6, ఆగస్టు 2022, శనివారం

ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది ఈ వయసులో - భండారు శ్రీనివాసరావు

 

బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు
'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ
'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ. పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం
'ఏంది గురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు.
బుడుగుకే కాదు, పుట్టిన ప్రతివారికీ ఈ పేర్ల తిప్పలు తప్పవు.
చిన్నప్పుడు నేను పుట్టినప్పుదు నామ నక్షత్రం ప్రకారం శ్రీనివాసరావు.
కానీ ఇంట్లో ముద్దు పేరు సీనప్ప.
అలాగే ఆ పేరుతోనే పెరిగాను. పెరిగి పెరిగి పెద్దయి ఆంధ్రజ్యోతిలో చేరాను.
చేరిన తరవాత తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు జ్యోతి శ్రీనివాస్ అన్నారు. కావమ్మ గారి మొగుడిలా కామోసు అనుకున్నా. తర్వాత రేడియోలో చేరిన తర్వాత రేడియో శ్రీనివాస్.
ఆ పిమ్మట జీవన స్రవంతి శ్రీనివాస్.
అక్కడితో ఆగిందా.
మాస్కో శ్రీనివాస్.
ఇలాగే ప్రతివారికి జీవితం చివరాఖర్లో .. చెప్పుకోవడానికి, పిలవడానికి ఎన్నో ఇంటి పేర్లు.
ఇప్పుడే ఒక మీడియా ఫంక్షన్ నుంచి వచ్చాను.
ఆక్కడ అందరూ నన్ను పలానా టీవీ శ్రీనివాస్ రావు అనడం మొదలు పెట్టారు. నిజానికి ఒక్కొక్కరు ఓ టీవీ పేరు చెబుతున్నారు. నాకూ ఆ టీవీలకి ఏమీ సంబంధం లేదు. నా వయసు డెబ్బయి ఆరు. ఉద్యోగం చేసే వయసు కాదు, ఉద్యోగం ఇచ్చే వయసు అంతకంటే కాదు.
అసలు విషయం ఇది కాదు.
జనం నన్ను గుర్తు పడుతున్నారు. గుర్తుపట్టి పలకరిస్తున్నారు ఆప్యాయంగా.
ఒక మనిషికి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది ఈ వయసులో.
(06-08-2022)

5, ఆగస్టు 2022, శుక్రవారం

వార్త ఎఫెక్ట్ అంటే ఇదీ!

 మా మీడియాలో వచ్చిన వార్త ఎఫెక్ట్ అనే ఈరోజుల్లో తరచుగా టీవీ తెరలపై చూస్తుంటాం. అలాంటిదే ఓ పాత సంగతి ఇది. కాకపొతే ఆ పత్రిక ప్రచారం చేసుకోలేదు.

ఇది ఇప్పటి మాట కాదు. యాభై ఏళ్ళ పైమాటే.

మద్రాసు జనరల్ ఆసుపత్రి బీట్ చూసే ఒక విలేకరికి ఒక రోజు స్కూటర్ ప్రమాదంలో గాయపడి మరణించిన వ్యక్తి శవం కనిపించింది. పక్కనే ఎవరికోసమో ఎదురు చూస్తున్న లక్ష్మి అనే వ్యక్తి అతడికి తారసపడింది. ఆమె ఒక నిర్మాణ కూలీ. స్కూటర్ పై వెడుతున్న ఓ ఇద్దర్ని అటుగా పోయే వాహనం కొట్టేసి ఆగకుండా అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నవారిని అందరితో పాటు ఈమె కూడా చూసింది. అందరూ వింత చూసేవారే కాని ఒక్కరూ కలగచేసుకోలేదు. ఈమే పరిగెట్టుకువెళ్లి వాళ్ళను లేవదీయాలని ప్రయత్నించింది. ఓ టాక్సీని ఆపింది. అప్పటికే ముగ్గురు నలుగురు ఆపకుండా పోయారు. మరి కిరాయి ఎవరిస్తారని టాక్సీవాడు అడిగాడు. డబ్బులేదు. ముక్కుపుడక చూపించింది. టాక్సీలో ఇద్దరినీ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అయిన ఆలస్యం వల్ల ఒకడు అప్పటికే చనిపోయాడు. ఈ స్తితిలో విషయం తెలుసుకున్న విలేకరి హృదయం ద్రవించింది.

నిరక్షురాస్యురాలయిన ఓ కూలీ వనిత తన రోజుకూలీ కూడా వొదులుకుని, ముక్కుపుడక టాక్సీవాడికి ఇచ్చి ఆసుపత్రికి చేర్చిన వైనాన్ని ఆ విలేకరి మరునాడు తన పత్రికలో రాసాడు. ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ’ అనే శీర్షికతో రాసిన ఆ వార్త మద్రాసులో చర్చనీయాంశం అయింది. పోలీసు కమీషనర్ లక్ష్మికి పాతిక రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె రోజు కూలీ రూపాయన్నరతో పోల్చుకుంటే ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే. పత్రికా పాఠకులనుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అనేకమంది ఆమెకు కానుకలు పంపారు. మధురై నుంచి వెంకటేశ్వరన్ అనే వ్యక్తి ఒక పార్సెల్ పంపాడు. గాయపడ్డవారి రక్తంతో తడిసిన ఆమె చీరెకు బదులుగా ఒక కొత్తచీరెను కానుకగా పంపించాడు. పత్రిక పాఠకులనుంచి దాదాపు వెయ్యి రూపాయల సాయం అందింది. వందరూపాయలు మించి వస్తే ఒక ఇత్తడి గిన్నె కొనుక్కుంటానని ఆ యువతి తరువాత అదే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ చదివిన కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య ఒక ఇత్తడి గిన్నెను కానుకగా పంపించారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే -

ఆ వార్త రాసిన పత్రిక హిందూ. ఆ వార్త రాసింది ఆ పత్రికలో కొత్తగా విలేకరిగా చేరిన ఆర్.జే. రాజేంద్రప్రసాద్. ప్రసాద్ గారు రాసిన ‘డేట్ లైన్ ఆంధ్ర’ అనే పుస్తకంలో ఈ సమాచారం వుంది.

 


(ప్లేటు చేతిలో ఉన్న వ్యక్తి శ్రీ రాజేంద్రప్రసాద్)

4, ఆగస్టు 2022, గురువారం

అగ్రరాజ్యపు పాము పగ – భండారు శ్రీనివాసరావు

 (Published in SAKSHI daily on 04-08-2022, SUNDAY, today)

ఆల్ ఖయిదా అగ్రనేత ఆల్ జవహరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, ఆఫ్ఘనిస్థాన్ లో తలదాచుకున్న  ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది.

ఇరవై ఏళ్ళ క్రితం  2001 సెప్టెంబర్ పదకొండో తేదీన (9/11) నాటి ఆల్ ఖయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరి మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 

9/11 గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి  ప్రతీకారంగా,  అమెరికా పదేళ్ల తర్వాత,  2011లో బిన్ లాడెన్ ని వధించి పగ తీర్చుకుంది. అప్పుడు  లాడెన్ కు కుడి భుజంగా వ్యవహరించిన జవహరీని కూడా  వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆల్ జవహరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్  ప్రపంచానికి మరోమారు చాటి చెప్పింది.

ఈ నేపధ్యంలో గతంలోకి  తొంగిచూసి నాటి విషయాలను పునశ్చరణ చేసుకుందాం.   

ఒసామా బిన్ లాడెన్ – బరాక్ హుస్సేన్ ఒబామా

వీరిద్దరి మధ్యా నామసారూప్యత మాత్రమే కాదు, భావ సారూప్యత కూడా వుంది.

‘మతం కోసం ఎలాటి మారణహోమానికయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ది.

‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అలనాటి  అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాది.

అయితే, ఆలోచన ఒక్కటే అయినా ఆచరణలో కొద్ది తేడా వుంది.

‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా పరవాలేదు అనే థియరీ’ ఒబామాది.

‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి  పనికిరాదనే భావజాలం’ ఒసామాది.

ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాలకోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ  విషనాగు,  ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని, తనకు తానుగా అమెరికా పెంచుకుంటూ వచ్చిన అహంభావాన్ని బిన్ లాడెన్ తనదయిన శైలిలో దెబ్బ తీసినప్పుడుకానీ, ‘పాము-పాలు’ కధ లోని అంతరార్ధం  అమెరికాకు అవగతం కాలేదు. తనదాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా, 2001, సెప్టెంబర్ 11  దుర్ఘటన తరవాత గాని ఉగ్రవాదం వల్ల పొంచివున్న ముప్పు ఎలావుంటున్నన్నది ఆ అగ్ర దేశానికి అర్ధం కాలేదు.

ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్ ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా అగ్రరాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు  కంటిమీద కునుకులేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే  ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదం అవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హై టెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలను జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్ లో కూర్చుని పధకం అమలవుతున్న తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్  ఒబామా హావభావాలనుబట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్షకులు లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్ధం చేసుకోగలిగారు.

బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది, 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన  పంజా దెబ్బకు అమెరికా గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ ఓటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో  పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. అధ్యక్ష  ఎన్నికకు ముందూ, ఆ తరువాతా ‘నేను క్రైస్తవుడినే’ అని బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత చేసిన తొలి విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ఇక, అమెరికన్ల ప్రతీకారేచ్ఛకు బలయిన ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్ లో కడునిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదరపోషణార్ధం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టాడు. అక్కడినుంచి అతడు పట్టింది బంగారమయింది. సౌదీ రాజ్య కుటుంబీకులతో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలు అతడి స్తితి గతుల్ని పూర్తిగా మార్చివేశాయి. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడు.

సౌదీ అరేబియాలో దాదాపు ఎనభయ్ శాతం రహదారులను మహమ్మద్ కంపెనీయే నిర్మించింది. అతడికి అనేకమంది భార్యలు. పదో భార్య సిరియన్ దేశీయురాలు. ఆమెకు జన్మించినవాడే ఒసామా బిన్ లాడెన్. మహమ్మద్ సంతానం 52 మందిలో ఒసామా 17వ వాడు. ఆరడుగులు ఎత్తు. అయినా మనిషి బక్క పలచన. సంపన్న కుటుంబంలో పుట్టి విలాసాలకు అలవాటుపడాల్సిన ఒసామా మనసు మతం వైపు మళ్ళింది.  గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా  తన భూభాగంలో అమెరికా మిలిటరీ  స్తావరం ఏర్పాటుకు  సౌదీ ప్రభుత్వం అనుమతించడాన్నిఒసామా జీర్ణించుకోలేకపోయాడు. ఆ సందర్భంలో అతడు చేసిన విమర్శలను ప్రభుత్వం తప్పుపట్టింది. ఒసామా పౌర సత్వాన్ని, పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం ఒసామాను తమ నుంచి వెలి వేసింది. దరిమిలా అల్ ఖయిదాకు అనేక దేశాల్లో బలమయిన స్తావరాలు ఏర్పాటుచేసే కృషిని కొనసాగించిన ఒసామా మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ఉగ్రవాదిగా గుర్తింపు పొందాడు. అల్ ఖయిదా  పేరు చెబితే పాశ్చాత్య దేశాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేసాడు. ’భౌతికంగా నన్ను రూపుమాపగలరేమోకాని నా భావజాలాన్ని, నా లక్ష్యాన్ని ఏనాటికీ, ఎవ్వరూ రూపుమాపలేరు’ అని ఒసామా బిన్ లాడెన్ తరచుగా చెబుతుండేవాడు. ధనరాశుల నడుమ జన్మించి, సంపదలతో వచ్చే సుఖాలనన్నిటినీ కాలదన్నుకుని, కొండలు, గుట్టల్లో జీవనాన్ని ఎన్నుకుని, నిరంతర పోరాటాలతో కాలం గడిపిన ఆయన తీరు ఎంతోమందిని ఆయన వైపు నడిపించింది. చేస్తున్నది తప్పా వొప్పా అన్న విచక్షణ నుంచి వారిని దూరం చేసింది.             

 

‘కత్తి  తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి.  క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.  

‘మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పరమతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకుంటున్నా, మత ఛాందసులు పట్టించుకోలేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.

పవిత్ర యుద్ధం పేరుతొ సంవత్సరాల తరబడి సాగించిన పోరాటంలో ఒసామా బిన్ లాడెన్ చివరకు తన ప్రాణాలనే తర్పణంగా విడవాల్సివచ్చింది. కళ్లుచెదిరే సంపద కలిగిన కలవారి కుటుంబంలో పుట్టి కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొండకోనల్లో దుర్భర జీవితం గడిపిన అనుభవం ఒసామాది. నిరుపేద కుటుంబంలో పుట్టి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు కాగలిగిన అదృష్టం ఒబామాది. తరాలకు పూర్వం మత మూలాలు ఒక్కటే అయినా, వేర్వేరు మతాలకు ప్రతినిధులుగా వీరిద్దరూ పోరుబాటలో పయనించిన తీరు విధి వైపరీత్యానికి పరాకాష్ట.

ఒసామా తర్వాత ఆల్ ఖాయిదా పగ్గాలు చేపట్టిన ఆల్ జవహారీ కూడా తన నాయకుడు లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం.




3, ఆగస్టు 2022, బుధవారం

తెలంగాణకి అప్పుల తిప్పలు తప్పవా తప్పవా?

కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి రగడ

ఎవరి హద్దులు వాళ్ళే తెలుసుకోవాలి

భారత స్వాతంత్ర అమృతోత్సవం

 ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం

భారత స్వాతంత్రోత్సవ అమృత ఘడియల్లో శ్రోతలందరికి ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయడం ఆనందంగా వుంది.
ఇప్పుడు ఆయన మన స్టుడియోలోనే వున్నారు. పేరు బ్రిగేడియర్ ఎస్. శ్రీరాములు. భారత సైన్యంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు.
బ్రిగేడియర్ శ్రీరాములు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో జన్మించారు. విజయవాడ ఎస్సారార్ కాలేజీలో చదివారు. గ్రాడ్యుయేషన్ తరువాత సైన్యంలో అధికారిగా చేరారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత సైన్యం తరపున పాల్గొన్నారు. మౌంటెన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కు నాయకత్వం వహిస్తూ, 2003లో పదవీ విరమణ చేశారు.
ఈ సుదీర్ఘమైన సైనిక జీవితంలో బ్రిగేడియర్ శ్రీరాములు అనేక ప్రశంసలు, సైనిక గౌరవాలు, పురస్కారాలు అందుకున్నారు.
ఆయన మిలిటరీ అనుభవాలు గురించి, సైనిక జీవితంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు గురించి బ్రిగేడియర్ శ్రీరాములు గారినే అడిగి తెలుసుకుందాం.
భండారు శ్రీనివాసరావు:
బ్రిగేడియర్ శ్రీరాములు గారు, తెలుగు రాష్ట్రాల నుంచి సైన్యంలో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనే అపోహ ఒకటి ప్రచారంలో వుంది. మరి ఈ నేపధ్యంలో, కాలేజి చదువు పూర్తి చేసుకోగానే వేరే ఉద్యోగాలకోసం ప్రయత్నించకుండా నేరుగా సైన్యంలో చేరాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగింది? మీ కుటుంబంలో కూడా ఎవరికీ మిలిటరీ అనుభవం వున్నట్టు లేదు.
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
మీరు అనేది నిజమే. మా కుటుంబంలోనే కాదు మా ఊరి నుంచి కూడా ఎవరూ ఆర్మీ లో చేరాలని ఆలోచించే వారు కాదు. ఐతే 1962 లో చైనా యుద్ధం జరిగే సమయానికి నేను ఉంగుటూరులో స్కూల్లో చదువుకుంటున్నాను. రక్షణనిధి చందా పోగు చేయడం కోసం స్కూలు పిల్లలని వరిపొలాల్లో కోతలకు పంపారు. మేమందరం చాల ఉత్సాహంగా కోతలు కోస్తుంటే ఓ రైతు నన్ను చూసి, 'అంత సరదాగా పని చేస్తున్నావు ఆర్మీ లో చేరి యుద్ధం చేస్తావా ?' అని సరదాగానే అడిగారు. నామనసులో ఆ మాట నాటుకుపోయింది. ఆ తరవాత 1965 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగే సమాయానికి నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ లో చదువుతున్నాను. ఆ సమయంలో రొజూ రేడియోలో యుద్ధం వార్తలు వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు నా మనసులో ఆర్మీ లో చేరాలనే ఆలోచన మరింత బలపడింది. అదే లక్ష్యంగా పెట్టుకుని డిగ్రీ చదువుతూనే ఆర్మీ సెలెక్షన్స్ కి ప్రిపేర్ అయ్యాను. 'యద్భావం తద్భవతి' అన్నట్లు డిగ్రీ అవగానే ఆర్మీ ఇంటర్వ్యూ కి వెళ్లడం, సెలెక్ట్ అవడం జరిగిపోయాయి. ఆలా లక్ష్యం, శ్రమ, అదృష్టం అన్నీ కలిసొచ్చాయి.
భండారు శ్రీనివాసరావు:
ప్రస్తుతం భారత జాతి యావత్తు ఆజాదీగా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న తరుణం. మన స్వాతంత్రం కూడా బ్రిటిష్ వారితో యుద్ధాలు చేసి సాధించుకున్నది కాదు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఉత్సవాలను ఒక సైనికాధికారిగా ఎలా అన్వయించి చెబుతారు?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
అమృత మథనం కథ మనందరికీ తెలిసిందే. దేవతలూ రాక్షసులూ మేరు పర్వతాన్ని,వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి సుదీర్ఘ కాలం క్షీర సాగర మథనం చేసారు. ఒకదాని తరవాత ఒకటిగా మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు ఉద్భవించాయి. హాలాహలాన్ని నిర్మూలించడానికి దేవతలు శివుని సహాయం కూడా తీసుకోవలసి వచ్చింది.
స్వతంత్ర భారతదేశ చరిత్ర కూడా అమృత మథనం లాగే సాగుతోంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాసుకి మాదిరిగా తాడులాగా పని చేసి, మథనం ఆగకుండా చూస్తూ, మంచి ఫలితాలు వస్తూనే ఉండేలా, చెడ్డ వస్తువులొస్తే వాటిని నిర్మూలించడానికి పనిచేసే ప్రమథ గణాల వలె పని చేస్తున్నాయి. ఈ బ్రహ్మయజ్ఞంలో, తాడులో ఒక చిన్న పోగులా నా జీవితం సాగిపోయింది. మహాకవి శ్రీ శ్రీ గారు చెప్పినట్లు 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' . అది నా అదృష్టం.
భండారు శ్రీనివాసరావు:
బ్రిగేడియర్! ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర అమృత మధనంలో సైనిక దళాల పాత్ర ఏమిటి అని అంటే ఏం చెబుతారు?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
ఏ యజ్ఞానికైనా రక్షణ అవసరం. విశ్వామిత్రుడంతటి మహర్షి తన యజ్ఞానికి శ్రీ రాముల వారి సహాయం తీసుకున్నారు. అలాగే స్వతంత్ర భారత అమృత మధన యజ్ఞానికి ఇండియన్ ఆర్మీ ఎల్లకాలం రక్షణ కల్పించింది, కల్పిస్తుంది కూడా.
విరోధి దేశాలే కాదు, దేశంలోపల కూడా చాలా దేశ విరోధ శక్తులు పని చేస్తున్నాయని అందరికీ తెలుసు. విరోధి దేశాలతో యుధ్ధాలే కాకుండా అంతర్విరోధ శక్తులతో కూడా సైన్యం ఎన్నోసార్లు తలపడే అవసరాలొచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన రొజు నుంచి ఈ రొజు వరకు సైన్యం చేసిన సేవలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
1 . యుద్ధాలు. 1947 - 48 జమ్మూ కాశ్మీర్ యుద్ధం; 1962 - చైనా యుద్ధం; 1965 - పాకిస్తాన్ తో యుద్ధం; 1967 - సిక్కింలో చైనా తో యుద్ధం; 1971 - పాకిస్తాన్ తో యుద్ధం, 1999 - కార్గిల్ యుద్ధం.
2 . అన్యాక్రాంతమైన భారత దేశ భూభాగాల స్వతంత్రీకరణ. హైదరాబాద్ (1948) ; దాద్రా, నగర్ హవేలీ (1954 ) ; నాగాల్యాండ్ (1955 -56 ); గోవా, డియూ, డామన్ (1961)
3. తిరుగుబాటు దారులతో సంఘర్షణ. నాగాలాండ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, జమ్మూ & కాశ్మీర్ . జమ్మూ & కాశ్మీర్ లో 1987 నుంచి ఈ రొజు వరకు సాగుతూనే ఉన్నాయి
4 . సరిహద్దుల రక్షణ - 365 రోజులూ, 24 గంటలూ దాదాపు 15000 కిలోమీటర్ల దేశ సరిహద్దుల నిరంతర రక్షణ బాధ్యత సైన్యానిదే. - ఇందులో 740 కిలోమీటర్ల లైన్ అఫ్ కంట్రోల్ పాకిస్తాన్ తో- అడుగడుగునా టెర్రరిస్టులు చొచ్ఛుకుని వచ్చే ప్రమాదం, 70 కిలోమీటర్ల, ప్రపంచం లోకల్లా ఎత్తైన రణభూమి సియాచిన్ లో మైనస్ 50 డిగ్రీల చలిలో ఐస్ మీద డ్యూటీ, దాదాపు 4000 కిలోమీటర్ల చైనా బోర్డర్ రక్షణ, టెర్రరిస్టులు, స్మగ్లర్లు, రెఫ్యూజీలు రాకుండా ఆపడం - ఇవన్నీ సైన్యం బాధ్యతలే కదా !
5 . శ్రీలంక 1987 - 89
6 . ఐక్య రాజ్య సమితి నియమిత శాంతి రక్షణ చర్యలు . కొరియా (1950 ) మొదలు ఈ రొజు వరకు చాలా దేశాలలో భారత సైన్యం పని చేసింది, చేస్తోంది. చాలా వరకు ఇవి కూడా యుద్ధాల వంటివే.
7 . మిత్రులైన చిన్న దేశాల రక్షణ . మాల్దీవ్స్ (1988 ) .
8 . విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులని క్షేమంగా దేశంలోకి తీసుకు రావడం . 1990 లో లక్షాయాభై వేలమందిని క్షేమం గా ఇరాక్ నుంచి తీసుకు రావడం ఒక రికార్డు. అప్పటినించి ఈ రొజు వరకు వేర్వేరు దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులకు సైన్యం రక్షణ కల్పిస్తోంది . ఇటీవల యుక్రెయిన్ నుంచి మన విద్యార్థులని క్షేమంగా తీసుకు రావడం ఇంకో ఉదాహరణ
9. ఉపద్రవాలు సంభవించినప్పుడు ప్రజా రక్షణ. సునామి, భూకంపాలు, వరదలు, అంత దాకా ఎందుకు బోరు బావిలో పడినా సరే, ఆర్మీ నిస్సంకోచం గా సహాయం చేస్తుంది.
10 . దేశ నిర్మాణం. సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, వంతెనలు నిర్మించడం, చిన్న తరహా హైడెల్ ప్రాజెక్ట్స్ , టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో స్కూల్స్ నడిపించడం వరకు సైన్యం సంతోషం గా చేస్తున్నది.
11 . స్పోర్ట్స్ . సైన్యం బాధ్యత తీసుకున్న తరవాత మన దేశ ఆటగాళ్లు ఒలింపిక్స్ లో స్వర్ణ, రజత, కాంస్య మెడల్స్ సాధించడం మొదలైంది
భండారు శ్రీనివాసరావు:
ఆర్మీ అనగానే అదేదో మనకు సంబంధం లేని విషయం అనే భావన ఇంకా చాలామందిలో వుంది. వెనక కాశీ పోయిన వాడు, కాటికి పోయిన వాడు ఒకటే అనే నానుడి వుండేది. అలాగే సైన్యంలో చేరే వారి గురించి ఇలాగే చెప్పుకునేవారు. అందులో చేరడం అంటే ఇక ఇంటికి తిరిగిరాడు వంటి అపోహల నడుమ, మీరు సుదీర్ఘ కాలం సైన్యంలో పనిచేశారు. పిల్లను ఇవ్వడానికి కూడా సంక్షేపించే తలితండ్రుల కాలంలో మీరు ఎలా నెగ్గుకు వచ్చారు. మీ విజయాల్లో మీ శ్రీమతి గారి పాత్ర ఏమిటి? మిలిటరీ జీవితం ఎలా వుండేది! ఆ వివరాలు కొన్ని మా శ్రోతలతో పంచుకుంటారా?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
ఆర్మీలో చేరడం ఎలా జరిగిందో మీకు చెప్పాను. చేరిన తరువాత ట్రైనింగ్ లో కొంత వరకు ధైర్యం, స్థైర్యం, యుద్ధ విద్యలు నేర్చుకుంటాం. నా అదృష్టమేమంటే చేరిన కొన్ని నెలలలోనే యుద్ధంలో పని చేసే అవకాశం దొరికింది. పాకిస్తాన్ విమానాల బాంబులు, గన్స్ నుంచి తూటాలు, అన్నీ అనుభవించాను . మొదట్లో కొంచెం భయం వేసిన మాట నిజమే. కానీ త్వర లోనే అలవాటై పోయింది. 'నా పేరు రాసి ఉన్న బులెట్ వచ్చే వరకు నాకేం కాదు' అన్న ధైర్యం ఈ రొజు వరకు నన్ను నిర్భయం గా ఉంచుతోంది.
నాకంటే ధైర్యం, స్థైర్యం, నా శ్రీమతి ప్రేమ కుమారి లో జన్మ సిద్ధం గా ఉన్నాయి. తణుకులో పుట్టి పెరిగిన తెలుగు మహిళకి అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు. యుధ్ధాలల్లో డేంజర్ అని తెలిసీ నన్ను ఎందుకు ఎంచుకుందో అది కూడా నాకు తెలీదు. లేకపోతే 'కన్యా వరయతే రూపం' అన్నట్లు నేను స్మార్ట్ గా కనిపించానని సరదా పడిందో,నా అదృష్టం అంతే. వివాహమైన రొజు నుంచి ఈరోజు వరకు నా కర్తవ్యాన్ని సపోర్ట్ చేస్తూ వస్తోంది.
సైన్యంలో మాకు సపోర్ట్ ఉండేది కానీ సోల్జర్ ఫామిలీస్ కి, ముఖ్యం గా భర్తలు బోర్డర్ లో ఉన్నప్పుడు ఒంటరి గా ఉండే మహిళలకి ఏ రకమైన సపోర్ట్ ఉండేది కాదు. పైగా మా రోజుల్లో ఇళ్లల్లో టెలీఫోన్స్ లేవు, మొబైల్ ఫోన్ అప్పటికి రాలేదు. ఒక చిన్న అనుభవం చెపుతాను.
1988 లో నేను కాశ్మీర్ లో, భార్యా పిల్లలూ హైద్రాబాద్ లో ఉన్నాం. మా అబ్బాయి కి ఏడేళ్లు, అమ్మాయికి ఐదేళ్లు. ఒక రోజున మా అమ్మాయి లాల్ బజార్ దగ్గర స్కూటర్ కింద పడింది. బాగా దెబ్బలు తగిలాయి. నాకు ఈ ఆక్సిడెంట్ గురించి తెలిపే సౌకర్యం లేదు. ఇన్లాండ్ లెటర్ రాస్తే అది మా యూనిట్ చేరడానికి 20 రోజులు పట్టింది. నేను యూనిట్ నుంచి 200 కి మీ దూరంలో ఒక పర్వతం పైన డ్యూటీ లో ఉన్న్నాను. సో, నాకు ఆ ఉత్తరం చేరడానికి ఇంకో 15 రోజులు పట్టింది. ఆ తరవాత లీవ్ దొరకలేదు. పాపని చూడడానికి 4 నెలల వరకు రాలేక పోయాను. ఈ రొజుకి కూడా అది గుర్తొస్తే బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం?
ఇలాంటి అనుభవాలు ప్రతి సైనికుడికి తప్పవు. అయితే 32 సంవత్సరాలు సేవ, సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యాలు తలుచుకుంటే నాకే కాదు, నా భార్య, పిల్లలు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. సర్వీస్ లో దాదాపు 13 సంవత్సరాలు టెర్రరిస్టులని వేటాడుతూ గడిపాను. రిటైర్ అయిన రొజు గూడా ఒక టెర్రరిస్ట్ నా మీదికి ఫైర్ చేసాడు. ఆ బులెట్ మీద నా పేరు లేదు గనక నేను మీ ముందున్నాను. ఇంత సేవచేసే అవకాశం దొరకటం అదృష్టం కాదా?
ఇది నా అమృత మంథన యాత్ర. నా ముందు, నా తరవాత భారత సైన్యం సేవ నిరంతరం సాగుతుంది, అమృతం ఉద్భవిస్తూనే ఉంటుంది
నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను ( శ్రీ శ్రీ )
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
మీరింతవరకు బ్రిగేడియర్ శ్రీరాములు గారితో ఇంటర్వ్యూ విన్నారు. భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ కార్యక్రమాన్ని సమర్పించింది.