7, జూన్ 2021, సోమవారం

ప్రాణం విలువ పెరుగుతోందా!

 

ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో ప్రజల మధ్యనే తిరుగుతూ ‘ఆఖరి నెత్తురు బొట్టు వరకు ప్రజలకొరకు పోరాడతాం’ అనే రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే అంగరక్షకుల వలయాల నడుమ జీవిస్తూ తమను గద్దె నెక్కించిన ప్రజలకు దూరం అవుతూ వుండడం మనం చూస్తూ వున్నాం.

ఇందుకు మినహాయింపులు కూడా లేకపోలేదు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పీవీ హయాములో మొదటి సారి కేంద్ర ఆర్ధిక మంత్రి అయ్యారు. ముంబైలో స్టేట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి ఠంచనుగా వచ్చారు. బ్యాంకు చైర్మన్ తో సహా సీనియర్ అధికారులందరూ ఎదురు చూస్తుండగా ఒక అంబాసిడర్ కారు వచ్చింది. అందులో నుంచి మన్మోహన్ సింగ్ కారు తలుపు తీసుకుని కిందికి దిగారు. వెంట ఒక పియ్యే, డ్రైవర్ ఇంతే సిబ్బంది. వెనుక ఒక పోలీసు జీపులో ఒక ఇనస్పెక్టర్, ఒక కనిస్టీబు, ఇంతే సెక్యూరిటీ.

అది చూసి బ్యాంకు అధికారులు నివ్వెర పోయారు. అంతకు ముందు వారు అనేకమంది ఆర్ధిక మంత్రుల హంగూ, ఆర్భాటం ఎరిగిన వారు కనుకనే వారిలో ఈ నివ్వెరపాటు.

6, జూన్ 2021, ఆదివారం

ఆడామగా జర సోచో – భండారు శ్రీనివాసరావు


మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
మనం ఒకరిని అభిమానించేది.......
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికేనా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికేనా?
పొద్దస్తమానం ఆగర్భ శత్రువుల్లా పోట్లాడుకోవడానికేనా?
ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో
ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో
ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో
ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడకుండా ఉండడానికి వీలుంటుందో
ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే విశాలమైన మనస్సు ఉంటుందో
ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలనే పంతాలు, పట్టింపులు వుండవో
ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు” మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే అలాటివాళ్ళు గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి.

5, జూన్ 2021, శనివారం

ఏమి బాధలే హలా! - భండారు శ్రీనివాసరావు

 పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా ఆ తప్పును ఎత్తి చూపించారు. యాభయ్  ఏళ్ళ తరువాత కూడా నాకిప్పటికీ ఇది జ్ఞాపకం వుంది.

అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.

ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి పల్లకీలో విలాసంగా కూర్చున్న ఆ పండితుడు అంటాడు ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని. భాద అన్న ముక్క వినగానే బోయీ వేషంలో వున్న కాళిదాసు, ‘’భాద అనే నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము మోయడం బాధగా లేదులే’ అంటాడు.

దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ.

మౌనమే నీ భాష – భండారు శ్రీనివాసరావు

 అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో – చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ – పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని – బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత మురిసిపోయేది. ‘నా బాబే! నా తండ్రే!’ అంటూ గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.’ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ ‘ అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా’ అనేసి ఆ దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.

కరివేపాకూ, తోటకూరో  ఏదో ఒక పేరుతొ  చిన్నప్పుడు  చదువుకున్న ఈ నీతికధ అందరికీ తెలిసిందే. ఇటీవల  జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.

మంచివాళ్ల మౌనం మరీ ప్రమాదం అని పెద్దలు జయప్రకాశ్ నారాయణ్ చెబుతుంటారు. అయితే, చెబితే వినేవాళ్ళు లేనప్పుడు, వినిపించుకునే పరిస్తితి లేనప్పుడు మౌనమే శ్రేయస్కరమని విదురనీతి చెబుతోంది. నాకు అర్ధం అయినంతవరకు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న అర్ధం లేని రగడలో విదురుడి మాటే రైటని పిస్తోంది.

ఇలా మాట్లాడ్డం తగదు అని ఒకరికి చెప్పబోయేలోగా మరొకరు రెచ్చిపోయి మాట్లాడతారు. తెరవబోయిన నోరు ఠక్కున మూతబడిపోతుంది.

4, జూన్ 2021, శుక్రవారం

నా మొదటి స్కూటరు – భండారు శ్రీనివాసరావు

 కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని భాస్కరులు (పత్రికా రచయితలు) ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవదానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు. ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం.

రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను. బాంకు అధికారి స్కూటరు లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే, గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు.
1987లో మాస్కో వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు జరిగిన ‘హెల్మెట్ ధరించని జర్నలిస్ట్ అరెస్ట్’ అనే సంచలన ఉదంతానికి కారణమైన ‘నేను’, ఆరోజు వెడుతున్నది ఈ గిర్నార్ స్కూటర్ మీదనే.
ఆ కధ అనేక మలుపులు తిరిగి సుఖాంతం అయింది కానీ ఆనాటి నుంచి స్కూటర్ ఎక్కలేదు.




ఇక హెల్మెట్ ఉపాఖ్యానం ఏమిటంటే:
హెల్మెట్ నిబంధన పాటించనందుకు నన్ను ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పట్టుకుని హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ లో పెట్టారు. ఈ సంగతి తెలిసి వివిధ పత్రికల్లో పనిచేసే విలేకరులు, సీనియర్లు స్టేషన్ బయట ధర్నా చేశారు. మర్నాడు అసెంబ్లీ ఈ కారణంగా వాయిదా పడింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటన పై దర్యాపుకు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్ గా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పోలీసు అధికారిని బదిలీ చేశారు ఈ క్రమంలో..
చిత్రంగా మరో మలుపు తిరిగింది. రాయలసీమకు చెందిన ఆ న్యాయమూర్తికి గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడ కలుసుకోవాలని నాకు వర్తమానం పంపారు.
తీరా వెడితే ఆ రిటైర్డ్ జడ్జి గారి అమ్మాయి రేడియోలో నా జీవన స్రవంతి కార్యక్రమానికి అభిమాని. నన్ను చూస్తాను అంటే ఆయన వెంటబెట్టుకుని వచ్చారు. హెల్మెట్ లేదని నన్ను పట్టుకున్న ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు. ఆయన మా ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగికి చుట్టం. అతడ్ని తీసుకుని మా ఇంటికి వచ్చి తన ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా చూడమని కోరాడు. ఆ విషయం నేను అప్పుడే మరచిపోయాను కాబట్టి మీకు అపకారం చేసే ఉద్దేశ్యం నాకు లేదని అతడికి భరోసా ఇచ్చాను.
తర్వాత అదే మాట జడ్జి గారెతో చెప్పాను. త్వరలోనే నేను మాస్కో పోతున్నాను కాబట్టి, ఎవరూ నా కారణంగా బాధ పడడం ఇష్టం లేదని అన్నాను. జరిగింది దురదృష్టకర సంఘటన కాబట్టి మరచిపోవడమే దీనికి పరిష్కారం అని కూడా చెప్పాను.
ఆయన నా మాట మన్నించారు. ఆవిధంగానే కేసు మూసేశారు.
తర్వాత చాలా కాలానికి (అప్పుడు నేను ఇండియాలో లేను) అసెంబ్లీకి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది.
కధకు ఆవిధంగా శుభం కార్డు పడింది.

3, జూన్ 2021, గురువారం

ఆధ్యాత్మిక రచనల మార్గంలో జ్వాలా

సుందరకాండ మందర మకరందం, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధ కాండ, యుద్ధకాండ, ధర్మధ్వజం, ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాధలు, శ్రీ మహా భాగవత కధలు, శ్రీ మదాంధ్ర మహాభారత కధలు. ఇవన్నీ ఉద్గ్రంథాలు. ఇంకా అనేకం వున్నాయి. స్థలాభావం కారణంగా పేర్కొనడం లేదు. అన్నీ కలిపితే వేల పుటలు దాటిపోతాయి. రాసింది మాత్రం ఒక్క చేయి. ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ, సంసార బాధ్యతల్లో మెలిగే మనిషికి ఎలా సాధ్యం? అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవడం జ్వాలాకు పుట్టుకతో వచ్చిన విద్య కాదు, పట్టుదలతో అలవరచుకున్న అభ్యాసం.
ప్రచురణ కాగానే నాకొక కాపీ ఇవ్వడం ఈ కరోనా రోజుల్లో పంపడం ఆయనకు అలవాటు. అలాగే ఇవ్వాల కూడా కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారత కధలు అనే పేరుతొ రాసిన ఆస్వాదన గ్రంధాన్ని పంపాడు.
కరోనా కోరల్లో చిక్కుకున్న రోజుల్లో కూడా రామ నామం మరవకుండా, ఆధ్యాత్మిక గ్రంధ రచన కొనసాగిస్తూ వచ్చాడు అనడానికి ఈ కొత్త గ్రంధం ఓ ఉదాహరణ.
భగవదనుగ్రహం ఆ కుటుంబానికి సర్వదా లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందుకు అర్హత ఆయనే సంపాదించుకున్నాడు ఇలాంటి అద్భుత రచనలు చేసి. మరో విశేషం ఏమిటంటే జ్వాలా ఇంతవరకు రాసిన పుస్తకాలను మార్కెట్లో పెట్టి విక్రయించలేదు.
ఆయన ఆ సర్వేశ్వరుడి నీడలో ఉండబట్టే ఆ పరమేశ్వరుడు జ్వాలా చేత ఈ సత్కార్య రచన చేయిస్తున్నాడు.



(03-06-2021)

పెళ్లి చేసి చూడు, పార్టీ మారి చూడు

 పూర్వం పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు చెప్పాలి. ఫోటోలు  చూపించాలి. జాతకాలు చెప్పించాలి. ఏడు తరాల ఆరాలు తీసుకోవాలి. మంచి చెడ్డలు కనుక్కోవాలి. తర్వాత పెళ్ళికొడుకు తల్లీ తండ్రీ వచ్చి పిల్లను చూడాలి. తర్వాత కొన్ని రోజులకు పెళ్ళికొడుకు చెల్లెలు లేదా దూరపు చుట్టాలు వచ్చి చూడాలి. జాతకాలు వగైరా చూపించుకోవాలి. ఈలోగా కట్నం లాంఛనాల వంటి వాటి విషయంలో ఒక స్పష్టత రావాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకునే వరుడు, స్నేహితులతో కలిసి  వచ్చి కాబోయే వధువును చూసి, పెద్దవాళ్ళతో మాట్లాడి ఏ విషయం కబురు చేస్తామని చెప్పాలి. అంతా అనుకున్నట్టు జరుగుతోంది అనే నమ్మకం కుదిరిన తర్వాత లగ్గాలు పెట్టుకోవాలి.

ఇంత తతంగం నెలలు, వారాల పాటు సాగితే కానీ పెళ్లి సంబంధం ఒక పట్టాన తేలేది కాదు, కుదిరేది కాదు, పెళ్లి పీటల దాకా వెళ్ళేది కాదు.

ఇప్పుడంటే పరిస్థితులు మారాయి.  అమెరికా సంబంధాలు వచ్చి పడి వారం పది రోజుల్లోనే పెళ్లి చూపులు,  మాట్లాడుకోవడాలు, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవడాలు చకచకా జరిగిపోతున్నాయి (కరోనా ముందు సంగతి అనుకోండి)

అలాగే, వెనక పార్టీ మారేవారు ఒక ప్రకటన చేసేవారు, పలానా పార్టీలో చేరినట్టు. పలానా పార్టీవాళ్లు మరో ప్రకటన చేసేవాళ్ళు పలానా నాయకుడిని తమ పార్టీలో చేర్చుకున్నట్టు. అంతే! ఆ కధ అక్కడికి చెల్లు.

మరి ఇప్పుడో!

అధినాయకుడు సరే కానీ చుట్టూ ఉన్నవారి మూలంగా పార్టీ ప్రజల్లో చులకన అవుతోందని ముందుగా ఒక  ప్రకటన చేయాలి. దానిమీద టీవీల్లో రెండు మూడు రోజులు చర్చలు జరగాలి. కొన్నాళ్ళు ఆగి ఏకంగా అధినాయకుడినే విమర్శిస్తూ తన పేరుతొ కాకుండా లీకు వదలాలి.  దానిమీద చర్చ పూర్తిగా జరగనిచ్చి మీడియాలో వచ్చిన వార్తలు తప్పుడుతడకలు అని ఓ గంభీర ప్రకటన చేయాలి. ఆఖరి శ్వాస వరకు తాను పార్టీని వీడేది లేదని బల్ల గుద్ది చెప్పాలి.

దాని మీద  సుదీర్ఘ కాలం జరిగే చర్చను మౌనంగా వీక్షించి మళ్ళీ మరో లీకు వదలాలి, అధినాయకత్వం తీరు మార్చుకోకపోతే తాను పార్టీని విడిచి పెట్టాల్సి వస్తుందని. మళ్ళీ దాని మీద టీవీల్లో విస్తృత చర్చ. మీడియా వక్రీకరించిందని  ఖండించాలి. అధినాయకుడికి తాను సర్వదా విధేయుడిని  చెప్పాలి.

కొన్ని రోజులు ఆగి పలానా పార్టీలో చేరబోతున్నట్టు మరో లీకు వదలాలి.  దాని మీద కొన్నాళ్ళు చర్చ. పలానా పార్టీ నాయకులతో రహస్య భేటీ అంటూ  మరో లీకు. దాని మీద మరో కొన్నాళ్ళు చర్చ. పార్టీ మారేది లేదని మరో ప్రకటన.

ఇంత తంతు ఓ  మూడు నెలలు సాగిన తర్వాత కూడా ఆయన పార్టీ మారాడా లేదా అనేది ఓ చర్చనీయాంశమే మీడియాకి.

ప్రతిరోజూ వార్తల్లో నానడానికి ఇదో మార్గం అని గిట్టని వాళ్ళ ఉవాచ.

(03-06-2021)