27, మే 2022, శుక్రవారం

జవహర్లాల్ నెహ్రూ, కొన్ని జ్ఞాపకాలు

 

ఈరోజు భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది.

ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెహ్రూ మరణించిన వార్త రేడియోలో విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా తక్కువ మంది ఆ రాత్రి భోజనాలు చేశారు. ఇంటిమనిషిని పోగొట్టుకున్న విషాదం వారిలో కానవచ్చింది.

మన సారధి, మన సచివుడు మన జవహరు మనకిక లేడంటూ ఆ మరునాడు ఆంధ్రప్రభ మొదటి పుటలో ఎనిమిది కాలాలతో పతాక శీర్షిక పెట్టింది.

నెహ్రూ గురించిన అనేక జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా వున్నాయి.

ఒకసారి బెజవాడలో ప్రధానమంత్రి మీటింగు జరిగింది. చుట్టుపక్కల నుంచే కాదు, ఇరుగు పొరుగు జిల్లాలనుంచి సొంత ఖర్చులతో రైళ్లల్లో, బస్సుల్లో వెళ్ళిన వాళ్ళలో నేనూ వున్నాను. ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ, ప్రజలు అభిమాన పురస్సరంగా ఆయనపై విసురుతున్న పూలదండలను నెహ్రూ ఒడుపుగా పట్టుకుని తిరిగి జనాలమీదకే విసరడం బాగా గుర్తుండిపోయింది.

నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో ఆయన యెంత నిరాడంబరంగా వుండేవారో తెలుసుకోవడానికి ఒక ఫోటో చూస్తే తెలిసిపోతుంది. నెహ్రూ అధికార నివాసంలో జరిగిన విలేకరుల గోష్టికి సంబంధించిన ఫోటో ఇది. అ గదిలో కూర్చోవడానికి వీల్లేక నిలబడి, సోఫా అంచుల మీద కూలబడి విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఎదురుగా ఒక సోఫాలో తలపట్టుకు కూర్చున్నది నెహ్రూ అంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. తలపై గాంధీ టోపీ లేకుండా జవహర్లాల్ ని చప్పున గుర్తుపట్టడం తేలిక కాదు. (అదేం చిత్రమో గాంధీ ఎప్పుడూ ఆలాంటి టోపీ పెట్టుకున్న సందర్భం లేదు, అయినా దానికి గాంధీ టోపీ అనిపేరు)

నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.

1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.

నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది ఎవరో కాదు, జవహర్ లాల్ నెహ్రూనే అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు రాస్తున్నారని అనుకునేవారు.

అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.

అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.

దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.

దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపధ్యం వుంది.

1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.

మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.

మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే –

'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'

ఇదీ మా బావగారు రామచంద్రరావు గారు చెప్పిన మాట.

1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీ ని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఒకసారి గూగుల్ లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఎన్టీయార్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీయార్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం.

ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళ లాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు, ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.

నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి.

దేశ ప్రగతికి మన వంతు కృషి ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు.

నెహ్రూ ను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్సనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.

చివరిగా ఒక మాట.

గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.

(కింది ఫోటో: నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తల పట్టుకు కూర్చున్న దృశ్యం)




మహానాడు - భండారు శ్రీనివాసరావు

 తెలుగుదేశం పార్టీ వార్షిక సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ మహానాడు అని తొలుత నామకరణం చేసినప్పుడు అందరు ఇదెక్కడి పేరు అని ఆశ్చర్యపోయారు. కానీ తదాదిగా మహానాడు అనేది తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందింది.

మాస్కోలో వున్న అయిదేళ్లు మినహాయిస్తే తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అన్ని మహానాడు కార్యక్రమాలకు నేను రేడియో విలేకరిగా హాజరయ్యాను.

చంద్రబాబునాయుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓసారి తెలుగుదేశం మహానాడు కాకినాడలో జరిగింది. హైదరాబాదు నుంచి విలేకరులను తీసుకువెళ్ళారు. ప్రారంభానికి ముందు రోజు అక్కడికి చేరుకున్నాం. ప్రైవేటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రయోగాత్మక దశలో వున్నాయి. టీవీ 9 వారికి ఓ ఆలోచన కలిగింది. ప్రారంభోత్సవానికి ముందు ఎవరయినా జర్నలిస్టుతో మాట్లాడించాలని అనుకున్నారు. పొద్దున్నే(మహానాడు జరిగే ప్రదేశం దగ్గరికి) పోదాం రెడీగా ఉండమని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లాం. మహానాడు వెన్యూ దగ్గర తిరుగుతూ నేనూ రజనీకాంత్ మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏవో అడుగుతున్నారు. నేను ఏదో చెబుతున్నాను.

ప్రతి రాజకీయ పార్టీ తమ కేడర్ ను ఉత్సాహ పరచడం కోసం ఇలాంటి తంతులు నిర్వహిస్తుంటారు. ఏదో మొక్కుబడి తీర్మానాలు ప్రవేశపెడతారు. ఏదో చర్చ జరిగిందని అనిపిస్తారు. తర్వాత ఆ తీర్మానాలు ఏమయ్యాయో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే నాయకులకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. గ్రామ స్థాయి కార్యకర్తల్ని పిలిచి మాట్లాడితే, హైదరాబాదులో కూర్చుని తెలుసుకోలేని విషయాలు వాళ్లకు తెలుస్తాయి. కానీ అంత తీరిక వాళ్ళకి వుండదు. అందుకే ఇదంతా ఒక తంతు అనేది. టీడీపీ అనే కాదు ఏ పార్టీ సమావేశాలు అయినా ఇదే తంతు”

ఏదో ఇలా చెప్పుకుపోతున్నాను. కాసేపు అలా తిరిగి మళ్ళీ హోటల్ కు వచ్చాము.

బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మంత్రి యనమల రామకృష్ణుడు కనిపించారు. ఆయన మోహంలో ఎప్పుడూ కనిపించే ప్రసన్నత కానరాలేదు. ప్లేటు చేతికి ఇస్తూ అన్నారు నా మొహం లోకి చూస్తూ.

అంతే లెండి! ఇంతింత శ్రమ పడి చేసినదంతా మీకు ఓ తంతులాగా కనిపిస్తోంది అన్నమాట”

ముందు నాకు అర్ధం కాలేదు ఆయన అలా ఎందుకు అంటున్నారో.

తర్వాత తెలిసింది, అంతకు ముందు నేను మాట్లాడినదంతా ఆ టీవీలో లైవ్ లో చూపించారట!

26, మే 2022, గురువారం

ఊహాగానమే అనుకోండి, ఉబుసుపోకకి పాడుకుందాం.

 ఫర్ సపోజ్ గుర్రం ఎగరావచ్చు అనే థియరీ ప్రకారం, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మితృలు వుండరు అనే రాజకీయుల పాచిపోయిన మరో సిద్ధాంతం ప్రకారం, రెండేళ్ల తర్వాత ఏపీలో జరగబోయే ఎన్నికల సమయానికి రాజకీయ ముఖచిత్రం ఈ కింది విధంగా మారింది అనుకోండి.

బీజేపీ కూటమిలో వైసీపీ చేరడం, లేదా వైసీపీకి  బీజేపీ అగ్రనాయకత్వం బేషరతు మద్దతు తెలపడం, బీజేపీ  టీడీపీ, జనసేన ఒక జట్టుగా, లేదా టీడీపీ జనసేన ఒక  కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాలని ఆయా పార్టీల అధిష్టానాలు  నిర్ణయించాయి అనుకుందాం. (ఊహాగానమే కదా! ఏమైనా అనుకోవచ్చు) ఇప్పుడు బుల్లి తెరలపై చొక్కాలు చించుకుంటున్న అధికార ప్రతినిధులు అందరూ   అప్పుడు మంత్రం వేసినట్టు నాలుకలు మడతేసి మాట్లాడుతారా!

అయ్యోరామా! మరిచేపోయా! నరంలేని నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది కదా! అనుమానం ఎందుకు! మడత తథ్యం. పెద్ద నాయకులకి లేని శషభిషలు కిందివారికి ఎందుకు?

గతంలో చూసిన సినిమాలే కదా!  

(26-05-2022)

25, మే 2022, బుధవారం

ఏఎన్నారా! ఎన్టీఆరా – భండారు శ్రీనివాసరావు


ఇది ముప్పయ్యేళ్ల పై మాటే.
ఢిల్లీ నుంచో, తన నియోజకవర్గం నుంచో ఏదో సమాచారం రేడియో వార్తలకోసం ఫోనులో చెప్పి నేను రాసుకున్న తర్వాత అడిగేవారు ఏఎన్నారా! ఎన్టీఆరా అని, ఒకప్పటి పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మల్లు రవి. ఎన్టీఆరే అని జవాబు చెప్పేవాడిని నవ్వుతూ. ‘అయితే సాయంత్రం రేడియో వింటాను’ అని ఫోను పెట్టేసేవారు ఆయన కూడా నవ్వుతూనే.
ఏఎన్నార్ అంటే వార్త రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎన్టీఆర్ అంటే వచ్చి తీరుతుందని ఒక కోడ్ భాష అన్నమాట.
మా ఇద్దరికీ నవ్వు తెప్పించిన ఈ ఇద్దరు అగ్ర హీరోల ప్రస్తావనకు ఒక నేపధ్యం వుంది.
ఇది కూడా ఆయన విన్న కధే!
మల్లు రవికి ఎవరైనా చెప్పారో లేక ఆయన కూడా విన్న మాటో తెలియదు కానీ ఆయన మాటల సందర్భంలో చెప్పిన విషయమే ఇది.
ఏఎన్నార్ దగ్గరికి ఎవరైనా నిర్మాత వెళ్లి కధ చెబితే ఆ కధతో సినిమా తీస్తే సూపర్ హిట్టు అయ్యే అవకాశాలు ఎంత బాగా వున్నాయో ఆయన పూసగుచ్చినట్టు చెప్పేవారట. నిర్మాత సంతోష పడేలోగా ఆయనే మళ్ళీ ఆ కధలో ఎన్నెన్ని లోపాలు వున్నాయో వాటిని కూడా విశదంగా వివరించి, ఆ కధని సినిమా తీస్తే నిర్మాత నెత్తిన చెంగే మిగులుతుందని అనేవారట. ఇక ఎన్టీఆర్ దగ్గర కధే వేరు. ‘సినిమా చేస్తున్నాను, చెయ్యను’ అనే రెండే రెండు మాటలతో ఆ నిర్మాత కధకు శుభం కార్డు వేయడమో లేక ఇక మీ పని చూసుకోండి అని సమయం వృధా చేయకపోవడమో జరిగేదట. దీన్నే ఆయన బాబుకు, వైఎస్ కు వాళ్ళు ముఖ్యమంత్రులుగా వున్నప్పుడు అన్వయించి చెప్పేవారు.
బాబుగారి దగ్గరకు ఎవరైనా పనిమీద వెడితే, చివరికి ఆయన ఆ పనిచేసినా, చివరివరకు పని అవుతుందో లేదో అనే అనుమానం ఉండేదట. అదే వై.ఎస్ వద్ద నిమిషాల్లో ఆ పని అయ్యేది కానిదీ తెలిసిపోయేదట.
ఈ ‘ఏఎన్నారా! ఎన్టీఆరా’ అనే కోడ్ రేడియో వార్తల వరకు పాకింది. వార్త వస్తుందా రాదా అనే విషయంలో ‘ఏఎన్నార్’ అంటే రావచ్చు, రాకపోవచ్చు, ఎన్టీఆర్ అంటే వచ్చి తీరుతుంది.
ఇదీ అప్పట్లో మా ఇద్దరి నడుమా నడిచిన కోడ్ భాష.

24, మే 2022, మంగళవారం

టీవీ ఛానళ్ళు, ప్రసారాల తీరుతెన్నులు – భండారు శ్రీనివాసరావు

 గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ లు ఏకచత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న కాలంలో, ప్రముఖ దినపత్రికల్లో వారానికోసారి వాటి కార్యక్రమాల మంచి చెడులను విశ్లేషిస్తూ చక్కటి వ్యాసాలు వచ్చేవి. కార్యక్రమాల మెరుగుదలకు తోడ్పడే మంచి సూచనలు అప్పుడప్పుడు వాటిల్లో తొంగిచూస్తుండేవి. కాకపోతే, వాటి నిర్వహణ యావత్తూ ప్రభుత్వం కనుసన్నల్లో జరిగేది కనుక ఆ సూచనలను ఏమాత్రం ఖాతరు చేసాయన్నది చరిత్రకే ఎరుక. ఈలోగా ప్రభుత్వ మీడియా సంస్థలకు తమ పనిపాటల్లో ఓమేరకు స్వేచ్చ (ఫంక్షనల్ ఫ్రీడం) కల్పించే క్రమంలో వాటిని ‘ప్రసార భారతి’ గొడుగు కిందకు తేవడం జరిగింది. కానీ ఆ సరికే దేశంలో ప్రైవేటు రంగంలో టీవీ ఛానళ్ళ శకం మొదలవడంతో, వాటికి వున్న వెసులుబాట్లు ప్రసారభారతికి కొరవడడంతో, ఏ లక్ష్యం కోసం రేడియో, దూరదర్సన్ లకు స్వేచ్చ కల్పించారో ఆ ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరకుండా పోయింది. కొత్త ఛానళ్ళ ధగధగల ముందు పాత ఛానల్ వెలవెల బోయిన మాట వాస్తవం. ఈ పోటాపోటీ కాటాకుస్తీ పోటీల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దూరదర్సన్ ప్రసారాలు, ప్రస్తుతం వున్నాయంటే వున్నాయన్న చందంగా కొనసాగుతున్న భావన ప్రజల్లో ప్రబలుతోంది. కొత్తొక వింత మాదిరిగా సరికొత్త ఛానళ్ళు తామర తంపరగా పుట్టుకొచ్చి కొంగొత్త కార్యక్రమాలకు పురుడు పోస్తూ వీక్షకులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటూ వుండడమే, ప్రైవేటు టీవీల రాకను మనసారా కోరుకున్న వారిని కూడా మధన పడేట్టు చేస్తోంది.

స్పర్ధ వల్ల విద్య పెరుగుతుందని చెప్పేవారు. అలాగే పోటీవల్ల నాణ్యత మెరుగు పడుతుందని కూడా అంటారు. సాంకేతికంగా నాణ్యత పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ కార్యక్రమాలలో ఆ విషయం ప్రస్పుటమవుతున్నదా అంటే చప్పున అవునని చెప్పలేని స్తితి. దీనికి ఆయా టీవీల యాజమాన్యాలను కూడా తప్పుపట్టలేని పరిస్తితి. వాణిజ్యపరంగా చూస్తే, టీవీల నిర్వహణ కూడా అలవికాని భారంగా పరిణమిస్తున్న రోజులివి. తియ్యనీటికి చేపలు ఎగబడే చందంగా ఈ రంగంలో ఏదో వుందన్న ఆశతో జర్నలిజంతో సంబంధం లేని పెట్టుబడుదారులు ఇందులో చేరడంతో విలువలకంటే పెట్టుబడుల పరిరక్షణ ప్రధానంగా మారిపోయింది. దీనికి తోడు రాజకీయాల రంగూ, రుచీ, వాసనా  కాఫీ డికాక్షన్ మాదిరిగా దిగిపోయి పరిస్థితులను మరింత దిగజార్చాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒకే టీవీ, ఇప్పుడు ప్రతి పార్టీకి ఒకటో రెండో టీవీలు. (సొంతం కాకున్నా, సొంతంకంటే ఎక్కువగా మద్దతు ఇచ్చేవి)

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వీటికి తోడు సోషల్ మీడియాలో ముసుగులు కప్పుకున్న తాలిబాన్ల వంటి కలం వీరులు, గళం ధీరులు.   

ఏదైనా మార్పు మంచిదే. మార్పును ఆహ్వానించాల్సిందే. ఈ క్రమంలో కొన్ని అగచాట్లు తప్పవు. మంచి చెడుల నడుమ ఘర్షణ తప్పదు. మురుగు నీరు సర్దుకుని, తేటనీరు బయట పడడానికి కొంత సమయం అవసరం. ఐతే, ఈ వ్యవధానం మరీ పెరుగుతూ పొతే, ఆశించిన ఫలితాలు అందడం కూడా ఆలస్యం అవుతుంది. మంచి మరుగునే వుండిపోయి, చెడు చెంతనే వుంటుంది.

ఆశాజీవులు కూడా ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.

కాకపోతే, ఈమధ్య వివిధ టీవీ ఛానళ్లలో వస్తున్న కార్యక్రమాలపై అనేక సోషల్ నెట్ వర్కుల్లో కానవస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తుంటే, పూర్వం దూరదర్శన్ కూడా ఇంతటి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోలేదేమో అని అనిపిస్తోంది. దూరదర్శన్ కార్యక్రమాలు గురించి జంధ్యాల మార్కు సినిమాల్లో చక్కటి హాస్య స్పోరక సన్నివేశాలు అనేకం వచ్చాయి. కానీ, ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించివున్న ప్రైవేటు న్యూస్ ఛానళ్ళకు మాత్రం విమర్శకులు ఆమాత్రం మినహాయింపు (అంటే హాస్య ధోరణిలో ఎండగట్టడం) కూడా ఇవ్వడం లేదు, పైగా కడిగి గాలించేస్తున్నారు. వాటికి రాజకీయ రంగులను పులుముతున్నారు. ఈ ఛానల్ ఇలాగే చెబుతుందిలే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన మా బోంట్లకు ఇది మింగుడు పడడం లేదు. అయినా ఇది కాదనలేని నిజం.

నేను ఖమ్మం కాలేజీలో చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్ ఒకరు వుండేవారు. ఆయన రాగానే గోలగోలగా వున్న క్లాసును అదుపుచేయడానికి డష్టర్ తో బల్ల మీద చప్పుడు చేస్తూ, ‘లెస్ నాయిస్ చిల్డ్రన్, లెస్ నాయిస్ ప్లీజ్ ’ అని పదేపదే అనేవారు. ‘పిల్లలు ఎలాగూ గోల చెయ్యకమానరు, కాబట్టి ఆ చేసేదేదో కాస్త తక్కువ చేయండ’న్నది దానికి టీకా తాత్పర్యం.

ఇప్పుడున్న పోటా పోటీ కాటా కుస్తీ ప్రపంచంలో పూర్తిగా ‘మడి’ కట్టుకుని ఛానళ్ళు నిర్వహించడం సాధ్యం కాని మాట నిజమే. కాకపోతేరేటింగులను’ ఓపక్క కనిపెడుతూనే, జనం నాడినిపట్టుకునే కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి కూడా ఉపాయాలు ఉండకపోవు.

వాటిని గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో కాస్త ఆలోచించండి!

22, మే 2022, ఆదివారం

ఉరి శిక్షలు ఎన్కౌంటర్లు


ఒక చమత్కారం గురించి చెప్పుకుందాం!
ఒకడు ఒక మైనర్ బాలికను పాశవికంగా బలాత్కరించి, అనుభవించి, శరీరాన్ని చిత్ర హింసలకు గురిచేసి, సాక్ష్యాలు దొరక్కుండా ఆమెపై కిరోసిన్ పోసి తగులబెట్టి ఆనవాళ్ళు లేకుండా చేసి పారిపోయాడు.
పోలీసులు కష్టపడి రుజువులు సంపాదించి ముద్దాయిని పట్టుకుని న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. బాలిక హత్యోదంతాన్ని టీవీల్లో చూసి రగిలిపోయిన సామాన్య జనం అతడికి మరణశిక్షే సరైన శిక్ష అని గగ్గోలు పెట్టారు. న్యాయమూర్తి కేసు పూర్వాపరాలను పరిశీలించి ముద్దాయికి ఉరి శిక్ష విధించారు. కాకపోతే ఇదంతా తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టింది. మధ్యలో మానవ హక్కుల సంఘాల వాళ్ళు, ఫీజు రాకపోయినా ఆ రాబడికి మించిన పేరు ప్రతిష్టలు సంచలన కేసులు చేసి గడించాలనే న్యాయవాదులు కొందరు రంగప్రవేశం చేసి, కేసును పై కోర్ర్టు, ఆపై కోర్టు దాకా తీసుకువెళ్లి ముద్దాయి నిర్దోషి అని నిరూపించి అతడి విడుదలకు సహకరించారు. కామాంధుడి చేతికి చిక్కి బలయిపోతూ కాపాడండి కాపాడండి అని ఆ బాలిక చేసిన రోదనలకు ఏళ్ళ తర్వాత లభించిన న్యాయం అది.
మరొకడు అలాగే ఓ మైనర్ బాలికను రాక్షసంగా మానభంగం చేసి అమానుషంగా హత్య చేసి శరీరాన్ని తగులబెట్టి సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్తపడి పారిపోయాడు. రంగప్రవేశం చేసిన పోలీసులు, ముద్దాయిని పట్టుకుని, ఈసారి తమదైన శైలిలో అతడ్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ప్రజలు ఆ పోలీసులకు బ్రహ్మరథం పట్టారు. కోర్టులు తప్పుపట్టాయి. ఆ పని మీది కాదు అన్నాయి.
న్యాయస్థానాలు మన రాజ్యాంగ వ్యవస్థలో ఓ భాగం. అలాగే పోలీసులు మరో వ్యవస్థలో మరో భాగం.
కోర్టులు ఉరిశిక్షలు విధించగలవు. పోలీసులు అలా చేయలేరు.
చమత్కారం కాక దీన్ని యేమని అంటాం!
(22-05-2022)

సతీ నీలాంబరి – భండారు శ్రీనివాసరావు

 నీలాంబరితో ఏకాంబరం పెళ్లి పెళ్లున జరిగిపోయింది. మొదటి రాత్రే ఏకాంబరం భార్యతో చెప్పాడు.

'మనం ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. నా మీద నీకు కోపం వస్తే కేకలు వెయ్యి. కానీ అప్పుడు మనిద్దరం తప్ప మూడో వ్యక్తి వుండకూడదు. నేనూ అలాగే. మరొకరు వున్నప్పుడు నీ మీద నోరు పారేసుకోను. అండర్ స్టాండ్?'

'అండర్ స్టాండ్. అల్లాగే' అన్నది నీలాంబరం.

భార్య సహకారం చూసిన ఏకాంబరానికి ఆమె మీద ప్రేమ పూనకంలా తన్నుకు వచ్చింది.

'నువ్వుంటే నాకు ఈ లోకంతో పనిలేదు. ఎదురుగా ఎందరు వున్నా నా కంటికి నువ్వొక్కదానివే...' అంటూ గారాలు పోయాడు.

మర్నాడు కాఫీ తాగేటప్పుడు ఏదో విషయం మీద మాటా మాటా వచ్చి మొగుడ్ని అత్తామామల ముందే కడిగి పారేసింది నీలాంబరి. ఏకాంబరం బిత్తరపోయాడు. బిక్కచచ్చిపోయాడు.

ఆ రాత్రి వొంటరిగా వున్నప్పుడు అడిగాడు 'అందరిముందు ఎందుకు అలా వొంటి కాలి మీద లేచావు' అని.

నీలాంబరి గారాలు పోతూ చెప్పింది.

'ఎవరున్నారు అక్కడ? మీరే కదా అన్నారు, ఎదురుగా నేనుంటే ఇక ఎవరూ లేనట్టే అని'

ఏకాంబరం మరోసారి బిక్కచచ్చిపోయాడు