9, జూన్ 2021, బుధవారం
సినీ నటి మామిడికాయ తింటే! – భండారు శ్రీనివాసరావు
సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు
సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.
“ఆయన నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి
వరసలో పక్కపక్కనే కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు.
పోయి ముందు వరసలో కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి
సమాధానం ఏమిటో తెలుసాండి. చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో
చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా వారి గురించి సమాచారం తెలిసి ఇంకా
ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు స్వామి సేవలో వుండడం
కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా వుండలేరు. అది
మాత్రం వాస్తవం”
శర్మగారికి బాగా చదివే అలవాటు వుంది.
యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన సంగతులు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటారు. శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.
అలా ఈరోజు ఓ విషయం చెప్పారు.
విశాఖ పోర్టు ట్రస్ట్ లో
పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో పరిచయం
కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు
యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై వైజాగులో
తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన ‘గణపతి రామాయణ
సుధ’ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు
వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా
తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
“వారొకసారి విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు
చేసుకున్నాను కూడా. ఇప్పుడు కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు. ఎలా అని గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను
వందలు పెట్టి వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”
శర్మగారు చెబుతూనే వున్నారు . ఇంతలో
“ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను. అదేమిటో సమయానికి
మరిచిపోతుంటాను”
అంత పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో
చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా వింటుంటే ఆ వయసులో వారికి
అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు. ఇంతవరకు చూడనూ లేదు)
7, జూన్ 2021, సోమవారం
ప్రాణం విలువ పెరుగుతోందా!
ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో ప్రజల మధ్యనే తిరుగుతూ ‘ఆఖరి నెత్తురు బొట్టు వరకు ప్రజలకొరకు పోరాడతాం’ అనే రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే అంగరక్షకుల వలయాల నడుమ జీవిస్తూ తమను గద్దె నెక్కించిన ప్రజలకు దూరం అవుతూ వుండడం మనం చూస్తూ వున్నాం.
ఇందుకు
మినహాయింపులు కూడా లేకపోలేదు.
మాజీ ప్రధాని
మన్మోహన్ సింగ్ పీవీ హయాములో మొదటి సారి కేంద్ర ఆర్ధిక మంత్రి అయ్యారు. ముంబైలో
స్టేట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి ఠంచనుగా వచ్చారు. బ్యాంకు చైర్మన్ తో
సహా సీనియర్ అధికారులందరూ ఎదురు చూస్తుండగా ఒక అంబాసిడర్ కారు వచ్చింది. అందులో
నుంచి మన్మోహన్ సింగ్ కారు తలుపు తీసుకుని కిందికి దిగారు. వెంట ఒక పియ్యే, డ్రైవర్ ఇంతే
సిబ్బంది. వెనుక ఒక పోలీసు జీపులో ఒక ఇనస్పెక్టర్, ఒక కనిస్టీబు, ఇంతే సెక్యూరిటీ.
అది చూసి బ్యాంకు
అధికారులు నివ్వెర పోయారు. అంతకు ముందు వారు అనేకమంది ఆర్ధిక మంత్రుల హంగూ, ఆర్భాటం ఎరిగిన
వారు కనుకనే వారిలో ఈ నివ్వెరపాటు.
6, జూన్ 2021, ఆదివారం
ఆడామగా జర సోచో – భండారు శ్రీనివాసరావు
5, జూన్ 2021, శనివారం
ఏమి బాధలే హలా! - భండారు శ్రీనివాసరావు
పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా ఆ తప్పును ఎత్తి చూపించారు. యాభయ్ ఏళ్ళ తరువాత కూడా నాకిప్పటికీ ఇది జ్ఞాపకం వుంది.
అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు
కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.
ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో
కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి
వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత
అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి పల్లకీలో విలాసంగా
కూర్చున్న ఆ పండితుడు అంటాడు ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని. భాద అన్న
ముక్క వినగానే బోయీ వేషంలో వున్న కాళిదాసు, ‘’భాద అనే
నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము మోయడం బాధగా లేదులే’ అంటాడు.
దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ.
మౌనమే నీ భాష – భండారు శ్రీనివాసరావు
అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో – చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ – పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని – బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత మురిసిపోయేది. ‘నా బాబే! నా తండ్రే!’ అంటూ గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.’ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ ‘ అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా’ అనేసి ఆ దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.
కరివేపాకూ, తోటకూరో ఏదో ఒక పేరుతొ చిన్నప్పుడు
చదువుకున్న ఈ నీతికధ అందరికీ తెలిసిందే. ఇటీవల జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న
కధనాలు గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత
వుందనిపిస్తోంది.
మంచివాళ్ల మౌనం
మరీ ప్రమాదం అని పెద్దలు జయప్రకాశ్ నారాయణ్
చెబుతుంటారు. అయితే, చెబితే వినేవాళ్ళు లేనప్పుడు, వినిపించుకునే పరిస్తితి లేనప్పుడు మౌనమే శ్రేయస్కరమని విదురనీతి చెబుతోంది. నాకు అర్ధం
అయినంతవరకు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న అర్ధం లేని రగడలో విదురుడి మాటే రైటని పిస్తోంది.
ఇలా మాట్లాడ్డం
తగదు అని ఒకరికి చెప్పబోయేలోగా మరొకరు రెచ్చిపోయి మాట్లాడతారు. తెరవబోయిన నోరు
ఠక్కున మూతబడిపోతుంది.
4, జూన్ 2021, శుక్రవారం
నా మొదటి స్కూటరు – భండారు శ్రీనివాసరావు
కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని భాస్కరులు (పత్రికా రచయితలు) ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవదానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు. ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం.