21, ఏప్రిల్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (146) – భండారు శ్రీనివాసరావు

 ప్రజా ప్రతినిధులలో కూడా పుణ్య పురుషులు వుంటారు. అందర్నీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు.

ఇప్పటి సంగతి నాకు తెలియదు. వున్నారేమో! కానీ నేను విలేకరిగా పనిచేసే రోజుల్లో కొంతమంది ఇలాంటి వారు తటస్థపడ్డారు. ప్రస్తుతానికి ఓ అయిదుగురు గురించి చెప్పుకుందాం.

బత్తిన సుబ్బారావు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏ మార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లోఅనారోగ్యానికి గురై, నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.

ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమామరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.

అలాగేప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అభ్యర్ధిగా 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు.

‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదుకనీసం ఈ సారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య అయితే,  వెంగయ్య అయివుండదుఅది వెంకయ్య అయివుంటుందని  హైదరాబాదు రిపోర్టర్లు  తామే తీర్మానించుకునిచప్పిడి వెంకయ్య అని రాసేవారు.

వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి ఒక ఆంగ్ల దినపత్రిక తరపున సుశీల్ కుమార్ అనే విలేకరి  ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదు కదాకనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో  చప్పిడి వెంగయ్య గురించి  తన పత్రికలో రాసిన వార్త చాలా సంచలనాన్ని సృష్టించింది.

మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’

నేను హైదరాబాదులో రేడియో విలేకరిగా చేరిన కొత్తల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం ఏర్పడింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగామద్యపాన వ్యతిరేకోద్యమ నేతగా ఆయన పలు పర్యాయాలు రేడియో స్టేషన్ కు వచ్చేవారు. నీరు కావి రంగు ఖద్దరు దుస్తులుముతక ధోవతిముడతలు పడ్డ అంగీ.  భుజం మీదుగా వేలాడుతూ ఒక గుడ్డ సంచి. దూరం నుంచే చూసి చెప్పొచ్చు ఆ వచ్చేది వావిలాల వారని. ఇక ఆ చేతి సంచిలో వుండేవి నాలుగయిదు  వేపపుల్లలుమరో జత ఉతికిన దుస్తులునాలుగయిదు పుస్తకాలునోటుబుక్కు. 1955 నుంచి 1967 వరకు ఆయన ఇండిపెండెంటుగా గెలుస్తూ వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన కాలినడకనే తిరిగేవారు. యెంత దూరమైనా కాలి నడకే. వూరు దాటి సుదూర ప్రాంతాలు  వెళ్ళాల్సివస్తే ఆర్టీసీ బస్సు లేదా సెకండు క్లాసు రైలు. ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళారు. గెస్టు హౌస్ లో దిగిన వావిలాల వారిని మర్యాద పూర్వకంగా కలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్ వెళ్లి గదిలో చూస్తే ఆయన లేరు. బయటకు వచ్చి వాకబు చేస్తే ఆ సమయానికి వావిలాల వారు  గెస్టు హౌస్ దగ్గర కృష్ణా నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ కానవచ్చారు. ‘అదేమిట’ని కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే, ‘వున్నవి రెండే జతలుఏరోజుకారోజే ఉతుక్కోవడం తనకు అలవాట’ ని చెప్పారు.

 

శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా ఆయనతో  నాకు పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు.

 

గతంలో ఓసారి  మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు (రిటైర్డ్ సీజీఎం, స్టేట్ బ్యాంక్,  అప్పుడు శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ చైర్మన్)  మా వదినెతో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే ఇవ్వాల్సిందని టీసీని అడిగారు. రాజమండ్రిలో మంత్రి సుభాష్ చంద్రబోస్ కోసం రిజర్వ్ అయ్యాయిలాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదాఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.

రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టంఆవిడమా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారుమనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.

మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”

మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే ఈ మాట చెప్పి మా అన్నగారి అనుమానం తీర్చారు.

రాజకీయుల్లో మంచివారి కోవలోకి వచ్చే వారిలో తన  89 వ ఏట మరణించిన భాట్టం  శ్రీరామ మూర్తి గారు మరొకరు.

దాదాపు ఇరవై ఏళ్ళు చట్టసభ సభ్యుడిగా,  ఎనిమిదేళ్ళు మంత్రిగా, ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా వున్నారు. కౌలాలంపూర్ లో నిర్వహించిన ప్రపంచ సభలకు నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు కారణాంతరాలవల్ల వెళ్ళలేక పోవడంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా వున్న శ్రీ భాట్టం ఆ సభల్లో కీలక ప్రసంగాలు చేసి సభికులను తన అసాధారణ వక్తృత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పీవీ మంత్రివర్గంలో వున్న ఈ ఇద్దరు మంత్రుల్ని 'జంట కవులు' అని పిలిచేవాళ్ళు. తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి అయినప్పుడు వీరి శాఖల్ని మార్చి ఒకరిది మరొకరికి కట్టబెట్టారు. 'జలగం గారు మాకు కుండ మార్పిడి చేశారు' అనేవారు శ్రీరామమూర్తిగారు హాస్యోక్తిగా.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి వ్యక్తిత్వం నచ్చిన నాటి టీడీపీ అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావు, ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో టీడీపీ టిక్కెట్టు మీద శ్రీ శ్రీరామమూర్తి, విశాఖ నియోజకవర్గం నుంచి తొలిసారి లోకసభకు ఎన్నికయి పార్లమెంటులో తన స్వరం వినిపించారు.

రాజకీయ జీవితంలో డబ్బుకు దూరంగా, ప్రజలకు దగ్గరగా గడిపిన చరిత్ర శ్రీ శ్రీరామమూర్తిది. రాజకీయ శత్రువులు సయితం ఆయన నిజాయితీని శంకించలేని స్తితి. హోదాలు కోరుకోలేదు. ఆస్తులు కూడబెట్టలేదు. విశాఖపట్నంలో ఏ చిన్న ఇంట్లో వున్నారో, జీవిత చరమాంకం వరకు అదే ఇంట్లో గడిపారు. మంత్రిగా వున్నప్పుడు అత్యంత నిరాడంబరంగా కుమారుడు విద్యాసాగర్ పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి శుభలేఖలు కూడా అచ్చు వేయించలేదు. తన కుటుంబసభ్యులను తీసుకుని ఒక ప్రైవేటు వాహనంలో పెళ్ళికి వెళ్ళి వచ్చారు. డాబూ దర్పాలూ లేవు, వందిమాగధులూ లేరు. అదీ భాట్టం శ్రీరామమూర్తి గారు పాటించిన జీవన విధానం.

తాను నమ్మింది ఆచరించి చూపడం అన్నది శ్రీరామ మూర్తి గారు తన పెళ్ళిలో కూడా ప్రదర్శించి చూపారు. ఆయనది కులాంతర వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ పెండ్లితంతుకయిన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.

ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా పనిచేసిన తరువాత మరోసారి శ్రీ రామారావు విశాఖ నుంచి రెండో మారు పోటీ చేయాలని శ్రీ శ్రీరామమూర్తిని కోరారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న శ్రీ భాట్టం, రామారావుగారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచీ ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక వ్యవహారాలకు దగ్గరగా వుంటూ వచ్చారు. ఏళ్ళు మీద పడి, కాళ్ళూ చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి వారిని ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు, అయన తన కుటుంబ సభ్యులనెవ్వరినీ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. తన టిక్కెట్టు తన భార్యకు ఇమ్మని కూడా దేబిరించలేదు.

భాట్టం శ్రీరామ మూర్తి గారు మిత్రుల కోరికపై తన ఆత్మ కధ రాశారు. అన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా రాసుకున్నారు.

చివర్లో తనకు తానే 'తుది పలుకులు' కూడా రాసుకున్నారు.

'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు) అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి ఏడుపెందుకు?'

శ్రీ భాట్టం శ్రీరామమూర్తికి ఒకనాటి రాజకీయ సహచరుడు, ముఖ్యమైన స్నేహితుడు కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు. అయన కుమారుడు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఈ గ్రంధానికి 'ముందు మాట' రాశారు. మహాకవి, సంస్కృత పండితుడు భవభూతి సూక్తిని శ్రీ బుద్ధ ప్రసాద్ అందులో ఉటంకించారు.

'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'. విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'

ఆ కొద్దిమందిలో ఒకరు శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి.

 

మరో ఉదంతం చెప్పుకుందాం.

ఓ మంత్రిగారు ఆఫీసులో రివ్యూ మీటింగులో వుండగా ఇంటర్ కం మోగింది.

అవతల పియ్యే.

సార్! ఇంటి నుంచి ఫోన్మేడం గారు లైన్లో వున్నారు’

మంత్రిగారు విసుగ్గా ఫోన్ తీసుకున్నారు. మరింత విసుగ్గా అన్నారు.

ఎన్ని సార్లు చెప్పానుఆఫీసులో మీటింగులో వున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. ఇంతకీ ఏమిటంత అర్జంటు పని’

‘........’

కారు పంపించాలా! ఎందుకు ఈ మీటింగు కాగానే నేనే ఇంటికి వస్తున్నాను. ఈ అరగంటలో కొంపలేం మునగవ్. డ్రైవర్ అటూ ఇటూ రెండు సార్లు తిరగడం దండగ. నేను వచ్చాక వెడుదువ్ కాని’

ఆరోజు మంత్రి ఛాంబర్లో దివాలా తీసిన ప్రూడెన్షియల్ సహకార పట్టణ బ్యాంకు గురించిన మీటింగ్ జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు అందులో పాల్గొంటున్నారు.

నిజానికి మంత్రులు ఇంటి పనులకోసం అధికారిక వాహనాలను వాడుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. అలాటి వాటిని చాలా సాధారణ విషయంగా తీసుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ప్రతి మంత్రికీ ఆయన శాఖ కిందికి వచ్చే కార్పొరేషన్ వాళ్ళే వాహనాలు ఒకటో రెండో అదనంగా సమకూర్చడం అనేది బహిరంగ రహస్యమే. మరి ఇదేమిటి ఈ మంత్రిగారు భార్య కారు కావాలంటే ఇలా విసుక్కుంటున్నారు?

ఆయన అంతే! ఆయన మంత్రే కాని అందరివంటి వాడు కాదు. ఆయన పేరే చిక్కాల రామచంద్రరావు. అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన సొంత అంబాసిడర్ కారునే వాడేవారు. ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ వాడుకునేవారు.

సింపుల్ గా వుండడం ఆయనకు ఇష్టం. మంత్రిగా వున్నప్పుడు ఈ ఇష్టాన్ని మహబాగా తీర్చుకున్నారు.

 

 

 

కింది  ఫోటోలు  : (ఎంత ప్రయత్నం చేసినా చప్పిడి వెంగయ్య గారిది దొరకలేదు)



వావిలాల గోపాల కృష్ణయ్య


పిల్లి సుభాష్ చంద్ర బోస్

భాట్టం శ్రీరామ మూర్తి

చిక్కాల రామచంద్ర రావు


















(ఇంకావుంది)

 

20, ఏప్రిల్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (145) – భండారు శ్రీనివాసరావు

 చంద్రబాబు పుట్టిన రోజు – ఒక జ్ఞాపకం

ఇరవై తొమ్మిదేళ్ల క్రితం ప్రతి ఏడాది ఏప్రిల్ పందొమ్మిదవ తేదీన మాకు తెలిసిన ఓ విజయవాడ వాస్తవ్యురాలు, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు, బస్సులో బయలుదేరి మరునాటి ఉదయం కల్లా హైదరాబాదు చేరుకొని, చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి మళ్ళీ బస్సెక్కి బెజవాడ వెళ్ళిపోవడం నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి నివాసంలో రద్దీని తప్పించి, ఆయన్ని కలుసుకునే వెసులుబాటు కల్పించడం అనే బాధ్యత ఆవిడ నా భుజస్కందాలపై వుంచేది. ఆయన అధికారంలో వున్నప్పుడు, లేనప్పుడు కూడా ఆవిడ అలా ఏటా హైదరాబాదు వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోవడం ఏళ్ళ తరబడి చూస్తూ వచ్చాను.
ఇప్పుడు కూడా ఆవిడ అలాగే వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే 2005 లో నేను రిటైర్ అయిన తర్వాత ఇలాంటి పనులు నెత్తికెత్తుకోవడం మానేశాను.
చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నాకూ, ఆయన పేషీ అధికారులకు నడుమ స్నేహపూర్వక కీచులాటలు నడుస్తుండేవి.
“ముఖ్యమంత్రితో వ్యవహరించాల్సిన పద్దతి ఇది కాదు, శ్రీనివాసరావు గారు..” అన్నాడో అధికారి ఓ రోజు నాతో తన మనసులోని అసహనాన్ని సాధ్యమైనంత మృదువైన మాటల్లో వ్యక్తపరుస్తూ.
ఈ ఐ.ఏ.ఎస్. అధికారి చాలా చాలా సౌమ్యుడు. పేషీలో పనిచేసే అధికారులను బట్టి ముఖ్యమంత్రి పనితీరు అంచనాలు ఆధారపడివుంటాయంటారు. ఆ రోజుల్లో సమర్దుడయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో ఆయన పేషీ అధికారుల పాత్రకూడా వుంది.
“ఇది మరీ అన్యాయం. ఆయన ముఖ్యమంత్రి. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఇలా పెళ్ళిళ్ళకూ, వేడుకలకూ పిలుస్తూ పోతే ఏం బాగుంటుంది. మీ ఇంట్లో పెళ్లి అంటే అర్ధం వుంది, ఇలా మీకు తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లకు కూడా ముఖ్యమంత్రి రావాలంటే ఎలా!” అనేవారు సౌమ్యుడయిన ఆ అధికారి.
“ఏమోనండీ! అది నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా, ఆయన పెళ్ళికి వస్తే పిలిచిన వాళ్ళు మహాదానందపడి పోయేవాళ్ళు. వున్న వూళ్ళో హైదరాబాదులోనే పెళ్లి. ఒక్కసారి వీలు చేసుకుని వస్తే సరిపోతుంది. అందుకే నేను అడగగానే ఆయన ఒప్పుకుని వస్తామని మాట ఇచ్చారు. ఇక మీ ఇష్టం” అనేవాడిని నేను.
తరవాత కధ చెప్పాల్సిన పనిలేదు. ఏ పెళ్ళికి ముఖ్యమంత్రిని పిలిచినా ఆయన వీలు చేసుకుని ఏదో ఒక సమయంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించి, పూల బొకే ఇచ్చి వెళ్ళేవాళ్ళు. కొన్ని చోట్ల భద్రతాపరమయిన ఇబ్బందులు అడ్డు వచ్చేవి. ముఖ్యమంత్రి వెళ్ళే చోట కనీసం రెండు లిఫ్టులు వుండాలి. రెండు ద్వారాలు వుండాలి. సెక్యూరిటీ వాళ్ళు ఇలాంటివి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్న తరువాతనే క్లియరెన్సు ఇచ్చేవాళ్ళు. కానీ, నా విషయంలో వాళ్ళు అనేకసార్లు రాజీ పడాల్సిన పరిస్తితి ఎదురయ్యేది. పెళ్ళిళ్ళకే కాదు, చిన్న చిన్న స్కూళ్ళ వార్షికోత్సవాలు, ఆటలపోటీలు ఇలా దేనికీ పిలిచినా చంద్రబాబునాయుడు మారుమాట లేకుండా వచ్చిపోయేవారు. ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇది కాదని పేషీ అధికారి కినుక వహించడం వెనుక కధ ఇదే.
ఏప్రిల్ ఇరవై చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. వారికి నా శుభాకాంక్షలు.
సీఎం అప్పాయింటుమెంటు అంటే అంత చులకనా! – వై ఎస్ తో ఓ జ్ఞాపకం
“ఏవిటండీ మీరు మరీను. సీఎం గారి అప్పాయింటుకోసం అందరూ క్యూలో వుంటారు. మీరేమో ఇచ్చింది క్యాన్సిల్ చేయమంటారు. ఇదేమీ బాగా లేదండీ శ్రీనివాసరావు గారూ”
భాస్కర శర్మ గారికి కోపం వచ్చిన సందర్భాలు బహు తక్కువ. వాటిల్లో ఎక్కువ భాగం నావల్లనే తటస్థపడ్డాయి.
భాస్కర శర్మ ఉద్యోగమే బిజీ బిజీ ఉద్యోగం. ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అప్పాయింటుమెంట్లు ఖరారు చేసే బాధ్యత ఆయనది. మామూలుగా అయితే ఫోను రిసీవ్ చేసుకునే వ్యవధానం కూడా వుండదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐ.ఏ.ఎస్.లు, ఐ.పీ.ఎస్. లు ఇలా ఎంతో మంది నుంచి ఒత్తిళ్ళు వుండే ఉద్యోగమాయే. అలాంటి ఉద్యోగం అయినా అది చేస్తున్నది భాస్కర శర్మ కాబట్టి ఆయన తీరే వేరు. ఎవరు ఫోను చేసినా మర్యాద, నమ్రత. సీఎం పేషీలో పనిచేసేవాళ్ళు యెంత మర్యాదస్తులయితే అంత మంచి పేరు నేరుగా సీఎం ఖాతాలో పడిపోతుంది.
నేను అనేకసార్లు శర్మ గారిని ఇబ్బంది పెట్టి ఎవరెవరికోసమో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అప్పాయింటు ఫోనులోనే అడగడం, తీసుకోవడం, మళ్ళీ ఫోనులోనే క్యాన్సిల్ చేయడం ఇలా అనేక సార్లు జరిగింది. యెంత సహన శీలుడికయినా కోపం రాకుండా ఉంటుందా. వచ్చింది. అప్పుడాయన అన్న మాట అదన్నమాట.
గతంలో రేడియో ఉద్యోగంలో వున్నప్పుడు ఈ అప్పాయింటుమెంట్ల గొడవే వుండేది కాదు. నేరుగా వెళ్లి కలవడమే. అంచేత వాటి విలువ ఏమిటో శర్మ చెప్పిన దాకా నాకూ తెలవదు.
రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే అప్పాయింటుమెంటు లేకుండానే ఆయన్ని అయన కారులోనే సరాసరి రేడియో రికార్ధింగుకు తీసుకువెళ్ళాను. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందుగా అయన సందేశం రికార్డు చేయాల్సింది రేడియో వాళ్ళే అనేది నా వాదన.
వై ఎస్ కూడా అంతే. అప్పాయింటుమెంటు తీసుకున్న సంగతీ, క్యాన్సిల్ చేసిన సంగతీ తెలిసి కూడా తరువాత కలిసినప్పుడు, ఏమీ తెలియనట్టే పలకరించేవారు. నోరారా నవ్వుతూ, ఒక చేతిని తెరిచి వుంచి మరో చేతి వేళ్ళను ముడిచి పెట్టి తెరిచిన అరచేతిపై కొట్టుకుంటూ ‘ఏవిటి విశేషాలు సార్ ’ అంటూ పలకరించేవారు. ఎవరితో అయినా ఆయన పలకరింపు పద్దతి ఇదే.

కింది ఫోటోలు:
జర్నలిస్ట్ ఎం.ఎస్. శంకర్ పెళ్లి రిసెప్షన్ లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే రేడియో స్టేషన్ రికార్డింగ్ కు వచ్చిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి
(ఇంకావుంది)
Like
Comment
Share

సందడి చేసిన జంధ్యాల గుంపు

 త్యాగరాయ గానసభలో సందడి చేసిన ఎస్సారార్ కాలేజీ జంధ్యాల గుంపు 


(గ్రూపుకు గుంపు అని తెలుగీకరణ చేసింది గుంపులో గోవిందుడు ధర్మవరపు రామ్మోహన రావు)


హైదరాబాద్ నగరం నలుమూలల్లో నివాసం వుంటున్న ఈ బ్యాచ్ లో దాదాపు పదిహేను మంది నిన్న సాయంత్రం ఠంచనుగా అయిదింటి కల్లా చిక్కడపల్లిలోని గానసభకు చేరుకున్నాము. అప్పటికి పెళ్లి కుమారుడు రఘు, తోడి పెళ్ళికొడుకు సుబ్బరాయ శర్మలు పెళ్లి మంటపానికి చేరుకోలేదు. నిజానికి అక్కడ జరిగింది పెళ్లి కాదు అంతకంటే పెద్ద వేడుకే.


ఎంవీ రఘు అనే ఎస్సారార్ కాలేజీ కుర్రాడు ఎలాంటి అండాదండా లేకుండా మద్రాసు వెళ్ళిపోయి సినీ జనారణ్యంలో సినిమాటోగ్రాఫర్ గా నిలదొక్కుకుని, యాభయ్ చిత్రాలకు, అందులోను దిగ్ధర్శకులు బాపు విశ్వనాధ్ వంటి వారితో పనిచేసి వారిచేత, ప్రేక్షకుల చేత సెహభాష్ అనిపించుకోవడం మాటలు కాదు. అందుకే మరోమాట

 లేకుండా త్యాగరాయ గాన సభలో ఘన సత్కారం.  విమర్శకుల  చేత ఆహా అనిపించుకున్న 'కళ్ళు' సినిమా దర్శకుడు కూడా ఈ రఘునే.  


ఈ సుదీర్ఘ సినీ యానంలో మిత్రుడు రఘుకు ఇంతకంటే ఘన సన్మానాలు, సత్కారాలు ఎన్నో జరిగాయి. కానీ నిన్న జరిగింది వెరీ వెరీ స్పెషల్.


 ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం ఒకే కాలేజీలో చదువుకున్న వాళ్ళం చాలా మందిమి, 'శనివారం సాయంత్రం  ఓ మూడు గంటలు మీ సమయం అప్పివ్వండి' అని కాలేజీ గ్రూపులో రఘు సరదాగా పెట్టిన ఆహ్వానానికి అందరూ తలూపడం, ఆ ఊపిన తలకాయలన్నీ పోలోమని వెళ్లి కమనీయంగా, కన్నుల పండుగగా జరిగిన రఘు సన్మాన వేడుకను కనులారా తిలకించి పులకించడం జరిగింది. 


మిత్రుడు ఎంవీ రఘు చూడడానికి చిన్న ఆకారం అయినా, సువిశాల సినిమా రంగంలో ఆకాశం ఎత్తుకు ఎదిగిన ఆ స్వయంకృషీవలుడికి స్వయంగా అభినందనలు తెలిపింది ఈ గుంపు. 


ఎంవీ రఘుకు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు లభించాలని కోరుకుంటూ అందరం ఇళ్లకు మళ్ళాము.

PHOTOS: Courtesy Shri Kusuma Mohana Rao Kilaru 









18, ఏప్రిల్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో ( 143 ) - భండారు శ్రీనివాసరావు

 ఏ నీతివాక్యం అయినా సరే,  ఏ ఒక్కరికో అనుకూలం కాదు. ఏ ఒక్కరికో ప్రతికూలం కాదు. నీతి అంటేనే ధర్మం. ధర్మానికి స్వపర బేధాలు వుండవు.

వర్తమానంలో ఏది సరైన దారి అని చెప్పేదే గతం. దాన్ని నుంచి పాఠం నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.

ఇది ఇప్పటి మాట కాదు, జరిగి అటూ ఇటూగా  అరవై ఏళ్ళు.

బెజవాడ రైల్వే ప్లాటు ఫారం. కృష్ణా జిల్లా కలెక్టర్ హడావిడిగా రాత్రివేళ అక్కడికి చేరుకున్నారు. కారణం వుంది. రైల్వే అధికారులపై ఆయనకు ఆగ్రహం కలిగింది. హైదరాబాదు నుంచి వైజాగ్ వెడుతున్న ఒక ఉన్నతాధికారికి కలిగిన అసౌకర్యం అందుకు కారణం. అధికారి రైల్వే రిజర్వేషన్ గురించి ముందుగానే రెవెన్యూ అధికారులు  బెజవాడ రైల్వే వారికి సమాచారం అందించి, రిజర్వేషన్ గురించిన అర్జీ ముందుగానే అందచేశారు కూడా. ఆ రోజుల్లో రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పట్లా కంప్యూటర్ల సాయంతో జరిగేది కాదు. హైదరాబాదు నుంచి వైజాగ్  వెళ్ళే వాళ్ళు బెజవాడలో రైలు మారి మరో రైల్లో వెళ్ళాలి. బెజవాడలో రైల్వే అధికారులు తయారు చేసిన రిజర్వేషన్ చార్టులో హైదరాబాదు అధికారి పేరు లేదు. రెవెన్యూ అధికారులకు ఏం చెయ్యాలో పాలిపోలేదు. కలెక్టర్ నేరుగా రైల్వే ఉన్నతాధికారితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే వారికీ, రెవెన్యూ వారికీ మాట పట్టింపు వచ్చింది. ఎవరికి వారు తమ వాదనే సరయినది అనుకోవడం వల్ల ఆ పట్టింపు పంతానికి దారి తీసింది. రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అంటే కుదరదు అన్నారు.

కలెక్టర్ తన పవర్ చూపించారు. తనకున్న జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలను ఉపయోగించుకుంటూ, అక్కడికక్కడే ప్లాటుఫారం మీదనే కోర్టు ఏర్పాటు చేశారు. దురుసుగా ప్రవర్తించిన రైల్వే అధికారిని అరెస్టు చేయాలని ఆర్డరు వేశారు. రైల్వే వారికి పరిస్తితి అర్ధం అయింది. మెట్టు దిగి వచ్చి హైదరాబాదు అధికారికి బెర్తు ఏర్పాటు చేశారు.

ఇది జరిగి కూడా అరవై ఏళ్ళు దాటింది. ఆ రోజుల్లో పత్రికల్లో చిన్న వార్తగా వచ్చింది. అప్పటి హైదరాబాదు పొలిమేరల్లో ఉన్న మిలిటరీ కంటోన్మెంటు నుంచి ఒక సైనిక జవాను నగరానికి వచ్చాడు. సినిమాహాల్లో కాబోలు అతడికీ స్థానిక పోలీసు జవానుకూ నడుమ ఒక తకరారు వచ్చింది. అది ముదిరి చేతులు కలుపుకునే దాకా వెళ్ళింది. స్థానిక పోలీసు తనకున్న స్థానబలంతో ఆ మిలిటరీ జవానును తీసుకువెళ్ళి లాకప్పులో పడేశాడు. ఈ సమాచారం కాస్త ఆలస్యంగా కంటోన్మెంటుకు చేరింది. ఒక ట్రక్కులో సైనికులు ఆ పోలీసు స్టేషన్ కు చేరుకొని స్థానిక పోలీసులకు దేహశుద్ధి చేసి తమ సహోద్యోగిని బందీఖానా నుంచి విడిపించి వెంటబెట్టుకు వెళ్ళారు. ఆ కాలంలో సమాచార వ్యాప్తి మెల్లగా జరిగేది కనుక, విషయం పైఅధికారులకు తెలిసేసరికి కొంత ఆలస్యం అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ వ్యవహారం కాబట్టి అది మరింత ముదరకుండా ఇరువైపులా ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు తీసుకున్నారని పత్రికా వార్తల కధనం.

“విద్యా సంస్థలు బంద్  అని టీవీల్లో స్క్రోలింగులు కనబడగానే మా అమ్మాయి బడికి వెళ్ళకుండా ఇంట్లో వుండిపోతుంది. యెంత చెప్పినా వినదు. ఇక  స్కూళ్ళు కూడా అలాగే మూసేస్తున్నారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్నభయాందోళనల వల్లే”.

ఈ మాటలు అన్నది సాక్షాత్తూ ఒకప్పటి  హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ అంటే నమ్మ శక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజంగా నిజం.

చాలా ఏళ్ళ క్రితం నగరంలో జరిగిన ఒక  సమావేశంలో మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయల్ దేశాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. “ఆ దేశంలో యెంత పెద్ద హింసాత్మక సంఘటన జరిగినా అక్కడి మీడియా ఆ విషయాన్ని లోపలి పేజీల్లో ప్రచురిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని ప్రముఖంగా మొదటి పేజీల్లో వేస్తుంది. మన దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. స్తానికంగా పరిమితమయిన సంఘటనలను సార్వత్రికం చేసి వార్తలు ప్రచారం చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు జరుగుతున్నాయి.”

కొత్వాల్ గారు అంతటితో ఆగలేదు.

ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ఉద్యమాలను నిర్వహించుకోవాలని హితవు పలికారు.

“రోడ్ల మీద భైఠాయించి ఇతరుల హక్కులకు భంగం  కలిగించే స్వేచ్చ ఆందోళనకారులకు ఎక్కడిద”ని నిలదీశారు.

ఖాన్ గారి ఈ  భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు కానీ, ఈ అంశాన్ని గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని మాత్రం చెప్పవచ్చు.

పత్రికలు చదవను.  టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.

భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్థల  ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.

చేతులు  బార్లా   జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే  ఆ చేతి కొసభాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఈ స్వేచ్చ  అని ఓ ఆంగ్ల సామెత వుంది.  అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.

 

“కేంద్రం మిధ్య” పొమ్మన్నారు, అలనాడు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు.

రామారావు సొంత పార్టీ పెట్టిన నాడు ఆయన పెట్టుకున్న లక్ష్యాలు ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ, కాంగ్రెస్ వ్యతిరేకత, ప్రాంతీయ ప్రయోజనాల సాధన. ఆ క్రమంలో ఆయన కేంద్రంపై విరుచుకుపడడాన్ని ప్రజలు అర్ధం చేసుకుని ఆయన్ని ఆశీర్వదించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చిన రీతిలో మార్చడం, ఆ పార్టీ హయాములో ముఖ్యమంత్రి అంజయ్యకు జరిగిన అవమానం, తెలుగు వాడి ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఆనాడు తీసుకున్న కొన్ని చర్యలు కూడా కేంద్రంపై పోరాటంలో రామారావు సాధించిన అపూర్వ  విజయానికి ఉపయోగపడిన మాట వాస్తవం. పోరాట పటిమ ప్రదర్శించడంలో ఎన్టీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు త్రికరణశుద్ధిగా ఆమోదించారు. 

  

ఒక్క ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి అనేకాదు,    ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పదవికీ, ప్రతి ఉద్యోగికీ కొన్ని అధికారాలు వుంటాయి. ఆ అధికారాలుకు అనుగుణంగా పనిచేసే కొన్ని వ్యవస్థలు వుంటాయి.  రాజ్యాంగం ప్రసాదించిన ఆ అధికారాలను, వ్యవస్థలను   తమ ప్రత్యర్ధులు, లేదా తాము  ఇష్టపడని వారిపై ప్రయోగిస్తూ పోతే అది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే అవుతుంది. అలా వాడుకోలేని అధికారాలు వుంటే ఏమి, లేకపోతే ఏమి అని వాదించేవాళ్లకు ఒక నమస్కారమే నా సమాధానం.

అంతరిక్షంలో వేలాది గ్రహాలు కళ్ళు తిరిగిపోయే వేగంతో  తమ నిర్ణీత కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయని సైన్సు చెబుతుంది. ఏ ఒక్క గ్రహమూ తన నిర్దేశిత కక్ష్యను దాటి ఒక మిల్లి మీటరు కూడా పక్కకు తొలగదు. అలా జరిగితే అది విశ్వ వినాశనమే. అయినా అన్ని గ్రహాలు అంత వేగంతో తిరుగుతూ కూడా  గతి తప్పకుండా భ్రమిస్తుంటాయి. పైగా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుంచీ జరుగుతోంది.

వాటికి ఎవరు చెప్పారు ఇలా గాడి తప్పరాదని.

రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే గతి తప్పకూడదు. తప్పితే రాజ్యాంగానికే ముప్పు. మన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, న్యాయాధిపతులు, అధికారులు  అందరూ సతతం మననం చేసుకోవాల్సిన నీతి వాక్యం.

ధర్మోరక్షిత రక్షితః

‘రాజ్యాంగాన్ని మీరు కాపాడండి. ఆ రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుంది”



(ఇంకా వుంది)

 

16, ఏప్రిల్ 2025, బుధవారం

అమ్మ చనిపోయింది – భండారు శ్రీనివాసరావు

 మా అమ్మ కడుపున పుట్టినా,  నేను పెరిగింది మా వదిన భండారు సరోజినీ దేవి దగ్గర.  నన్ను పెంచింది మా పెద్ద వదినే. నా  హైస్కూలు, కాలేజి చదువులు మా అన్నయ్య ఇంట్లోనే.

ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత వెన్నెముకకి సంబంధించిన  వ్యాధితో బాధ పడ్డాను. కింద చాప మీద వెల్లకిలా పడుకునే వుండాలి. ఏమాత్రం అటుఇటు ఒత్తిగిల్లినా ప్రాణం పోతున్నంత బాధ. అప్పుడు అన్నం ముద్దలు తినిపించింది మా వదినే. వేళకు మందులు వేసేది. అంతెందుకు బెడ్ పాన్ కూడా ఆమే పెట్టేది. కన్నతల్లి చేసే సేవలు మా వదిన చేసింది. ఆమె రుణం ఎన్ని జన్మలకు తీరనిది.

85 వ ఏట ఆమె రాత్రి నిద్రలోనే పోయింది.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు గారు   రిటైర్ అయిన తర్వాత, పుట్టపర్తిలో ఒకే ఒక గదిలో వుండేవాళ్ళు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం నడుచుకుంటూ భజనలకు వెళ్ళేవాళ్ళు. రెండు అడుగులు ముందు అన్నయ్య. ఆయన వెనుకనే అడుగులో అడుగు వేసుకుంటూ మా వదిన. ఎక్కడికి అని అడిగేది కాదు. ఆయన వెంట నడవడమే ఆమెకు తెలిసింది.

ముందు ఆయన పోయాడు. ఇప్పుడు ఆయన వెనుకనే వదిన.

ఇప్పుడే హైదరాబాదు మహాప్రస్థానంలో వదినగారి అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి చేరాము.

ఓం శాంతి!



(16-04-2025)

15, ఏప్రిల్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (142)- భండారు శ్రీనివాసరావు

 చంద్రబాబు నాయుడు నవ్వుతారా?

ఇదేమీ లోగడ  టీవీల్లో ఎస్ఎంఎస్ ప్రశ్న కాదు. అందుకు సందేహం అక్కరలేదు. ఆయన నవ్వుతారు. కాకపోతే నవ్వించాలి. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో , 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో కాని,  ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే! చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కబురు పెట్టారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు 'ప్రాంతీయ వార్తలు సమాప్తం' అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. 'నేనంటే ఎదురుగానే ఆఫీసు కనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే' అనుకున్నా. ఈలోపల అప్పటి సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, 'సీఎం బయలుదేరి రావచ్చా' అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేశారు. విలేకరులు పలుచగా వుండడం ఆయన కూడా గమనించారు.

'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను ఆయన పక్కనే కూర్చుని. అవేమిటో చెప్పమని అడిగారు. 'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడతాయా అన్నట్టుగా వుంది'

'అయితే...'

 'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'

'వూ..'

'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'

ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.

వై ఎస్ ఆర్ చెప్పిన గానుగెద్దు కధ
2004
జులై 21 న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక కధ చెప్పారు.
బాగా చదువుకున్న పండితుడు ఒకాయన నూనె గానుగ వద్దకు వెళ్ళాడు. అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ ఎద్దు మెడలోని గంటల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. పండితుడు గానుగ మనిషిని పేరు పెట్టి పెద్దగా పిలిచాడు. ఆ పిలుపు విని అతడు బయటకు వచ్చాడు.
నూనె కొన్న తరువాత పండితుడు అడిగాడు.
ఎప్పుడు వచ్చినా నువ్వుండవు. గానుగ పని మాత్రం నడుస్తూనే వుంటుంది. ఎలాఅని.
ఎద్దు మెడలో గంట కట్టిందే అందుకోసం. గంట చప్పుడు వినబడుతున్నదీ అంటే ఎద్దు తిరుగుతున్నట్టే లెక్క. తిరగడం మానేస్తే గంట చప్పుడు వినబడదు. నేను ఏ పనిలో వున్నా బయటకు వచ్చి ఎద్దుకు మేత వేస్తాను. నీళ్ళు పెడతాను. మళ్ళీ దాని పని మొదలు. నాపనిలో నేనుంటానుగానుగవాడు చెప్పాడు.
పండితుడు కదా! అనుమానాలు ఎక్కువ.
అలా అయితే ఎద్దు ఒకచోటనే నిలబడి తల ఊపుతుంటే గంటల శబ్దం వినబడుతుంది. కాని పని సాగదు. అప్పుడెలా?’ అడిగాడు.
నా ఎద్దు అలా చేయదుఅన్నాడు గానుగ మనిషి.
అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు?’ అని గుచ్చి అడిగాడు పండితుడు.
ఎందుకంటే, నా ఎద్దు మీలా చదువుకోలేదు కాబట్టి
ఆ జవాబుతో పండితుడి కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి.

వై ఎస్ చెప్పిన ఈ కధతో శాసనసభలో అందరూ పెద్దగా నవ్వారు.

 

నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’

ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది. ఒకరోజు పొద్దున్నే విలేకరులు  వెంటరాగా, ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి ఆయన కంటపడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!

నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.

 

కింది ఫోటో:

 

చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తీసిన ఫోటో. కర్టేసి: మిత్రుడు  శ్రీ జయప్రసాద్ఎండీమెట్రో టీవీ. ఆ రోజుల్లో బాబు గారి ఆకస్మిక పర్యటనలు మీడియాకు మంచి ఆహారం. అలా ఒక రోజు ప్రత్యేక బస్సులో వెడుతుండగా సీఎం మాతో (విలేకరులతో) ముచ్చటిస్తూ ఉన్నప్పటి దృశ్యం. ఆయన ఎదురుగా పొడుగు చేతుల తెల్ల చొక్కా మనిషిని నేనే.

మొదటి టరమ్ అని ఎందుకు గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే చంద్రబాబు కాళ్ళకు వున్న చెప్పులు. బహుశా తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు ఆయన తన  ఆహార్యం (ప్యాంటుచొక్కా)  ఏమీ మార్చుకోలేదు కానీ చెప్పుల నుంచి బూట్లలోకి మారిపోయారు. నేను కొత్తగా  మాస్కో రిటర్న్ కదా! బ్రాండెడ్  నైక్ షూస్ తో నేను.



 

(ఇంకా వుంది)