25, అక్టోబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (238) : భండారు శ్రీనివాసరావు

 చిన్న మనుషులు – గొప్ప మనసులు

యాదమ్మ, స్వరూప, అంకిత , వనిత

గత మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో వివిధ దశల్లో మా జీవితాలతో ముడిపడిన వారిలో వీరున్నారు. జీతాల మీద పనిచేసిన వారే కానీ జీతాల కోసమే పనిచేయలేదు. అందుకే కుటుంబ సభ్యులు అయ్యారు.

యాదమ్మ, సంపూర్ణ ఇంటి పనిలో సహాయకులు. స్వరూప మా పెద్ద వదిన గారికి పెద్దతనంలో సహాయకురాలు, అంకిత మా మనుమరాలు జీవికకి కేర్ టేకర్, ఇక వనిత గత పదిహేను సంవత్సరాలుగా మా వలలి.

జీవితం అన్నాక కొందరు గొప్పవాళ్లు తారసపడతారు. అలాగే చాలామంది చిన్నవాళ్లు కూడా మన జీవన నౌక సాఫీగా సాగడానికి తోడ్పడతారు. నా జీవితాన్ని తరచి చూసుకునే ఇలాంటి సందర్భాలలో చిన్నా గొప్పా తారతమ్యం లేకుండా అలాంటి వారిని కూడా గుర్తు చేసుకోవడం సముచితమని నా భావన.

తెలుగువారికి గొప్ప పండుగలలో సంక్రాంతి ఒకటి. అది వెళ్ళిన మరునాడే కనుమ. అది కూడా పండగే. సంక్రాంతికి సొంతూరు వెడితే మర్నాడు కనుమ కూడా అక్కడే గడిపి రావడం ఆనవాయితీ. కనుమనాడు కాకయినా కదలదు అనే నానుడి పేర్కొంటూ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తారు.

అలా ఒకసారి 2019 లో కనుమ నాడు కూడా మా ఇంట పండగ సందడి చోటు చేసుకుంది. దానికి కారణం ఎప్పుడో పుష్కరం కింద మా ఇంట్లో పనిచేసిన మల్లయ్య కుటుంబం.

ముప్పయ్ ఏళ్ళ క్రితం మేము మాస్కోనుంచి వచ్చి హైదరాబాదు పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో మళ్ళీ కొత్తగా కొత్త కాపురం పెట్టిన రోజుల్లో, మల్లయ్య కుటుంబం మా ఇంట్లో పని చేసేది. మధ్యలో మేము చాలా ఇళ్ళు మారాము. అయినా ఆ కుటుంబంతో మా బంధం కొనసాగుతూ వచ్చింది.

ఆ ఏడాది కనుమ రోజు సాయంత్రం ఎల్లారెడ్డి గూడాలోని మా ఇంటికి ఇంటిల్లి పాదీ వచ్చారు. ఆటో నడిపే మల్లయ్యకు అందరూ ఆడపిల్లలే. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయి పిల్లలకు తల్లులు అయ్యారు. యాదమ్మ, మల్లయ్యలకు ముగ్గురు మనుమళ్ళు నలుగురు మనుమరాండ్రు. ఎల్ కేజీ నుంచి తొమ్మిదో తరగతి దాకా చదువుతున్నారు. మల్లయ్య ఆడ సంతానం పెద్ద పండగ సంక్రాంతికి పుట్టింటికి వచ్చారు. అల్లుళ్ళు ఏరీ అని అడిగితే అందరిలోకి చిన్నమ్మాయి ( మా కళ్ళ ముందే పుట్టింది) తిరుమలమ్మ (పెళ్ళిలో రూప అని పేరు మార్చుకుందట) తటాలున జవాబు చెప్పింది. ‘మేము మా అమ్మానాన్నలను చూడడానికి మా పుట్టింటికి వచ్చాము. మా మొగుళ్ళు వాళ్ళ అమ్మానాన్నలను చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు’ అని.

వాళ్ళందరినీ చూసి మా ఆవిడ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ పిల్లల్లో ఇద్దరు ముగ్గురు ఆవిడ చేతుల్లోనే పెరిగారు. వాళ్ళ చదువులు, ఫీజులు, పుస్తకాలు వగైరా దగ్గరుండి కనుక్కుంటూ వుండేది. అందుకని ఆ కుటుంబానికి మా ఆవిడ అంటే అభిమానంతో కూడిన ఆరాధన.

అంతమంది ఆడపిల్లలు గల గలా మాట్లాడుతుంటే ఆడ సంతు లేని మేము ఎంతో సంతోషించాము. ఫోటో అంటే మొహం తిప్పుకునే మా ఆవిడ ఆ రోజు అందర్నీ తన పక్కన నిలబెట్టుకుని నాతో వాళ్ళ గ్రూపు ఫోటో తీయించుకుంది.

ఇది జరిగింది జనవరిలో. ఆగస్టులో ఆమె లేదు. ఫోటో మిగిలింది.

స్వరూప.

నలభై,యాభయ్ ఏళ్ళు వుంటాయి. పేరుకు తగిన రూపం కాదు అని మొదటిసారి చూసిన వాళ్ళు అనుకుంటారు.

కానీ ఆమె మనసు ఎంతటి ఉదాత్తమైనదో తెలిసే అవకాశం ఒకసారి వచ్చింది.

మా పెద్ద వదిన సరోజిని గారు జీవించి వున్నప్పుడు చేయి విరిగింది. మా కుటుంబంలో పెద్ద. ఆమెకు సాయంగా ఉండడానికి మా అన్నయ్య కుమారుడు రాఘవ రావు ఏదో ఏజెన్సీతో మాట్లాడి ఒక సహాయకురాలిని పెట్టాడు. ఆమే ఈ స్వరూప. మా ఇంటికి దగ్గర కాబట్టి, ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వెళ్లి మా వదినను చూసి వస్తుండే వాడిని.

ఒక రోజు నేను వెళ్ళే సరికి తల వాకిలి ఓరగా వేసివుంది.

లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ఆ గదిలో వున్న ఇద్దరూ నా రాకను గమనించలేదు. నడిచి వచ్చిన బడలిక తీర్చుకోవడానికి ఓ కుర్చీలో కూలబడ్డాను.

వదిన మంచం మీద దిండును ఆనుకుని కూర్చుని, ఎదుటి మనిషి చెబుతున్న మాటలను ఏకాగ్రతగా వింటోంది.

మా వదినను మాట్లాడనివ్వకుండా, ఆమె రెండు చేతులూ పట్టుకుని స్వరూప ఏకబిగిన చెప్పుకు పోతోంది.

నేను మౌనంగా వింటున్నాను.

అమ్మా! మీరు పెద్దవారు. ఎనభయ్ దాటాయని చెబుతున్నారు. మీ వయసులో సగం లేదు నా వయసు. మిమ్మల్ని కనిపెట్టుకుని చూడమని మా యజమాని నన్ను మీ వద్దకు పంపాడు. ఆయనకు మాట రానివ్వకుండా చూడాలి నేను. మీరేమో రాత్రుళ్లు నాకు చెప్పకుండా లేస్తున్నారు. మీ పక్కనే పడుకుంటున్నాను. ఏమాత్రం అవసరం వున్నా నన్ను లేపండి. నేను దగ్గర వుండి మిమ్మల్ని బాత్ రూముకు తీసుకు వెడతాను. మీరు నా కంటే చాలా పెద్ద. కానీ నాకంటికి నువ్వు రెండేళ్ల పిల్లవే. కన్నబిడ్డ పక్కబట్టలు ఆగం చేస్తే తల్లి శుభ్రం చేయదా! నేనూ అంతే! పక్క మీద నుంచి రాత్రి వేళ కదిలే పని లేకుండా నేనే చూస్తాను. లోగడ కొన్నాళ్ళు ఓ ఆసుపత్రిలో ఆయాగా పని చేశాను. ఇవన్నీ నాకు అలవాటే. కాబట్టి నా మాట వినండి. నేను ఈ పనులు డబ్బుల కోసం చేస్తున్నా, డబ్బొక్కటే ముఖ్యం కాదు. నాకిక్కడ మూడు పూటలా అన్నం పెడుతున్నారు. చక్కగా కనుక్కుంటున్నారు. నా పనిలో ఏదైనా తేడా వస్తే ఆ పైన దేవుడు నన్ను వదిలి పెడతాడా!

మళ్ళీ చెబుతున్నాను. ఈసారి అరిచి కసిరి చెబుతాను. పిల్లలకు తల్లి చెప్పదా! అలాగే నేనూ గట్టిగానే చెబుతాను. మనసులో పెట్టుకోకండి. మీ కట్టు విప్పి, మీ చేయి నయం అయ్యేవరకు నేను మిమ్మల్ని వదిలిపోను. తర్వాత మీ ఇష్టం. అంతవరకూ నాకు మాట రానీయకండి”

ఇదంతా విన్న తర్వాత నాకు అక్కడ ఉండాల్సిన అవసరం కనపడలేదు. ఎంత మౌనంగా వచ్చానో అలాగే బయటకు వచ్చేశాను. వదిన ఎలా వుందో చూడాలని వచ్చాను. ఆమెను పదిలంగా చూసుకునే మనిషి దొరికింది.

గుళ్ళో వుండే దేవుడు మనుషుల్లో కూడా ఉంటాడు. ఈ దేవత కొలువైన గుడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయాను.

అంకిత

ఈ అమ్మాయిని మా మనుమరాలు జీవికకు కేర్ టేకర్ గా పెట్టారు.

అప్పటికి నా కొడుకు కోడలు ఉద్యోగస్తులు. మనుమరాలిని చూసుకోవడానికి మా ఆవిడ లేదు.

అంచేత ఏదో కంపెనీని సంప్రదించి ఓ కేర్ టేకర్ ని పెట్టారు. ఆ అమ్మాయి పేరు తప్ప, వాలకం నాకు ఏమాత్రం నచ్చలేదు. గాంధీ గారి కళ్ళజోడులాంటి గుండ్రటి పెద్ద కళ్లద్దాలు. ఆధార్ కార్డు ప్రకారం వయసు 22. కానీ ఆ పిల్ల పీలగా పద్నాలుగేళ్ళ అమ్మాయిలా వుంది.

మనుమరాలు జీవికని కనిపెట్టి చూసుకోవడమే ఆ అమ్మాయి పని.

ఇంట్లోనే వుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నా కంట్లో పడేది. చీదరించుకున్నట్టు చూసేవాడిని.

ఈలోగా ఘోరం జరిగిపోయి మా వాడు ఆకస్మిక గుండె పోటుతో చనిపోయాడు.

నాకు ప్రపంచం యావత్తూ శూన్యంగా మారింది. ఆరోగ్యం దెబ్బతిన్నది. కను చూపు మందగించింది. మా కోడలు నిషా శ్రద్ధ తీసుకుని కంటి ఆపరేషన్ చేయించింది.

కొన్ని రోజులు గంట గంటకీ కంట్లో చుక్కలు వేయాలి. ఆ పని అంకిత చూసింది. అలారం పెట్టుకుని కరక్టు టైముకి వేసింది.

ఆ తర్వాత బీపీ షుగర్ సమస్యలు. ఎప్పటికప్పుడు మిషన్ల మీద రీడింగ్ తీసుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకుని డాక్టర్లు అడగగానే చెప్పే బాధ్యత స్వచ్చందంగా తీసుకుంది. వేళకు గుర్తు పెట్టుకొని మందులు ఇచ్చేది.

ఈ నర్సింగ్ సర్వీసుతో ఆ అమ్మాయి పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

ఆడపిల్లలు లేని నాకు ఈ అమ్మాయిని ఆ దేవుడే పంపాడు అని నిర్ధారణకు వచ్చాను.

అయితే ఒక విషయం చెప్పాలి.

ఇంత మొండి పిల్లను నా జీవితంలో చూడలేదు.

పాలవాడో, పేపరు వాడో వచ్చి డబ్బులు అడుగుతాడు.

అమ్మా అంకితా వెళ్లి నా ప్యాంటు జేబులో పర్స్ తీసుకురా’ అంటే ససేమిరా వినదు. ‘హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చేటప్పుడే మా అమ్మ ఇతరుల డబ్బు తాకవద్దు అని చెప్పి పంపింది’ అంటుంది.

నేనే చెబుతున్నా కదా’ అన్నా వినదు. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు బాపతు.

ఈ కాలంలో ఇంత నిజాయితీ అరుదు.

సంక్రాంతి, దసరా వంటి పండుగలు, చీరలో డ్రెస్సులో కొనుక్కోమని వంటమనిషి వలలికి, (అసలు పేరు వనిత) పనిమనిషి అనితలతో పాటు డబ్బు ఇస్తే అంకిత తీసుకోదు.

'మీరు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా జీతం పదిహేను వేలు లెక్క కట్టి ఇస్తున్నారు కదా! నా సంపాదనతోనే ఏదైనా కొనుక్కుంటాను, ఇక్కడ నాకు విడిగా పెట్టే ఖర్చు లేదు, నా అన్ని అవసరాలు మీరే చూసుకుంటున్నారు. ఒక వేయి నేను వుంచుకుని, మిగిలింది మా అమ్మకు జీపే చేస్తాను' అంటుంది ధీమాగా, ఎంతో బాధ్యతగా.

అందుకే ఆ అమ్మాయి ముట్టె పొగరుని సహిస్తూ, భరిస్తూ వచ్చాను. ఆమెకున్న ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ వచ్చాను.

కాంట్రాక్ట్ ముగిసింది. మనుమరాలు కటక్ లో వాళ్ళ అమ్మమ్మ గారింట్లో వుంది. నా ఆరోగ్యం కుదుట పడింది. ఏడాది ఆఖరులో వాళ్ళ కులదేవత పూజలు అవీ వున్నాయి, నెల రోజులు వుండను, వూరికి పోతాను అని ఏడాది కిందట పనిలో చేరేటప్పుడే చెప్పింది. అలాగే వెళ్ళిపోయింది.

పనివాళ్ళు దొరుకుతారేమో కానీ పనిమంతులు దొరకడం కష్టం.

తోకటపా:

మా పిల్లలలాగే అంకితకు కూడా తన ఫొటో సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేయడం అస్సలు ఇష్టం వుండదు. మా మనుమరాలు జీవికతో వున్న ఫోటోల్లో తాను వుంటే, అది ఎడిట్ చేసేదాకా వూరుకోదు. అంత మొండిఘటం.

కింది ఫోటో: మల్లయ్య కుటుంబంతో మా ఆవిడ నిర్మల




(ఇంకావుంది)

22, అక్టోబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (237) : భండారు శ్రీనివాసరావు


ఒకసారి తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.
ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. రెండు గదులు, పెద్ద హాలు, వంట గది, అద్దె పద్దెనిమిది వందలు. మాస్కో నుంచి వచ్చే సామాను చాలా ఎక్కువ కనుక అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మాస్కో నుంచి స్వదేశం తిరిగి వెళ్లి పోయేవారి కోసం పెద్ద పెద్ద కంటైనర్లు రేడియో మాస్కో వాళ్ళే ఏర్పాటు చేస్తారు. వీటికి చెల్లించాల్సిన రుసుము అతి స్వల్పం. వాటిని లిఫ్ట్ వ్యాన్ అంటారు. ఖరీదైన కలపతో చేసినవి. ఆ కంటైనర్ రోడ్డు మీద కదలాలి అంటే ఇరవై నాలుగు టైర్ల భారీ లారీ కావాలి.
చౌకగా దొరుకుతాయని కొని పడేసిన సామాను మొత్తం వేసినా పుష్పక విమానంలా కొంత జాగా మిగలడంతో, మా దగ్గర పోగుపడిన రూబుల్స్ ఇండియాలో చిత్తుకాగితాలతో సమానం కనుక, ఇంట్లో నలుగురం నాలుగు టాక్సీలు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కంటికి కనిపించిన వస్తువులన్నీ కొని దాన్ని నింపే ప్రయత్నం చేశాము. ఇంట్లో సామాను మొత్తం వాళ్ళే ప్యాక్ చేసి కింది దించి లిఫ్ట్ వ్యాన్ ఎక్కించారు. లిఫ్ట్ వ్యాన్ వెంట మరో టాక్సీలో నేను, కొంచెం కొంచెం రష్యన్ అర్ధం చేసుకుని మాట్లాడే మా పెద్ద వాడు సందీప్ కలిసి మాస్కోలో మరో కొసలో వున్న కష్టమ్స్ కార్యాలయానికి వెళ్ళాము. తీరా అక్కడకి పొతే వాళ్ళు అడిగినవి రెండే రెండు ప్రశ్నలు. ఇందులో పాలూ, పెరుగూ ఉన్నాయా అని.
మూడు నెలల తర్వాత ఇండియా చేరే లిఫ్ట్ వ్యానులో పాలూ, పెరుగూ ఎవరు స్మగుల్ చేస్తారు? ఆ ప్రశ్నకు నవ్వు వచ్చినా బయట పడకుండా మొహం పెట్టి, నియత్ నియత్ (లేదు, లేదు) అన్నాము. అంతే! వాళ్ళు స్టాంప్ వేసి రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేశారు.
మాస్కో సామాన్లు భద్రంగా మద్రాసు చేరినట్టు కబురు వచ్చింది. అప్పటి దాకా మాస్కో సామాను రేపో మాపో వస్తుందని ఇంట్లో ఏ సామాను అమర్చుకోకుండా చాపలు, జంపఖానాలతో కాలక్షేపం చెస్తూ వస్తున్న మేము, అమ్మయ్య అనుకున్నాము. నేను ఒక్కడినే మద్రాసు వెళ్లాను. అదే నేను చేసిన పొరపాటు. మా పిల్లల్లో ఒకడిని వెంట తీసుకుని వెళ్ళాల్సింది.
మద్రాసు కష్టమ్స్ గోడౌన్ చాలా విశాలంగా వుంది. ఎటు చూసినా పెద్ద పెద్ద కంటైనర్లు. వాటి నడుమ మాదే చిన్నది అనిపించింది. మేము పలానా రోజు వస్తున్నామని తెలుసు కనుక ముందే కంటైనర్ ఖాళీ చేసి కింద పరిచి పెట్టారు. నిజానికి మేము వెళ్ళే వరకు ఆ పని చేయకూడదు. కానీ మనం ఎందుకు అని అడగకూడదు.
కష్టమ్స్ తనిఖీ చేసే అధికారుల తరపున ముందు ఒక చిన్న అధికారి వచ్చి, మేము మాస్కో నుంచి వచ్చాము అని తెలుసుకుని, పెదవి విరిచాడు. మాస్కో నుంచి వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు పట్టుకునే సామాను కానీ, వాళ్ళు కోరుకున్న వస్తువులు అంటే మద్యం సీసాలు వగైరా దొరికే అవకాశం లేదు అని పెద్దగా చెకింగ్ చేయరు. ఒకరకంగా వాళ్ళ సమయం వృధా.
ఇంతలో ఒక పోర్టరు, బయట బ్యాంకు బ్రాంచి వుంది, వెళ్లి ఒక వంద రూపాయలకు చలానా కట్టి ఆ ఫారం పట్టుకు రమ్మన్నాడు. బ్యాంకులో ఆ విండో దగ్గర చాలామంది వున్నారు. ఆ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి, సామాను హైదరాబాదు చేర్చాల్సిన భారీ లారీ బయట సిద్ధంగా వుంది. దాంతో హడావిడిగా లోపలకు వెళ్లి, తొందరగా పని పూర్తి చేసుకుని రాత్రి ఫ్లయిట్ అందుకోవాలనే ఆత్రుతతో నేనున్నాను.
మాస్కో నుంచి రోడ్డు మార్గాన సోవియట్ యూనియన్ లో మరో మూల వున్న ఓడ రేవుకు, మళ్ళీ ఓడలో మూడు నెలలు ప్రయాణం చేసి మద్రాసుకు మా సామాను చేరింది. ఒక్కటంటే ఒక్క గాజు సామాను కూడా కొంచెం కూడా దెబ్బతినలేదు. అంత చక్కగా అక్కడి వాళ్ళు వాటిని ప్యాక్ చేశారు. మద్రాసులో వాళ్ళు వాటిని ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా ప్యాకింగులు విప్పి అక్కడ నేల మీద పరిచి పెట్టారు. చెకింగ్ తర్వాత మళ్ళీ ప్యాక్ చేయడం మా పని కాదంటారు. చివరికి డబ్బులు తీసుకుని ఆ పని చేసి పెట్టారు.
బతుకు జీవుడా అని బయట పడి హైదరాబాదు విమానం ఎక్కాను.
మూడో రోజో నాలుగో రోజో ఆ భారీ లారీ హైదరాబాదు చేరింది. మేమున్న కాలనీలోకి రావడానికి ఆ లారీకి ఒక పట్టాన సాధ్యం కాలేదు. మొత్తం మీద మూడు నాలుగు గంటల విశ్వ ప్రయత్నం మీద ఇంటికి చేరింది.
మాస్కో సామాను అంటేనే భారీ. అది సోఫా కావచ్చు, టీ కప్పు కావచ్చు. ఏదైనా పెద్ద సైజే. కింగ్ సైజే! వాటిని మేము అద్దెకు తీసుకున్న మొదటి అంతస్తుకు చేర్చడానికి మరో బ్రహ్మ ప్రళయం. వాటితో మా హాలు మొత్తం నిండి పోయింది.
ఆ తర్వాత తీరిగ్గా సామాను ప్యాకింగు విప్పి చూసుకుంటే మూడో వంతు సామాను గాయబ్. ఇందుకా అవసరం వున్నా లేకపోయినా బ్యాంక్ చలాన్ తీసుకుని రమ్మని నన్ను బయటకు పంపడంలో ఆంతర్యం.
మాస్కో నుంచి వచ్చే వారిలో వారు పట్టుకునే సామాగ్రి లేకపోయినా ఖరీదైన గ్లాస్ వేర్ వుంటుందని పోర్టళ్ళకు తెలుసల్లె వుంది. మాస్కోలో రూపాయి ఖరీదు చేయని వస్తువు కూడా ఇండియాలో వేలు పలుకుతుంది (ట). ముఖ్యంగా చెకొస్లవేకియా కట్ గ్ల్లాసులు, రష్యన్ నీలిరంగు పింగాణీ వస్తువులు. నిజానికి ఈ సంగతి మాకు కూడా తెలియదు. ఆ విధంగా బంధువులకు కానుకలుగా తెచ్చిన వస్తువులు అన్నీ మద్రాసు పోర్టర్ల పరమయ్యాయి. వాళ్ళు చేసిన బ్యాడ్ ప్యాకింగ్ నిర్వాకం కారణంగా మరికొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. వెంట మా వాడిని తోడు తీసుకుని వెళ్లి వుంటే మద్రాసు పోర్టర్లకు ఈ చేతివాటం అవకాశం చిక్కేది కాదేమో!
దుర్గానగర్ లోని మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం.
ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ, మల్లయ్యల కడసారి కుమార్తె. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇళ్ళు మారుతూ వచ్చినా ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు.
కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. సందీప్ ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న అతడికి ఒఅ ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
‘నువ్వేం చేస్తున్నావ’ని అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!
కింది ఫోటో:
2018 లో తిరుమలమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆవిడ నిర్మలతో తీసిన ఫోటో. మరుసటి ఏడాది తాను ఏ ఫోటోలో పడని దూరతీరాలకు తరలిపోయింది.



(ఇంకావుంది)

21, అక్టోబర్ 2025, మంగళవారం

హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఎన్నికలు – భండారు శ్రీనివాసరావు

 

ఈసారి హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఎన్నికలు రేపుతున్న దుమారం మామూలుగా లేదు, టీవీ ఛానల్స్ లో చర్చలు మినహాయిస్తే.
ఈ ఎన్నికలు, పెద్ద పెద్ద క్లబ్ ల ఎన్నికలను తలపిస్తున్నాయి అంటే ఆశ్చర్యం లేదు. ఫేస్ బుక్ వేదికగా, వాట్సప్ గ్రూపుల ద్వారా సాగుతున్న ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ స్థాయిలో ప్రచారం జరిగినప్పుడు ఓ స్థాయిలో ఉద్రేకాలు ప్రబలడంలో ఆశ్చర్యం లేదు.
హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఆవిర్భావం గురించి మిత్రుడు బుద్ధవరపు రామకృష్ణ Ramakrishna Buddhavarapu ఇప్పటికే చక్కటి సవివరమైన పోస్టులు పెట్టాడు.
గతంలో నేను ఒకసారి క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. మరోసారి ఓడిపోయాను.
గెలిపించింది నా క్లబ్ కుటుంబసభ్యులే. ఓడించింది ఆ కుటుంబ సభ్యులే. కాబట్టి ఆ జయాపజయాలను నేను ప్రతిష్టగా తీసుకోలేదు. హాయిగా అప్పుడప్పుడూ క్లబ్ కి వెళ్లి వస్తూనే వున్నాను. అందర్నీ పలకరిస్తున్నాను. వాళ్ళూ నేనంటే అంతే ఆప్యాయంగా, కొండొకచో గౌరవంగా కూడా వుంటున్నారు.
కావున నా మనవి, నా సలహా ఏమిటంటే అందరూ కలిసి వుండండి. అందర్నీ కలుపుకు పొండి. పదవుల్లో ఎవరు వున్నా, క్లబ్ అందరిదీ అనుకుంటే నాలుగు మంచి పనులు చేసి చూపించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది.
జర్నలిష్టులకు వృత్తి రీత్యా రాజకీయ వాసనలు తప్పనిసరి. వాటిని క్లబ్ బయటే ఒదిలి లోపలకి వస్తే ఏ చిక్కూ ఉండదు.
గొప్ప క్లబ్ లో సభ్యులం అని నలుగురూ చెప్పుకుంటుంటే వినాలని కోరుకుందాం. ఆ గొప్పతనంలో వున్న మధురిమను అందరం ఆస్వాదిద్దాం.
మరో అయిదు రోజుల్లో అంటే ఈ నెల 26న ఎన్నికలు. అంటే ఆ రోజు ఈ సరికల్లా ఫలితాలు తెలుస్తాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటవుతుంది.
ఈ ఎన్నికల్లో కొందరు గెలుస్తారు. వారికి అభినందనలు తెలుపుదాం. ఎన్నికలు కదా! పోటీ చేసిన అందరూ గెలవరు. ఓడిన వాళ్లకు గెలిచిన వాళ్ళు కూడా అభినందనలు తెలిపితే హుందాగా వుంటుంది. వాళ్లకు భవిష్యత్తులో అవకాశం రావచ్చు. ఇవే ఆఖరి ఎన్నికలు కావు కదా!
(21-10-2025)

18, అక్టోబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (236) : భండారు శ్రీనివాసరావు

 

నో రిగ్రెట్స్
అరవై ఏళ్ళ క్రితం సంగతి ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి.
నాకు చదువు మీద శ్రద్ధ తగ్గిపోతోందని గ్రహించిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, నాకా విషయం గ్రహింపుకి రావడానికి తనదయిన పద్దతి ఎంచుకున్నాడు. అతి సామాన్యమైన చదువు మాత్రమే చదువుకున్న మా వదినెగారి చేత వైద్య విద్వాన్ ఆయుర్వేద పరీక్షకు కట్టించి ఫస్టున పాసయ్యేలా చేసి ‘శ్రద్ధ వుంటే చాలు లక్ష్యం సాధించడానికి ఆట్టే కష్టపడనక్కరలేద’ని నాకు పరోక్షంగా చెప్పాడు.
ఆయన పద్దతి ఆయనకుంటే ఆయన తమ్ముడిని, నా పద్దతి నాకూ వుంటుంది కదా! అంచేత అవేవీ చెవికి ఎక్కించుకోకుండా నా చదువును అధ్వాన్నపు బాటలోనే సాగించాను, ‘ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను’ అనే పాట పాడుకుంటూ. పైగా ‘పెళ్ళొద్దు! పెళ్ళాం కావాలి! ఉద్యోగం వద్దు ఉపాధి కావాలి’ అనే స్లోగన్లు. అంటే పెళ్లి పేరుతొ ఖర్చులు వద్దు, ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా, నలుగురికి ఉపాధి కల్పించే సొంత ఉపాధి ఏర్పాటు చేసుకోవాలి అని ప్రతిపదార్ధం చెప్పుకోవాలి. ఉడుకు రక్తం కదా! చల్లారడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది.
ఫలితం ఎనభయ్యవ ఏట ఇదిగో ఇలా మిగిలాను. నో రిగ్రెట్స్! ఇపుడు చింతించి వగచిన ఏమి ఫలము?
మా రెండోవాడు సంతోష్ నా బాటే పట్టాడు. అంటే నా తోవన నడిచాడు అని కాదు. తనకు తోచిన విధంగా తానూ నడిచాడు అని చెప్పడం. పుష్కరం క్రితమే నెలకు లక్ష రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం వదిలిపెట్టి, యేవో ‘యాప్’ లు తయారు చేసే సొంత ఉపాధి ఎంచుకుని కుస్తీ పట్టడం మొదలెట్టాడు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు సంబంధించి వాడు ఒక యాప్ తయారు చేసిన సంగతి, హిందూ పేపర్ లో వేసిన ఆ వార్త క్లిప్పింగ్ ఎవరో నాకు ఫార్వార్డ్ చేసేవరకు తెలియదు. అదే విషయంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీ గారికి పవర్ పాయింటు ప్రెజెంటేషన్ ఇచ్చి వచ్చిన విషయం కూడా నాకు వాడి స్నేహితుల ద్వారానే తెలిసింది. గతంలో ఎంతోమందికి నేను మాట సాయం చేసి వుంటాను. డబ్బు సాయం చేసే శక్తి ఎలాగూ లేదు. కనీసం సొంత కుమారుడి విషయంలో మాట సాయం కూడా చేయలేకపోయాను. ఒక మాట ఎవరితో అయినా చెప్పొచ్చుకదా అని మా ఆవిడ అనేది. కానీ నేను ఎప్పటిమాదిరిగానే ఉలుకు పలుకు లేకుండా వుండిపోయాను. ‘నాన్నకు చెప్పవద్దమ్మా! నా తిప్పలు ఏవో నేను పడతాను’ అనే వాడని తర్వాత ఎప్పుడో తెలిసింది.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే....
మా అన్నయ్య కష్టజీవి. తాను కష్టపడ్డాడు. ఇంట్లోవాళ్ళని మరీ సుఖాల పల్లకీలో ఊరేగించక పోయినా కష్టాల పాలు చేయలేదు.
ఇక నా తరం. నేను కష్టపడలేదు, అలా అని మరీ సుఖపడ్డదీలేదు. మా ఇంట్లోవాళ్ళని మరీ కష్టపెట్టలేదు. అలా అని బాగా సుఖపెట్టిందీ లేదు. సో సో.... అందుకే మరోసారి, నో రిగ్రెట్స్.
ఇక మా వాడిది, మరీ కష్టపడకుండా బాగా సుఖపడాలని, తమ వారిని మరింత సుఖపెట్టాలని కోరుకునే తరం.
ముందే చెప్పాకదా!
మా వాడిది కూడా నా టైపే అని. బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని సొంత కాళ్ళపై నిలబడే ప్రయత్నాలు చేయడం గురించి నాతో సహా ఇంట్లో బయటా జనాలు గొణుక్కోవడం గమనించినట్టున్నాడు. ఆరేళ్ల క్రితం ఒక రోజు తనకు వచ్చిన ఓ మెయిల్ ని నాకు ఫార్వార్డ్ చేసాడు. బెంగళూరులోని DEL (EMC) వాళ్ళు పంపిన ఆఫర్ లెటర్ అది. కాంపెంసేషన్ బ్రహ్మాండంగా వుంది.
ఎప్పుడు చేరాలి అంటే ఎందుకు చేరాలి అనే విధంగా జవాబు. ఈ పోటీ యుగంలో ఇంటర్వ్యూలకు వెడితే ఉద్యోగం వస్తుందా రాదా అనే సందేహాలు ఉన్న నా బోటివాళ్ళ అనుమానాలు తీర్చడానికి ఒక టెస్ట్ కింద ఈ ప్రయత్నం చేశానని వివరణ.
ఏం జరిగినా, అసలు ఏం జరగకున్నా నో రిగ్రెట్స్!
ఎందుకంటే పెద్దగా కష్టపడకుండా, పెద్ద పెద్ద ఆశలు లేకుండా బతుకు బండి నడిపే జీవితం నాది.
చివరికి మా వాడు ఒక మంచి ఉద్యోగంలోనే చేరాడు. ఇష్టంలేని ఉద్యోగం ఎందుకు అని పైవాడు అనుకున్నాడేమో, కొద్ది నెలలు కూడా ఉద్యోగ వైభవం అనుభవించకుండా ఆ పైవాడి దగ్గరికే వెళ్ళిపోయాడు.
కింది ఫోటోలు:
మా వాడు సంతోష్,
హిందూ పేపరు క్లిప్పింగ్






(ఇంకావుంది)

16, అక్టోబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (235) : భండారు శ్రీనివాసరావు

 

సభకు నమస్కారం
నేను మాటకారిని కావచ్చేమో కానీ వక్తను కాను.
హెచ్ ఎం టీ వీ వాళ్ళు, చాలా ఏళ్ళ క్రితం యువతలో ప్రసంగ పాటవాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో వక్త అనే పేరుతో అనుకుంటా, ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ, అందుకోసం ఒక శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించేవారు. ఆ క్రమంలో ఒక రోజు నన్ను ఆ శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించమని ఆహ్వానించారు. బహుశా టీవీ చర్చల్లో నా విశ్లేషణలను చూసి నన్ను పిలిచి వుంటారు.
మాట్లాడడం ఎలా అనే విషయంలో యువతకు అంతటి ఆసక్తి వుందని వెళ్ళేంత వరకూ నాకూ తెలియదు. అప్పుడు సమైక్య రాష్ట్రం. అనేక జిల్లాల నుంచి చాలామంది రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ మహా సమావేశంలో ప్రసంగించడం ఎట్లా అనే భయం కూడా పట్టుకుంది. మూడు నాలుగు వాక్యాల తర్వాత ఏం మాట్లాడాలో మరచిపోయే మతిమరపు నాది.
అంచేత ఒకటి రెండు ముక్కలు చెప్పి, మీరు ప్రశ్నలు అడగండి, నేను జవాబు చెబుతాను అన్నాను. ఏదైనా ఎవరైనా అడుగుతుంటే వాటికి చమత్కారంగా సమాధానం చెప్పడం నాకు వెన్నతో పెట్టిన విద్య, ఆ విధంగా ఆ పూటకు నా పని పూర్తి చేసుకుని, టీవీ వాళ్ళు కప్పిన శాలువా, ఇచ్చిన మొమెంటోతో బతుకు జీవుడా అని బయట పడ్డాను.
2005లో హైదరాబాదు దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున వీడ్కోలు ప్రసంగం చేయాల్సిన అవసరం పడింది. షరా మామూలుగా ప్రసంగ పాఠం సిద్ధం చేసుకున్నాను.
‘అందరికీ నమస్కారం...
‘జాతస్య మరణం ధృవం అన్నట్టు, సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు, 'ఈనాడు ' అనేది రాక తప్పదు.
‘నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.
‘చూస్తుండగానే రేడియోలోను, ఇక్కడా ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల, చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు. పైగా ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.
‘అసూయ తెలియని పై అధికారులు, ఆత్మీయత కనబరిచే సాటి సిబ్బంది, నిజానికి ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?
‘అందుకే, అత్తలేని కోడలులాగా అందరిలోను, అందరితోను కలిసిపోయి, కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగాననే అనుకుంటున్నాను.
‘అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక, ఎప్పుడో ఒకప్పుడు, ఎవరినో ఒకరిని వృత్తి ధర్మంగా నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే ‘సారీ’ చెప్పేసి, మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనా వుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం, పరమార్ధం.
‘నాకు ‘సరిగా’ మాట్లాడడం రాదు. ఇది నా మాట కాదు. మా ఆవిడ ఉవాచ. ముఖ్యంగా మనసు ఆర్ద్రం అయిన ఇలాటి సందర్భాలలో.
‘అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నాను.
‘మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట.
‘నిజమే! కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...
‘అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం’
తర్వాత, మరో పదేళ్లకు కాబోలు ఒక కళాశాల వార్షికోత్సవంలో పాల్గొనే ఒక అరడజను విశిష్ట, పరమ విశిష్ట అతిధుల జాబితాలో నన్ను చేర్చారు. రేడియోలో పనిచేశాడు కదా ఎంతో కొంత మాట్లాడకపోతాడా అనే నమ్మకంతో.
సరే! కారు పంపించారు కదా అని వెళ్లాను.
హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మంటపం మందిరంలో అరోరా పీజీ కళాశాల వార్షికోత్సవం.
చాలామంది మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వచ్చింది.
‘సభకి నమస్కారం’ అంటూ నా ప్రసంగం మొదలు పెట్టాను. ప్రసంగ పాఠం చేతిలో వుంది కనుక మొత్తం మీద కధ నడిపించాను. అది ఈ విధంగా సాగింది.
‘సభకు నమస్కారం అనే ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల', సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లన్నీ వరుసగా ప్రతి వక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.
‘సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడక పోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పది నిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఎక్కువ కాకూడదు, అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.
‘అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో సందేహం.
‘మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.
‘పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని వ్యక్తీకరించలేవు. అయితే ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి, మాటలు రాని పాపాయి మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.
‘గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది.
‘అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయి వుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని, మంచినే మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.
‘విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి.
ఉపాధ్యాయులు చెప్పే మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అప్పుడు, అలా మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది.
అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే, ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది.
ఇందులో ఇంత విషయం వుంది కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.
‘షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు చెప్పి, యేవో కొన్ని ఉద్బోధలు చేసి వెళ్లిపోవచ్చు.
కానీ, మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది. సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అలా జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ బెంగ అక్కరలేదు.
‘చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.
‘మరో మాట. నా పిల్లల చిన్నతనంలో, మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ నా ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఆ ఆశ అప్పుడు తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.
‘మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే కాదు, పలానా విద్యార్ధి మా కాలేజీలో చదివాడు సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.
‘ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.
‘నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
‘సభకి మరో మారు నమస్కారం'
అంటూ రాసుకొచ్చిన ప్రసంగ పాఠాన్ని రేడియో వార్తల మాదిరిగా గడగడా చదివి, సభికుల హర్షధ్వానాల మద్య బయటపడ్డాను.
తోకటపా:
మరో చేదు అనుభవం చెప్పాలి.
లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో, అన్నట్టు నేను బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నట్టు నటిస్తున్న రోజుల్లో, నా మాటలు, ముచ్చట్లు చూసిన మా లెక్చరర్లు ముచ్చట పడి, వక్తృత్వ పోటీల్లో ఏదో పొడుస్తాడు అని భ్రమ పడి, జగ్గయ్యపేటలో జరిగే అంతర్ కళాశాలల వక్తృత్వ పోటీలలో పాల్గొనడానికి నన్ను ఎంపిక చేశారు.
సరే! అప్పుడు లయోలా కాలేజీలో చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావుని తోడు తీసుకుని జగ్గయ్యపేట వెళ్లాను. పోటీలు మొదలయ్యాయి.
అణ్వస్త్రాలు అవసరమా కాదా అనేది టాపిక్.
నేను స్టేజి మీదకు వెళ్లి మైకు ముందు నిలబడ్డాను.
“సభాధ్యక్షా! సదస్యులారా!’ అని మొదలు పెట్టాను.
“ఇప్పుడు ప్రపంచ ప్రజలకి కావాల్సినవి అణ్వస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు’
సమావేశంలో చప్పట్లు మోగాయి ఈ మొదటి మాటతో.
ముందే చెప్పినట్టు తర్వాత నా ప్రసంగం ఒక్క ముక్క ముందుకు సాగితే ఒట్టు.




(ఇంకావుంది)

15, అక్టోబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (234) : భండారు శ్రీనివాసరావు

 

అభిమానధనం
‘ఇన్నేళ్ళుగా ఇంతమంది ముఖ్యమంత్రులకు పీ ఆర్ వో గా పని చేస్తూ వచ్చారు. హైదరాబాదులో ఇల్లు ఏమైనా కట్టారా?’ అని అడిగాడు ఓ పెద్దమనిషి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారిని.
‘కట్టాను, ఈ నెల అద్దె’ మా అన్నయ్య జవాబు.
సమాచార శాఖ డైరెక్టర్, సిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేసి, రిటైర్ అయి చివరికి సొంత ఇల్లు ఏర్పరచుకోకుండానే దాటిపోయాడు.
మొన్నీమధ్య నాకూ అలాంటి ప్రశ్నే ఎదురయింది.
‘ఇంతమంది పెద్ద పెద్దవాళ్ళతో సన్నిహిత పరిచయాలు వున్నాయి, ఏమైనా పోగేసారా?’ అని.
‘అవును పోగేసాను, లెక్కపెట్టలేనంత’ నా సమాధానం.
ఆ పోగేసిన దాంట్లో కొంత మచ్చుకు చెబుతాను.
ఉష నాకు రేడియోలో సహోద్యోగి మాత్రమే కాదు. కుటుంబ స్నేహితురాలు. గురుతుల్యులైన తురగా జానకీరాణిగారి ముద్దులపట్టి. పిన్నవయసులోనే పెద్ద పెద్ద కష్టాలను భరిస్తున్న మనిషి. ఉషకు తెలిసీ తెలియని వయసులోనే తండ్రి కృష్ణమోహనరావు గారు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అండగా వుంటాడు అనుకున్న జీవనసహచరుడు అర్ధాంతరంగా ఆమె జీవితం నుంచి అదృశ్యమైపోయాడు. తండ్రి పోయినప్పటినుంచి కనురెప్పలా కనిపెట్టుకుని చూస్తూ వచ్చిన కన్నతల్లి కూడా కనుమరుగైంది.
పుట్టెడు కష్టాలను పంటిబిగువన సహిస్తూ, పెద్ద ఆరిందాలా 2019 లో నా భార్య చని పోయినప్పుడు ఉషారమణి వచ్చి నన్ను ఓదార్చింది చూడండి. అదీ నేను సంపాదించుకున్న అభిమాన ధనం.
ఉషా! నీ పెద్ద మనసుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదమ్మా!
ఆ రోజుల్లో ఆమె నాకు రాసిన ఈ ఉత్తరం చదవండి. నేను ఎంతగా పోగేసుకున్నానో అర్ధం అవుతుంది.
"నేను మహా దుఃఖంలో ఉన్న రోజుల్లో నన్ను చూసి చాలా మంది ఆందోళన పడేవారు. నీ కళ్ళు ఖాళీగా ఉన్నాయి...నాకు భయమేస్తోంది నిన్ను చూస్తుంటే అనేవాడు ఒక ఫ్రెండ్. మనసులో వ్యాకులత physicalగా కనిపిస్తుంది అని ఎవరు చెప్పినా నాకు అప్పుడు తెలీలేదు.
.
" అలాంటి ఒక మహా దుఃఖాన్ని మళ్ళీ చూశా. అది కూడా ఎప్పుడూ చిరునవ్వు చెదరకుండా, చీకు చింతా లేకుండా...కాదు, కనిపించకుండా ... ఉండే ఒక మనిషిలో.
.
"భండారు నిర్మలగారు వెళ్లిపోయారు. వెళ్ళిపోతూ భండారు శ్రీనివాసరావు గారిని చాలా ఒంటరిని చేశారు. అసలు ఆవిడ వెళ్లిపోవాల్సిన వయసు కాదు. టైం కాదు. పధ్ధతి కాదు. కానీ, లాజిక్ అనేది లేని విషయం మృత్యువు ఒకటే అని స్వానుభవం మీద తెలుసు కనుక, బాధపడ్డా 'ఇంతే కదా జీవితం' అనుకున్నా.
.
"శ్రీనివాసరావుగారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మా అమ్మకి కొలీగ్. మా నాన్నగారి పేరు మీద ఆయనకి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చే గౌరవం మాకు దక్కింది. నేను కూడా ఆయనతో కలిసి రేడియోలో పని చేశాను.
.
"ఆయన అంటే నాకు గౌరవం అన్నది మామూలుగా చూపించినా, నాకు ఎంత admiration అన్న విషయం ఎప్పుడూ చెప్పలేదు. కులాసాగా పని చేసుకోవడం, efficientగా టైం manage చేసుకోవడం, ఇంకోళ్ళ నెత్తిన pressure పెట్టకుండా సరదాగా కబుర్లు చెప్తూ పని పూర్తి చేయడం...ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవే. రేడియో ఒక్కటే breaking news గా ఉన్న రోజుల్లో ఆయన చేసిన రిపోర్టింగ్ ఈరోజు జర్నలిజం schoolsలో ఒక కోర్సు కావాలి. సరసంగా మాట్లాడడం, సరళంగా విషయం చక్కబెట్టడం, ఆత్మీయంగా అందరితో కలిసిపోతూనే తనదైన unique వ్యక్తిత్వం...శ్రీనివాసరావు గారు నిజంగా కోటిమందిలో ఒకరు.
.
"Smart appearance, హాయిగా నిదానంగా నడుస్తూ, కళగా కనిపించే ఆయన, అప్పుడు కలిసినప్పుడు వివర్ణంగా ఉన్నారు. భుజాలు వొంగిపోయాయి. ఏంటో దిక్కుతోచని చిన్నపిల్లాడిలా, అదే సమయంలో సడన్ గా తన వయసు గుర్తొచ్చినట్లుగా ఉన్నారు.
.
"నిర్మలకి వేరే పుట్టిల్లు లేదు, నేనే అన్నీ... అన్నారు ఆయన. దాదాపు 50 ఏళ్ళ సాంగత్యం. అసలు వాళ్లిద్దరూ వేరే ఇద్దరు వ్యక్తులంటే ఎలా నమ్మడం? ఆయనకి ఆవిడ మీద ఉన్న ప్రేమ, వారి స్నేహం, సంసారంలో సరిగమలు... జగద్విదితమే. ఒక రకంగా చెప్పాలంటే, అలా ప్రేమ పొందుతూ, ఒంటరితనం తెలీకుండా ఆవిడ వెళ్లిపోవడం ఆవిడకి అదృష్టమే. నాకు తెలుసు.
.
"ఇవాళ నేను నీ స్థానంలో ఉన్నా, ఉషా!’ అన్నారు ఆయన. స్వరం గద్గదం అయిపోయి, కళ్ళల్లో తడితో మాట్లాడుతున్న ఆయనని చూస్తే సీతావియోగ దుఃఖం అనుభవిస్తున్న శ్రీరాముడు గుర్తొచ్చాడు.
.
"శ్రీనివాసరావుగారు నాకు అన్ని విధాలా గురుతుల్యులు. మా అమ్మా నాన్న మీద అభిమానంతో పాటు నేనంటే ఎంతో ఆత్మీయంగా నాకు ఎన్నో సార్లు life advice ఇచ్చారు.
.
"కానీ, జీవితంలో మన సర్వస్వం అనుకున్న వ్యక్తి హఠాత్తుగా విడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అన్న ఎరుకలో నేను సీనియర్ ని కనుక, ఆయనని చూస్తూ ఎంతో దుఃఖపడుతూనే, 'అయ్యో...ఇంకా జీవితం ముందుంది.. ఈయన ఎలా ఉంటారు ఆవిడ లేకుండా?' అని కళవెళ పడ్డాను.
"జీవితమే నేర్పిస్తుందిలే ఆ పాఠం కూడా. రోజుకో చాప్టర్ చొప్పున"
నిజమే ఉషా! జీవితం నేర్పుతోంది. నెమ్మది నెమ్మదిగా ఒక్కో పాఠం నేర్చుకుంటూనే వున్నాను.
ఇలా పోగుపడుతున్న అభిమానధనాన్ని లెక్కించడానికి ఎన్ని కౌంటింగ్ మిషన్లు కావాలి?
కింది ఫోటో:
ఉషారమణి మంచి న్యూస్ రీడర్, మంచి జర్నలిస్టు, పైగా ఆంగ్లంలో సమర్దురాలయిన పత్రికా రచయిత్రి. అన్నింటికీ మించిన మరో కోణం చక్కటి ఫోటోగ్రాఫర్. రేడియో స్టేషన్ లో జరిగిన ఒకానొక కార్యక్రమంలో ఆమె నాకు తెలియకుండా తీసి పంపిన ఫొటో ఇది.



(ఇంకావుంది)