4, ఏప్రిల్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (135) – భండారు శ్రీనివాసరావు

 రాయని నా డైరీలో ప్రతి పేజీలో ఆవిడే!

నాకే విచిత్రం అనిపిస్తోంది, నా జ్ఞాపక శక్తి చూసి. రాత్రి తిన్న కూర ఏమిటంటే బుర్ర తడుముకునే  పరిస్తితి నాది. అలాంటిది ....

నాలుగు నెలలనుంచి ప్రతి రోజూ రాస్తూవస్తూనే వున్నాను, బిగ్ జీరో పేరుతో నేను నడిచివచ్చిన దారి గురించి. ఎందరో వ్యక్తులు, ఎన్నో సంఘటనలు. అర్హతను మించి ఎక్కిన మెట్లు, అర్హత వున్నా అందుకోలేని అందలాలు. అన్నీ కలగలిపి చూసుకుంటే ప్లస్సులు, మైనసులు లెక్క తీస్తే మిగిలింది సున్నా. ఆరేళ్ల క్రితం మా ఆవిడ మరణంతో అది గుండు సున్నా, బిగ్ జీరో అయింది. ఆమె నా పక్కన ఉక్కు స్తంభంలా నిలబడి వున్నప్పుడు నేనో పెద్ద అంకెలా కనబడేవాడిని. జనాల దృష్టిలో హీరోగా కనబడేవాడిని. పోయిన తరవాత కానీ నా అసలు విలువ ఏమిటన్నది నాకు తెలిసి రాలేదు. నా జీవితంలో ఆమె పాత్ర గురించి నాకు పూర్తిగా తెలిసి రావడం కానీ,  దానిని గురించి రాయడం కానీ ఆమె పోయిన తర్వాతనే మొదలయింది. అదో విషాదం.  ఆమె వెళ్ళిపోయిన తర్వాత  నాది దారీ తెన్నూ లేని జీవితం అయిపోయింది. అంచేత ఆమె గురించి రాస్తున్న రాతలకు కూడా ఒక దారీ తెన్నూ లేదు. ఒక తీరున వుండవు.  ఒక వరసలో వుండవు. నా మనసులాగే అల్లకల్లోలం. పిచ్చి గీతలు. పిచ్చి రాతలు.  చదువరులు మన్నించాలి. పెద్దమనసు చేసుకోవాలి. ఇంతవరకు రాసినవి చదివి ‘మీరు జీరో కారు హీరో’నే అని మెచ్చుకున్నవాళ్ళు,  నేను బిగ్ జీరో ఎందుకు అయ్యానో తెలుసుకోవడానికే ఈ రాతలు.   

ఆ రాత్రి ఏం జరిగింది?


2019 ఆగస్టు 17 రాత్రి పదిగంటలు.

ప్రతి రాత్రీ నిద్రపోవడానికి ముందు డబ్బూడుబ్బూ లేని ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం  మా ఇంట్లో ఆనవాయితీ అయిపోయింది. పెద్ద పిల్లవాడు సందీప్  అమెరికాలో  సెటిల్ అయ్యాడు. రెండోవాడు సంతోష్, వాడి భార్య ఉద్యోగాల నిమిత్తం  బెంగుళూరులో.

ఉదయం నుంచి రాత్రి దాకా  నేను ఏదో ఒక టీవీ చర్చల్లోన్నో, ఫ్రెండ్స్ తోనో కాలక్షేపం చేస్తుంటే, తాను తన పూజలు, పునస్కారాలతో పొద్దు పుచ్చుతుండేది.

గత పదేళ్ళలో ఎన్ని సినిమాలు చూశామో లెక్క గుర్తు లేదు కానీ  గత రెండేళ్లలో చాలా సినిమాలు కలిసి చూశాము. బుక్ మై షో వంటి యాప్స్, ఓలా ఉబెర్ వంటి రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో తరచుగా ధియేటర్లకి వెళ్ళడం అలవాటు అయింది. మా ఆవిడ ఉదయం పూజకు అడ్డులేకుండా, నా సాయం కాలక్షేపాలకు అడ్డం రాకుండా వుండే ఆట సమయాలు ఒక్కటే కండిషన్. సినిమా ఏమిటి అన్నదానితో నిమిత్తం లేదు. పైనుంచి రెండు మూడు వరసల్లో టిక్కెట్లు దొరికితే చాలు. బుక్ చేయడం, ఉబెర్ పిలవడం సినిమాకి వెళ్ళిపోవడం. మళ్ళీ ఉబెర్ లో ఇంటికి. ఎక్కడా పర్స్ తీసే అవసరం లేదు. అంతా ఆన్ లైన్. ఇంట్లో ఇద్దరమే. దాంతో చూసే సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

రెండేళ్ల తర్వాత ఇలా కలిసి సినిమాలకు వెళ్ళడం ఎలాగూ వీలుపడదని తెలియక అప్పుడే హడావుడిగా చాలా సినిమాలు చూసేశాము. బహుశా పెళ్ళయిన తరవాత ఇన్నేళ్ళలో కూడా అన్ని సినిమాలు ఎప్పుడూ చూసివుండం.

అప్పట్లో అదో తుత్తి. 

ఆ దురదృష్టపు రోజున తాను కార్డ్సు ఆడదామా అని అడగకపోవడం ఆశ్చర్యం అనిపించింది.

‘తలనొప్పిగావుంది అమృతాంజనం కావాలంది. ఇంట్లో అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం నాది.  తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. బాత్ రూం కు పోతానంటే అడుగులు తడబడుతుంటే, నేనే తీసుకువెళ్లి, తీసుకుని వచ్చాను. హాల్లో సోఫాలో పడుకుని ఆయాసపడుతోంది. చూడలేక అంబులెన్స్ కు ఫోన్ చేశాను.

48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే.

ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. ఆ రాత్రి మేము ఆసుపత్రికి వెళ్లినట్టు పొరుగు వాళ్లకు కూడా తెలియదు. మర్నాడు మేము కనబడకపోతే మా అన్నయ్య ఇంటికి వెళ్ళామనుకున్నారుట.   

 

ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావు కబురు చల్లగా చెప్పారు, దారిలోనే పోయిందని.  

నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!

 

15 రోజుల్లో ముగిసిన కధ’

 

 

2019 ఆగస్టు  పదిహేడో తేదీ అర్ధరాత్రి దాటిన  తర్వాత, కార్డియాక్  అరెస్టుతో ఆకస్మికంగా నా భార్య నిర్మల చనిపోవడానికి ముందు, కేవలం  రెండు వారాల లోపు వ్యవధానంలో అనేక వేడుకలు, వినోదాలు, శ్రావణ శుక్రవారం  నోములు, పేరంటాలు, ముత్తయిదువులకు  వాయినాలు, చుట్టాల ఇళ్ళు చుట్టబెట్టడాలు,  ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు, హైదరాబాదులో ఇన్నేళ్ళుగా ఉంటున్నా ఎన్నడూ చూడని  రామోజీ  ఫిలిం సిటీలో ఒక రోజల్లా  సరదా తిరుగుళ్ళు, ఒకటా రెండా, అలుపు లేకుండా తిరిగి ఆ అలసట తీర్చుకోవడానికా అన్నట్టు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది. హైదరాబాదులోని చుట్టాలు అందరూ విషయం తెలిసి తెల్లవారక ముందే ఆసుపత్రికి వచ్చారు. 1989 లో ఇదే ఆసుపత్రిలో మా ఆవిడకు  మొదటిసారి  గుండె ఆపరేషన్ జరిగింది. ముప్పయ్యేళ్ల తర్వాత అదే ఆసుపత్రిలో కన్నుమూయడం కాకతాళీయం.

కబురు తెలియగానే అమెరికా  నుంచి మా పెద్దవాడు సందీప్, కోడలు భావన, మనుమరాళ్లు సఖి, శ్రిష్టి, బెంగుళూరు నుంచి చిన్నవాడు సంతోష్, కోడలు నిషా రెక్కలు కట్టుకుని హైదరాబాదులో వాలారు, మంచు పెట్టెలో ప్రశాంతంగా నిద్ర పోతున్న నా భార్యని చూసి భోరుమన్నారు. సంతోష్ కి నామీద చాలా కోపం వచ్చింది, అమ్మకు ఒంట్లో బాగా లేకపోతే ఎందుకు ఫోన్ చేయలేదని. అమ్మ నాకు అంత వ్యవధానం ఇవ్వలేదురా అని చెప్పలేని పరిస్థితి నాది.

మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకి ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు వచ్చారు. ఇద్దరు పిల్లలు శాస్త్రోక్తంగా ఆ క్రతువు ముగించారు. ఆమె కట్టెల్లో కాలిపోతుంటే, చూస్తూ కూర్చొన్నాను. నా  కంటివెంట కారే కన్నీటితో వాటిని చల్లార్చడం అయ్యేపని కాదని తెలుసు. 

 

  

‘ఈ జీవితానికి పని పూర్తయింది’

పెద్దల ఆశీశ్శులతో, ఆత్మీయుల ఆదరణతో, పిల్లల ప్రేమాభిమానాలతో కరోనా నేపథ్యంలో సైతం మా ఆవిడ ఏడూడి, (సంవత్సరీకాలు) భగవంతుని దయతో నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల క్రతువులో నేను నిమిత్తమాతృడిని. కొడుకులు, కోడళ్ళు యావత్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు.

మొత్తం కార్యక్రమంలో అందరికీ కళ్ళ నీళ్ళు తెప్పించింది మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి వ్యాఖ్య:

"మాకన్నా ఎంతో చిన్నదైన మా తమ్ముడి భార్యకు దండాలు పెట్టడం ఎంతో బాధ కలుగుతున్నది . ఏటా అమ్మ నాన్నల తద్దినాలకు వెళ్లి, అదే ఇంట్లో ఎన్ని సంవత్సరాలనుంచో దండాలు పెడుతూ ఉన్నాము .అదే ఇంట్లో ఈరోజు ఇలా చిన్న మనిషికి నమస్కరించి రావడం

మనసును కలచి వేసింది .

“అమ్మ నాన్నల తద్దినాలు పెట్టినప్పుడు , తమ్ముడి భార్య నిర్మల సర్వం తానుగా అన్ని ఏర్పాట్లు చేసి , పురో హితునితో మాట్లాడటం, వంటమనిషితో మాట్లాడటం ,

ధోవతులు తేవడం ,అందరికీ ఫోన్లు చేయడం , మడి కట్టుకొని అన్నీ ఏర్పాట్లు స్వయంగా, శ్రద్ధగా, నిష్ఠగా చూసుకొనేది .

“అటువంటిది ఆ ఇంట్లోనే ఆమె పిండాలకు దణ్ణం పెట్టడం మా దురదృష్టం. మనం దేనినన్న జయించవచ్చు కానీ ,

విధిని మాత్రం జయించలేము. విధికి తలవంచి రాజీ పడటం మాత్రమే మనం చేయగలిగింది.

“ఆమె పవిత్ర ఆత్మకు

శ్రద్దాంజలి . ఓం శాంతి శాంతి"

 

ఆ రోజు మా ఆవిడ గుణగణాలు గురించి, మంచితనం గురించి మెట్టినింటివాళ్ళు చేసిన ప్రసంశలు విని ఆమె పుట్టింటివాళ్ళే ఆశ్చర్యపోయారు.  

 

 

‘అమ్మకు ఏదిష్టం?

 

కాలం మన చేతిలో వుండదు. చూస్తూ ఉండగానే మా ఆవిడ రెండో ఆబ్దీకం వచ్చింది.

మూడు కూరలు, మూడు పచ్చళ్ళు జాబితా రాస్తున్నప్పుడు ఆమెకి ఇష్టం అయిన కూరో, స్వీటో చేయిస్తే బాగుంటుంది అని ఓ సలహా.

ఆమెకి ఏమిష్టం అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. నా ఇష్టాలే తన ఇష్టంగా బతికింది. ఆమెకేది ఇష్టమో  నేను తెలుసుకునే తీరిక, ఓపిక నాకు ఎక్కడిది?

అమ్మకు నేనంటే ఇష్టం అని మనసులో మాట చెప్పాలని అనిపించింది. కానీ గుండెలో మొదలయిన ఆ మాటను గొంతులోనే నొక్కేసాను.

పనస పొట్టు కూర, దబ్బకాయ పులుసు, ఐస్ క్రీం. ఇలా అనేక సూచనలు. వీటి మధ్య కర్ణపేయంగా వినబడింది ఓ మాట.

‘అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా ఇంటికి వచ్చినవాళ్లు ఎంతమంది అని చూసుకోకుండా అప్పటికప్పుడు వంట చేసి పెట్టడం ఆమెకు చాలా ఇష్టం’

ఈ మాట అందరికీ నచ్చింది.

కొడుకు సంతోష్, కోడలు నిషా ఈ బాధ్యత నెత్తికి ఎత్తుకున్నారు.

మా ఆవిడ క్రమం తప్పకుండా వెళ్ళే మా ఇంటి పక్కన వున్న ఓ దేవాలయాన్ని సంప్రదించారు. డబ్బు చెల్లించి ఓ అయిదు వందల మందికి అన్న వితరణ ఏర్పాటు చేశారు.

 కరోనా కాలంలో పిలవకుండా ఎవరు వస్తారని అనుకున్నాను. రెండు రోజుల ముందే ఆ గుడిలో పలానా వ్యక్తి సంస్మరణలో అన్నదానం అని బోర్డు పెట్టారుట. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో వుండే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఈ లొకాలిటీలో నన్ను తెలిసిన వాళ్ళు అరుదు. ఆమెకి ఇంతమంది తెలుసా! ఇంతమందికి  ఆమె తెలుసా! అన్న సంగతి అప్పుడే తెలిసింది.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావుగారు  ఎనభయ్యో పడిలో కూడా, కరోనాని కూడా లెక్క చేయకుండా చనిపోయిన మరదలి మీద, నా మీద  ప్రేమాభిమానాలతో వచ్చి నిలబడి వడ్డన చేశాడు. నాకది ఎంతో అపూర్వంగా  అనిపించింది.

మనిషి ఎలాటివాడు అన్నది అతడు చనిపోయిన తర్వాత తెలుస్తుంది అంటారు.

భార్యను చూసి మొగుడు గర్వపడే అవకాశం నాకు ఇచ్చి వెళ్ళిపోయింది మా ఆవిడ.      

కింది ఫోటో :


ఇంక సెలవ్ !




(ఇంకావుంది)

3, ఏప్రిల్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (134) – భండారు శ్రీనివాసరావు

  లక్ష రూపాయల డిక్రీ కధ  

అమెరికాలో మా పెద్ద కుమారుడు సందీప్ వుంటున్న సియాటిల్ కి దాదాపు మూడు వందల మైళ్ల దూరంలో వున్న స్పోకెన్ నగరం నుంచి  స్పోక్స్ మన్ రివ్యూ అనే పత్రిక 125 సంవత్సరాలకు పైగా ప్రచురితమవుతూ వస్తోంది. కిందటి ఎపిసోడ్ లోని ఫోటోలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నాయుడు గారు చూస్తున్న, లేదా నేను చూపిస్తున్న పత్రిక ఇదే.

హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా సహోద్యోగిగా పనిచేసిన పవని విజయ లక్ష్మి, ఆమె భర్త బాలాజీ ఉద్యోగరీత్యా ఆ నగరంలో వుంటున్నారు. 2004 లో కాబోలు, నేను అమెరికా వచ్చిన సంగతి తెలుసుకుని, వాళ్ళ వూరు రావాల్సిందని పదే పదే ఫోన్లు చేస్తూ వుండడంతో ఒకరోజు నేను మా ఆవిడను తీసుకుని స్పోకేన్ కు వెళ్ళాను.


 
అక్కడ వాళ్ళు కొనుక్కున్న ఇల్లు చూడముచ్చటగా వుంది. అంతకు ముందే బాలాజీ తలిదండ్రులు హైదరాబాద్ నుంచి వచ్చి కొడుకూ కోడలి దగ్గర ఆరు నెలలు వుండి తిరిగి ఇండియాకు వెళ్లారు. సగటు తెలుగు కుటుంబాల్లో ఇది సహజంగా జరిగేదే. అయితే, అక్కడి అమెరికన్లకు ఇదొక వింత.  వేరు కాపురం పెట్టుకున్న కొడుకు దగ్గర తలిదండ్రులు అన్ని నెలలు గడపడం అక్కడివారికి ఎంతో వింతగా తోచింది. ఆ నోటా ఈ నోటా పడి ఈ సంగతి స్పోక్స్ మన్ రివ్యూ  పత్రిక విలేఖరి రెబెక్కా నప్పీ చెవిన పడింది. ఇంకేముంది ఆమె అమాంతం విజయలక్ష్మి అడ్రసు కనుక్కుని ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మొత్తం ఫ్యామిలీ ఫొటోలతో సహా మొదటి పుటలో ప్రచురించింది. ఆ వార్తాకధనానికి వచ్చిన మంచి స్పందన గమనించిన ఆ స్పోక్స్ మన్ రివ్యూ పత్రిక వాళ్ళు, వారం వారం విజయలక్ష్మి కార్యకలాపాలను కేంద్రంగా చేసుకుని,  ప్రత్యేక కధనాలను ప్రచురించడం ప్రారంభించారు.  అంటే స్పోకెన్ నగరంలో ఆమె ఒక ఐకాన్ గా మారిపోయింది. రెబెక్క ఆ పత్రికకు ఇంటరాక్టివ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. నేను ఆలిండియా రేడియో విలేకరినని తెలుసుకున్న మీదట ఆమె  స్పోక్స్ మన్  రివ్యూ పత్రిక కార్యాలయానికి ఆహ్వానించారు.

 డౌన్ టౌన్ రివర్ సైడ్ ఎవేన్యూ లో అనేక అంతస్తులలో వున్న ఈ పత్రిక భవనం అతి పురాతనమయినది. చారిత్రిక అవశేషాలు దెబ్బతినకుండా భవనం లోపల ఇంటీరియర్ ను మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా అధునాతనంగా తీర్చిదిద్దారు. సుమారు నూరేళ్ళ నాటి లిఫ్ట్ దగ్గర నిలబడి ఫోటోలు దిగాము. రెబెక్క మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించి వివిధ విభాగాలకు తీసుకువెళ్లి, అక్కడ పనిచేస్తున్న జర్నలిష్టులను పరిచయం చేసారు.

 అంతే కాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్ లో కూర్చోబెట్టి ‘జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫ్రం ఇండియా’ అని పరిచయం చేసిన తీరు మరిచిపోలేనిది. పత్రిక చీఫ్ ఎడిటర్ ఎలాటి భేషజం ప్రదర్శించకుండా చక్కని హాస్యోక్తులతో కూడిన ప్రొఫెషనల్ సీరియస్ నెస్ తో సమావేశాన్ని రక్తి కట్టించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ ప్రాంతాల విలేకరులతో మాట్లాడి ఏ వార్తకు ఆ రోజు ఎలాటి ప్రాధాన్యం ఇవ్వాలో అందరితో చర్చించి నిర్ణయించడంతో ఆ సమావేశం ముగిసింది. తరవాత చివరి అంతస్తులో వున్న కాంటీన్ కు వెళ్లి కాఫీలు కలుపుకు తాగాము. అక్కడ మేడ మీద పెద్ద పెద్ద గుడ్లగూబ పక్షుల బొమ్మలు కనిపించాయి. మన వైపు వీధి వాకిళ్ళ వద్ద కనిపించే సింహాల బొమ్మల మాదిరిగా వున్నాయి. క్షుద్ర శక్తులు ప్రవేశించకుండా ఈ బొమ్మలు కాపాడుతాయని తమ పూర్వీకులు నమ్మేవారని రెబెక్క చెప్పారు.  

ఆధునిక జీవన శైలికి, నమ్మకాలకు సంబంధం లేదని ఆమె మాటల్ని బట్టి అర్ధం అయింది. పూర్వం మేము కమ్యూనిస్ట్ రష్యాలో వున్నప్పుడు కూడా ఎవరైనా తుమ్మితే, నెత్తి మీద తట్టి, రష్యన్ లో చిరంజీవ అనే అర్ధం వచ్చే విధంగా (Da zdravstvuyet) అనే నోరు తిరగని పదం అనేవారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, విజయలక్ష్మి ఇక్కడ హైదరాబాదులో వున్నప్పుడు తాను ఇతరుల గురించి వార్తలు సేకరించేది, అమెరికా వెళ్ళిన తర్వాత తానే వార్తల్లో వ్యక్తి అయింది. చాలా సమాజ సేవా కార్యకలాపాల్లో పాల్గొంటో౦దని, ఆ పత్రికా కధనాలను బట్టి మాకు అర్ధం అయింది. ఆమె ఒకసారి హైదరాబాదు వచ్చినప్పుడు,  వాటినే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తే,  ఆయన ఆసక్తిగా తిలకించారు. ఇదీ ఆ ఫోటో వెనుక కధ.  

పొతే, లక్ష రూపాయల కోర్టు డిక్రీ సంగతి.

పది వేలు గరిష్ట పరిమితితో  అప్పు మంజూరు చేశారు కానీ, వాస్తవంగా ఆ పెయింటర్/ ఆర్టిస్టు తీసుకున్నది మూడు వేలే. ఆ బాకీ వాయిదాలు కూడా సరిగా కట్టలేక ఆ వ్యాపారం వదిలేసాడో ఏమిటో తెలియదు. మనిషి జాడ లేడు.  హామీ సంతకం చేసింది నేను కాబట్టి నాకు నోటీసులు పంపారేమో అదీ తెలియదు. నేను అద్దె ఇల్లు ఖాళీ చేసి హైదరాబాదు వచ్చేశాను. మాస్కో నుంచి వచ్చాక,  హైకోర్టు ఇచ్చిన డిక్రీ మీద ఒక లాయరు స్టే తెప్పించారు. డిక్రీ అమలు అయితే నాకు వేరే ఆదాయాలు లేవు కాబట్టి, వచ్చే జీతంలో పావు వంతు కంటే తక్కువ ప్రతి నెలా కట్టాల్సి వుంటుందన్నారు. అప్పటికి నాకు ఇంకా పదమూడేళ్ల సర్వీసు వుంది. అంతటితో సరి. పెన్షన్ కి ఈ కత్తిరింపులు వుండవుట.  స్టే వెకేట్ కాగానే ఇలా బాకీ చెల్లింపు చేయాలని మానసికంగా సిద్ధపడ్డాము. అయితే ఈ లోగా ఒక విచిత్రం జరిగింది.

ఒక మంచి రోజు చూసుకుని ఆ బ్యాంకు దివాళా తీసింది.

(చిన్నచిన్న మొండి బకాయిలకంటే, ఆ అప్పులను వసూలు చేసే క్రమంలో, పెద్ద పెద్ద లాయర్లకి చెల్లించిన భారీ ఫీజుల వల్లే అలా జరిగిందని నా అనుమానం)

కింది ఫోటో:

పవని విజయలక్ష్మి, రేడియోలో సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు, మా ఆవిడ నిర్మల 


 

(ఇంకా వుంది)  

2, ఏప్రిల్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (133) – భండారు శ్రీనివాసరావు

 నా కడప బదిలీ రద్దు కావడంలో జరిగిన ఆలస్యానికి కారణం, వేరే ఎవరో కాదు  నేనే.

నేను పైవాళ్ళని అడిగింది ఒక్కటే, విజయలక్ష్మిని మళ్ళీ బయటకు పంపకుండా, నాకు హైదరాబాదు ఆలిండియా రేడియోలో  పోస్టింగు ఇవ్వమని. అదెలా అన్నారు. అలాగే కావాలి అన్నాను నేను.

(నేను షరతులు పెట్టడం ఏమిటో!  తలచుకుంటే, ఇప్పటికీ  విచిత్రం అనిపిస్తుంది)

‘హైదరాబాదు రేడియోలో పోస్టు ఖాళీ లేదు, అలా కుదరదు’ అని వాళ్ళ వాదన.  ‘పోనీ అయితే దూరదర్సన్ లో వేస్తాము  వెళ్ళండి అన్నారు.

‘అక్కడ నాకు గాలి ఆడదు. రేడియోలో అయితే స్వతంత్రంగా పని చేసుకోగలుగుతాను’ అనేది నా నమ్మకం.

ఆ విధంగా ఓ నెల రోజులు సెలవులో వెళ్లాను. చివరికి వాళ్ళు నా కోసం,  కడప ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ పోస్టుని హైదరాబాదు ఆలిండియా రేడియోకి మార్చి, తద్వారా ఒక ఖాళీని సృష్టించి అందులో నన్ను అసిస్టెంట్ ఎడిటర్ (న్యూస్)  గా వేశారు.

అప్పుడు అంటే ఇన్ని తిప్పలు పడ్డాను, పెట్టాను. కానీ ఇప్పుడు పోస్టులు, ఖాళీలతో నిమిత్తం లేకుండా బదిలీలు చేసేస్తున్నారు. పోస్టింగులు ఇచ్చేస్తున్నారు.  గత పాతికేళ్లలో నేను గమనించిన మార్పు ఇది. మరి అప్పటి నిబంధనలే ఇప్పుడూ వున్నాయి.  సమయానుకూలంగా మారడం వీటికీ వర్తిస్తుంది కాబోలు.  

నిజానికి,  నా స్థానంలో వచ్చిన పవని విజయలక్ష్మి చాలా గొప్ప ప్రతిభాశాలి. తిరుపతి పద్మావతి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్.  న్యూస్ రిపోర్టర్ ఉద్యోగం అంటేనే వేళాపాళా వుండదు. అయినా పోటీపడి వార్తలు ఇచ్చేది. తన ప్రతిభతో, పని తీరుతో, మాట మంచితనంతో అనతికాలంలోనే నేనొకడిని వున్నాను అని ఇంటాబయటా జనం మరిచిపోయేలా చేసింది. ఆలిండియా రేడియో అంటే పవని విజయలక్ష్మి అనే పేరు త్వరలోనే తెచ్చుకుంది. ఇందుకోసం చాలా కష్టపడి పనిచేసేది.

నేను సెలవులో వున్నా కూడా కాలక్షేపం కోసం రేడియోకి, సచివాలయం ప్రెస్ మీట్లకు వెళ్ళే వాడిని.  అందరూ నన్ను గుర్తుపట్టేవారే  కనుక ఇబ్బంది వుండేది కాదు. కాకపోతే తనే,  రేడియోకి  రిపోర్ట్ చేసేది.  రేడియో విలేకరిగా విజయలక్ష్మికి  దేశ వ్యాప్తంగా విస్తృతమైన పేరు  తెచ్చిన  విషాద సందర్భం ఒకటుంది. ఆ రోజు నాకు బాగా గుర్తు. జనవరి పద్దెనిమిది, 1996.

అంతకు ముందు  రోజు సాయంత్రం నేను, నా జర్నలిస్ట్  మిత్రుడు ఎం ఎస్ శంకర్ ఇద్దరం రైల్లో తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాము. తెలతెలవారుతుండగా  రైలు రేణిగుంట స్టేషన్ లోకి ప్రవేశిస్తోంది. పక్క బెర్తులో పడుకున్న  అప్పటి మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు ముద్దు కృష్ణమ నాయుడు, శంకర్ ఇంకా నిద్రలోనే వున్నారు. రైల్లో రాత్రంతా ముద్దు కృష్ణమ నాయుడు గారితో కబుర్లతోతే సరిపోయింది.  ‘దర్శనానికి ఎవరికయినా చెప్పనా’ అని అడిగారు. ‘వద్దండి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాము’ అన్నాము.

ఒకసారి ప్రెస్ మీట్ లో బి.హెచ్.ఇ.ఎల్. వాళ్ళు ఇచ్చిన సిగరెట్ పెట్టే సైజు బుల్లి  ట్రాన్సిస్టర్ రేడియో నా దగ్గర హమేషా వుండేది. దాన్ని ఆన్ చేశాను. ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి.

“హియర్ ఈజ్  ఎ ఫ్లాష్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు  ఈజ్ నో  మోర్. ఎకార్దింగ్ టు అవర్ హైదరాబాద్ కరస్పాండెంట్ పవని విజయలక్ష్మి..”

షాక్! కాసేపు మెదడు మొద్దుబారింది. అంతకు ముందు రోజే విలేకరులతో మాట్లాడారు.  ఎక్కడా ఆయనలో అనారోగ్య ఛాయలు కనిపించలేదు. ఇదేమిటి? ఎలా జరిగింది?  నిజమా కాదా ! వార్త వచ్చింది ఢిల్లీ నేషనల్ బులెటిన్ లో. కాబట్టి నమ్మకపోవడానికి ఆస్కారం లేదు.  విజయలక్ష్మిని అడిగి నిర్ధారణ చేసుకోవడానికి ఈ రోజుల్లో మాదిరిగా  మొబైల్ ఫోన్లు లేవు. శంకర్ ని ముద్దు కృష్ణమ నాయుడు గారిని లేపుతుండగానే రైలు రేణిగుంటలో ఆగింది. గభాలున దిగి పేపరు కొన్నాను.  అందులో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ తప్పిస్తే వేరే విషయం లేదు. ప్లాట్ ఫారం కూడా మామూలుగానే వుంది. ఇంకా ఎవరికీ విషయం తెలిసినట్టు లేదు. అంటే పత్రికల ఎడిషన్ టైం తర్వాత జరిగి వుంటుంది.  విషయం వినగానే నాయుడు గారు గుండెలు బాదుకుంటూ ‘నేను అనాథను అయిపోయాను అని బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. ఇది గమనించి ఆయన గన్ మెన్ పరిగెత్తుకు వచ్చాడు.

భారంగా రైలు దిగి కొండ మీదకు వెళ్ళాము. ఎవరికీ విషయం తెలియదు కనుక అక్కడ కూడా ప్రశాంతంగానే వుంది. ఏర్పాట్లతో వెళ్ళాము కనుక దర్శనం త్వరగానే ముగిగిసింది. బయటకు వచ్చేసరికి వాతావరణంలో పెనుమార్పు. తిరుమలలో అంగళ్లు, హోటళ్ళు మూసేస్తున్నారు. వచ్చిన టాక్సీలోనే వెంటనే  కిందికి వెళ్ళాము.  శంకర్ మూడు నాలుగు అవుట్ స్టేషన్  ఇంగ్లీష్ పత్రికలకి వార్తలు పంపుతుంటాడు. కొండ దిగే సరికి తిరుపతి నిర్మానుష్యం. పత్రికలు స్పెషల్ ఎడిషన్లు వేసినట్టున్నాయి. ప్రతి కూడలిలో ఎన్టీఆర్ ఫోటో, విషాద సూచకంగా నల్ల జెండాలు. తిరుపతి మొత్తం టోటల్ బంద్. ఆఖరికి బండి దుకాణాలు కూడా లేవు. ఇన్ఫర్మేషన్ సెంటర్ కి వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ సుభాష్ గౌడ్ అధికారి. తలుపులు మూసి పని చేసుకుంటున్నారు. శంకర్ అక్కడే టైప్ రైటర్ మీద నాలుగు విభిన్న వార్తలు టైప్ చేశాడు. వాటిని ఫాక్స్ చేయడానికి సుభాష్ గౌడ్ ఒక మనిషిని తోడిస్తే, పెద్ద పోస్టాఫీసుకు వెళ్ళాము. అది మూసేసి వుంది. తలుపు గట్టిగా తడితే ఎవరో తలుపు ఓరగా తీసి, ఏం కావాలంటే, హైదరాబాదు నుంచి వచ్చిన జర్నలిష్టులం, ఎన్టీఆర్  వార్త ఇవ్వాలి అని చెబితే లోపలకు రానిచ్చాడు. అక్కడ పని పూర్తి చేసుకున్నతర్వాత  సుభాష్ గౌడ్  తాలూకు మనిషి ఒక చిన్న రెస్టారెంటుకు తీసుకువెళ్ళాడు. షట్టర్లు వేసి వున్నాయి. వెనుక నుంచి దొంగదోవన లోపలకు తీసుకు వెళ్ళాడు. ‘భోజనం లేదు. ఒక్క ప్లేటు సాంబార్ రైస్ మాత్రం ఇస్తాను, ఇద్దరూ సర్దుకోండి’ అన్నాడు. అదే మహాప్రసాదం అనుకుని తినేసి బయట పడ్డాము. సాయంత్రం హైదరాబాదు రైల్లో రిజర్వేషన్ వుంది కాబట్టి ఎక్కాము. రైలంతా ఖాళీ. దారి మధ్యలో ఎక్కడైనా ఆపేస్తారేమో అనుకున్నాము కానీ మొత్తం మీద ఇళ్లకు చేరాము. ఇంటికి రాగానే ఎన్టీఆర్ చనిపోయిన వార్త తెలుసు కదా అంటూ, ఎదురొచ్చిన మా ఆవిడ,  ‘నిన్నంతా మీ కోసం తెగ ఫోన్లు.  నిన్న తెల్లవారుఝామున్నే రోశయ్య గారు చేశారు. మీరు తిరుపతి వెళ్ళారు అని చెప్పా. బహుశా ఇందుకోసమే అనుకుంటా’ అంది.

మొత్తానికి ఈ వార్తతో  విజయలక్ష్మి పేరు మీడియా సర్కిల్స్ లో, రాజకీయ వర్గాల్లో మారుమోగింది. నన్ను గురువుగారు అనేది. శిష్యులు తమను మించి ఎదగడం ఏ గురువుకు అయినా ఆనందమే కదా!  హాట్స్ ఆఫ్ విజయలక్ష్మి! అని మనసులో అనుకున్నాను. ఫోన్ చేసి చెప్పాను.

తరువాత కొన్నేళ్ళకు,  విజయలక్ష్మి భర్త  బాలాజీ  ఉద్యోగరీత్యా  అమెరికా వెడుతుంటే, ఆయనతో పాటు వెళ్లి అక్కడే సెటిల్ అయింది. కడప నుంచి తెచ్చి హైదరాబాదు రేడియోలో నా కోసం  నాటిన ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ పోస్టు  మళ్ళీ కడపకు వెళ్ళిపోయింది. నేను హైదరాబాదులో ఉండిపోయాను. కడపకు బదిలీ చేసిన పోస్టులో ఒక్క రోజు కూడా పనిచేయకుండానే పని గడిచిపోయింది. ఇన్నేళ్ళ సర్వీసులో జరిగింది ఒకే ఒక బదిలీ. దాని చరిత్ర అలా ముగిసింది.

ఉద్యోగంలో చేరిన ఊళ్లోనే రిటైర్ అయ్యే అవకాశం అనాలో,  రికార్డు అనాలో అది నాకు మిగిలింది.   

కింది ఫోటో:

FACEBOOK, WHATSAPP లతో ఒక ప్రయోజనం వుంది అని ఈ రోజే తెలిసింది. నా పోస్టు చూసిన ఒక అజ్ఞాత మిత్రుడు పవని విజయలక్ష్మి ప్రసక్తి గమనించి,  ఎప్పటిదో ఒక పాత ఫోటో పంపారు. వారికి కృతజ్ఞతలు.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, పవని విజయలక్ష్మి, నేను. ఈ ఫోటోలో ముఖ్యమంత్రికి చూపిస్తున్న పత్రికావార్తకో కధ వుంది. అది తర్వాత. లక్ష రూపాయల డిక్రీ సంగతి కూడా.



(ఇంకా వుంది)

   

1, ఏప్రిల్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (132) – భండారు శ్రీనివాసరావు

 


ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్న శాఖకు నేను మంత్రిని . ఆ విషయం మరచిపోవద్దు శ్రీనివాస్!  మళ్ళీ ఒకసారి ఈ బదిలీ విషయంలో నా మీద ఒత్తిడి తెచ్చావంటే ఊరుకోను.  నిన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాను, అర్ధమయిందా”

“నన్ను సస్పెండ్ చెయ్యండి కానీ ఆయన్ని మాత్రం హైదరాబాదుకు వెయ్యండి. నాకంతే చాలు” అన్నాను స్థిరంగా, అప్పటి కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి మల్లికార్జున్ గారితో.

రేడియో, దూరదర్సన్ లలో ఉద్యోగాలు వివిధ రకాలుగా వుంటాయి. ఒక పట్టాన బయట వారికి అర్ధం కావు. ఉదాహరణకు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం తీసుకుంటే,  కింద నాలుగో తరగతి సిబ్బంది నుంచి పైన స్టేషన్ డైరెక్టర్ వరకు పరిపాలనా యంత్రాంగం కిందికి వస్తారు. అలాగే ఇంజినీరింగ్ విభాగం వాళ్ళు. వీళ్ళందరూ పెన్షన్ కు అర్హత వున్న పూర్తికాలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళకు రిక్రూట్ మెంట్ విధానం వుంటుంది. పే స్కేల్స్ వుంటాయి, ప్రమోషన్లు వుంటాయి, బదిలీలు కూడా వుంటాయి. దేశంలో ఎక్కడికయినా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

మరో కేటగిరీ స్టాఫ్ ఆర్టిస్ట్ సిబ్బంది. ఒక రకంగా చెప్పాలి అంటే కళాకారులు. గొప్ప మృదంగం కళాకారుడిని ఎంపిక చేసేటప్పుడు విద్యార్హతలు చూస్తే, సరయిన వ్యక్తి దొరకడం కష్టం. అంచేత ఆ రంగంలో నైపుణ్యం మాత్రమే చూస్తారు. వీరిని స్థానికంగా ఎంపిక చేస్తారు. మొదట్లో వీరి జీత భత్యాలు చాలా హీనంగా వుండేవి. ఎంత గొప్ప కళాకారుడు అయినా, సంగీత విద్వాంసుడు అయినా రెగ్యులర్ ప్రభుత్వ సిబ్బంది ఆజమాయిషీలో పనిచేయాల్సి వుంటుంది. రేడియో అనగానే తటాలున గుర్తుకువచ్చే సుప్రసిద్ధ కళాకారులు అందరూ ఈ కేటగిరీ వాళ్ళే. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రిగా వున్న రోజుల్లో శ్రీమతి ఇందిరా గాంధీ కొన్నాళ్ళు రేడియో మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ సమయంలో రేడియోలో పనిచేసే స్టాఫ్ ఆర్టిస్టులను ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తూ ఆదేశాలు ఇచ్చారు. సమానంగా పరిగణించమన్నారే కానీ ప్రభుత్వ ఉద్యోగులను చేయలేదు. దానితో వారికి పే స్కేల్స్ ఇచ్చారు. పెన్షన్ సదుపాయం కల్పించారు. కానీ ప్రమోషన్లు ఇవ్వడం జరగక పోవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే చేరిన హోదాలోనే రిటైర్ అవ్వాల్సి వుంటుంది. రేడియోలో  న్యూస్ చదివేవారుంటారు. వారు రిటైర్ అయ్యేవరకు అదే కొలువు. అలాగే అనౌన్సర్‌లు. ప్రయోక్తలు, కార్యక్రమాల రూపకర్తలు. వీళ్ళకు పే కమిషన్ సిఫారసుల ప్రకారం  జీతాలు పెరుగుతాయి, ఒక్కోసారి, వారిపై ఆజమాయిషీ చేసే వారికంటే కూడా ఎక్కువ వేతనాలు పొందుతారు. కానీ పెత్తనం చేసే అధికారం మాత్రం  వేరేవారిది.

1975 లో నేను హైదరాబాదులో ఆకాశవాణిలో అసిస్టెంట్ ఎడిటర్ , రిపోర్టింగ్ అనే పేరు కలిగిన ఉద్యోగంలో చేరినప్పుడు నాదీ ఇలాంటి స్టాఫ్ ఆర్టిస్ట్ ఉద్యోగమని తెలియదు. ముందు మూడేళ్ళకు కాంట్రాక్ మీద సంతకం చేయించుకుంటారు. తరువాత యాభయ్ ఎనిమిదేళ్లు వచ్చే వరకు ఉద్యోగంలో అదే పోస్టులో కొనసాగేవిధంగా,  దీర్ఘకాలిక కాంట్రాక్ట్ ఇస్తారు. (తరువాత ఈ గరిష్ట వయోపరిమితి అరవై ఏళ్ళు చేశారు). ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసే మాడపాటి సత్యవతి, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్నా దేవి, వసీంఅక్తర్ తో సహా మేమందరం ఈ స్టాఫ్ ఆర్టిస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులమే. అయితే, నేను మాస్కోలో వున్న సమయంలో నా సర్వీసుని ఐ. ఐ. ఎస్. లో విలీనం చేశారు. తిరిగివచ్చిన తర్వాత నాకీ సంగతి తెలిసింది.

నేను మాస్కోకి పోకమునుపు, హైదరాబాదులో పనిచేస్తున్న న్యూస్ రీడర్ డి. వెంకట్రామయ్యను ఢిల్లీకి బదిలీ చేశారు. ఢిల్లీ వాతావరణం ఆయనకు పడదు. బదిలీ వద్దు అనడానికి ఈ కారణం సరిపోదు. ఈ ఉద్యోగాలకు పత్రికా ప్రకటన ఇచ్చేటప్పుడు,  హైదరాబాదులో కేంద్రంలో పనిచేయడానికి న్యూస్ రీడర్ కావాలని ఇచ్చారు. పలానా చోట ఉద్యోగం అని తెలిసి దరకాస్తు పెట్టుకుని ఎంపిక అయ్యారు కనుక, ఈ ఒక్క పాయింటు పట్టుకుని నేనూ, వెంకట్రామయ్య గారు ఢిల్లీ వెళ్ళాము.

అప్పుడు రేడియో విభాగాన్ని మంత్రి డాక్టర్  మల్లికార్జున్ (పూర్తిపేరు మల్లికార్జున్ గౌడ్) చూస్తున్నారు. స్నేహశీలి. 1969 తెలంగాణా ఉద్యమంలో మల్లికార్జున్ గారిది కీలక పాత్ర. ఆరు పర్యాయాలు లోకసభకు, నాలుగు సార్లు మహబూబ్ నగర్ నుంచి, రెండు సార్లు మెదక్ నుంచి ఎన్నికయ్యారు.

గుబురు మీసాలతో గంభీరంగా కానవచ్చేవారు . ఇంటిపేరు ఎవరికీ తెలియదు. మీసాల మల్లికార్జున్ అనేవారు. ఆయనా ఏమీ అనుకునేవారు కాదు. కాంగ్రెస్ నాయకుడు సమరసింహారెడ్డి గారికి  చాలా సన్నిహితులు.  రాజకీయాల్లోకి విద్యార్థి నాయకుడిగా ప్రవేశించారు. ఫక్తు తెలంగాణా వాది. పీసీసీ అధ్యక్షుడిగా చేశారు.  మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికయింది కూడా తెలంగాణా ప్రజా  సమితి టిక్కెట్టు మీదనే.  తరచూ ఏవో ఉద్యమ వార్తలు తీసుకుని రేడియోకి వచ్చేవారు. అప్పటినుంచీ వెంకట్రామయ్యకు పరిచయం వుంది. మంత్రి అయినా, తలుపు తోసుకుని వెళ్ళగల చనువు ఆయనతో నాకు వుండేది. ఢిల్లీ వెళ్లి కలిస్తే, ఫైలు తెప్పించుకుని చూశారు.

‘ఢిల్లీ ఏమైనా అడివా! కొన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తే ఏమిటి ఇబ్బంది’ అనేశారు. కింద నుంచి ఎవరో సరైన సమాచారం ఇవ్వలేదని మాకు  అర్ధం అయింది. వివరంగా చెప్పి చూశాను. పని కాలేదు. కాదు అని కూడా బోధపడింది. అయినా పట్టు విడవకుండా  నిత్యం వెంటపడడంతో ఆయనకు విసుగెత్తి,  ‘సస్పెండ్ చేస్తాను జాగ్రత్త’  అనే వరకు పరిస్థితి వెళ్ళింది. ‘సస్పెండ్ చేయండి, కానీ వెంకట్రామయ్యను  హైదరాబాదు బదిలీ చేసి నన్ను ఏమైనా చేయండి’  అనడంతో ఆయన మెత్త పడ్డారు. మా వాదనలో ఏదో విషయం వుందని అర్ధం చేసుకున్నారు. వెంటనే జాయింట్ సెక్రెటరీని తన ఛాంబర్ కు పిలిపించారు. మా ముందే ఆయన్ని అడిగారు, వెంకట్రామయ్య గారిని  ముందు న్యూస్ రీడర్ గా సెలెక్ట్ చేసింది హైదరాబాదుకా, ఢిల్లీకా అని. ఆ అధికారి ఫైలు చూసి చెప్పారు, హైదరాబాదుకని. మంత్రి మల్లికార్జున్ వెంటనే గట్టి స్వరంతో చెప్పారు, వెంకట్రామయ్యను హైదరాబాదు బదిలీ చేస్తూ ఆర్డర్ ఇవ్వమని. మల్లికార్జున్ గారికి ధన్యవాదాలు చెప్పాము.

నా ఈ చరిత్ర తెలిసిన వారందరూ, ‘చూస్తుండండి శ్రీనివాసరావు కడప బదిలీ ఆర్డర్ చిటికెలో రద్దు చేయిస్తాడు’ అని.

కానీ నేను అలా చేయలేదు, అలా అని కడప బదిలీపై వెళ్ళలేదు.

కింది ఫోటో:



నాటి కేంద్ర మంత్రి  డాక్టర్ మల్లికార్జున్ ( గూగుల్ చిత్రం)

(ఇంకా వుంది)