22, మార్చి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (123) – భండారు శ్రీనివాసరావు

 నిన్న ఎలా గడిచిందో ఈరోజు అలా,  రేపు మళ్ళీ అలానే.

ధరలు పెరగవు, క్యూలు తరగవు. అదే వాతావరణం. ఇందులో మరో గమ్మత్తు. మన దగ్గర  ఎండ కాసినా రాత్రికి కొంత చల్లబడుతుంది. అక్కడ చలి అలా కాదు. ఉదయం కంటే మధ్యాన్నం చలి కొంత తగ్గవచ్చు. రాత్రికి మరింత తగ్గవచ్చు. లేదా పెరగవచ్చు. అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే టీవీలో ఆనాటి వాతావరణం ఎప్పుడు  ఎలా వుంటుందో చూసుకుని, తగిన  దుస్తులు వేసుకుని బయలుదేరాలి.  

హైదరాబాదు నుంచి మళ్ళీ వెళ్లి అలాటి  మార్పులేని మాస్కో జీవితంలో పడ్డాము.

ఆఫీసుకు వెళ్ళడం రావడం. చేతిలో సంచీ పట్టుకుని కనపడ్డ క్యూలో నిలబడి దొరికిన ప్రతిదీ కొనడం. ఇంటికి వచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసి  చూసి, పనికొచ్చేది అయితే వాడుకోవడం, పనికిరానిదయితే డస్ట్ బిన్ లో పడేయడం. డబ్బుకు చింత లేదు. పొదుపు చేసి కూడబెట్టి  లాభం లేదు. రష్యన్ రూబుళ్ళు ఏ ఇతర దేశంలో పనికిరావు. పిలిపెంకో అనేవారు రూబుల్ తాయిలెత్ బూమాగా (టాయిలెట్ పేపర్) అని. ఇక్కడ ఒక మనవి. నాకు రష్యన్ రాదు. మేము అక్కడ వున్నప్పుడు విన్న పదాలని నాకు బోధపడిన విధంగా, గుర్తు చేసుకుని రాస్తున్నాను. రష్యన్ తెలిసిన వారు ఎవరైనా  సరైన పదం చెబితే తగ్గట్టుగా సరిచేసుకుంటాను.        

హైదరాబాదు నుంచి తిరిగి మాస్కో వెళ్ళేటప్పుడు మా వాళ్ళు ఇచ్చిన కారాలు, పచ్చళ్ళు, క్రేన్ వక్కపొడి పొట్లాలు, కాఫీ పొడుం పొట్లాలు, టీ ప్యాకెట్లు వగైరా వగైరా సూటుకేసుల నిండా సర్దుకుని తీసుకు వెళ్ళాము. టీ ప్యాకెట్లు రష్యన్ మితృలకు చిరుకానుకలుగా ఇవ్వడానికి. వాళ్లకు ఇండియన్ టీ అంటే మోజు. అలాగే చార్మినార్ కంపెనీ వారి చార్మ్స్ సిగరెట్లు కూడా తగని ఇష్టం. ఈ సారి వెడుతూ వెడుతూ ఒక విస్తళ్ళకట్ట కూడా  పట్టుకుపోయాను. విస్తరిని  డ్రాయింగు రూములో గోడకి అతికిస్తే, చూసిన రష్యన్ మితృలు, ఈ హాండీ క్రాఫ్ట్ బాగుందని అడిగి పట్టుకుపోయేవారు.

ఒక సాయంత్రం మాస్కో రేడియోలో పని ముగించుకుని ఆఫీసునుంచి బయలుదేరాలని అనుకునే సమయంలో నటాషా ఎదురుగా వచ్చింది. రష్యన్ భాషలో ‘ట’ లు లేవు, ‘త’లు తప్ప అనేవారు కలం కూలీ జీ. కృష్ణ గారు.  కానీ, నేను మాత్రం  కాస్త వత్తిపలికినట్టుగా వుంటుందని ‘నటాషా’ అని  పిలిచేవాడిని. నా రష్యన్ భాషా ప్రావీణ్యం పేరు పెట్టి పిలవడం వరకే. ఆ తరువాత ఏదో సినిమాలో జంధ్యాల చెప్పినట్టు ఆదివారం మధ్యాన్నం టీవీ వార్తలే. అంటే కేవలం సైగలే.

నటాషా రష్యన్ భాషలో  గడగడా ఏదో చెప్పింది. ఆ చెప్పిన దాన్ని తెలుగు తెలిసిన నా రష్యన్ సహచరుడు గీర్మన్  అనువదించి చెప్పాడు. ‘నతాషా ఇప్పుడు మీతో మీ ఇంటికి రావాలని అనుకుంటోంది. మీ ఆవిడ హాండీ క్రాఫ్ట్స్ ఎలా చేస్తారో చూస్తుందట’. మా ఆవిడ ఈ విద్య ఎప్పుడు నేర్చుకుందని నేను తటపటాయిస్తుంటే, మళ్ళీ ఆవిడే గుట్టు విప్పింది. కిందటి వారం ఇంట్లో చేసిన కారప్పూస ఆఫీసుకు తెచ్చి సంతర్పణ చేసాను. కారప్పూస  అలా చుట్టలు చుట్టలుగా  ఒకదానిలో ఒకటి అలా లాఘవంగా ఎలా దూర్చామో చూడాలని నటాషా కోరిక. ఓస్! ఇంత చిన్న కోరిక తీర్చడానికి ఇబ్బంది ఏముంది. ఇద్దరం కోట్లు తగిలించుకుని మెట్రోలో పడి ఇంటికి చేరాము.

ఇక అప్పుడు మొదలయింది మా వంటింట్లో కారప్పూస చేసే విధాన ప్రక్రియ ప్రదర్శన.  మా ఆవిడ అప్పటికప్పుడు పిండి తడిపి, ముద్దలు చేసి కారప్పూస గిద్దెల్లో కూరి, బాగా కాగిన నూనె మూకుడులో వేస్తుంటే,  నటాషా కళ్ళార్పకుండా, విభ్రమంగా ఆ యావత్తు కార్యక్రమాన్ని దీక్షగా వీక్షించింది. చూస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపులు, కారప్పూస తిన్నప్పుడు కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళలో కలిసిపోయాయి. ‘ఎంత బాగున్నాయో’ అంది వెడుతూ వెడుతూ,  అదేపనిగా  కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదుకుంటూ,  రష్యను భాషలో, పదేపదే స్పసీబా (థాంక్స్) అని  చెప్పుకుంటూ.

నేనున్న అయిదేళ్ళ కాలంలో నేను గమనించింది ఏమిటంటే రష్యన్లు రోజు  మొత్తంలో ఎక్కువ వాడే పదం ఈ స్పసీబా. అలాగే ఇజ్వేనిచ్ పజాలుస్తా  (సారీ! ప్లీజ్).

సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, రష్యన్లు కూడా, మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. క్షమించమని కోరడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది.

థాంక్స్, స్పసీబా, ధన్యవాదాలు ఏ భాషలో చెప్పినా దాని విలువే వేరు.

ప్రతి రోజూ మనం అక్షరాలా పద్నాలుగువందల నలభయ్ నిమిషాలు ఖర్చు చేస్తున్నాము. వాటిల్లో  నాలుగయిదు  నిమిషాలను, మనకు ఈ  జీవితాన్ని ప్రసాదించిన ఆ సర్వేశ్వరుడికో, మనకు ఎంతోకొంత ఆనందాన్ని కలిగిస్తున్న తోటివారికో, సౌకర్యాలను అందిస్తున్న పనివారికో ధన్యవాదాలు తెలపడానికి ఉపయోగిస్తే ఎంతో మంచిది. ఒక రకంగా ఇది మంచి భవిష్యత్తుకు మంచి పెట్టుబడి కూడా. అంచేత మీకు సాయపడ్డ ప్రతివారికీ కృతజ్ఞతలు తెలపడం మరిచిపోకండి. డబ్బు వెదచల్లినా కాని పనులు మంచి మాటతో అవుతాయి.

కింది ఫోటో:

 

(ఇంకా వుంది)

21, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (122) – భండారు శ్రీనివాసరావు

 ఇటు ఆలిండియా రేడియోలో కాకుండా, అటు రేడియో మాస్కోలో కాకుండా హైదరాబాదులోనే  త్రిశంకు స్వర్గంలో పనీ పాట లేకుండా  మూడు నెలలు రికామీగా గడిపే అవకాశం దొరికింది మా ఆవిడ ఆపరేషన్ కారణంగా.

నెల రోజుల తర్వాత  చెకప్ కి వెళ్లాం. డాక్టర్ గారు పరీక్షలు  చేసి సంతృప్తిగా చెప్పారు, తాను అనుకున్నదానికంటే తొందరగా, బాగానే కోలుకున్నదని, ఇలాగే వుంటే మరో నెల రోజుల తర్వాత మాస్కో ప్రయాణం పెట్టుకోవచ్చని. ఇంకో మాట అన్నారు,  ఇటువంటి చికిత్సల్లో డాక్టర్లు చేసేది కొంతయితే,  పేషెంట్ల సహకారం, వాళ్ళ మనోధైర్యం కూడా పనిచేస్తాయని. ఆపరేషన్ జరిగిన రోజునే, మా ఆవిడ దాన్ని గురించి మరిచిపోయిందని ఆయనకు తెలియదు.

పోస్ట్ ఆపరేషన్ టైం లో మా ఆవిడ ప్రధాన స్నేహితురాళ్లు వనం గీత, వనం విజయలక్ష్మి, (జ్వాలా భార్య), శేషు, అరుణ రోజూ ఏదో ఒక సమయంలో వచ్చి, ముచ్చట్లు చెబుతూ కాలక్షేపం చేసేవాళ్ళు. సరే! హైదరాబాదు ప్రెస్ క్లబ్ (అప్పుడు బషీర్ బాగ్), స్నేహితులు ఇలా నా కాలక్షేపం. అప్పుడప్పుడూ మాస్కో జీవితం గుర్తుకు వచ్చేది. అక్కడ కష్టాలు మరో రకం. అవి డబ్బుతో తీరేవి కావు.

మాస్కోలో వున్నప్పుడు ఎవరైనా కూరగాయలు ఇస్తే ఎంతో సంతోషం అనిపించేది. రెడ్డి గారని ఎంబసీలో పనిచేసేవారు. ఎంబసీ  వాళ్లకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వారం వారం కూరగాయలు వచ్చేవి. రెడ్డి గారి కుటుంబం  ఉద్యోగరీత్యా చాలా కాలం ఉత్తర భారత దేశంలో వున్నారు. అంచేత, వారికి వచ్చిన కూరగాయల బాస్కెట్ లో  పచ్చి మిరపకాయలు, బెండకాయలు, దొండకాయలు, కొన్ని ఆకు కూరలు  మాకు ఇచ్చేవారు. వాటికోసం నేను రెండు మెట్రోలు మారి, మా ఇంటికి  చాలా దూరంగా వున్న వారి ఇంటికి వెళ్లి తెచ్చుకునేవాడిని. (దిల్ సుఖ్ నగర్ నుంచి బీ హెచ్ ఇ ఎల్ రామచంద్రాపురం వెళ్ళినంత దూరం కంటే ఎక్కువేనేమో. కూరగాయల సంచీని ట్రాలీలో పెట్టుకుని మెట్రో వరకు ఈడ్చుకుంటూ, ఎస్కలేటర్లు ఎక్కుతూ దిగుతూ,  మెట్రోలు మారుతూ ఊలిచ్చవావిలోవా లోని మా ఇంటికి చేరే వాడిని. ఈ కష్టాలు పగవాడికి కూడా వద్దురా అనిపించేది.  అలా అని కూరగాయలు లేకపోతే మాకు గడవదు. అంచేత  అవి తెచ్చుకోవడానికి అంత కష్టపడేవాడిని. రెడ్డి గారికి థాంక్స్ చెబుతున్నప్పుడు నా కళ్ళల్లో సంతోషాన్ని ఆయన చూశాడో లేదో తెలియదు. పర్వాలేదండీ అనే వాడు మర్యాదగా. అవసరంలో వున్నప్పుడు ఒకరికి ఇవ్వడంలో వున్న ఆనందం అలాంటిది. అది అలా మనసులో ముద్ర పడిపోయింది. అలా అవసరంలో ఉన్నవారికి సాయం చేసే అవకాశం నాకు కూడా వస్తే బాగుండు అనుకునేవాడిని.  

చెప్పాను కదా! చిన్నప్పటి నుంచి నాకు కొంత తిక్క వుండేదని. బషీర్ బాగ్ నుంచి అశోక్ నగర్ స్టాప్ వరకు ఆటోలో వచ్చేవాడిని. లోపలకు రావడానికి ఆటో వాళ్ళు  ఒప్పుకునే వాళ్ళు కాదు.

(మాస్కో వెళ్ళిన తరువాత నాకు పెరిగింది ఏమీ లేదు కానీ తగ్గింది మాత్రం కోపం. మా బామ్మ వుంటే ఈ సంగతి  తెలిసి ఎంత సంతోషపడేదో. ఒళ్ళు తెలియని కోపం వచ్చినప్పుడు ఒకటీ రెండూ మూడూ అని ఒంట్లు లెక్కపెట్టమనేది. పిచ్చి బామ్మ.  కోపం రావాలే  కానీ  ఎక్కాలు చెప్పుకుంటే తగ్గుతుందా)

దాంతో  రిక్షానే శరణ్యం. ఒక రోజు అలా రిక్షా ఎక్కి వస్తుంటే అశోక నగర్ చమన్ దగ్గర తెరిచి వున్న ఒక కిరాణా దుకాణం కనిపించింది. దిగి షాపులోకి వెళ్లాను. పాతిక కేజీల బియ్యం మూట, పెద్ద పెద్ద సైజుల్లో ఖరీదైన కేడ్ బరీస్  చాకొలెట్లు, రకరకాల బిస్కెట్ ప్యాకెట్లు, ఇంట్లోకి కావాల్సిన ఇతర  కిరాణా సామాను  కొని రిక్షాలో పెట్టించాను. ఇంటి దగ్గర దిగి అతడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాను. అతడు సామాను దింపబోతుంటే వద్దు, ‘అవన్నీ మీ ఇంటి కోసమే, మీ పిల్లల కోసమే’ అని చెప్పి వచ్చేశాను. చీకటిగా వుంది. నా మొహంలో ఆనందం అతడికి కనిపించిందో లేదో తెలియదు. ఎవరీ పిచ్చోడు అనుకున్నాడేమో, అతడి మొహంలో ఆ భావం నాకూ  కనిపించలేదు.

తర్వాత మా ఆవిడతో చెబితే,  ‘మంచి పనిచేశారు.  ఎంతో మంది, ఎంతో సాయం చేయబట్టే మనమిప్పుడు ఇలా ఉన్నాము. కాకపోతే, ఈ విషయం  ఎవరికీ చెప్పకండి. మొహం మీద  నవ్వినా నవ్వుతారు’ అంది.

కొన్ని విషయాల్లో ఆవిడే కరక్టు. అంచేత అప్పుడు ఆ మాట విన్నాను. ఇప్పుడు లేదు కదా! అంచేత ఆ సంగతి బయటపెడుతున్నాను.  

కింది ఫోటో:

మాస్కోలో మాకు కూరగాయల దాత రెడ్డి గారు పిల్లలతో మా ఇంటికి వచ్చినప్పుడు తీసింది.  పక్కన ఆర్వీయార్, నేను.  



(ఇంకా వుంది)          

 

20, మార్చి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (121) – భండారు శ్రీనివాసరావు

 నా జీవితం మొదటి నుంచి వడ్డించిన విస్తరి కాదు, కానీ  భగవంతుడి దయ వల్ల అన్నీ సమకూరేవి. ఒకరకంగా ఇదొక అదృష్టం. మరో రకంగా దురదృష్టం. నా ప్రమేయం లేకుండా జరిగిపోతూ వుండడంతో, నాలో బద్ధకం, బాధ్యతారాహిత్యం పెరిగిపోతూ వచ్చాయి. బిగ్ జీరో అవడానికి ఇవి ప్రధాన కారణాలు.

మాస్కో వెళ్ళడానికి ఎయిర్ పోర్టుకు వెళ్ళాల్సిన మా ఆవిడను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. మాస్కోలో రూబుళ్ళ సంపాదనతో రారాజుగా వెలిగిన నేను, రూపాయలు చేతలేకుండా నా భార్యకు, ఆ రోజుల్లో అంతవరకూ కనీవినీ ఎరుగని  ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాను అంటే అది నా సొంత ప్రయోజకత్వం ఎంత మాత్రం కాదు.

అపోలో ఆసుపత్రి ప్రారంభించిన రోజులు. అక్కడ అప్పటికి ఒకే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. చేసి రెండు వారాలు కూడా కాలేదు. ఆ శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ సీతారామరెడ్డి గారు మా పెద్దక్కయ్య పెద్ద కుమారుడు డాక్టర్ ఏపీ రంగారావు (తదనంతర కాలంలో 108, 104 పధకాల సృష్టికర్త) కు స్నేహితులు, సన్నిహితులు. అది హైదరాబాదులో కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేసిన   మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి. డాక్టర్ రంగారావుకు కార్పొరేట్ ఆసుపత్రుల పట్ల వైముఖ్యం. వైద్యం అనేది ప్రైవేటు వ్యక్తులు, వ్యవస్థల చేతుల్లో వుండకూడదు అని ఆయన సిద్ధాంతం.   అంచేత మా ఆవిడను ముందు గాంధీలో చేర్చాలని అనుకున్నాడు. కానీ సీతారామ రెడ్డి గారు బాగా తెలిసిన వాడు కావడంతో ఆయన్ని సంప్రదిస్తే, తాను అంతకు కొద్ది రోజుల ముందు ఇదే ఆపరేషన్ చేసిన ఒక రోగి ఇంటికి తీసుకు వెళ్ళారు. అప్పుడే ఇరవై ఏళ్ల యువతి మేడ మీద నుంచి  మెట్లు దిగుతూ, డాక్టర్ గారిని చూసి నమస్కారం పెట్టింది. ఈ అమ్మాయికే నేను ఆపరేషన్ చేసింది అని పరిచయం చేశారు. అంటే తన మీద నమ్మకం కుదరడానికి అది ఆయన ఎంచుకున్న పద్దతి అనిపించింది. అంతవరకూ ఆ డాక్టరు గారు విదేశాలలో పనిచేసి వచ్చారు.

నేను ప్రస్తుతం విదేశాల్లో పనిచేస్తున్నా కనుక,  సీ జీ హెచ్ ఎస్ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వైద్య పధకం) నాకు వర్తించదు. మాస్కోలో ఇంతకంటే పెద్ద ఆపరేషన్లు ఉచితమే కానీ, ఆపరేషన్ అక్కడ జరగలేదు. సొంత డబ్బులతో చేయించాలి. ఎలా? నాకు వెంటనే  తట్టిన సమాధానం ఈ మధ్యనే మా ఆవిడ కొన్న గాజులను బ్యాంకులో తాకట్టు పెట్టడం. ఆ పనిచేసి ఎనిమిదివేలు తెచ్చాను. అయితే అది ఏ మూలకు?

అయితే ‘ఈ ఎలా?’  అనే ప్రశ్న వేసుకున్నది, సమాధానం  రాబట్టింది నా మిత్రుడు జ్వాలా నరసింహారావు.  ఆయనా డబ్బు విషయాల్లో నాలాంటి కుచేలుడే. అయినా అవసరానికి డబ్బు పుట్టించగలడు. సర్కిల్ పెద్దది. ఆపరేషన్ కు మొత్తం ఎంత అయిందో,  దాన్ని ఎవరు కట్టారో  నాకిప్పటికీ పూర్తి వివరాలు తెలియవు. తరువాత కాలంలో కొంత తీర్చినట్టు గుర్తు. పూర్తిగా తీర్చానో లేదో గుర్తు లేదు. పెద్దలు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారి మాట సాయంతో ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది కంటికి రెప్పలా కనిపెట్టి చూసుకున్నారు. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి బావమరిది వెంకటరెడ్డి గారితో  ఖమ్మంలో పరిచయం. అదికూడా ఉపయోగపడింది. మాకందరికీ ఆసుపత్రి పక్కనే వున్న గెస్టు హౌస్ ఇచ్చారు. కాఫీ టిఫిన్లు, భోజనాలు కేంటీన్ లో.

 

ఆ రోజుల్లో జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రి ఊరికి దూరంగా విసిరేసినట్టు వుండేది. చెక్ పోస్ట్ అవతల ఏమీ లేదు. ఎటు చూసినా పంట పొలాలు. సరైన రహదారి వుండేది కాదు. నందమూరి బాలకృష్ణ గారి ఇంటి తరువాత ఇళ్ళ నిర్మాణాలే లేవు. ఆటో వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వచ్చినా హైరాణా ప్రయాణం.  హైదర్ గూడాలోని అపోలో నుంచి గంటకో రెండు గంటలకో ఆసుపత్రి వారే ఉచిత షటిల్ బస్సు  సర్వీసు నడిపేవారు రోగుల బంధువుల కోసం. అందులో పడి వెళ్ళేవాళ్ళం.

 

ఆపరేషన్ రోజున ఖమ్మంనుంచి,  బెజవాడ నుంచీ బంధువులు అనేకమంది వచ్చారు. ఇక హైదరాబాదులో వున్న వారి సంగతి చెప్పనక్కర లేదు. వారితో ఆసుపత్రి కిటకిటలాడింది. ఎవరైనా ఉచితంగా రక్తం ఇస్తారా అని అడిగితే, ఆ రోజు మా వాళ్ళు  అందరూ క్యూలో నిలబడి రక్తదానం చేశారు. వందకు మించి రక్తం ఇచ్చారని ఆసుపత్రి వాళ్ళు చెప్పారు.

మా ఆవిడకి ఆసుపత్రి దుస్తులు వేసి ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకువెడుతుంటే, గుండెతో పని అని  భయపడుతుందేమో అని నేను భయపడ్డాను. కానీ ఆమెలో ఎలాంటి ఆందోళనా కానరాలేదు. కాకపోతే,  వెడుతూ వెడుతూ,  మళ్ళీ చూస్తానో లేదో అన్నట్టు నా వైపు తేరిపార  చూసింది. గాజులు లేని చేతితో నా చేయి మెల్లగా నొక్కి వదిలేసింది.

ఒకటి కాదు, రెండు కాదు కొన్ని గంటల పాటు జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇప్పుడంటే ఇలాంటి  ఆపరేషన్లు త్వరత్వరగా చేసేస్తున్నారు.

ఆపరేషన్ పూర్తయిన తర్వాత డాక్టర్ సీతా రామారెడ్డి గారు చెప్పారు, బాగా జరిగిందని. అందరం ఊపిరి పీల్చుకున్నాం. మూడు రోజుల తర్వాత అపోలో హాస్పిటల్ పైన ఖాళీ జాగాలో నడిపించారు. (ఇప్పుడు ఆ ఖాళీ జాగా లేకుండా నిర్మాణాలు చేశారు)

పద్దెనిమిది రోజుల తర్వాత అనుకుంటా డిస్ చార్జ్ చేశారు. కానీ వెంటనే విమాన ప్రయాణం మంచిది కాదని చెప్పారు. దాంతో నెల అనుకుని వచ్చిన ప్రయాణం మూడు నెలలు వాయిదా పడింది. మా పిల్లలు స్కూలు పోతోందని అనుకున్నారు కానీ, తప్పని సరి పరిస్థితి.   

కింది ఫోటో:

ముప్పయ్ అయిదేళ్లకు పూర్వమే మా ఆవిడ నిర్మలకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ బి. సీతారామారెడ్డి గారు

ఆపరేషన్ విజయవంతం అయి మేము మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత మాస్కోలో ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్ లో డాక్టర్లు ఆవిడను పరీక్షించి ఇంత గొప్పగా మాదగ్గర కూడా చేయలేమో అని అనడం చాలా ఆనందం అనిపించింది. మాస్కో నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత, దంపతులం ఇద్దరం అపోలో ఆసుపత్రికి వెళ్లి  డాక్టర్ గారిని కలిశాము.  మాస్కో వైద్య నిపుణులు ఆయన గురించి చేసిన ప్రశంసను ఆయన  చెవిన వేశాను. ఎంత సంతోషించారు అంటే మా ఆవిడను వెంటబెట్టుకుని  తోటి డాక్టర్లకు చూపించి, చూశారా ఈవిడకే నేను పాతికేళ్ళ నాడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాను, ఎంత ఆరోగ్యంగా వుందో చూస్తున్నారు కదా! అని చెప్పుకుని మురిసిపోయారు. తాము చికిత్స చేసిన రోగులు బాగా వున్నారు అని తెలుసుకున్నప్పుడు డాక్టర్లలో కలిగే ఆనందాన్ని ఆనాడు డాక్టర్ సీతారామారెడ్డి కళ్ళలో నేను చూడగలిగాను.



 

(ఇంకావుంది)                    

19, మార్చి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో ( 120 ) – భండారు శ్రీనివాసరావు

 ‘మీరు ఈ సారి వేసవి సెలవుల్లో ఎక్కడికి వెడదామని అనుకుంటున్నారు?’ అని ఒక రోజు గీర్మన్ అడిగాడు.

అదృష్టం ఒకేసారి తలుపు తడుతుందంటారు. నాకు చాలా సార్లు తట్టింది. అయితే ఏం లాభం, జన్మతః వచ్చిన కొన్ని అలవాట్లు నన్ను చాలా అదృష్టాలకు దూరం చేశాయి. 

రేడియో మాస్కోలో పనిచేసేవారికి ఏటా ఒక నెల రోజులు సెలవులు వుంటాయి. వాటిని ఖచ్చితంగా వాడుకోవాలి. ప్రతి మనిషికి తగినంత విశ్రాంతి వుండాలి అనే కోణంలో ఆలోచించి పెట్టిన నిబంధన అది. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామో ముందుగా చెబితే, దానికి తగ్గట్టుగా ప్రయాణపు ఏర్పాట్లు, వసతి సదుపాయాలు అన్నీ ఆఫీసు  వాళ్ళే చేస్తారు.

విదేశీయులతో సహా చాలామంది నల్ల సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుకోవడానికి ఇష్టపడతారు. బోటు షికార్లు, సముద్రంలో ఈతలు వీటితో కాలక్షేపం చేస్తారు. సముద్ర తీరంలో దాచా (గెస్ట్ హౌస్ ) ల్లో అన్ని సౌకర్యాలు వుంటాయి. మనం చేయాల్సింది అల్లా వాళ్లకు ముందస్తుగా తేదీలు ఇవ్వడమే. మిగిలినవన్నీ వాళ్ళే చూసుకుంటారు.  మా పిల్లలు కూడా మొగ్గు చూపారు. కానీ  నా భోజన అలవాట్లు తెలిసిన మా ఆవిడ, అన్ని రోజులు మీరు అక్కడ వుండలేరు అనడంతో మా సెలవు రోజుల్ని హైదరాబాదులో గడపడానికి నిశ్చయించాము. 

ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే ఒకళ్ళు ఇద్దరు అపరిచితులు కలిసి,  మీ దగ్గర రష్యన్ బ్రీడ్  పెట్స్  వున్నాయా, బ్లూ కలర్   టీ సెట్స్ వున్నాయా, చెక్ కట్ గ్లాసులు వున్నాయా  అని వాకబు చేయడం చూసి,  మాస్కోలో ఒక స్టూడెంట్ చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది. మాస్కోలో కుక్కపిల్లలు  అమ్మే సంతలు జరుగుతాయి. కుక్క కూనల తల్లి, తండ్రి వివరాలు, వాటి  గోళ్ళు, మచ్చలు   ఇలా అనేక వివరాలతో కూడిన ఒక చిన్న పుస్తకం లాంటిది వాటితో పాటే  ఇస్తారు. వాటిని బట్టి ఢిల్లీలో రేట్లు వుంటాయి. ఒక జత కుక్క పిల్లలని అక్కడ ఓ పాతిక ముప్పయి రూబుళ్ళకు కొనుక్కుని ఢిల్లీ తీసుకువస్తే ( ఏరో ఫ్లోట్ లో వాటికి చార్జి కూడా వుండదు) ఒక్కొక్కటి పదివేలకు కొనుక్కు పోతారట.  

అలాగే రష్యాలో తయారైన నీలం రంగు  పింగాణీ టీ సెట్లకు కూడా బయట దేశాల్లో చాలా గిరాకీ. 

మాస్కో పొలిమేరల్లో పింగాణీ  సామాగ్రి తయారు చేసే ఫాక్టరీకి ఒకరోజు రేడియో వాళ్ళే బస్సులు పెట్టి కుటుంబాలతో సహా తీసుకువెళ్ళారు. అప్పుడప్పుడూ విదేశీ ఉద్యోగులని ఇలా తిప్పుతుంటారు. అక్కడ రకరకాల పింగాణీ వస్తువులు తయారు చేస్తున్నారు. మాతో  వచ్చిన వాళ్ళందరూ డజన్ల లెక్కలో కొన్నారు. రష్యన్లు వాళ్ళ ఆకారానికి తగ్గట్టు పెద్ద పెద్ద కప్పుల్లో టీ తాగుతారు. మా ఇంట్లో ఎవరికీ అంత పెద్ద కప్పుల్లో తాగడం అలవాటు లేదు. అందుకని పది రూబుళ్ళు పెట్టి  ఒక సెట్టు కొనుక్కుని తెచ్చుకున్నాము. తరువాత మా ఇంటికి వచ్చిన ఒక పెద్దమనిషి అవి చూసి, ఇవెక్కడ దొరికాయి, ఒక్కొక్క  సెట్టు ధర వేలల్లో వుంటుంది అని చెప్పేవరకు మాకు వాటి ధర తెలియదు. అయినా డ్రాయింగు రూము షో కేసులో వుండేవాటి  ధర ఎంతయితే ఏమిటి? అది మారుబేరాల వాళ్ళ పని.    

ఢిల్లీలో రాయపాటి సాంబశివరావు గారు పంపిన కారులో వారి   బంగళాకి వెళ్ళాము. ఆయన లేరు. కానీ ఆయన  పియ్యే  సజ్జీ మమ్మల్ని బాగా కనుక్కున్నారు. చిన్ని చిన్ని ఉల్లిగడ్డలు వేసిన చక్కటి వేడి వేడి సాంబారుతో  భోజనం.  సరే, దానికి ముందు షరా మామూలుగా అతిధులకి చేసే మర్యాదలు.  కారులో మా పిల్లలని   ఢిల్లీ నగర వీధుల్లో అటూ ఇటూ తిప్పి,  మమ్మల్ని  మళ్ళీ మర్నాడు హైదరాబాదు ఫ్లయిట్ ఎక్కించాడు. 

అప్పుడు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు ఇద్దరూ హైదరాబాదు లోనే వున్నారు. ఆ నెల రోజుల్లో చాలా తిరిగాము. బరంపురం ( మా ఆవిడ పుట్టిల్లు కాదు కానీ, వాళ్ళ అమ్మగారి అక్కయ్య కూతురు అక్కడ వుండేది. మా ప్రేమ పురాణం నడిచే రోజుల్లో,  కొన్ని నెలలు నా నుంచి దూరంగా వుంచడానికి మా ఆవిడను బరంపురం పంపించారు)  వెళ్లి,  అక్కడ రెండు రోజులు వుండి విశాఖపట్నం వెళ్ళాము. స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడి అటో వాళ్ళు ఎక్కడికి, ఎంత అని అడగకుండా వుండడం చూసి,  ముచ్చటేసింది. అక్కడి పోలీసు సూపర్నెంట్ రామస్వామి ఐ పి ఎస్. (అప్పటికి కమిషనర్ల వ్యవస్థ లేదు) ఆయనకి ఈ విషయం చెప్పి అభినందిద్దాము,  అని అదే ఆటోలో ఆయన ఆఫీసుకు వెళ్ళాము. ఎప్పుడో హైదరాబాదులో పరిచయం. కానీ ఆయన నన్ను గుర్తుపట్టారు. ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగారు. మళ్ళీ ఎప్పుడు ప్రయాణం అని అడిగి, ఈలోగా అరకు వెళ్లి రండి అంటూ  అప్పటికప్పుడు ఒక వాహనం ఏర్పాటు చేసి మమ్మల్ని అరకు పంపించారు. అనుకోకుండా అరకు, బొర్రా గుహలు చూసే అవకాశం దొరకడంతో పిల్లలు కూడా సంతోష పడ్డారు. అరకు నుంచి వచ్చేటప్పుడు మమ్మల్ని రైలు ఎక్కించి, టన్నెల్స్ ద్వారా ప్రయాణానుభూతి కలిగించి, మమ్మల్ని తీసుకువెళ్ళిన వాహనం రైలు వెంట వచ్చే ఏర్పాటు చేశారు. తరువాత రామస్వామి గారు హైదరాబాదు కమిషనర్ గా కూడా పనిచేశారు. 

(మాస్కో ఎసైన్ మెంటు పూర్తిచేసుకుని, అయిదేళ్ళ తరువాత  హైదరాబాదు ఆలిండియా రేడియోలో తిరిగి చేరిన తరువాత, రామస్వామి గారు (అప్పటికి రిటైర్ అయ్యారు) రాజ్ భవన్ లో కనపడ్డారు. ఆ రోజు ఆనాటి గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టిన రోజు. అధికారులు, అనధికారులు అనేక మంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి రాజ భవన్ కు వచ్చారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో ఐ పి ఎస్ అధికారిగా పనిచేసిన కారణమో  ఏమిటో తెలియదు కానీ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేక మంది అధికారులు వచ్చారు. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. నిబంధనల ప్రకారం ఆయన తన సెల్ ఫోన్ ను కారులోనే వుంచేసి లోపలకు రావడం గమనించి,  అదే విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే, పోలీసు శాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే ఎట్లా అన్నట్టు చిరునవ్వే సమాధానం.)

హైదరాబాదు వచ్చిన తర్వాత గుంటూరు నుంచి రాయపాటి సాంబశివరావు గారు ఫోన్ చేశారు. రేపు పొద్దున్నే మీ అన్నయ్య గారి ఇంటికి కారు వస్తుంది, అది ఎక్కి గుంటూరు రండి, మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత  హైదరాబాదు వెళ్ళండి’ అన్నారు.

అప్పటికి ఏసీ కార్లు ఇంత విస్తృతంగా లేవు. చెప్పిన ప్రకారం కారు వచ్చింది. చల్లగా ప్రయాణం చేస్తూ గుంటూరు చేరాము. భార్య లీలాకుమారి గారికి  మా ఆవిడను పరిచయం చేస్తూ, మాస్కోలో నాకు ఈవిడ అన్నదాత అనడంతో నా కళ్ళు చమర్చాయి. ఒకరికి భోజనం పెట్టడంలో ఇంత ఆనందం వుంటుందా అనిపించింది. వెండిపళ్ళెంలో పట్టు చీరె, జాకెట్టు గుడ్డ  వుంచి మా ఆవిడకి బొట్టు పెట్టి ఇచ్చారు.  ఆ సాయంత్రం కూడా అక్కడే గడిచింది. మమ్మల్ని వుంచిన గెస్ట్ హౌస్ కి    వచ్చిన సాంబశివరావు గారు, ఇంత దూరం వచ్చి తిరుపతి వెళ్ళకపోతే ఎలా అని అదే కార్లో మమ్మల్ని తిరుపతి పంపించి మంచి దర్శనం చేయించారు. తిరుపతి నుంచి అదే కార్లో తిరిగి హైదరాబాదు చేరాము. క్షేమంగా తిప్పి తీసుకువచ్చిన డ్రైవర్ కు థాంక్స్ చెబితే, మీరు  రెండు మూడు రోజుల్లో  మాస్కో తిరిగి వెడతారు కదా, అప్పటిదాకా నన్ను మీతోనే వుండమన్నారు మా సారు’ అన్నాడు ఆ డ్రైవర్. ఈ ఊళ్ళో మాకు కారు అవసరం లేదు అని గట్టిగా చెప్పి తిప్పి పంపించాను. 

మాస్కో సంపాదనలో ఓ పది వేలు బ్యాంకులో వుంటే,  అవి మా ఆవిడకి ఇచ్చి ఏమైనా కొనుక్కో అంటే రెండు జతల గాజులు కొనుక్కుంది. ఆ రోజుల్లో బంగారం ధరలు అలాగే వుండేవి.  కొన్న మూడో రోజునే వాటిని బ్యాంకులో  తాకట్టు పెట్టి ఎనిమిది వేలు అప్పు చేయాల్సి వస్తుందని అప్పుడు ఊహించలేదు. 

మర్నాడు సాయంత్రం బేగంపేట నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి మాస్కో ప్రయాణం.

ఈ లోగా అనుకోని అవాంతరం. ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తే, మా  ఆవిడని మా పెద్దక్కయ్య కొడుకు డాక్టర్ రంగారావు చూసి, ప్రయాణం వాయిదా వేసుకో అని సలహా చెప్పాడు.  

ట్రంక్ కాల్ బుక్ చేసి మాస్కో రేడియోకి ఫోన్ చేసి గీర్మన్ తో చెప్పా.

‘ముందు అనుకున్నట్టు మేము మాస్కో రావడం లేదు. రెండు రోజుల్లో మా ఆవిడకి  ఓపెన్ హార్ట్ సర్జరీ’   

కింది ఫోటో: 

రష్యన్ బ్లూ కలర్ టీ సెట్టు 



(ఇంకావుంది)