9, ఏప్రిల్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (139) – భండారు శ్రీనివాసరావు

 ఎవరీ పిల్లల కోడి?

ఒకప్పుడు ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్ నుంచి వనితాజ్యోతి అనే మహిళల పత్రిక వెలువడేది. వాసిరెడ్డి కాశీరత్నం గారు దానికి  ప్రతినిధి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ వాసిరెడ్డి నారాయణ రావు గారి సతీమణి.  

ఎప్పుడో  నలభయ్  అయిదేళ్ళ క్రితం వెతుక్కుంటూ చిక్కడపల్లి త్యాగరాయగాన  సభ దగ్గర వున్న మా ఇంటికి వచ్చారు. నా కోసం కాదు, మా ఆవిడకోసం. వెంట ఒక ఫోటోగ్రాఫర్ కూడా. వచ్చేసరికి మా ఆవిడ నడుపుతున్న అమ్మవొడి చైల్డ్ కేర్ సెంటర్ పిల్లలతో కీసరబాసరగా వుంది. వనితాజ్యోతి పత్రిక కోసం ఇంటర్వ్యూ చేద్దామని వచ్చారు. నోటు పుస్తకంతో కాశీరత్నం గారు, చంకన బిడ్డలతో మా ఆవిడ. ఆ గందరగోళం నడుమనే ఆమె ఇంటర్వ్యూ చేసి తమ పత్రికలో ప్రచురించారు.

అది యధాతధంగా:    

చిట్టి పొట్టి చిన్నారుల చిన్నారి ప్రపంచం – వాసిరెడ్డ్డి కాశీరత్నం

చిక్కడపల్లి సుధా హోటల్ నుంచి త్యాగరాయ గానసభకు వెళ్ళే రోడ్డులో “అమ్మ ఒడి” అని బోర్డు కనిపిస్తుంది. ‘అమ్మకొంగు ముడి విడలేని చిన్నారుల బడి’ అని కూడా ఓ ట్యాగ్ లైన్ వుంటుంది.

అదే భండారు నిర్మలాదేవి నిర్వహించే డే కేర్ సెంటర్ “అమ్మ ఒడి”.

గేటు తీసుకుని లోపలకు వెడితే...

ఆ గది అంతా పసివారి కోలాహలంతో నిండి వుంటుంది. పాల కోసం ఏడుస్తూ చేతులు చాపే చిన్నారుల దగ్గరినుంచి కాలిమువ్వలు ఘల్లుఘల్లుమంటూ తిరిగే దీపిక దాకా అంతా నిర్మలాదేవికి మాలిమి అయినవారే.

“ఈ పిల్లలంతా ఇలా కోలాహలంగా అరుస్తున్నారు కదా! మీకు తల నొప్పిగా ఉండదూ” అని ప్రశ్నిస్తే నవ్వుతుంది నిర్మల.

“మొదట్లో సంగతి ఎలా వున్నా తరువాత పిల్లలు బాగా అలవాటు అయ్యారు. ఇప్పుడు పిల్లలు లేకపోతె నేనుండలేను. ఏదో ఒక  కారణం వల్ల ఒక పిల్లవాడో, పాపో రాకపోతే ఆ  రోజు  నా మనసు తహతహలాడుతుంది. ఏమిటీ అనుబంధం అని ఆశ్చర్యం వేస్తుంది” నిర్మల జవాబు.

ముద్దులొలికే ఆ పసివాళ్లు పెద్దవాళ్ల మనస్సులకు బంధాలు వేసి లాగుతారు కదా!

“మొదటి నుంచీ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. నా పిల్లలు ఇద్దర్నీ బాగానే పెంచాను. మా పక్కన వుండే పూర్ణ చంద్రావతి నాకీ సలహా ఇచ్చారు. ముందుగా ఆవిడే వాళ్ళ పాప దీపికను నాకు అప్పగించి ఆఫీసుకు వెళ్ళేవారు. ఆ తర్వాతనే జేమ్స్ తట్టా బుట్టాతో వచ్చాడు”

అక్కడే ఆ పిల్లల దగ్గరే పిల్లల కోడిలా కూర్చుని కబుర్లు చెబుతోంది నిర్మల.

“ఇదిగో కార్తీక్. వీళ్ళమ్మ మ్యూజిక్ కాలేజీలో పనిచేస్తుంది. ఇటు చూశారా, హేమంత్. ఇదిగో ఇటు గౌతమ్. పద్మ ప్రియ. వీళ్ళ తల్లులు బ్యాంకుల్లో పనిచేస్తారు. ఈ చిన్నారి అపర్ణ అమ్మ యూనివర్సిటీలో, సురేశ్ వాళ్ళమ్మ టెలిఫోన్స్ లో పనిచేస్తారు”

ఒక్కొక్క బేబీని పేరుపేరునా పిలిచి చూపిస్తోంది నిర్మల.

“ఇంత పసివాళ్లు కదా! ఎలా మాలిమి అయ్యారు”

“మొదట్లో కొంతమంది మారాం చేశారు. శ్రీనివాస్ వచ్చినప్పుడు రెండున్నర ఏళ్ళవాడు. కొంచెం కష్టం అయింది. చంక దిగేవాడు కాదు. ఇంట్లో వంటంతా  వాడిని ఎత్తుకునే చేసేదానిని. ఆ తరవాత అలవాటు అయ్యాడు అనుకోండి. శైలజ రాగానే వాళ్లమ్మ చంక నుంచి నా మీదకు దూకేసింది. వీళ్ళందరికీ కబుర్లు చెప్పాలి. మాటలు నేర్పాలి. సాయంత్రం అయ్యేసరికి మొహాలు కడిగి, పౌడరు వేసి, బొట్టూ కాటుక పెట్టి వారి తల్లులకు అప్పగించేదాన్ని. కొంతమందికి స్నానాలు కూడా ఇక్కడే.  కొందరికి జడలు వేయాలి. వాళ్ళ అమ్మావాళ్ళు ఇచ్చి వెళ్ళిన డ్రస్సులు వేయాలి. మరీ చిన్నవాళ్లను లాలిపాటలు పాడి నిద్ర పుచ్చాలి. పెండ్లి వారిన పంపినంత పని వుంది.”

“ఇంత పనీ మీరొక్కరే చేయగలుగుతారా?

“అరుగో వున్నారు కదా! జయవిజయుల్లాగా. పెద్ద ఆయా సుశీల. చిన్న ఆయా పద్మ. వాళ్లిద్దరే నాకు సాయం”

“ఈ పసివాళ్లకు ఏదైనా సుస్తీ చేస్తే మీరేం చేస్తారు”

“చాలాసార్లు చిన్న చిన్న చిట్కా వైద్యాలు నేనే చేస్తుంటాను. మా పిల్లలు పసివాళ్ళుగా వున్నప్పుడు మా అత్తగారు, వదిన గార్ల నుంచి నేర్చుకున్నాను. నిజానికి ప్రతి తల్లీ ఒక రకంగా చిన్నసైజు  డాక్టరే. చాలా మంది తల్లులు పిల్లలకు నీళ్ళ పాలు పడతారు. ఇది మంచిది కాదు. తల్లులకు  పాలు ఎలా కలపాలో, ఎంత పొడి వేయాలో చెబుతుంటాను.  సాధారణంగా పసివారికి నెలకు రెండు డబ్బాలు పడతాయి. పాల పొడి డబ్బాలు, పాల సీసాలు వాళ్ళే ఇస్తారు. సీసాలను ఇక్కడే నీళ్ళలో ఉడికించి స్టెరిలైజ్ చేస్తాము. ఒక్క జేమ్స్ ను మాత్రమే రెండు మూడు సార్లు ఆసుపత్రికి తీసుకు వెళ్ళాల్సి వచ్చింది. తక్కిన పిల్లలతో ఎలాంటి ఇబ్బందీ లేదు. మా పెద్ద వదిన గారి కొడుకు మనోహర్ ఈ ఏరియాలో మంచి పేరున్న పిల్లల డాక్టర్. ఇంగ్లాండ్ లో చదువుకుని వచ్చాడు. అసలు విసుగన్నదే లేని మనిషి. ఎప్పుడు ఫోన్ చేసి సలహా అడిగినా ఏం చేయాలో చెప్పేవాడు. అలాంటి డాక్టర్ మనోహర్  మా చుట్టం అని తెలియగానే చాలా మంది తలిదండ్రులు సంతోషపడ్డారు కూడా”

“మరి ఈ తల్లులందరూ మీకు రెగ్యులర్ గా పే చేస్తుంటారా”

తల ఊపింది నిర్మల.

“చాలా రెగ్యులర్ గా పే చేస్తారు. పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా పిల్లల్ని నాకు అప్పగిస్తారు. మళ్ళీ సాయంత్రం అయిదున్నర లోపు తీసుకు వెడతారు. ఎవరో కొద్దిమంది షాపింగ్ కూడా ముగించుకుని వస్తారు. అదే కొంచెం కష్టం అనిపిస్తుంది. మా పిల్లలు అప్పటికే స్కూలు నుంచి వచ్చేవారు. వాళ్లకు ఏదైనా తినడానికి చేసి పెడదాం అంటే కుదిరేది కాదు. పాపం ఇద్దరూ అలా మిగిలిన పిల్లలతో ఆడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు”

మనసుకు తృప్తి కలిగించే పనులు చేస్తున్నప్పుడు మిగిలిన బాధలు ఒక లెక్కలోనివి కావు అన్నట్టు మాట్లాడింది నిర్మల.

తనకు నచ్చిన పని దొరికితే మనిషికి ఎంత సంతృప్తి లభిస్తుందో నిర్మలను చూసినప్పుడు నాకనిపించింది.

ముద్దులొలికే ఆ చిన్నారుల కబుర్లు, ముచ్చట్లు వింటూ నవ్వుకుంటున్న ఆ ‘భాగ్యశాలి’కి వీడ్కోలు చెప్పి అమ్మ ఒడి నుంచి బయటకు వచ్చాను.

-వాసిరెడ్డి కాశీరత్నం

కట్ చేస్తే  

సరిగ్గా ముప్పై తొమ్మిది  సంవత్సరాల తర్వాత :

 

చివరాఖరి నవ్వు



2019, ఆగస్టు.

హైదరాబాదు పంజాగుట్ట గలేరియా మాల్ లో ఓ షాపు. తను లోపలికి వెళ్ళింది. నేనూ వెంటే వెళ్లాను. అక్కడి సేల్స్ గర్ల్ కు  చిన్న తల నూనె సీసా చూపించింది.

ఎంత”

ట్వెల్ ఫిఫ్టీ”

ఆ అమ్మాయి ధర చెప్పగానే, నేను తొందరపడి,

అయితే నాలుగివ్వండి” అన్నాను పర్సులో నుంచి యాభయ్ నోటు తీస్తూ.

అప్పుడు వినపడింది నవ్వు.

ముందు సేల్స్ గర్ల్ అనుకున్నాను.

ఆమె వైపు చూస్తే అమ్మాయి నా మొహంలోకి చూస్తూ సన్నగా మందహాసం చేస్తోంది. మరి అంత బిగ్గరగా నవ్వుతోంది ఎవరు?

తీరా చూస్తే మా ఆవిడే.

ఇంకా నవ్వుతోంది. చిన్నగా కాదు. పగలబడి నవ్వుతోంది. అందరూ చూస్తున్నారు అనే ధ్యాస లేకుండా.

బహుశా అంత హాయిగా నవ్వింది మా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారి అనుకుంటా. అందుకే అలా చూస్తుండి పోయాను.

అంతగా నవ్వు తెప్పించే మాట అమాయకంగా ఏమన్నాను?

తర్వాత తెలిసింది, ఆమె నవ్వింది నా అమాయకత్వాన్ని చూసి కాదు, నా తెలివి తక్కువతనాన్ని చూసి అని.

ఉబెర్ లో ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఆ నవ్వు అలా తెరలు తెరలుగా వస్తూనే వుంది.

మీకు కిలో కాఫీపొడుం రేటు తెలవదు, అలాంటి షాపుల్లో పదీ పరక్కూ దొరుకుతాయని ఎలా అనుకున్నారు” అని నవ్వుతూనే అంది.

ఇంతకీ ఆ రోజు జరిగింది ఏమిటంటే సినిమా చూసి వస్తూ  షాపులోకి వెళ్ళాము. ఏదో తల నూనె కొన్నది. చూడబోతే చిన్నసీసా.

డబ్బులు ఇవ్వబోతూ నేనడిగిన ప్రశ్న”ఎంత” అని. “ట్వెల్ ఫిఫ్టీ” అన్నది షాపులోని అమ్మడు. “పన్నెండున్నర రూపాయల సీసా కోసం మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు, ఒకేసారి నాలుగు సీసాలు కొనుక్కోవచ్చు కదా” అంటూ యాభయ్ నోటు తీశాను. నిజానికి దాని ధర పన్నెండు వందల యాభయ్ రూపాయలు. ఈ విషయం తనకు తెలుసు. నాకు తెలవదు. మరి నాది అమాయకత్వమో, తెలివితక్కువతనమో కూడా తెలియదు. ఏదైతేనేం అది చూసే ఆమెకు నవ్వొచ్చింది. మామూలుగా కాదు. తెరలుతెరలుగా.

ఇలా పగలబడి నవ్వడం మొదటిసారి. నాకప్పుడు తెలియదు, మరో వారం తర్వాత అదే చివరిసారి అవుతుందని.

ఇప్పుడు కూడా ఆ మాల్ కి నా మనుమరాలు జీవికను వెంటబెట్టుకుని వెళ్లి ఆ షాపు దగ్గర కాసేపు తచ్చాడుతాను. నవ్వు వినబడుతుంది కానీ మనిషి కనబడదు.  

నవ్వు లాగే జ్ఞాపకాలు.

తెరలు తెరలుగా అలా వస్తూనే వుంటాయి.

ఎక్కడో ఆపాలి!

 

కింది ఫోటో :

మా ఆవిడ నడిపిన అమ్మవొడి




 

(ఇంకా వుంది)

 

 

అయాం ఎ బిగ్ జీరో (138) – భండారు శ్రీనివాసరావు

 అయిదే అయిదు నిమిషాల్లో కొన్న లక్ష రూపాయల నెక్లెసు

మొదటి నుంచీ మా సంసారం చిల్లు పడిన గంగాళం కాదు, ఎన్ని నీళ్ళు నింపినా జలజలా కారిపోయే వెదురు గంప.

జీతం వంద వున్నప్పుడు ఖర్చు  నూట యాభయ్ దాటేది. అయిదు వందలు చేతికి వస్తే ఆరేడు వందలు చేతులు దాటేవి.  ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎంతో కొంత తీసుకోవడమే. రిటైర్ అయినప్పుడు ఈ ఫండ్ నుంచి నాకు వచ్చింది ఏమీ లేదు. ఇది నా ఒక్కరికే కాదు, ఇప్పుడు డెబ్బయ్యో పడిలో పడిన ప్రతిఒక్కరికి అనుభవైకవేద్యమే.

ఇక్కడి నా మిత్రులలో అన్ని వయసుల వాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది కొంచెం అటూఇటూగా నా ఈడువాళ్ళే. నా తరం వాళ్ళే. కాబట్టి మా పెంపకాల్లో, జీవన విధానాల్లో కొంచెం పోలికలు కనిపిస్తాయి. మొదటి మెట్టు మీద కాలు మోపిన దగ్గరినుంచి పడిన కష్టాలు, ఇబ్బందులు, ఇప్పుడు పై మెట్టు మీద నిలబడి చూసుకుంటూ వుంటే చాలా వింతగా వుంటుంది. నడిచి వచ్చినదారి ఇలాంటిదా అని ఆశ్చర్యం వేస్తుంది.

తెలంగాణా సీ ఎం సీపీఆర్వో గా పదేళ్లు పనిచేసిన  వనం జ్వాలా నరసింహారావు, మా అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు (స్టేట్ బ్యాంక్  చీఫ్ జనరల్ మేనేజర్, రిటైర్డ్)  నేను కొద్ది సంవత్సరాల తేడాతో హైదరాబాదులో కాపురాలు పెట్టాము. ఈ విషయంలో జ్వాలా సీనియర్. ఆయన భార్య అయిన మా మేనకోడలు విజయలక్ష్మి, మా వదిన గారు విమల, మా ఆవిడ నిర్మల కలిసి చిక్కడపల్లిని కాలినడకన చుట్టబెట్టేవారు. మా అన్నయ్య అప్పటికే స్టేట్ బ్యాంకులో రీజినల్ మేనేజర్. . ఉద్యోగ రీత్యా ఎన్నో వ్యాపార సంస్థలకు రుణాలు ఇచ్చి వుంటారు.  కానీ ఆయన అశోక్ నగర్ లో తన ఇంటికి దగ్గరలో వున్న కిరాణా దుకాణంలో రెండు వందలు ఖాతా పెట్టాల్సి వస్తే, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబితే ఇస్తాను అన్నాడు ఆ దుకాణదారు. చివరికి మా పెద్ద  మేనకోడలు కూతురు చిన్నపాప   సిఫార్స్ మీద ఆ రెండు వందలు అప్పు పుట్టిందట.

మా మేనకోడలు, మా వదిన గారు అశోక్ నగర్ నుంచి నడుచుకుంటూ త్యాగరాయ గానసభ దగ్గర వున్న మా ఇంటి (అమ్మవొడి)కి వచ్చి మా ఆవిడను తీసుకుని సరుకులు కొనడానికి చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు వెళ్ళేవాళ్ళు.

ఎండ బాగా వుంటే ముగ్గురూ కలిసి ఒక రిక్షా మాట్లాడుకుని మధ్యలో మా ఆవిడను దింపేసి వాళ్ళిద్దరూ అశోక్ నగర్ వెళ్ళేవాళ్ళు.

లక్ష్మీ షో రూములో వాయిదాల మీద చీరెలు కొనుక్కునే వాళ్ళు.

ఆ రోజుల్లో లోటస్ స్టీల్ షాపులో నెలకు పది రూపాయలు చొప్పున పది నెలలు కడితే నెలకోసారి లాటరీ తీసి వంద రూపాయల స్టీలు వస్తువు ఇచ్చేవాడు. ప్రతినెలా ఆ షాపు దగ్గరికి పోవడం, బోర్డు మీద చాక్ పీసుతో రాసిన విజేతల జాబితాలో తమ నెంబరు లేకపోవడం, ఉసూరుమంటూ తిరిగి వస్తూ సుధా హోటల్లో టు బై త్రీ కాఫీ తాగడం నెలనెలా ఓ తంతుగా మారింది.

ఇంట్లో అందరి పేరు మీద కట్టినా, లాటరీ ఎప్పుడూ తగలకపోవడంతో, మా వదిన గారు ఓ నెల, మా రెండో పిల్లవాడు సంతోష్ పేరు మీద కడితే మూడో నెలలోనే లాటరీ తగిలిందట. వంద రూపాయల వస్తువు తీసుకుంటూ, మా వాడికి కూడా, పాలు పట్టడానికి ఓ స్టీలు గ్లాసు కొనిచ్చింది.

ఆ రోజుల్లో ఇలా ఇబ్బందులు అందరికీ ఉండేవి కానీ, అవి ఇబ్బందులుగా అనిపించక పోవడానికి కారణం అందరూ ఒకే బోటులో ప్రయాణీకులు కావడమేమో మరి!

నిజం చెప్పాలి అంటే 2005 డిసెంబరు  31రిటైర్ అయిన తర్వాతనే నాకు రుణ విముక్తి కలిగింది. అప్పుల బాధ తీరింది.  గ్రాట్యుయిటీ మొదలయిన రూపాల్లో చేతికి వచ్చిన  నాలుగయిదు లక్షల రూపాయలతో,  పేరుకున్న చిల్లర బాకీలు తీర్చేముందు, మళ్ళీ ఇలాంటి బంగారు అవకాశం నాకు జన్మలో రాదని, మా ఆవిడకు నా  బ్యాంకు కార్డు ఇచ్చి, ఈ మొత్తానికి మించకుండా నీ ఇష్టం వచ్చింది కొనుక్కోమని పంజాగుట్ట లోని టాటా వాళ్ళ  టైటాన్ షో రూమ్ కి తీసుకువెళ్ళాను. ఒక్క చిన్న ఉంగరం కొనుక్కుని బయటకు వచ్చింది. మిగిలిన డబ్బుతో  బాకీలు అన్నీ తీర్చేసి, ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా అరవై ఏళ్ళ వయసులో ఉద్యోగ విరమణ పర్వాన్ని ప్రారంభించాము.  

రిటైర్ కావడానికి ఏడాది ముందు ఆరు నెలలు అమెరికా వెళ్ళాం మా పెద్దవాడు సందీప్ ఉంటున్న సియాటిల్ కు. అమెరికా అని చెప్పి  ఎందుకు  వున్న సెలవులు  పాడు చేసుకుంటారు, అదీ రిటై మెంట్ ముందు. అమలాపురం వెడుతున్నాం  అని రెండు రోజులు సెలవు చీటీ పారేసి అమెరికా వెళ్ళిరండి అని శ్రేయోభిలాషుల సలహా. బిగ్ జీరోలు అలాంటి మాటలు చెవిన పెట్టరు. కదా! అంచేత రిటైర్ మెంటులో పది నెలలకు రావాల్సిన జీత భత్యాల్లో  ఆరు మాసాల సొమ్ముకు చెల్లు చీటీ స్వయంగా రాశాను.  అలా వుంటుంది జీరోలతోటి.

అక్కడ అమెరికాలో మా వాడు సందీప్, కోడలు భావన కలిసి మా ఆవిడని వెంటబెట్టుకుని బంగారం షాపింగుకి వెళ్ళారు. తీరా ఇంటికి పది జతల చెప్పులతో వచ్చారు. ‘ఎంత చెప్పినా అమ్మ వినలేదు. బంగారం మీద మోజు లేదు. మంచి చెప్పులు కొనుక్కుంటాను, మా ఫ్రెండ్స్ కి కూడా తీసుకు వెడతాను’ అంటూ మొండికేసింది అని మొత్తుకున్నాడు మా వాడు. మా ఆవిడ దగ్గర పెరుగుతున్న పక్కింటి పాపకు ఒక బంగారు గొలుసు కొనమని చెప్పిందట, కొన్నాడు.  అదేమిటో ఈ కాలపు ఆడపిల్లలకు చాలామందికి బంగారం మీద మోజున్నట్టు లేదు. మా కోడళ్ళు ఇద్దరూ ఇదే బాపతు.

నా రిటైర్ మెంటు 2005 డిసెంబరు  31 న. ఒక్క రోజు తర్వాత, 2006  జనవరి ఒకటిన  రిటైర్ అయివుంటే,  ఆ నాటినుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర  పే కమిషన్ సిఫారసుల ప్రకారం నా పెన్షన్ బాగా పెరిగేది. ఉద్యోగులకు, ఉద్యోగ విరమణ చేసినవారికి  గొప్ప ప్రయోజనం కలిగించిన అలాంటి  మంచి సిఫారసులు మళ్ళీ ఈ పాతికేళ్లలో రాలేదని చెప్పుకుంటారు.  ఆ బస్సు నాకు ఒక్క రోజులో మిస్సయింది. కానీ దేవుడు కరుణామయుడు. కేంద్ర ప్రభుత్వం కామధేనువు.  పే కమిషన్ లో కొంతమందికి జరిగిన అన్యాయాన్ని సవరించి మళ్ళీ కొంత మొత్తాన్ని పట్టుకుపొమ్మని దూరదర్సన్ వాళ్ళు ఫోన్ చేశారు. అది నా డెబిట్ కార్డులో భద్రపరచుకుని, ఈ సారి పోయిన సారిలా కాకూడదని మా ఆవిడను తీసుకు పోకుండా, నా అంతట నేనే వెళ్లి డెబిట్ కార్డుపై ఒక చిన్నపాటి నెక్లెస్ లక్ష రూపాయలు పెట్టి  అయిదంటే అయిదే నిమిషాల్లో కొన్నాను. అమ్మిన అమ్మడు నా వైపు అదోలా చూసింది, అనుమానంగా. ఒక పత్రికలో పడిన చిన్నపాటి నెక్లెస్ ప్రకటనని ఒకటి రెండు సార్లు మా ఆవిడ చూడడం గతంలో నా కంటపడింది. బహుశా అదంటే ముచ్చట పడుతున్నదేమో అనిపించి  అదే కొన్నాను.  చాలా సంతోషపడింది, దాన్ని చూడగానే. ఎందుకంటే నా అంతట నేను కొనిచ్చిన మొదటి బంగారు కానుక అది.  

ఎప్పుడు చిన్నమెత్తు బంగారం కొనిపెట్టని మొగుడు ఇలా కొనడం ఆ దేవుడికి  నచ్చినట్టు లేదు. మళ్ళీ ఆసుపత్రి పాలయింది.  వాళ్ళు పరీక్షల పేరుతొ  ఆమె ఒంటిపై ఉన్న కాలి మెట్టెలతో సహా తీసి ఇచ్చారు. అంతా అయోమయంలో ఉన్నాము. ఎలా జరిగిందో తెలియదు. నేను ముచ్చటపడి కొన్న ఆ నెక్లెస్ కనిపించకుండా పోయింది. రేపో ఎల్లుండో  డిస్ చార్జ్ అనగా, నేను నా మేనకోడలు విజయలక్ష్మికి అంటే నా మిత్రుడు జ్వాలా నరసింహారావు భార్యకి ఫోన్ చేశాను. వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణం బాపతు.

‘ఈ సంగతి ఎవరితో అనవద్దు. జరిగిన విషయం ఇది. తను ఇంటికి వచ్చేలోగా ఆ నెక్లెస్ ఇంట్లో వుండాలి. నేను ఆసుపత్రి నుంచి మీ ఇంటికి వస్తున్నాను. ఇద్దరం కలిసి వెడదాం. అచ్చు అలాంటిదే మరోటి కొనాలి. నీ సాయం కావాలి’ అని అడిగాను. అసలే నాకు  మతిమరపు. వేరే డిజైన్ కొంటే ఇబ్బంది. పాపం తను ఒప్పుకుంది. ఇద్దరం వెళ్లాం. అదే రకం నెక్లెస్ దొరికింది. అమ్మయ్య అనుకున్నా.  నా పెన్షన్ ఖాతాలో వున్న డబ్బులు సరిపోయాయి. కధ సుఖాంతం.   

దేనికయినా ప్రాప్తం అనేది ఒకటి వుంటుంది. ‘గోదావరిలో ఎన్ని నీళ్ళు వున్నా మనం బిందె తీసుకు వెడితే బిందెడు, గిన్నె తీసుకు వెడితే గిన్నెడు. ఎంత ప్రాప్తమో అంతే!’ అనేవారు మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు. పాత నెక్లెస్ ఎలా పోయిందని ఆలోచించలేదు. ఆలోచించి ఏం లాభం? ఎవరిమీదో అనవసరమైన అభాండం వేయడం తప్ప.

ఇలా ఎన్నో! ఎన్నెన్నో! అనుభవాలు.  

కింది ఫోటో:

పెన్షన్ డబ్బులతో మొదటిసారి కొన్న నెక్లెస్ తో మా ఆవిడ నిర్మల



(ఇంకా వుంది)

8, ఏప్రిల్ 2025, మంగళవారం

అన్నీ యంత్రాలకు ఒప్పచెబితే ఇక మనుషులు ఏం చేయాలి? – భండారు శ్రీనివాసరావు

  

నేను బాంకర్ నా, బాంక్ కస్టమర్ నా ?

నా బుద్ధి పనిచేసే మేరకు నేను బాంకర్ ని కాదు, కేవలం కస్టమర్ నే. 

మరి ఈ కె వై సీ ఏమిటి? బాంకుల పరిభాషలో KYC అంటే   KNOW YOU CUSTOMER. దీనికి అర్ధం చెప్పుకుంటే నీ కస్టమర్ పూర్వాపరాలు గురించి తెలుసుకో అనే భావం స్పురిస్తుంది. కస్టమర్ గురించి తెలుసుకోవాల్సింది బాంకులే అనే అర్ధం వస్తుంది. మరి మీ కె వై సి ఇంకా దాఖలు చేయలేదు, వెంటనే మీ బ్రాంచికి వెళ్ళండి అని మెసేజ్ లు, ఈ మెయిల్స్, ఆఖరికి స్పీడ్ పోస్టులో ఉత్తరాలు. ఈ ఉత్తరం వెంటబెట్టుకుని వెళ్ళండి అని ఓ చివర్లో సలహా కూడా.    

సరే! ఈ మతలబు ఎలాగో అర్ధం అవదు కనుక ఇంతటితో వదిలేద్దాం.

ఇది వాళ్ళ బాధ్యతా, మన బాధ్యతా అనే కుశంకలకు తావివ్వకుండా, తర్కాలకు పోకుండా బాధ్యత కలిగిన పౌరుడిగా బాంక్ కే వెళ్లాను. అన్ని కౌంటర్లలో  సింగిల్ విండో అనే బోర్దులే కనిపించాయి. ఒక కౌంటర్ దగ్గర ఆట్టే జనం లేకపోవడంతో కాసేపు వెయిట్ చేసి అడిగితే, ఈ కౌంటర్ కాదు, పలానా కౌంటర్ కు వెళ్ళండి అని సూచన. మరి సింగిల్ విండో అంటే అర్ధం ఇది కాదు కదా అని అడగబోయి, సాధారణ పౌరుడి సాధారణ పౌర ధర్మం గుర్తుకు వచ్చి, మళ్ళీ తర్కవితర్కాలకు పోకుండా బుద్ధిగా తలూపి అక్కడికే వెళ్లాను. అదేమిటో కొన్ని చోట్ల జనం లేరు. ఈ విండో దగ్గర కనీసం పదిమంది తేనేతీగెల తుట్టెలా మూగివున్నారు. తీరా నా వంతు వచ్చేసరికి అ కౌంటర్ లో వ్యక్తి ఆధార్ ఉందా, పాన్ వుందా వుంటే వాటి జిరాక్స్ కాపీలు, లేటెస్టుగా దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జత చేసి, అక్కడ కౌంటర్ లో కేవైసీ ఫారం పూర్తిచేసి పట్రండి అన్నది, తాపీగా. పర్సులో క్రెడిట్ కార్డులు అంటే వుండవు కానీ ఇలాంటి కార్డులకు కొదవేముంటుంది. అక్రిడిటేషన్ కార్డు, ప్రెస్ క్లబ్ కార్డు, పెన్షన్ కార్డు, సీ జీ హెచ్ ఎస్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు  మొదలైన కార్డులతో, డబ్బులు లేకపోయినా న పర్స్ ఎల్లప్పుడూ కడుపు నిండుగా వుంటుంది. కానీ   జిరాక్సులు. ఈ మండుటెండలో అదో పరీక్ష. వీటి కాపీలు తీసుకురావాలని ఆ స్పీడ్ పోస్టు ప్రేమలేఖలో రాస్తే మీ సొమ్మేం పోతుంది అనబోయి మళ్ళీ ఏదో సినిమాలో కోపాన్ని నిగ్రహించుకోవడానికి చిటికెలు వేసినట్టు  వేయబోయి,  మళ్ళీ కొత్త అపార్థాల సీనుకు తెర తీయడం  ఎందుకని,  బలవంతాన నిగ్రహించుకుంటుంటే ఎదురుగా ఒక నోటీసు బోర్డు మీద ఒక ఫోటో కనిపించింది. కింద బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది క్వార్టర్ అని రాసుంది. అరె యాదగిరి రెడ్డి గారు, తెలిసినవాడే అని ఆయన  ఛాంబర్ లోకి వెళ్లబోతుంటే, ఫోనులో మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని అక్కడే కాసేపు నిలబడ్డాను. ఫోను పెట్టేసిన తర్వాత కలిసి విషయం చెబితే ఎవర్నో పిలిస్తే, అతడికి నా ఆధార్, ఇతర కార్డులు పూర్తిచేసిన ఫారం  ఇచ్చాను. 

కధ సుఖాంతం నేను  అనుకున్నా కానీ,  కధ అనుకోలేదు. అది యథావిధిగా కొనసాగింది. ఈ వివరాలను అప్ లోడ్ చేయాల్సిన ఉద్యోగి తన పనితో సతమతమౌతున్నాడు. వీలు దొరకగానే చేస్తాను అన్నాడు. నమ్మకం లేక అక్కడే కాసేపు కూర్చొన్నాను. ఈ లోగా ఎదో పని మీద బయటకు వచ్చిన రెడ్డి గారు ఏమిటి ఇంకా ఇక్కడే వున్నారు అన్నట్టు చూస్తే, విషయం చెప్పాను. ఆయన కౌంటర్ లో కనుక్కుంటే ఇప్పుడే చేశాను, ఆయన అవసరం లేదు వెళ్లిపోవచ్చు అన్నాడు. ఏదైనా రసీదు ఇస్తారా అంటే అదేమీ లేదు, మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది అన్నాడు. నమ్మకం లేక బ్యాంకు వాట్సప్ నెంబరుకు మెసేజ్ పెడితే, మీ కేవైసీ దాఖలు చేయలేదు, వెంటనే దగ్గరి బ్రాంచికి  వెళ్ళండి అని సమాధానం వచ్చింది. అది ఆయనకు చూపిస్తే, నేను పూర్తిచేసి ఇచ్చిన ఫారంలో కింది భాగం చించి, స్టాంపు వేసి ఇచ్చి వెళ్ళమన్నాడు. 

చివరికి అర్ధం అయింది ఏమిటంటే కంప్యూటర్ చెప్పిందే వేదం. స్వయంగా నేను నేనే అని చెప్పినా అది కంప్యూటర్ చెబితేనే నమ్మే రోజులు. 

1975 లో నేను హైదరాబాదులో రేడియో ఉద్యోగంలో చేరినప్పుడు ఓపెన్ చేసిన అక్కౌంట్. అంటే దాదాపు యాభయ్ ఏళ్ళుగా ఆ బ్యాంకుకి నిరవధిక కస్టమర్ ని. అయినా ఆ విషయం ఇన్ని ఆధారాలు ఇచ్చి ప్రవర చెప్పుకుంటే కానీ నేను కస్టమర్ ని కానట్టే లెక్క. 

వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు రావాలి అని అడిగితే రెండేళ్ల తరవాత అన్నారు.  అప్పుడు కూడా ఇన్ని కార్డులు, కాపీలు తేవాలా అంటే తప్పకుండా అనే జవాబు. 

‘ఇప్పుడు నా వయసు 79. విష్ మి బెస్ట్ ఆఫ్ లక్’ అని చెప్పి వచ్చేశాను. 

AI అడుగు పెడుతున్న సంధి యుగంలోనే ఇలా వుంటే అది పూర్తిగా రెక్కలు విప్పితే అప్పుడు ఎలా వుంటుందో!



(08-04-2025)

7, ఏప్రిల్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో ( 137 ) – భండారు శ్రీనివాసరావు

 ఎప్పటికీ మిగిలేవి జ్ఞాపకాలే!

తలపుకు వస్తే కొన్ని దుఃఖ పెట్టేవి, మరికొన్ని  మనసుకు ఉల్లాసం కలిగించేవి.

సమస్త సృష్టిలో ఒక్క మనిషికే దక్కిన వరం ఈ జ్ఞాపకం.

మనిషికి వున్న వాటికంటే  పోయిన, పోగొట్టుకున్న వాటి మీదే మక్కువ ఎక్కువ. జ్ఞాపకాలు కూడా వీటిచుట్టూనే తిరుగుతుంటాయి. అలాగే నా ఈ స్మృతులు.

ఎందుకీ రాతలు?
కారు అద్దంపై జారిపోతున్న వర్షపుచుక్కల్లా మనసును ముసురుకుంటున్న ఆలోచనలు.
వైపర్ తో నీటిపొరలను తొలగించినట్టు,
దిగులును దూరం చేసుకునేందుకే ఈ రాతలు.
ఒక్క క్షణం ఆపితే... చాలు
చుట్టూ జ్ఞాపకాల వరదలు

 

ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది ఒక పిచ్చివాడితోనా!”

మా ఆవిడ చనిపోయి, దహన సంస్కారాలను కళ్ళారా చూసి వచ్చిన నెలరోజులకు తను నాతో మాట్లాడింది.
ఆశ్చర్యంగా వుంది కదూ. నేనే మాట్లాడేది. అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ పొద్దున్నే లేచి నా ఫోటోకి దణ్ణం పెడుతుంటే చూసి ఇక మాట్లాడక తప్పదు అనిపించింది.
నేను ప్రతి రోజూ పూజలు చేస్తుంటే దేవుడి మండపంలో ఏనాడు దీపం కూడా వెలిగించని నువ్వు ఇలా చేస్తుంటే నాకూ ఆశ్చర్యం అనిపించింది.
నిన్ను ‘నువ్వు’ అంటున్నానని ఆశ్చర్యంగా ఉందా. నిజమే! నా జీవితంలో నిన్ను ఏనాడూ ‘నువ్వు’ అని పిలిచి ఎరుగను. ఇప్పుడు జీవితమే లేని ‘జీవితం’ నాది. ఎల్లాగూ దణ్ణం పెడుతున్నావు కాబట్టి ఇక నుంచి నిన్ను నేను నువ్వు అనే అంటాను.
ఆ రాత్రి నువ్వు అంబులెన్స్ కోసం హడావిడి పడుతూ నా చివరి మాటలు వినే ఛాన్స్ పోగొట్టుకున్నావు. నిజానికి నేనూ మాట్లాడే పరిస్తితి లేదు. ఏదో చెబుదామని నోరు తెరవబోయాను. మాట పెగల్లేదు. అంబులెన్స్, అడ్రసు చెప్పడాలు ఏవేవో మాటలు. అర్ధమయీ కాకుండా.
అందుకే నెల రోజులు ఆగి ఇప్పుడు చెబుతున్నా విను.
నువ్వు నువ్వులా వుండు. వేరేలా వుంటే నాకస్సలు నచ్చదు. బావగారూ, అక్కయ్యలు, మేనకోడళ్ళు పిల్లలు అందరూ ఇదే చెబుతున్నారు, నీకు. వారి మాటే నా మాట కూడా.
పెళ్లికాకముందు నుంచి నువ్వు ఎలా వుంటే బాగుంటుందో నాకో ఐడియా వుండేది. వేసుకుండే బట్టలు. నడిచే పద్దతి. మాట్లాడే తీరు. మూడోది నీదే, నేను మార్చింది ఏమీ లేదు. గుర్తుందా. మద్రాసు నుంచి ఒక చొక్కా పోస్టులో పంపితే ఇదేం ఫ్యాషను అని వంకలు పెట్టావు. చివరికి అదే ఫ్యాషన్ అయింది. ఈ యావలోనే నేను ఒక పొరబాటు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీ దుస్తుల సైజు నీకు తెలవదు.  షర్ట్ బటన్లు సరిగా పెట్టుకోవడం చేతకాదు. ఏ ప్యాంటుపై ఏ కలర్ చొక్కా వేసుకోవాలో నేనే చెప్పేదాన్ని. మరి ఇప్పుడు ఎలా అన్నది నీకే కాదు, నాకూ ప్రశ్నే.
ఇన్నాళ్ళు ఇంటిని పట్టించుకోకుండా ప్రపంచమే నీ ప్రపంచమని వేళ్ళాడావు. ఇప్పుడు పట్టించుకోవడానికి ఇంట్లో నేనెట్లాగు లేను. నేనున్నప్పుడు నీకో ప్రపంచం వుండేది. అందులో వున్నప్పుడు నేనెప్పుడూ నీకు గుర్తు వుండేదాన్ని కాదు. సరే! అదొక విషయం. దాన్ని పక్కన పెడదాం.  మళ్ళీ నీ ప్రపంచంలోకి వెళ్ళిపో. నా మాట విని నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయిపో. ఇంకో విషయం చెప్పనా! నువ్వు అలా ఉంటేనే నేనిక్కడ సంతోషంగా వుంటాను. మాట వినే మొగుడు నా మొగుడని ముచ్చట పడతాను.
ఒంటరిగా ఎలా నిభాయించుకుని వస్తావో తెలవదు. అదొక్కటే నా బాధ. దానికి నేను కూడా చాలావరకు కారణం.  కానీ నీ చుట్టూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటున్న మన వాళ్ళని చూసిన తర్వాత ఆ భయం క్రమంగా తగ్గిపోతోంది.
మళ్ళీ చెబుతున్నా విను. ఇదే ఫైనల్. మళ్ళీ నా నోట ‘నువ్వొక పిచ్చివాడివి’ అనిపించకు”


నేనూ అందరిలాగే నిద్రలో అనేక కలలు కంటూ వుంటాను.
లేచిన తర్వాత ఒక్కటీ గుర్తు వుండదు. మరి ఇది ఎలా గుర్తుంది?
కల కాదా! నిజమా!! నా భ్రమా!!!

 

 

ఇంతగా భార్యను  ప్రేమించారు. చాలా గొప్ప విషయం’ అంటూ మితృలు కొనియాడుతున్నారు. ఇది కలలో కూడా నేను అంగీకరించను. ఒకవేళ నేను అలా గొప్పలు చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే.

మా ఆవిడ ప్రాణ  స్నేహితురాలు శ్రీమతి వనం గీత ఎప్పుడూ అంటుండేది. ‘నువ్వు మీ ఆయన్ని బాగా గారాబం చేసి చెడగొడుతున్నావు. అందరికీ మొగుళ్ళు లేరా! అందరూ ఇలానే మాలిమి చేస్తున్నారా! నీకు ఒంట్లో బాగా లేకపోయినా నువ్వే కాఫీ కలిపి ఆయనకు ఇవ్వాలా! వంటింట్లోకి పోయి ఓ కప్పు కాఫీ కలుపుకుని తాగలేరా, మరీ విడ్డూరం కాకపొతే!’

 

అవును. గీత గారు చెప్పింది అక్షరాలా నిజం. నన్ను చెడగొట్టి ఎందుకూ పనికిరాని ఓ మొగుడ్ని చేసింది. స్టవ్ అంటించడం కూడా రాని మొగుళ్ళ జాబితాలో చేర్చేసింది. సిగ్గు లేకుండా చెబుతున్నాను. నా బనీను సైజు కూడా నాకు తెలియదు. పొరబాటున ఏదైనా వూరు వెళ్లినప్పుడో, స్నేహితులు షాపింగ్ చేస్తున్నప్పుడు కొనుక్కున్నానా ఇక అంతే! లొడుంగు బుడుంగు. ప్యాంటు పైకి లాక్కుంటూ తిరుగుతుంటే తనే తీసుకువెళ్ళి వాటిని ఆల్టర్ చేయించేది.

 

ఇంటికి ఎవరు వచ్చినా ‘ఇదిగో ఎక్కడున్నావ్? రెండు కాఫీలు ఇస్తావా?’ అని కేక పెట్టి అడిగే పనే లేదు. వచ్చిన సమయాన్ని బట్టి, వాళ్ళు ఎవ్వరయినా సరే! కాఫీలో, టిఫిన్లో, భోజనాలో కనుక్కుని పెట్టేది. ఇన్నేళ్ళుగా ఆమె నిరంతరంగా చేస్తూ వచ్చిన సేవలను నేను ఎన్నడూ గుర్తించలేదు. ఓ మంచి మాట తనతో అన్నదీ లేదు. అందరూ అన్నపూర్ణ తల్లి అంటుంటే గర్వంగా ఫీలయ్యేవాడిని. పైగా అలా చేయడం ఆమె బాధ్యత అనుకునేవాడిని.

నేను పొద్దున్నే టీవీ షోలకు వెళ్ళాలి అంటే ఆ పాట్లేవో తనే పడేది. నాకంటే ముందే లేచి కార్న్ ఫ్లేక్స్ తయారు చేసి తినిపించి, బీపీ మాత్తర్లు ఇచ్చి పంపేది. డాక్టర్ రాసిచ్చిన ఆ మాత్ర పేరేమిటో నాకిప్పటికీ తెలవదు.

ఒక్కోసారి ‘వుండండుండండి! ఆ టీవీ వాళ్లకు ఈ చొక్కా రంగు పడదు. తీరా పోయిన తర్వాత గ్రీన్ మ్యాటో, బ్లూ మ్యాటో అని వేరే ఎవరి చొక్కానో తగిలిస్తారు. ముందే మార్చుకుని వెళ్ళండి’ అంటూ జాగ్రత్తలు చెబుతుంది. షర్ట్ గుండీలు సరిగ్గా పెట్టుకున్నానో లేదో చూసి సరిచేసేది.

అలా అన్నీ ఆమే నాకు అమర్చి పెట్టేది. కంటికి రెప్పలా కనుక్కుంటూ వుండేది. ఇంట్లో నేనొక మహారాజుని. ఆవిడ జీతం భత్యం లేని మహామంత్రి. నన్నలా మురిపెంగా, మన్ననగా, లాలనగా చూసుకుని, నా కళ్ళముందే అలా దాటిపోయింది.

ఇప్పుడు అర్ధం అవుతోంది. ఆమెను పోగొట్టుకుని కాదు, నేను ఇంతగా బాధ పడుతోంది. ఇలా చేసే మనిషి లేకుండా ఎలా బతకాలి దేవుడా అనే స్వార్ధం నా చేత ఇలా రాయిస్తోంది.

ఇది నిజంగా నా మనసులోని మాట. నిజాయితీగా చెబుతున్న నిజం.

ఇది నా జీవితం. కధకాదు.

అంచేత సాఫీగా ఎలాంటి ముడులు, ఎత్తుగడలు లేకుండా చెబుతాను.

అసలు ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకోవాలి. కాగితం మీద పెట్టేవి కావనే స్పృహ లేనివాడిని కాదు. కానీ  పంచుకునే మనిషి మాయమై పోయింది.  మంచీ చెడూ చెప్పే  తోడు లేకుండా పోయింది.

పిల్లలు, కోడళ్ళ పుణ్యమా అని కరోనా కాలంలో కూడా జీవితం సాఫీగా గడిచిపోయింది. దేనికీ లోటు లేదు, ఎవరూ తీర్చలేని ఆ ఒక్క లోటు తప్ప. ఓ  ఆదివారం సామాను సదిరే కార్యక్రమంలో ఓ కపిలకట్ట బయట పడింది. అందులో ఏముంటాయో నాకు తెలుసు కాని మా అబ్బాయికి, కోడలికి తెలియదు. దాన్ని నేను పదిలంగా తీసుకుని భద్రపరచుకున్నాను. మా ఆవిడకు అదంటే ప్రాణ సమానం. మేము మాస్కో వెళ్ళినా మాతోటే వచ్చింది. తిరిగి మాతోటే ఇండియా వచ్చింది. హైదరాబాదులో ఎన్నో ఇళ్ళు మారినా అది మాత్రం తను మరచిపోకుండా వెంట తెచ్చుకునేది. అందులో బంగారం ఏమీ లేదు. బంగారం లాంటి ఉత్తరాలు ఉన్నాయి. మా పెళ్ళికి పూర్వం, యాభయ్ అయిదేళ్ళ క్రితం, రెండు మూడేళ్ళ పాటు మా మధ్య ఉత్తరాయణం నడిచింది. నేను రాసినవన్నీ ఆవిడ దగ్గర భద్రంగా వున్నాయి. తను రాసిన వాటిలో కొన్నే నా దగ్గర మిగిలాయి.

మిమ్మల్ని ఇలాంటి వ్యక్తిగత విషయాలతో విసిగించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రేమించిన ఆడదాని హృదయం ఎంత గొప్పదో, అది ఎంతటి ఉదాత్తమైన ప్రేమో చెప్పడం కోసమే ఈ ప్రయత్నం.

ఆమె రాసిన వాటిల్లో అణువణువూ ప్రేమమయం. నా ఉత్తరాలు అన్నీ డాబుదర్పం.

పెళ్ళయిన తర్వాత ఎలా మెలగాలి, అత్తగారు, ఆడబిడ్డలతో ఎలా వుండాలి’ ఇలా అన్నమాట. నిజానికి అలా నిర్బంధించే అధికారం నాకేమి వుంది. ఆమె నన్ను ప్రేమిస్తోంది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అంతే! అలాంటప్పుడు నా ఈ పేను పెత్తనం ఏమిటి? అవి చదివి ఎంత నొచ్చుకుని వుంటుంది. అయినా నన్ను పెళ్ళాడింది అంటే అది ఆమె గొప్పతనమే. ఇప్పుడు తలచుకుంటే చాలా చిన్నతనం అనిపిస్తుంది.

నన్ను మన్నించు! నన్ను క్షమించు ! అని ఎంతగా గొంతు చించుకున్నా నా మాటలు

 వినబడనంత దూరానికి వెళ్ళిపోయింది.





 

(ఇంకావుంది)