13, జులై 2021, మంగళవారం

తాజా మాజీ

 'హలో నమస్కారం'

'నమస్కారం. చెప్పండి '

'మనం కలవక చాలా రోజులయింది'

'అవునండీ'

'ఈ సాయంత్రం ఎలా వున్నారు? వీలుంటే బంజారా హోటల్లో కలుద్దామా!'

'ఎందుకండీ అంత ఖర్చు. హాయిగా మన ప్రెస్ క్లబ్ వుంది కదా'

'ప్రైవసీ వుండదేమో'

'హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి ప్రైవసీ ఎందుకండీ?'

'అదీ నిజమే అనుకోండి'

క్లబ్బులో రెండు మూడు గంటలు గడిపిన తరువాత.....

'నేను వస్తానండీ'

'అప్పుడేనా?'

'చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడయితే ఏదో ఒక ఆటో దొరుకుతుంది. ఆలస్యం అయిన కొద్దీ వాళ్ళతో తంటా. రోజూ వుండే తద్దినమే అయినా పొద్దున్నే వార్తల టయిముకి ఆఫీసుకి చేరాలి కదా!'

'వుండండి నా కారులో దింపేసి వెడతాను'

'భలే వాళ్ళే! మీరు వుండేది ఉత్తరం, నేను ఉండేది దక్షిణం. బోలెడు దూరం తిరిగెళ్లి వెళ్ళాలి. వద్దు లెండి'

'నేనేమన్నా మిమ్మల్ని మోసుకుంటూ వెడతానా ఏమిటి? కారే కదా. పైగా డ్రైవర్ కూడా వున్నాడు, పదండి'

'సరే పదండి'

ఇంటి దగ్గర దిగే ముందు -

'నేను చెప్పేది కాస్త గుర్తు పెట్టుకోండి. నాకు ఇది ప్రిస్టేజ్ ఇష్యూ'

ఏళ్ళు గడిచిపోయాయి.

అప్పటి జర్నలిష్టు ఇప్పుడు మాజీ జర్నలిష్టు.

ప్రెస్ క్లబ్ లో మళ్ళీ కలిశారు అదే ఇద్దరు.

'ఏమండీ బాగున్నారా?'

'బాగున్నాను, మీరెలా వున్నారు?'

'బాగానే వున్నాను. కంపెనీ టర్నోవర్ అయిదు కోట్లు దాటింది. దాంతో పాటే పని కూడా బాగా పెరిగిపోయింది. స్టాఫ్ పెరిగారు. అన్నీ ఒక కంట కనిపెట్టి చూసుకోవాలి. పైగా ఢిల్లీ బాంబే తిరుగుళ్ళు. మునపటిలా ఎవర్నీ తీరిగ్గా కలవలేకపోతున్నాను. సారీ అండీ. అయినా కాసేపు మాట్లాడుకుందాం రండి'

'లేదండీ. ఇప్పటికే చాలా సేపు అయింది. మీకు తెలుసు కదా! చాలా దూరం వెళ్ళాలి. పైగా అప్పుడూ ఇప్పుడూ అదే సమస్య. ఆటో'

'మరే. నేనూ అదే అనుకుంటున్నాను. ఈరోజు వేరే ఫ్రెండ్స్ వస్తామన్నారు. మరో రోజు తీరిగ్గా కలుద్దాం లెండి. గుడ్ నైట్ అండీ'

'గుడ్ నైట్'

 

12, జులై 2021, సోమవారం

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ....

 నా రాశి ఫలాల్లో పుస్తక లాభం అని రాసివుంటుందేమో. నేను చూడను కనుక తెలియదు. ఉదయం ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ గారు ఫోన్ చేసి నాయింటి అడ్రసు వాకబు చేసారు. చెప్పిన సమయానికే వచ్చారు. దాదాపు మూడుగంటలు. ఇంకా ఎక్కువే కావచ్చు. నాకయితే టైము తెలియలేదు. అన్ని ముచ్చట్లు. ఎన్నెన్నో విషయాలు. అవన్నీ రాయాలంటే వంద పేజీల పుస్తకం అవుతుంది. రాయడం తెలిసిన రాజకీయ నాయకుడు కనుక ఆయనే రాస్తే బాగుంటుంది. అదే ఆయనతో చెప్పాను. చూద్దాం రాస్తారేమో.

మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగారు. భోజనం చేసి వెళ్ళండి అంటే  ఇల్లు తెలిసింది కదా మరో మారు అన్నారు. మా ఇద్దరితో కలిసి ఒక ఫోటో దిగారు.



ఇప్పుడు ఆ పుస్తకాలు, నేనూ ఆ  ఫోటో మిగిలాము ఇంట్లో. సరిగ్గా రెండు నెలల తర్వాత 'భోంచేసి వెళ్ళండి' అని అడిగే మా ఆవిడ లేకుండా పోయింది.

(12-07-2020)

పేరు కోసం – భండారు శ్రీనివాసరావు

 ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.

కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి వచ్చాడు. చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టు కొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను’. నాకేమనాలో తోచలేదు. కానీ భేషజాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఆరోజు మావాడి నుంచి నేర్చుకున్నాను.

ఆరోజు గుడికి వెళ్ళాము. అక్కడ తిరిగే ఫ్యాన్ల మీదా, వెలిగే ట్యూబ్ లైట్ల మీదా వాటిని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు రాసివున్నాయి. చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తాపత్రయమే నాకు వాటిలో కనిపించింది.

టీవీలో సినిమా వస్తోంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!’ బందీఖానాలో కొరడా దెబ్బలు తింటూ కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాడుతున్నాడు. తాను భద్రాద్రి రాముడికి చేయించిన నగలు వాటి ఖరీదు గురించి వివరిస్తున్నాడు.

ఏవిటో ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అనిపిస్తోంది కదూ.

పధకాల క్రెడిట్ తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఆయా పార్టీలు పడుతున్న తాపత్రయం నేపధ్యంలో చూస్తే వీటికి ఉన్న సంబంధం బోధపడుతుంది.

ప్రాజెక్టుల మీదా, పధకాల మీదా ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు నిజానికి ఆయా పాలక పార్టీలది కాదు, పన్నులు కడుతున్న ప్రజలది.

ప్రజలు చూసి చూసి విసుగెత్తి ఎప్పుడో అప్పుడు, రామదాసు గారు ఎద్దేవా చేసినట్టు, ‘ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేరు’ అని ప్రభుత్వాలని నిలదీయకుండా జాగ్రత్త పడడం మంచిదేమో!

 

11, జులై 2021, ఆదివారం

“ఒరేయ్! నేను రాష్ట్రపతిని రా!”

 

1932 లో పుట్టారు అంటే ఇప్పుడు ఆయన వయసు 88. నిజామాబాదు జిల్లా ఆర్మూరులో పుట్టిన జి.ఎస్.వరదాచారి గారు నాకు తెలిసినంత వరకు అత్యంత వయోధికుడైన పాత్రికేయులు. ఈనాటి జర్నలిస్టులకు దిక్కూ, దిక్సూచి ఆయనే. ఆ వయసులో ఆయన చురుకుదనం చూసి వయసే సిగ్గుతో పక్కకు తప్పుకుంది. డెబ్బయ్ అయిదేళ్ళు వచ్చిన తరువాత కాబోలు అయన కంప్యూటర్ మీద తెలుగు టైప్ చేయడం అభ్యసించి ’జ్ఞాపకాల వరద’ అనే పేరుతొ తన జీవితానుభవాలను గ్రంధస్తం చేశారు. నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘానికి ఫౌండర్ ప్రెసిడెంట్. ఆయన జ్ఞాపకాల సమాహారం నుంచి వెలికి తీసిన వాడని సుమమే ఈ పోస్టు.

ప్రస్తుతం పంజాగుట్ట చట్నీస్ దగ్గర (కొత్తగా అక్కడ ఓ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది) హైదరాబాదులో మొట్టమొదటి జర్నలిస్టుల కాలనీ నిర్మాణం అయింది. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ స్థలాన్ని మార్కెట్ రేటు ప్రకారం గజం అయిదు రూపాయల వెల నిర్ణయించి ప్రభుత్వం కేటాయించింది. మొత్తం నలభయ్ రెండు ప్లాట్లు. విస్తీర్ణాన్నిబట్టి ఒక్కొక్కరు 1750 నుంచి 2000 వేల రూపాయలు కట్టాలి. అంత మొత్తం ఒకేసారి చెల్లించే స్తోమత చాలామందికి లేదు. మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి పరిగెత్తక తప్పలేదు. పన్నెండు అర్ధ సంవత్సర వాయిదాలలో కట్టడానికి అంగీకరించింది. (అయినా కాలనీలో మూడు ప్లాట్లు మిగిలాయి. గోరాశాస్త్రిని అడిగితే ‘ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఓనింగ్ ప్రాపర్టీ’ అన్నారు. గండూరి కృష్ణ ప్రవేశ రుసుము కట్టే పరిస్తితి లేదంటే సొసైటీ ఆయనకు కొంత ఋణం కూడా ఇచ్చింది. చివరకు ఆయన ఇల్లు కట్టుకోలేక ప్లాటును వాపసు ఇచ్చారు).

1968 ఏప్రిల్ మూడో తేదీన బ్రహ్మానందరెడ్డి వచ్చి శంకుస్థాపన చేసారు.

జర్నలిస్టులు ఒక సహకార సంఘంగా ఏర్పడి నిర్మించుకున్న మొట్టమొదటి కాలనీ పూర్తయింది. ఇక ప్రారంభోత్సవం తరువాయి.

ప్రతి సంవత్సరం వచ్చినట్టే నాటి రాష్ట్రపతి వీవీ గిరి గారు శీతాకాలపు విడిది కోసం హైదరాబాదు వచ్చి వున్నారు. ఆయన చేత కాలనీ ప్రారంభోత్సవం చేయిస్తే ఎలా ఉంటుందని అందరం అనుకున్నాము. కట్టగట్టుకుని బొలారం వెళ్ళాము. రాష్ట్రపతి మేనల్లుడు అయిన సింహం, పూర్తిపేరు దిగుమర్తి నరసింహారావు కూడా సొసైటీ సభ్యుడు. ఈ కాలనీలో ఆయనకు ప్లాటు లేదు. ఐనా, నేను మాట్లాడి పెడతానన్నాడు. అలాగే ప్రస్తావించాడు. అప్పుడు గిరి అన్న మాటలలో ధ్వనించిన ఆప్యాయత నేను మరచిపోలేను.

ఒరేయ్! నేను రాష్ట్రపతిని రా! నా కార్యక్రమాలన్నీ మూడు నెలల ముందే నిర్ణయమైపోతాయి. నా చేతులలో వుండదు. ఇప్పుడు కుదరదు. జర్నలిస్టు కాలనీ అంటున్నారు. నేను మళ్ళీ వస్తాను. తప్పక ప్రారంభిస్తాను” అన్నారాయన.

కొన్నాళ్ళ తరవాత కొంతమంది సైనికాధికారులు వచ్చి కాలనీ వున్న ప్రదేశాన్ని పరిశీలించి వెళ్ళారు. మరికొన్నాళ్లకు రాష్ట్రపతి 1971 ఏప్రిల్ ఆరో తేదీన ప్రారంభిస్తారని వర్తమానం అందింది. అప్పుడు సొసైటీకి పొత్తూరు వెంకటేశ్వర రావు అధ్యక్షుడు. ఆర్. శ్రీనివాసన్ కార్యదర్శి. కాలనీకి సుప్రసిద్ధ సంపాదకుడు కోటంరాజు రామారావు పేరు పెట్టాలని నిర్ణయించాము.

అనుకున్నవిధంగానే రాష్ట్రపతి వచ్చి కాలనీని ప్రారంభించారు. జర్నలిస్టులకు కొన్ని పట్టణాలలో ప్రభుత్వ గృహాలు కేటాయించిన దృష్టాంతాలు ఉన్నాయి. కానీ వారే ఒక సొసైటీగా ఏర్పడి నిర్మించుకున్న మొదటి కాలనీ ఇదే అని రాష్ట్రపతి అభినందించారు.

సభ ముగియగానే రాష్ట్రపతి వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహారానికి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి, రెవెన్యూ మంత్రి వీబీ రాజు, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు”

(జ్ఞాపకాల వరద, రచన” డాక్టర్ జీ.ఎస్. వరదాచారి, ఎమెస్కో ప్రచురణ, వెల: Rs.150/- ప్రతులకు: ఎమెస్కో బుక్స్)

10, జులై 2021, శనివారం

రంగస్థల కృష్ణ మూర్తి పీసపాటి నరసింహ మూర్తి

(ఈరోజు జులై 10, ఆయన జయంతి)

కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహ మూర్తి గారు.
విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయ మైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన వరకే సంగీతం పద్యంలో చొప్పించి పాడే వారు. ఎంత గొప్పగా ఉండేదో.
ఆయన నాటకం చూడలేకపోతే జీవితంలో వో మంచి అవకాశం పోగొట్టుకున్నట్టే. తెలుగు వారంతా బ్రహ్మరథం పట్టడంతోపాటు, నటుడిగా ఆయనకు రావల్సిన గౌరవాలన్నీ దక్కాయి వొక్క పద్మ అవార్డు మినహా.
ఓసారి తిరుపతి వెంకట కవుల సమక్షంలో ‘ఉద్యోగ విజయాలు’ పోటీలు జరిగాయి. అందులో కృష్ణ పాత్రధారి పీసపాటి బంగారు కీరీటం బహుమతిగా పొందారు. 'మామా సత్యవతీ పౌత్రా! ధాత్రరాష్ట్రులకు పాండవులకు సంధి చేసి ఈ రాజలోకమ్మును కాపాడుమని యాచించుటకయి పాండవదూతగా నీ వద్దకు వచ్చితి’ అంటూ ఆయన రాయబారం సీన్ లో ప్రవేశించడం ఓ మధురాతి మధురమైన జ్ఞాపకం. ‘పతితులు కారు నీయెడల భక్తులు, శుంఠలు కారు విద్యలన్ చతురులు’ అని పాండవుల గొప్పతనం గురించి కౌరవుల సభలోచెప్పడం కూడా ఎంతో రమ్యంగా వుండేది. ‘ఒన్స్ మోర్’ లు పట్టించుకునే వారు కాదు. ఇక తప్పని సరి అయితే సంభాషణలు మార్చి కొత్తదనంతో అదే పద్యాన్ని కొద్దిగా మార్చి పాడేవారు. ప్రేక్షకులంతా హర్ష ధ్వానాలు చేసేవారు.
తెలుగు నాటకరంగాన్ని కొన్నేళ్ళ పాటు ఏలిన నటుడు పీసపాటి నరసింహ మూర్తి.



తెలుగు సినీ హాస్యానికి పెట్టని కోట, కోట శ్రీనివాసరావు

 (జులై, 10, కోట పుట్టినరోజు) 

“రేడియో నుంచి చాలా నేర్చుకున్నాను. ఉచ్చారణ ఎలా వుండాలి? ఏ వాక్యాన్ని ఎక్కడ ఎలా విరవాలి? ఏ పదాన్ని ఎక్కడ ఎంత నొక్కి చెప్పాలి? ఇవన్నీ రేడియో నాటకాల్లో నటిస్తూ నేర్చుకున్నాను”

తన డెబ్బయి నాలుగో పుట్టినరోజున ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇవి. ఒకప్పుడు రేడియోలో పనిచేసిన మనిషిగా ఈ మాటలు విని నేనూ సంతోషపడ్డాను. ( నాకంటే వయసులో ఏడాది పెద్ద అని ఈరోజే తెలిసింది)

“బ్యాంకులో ఉద్యోగం. సాయంత్రాలు నాటకాలు రిహార్సల్స్. మధ్యమధ్య రేడియో నాటకాలు. రవీంద్ర భారతిలోనే నూట యాభయ్ కి పైగా నాటకాలు వేసిన అనుభవం. ఎవరో అన్నారు, సినిమాల్లో కూడా ప్రయత్నించరాదా అని. నాది నల్లటి ఛాయ. ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అంటారేమో అని బెరుకు” 

అలాంటి మనిషి ఒకటీ అరా కాదు, లెక్కకు మించిన సినిమాల్లో వేశారు. అవీ చిన్నాచితకా వేషాలు కావు. నటనా వైదుష్యానికి గుర్తుగా ఎనిమిది నందులు ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఆకాశంలో ఓ వెలుగు వెలిగారు.

నేను రేడియోలో చేరిన కొత్తల్లో కోట శ్రీనివాసరావు గారు నారాయణ గూడా (దీపక్ మహల్ పక్కన) స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. అప్పుడప్పుడు తోటి నాటకాల నటులతో కలిసి రేడియో ఆవరణలో కనిపించేవారు. 

ఒకరోజు అయన అన్నమాటలు నాకు బాగా జ్ఞాపకం.

“మా బ్యాంకు వాళ్లకు ఆటలు ఆడేవాళ్ళు తప్ప మా బోటి నటులు పనికిరారు. (ఆ రోజుల్లోనే క్రికెట్ క్రీడాకారుడిగా స్టేట్ బ్యాంకు ఉద్యోగి మహమ్మద్ అజహరుద్దీన్ నిలదొక్కుకుంటున్నారు. చిన్నతనంలో విఠల్ వాడీలో గల్లీ క్రికెట్ ఆడేవారని చెప్పుకునేవారు) వాళ్లకు అడగడమే ఆలస్యం సెలవు దొరుకుతుంది. నాకేమో రాకరాక ఓ సినిమా వేషం వచ్చింది. వారం రోజులు సెలవు కావాలంటే దొరకడం గగనం. సరే మేము సినిమాల్లో వేసి డబ్బులు తీసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు మాత్రం క్రికెట్ ఊరికే ఆడుతున్నారా! ఎందుకీ వివక్ష?” అనేది ఆయన ఆవేదన.

సినిమాలు పెరిగాక ఆయన ఆ ఉద్యోగం వదిలేశారు, అది వేరే విషయం.

స్టేట్ బ్యాంకులో మధుర బాబుగారని ఓ అధికారి వుండేవారు. (చనిపోయి కొద్ది సంవత్సరాలు అవుతోంది) హైదరాబాదు మెయిన్ బ్రాంచికి మేనేజర్. సమర్ధుడైన ఆఫీసర్ అని పేరు. ఆ రోజుల్లో ఆయన హవా బాగా వుండేది. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అనిపించుకుంటున్న వారిలో అనేకమంది ఆయనకోసం ఆఫీసు బయట వెయిట్ చేస్తుంటే నేను ఆరోజుల్లో చూశాను. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారూ మధురబాబు గారు మంచి స్నేహితులు. మా అన్నయ్య విశాఖ గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా, మధురబాబుగారు నాగార్జున గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు. తదనంతర కాలంలో మా అన్నయ్య చెన్నై, పుదుచ్చేరి, కేరళరాష్ట్రాల స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా, మధురబాబు గారు జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రపంచ ప్రసిద్ధ కేన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయుడు మధురబాబు గారెకి స్వయానా తమ్ముడు.  

వేరే విషయం అంటూ వేరే వేరే విషయాల్లోకి పోతున్నానని అనుకుంటున్నారా. లేదు. కోట శ్రీనివాసరావు గారికీ బ్యాంకుకూ సంబంధం ఉన్నట్టే, ఒకప్పుడు ఏ బ్యాంకులో అయితే రెండు రోజులు సెలవు కోసం ఇబ్బందులు పడ్డారో అదే స్టేట్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేసిన  ఈ మధురబాబు గారికీ సంబంధం వుంది. అది కూడా అలాంటిలాంటి సంబంధం కాదు. తదనంతర కాలంలో ఈ ఇద్దరూ స్వయానా వియ్యంకులు అయ్యారు.



9, జులై 2021, శుక్రవారం

పాదయాత్రాఫల సిద్ధిరస్తు – భండారు శ్రీనివాసరావు

 

కనుచూపు మేరలో ఎన్నికలు లేవు. అయినా అన్ని పార్టీల నాయకులు ఏదో ఒక పేరు పెట్టుకుని జనం మధ్యనే గడపాలని అనుకుంటున్నారు. ఈ మార్పుకు కారణం ఒక్కటే, వెనుకటికీ ఇప్పటికీ రాజకీయ వ్యూహాల్లో వచ్చిన తేడానే!
కొన్ని దశాబ్దాల క్రితం విద్యార్ధులు పరీక్షల తరుణంలోనే పుస్తకాలు చేతపట్టి రాత్రీ పగలూ అనకుండా కష్టపడి చదివి గట్టెక్కాలని ప్రయత్నం చేసేవారు. మిగిన రోజుల్లో ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి ప్రబలిన తరువాత విద్యార్ధులకు అనునిత్యం పరీక్షలే. ప్రతిక్షణం పరీక్షాకాలమే.
ఇప్పుడీ సంస్కృతి రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినట్టు వుంది. పూర్వం ఎన్నికల సమయంలో మాత్రమె కానవచ్చే హడావిడి ఇప్పుడు ఏడాది పొడుగునా కళ్ళకు కడుతోంది. నిత్యం జనాలతో అనుబంధం పెంచుకుంటూ ఆత్మస్తుతి, పరనిందలతో పొద్దుపుచ్చుతున్నారు. అందుకే, రాజకీయ కోయిలలు ముందే కూస్తున్నాయి. ఎన్నికల ఘడియ దగ్గరలో లేకపోయినా నాయకులు కాళ్ళకు బలపాలు కట్టుకుని జనాలమధ్యనే తిరుగుదామని ఆలోచనలు చేస్తున్నారు.
అరవయ్యో దశకంలో ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం లోకసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికలప్పుడు జనాలకు చూపించిన మొహం మళ్ళీ ఎన్నికల వరకు చూపించేవారు కాదు. అయినా వరసగా అయిదు సార్లు ప్రజలు ఆయన్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గెలిచిన తరువాత ఢిల్లీలోనో, హైదరాబాదులోనో హాయిగా కాలక్షేపం చేసేవారు కాని నియోజకవర్గం వైపు తొంగి చూసేవారు కాదు. అయినా ఆ రోజుల్లో అలా నడిచిపోయింది.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత కొంత పరిస్తితి మారింది. జనాల్లో తిరగకుండా జనాలమీద పెత్తనం చేయడం కష్టం అన్న ఎరుక రాజకీయ నాయకుల్లో మొదలయింది. అయితే ఎన్టీఆర్ తరహా కూడా అదో మాదిరి. ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు, కనీసం ఏసీ సౌకర్యం కూడా లేని చైతన్య రధం మీద బయలుదేరి, ఎండావానల్ని లెక్కచేయకుండా, ఆకలిదప్పులు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని చుట్టబెడుతూ రాత్రింబగళ్ళు ప్రజల మధ్యనే తిరిగేవారు. ఆ ఎండలకు అంతటి అందగాడి మొహం కూడా నల్లకప్పు వేసిపోయేది. ఒక్కసారి విజయం సాధించి, అధికార పీఠం ఎక్కడం తరువాయి, అంతే! ఎంతో ముఖ్యమైన రాచకార్యం వుంటే తప్ప రాజధానిని ఒదిలిపెట్టి అడుగు బయట పెట్టేవారు కాదు. జిల్లాల పర్యటనలు ఎక్కువగా పెట్టుకునేవారు కాదు. చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన గురించిన కబురు చెవిలో పడడం ఆలస్యం కాళ్ళకు రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళేవారు. కొన్ని సందర్బాలలో స్థానిక అధికారుల కంటే ముందే అక్కడ వాలిపోవడం, లేదా ముఖ్యమంత్రి హైదరాబాదు నుంచి ఆ విషయం గురించి వారిని వాకబు చేయడం ఇలాటివన్నీ ఆ రోజుల్లో తమాషాగా చెప్పుకునేవారు. కొండొకచో సంచలనాత్మకంగా, కొండొకచో విమర్శనాత్మకంగా ఉండేవి అవి.
దరిమిలా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిది కూడా ఓ రకంగా ఇదే తరహా. పర్యటనల్లో వున్నా, రాజధానిలో వున్నా జనం మధ్య గడపడానికే ఆసక్తి చూపేవారు. ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడానికి ఆయన చాలా కాలం పాటు చేసిన నిరీక్షణ ఫలించడానికి కారణం ఆయన చేసిన పాదయాత్రే అనడంలో సందేహం లేదు. తదాదిగా అధికారం చేజిక్కించుకోవాలంటే పాదయాత్రలు చక్కని రాజమార్గం అన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో కుదిరిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అనంతరమే తొమ్మిదేళ్ళ పైచిలుకు సాగిన ప్రతిపక్ష అజ్ఞాత వాసం నుంచి బయట పడి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు.
ఇక సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా జనం మీదనే ఆధారపడ్డారు. జనం అండ ఉంటుందనే నమ్మకంతో రాజకీయ ఎత్తుగడల్లో చూపించాల్సిన పట్టు విడుపుల్ని ప్రదర్శించకుండా ఓ మేరకు నష్టపోయారని కూడా ఆయన్ని గురించి చెప్పుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనది అదే తీరు. తన సొంత పార్టీ నాయకులతో కంటే జనాల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతారనే పేరు ఆయన ఖాతాలో వుంది కూడా. అదే తీరు కొనసాగించి, సుదీర్ఘ పాదయాత్ర అనంతరం అధికార పీఠం ఎక్కగలిగారు.
పొతే, రాజకీయ నాయకుల పాదయాత్రలు, కిసాన్ యాత్రలు, రైతు భరోసా యాత్రలు, బస్సు యాత్రలు ఇంకా ఇలాటి అనేకానేక యాత్రలు, పర్యటనలు, ప్రదర్శనలు, ర్యాలీలు ప్రజలకు చేసే మేలు ఏమిటోకాని ఆయా పార్టీలకు మాత్రం పెద్ద మేళ్ళే చేస్తున్నాయని వాటి గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే ఇబ్బందులు వున్నా, కష్టాలు వున్నా, బాగా డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా నాయకులు వెనుకడుగు వేయకుండా పాదయాత్రలతో ముందడుగు వేస్తున్నారు.
సరే! 'యాత్రాఫల సిద్ధిరస్తు' అని జనం వారిని ఆశీర్వదిస్తారో లేదో తెలియడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది.

Link to Andhraprabha epaper which published the above article on 11-07-2021)

https://epaper.prabhanews.com/c/61719725