2, డిసెంబర్ 2021, గురువారం

అభిమానం అర్ణవమైతే – భండారు శ్రీనివాసరావు

 “సినిమా టిక్కెట్టు ధర తగ్గిస్తే ఏమిటి? బెనిఫిట్ షోలు ఎత్తేస్తే ఏమిటి? ఒక్కసారి పెద్దమొత్తం ఇలా ఖర్చు చేసేబదులు, మా హీరో సినిమా ఒకటికి పదిసార్లు, వీలయితే వరసగా పాతికసార్లు టిక్కెట్టు కొని చూస్తాం. అదీ మా అభిమానం” అంటున్నాడు ఓ హీరో అభిమాని ఓ టీవీ చర్చలో.

మంచిదే అనిపించింది, సినిమా సక్సెస్ కు రిపీటెడ్ ఆడియన్స్ ఓ గీటురాయి అని తలనెరిసిన సినీపండితుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మళ్ళీ పాతరోజుల్లో మాదిరిగా, ధియేటర్లు పూర్తిగా నిండుతుంటే,  శత దినోత్సవాలు, రజతోత్సవాలు జరిగే  స్వర్ణయుగం తిరిగి వస్తుందేమో!

అయితే ఇలా ఉద్రేకపడే ముందు, ఒక్కసారి ముంచుకు వస్తున్న మూడో వేవ్ గురించి కూడా ఆలోచించండి. మీ కుటుంబం గురించి కూడా ఆలోచించండి.

సినిమా అయినా, అభిమానం అయినా, ఏదైనా  ముందు మనం పదిలంగా వున్నప్పుడే కదా!

(చట్టబద్ధమైన సూచన: ఇది రాజకీయ పోస్టు కాదు. వినవచ్చని విషయంపై వ్యాఖ్య మాత్రమే)  

(02-12-2021) 

చంద్రహారం

 

టీవీల్లో చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు. చక్కటి పాత చిత్రాలు ఎన్నిసార్లు వేసినా చూడాలనే అనిపిస్తుంది. అలాంటి సినిమానే చంద్రహారం. మొదటిసారి విడుదల చేసినప్పుడు  పెద్దగా ఆడినట్టు లేదు.  ఇప్పుడు ఈ టీవీ సినిమా  ఛానల్ లో వస్తోంది. ఇది చూస్తున్నప్పుడు గతంలోని ఓ జ్ఞాపకం గుర్తుకు వచ్చింది.

మా వూరికి నాలుగు మైళ్ళ దూరంలో వున్న వత్సవాయిలో ఒక టూరింగు టాకీసు వుండేది. దాంట్లోకి చంద్రహారం సినిమా వచ్చినట్టు ఆ ఉదయం మా వూళ్ళో దండోరా వేసారు. దండోరా అంటే ఒక ఎడ్లబండికి రెండువైపులా సినిమా పోస్టర్లు తగిలించేవాళ్ళు. అందులో ఓ ముసలాయన కూర్చుని మైకులో సినిమా గురించి చెబుతుండేవాడు. బండిలోనుంచి కరపత్రాలు విసిరేస్తే అవి పట్టుకోవడానికి కుర్రవాళ్ళం నానా తంటాలు పడేవాళ్ళం. ఎన్టీఆర్ నటించిన అ సినిమా ఎల్లాగయినా చూడాలని మా అమ్మ వెంట పడ్డాం. మా  చిన్నతనంలోనే  నాన్న చనిపోవడంతో ఆమెకు మేమంటే ప్రాణం. కానీ ఆమెకు డబ్బు వ్యవహారాలు ఏమీ తెలవ్వు. అన్నీ మా బామ్మే చూసుకునేది. కాళ్ళు వత్తిందో, నడుం నెప్పికి అమృతాంజనం రాసిందో ఏం చేసిందో కాని మడిబీరువాలో దాచిపెట్టిన చిల్లర డబ్బుల్లోనుంచి మూడు పావలాలు బామ్మను  అడిగి తీసుకుని రెండు మా మూడో అన్నయ్య చేతిలో పెట్టింది. ఇంకో పావలా నాకిచ్చి సినిమా మధ్యలో ఏదైనా కొనుక్కోమని చెప్పింది. మాతోపాటు మరో నలుగురు సావాసగాళ్ళు రావడానికి తయారయ్యారు. పొలాలగట్ల మీద నడుచుకుంటూ వెడుతుంటే అక్కడక్కడ ఎండ్రకాయల బొరియలు కనబడేవి. మేము ఊరు పొలిమేరలకు చేరగానే సినిమాహాలు వాడు వేసే పాట మైకులో వినిపించింది. మొదటి ఆటకు సినిమా టిక్కెట్లు అమ్మడం మొదలు పెట్టడానికి ముందు ఊరంతా వినిపించేటట్టు పాటలు వేసేవాళ్ళు.

సరే! నేల క్లాసు పావలా టిక్కెట్టు కొనుక్కుని హాల్లోకి వెళ్ళాము. జనం బాగానే వున్నారు. మధ్యలో చోటుచూసుకుని కూర్చున్నాము. పైన డేరాకున్న చిల్లుల్లో నుంచి ఆకాశం కనబడుతోంది. కొనుక్కున్న కట్టె మిఠాయి తింటూ వుండగానే సినిమా మొదలయింది. ఫిలిమ్స్ డివిజన్ వారి చిత్రంలో నెహ్రూ గారు కనబడగానే హాలు మొత్తం కేరింతలు. రామారావు సినిమా అని ఎగబడి వెళ్ళాము కానీ, అసలు సినిమా మాకెవ్వరికీ అంత నచ్చలేదు.

తిరిగివచ్చేటప్పుడు చూడాలి, వెన్నెల వెలుతుర్లో కనిపించే ఎండ్రకాయ బొరియలు ఎంతో భయపెట్టాయి. వచ్చేటప్పుడే వెంట ఒక తాడు తెచ్చుకున్నాము, ఆరుగురం ఆ తాడు పట్టుకుని వరసగా నడవడానికి. ఎవ్వరూ తప్పిపోకుండా ఆ ఏర్పాటు. చిన్నవాడినని నన్ను మధ్యలో నడవమన్నారు. ఇంటికి చేరేవరకు లోపల బితుకుబితుకుమంటూనే వుంది.

అసలు చంద్రహారం కధ ఏమిటంటారా!

చిన్నప్పుడు సినిమా చూడడమే ముఖ్యం. సినిమా గురించికానీ, సినిమా కధ గురించి కానీ పట్టని వయసు.



'దడిగాడు వాన విదిచ’ – భండారు శ్రీనివాసరావు

 

సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది ‘రాంగున్నర రాంగు’ అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అనేది కూడా మా వాడి థియరీనే! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు.
కాకపోతే, ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు మా వూళ్ళో పార్ట్ టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు. వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన, వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది వూరి పోస్ట్ మాస్టరుగా తనకున్న కాపీరైట్‌ అని భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా సాగిస్తూ వుండేవాడు. అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ' ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?' అంటూ ఆరాలు తీసేవాడు. ఇలా చాన్నాళ్లు అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే ‘చదివినవాడు గాడిద’ అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం. కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.

Top of Form

Bottom of Form

 

1, డిసెంబర్ 2021, బుధవారం

యశస్వి

 

వయస్సులో పదేళ్లు చిన్నవాడు

యశస్సులో ఏడు జన్మలు పెద్దవాడు

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జీవన ప్రస్థానం

మహాప్రస్థానంలో ముగిసిపోయింది.

ఆయన మరణం భౌతికం ఆయన పాట అజరామరం



30, నవంబర్ 2021, మంగళవారం

పుణ్యం ఊరికే పోదు

 

జ్ఞాపకాల గొందుల్లో

మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అడపాదడపా కొంత పైకం మా వదినెగారి చేతికి ఇచ్చి మా అమ్మగారికి ఇమ్మనేవారు. మా కుటుంబంలో అటు ఏడుతరాలకు, ఇటు ఏడు తరాలకు వయసులో మా అమ్మే పెద్ద. చుట్టపక్కాలు, చిన్న వాళ్ళు ఇంటికి వచ్చి చూసి వెడుతూ కాళ్ళకు దణ్ణం పెట్టినప్పుడు వాళ్ళచేతిలో పదోపరకో డబ్బులు పెట్టడానికి ఈ ఏర్పాటు.

మా అన్నయ్యగారి ఆఖరి అమ్మాయి వాణి పెళ్ళిలో కన్యాదానం చేసే మహత్తర అవకాశాన్ని, నాకు ఆడపిల్లలు లేనందువల్ల, మా పెద్దన్నయ్య కల్పించారు. ఆ సందర్భంలోనే  మా అమ్మగారి సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయిదు రూపాయల కొత్తనోట్లను తెప్పించి వాటిని కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ, చిన్నలకు, పెద్దలకూ మా అమ్మగారి చేతుల మీదుగా ఇప్పించాడు.

మా అమ్మ గారి చివరి రోజులవరకు మా అన్నగారే ఆమెను కంటికి రెప్పలా కనిపెట్టుకు చూసుకున్నారు. చనిపోయినప్పుడు ఆమె ఉత్తర క్రియలు కాశీలో జరిపించాడు.

ఉమ్మడి రాష్ట్రంలో అయిదుగురు ముఖ్యమంత్రులకు సీపీఆర్వోగా, సమాచార శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా అనేక ఉన్నత ఉద్యోగాలు చేసి, సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన లేకుండా చివరికి పుట్టపర్తిలో మా వదిన గారెతో కలిసి ఓ చిన్న గదిలో జీవితం గడుపుతూ, నరసింహస్వామి తత్వాన్ని గురించి అనేక సంపుటాలతో కూడిన బృహత్ గ్రంధాన్ని రచించి, ఆధ్యాత్మిక వాతావరణంలో చివరి రోజులు గడిపాడు.      

ఈ పుణ్యం ఊరికే పోలేదు.

అనాయాసమరణం రూపంలో మా అన్నగారికి దక్కింది.

 




 

29, నవంబర్ 2021, సోమవారం

హమే తుమ్సే ప్యార్ కిత్ నా...... భండారు శ్రీనివాసరావు

  నా హిందీ అంతంత మాత్రం. హిందీ సినిమాలకు వెళ్ళినప్పుడు హాల్లో అందరూ పాప్ కార్న్ తింటుంటే నేను మాత్రం మా ఆవిడ మెదడు కొరుక్కుని తింటుండేవాడిని, ఆ హీరో ఏమన్నాడు? ఆ హీరోయిన్ ఎందుకలా ఏడుస్తోంది? అని అడ్డమైన ప్రశ్నలు వేస్తూ. ఈ హిందీ ప్రస్తావన దేనికంటే... మా పెద్దవాడు సందీప్ పెళ్ళికి రాంచీ నుంచి ఆడపెళ్లి వాళ్ళు తరలివచ్చారు. రవిగారు, విజయ శ్రీనగర్ కాలనీలో తాము కొనుక్కున్న కొత్తఫ్లాటును వాళ్లకి బసగా ఇచ్చారు. శ్రీ వాస్తవ్ గారు, ఆయన భార్య ఇందూ శ్రీ వాస్తవ్ వారి సమీప బంధువులు చాలామంది వచ్చారు. 1999 నవంబరు 29 అర్ధరాత్రి సందీప్ పెళ్లి. సత్యసాయి కళ్యాణ మండపంలో. ఆ రోజుల్లో హైదరాబాదులో ఆ మండపం కాసింత ఖరీదు వ్యవహారమైనా శ్రీ వాస్తవ్ దాన్ని ముచ్చటపడి ఎంపిక చేసుకున్నారు. ఈ పెళ్ళికి అరుణ, శేఖర రెడ్డి దంపతులు మూడు రోజులపాటు తమ ఖరీదైన కారును మా అధీనంలో ఉంచారు. అమీర్ పేటలోని శైలి అపార్ట్ మెంటు నుంచి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వరకు బారాత్ సాగింది. అదీ మాకు కొత్తే. సందీప్ స్నేహితులు పవన్, సుధీర్, సుధాకర్, రాజశేఖర్, కృష్ణ, శేషిరెడ్డి, కోటిరెడ్డి దారిపొడుగునా నృత్యాలు చేస్తూ మంచి ఉత్సాహం కలిగించారు. ఆరోజు ఉదయం కళ్యాణ మండపంలోనే ఉపనయనం. ఆ ఏసీ హాల్లో హోమం చేయడానికి నిబంధనలు అడ్డం వచ్చి, బయట కారిడార్లోనే ఆ కార్యక్రమం పూర్తిచేసాము. అదే ఇబ్బంది పెళ్ళికి కూడా ఎదురయింది. సాంప్రదాయ బద్ధంగా కన్యాదానం చేయాలనుకున్న శ్రీవాస్తవ్ దంపతులు లోపల రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుని బయట ఆవరణలో షామియానాలు వేయించి, కుర్చీలు తెప్పించి మరో పెళ్లి ఖర్చు మీద వేసుకున్నారు. బెజవాడ నుంచి ఈ పెళ్ళికి వచ్చిన హనుమంతరావు బావ పెళ్లి జరిగే వేదికకు దగ్గరలో కుర్చీ వేయించుకుని ఇటు దక్షిణాది పద్దతిలో, అటు ఉత్తరాది విధానంలో ఏక కాలంలో తెల్లవారుఝాము దాకా కొనసాగిన వివాహ క్రతువును ఆ సాంతం శ్రద్ధగా చూసారు. రాంచీ నుంచి వచ్చిన మహిళా పురోహితురాలు తాను చదువుతున్న ప్రతి మంత్రానికి అర్ధ తాత్పర్యాలను వివరించి చెప్పడం హనుమంతరావు బావగారిని ఆకర్షించింది. పెళ్లిని ఒక తంతులాగా ముగించడం కాకుండా ఆ క్రతువును నిష్టతో నిర్వహించడం చూసి ఆయన ఆ మహిళా పురోహితురాలిని మెచ్చుకున్నారు కూడా. అంతకుముందు రోజు అంటే నవంబరు 28 న రవి గారి అపార్ట్ మెంటు ‘డోఎన్’ లో మెహందీ కార్యక్రమం. అప్పటిదాకా ఇలాంటి తంతులు ఎరగని వాళ్ళం కనుక మెహందీలో చిన్నాపెద్దా అందరూ సరదాగా పాటలు పాడడం చూసి ఎంతో సంబరపడ్డాము. అదిగో అప్పుడు పెళ్లి కుమారుడు సందీప్ గోడనానుకుని నిలబడి, క్రీగంట పెళ్లి కుమార్తె భావనను చూస్తూ పాడిన పాటే ఇది.హమే తుమ్సే ప్యార్ కిత్ నా......” అర్ధం నాకంతగా బోధపడలేదు కాని, రాంచీ నుంచి వచ్చిన పెళ్లి వారందరూ తెగ మెచ్చుకున్నారు. ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మర్నాడు కాక ఆ మర్నాడు (డిసెంబరు ఒకటి) బేగంపేటలోని ఎయిర్ పోర్టు దగ్గరలోని ఒక హోటల్లో జరిగిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు రాజేష్, ప్రియల పెళ్ళికి కూడా హాజరయి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళడం భండారు కుటుంబానికి ఒక మరపురాని తీయటి జ్ఞాపకం.

డియర్ భావన, సందీప్

మీ పెళ్లి రోజున, మీ పుట్టిన రోజున, సఖి, సృష్టి పుట్టిన రోజుల్లో అమ్మ చేసే హడావిడి నాకింకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. అమెరికా టైం ప్రకారం మీకు గ్రీటింగ్స్ చెప్పాలని చాలా ఆత్రుత పడేది. ఎందుకు వాళ్ళని అర్ధరాత్రి నిద్ర లేపి మరీ చెప్పాలా అని నేను అంటున్నా తను పట్టించుకునేది కాదు.

తన నుంచి ఇలాంటి ఆప్యాయతానురాగాలు నేను నేర్చుకునేలోగా తను దాటి వెళ్ళిపోయింది.

ఈరోజు, మీ పెళ్లి రోజు, మీ ఇద్దరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ప్రియ, రాజేష్ లకు ముందస్తు శుభాశీస్సులు.

-నాన్న

 పైన రాసిన ఆ హిందీ పాటకి గూగులమ్మ లింకు:

https://www.youtube.com/watch?v=iJllh7l-D3g




28, నవంబర్ 2021, ఆదివారం

ఒక్క అవకాశం - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు, 28-11-2021, ఆదివారం ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)

ఈ మాట మీరు ఎక్కడో విన్నట్టున్నప్పటికీ ఈ ఒక్క అవకాశం, ఆ ఒక్క అవకాశం గురించి మాత్రం కాదు. ఇది వేరే. అది వేరే!
2005 డిసెంబరులో దూరదర్శన్ నుంచి నేను రిటైర్ అయ్యేంతవరకు ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు ఏ ప్రోగ్రాముకు పిలిచినా నేను ఒప్పుకునేవాడిని కాదు, ఒక ఛానల్ లో పనిచేస్తూ మరో ఛానల్ కు పోకూడదని నాకు నేనై పెట్టుకున్న నిబంధన కారణంగా.
ఆ తర్వాత మాత్రం పిలిచిన ఎవ్వరినీ కాదనలేదు. ఆ క్రమంలో రోజుకు రెండు మూడుసార్లు టీవీ చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాను. ఆ రోజుల్లో ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా, అంశాన్ని బట్టి స్వతంత్రంగా విశ్లేషణ చేసే అవకాశాలు దొరకడంతో, నేను టీవీ చర్చల పర్వాన్ని నిశ్చింతగా కొనసాగిస్తూ పోయాను. అలా పుష్కర కాలానికి పైగా టీవీలతో కాలక్షేపం చేశాను. వారంలో ప్రతి రోజూ ఒక ఛానల్ అని ముందే నిర్ణయించుకుని టైం టేబుల్ మాదిరిగా వెడుతుండే కాబట్టి నన్ను వారాలబ్బాయి అని పిలిచేవారు కూడా. ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు అనేది మా ఆవిడ నిర్మల.
2019లో నా భార్య మరణం తర్వాత టీవీ చర్చలకు పోవడం పూర్తిగా మానుకున్నాను. క్రమం తప్పకుండా నన్ను తన చర్చలకు స్వయంగా ఆహ్వానించే ఓ ప్రముఖ ఛానల్ మోడరేటర్ ఒకరు, ఓసారి ఫోన్ చేసి ‘మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఈ రెండేళ్ల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, మునుపటిలా స్వతంత్రించి మాట్లాడించడానికి మాకూ, స్వతంత్రంగా మాట్లాడడానికి మీకూ వీలులేని రాజకీయ వాతావరణం ప్రస్తుతం వుంది’ అని చెప్పారు.
రోగి కోరుకుంది, వైద్యుడు చెప్పింది ఒకటే అన్నట్టు నేను కూడా సంతోషించాను. తదాదిగా నా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, ఇలా వారం వారం ఆంధ్రప్రభ దినపత్రికకు వ్యాసాలు రాస్తూ వస్తున్నాను. చాలా తృప్తిగా వుంది.
మరి ఈ ఒక్క అవకాశం సంగతి ఏమిటంటారా!
చెబుతాను. అది చెప్పడానికే ఈ అవకాశం తీసుకున్నాను.
నేను ముప్పొద్దులా, మూడు ఛానళ్ళు. ఆరు చర్చలు అనే రీతిలో పొద్దు పుచ్చుతున్న రోజుల్లో, ఓరోజు పొద్దున్నే ఒకతను మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు.
‘నాకు టీవీ చర్చల్లో పాల్గొనాలని వుంది. మీరు ఎవరికైనా చెబుతారా! ఎలాగైనా సరే, ఒక్క అవకాశం దొరికేలా చూడండి’
ఆయన్ని చూడడం నాకు అదే మొదటిసారి. అయినా భేషజాలకు పోకుండా, మనసులోని మాటని బయటపెట్టడానికి తాత్సారం చేయకుండా, చల్లకు వచ్చి ముంత దాచిన చందం కాకుండా నేరుగా చెప్పిన తీరు చూసి, ఇతడు ఎవరి సాయం లేకుండానే టీవీ రంగంలో రాణించే రోజు వస్తుందని నేను అప్పుడే అనుకున్నాను.
ఉద్యోగం చేసే రోజుల్లో మా ఆవిడ ఇలా పనిమీద వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడే విధానం గమనించి, ‘కొబ్బరికాయ పైరవి’ అనేది. అంటే పని కాకపోతే తిరిగి ఎలాగూ రాడు. పని అయినా రాకపోయే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే పని మీద శ్రద్ధ వున్నవాళ్ళు, ఏ ఒక్కరినో నమ్ముకుని ఊరుకోరు. మరో నలుగురితో చెప్పించుకుంటారు. ఆ విధంగా ఏదో విధంగా పని జరిగిందని తెలిసినప్పుడు ఆ శనివారం దేవుడికి ఓ కొబ్బరికాయ కొట్టి, అది దేవుడి ఖాతాలో వేసేవాడిని. దానికి మా ఆవిడ పెట్టిన ముద్దు పేరు ‘కొబ్బరి కాయ పైరవి’
‘అలాగే ! చెప్పిచూస్తాను’ అనేశాను మేకపోతు గాంభీర్యంతో.
ఆయన పోతూ పోతూ ఓ సలహా చెప్పాడు.
‘చాలాకాలం నుంచి చూస్తున్నాను. మీరు టీవీలో మాట్లాడేటప్పుడు, ఎప్పుడూ కెమెరా వంక చూడరు. మిమ్మల్ని జనం గుర్తు పెట్టుకోవాలి అంటే కెమెరా వంకే చూస్తూ మాట్లాడాలి, యాంకర్ వంక కాదు’
నాకు నవ్వు వచ్చింది. కానీ నవ్వలేదు.
‘యాభయ్ ఏళ్ళుగా ఈ రంగంలో ఉంటున్నాను. ఇంకా నా మొహం గుర్తు పెట్టుకునేది ఏమిటి నా మొహం!’ అనుకున్నాను మనసులో.
ఆయన వెడుతూ వెడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించి వెళ్ళాడు.
‘నాకు ఏదైనా రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని వుంది. ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఆర్ధికంగా నా నేపధ్యం గొప్పది కాదు. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. ఇలా విశ్లేషకుడిగా టీవీల్లో మాట్లాడుతూ వుంటే ఎవరో ఒకరి కంట్లో పడకపోను. అప్పుడు ఏదో ఒక పార్టీకి అధికార ప్రతినిధి హోదాలో ప్రతి ఛానల్లో కనబడే ఛాన్స్ లంహిస్తుంది. నాకు పార్టీలో అవకాశం ఇచ్చిన నాయకుడి కంటే కూడా ఎక్కువగా ప్రజల కళ్ళల్లో పడే మహత్తర అవకాశం నాకే వుంటుంది. రోజూ నా మొహం టీవీల్లో చూస్తుంటారు కాబట్టి నా నియోజకవర్గం ఓటర్లకు నేను బాగా గుర్తుంటాను. ఎప్పటికో అప్పటికి నా కోరిక తీర్చుకోకపోను’ అన్నాడు ధీమాగా!
అతడు చెప్పింది నిజమే. డబ్బులు ఊరికే రావు అన్నట్టు పదవులు, అవకాశాలు ఊరికే రావు. ప్రయత్నిస్తూనే వుండాలి.
అతడు కోరుకున్నట్టే టీవీల్లో మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది. సద్వినియోగం చేసుకున్నాడు అని వేరే చెప్పాల్సిన పని లేదు.
చూస్తూ ఉండగానే అతడు తన దీర్ఘకాలిక ప్రణాళికలో నిర్దేశించుకున్న మొదటి రెండు లక్ష్యాలు సాధించాడు. సొంత ప్రతిభతో విశ్లేషకుడిగా రాణిస్తూనే ఓ రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా నాతోనే పలు చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాడు. విషయ పరిజ్ఞానం, కష్టపడి సమాచారం సేకరించే అలవాటు, పెట్టుకున్న ధ్యేయం పట్ల చిత్తశుద్ధి, అనుకున్నది సాధించాలనే తపన ఈ ఎదుగుదలకు కారణం అని నాకు అనిపించేది.
నాకొక అనుమానం వుండి పోయింది. అతడు చేరాలి అనుకుంటే, అతడి ప్రతిభ చూసి అధికార పక్షం కూడా ఆహ్వానించి వుండేది. మరి ప్రతిపక్షం పాత్రను ఎందుకు ఎంపిక చేసుకున్నట్టు?
ఒకరోజు విరామ సమయంలో ఆయన్నే అడిగాను. చెప్పిన జవాబు విని నివ్వెరపోయాను.
‘నాకిప్పుడు వున్న ప్లస్ పాయింటు నా వయస్సు. మరో పదేళ్లు ఓపిగ్గా ఎదురుచూడగలను. ఒక రాజకీయ భావజాలం అంటూ ప్రత్యేకంగా నాకు ఏమీ లేదు, ఎందులో అయినా సర్దుకుపోగలను. అధికార పార్టీ అయితే పుణ్యకాలం కాస్తా పార్టీ కార్యకలాపాలను సమర్ధించుకోవడంలోనే సరిపోతుంది. అదే ప్రతిపక్షం అయితే గొంతెత్తి మాట్లాడానికి, ఎంత ఘాటు విమర్శలు అయినా చేయడానికి అవకాశం వుంటుంది. వీక్షకులకీ, టీవీల వాళ్ళకీ కావాల్సింది ఇదే. చర్చల అవకాశాలు బాగా వుంటాయి. అంచేత ఇదే సరైన పద్దతి అనుకున్నాను. అధికార పక్షంలోకి సమయం చూసుకుని చేరతాను. అందుకు ఇంకా సమయం వుంది. తొందరపడితే అసలుకే మోసం. ‘మరో విషయం గమనించారా! విశ్లేషకుడిగా కాకుండా నేను సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరివుంటే ఎక్కడో రోడ్ల మీద ధర్నాలు చేస్తూ మిగిలిపోయేవాడిని. ఇప్పుడు చూడండి. ఎండనక, వాననక వీధుల్లో ఆందోళనలు చేస్తూ, గొంతు ఎండిపోయేలా నినాదాలు చేసే మా పార్టీ వాళ్లకు అనుకూలంగా, హాయిగా స్టూడియోల్లో కూర్చుని, స్వరం పెంచి మాట్లాడగలుగుతున్నాను. హోటళ్ళకు పోయినా, సినిమాలకు వెళ్ళినా జనం గుర్తు పట్టి పలకరిస్తున్నారు.
‘మరో రహస్యం చెబుతున్నా మీరు కాబట్టి. మా అధినాయకుడిని కలవాలంటే మా పార్టీ నాయకులకే దుర్లభం. అలాంటిది నేను నేరుగా కలవగలుగుతున్నాను. అయిదేళ్ళ కాలంలోనే ఇదంతా! ఇంకో అయిదేళ్లు మిగిలే వుంది’ అన్నాడు.
అతడి మాటల్లో ఎనలేని ఆత్మ విశ్వాసం తొణికిసలాడింది.
ఏదో ఒకరోజు ఆయన్ని అసెంబ్లీలో చూస్తాను అని నాకో ఫీలింగు కూడా ఈ మధ్య కలుగుతోంది. అతడికేదో దారి చూపించడంలో చిటికెన వేలంత పాత్ర నాది ఉందనే గర్వం ఇన్నాళ్ళు నా మనసులో ఏ మూలో వుండేది. ఇప్పుడది తొలగిపోయి, అతడే నా కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేశాడనే భావన కలుగుతోంది.
ముగించే ముందు ఓ విషయం చెప్పాలి.
ఆయన మొట్టమొదటిసారి టీవీలో కనపడ్డ రోజు, మరచిపోకుండా దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నాను. ఎందుకంటే అతడి కోరిక తీరడంలో నా ప్రమేయం ఏమీ లేదని నా అంతరాత్మకు తెలుసు కాబట్టి.
తోకటపా: ఈ రచన నా స్వకపోల కల్పితం అని పాఠకులకు మనవి.