11, జూన్ 2021, శుక్రవారం

అలా దేశాలు చుట్టి వద్దాం రండి! – భండారు శ్రీనివాసరావు

 నూట యాభయ్ రూపాయలతో  అన్నీ  చూపిస్తాను  రండంటున్నారు రాజేష్ వేమూరి.

నాకు సంతోషం అనిపించి ఆ ప్రయాణం ఇవ్వాళే మొదలెట్టాను. ఇంకా పోలండులోనే వున్నాను. చూడాల్సినవి ఇంకా చాలా వున్నాయి. జర్మనీ, స్వీడన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, ఇంకా మనకు ఆట్టే తెలియని, నోరు తిరగని మరో దేశం లిచ్టేన్ స్టెయిన్.

కాకపోతే చదువరికీ అద్భుతమైన అనుభూతిని రాజేష్ కల్పించింది తాను రాసిన ‘ నా ఐరోపా యాత్ర’ అనే 184 పేజీల పుస్తకం ద్వారా. (నాకు ఈ మాత్రం ఖర్చు కూడా లేకుండా వేమూరి రాజేష్ ఆ పుస్తకాన్ని కొరియర్ ద్వారా నాకు ఈరోజు పంపారు. వారికి కృతజ్ఞతలు)

నిజానికి వీటిల్లో చాలా దేశాలను నా కళ్ళతో చూసే బంగారు అవకాశం మూడు దశాబ్దాల క్రితమే నేను మాస్కో రేడియోలో ఉన్నప్పుడే లభించింది. కానీ ప్రతి హాలిడేకి నేను స్వదేశాన్నే ఎంచుకోవడం వల్ల దాన్ని కోల్పోయాను. సోవియట్ యూనియన్ రోజుల్లో ఈ దేశాల్లో చాలా వరకు రష్యా మిత్ర దేశాలు. విమానాల్లోనే కాకుండా రైల్లో వెళ్లి తిరిగివచ్చే దేశాలు. పలానా రోజుల్లో పలానా దేశం వెళ్లి వద్దామని అనుకుంటున్నట్టు రేడియో వాళ్లకి చెబితే చాలు యావత్తు కుటుంబానికి వాళ్ళే రైలు టిక్కెట్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకు వసూలు చేసే డబ్బు కూడా నామమాత్రం. అప్పుడు చూడని ఈ దేశాల్ని ఇదిగో ఇలా చూడగలుగుతున్నాను. ఆయన ఎంత వివరంగా రాశారంటే రాజేష్ వెంట మనమూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.

వెనకటి రోజుల్లో విదేశీ ప్రయాణం అంటే ఒక అపురూపం. ఇప్పుడలా కాదు, ఉద్యోగాలకోసం బయట దేశాలకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికా వంటి దేశాల సంగతి చెప్పక్కర లేదు. పొతే ఇదిగో ఇలా యూరోపియన్ దేశాలకు వెళ్ళే పర్యాటకులకు కొదవ లేదు కానీ, ఉద్యోగాలు, ఉపాధుల నిమిత్తం పోయేవారు ఇంకా అరుదే.

విదేశాలను పొగడడం అంటే మన దేశాన్ని చిన్న బుచ్చడం కాదని రచయితే ఒక చోట చెప్పారు. అయితే ఘన చరిత్ర గురించి చెప్పుకుంటే సరిపోదు. దాన్ని పదిల పరచుకోవడం కూడా తెలియాలి. ఉదాహరణకు లండన్ మ్యూజియంలో అమరావతి శిల్పాలను ఒక ఫ్లోరు నిండా ప్రదర్శనకు ఉంచారు. అలాగే, ప్యారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియలో ఘంటసాల తవ్వకాల్లో బయటపడిన మూడు శిల్పాలను, ఊరి పేరు వివరాలతో సహా భద్రపరిచారు. అవన్నీ అక్కడ పదిలంగా వున్నందుకు సంతోష పడాలా, పోగొట్టుకున్నందుకు ఖేదపడాలా!

పోలండు, జర్మనీ వంటి దేశాలు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పూర్తిగా ధ్వంసం అయి, మళ్ళీ స్వయం కృషితో కోలుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యాయి. ఆ క్రమంలో అవి ఏనాడూ తమ దీన స్తితిని ప్రపంచానికి చాటుకోలేదు. ఆ తరవాత స్వాతంత్రం వచ్చిన మన దేశాన్ని వాటితో పోల్చుకోగలమా! అక్కడా రాజకీయ పార్టీలు వున్నాయి. అవీ రాజకీయం చేస్తాయి. కానీ అభివృద్ధిని పణం పెట్టికాదు.

కరోనా కాలంలో ఇలాంటి పుస్తక పఠనం అభిలషణీయం, ఆహ్లాదకరం. 

ఈ పుస్తకం రాసిన రాజేష్ వేమూరికి అభినందనలు.



(నా ఐరోపా యాత్ర, రచయిత : రాజేష్ వేమూరి, ప్రచురణ: మన ఘంటసాల ప్రచురణలు, ప్రతులకు: +919182272551)

10, జూన్ 2021, గురువారం

కలల లోకంలో కాసేపు – భండారు శ్రీనివాసరావు

 

పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాం” అని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపు’ కోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ‘ఏమి జీవితమూ దుర్భరమూ ‘ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు – తరవాత్తరవాత – తత్వం మార్చుకుని - “కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండు” అనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. 2010లో  ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది. 

 ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!’ అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.

మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ – ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొ’ పల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.

ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్” ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి.

ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం ‘స్కూలు డిస్ట్రిక్టుల’ను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ‘ఇన్నోవేషన్ ఫండ్’ నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది.ఈ ఏడాది వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు – బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం – అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.


ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి. 

 బ్లాకు బోర్డులు, చాక్ పీసులకు బదులు ‘టచ్ స్క్రీన్ కంప్యూటర్లతో‘ పాఠాలు బోధించే విధానం ప్రాధమిక తరగతి నుంచే ప్రారంభం కావడం మరో విశేషం. పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు దండిగా వుండడం వల్ల ‘బతకలేక బడి పంతులు’ అనే నానుడుకి దూరంగావుంటూ, తమ విద్యార్ధులతో ప్రేమపూర్వకంగా మసలుకుంటూ - ‘గురు సాక్షాత్ పరబ్రహ్మ’ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ స్కూలులో పిల్లలకు నడవడిక నేర్పే పద్ధతులు దగ్గరనుంచి గమనించిన తరవాత వారి అదృష్టాన్ని గురించి మరో సారి అసూయపడాల్సి వచ్చింది. తోటి విద్యార్ధులతో మాట్లాడడం నుంచి సభ్య సమాజంలో మెలగడం వరకు – చిన్ననాటినుంచే ఇస్తున్న తర్పీదు చూడముచ్చటగా వుంది. తమకున్న పరిమితుల్లోనే సమాజానికి ఎలా సేవ చేయవచ్చన్నది ఆచరణలో బోధిస్తారు. 

 స్కూలు మొదలయ్యేటప్పుడు, తిరిగి వొదిలేటప్పుడు టీచర్లు, కొందరు ఎంపిక చేసిన విద్యార్ధులు స్కూలు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తారు. అలాగే పేరెంట్స్ తోడు లేకుండా స్కూలు బస్సుల్లో ఒంటరిగా వచ్చే పిల్లలను జాగ్రత్తగా దింపుకుని వారి వారి తరగతి గదులకు చేరుస్తారు. బస్సునుంచి దిగుతున్నప్పుడే పిల్లల పేర్లను రిజిస్టర్ లో రాసుకుంటారు. ఈ బస్సులకూ, మధ్యాహ్న భోజనానికీ ఎలాటి చార్జీ వుండదు.

 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్ధులు పై తరగతికి మారుతున్నప్పుడు పాత సహాధ్యాయుల ఫోటోలు, వారి వివరాలతో కూడిన ఒక చిన్న ఆల్బం ఇస్తారు. వారిలో కొందరు సొంత కారణాలపై వేరే స్కూలుకు మారినప్పటికీ, వారి జ్ఞాపకాలు భద్రంగా వుంచుకునేందుకు ఈ ఆల్బంలు పనికివస్తాయి. తరగతి గదిలో ఏటిపొడుగునా విద్యార్ధులు సృజనాత్మకతను రంగరించి చేసిన పనులను, అంటే గీసిన బొమ్మలు, వేసిన చిత్రాలు, తీసిన ఫోటోలు, రాసిన కధలు, వ్యాసాలు అన్నింటినీ జాగ్రత్తగా భద్ర పరచి ఒక చక్కని ఫోల్డర్ రూపంలో ఏడాది చివరిలో అప్పగిస్తారు. తలిదండ్రులతో తరచుగా సమావేశాలు జరిపి వారి పిల్లల పురోగతిని గురించి వివరిస్తారు.

హైదరాబాదులో వేలకొద్దీ ఫీజుల రూపంలో దండుకునే అనేక విద్యా సంస్తలు కొన్నింటిలో ఇదేమాదిరి విధానాలు,వసతులు వుండవచ్చు. కానీ ఇంతవరకు ముచ్చటించుకున్నది ఏదో కార్పొరేటు స్కూలు గురించి కాదు. అమెరికాలో ఒక సర్కారు బడిని గురించి మాత్రమె. ఈ వాస్తవం గమనంలో వుంచుకుంటే – ఈ స్కూలుని చూసి ఎందుకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందో అర్ధం అవుతుంది.

కలాం గారు  కోరుకున్నట్టు – మనందరం ఒక కల కనాలి. కనడమే  కాదు దాన్ని  నిజం చేసుకోవాలి.

ఇలాటి స్కూళ్ళు గ్రామ గ్రామానికీ రావాలన్నదే ఆ కల. పైసా ఖర్చు లేకుండా,పేదా గొప్పా తారతమ్యం లేకుండా -  పిల్లలందరికీ ‘ఇలాటి చిన్నతనం’ వారి  సొంతం కావాలి.

భావి భారతం ‘భద్ర భారతం’ కావాలంటే, భావి తరం ‘మేధావి భారతం’ కావాలంటే – చదువు నేర్చుకోవడం అన్న ఒక్క ‘హక్కు’ ఇచ్చి వూరుకుంటే సరిపోదు- ఇంత ఆనందంగా, హాయిగా, ఆడుతూ, పాడుతూ చదువుకోగల ‘సర్కారు స్కూళ్ళు’ - చదువుకుందామనుకునే ప్రతి ఒక్కరికీ హక్కు భుక్తం కావాలి.

అయితే-

వీటన్నిటినీ ఆచరణలోకి తీసుకురావాలంటే కొన్నింటికి తప్పనిసరిగా డబ్బు కావాలి. అది ఎప్పుడూ కొరతే. మరికొన్నింటికి కేవలం చిత్త శుద్ధి వుంటే చాలు .కానీ, ఇప్పుడు బాగా కొరతగా వున్నది దీనికే. టీవీ చర్చల్లో తప్ప ఎక్కడా వినబడని ఈ "చిత్తశుద్ధి" అంత తేలిగ్గా దొరుకుతుందా?


(మా మనుమరాళ్ల స్కూలు వద్ద నేనూ, మా ఆవిడా. ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ విద్యార్ధులు)

(2010)

ఆప్త వాక్యం

 

'క్రమక్రమముగా కొలువుకూటము రణకూటమగుచున్నది, పదువురుండగనే నా మాటలాలకింపుడు' అంటాడు పాండవుల పనుపున దూతగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవసభలో ధృతరాష్ట్రుడితో.

ఇప్పుడు నవ్యాంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో రాజకీయ రంగం సమరాంగణంగా మారుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ఉవ్వెత్తుతున్నాయి. మీడియాలో చర్చలు, ఎవరివాదాన్ని వారు బలంగా వినిపించే ధోరణితో పేట్రేగిపోతూ దారితప్పుతున్నాయి. ఒకరు చెప్పేది మరొకరు వినిపించుకోరు. తమ మాటే వినాలని, తమ ప్రశ్నకే జవాబు చెప్పి తీరాలని, అ సమాధానం కూడా తమకు అనుకూలంగా వుండాలని పట్టుబట్టే పెడ ధోరణే జడలు విప్పుకుంటోంది.  మీడియా కూడా  పార్టీల వారీగా విడిపోయి ఒక వైపు మాత్రమే కొమ్ముకాసే  దురదృష్టకర పరిస్థితి  రూపుదిద్దుకుంటోంది. ఈ వేడిలో, వాడిలో వివేచన వెనక్కు తప్పుకుంటోంది. తప్పు మీదంటే మీదని బురద చల్లుకునే క్రమంలో తప్పు చేయడం అసలు తప్పేకాదన్న రీతిలో భాష్యాలు చెబుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అనుచర గణాలు ఈ విషయంలో నాయకులను మించి గొంతులు పెంచి నానా యాగీ చేస్తున్నాయి.  కొంత కాలం క్రితం ఒక టీవీ ఛానల్ చర్చకు వచ్చిన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిస్సిగ్గుగా చెప్పాడు, 'ఈ విషయంలో జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి' అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది యెంత అప్రదిష్ట.

రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అవకాశం కోసం అర్ధం కానట్టు వుండిపోతున్నారు అనుకోవాలి.

ఏవిషయం వచ్చినా, సమస్య వచ్చినా ముందు రాజకీయం అనే రక్కసి అందులో చేరి పడగలు విప్పుతోంది. దాంతో ప్రతిదీ రాజకీయమయం అయిపోతోంది. ఎవడో ఒకడు ఒక నేరం చేస్తాడు. లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అతడు ఏదో ఒక పార్టీవాడు అయితే ఇక అంతే సంగతులు. పార్టీ అతడికి కొమ్ము కాస్తుంది. వెంటనే ఎదుటి పక్షం తన పల్లవి తాను అందుకుంటుంది. అధికారం అడ్డం పెట్టుకుని చేసిన తప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని  ఎదురు ఆరోపణ చేస్తుంది. అంతటితో ఆగకుండా వ్యవస్థలను కూడా రంగంలోకి ఈడుస్తుంది. వ్యవస్థలను మేనేజ్ చేసేవారిని మానేజ్ చేస్తూ చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్నారని అంటూ రాజ్యాంగ వ్యవస్థల ప్రతిష్టను మసక బార్చే ప్రయత్నం చేస్తుంది.   ఇలా రాజకీయం రంగ ప్రవేశం చేయడంతో ఆ మనిషి చేసిన నేరం కాస్తా నేపధ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇలాటి విషయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రతి పార్టీ చేసే పని ఇదే. నేరం చేసిన వాడు పరాయి వాడు అయితే, 'చట్టం తన పని తను చేసుకు పోతుంది, చట్టానికి ఎవరూ అతీతులు కారు' అంటూ బుడిబుడి రాగాలు తీస్తారు. తమవాడే అయితే 'చట్టం పాలకుల చేతిలో చుట్టం' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పుచేసిన వాడిని పోలీసులు విచారిస్తే, అది సరికాదు, సీబీ సీ ఐ డీ దర్యాప్తు కోసం గగ్గోలు పెడతారు. సీబీ సీ ఐ డీ విచారణ చేస్తుంటే, అది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, సీ బీ ఐ దర్యాప్తు అంటారు. సేబీఐ పరిస్తితీ ఇంతే, అది కేంద్రం చేతిలో ఆటబొమ్మ అంటారు. ఇలా వ్యవస్థలను భ్రష్టుపట్టించే అసంబద్ధ ఆరోపణలు చేస్తూ విచారణను నీరుకారుస్తారు. నేరారోపణలు ఎదుర్కున్న వ్యక్తులు కొన్నాళ్ళ తరువాత హాయిగా జనం మధ్యే తిరుగుతుంటారు. ఇదీ కొన్నేళ్లుగా జరుగుతున్న కధ. ఇప్పుడు నడుస్తున్న కధ. నడవబోయే కధ కూడా దానికి పొడిగింపే.

ముందు చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు కలగలసిపోయినట్టు ఈ నాడు నేరాలు, రాజకీయాలు జమిలిగా ముడి పడిపోయాయి. వీటిని విడదీసే జల్లెడలు లేవు. వున్నా రాజకీయ పార్టీలకి వాటి అవసరం లేదు. వాళ్లకి కావాల్సిందల్లా తమ వాళ్ళను కాపాడుకోవడం, వాళ్లు నేరస్తులయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఎదుటివాడయితే చేతిలో వున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టడం. మనవాడయితే వాటినుంచి బయటపడవేయడం. ఇదే నేటి రాజకీయ ధర్మం. 'ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంద'ని ఉవాచ. రాజకీయ పార్టీలు కూడా తాము నమ్మిన ' ధర్మమే' తమను కాపాడుతుందని భావిస్తూ తాము పెంచి పోషిస్తున్న 'అధర్మాన్నే' సదా కాపాడుతూ పోతుంటారు.

రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు జనంలోకి చేరిపోయి వారు కూడా రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు మరింత బిగిసిపోకముందే రాజకీయ నాయకులు కళ్ళు తెరవాలి. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.

'చెడు వినకు, కనకు, మాట్లాడకు' అనే సూక్తికి తనదయిన రీతిలో బొమ్మ గీసిన మహానుభావులు, కీర్తిశేషులు 'బాపు'గారికి కృతజ్ఞతలతో

 

9, జూన్ 2021, బుధవారం

బేనిషా మామిడి పండ్లు

  కొంతమంది పిల్లలు ఉన్నారు, కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి.

ఒక్కొక్క పిల్లవానికి ఒక్కొక్క పండు ఇస్తే ఒక పండు మిగులుతుంది. ఒక్కొక్క పిల్లవానికి రెండు పండ్లు ఇస్తే ఒక పిల్లవానికి పండ్లు తక్కువవుతాయి. అయితే ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి?

జవాబు: ముగ్గురు పిల్లలు, నాలుగు మామిడి పండ్లు

పిల్లలు ముగ్గురు, పండ్లు నాలుగు కాబట్టి ఓకే. పేచీ లేదు. మా సమస్య అది కాదు. వున్నది ఇంట్లో ముగ్గురం. అందులో ఇద్దరు, నా  కొడుకు, కోడలు మామిడి పండ్లు అంతగా ఇష్టపడరు. నా కోసం వాళ్ళు బజార్లో కొన్ని పళ్ళు కొనుక్కుని వస్తారు, కర్ఫ్యూ లేని సమయంలో. అవన్నీ నేను తినలేను. పాడయిపోతాయని నేనే వంట మనిషికి, పని మనిషికి ఇచ్చేస్తుంటాను.

అలాంటిది నిన్న ఒక మిత్రుడు, మిత్రుడు అనడం కంటే పెద్దమనిషి అనడమే సబబు, రెండు బాక్సులు ఇంటికి పంపారు. తెరిచి చూస్తే అన్నీ మామిడి పండ్లు. అవి వారి తోటలో కాసినవని చెప్పారు. పేరు బేనిషా మామిడి.

ఏం చేసుకుంటాం అని ఆలోచించే లోగా ఇద్దరూ కలిసి అపార్ట్ మెంటులో అందరికీ పంచి పెట్టి వచ్చారు. వలలికి (వంటావిడ), పనివాళ్ళకి పంచేశారు. మంచి పనిచేశారు అనిపించింది.

కాగా మిగిలినవి ఇవి.



ఇప్పుడూ అదే సమస్య. వున్నది ముగ్గురం, మిగిలినవి ఇన్ని.

చూద్దాం.  ప్రతి మామిడిపండు మీద అది తినేవాడి పేరు రాసే వుంటుంది కదా!

(09-06-2021)