3, ఆగస్టు 2022, బుధవారం

ప్రతి ఊళ్ళో, ప్రతి గుళ్ళో నాదస్వరం

 (ఆగస్టు మూడు పినాకపాణిగారి జయంతి)

డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అరుదయిన వ్యక్తే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుగడ్డ గర్వించదగిన పదహారణాల తెలుగుబిడ్డ.

చాలా ఏళ్ళ క్రితం సంగతులు.

జంటనగరాలలో రెండు సంగీత కళాశాలలు వున్నాయి. ఒకటి సికింద్రాబాద్ లో, రెండోది హైదరాబాద్ లో. సికింద్రాబాద్ కాలేజీకి నూకల చిన్న సత్యనారాయణ ప్రిన్సిపాల్ అయితే, హైదరాబాద్ కాలేజీకి హిందుస్తానీ విద్వాంసులు దంతాలే ప్రిన్సిపాల్. అప్పట్లో రెండు కాలేజీలు కలసి రవీంద్రభారతిలో త్యాగరాజ స్వామి ఉత్సవాలు నిర్వహించేవారు. ఉదయం నుంచి ప్రసిద్ధ విద్వాంసుల కచేరీలు మొదలయ్యేవి. ఇక రోజంతా అక్కడే గడపడం. పక్కనే వున్న గోపి హోటల్లో టిఫినూ, భోజనమున్నూ.

ఈ ఉత్సవాల్లో ఓ రోజు సంక్రాంతి వచ్చింది. ఆవేళ ఉదయం పదకొండు గంటలకు కోటి శ్రీ కృష్ణదేవరాయ ఆడిటోరియం లో పినాకపాణి గారి సోదాహరణ ప్రసంగం, కర్ణాటక సంగీతంలో నెరవు (అరవంలో నెరవల్) స్వరకల్పన ఈ రెండింటిపై.  ఆ రోజు హాజరు కాని సంగీత అభిమానులది దురదృష్టమనే చెప్పాలి. నాలుగు గంటలకు పైగా పాణి గారు అద్భుతమైన ప్రసంగం చేసారు. కళ్యాణి రాగంలో ‘మది దేహి’ అనే కీర్తనలో ‘పతిత పావన’ అనే చోట నెరవు, స్వరకల్పన గురించి. నిజంగా అమ్మవారు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది అందరికి. పండగ విందు అక్కడే దొరికింది. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పినాక పాణి మీద కవర్ పేజి కధనం ప్రచురించింది. జి ఎన్ ఎస్ రాఘవన్ గారు రాసారు. ఆయన ఆకాశవాణి వార్తా విభాగానికి డైరెక్టర్ గా పని చేసారు.  రాఘవన్ కు పినాకపాణి సంగీతం అంటే అమిత ఇష్టం.

మ్యూజిక్ అకాడెమి పినాక పాణి గారిని ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. పినాక పాణి గారికి రావలసిన సత్కారాలన్నీ వచ్చాయి. దీనితో పాటు భగవదనుగ్రహం కూడా. నూరేళ్ళు పూర్ణాయుర్దాయం లభించింది. నేదునూరి, నూకల, వోలేటి, గోపాలరత్నం వంటి శిష్యులు, మల్లాది సూరిబాబు, శ్రీరామ్, రవి కుమార్ వంటి ప్రశిష్యులు ఆయన బాణీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకన్న కావల్సినదేముంటుంది ? 1990 లో ఆయనకు తొంభయి ఏళ్ళు పూర్తయిన సందర్భంలో కర్నూలులో కొంత మంది విద్వాంసులు వెళ్లి ఆయనకు పాదపూజ చేసారు. ఆయన పాడిన ఓ కచేరి సీడీగా తెచ్చారు.

పినాకపాణి గారికి కొన్ని నిర్దిష్టమయిన ప్రమాణాలు వున్నాయని సంగీత ప్రియుడు, రేడియో, దూరదర్సన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన  ఆర్వీవీ కృష్ణారావు చెప్పారు. వాటితో రాజీపడేవారు కారు అనడానికి ఓ ఉదాహరణ జోడించారు.

‘బెజవాడలో మా త్యాగరాజ సంగీత కళా సమితి తరఫున ఆయన్ని 1986 లో ఘనంగా సత్కరించాము. అప్పుడు ఆయన ధర్మపురి రామమూర్తితో కలసి కర్నూలు నుంచి బస్సులో వచ్చారు. సన్మానం అయిన తర్వాత సుధారఘునాథన్ కచేరి పెట్టాము. చివరివరకు కూర్చున్నారు. మర్నాడు కూడా వున్నారు. ఆ రోజు మరో ప్రసిద్ధ విద్వాంసులు మహారాజపురం సంతానం కచేరి. కచేరీకి రమ్మనమని పిలిచాం. రానని మొండి కేసారు. ఎందుకని అడుగుతే ‘వాడు డబ్బు మనిషి. విద్వత్తుని నిర్మొహమాటంగా అమ్ముకుంటున్నాడు. వాడు ఎంత గొప్పగా పాడినా అనవసరం’ అని కృష్ణారావు  అన్నారు.

ఇక సంగీతానికి వస్తే ‘అసలయిన సంగీతం కావేరి నది వొడ్డున వుంది’ అనేది పినాక పాణి గారి అభిప్రాయం. అందుకనే కాబోలు ‘పాణి గారిది తంజావూరు బాణీ’ అంటారు. ‘మీ గురువు ఎవర’ని అడిగితే ‘నా తల్లి’ అని చెపుతూ వుంటారు. చిన్నప్పుడు తల్లి పాడే తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలే, డాక్టర్ అయిన తనని సంగీతం వయిపు లాక్కుని వెళ్లాయని పాణి గారు చెపుతూ వుంటారు. సంగీతం ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందాలంటే ఒకే ఒక సూత్రం ఉందంటారు పాణిగారు. ప్రతి వూళ్ళోని  దేవాలయంలో ప్రాతః కాలంలో నాదస్వర  వాయిద్యం వినిపించాలన్నది ఆయన కోరిక. నాదస్వరానికి మించింది మరోటి లేదన్నది ఆయన విశ్వాసం. ఉదయం పూట నాదస్వరం వింటే సంగీతంపై అభిమానం కలుగుతుందని,  అప్పుడే తెలుగునాట కర్నాటక సంగీతం వైభవంగా పరిఢవిల్లుతుందని అనేవారు.

శతాయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. కోటికి వొకరికి  కూడా లభ్యంకాని ఆ అదృష్టం పినాకపాణి గారికి భగవంతుడు ప్రసాదించాడు. దానితో పాటే మనందరికీ మరో వరం అనుగ్రహించాడు. అదేమిటంటే ఆయనకు సమకాలికులుగా కొన్నేళ్ళు మనగలిగిన మహద్భాగ్యం.



(03-08-2022)

 

 

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

 

చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.

"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.

తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట.

పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."

ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.

కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.

విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.

కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు.

" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు.

బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.

పొతే,వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.

హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.

మళ్ళీ అసలు సంగతికొస్తే-

'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.

'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.

విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.

NOTE: Courtesy Image Owner 



 

1, ఆగస్టు 2022, సోమవారం

సకాలంలో అందిందే సాయం

కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై వార్తలు ఊహాగానాలే!

నీ రేడియో, నా రేడియో, మన రేడియో, అందరి రేడియో




ఒకానొక కాలంలో రేడియో చిన్నక్కగా తన సుస్వరంతో లక్షలాదిమంది శ్రోతలను అలరించిన రతన్ ప్రసాద్ ఫోను చేశారు. జర్నలిస్ట్ డైరీ ఫేం సతీష్ బాబు రెడియోపై రూపొందించిన వీడియో చూసారట. అందులో తన గురించిన ప్రస్తావన వుందని మురిసిపోతూ చెప్పారు. ప్రస్తుతం ఆవిడ ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. సతీష్ కు థాంక్స్ చెప్పు బాబూ అని కోరారు.
“మేమెవ్వరం రేడియోలో ఉద్యోగం అనుకుని చేయలేదు. కళాకారులకి కావాల్సింది కాసింత ప్రశంశ. అది మంచి టానిక్కులా పనిచేస్తుంది” అని అంటూ కొన్నేళ్ళ క్రితం సంఘటనను గుర్తుచేసుకున్నారు.
రేడియో న్యూస్ రీడర్ డి. వెంకట్రామయ్య గారు ఆకాశవాణిలో చిరకాలం పనిచేసిన వారితో 2018 ఏప్రిల్ లో హైదరాబాదులో ఒక ఇష్టాగోష్టి విందు సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికి కొద్ది రోజుల క్రితం రతన్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ‘నువ్వు నమ్మవు కానీ బాబూ నేను చావు ముఖంలో అడుగు పెట్టి మళ్ళీ బయటకు వచ్చాను. మా పిల్లలు ఆ మీటింగుకు ఇప్పుడు వెళ్లకపొతే ఏం’ అంటూ అభ్యంతర పెట్టారు. నా పోరు పడలేక తీసుకువచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన నన్ను చూస్తూనే నువ్వొక మాట అన్నావు, ‘ఏమండీ రతన్ ప్రసాద్ గారూ, మీ స్వర యవ్వన రహస్యం ఏమిటో చెబుదురూ’ అని. నిజం చెప్పొద్దూ! నేను తొమ్మిది పదులు నిండి కూడా ఇలా మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు నువ్వన్న ఆ ఒక్క మాటే కారణం. అది మంచి టానిక్కులా పనిచేసింది. అంతకుముందు అనారోగ్యంతో చాలా అవస్థలు పడ్డాను. కానీ ఆరోజు నుంచి నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. మా పిల్లలతో ఎప్పుడూ అంటుంటాను, శ్రీనివాసరావు ఆ ఒక్క మాటతో నాకు పునర్జన్మ ఇచ్చాడు అని. ఈరోజు నీ పోస్టు చూసి ఫోన్ చేయాలనిపించింది. సతీష్ కు కూడా చెప్పు. ఈ వయస్సులోవున్న మాలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని ప్రోగ్రాం లో చేర్చినందుకు. వుంటాను నాయనా! ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆవిడను అడిగానని చెప్పు అనడానికి నాకు నోట మాట రావడం లేదు. పాపం చిన్న వయసులోనే పోయింది. ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడేది. ప్రసాద్ గారు పోయిన తర్వాత నాకూ ఒంటరితనంలో బాధ ఏమిటో తెలుస్తోంది”
ఆవిడ అలా మాట్లాడుతూనే వున్నారు. నా ఆలోచనలో నేను వున్నాను.
ఒక మంచి మాటలో ఇంతటి శక్తి ఉందా!

కింది ఫోటో:

(2018 లో రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ గారితో)





31, జులై 2022, ఆదివారం

ఇచ్చుటలో వున్న హాయీ! – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Prabha on 31-07-2022, SUNDAY today)

 

ఇచ్చుటలో ఎంతో హాయి వుందని బాపూ రమణలు తమ సినిమాల ద్వారా  ఎన్నోసార్లు చెప్పారు. 

ఆ ఇవ్వడానికి కూడా ఓ తరీఖా వుందంటున్నారు, ఇవ్వడం తెలిసినవాళ్ళు. 

అపాత్రదానం చేయకూడదు అనేది అలాంటివాళ్ళు చెప్పే గోల్డెన్ రూల్.  ఏది ఇవ్వాలన్నా కొన్ని ప్రశ్నలకు ముందు జవాబు వెతుక్కున్న తర్వాతే దానాలు, ధర్మాలు వగైరా వగైరా చేయాలనేది వాళ్ళమాట.

ఆ ప్రశ్నలు ఏమిటంటే:

ఎంత ఇవ్వాలి ? ఎప్పుడు ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? 

మరో చివరాఖరి  ప్రశ్న మరోటి వుంది. అయితే, ముందు ఈ నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్న తర్వాత ఆ చిట్ట చివరి ప్రశ్న విషయం  చివర్లో చెప్పుకుందాం.

మొదటి ప్రశ్న ఎప్పుడు ఇవ్వాలి?

పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు ఓ రోజు జూదమాడుతూ ఆనందిస్తున్న వేళ, ఓ భిక్షకుడు వచ్చి ధర్మం చేయమని కోరతాడు. ధర్మరాజు తన ధ్యాసలో వుండి, ‘చేయి ఖాళీ లేదు మర్నాడు రమ్మంటాడు. ఆ పక్కనే కూర్చుని గదకు మెరుగులు దిద్దుకుంటున్న సోదరుడు భీమసేనుడు, అన్న ధర్మజుడు నుడివిన మాటవిని ఎంతో సంతోషించాడట. ఎందుకటా!

ఎందుకంటే, వాక్శుద్ధి కలిగిన  ధర్మరాజు తన తొందరలో వుండి ఆ భిక్షకుడిని మరునాడు రమ్మని చెప్పాడంటే మరుసటి రోజువరకు అగ్రజుడు బతికే వుంటాడని  ఆ కండల వీరుడు సంబరపడ్డాడట. 

అయితే, ఈ క్షణంవరకు  ప్రాణాలతో వున్న మనిషి మరునిమిషం దాకా జీవించివుంటాడో లేదో తెలియని  అశాశ్వతమైన బతుకులు మానవులవి. అలాటిది తక్షణం చేయదలచుకున్న దానాన్ని మరో క్షణం వరకు వాయిదా వేయడం మంచిది కాదన్న పెద్దనీతి ఈ చిన్ని కధలో వుంది.

ఒకరికి ఇవ్వడం,  అది దానం అనండి, మరోటి అనండి అది ఏమయినా సరే వాయిదా వేస్తే క్షణభంగుర జీవితంలో అది నెరవేరే  వీలుండక పోవచ్చు కూడా. అందుకే ఒకరికి ఏదయినా ఇవ్వాలన్న ఆలోచన కలగగానే దాన్ని తక్షణమే ఆచరణలో పెట్టడం మంచిది.

ఇక ఎంత ఇవ్వాలి అనేది రెండో ప్రశ్న.

చరిత్రలో ఒక సంఘటన చెప్పుకుందాం.

రాణా ప్రతాప్ మహా యోధుడు. కానీ మొఘల్ చక్రవర్తులతో చేసిన ఒక యుద్ధంలో దారుణ పరాజయం పాలవుతాడు.  ఒక్క ప్రాణాలు తప్ప సర్వస్వం కోల్పోతాడు. సైన్యం తుడిచి పెట్టుకు పోతుంది. రాజ్యం చేజారి పోతుంది. ఈ పరిస్థితుల్లో   అడవుల్లో ఒంటరిగా సంచరిస్తూ విచారిస్తుంటాడు. ఈ దశలో  రాణా ప్రతాప్ కు స్నేహితుడు, ఒకప్పటి మంత్రి అయిన భామాషా ఆదుకుంటాడు.  తన సర్వ సంపదలను ఆయన అధీనంలో వుంచుతాడు. మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని తిరిగి  యుద్ధానికి సిద్ధం కాగల ధనసాయం చేస్తాడు. ఈ విషయంలో ఇంతా అంతా అని చూడకుండా భామషా చేసిన సాయంతో రాణా ప్రతాప్ తెప్పరిల్లుకుంటాడు. తిరిగి పోరాటం చేసి పోగొట్టుకున్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. 

ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇవ్వగలిగినంత పూర్తిగా ఇవ్వాలి. అప్పుడే ఇచ్చిన దానివల్ల ప్రయోజనం వుంటుంది.  

ఇవ్వాలి సరే! ఏమి ఇవ్వాలి అనేది మరో ప్రశ్న.

ఇవ్వడం అంటే అర్ధం డబ్బు ఒక్కటే కాదు. ఇతరులని సంతోషపెట్టగలిగేది ఏమి ఇచ్చినా మంచిదే.  పువ్వుతో సంతోషపెట్ట వచ్చు, చిరునవ్వుతో కూడా ఇతరులను ఆనందపెట్టవచ్చు. వారి ముక్కూ మొహం మీకు తెలియకపోవచ్చు. కానీ అలాంటి వ్యక్తి వైపు ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వు నవ్వండి. అతడు  మిమ్మల్ని కొన్ని రోజులపాటు గుర్తుపెట్టుకుంటాడు.

పువ్వు ఇస్తారా! చిరునవ్వు ఇస్తారా! అది మీ ఇష్టం. కాకపోతే ఇచ్చేది మనసారా ఇవ్వండి. మనస్పూర్తిగా ఇవ్వండి.  బదులు కోరకుండా ఇవ్వండి. ఇది చాలా చాలా ముఖ్యం.    

 

‘నదుల్లో నీళ్ళు పుష్కలంగా వుంటాయి. కానీ నది దాహం వేసినప్పుడు తనలో పారే నీళ్ళను ఎప్పుడూ తాగదు. అలాగే చెట్టుకు యెంత ఆకలేసినా తనకు కాసిన పళ్ళను తినదు. అంటే ఏమిటి. ఏదయినా ఇతరులకి ఇవ్వడం అన్నదే ప్రకృతి ధర్మం. 

ఇక ఎలా ఇవ్వాలి అనేది ఇంకో ప్రశ్న.

దీనికి జవాబు చాలా సింపుల్. మీరు ఇచ్చేదానితో అతడు సిగ్గుపడకూడదు. అలాగే  ఇస్తున్నాను కదా అని మీరు గర్వపడకూడదు. 

సరే! దానమో, ధర్మమూ, చేయంగల సాయమూ చేసేస్తారు. అప్పుడు మీ ఆలోచనలు ఎలా వుండాలి? అచ్చు మన పురాణ కధల్లోని  ఏకలవ్యుడి తీరుగా వుండాలి. 

గురువు ద్రోణుడి కోరిక మేరకు అతడు ఏమాత్రం సంకోచించకుండా తన కుడి చేతి బొటన వేలిని కోసి గురుదక్షిణగా సమర్పిస్తాడు. ఈ పనిచేసినందుకు అతడు ఎప్పుడూ విచారించలేదు. అయితే ప్రక్షిప్తమూ ఏమో తెలియదు కానీ చాలామందికి తెలియని విషయం ఒకటి చెబుతారు. అలా ముందూ వెనకా ఆలోచించకుండా బొటన వేలు కోసి ఇవ్వకుండా బాగుండేదని అతడు విచారించిన సన్నివేశం ఒకటి వుందని అంటారు.

జీవితం చరమ దశలో  ఏకలవ్యుడు ఒకే ఒకసారి తానుచేసిన పనికి విచారిస్తాడుట అది ఎప్పుడు?

ఎందుకోసం? 

అశ్వద్ధామ హతః అని ధర్మజుడితో చెప్పించి, ఆ మాట నిజమే అని నమ్మిన ద్రోణాచార్యుడు విల్లంబులు పారేసి కొడుకు మరణించాడు అని దుఃఖిస్తున్న సమయంలో పాండవులు  ఆయనని వధించిన తీరు ఏకలవ్యుడికి సుతారమూ నచ్చదు.  అప్పుడు ఇలా  అనుకుంటాడుట.

‘ఆరోజు గురుదక్షిణగా నా కుడి చేతి బొటన వేలు త్యాగం చేసి పొరబాటు చేశాను. అలా చేయని పక్షంలో,  పాండవులు ఎవరు కూడా తన గురుదేవుడిని చంపే సాహసానికి పూనుకుని వుండేవారు కాదు, నా గురువుని నేను కాపాడుకోగలిగేవాడిని’

పొతే ఇంతవరకు చెప్పంది, అతి ముఖ్యమైనది అయిన చివరి ప్రశ్న. 

మన వారసులకు ఏమి ఇచ్చి మనం ఈ లోకం నుంచి సెలవు తీసుకోవాలి అనేది ఆ ప్రశ్న.

ప్రపంచం మొత్తంలో  అతి పెద్ద సంపన్నుడు, అతి గొప్ప దాన కర్ణ్డుడు అయిన వారెన్ బఫెట్ ఈ ప్రశ్నకు ఇలా  జవాబు చెప్పాడు.

“మీ సంతానం ఏమి చేద్దామని అనుకున్నా సరే, అందుకు సరిపోయేంత సొమ్ము, సంపద వారికి మారుమాట్లాడకుండా ఇచ్చేయండి. అయితే, ఏమి చేయకుండా ఉంటాము అని వారంటే మాత్రం వారికి ఏమీ ఇవ్వకండి”

నిజానికి ఇవ్వడం అనేది ఓ కళ.

సంత్ కబీర్ చెప్పిన మాటలు ఈ వ్యాసానికి సరయిన ముగింపు అనుకుంటున్నాను.

‘మనం ప్రయాణిస్తున్న పడవలో నీళ్ళు నిండినప్పుడు ఏమి చేస్తాము? రెండు చేతులతో ఆ నీళ్ళు తోడి బయట పోస్తాము. అలాగే మన ఇల్లు సమస్త భోగభాగ్యాలతో, సిరి సంపదలతో  నిండిపోయినప్పుడు కూడా అదే పని చేయాలి”



(31-07-2022)

30, జులై 2022, శనివారం

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

 ( ఇంగ్లీష్ తేదీల ప్రకారం ఈరోజు మా అమ్మగారి పుణ్య తిధి)


“ మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907 నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
“ మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
“అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.
“కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన పూర్ణ జీవితం గడిపింది.
“1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది. ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది. చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది. మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.
“మూడో రోజు ఉదయం, అస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. చిన్న అల్లుడు, భారతి అక్కయ్య మొగుడు తుర్లపాటి పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది. అమ్మ అపర కర్మలు యావత్తు సమీప బంధు జన సమక్షంలో కాశీలో జరగడం ఓ విశేషం ”

కింది ఫోటో:  1987లో  నేను మాస్కో వెళ్లేముందు మా అమ్మగారు జీవించి వున్నప్పుడు కొందరు కుటుంబ సభ్యులతో తీసిన ఫోటో