21, ఏప్రిల్ 2021, బుధవారం

ఒక రోగి ఆత్మ కధ

ఏడాది కిందటి మాటే! అవి లాక్ డౌన్ పూర్తిగా అమలు అవుతున్న రోజులు. మా బంధువు ఒకరు కరోనాతో ఆసుపత్రిలో చేరారు.  లక్షణాలు కనబడగానే  జాగ్రత్త  పడివుంటే పరిస్థితి ఆసుపత్రి వరకు వచ్చేది కాదేమో. కానీ ఈ కొత్త రోగం గురించి రోజుకో కొత్త సంగతి బయటకు వస్తున్న రోజులు కావడంతో ముందు భయంతో కొన్ని రోజులు తటపటాయించారు. పాజిటివ్ రాగానే డాక్టర్లు ఇచ్చిన మందులు శ్రద్ధగా వేసుకోకపోవడం, రుచి తెలియక సరిగా ఆహారం తీసుకోకపోవడం ఇవన్నీ అందుకు  కారణాలే.

చివరికి తెలిసిన వారి సాయంతో ఒక  మధ్య సైజు  కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అప్పటి పరిస్థితి దృష్ట్యా నేరుగా ఐ.సీ.యు. లో చేరాల్సి వచ్చింది. ఆ హాల్లో ఎటు  చూసినా కరోనా రోగులే.

ఇక్కడి నుంచి అతడు నాకు చెప్పిన సంగతులు అతడి మాటల్లోనే:

“మొదటి రెండు మూడు రోజులు  నాకు ఏమి జరుగుతున్నదో  తెలిసేది కాదు. కొద్దిగా మందులు వంట బట్టిన తరువాత  కొద్ది కొద్దిగా  పరిస్థితులు అర్ధం అవడం మొదలయింది. అంతవరకూ ఇంట్లో భార్యా పిల్లల మధ్య ఉంటూ వచ్చిన నాకు అక్కడి వాతావరణం చూసి ఒక్క సారిగా గుండె జారిపోయింది. ఐ.సీ.యు. ఎలా వుంటుంది అనే  విషయంలో నాకు కొంత అవగాహన వుంది. కానీ ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా వున్నాయి. రోగులు తప్ప డాక్టర్లు అరుదుగా కనిపిస్తున్నారు. అప్పుడప్పుడూ నర్సులు వచ్చి చుట్టూ అమర్చిన మిషన్ల వంక చూసి ఏదో రాసుకుని వెళ్లి పోతున్నారు. పైగా తెల్లటి ఉడుపుల్లో కనిపించే వైద్య సిబ్బంది, మొహమూ, శరీరమూ కప్పివుంచే  అవేవో నీలం రంగు దుస్తులు ధరించి వుండడంతో పరిస్థితి మరింత భయానకంగా అనిపించింది.

వయసు అరవై దాటినా ఇంతవరకు పెద్ద రోగాలబారిన పడి ఆసుపత్రి పాలు కాలేదు. ఐ.సీ.యు. లో అన్ని రోజులు  వుండడం అనేది  పూర్తిగా కొత్త. టైముకు బ్రేక్  ఫాస్టు, ఆహారం తెచ్చి పెడుతున్నారు. మందులు ఇచ్చి వెడుతున్నారు. ఆ వాతావరణంలో తిండి సయించలేదు. తిండి సరిగా తినకపోవడంతో నీరసం ఆవహించింది. గెలికి పారేసినట్టు వున్న భోజనం ప్లేటు గమనించిన ఓ నర్సు ఈ పేషెంటు బొత్తిగా తిండితినడం లేదని డాక్టరుకు చెప్పింది.

డాక్టరు వచ్చి గట్టిగానే చెప్పాడు.

“మేము ఇస్తున్న మందులు పనిచేయాలి అంటే తిండి సరిగా తినాలి. తినకపోతే  గొంతులో  గొట్టం వేసి  ఆహారం ఇవ్వాల్సి వుంటుంది జాగ్రత్త

అప్పుడు ఆలోచించుకున్నాను. పూర్తి స్వస్టత చిక్కి ఇంటికి వెళ్లి మళ్ళీ భార్యాపిల్లల్ని చూడాలి అనుకుంటే ఇష్టం వున్నా లేకపోయినా పెట్టింది తిని తీరాలి. గత్యంతరం లేదు అని అర్ధం అయింది.

ఆరోజు నుంచి నాలో కొంత మార్పు వచ్చింది. అన్నంతో పాటు రోజుకు మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్లు ఇచ్చేవాళ్ళు. అవి ఎప్పుడూ తినలేదని కాదు కాని  అలా మూడేసి గుడ్లు ముప్పూటా  తినడం అలవాటు లేని పని. అయినా సర్దుకున్నాను. మందులతో పాటు కాస్త ఆహారం కూడా పడడంతో మూడు నాలుగు  రోజుల్లో కొంత ఓపిక వచ్చింది. 

ఓపికతో పాటే లేనిపోని ఆలోచనలు. నిద్ర పట్టేది కాదు. ఇంట్లో వాళ్ళు ఎలా వున్నారో అనే భయం పట్టుకుంది. ఆసుపత్రి నిబంధనల ప్రకారం సెల్ ఫోన్ కు అనుమతి లేదు. కొందరు పేషెంట్లు, చేరిన కొత్తల్లో పరిస్థితులకు భయపడిపోయి  వీడియోలు తీసి బయటకు పంపుతూ ఉండడంతో అవి వైరల్ అయి చెడ్డపేరు వస్తోందని వాళ్ళు ఈ ఆంక్షలు పెట్టారట.

ఒక రోజు డాక్టరును నిలదీసాను. సెల్ ఫోన్ లేకపోతే నా సంగతి సరే, ఇంట్లో వాళ్ళు ఏమయ్యారో ఎలా వున్నారో నాకు తెలియడం ఎలా! అని. (నిజానికి వాళ్ళు ప్రతిరోజూ ఆసుపత్రికి ఫోను చేసి నా యోగక్షేమాలు విచారిస్తూనే వున్నారు. ఆ సంగతి నాకు తెలియదు. లాక్ డౌన్ వల్ల వాళ్ళు ఆసుపత్రికి రాలేరు)

అప్పుడు ఒక మనిషిని చూపెట్టాడు. ‘అతడిని అడగండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తాడు’ అని చెప్పాడు.

ఇదొక కార్పొరేట్ మోసం అనిపించింది. మన దగ్గర సెల్ లేకుండా చేసి బయట వ్యక్తి ఫోన్ వాడుకోమని చెబుతున్నారు అంటే ఇందులో ఏదో మతలబు వుందనిపించింది. అతడ్ని దగ్గరకు పిలిచాను. అతడూ డాక్టర్ల మాదిరిగానే పూర్తిగా కరోనా రక్షణ కవచం దుస్తుల్లోనే వున్నాడు. ఒక్క  కళ్ళజోడు తప్ప ఆయన్ని గుర్తు పట్టే అవకాశమే లేదు.

వచ్చి ‘నెంబరు చెప్పండి, కలిపి ఇస్తాను’ అన్నాడు. మళ్ళీ సమస్య.  ఒక్క నెంబరూ గుర్తుకు రాలేదు. అన్నీ ఫీడ్ చేసుకుని ఫోన్లు చేసే పద్దతికి అలవాటు పడడంతో పిల్లల నెంబర్లు కూడా గుర్తు పెట్టుకోవడం మరచిపోతున్నాము. అప్పుడు గుర్తుకు వచ్చింది.  ఎప్పుడో మాంధాతల కాలంలో పెట్టించి, ఇప్పుడు మూగ నోము పట్టి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయిన లాండ్ లైన్ నెంబరు చెప్పాను. కానీ అది ఇంట్లో వాళ్ళు ఎత్తుతారా అని మరో సందేహం. ఈలోగా మరో అనుమానం. ఇప్పుడు ఇతడికి డబ్బులు ఇవ్వడం ఎలా! నా దగ్గర పర్సు కూడా లేదు. అతడితో అదే విషయం చెప్పాను. చివర్లో బిల్లు సెటిల్  చేసేటప్పుడు  మీ డబ్బులు కూడా మా వాళ్ళు ఇస్తారు, పరవాలేదా అని.

అతడు నవ్వి (నవ్వు కనపడలేదు, వినపడింది) అన్నాడు.

‘సారూ. ఇప్పుడు మీరు కోలుకోవాలి. అది ముఖ్యం. డబ్బుల సంగతి ఎందుకు ఆలోచిస్తారు అన్నాడు.

మొత్తం మీద ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాను. నా గొంతు వినగానే వాళ్ళు బోలెడు సంతోషపడ్డారు. నాకయితే ఆకాశంలో తేలుతున్నట్టు అనిపించింది. మా వాళ్ళు తెలివిగా, నేను ఫోన్ చేసిన మొబైల్ కు కొన్ని నెంబర్లు పంపారు. వాటిని ఒక కాగితం మీద రాసి ఇమ్మని అతడినే అడిగాను. అతడు, ‘అక్కర లేదు ఈ నెంబర్లు నేను ఎరెజ్ చేయకుండా దాచి పెడతాను. కావాల్సినప్పుడు  వీడియో కాల్ చేసి  మాట్లాడుకోండి, రెండు నిమిషాలే సుమా! ఎందుకంటే  ఇక్కడి  పేషెంట్లు అందరూ ఆత్రుతగా  నాకోసం ఎదురు చూస్తుంటారు.’

నిజంగా మహానుభావుడు. ఓపిక చేసుకుని చేతులు జోడించి దణ్ణం పెట్టాను.

తరువాత అతడి గురించి తోటి పేషెంట్లు వివరాలు చెప్పారు.

అతడొక ముస్లిం. ఆ ఆసుపత్రి దగ్గరలోనే ఏదో చిన్న దుకాణం. అతడూ కరోనా బాధితుడే. మా లాగా ఆసుపత్రిలో చేరి ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేక అవస్థలు పడ్డవాడే. జబ్బు నయమయ్యాక,  అతడు ఆసుపత్రి వారి దగ్గర పర్మిషన్ తీసుకుని, రోజూ ఒక టైములో వచ్చి  ఇక్కడి పేషెంట్లకు ఉచిత సేవ చేస్తున్నాడు.

మా బామ్మ చెప్పినట్టు భగవంతుడు మన చుట్టూ వుండే మనుషుల రూపంలోనే ఉంటాడు.

ఆసుపత్రి భోజనానికి అలవాటు పడ్డాను. మందులు పనిచేస్తున్నాయని నర్సులు చెబుతున్నారు. ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్ చేసి అందర్నీ చూస్తూ మాట్లాడడానికి ఆ ముస్లిం సోదరుడు వున్నాడు. చుట్టూ కోలుకుంటున్న పేషెంట్లు వున్నారు. మొదట్లో వున్న భయాలు, సంకోచాలు పోయాయి.

ఒకరోజు డాక్టరు వచ్చి మిమ్మల్ని రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తాము అనే శుభ వార్త చెప్పారు. వెంటిలేటర్ లేకుండా ఆక్సిజన్ సరిపడా అందుతోందో లేదో నిర్ధారణ చేయడానికి ఒక రోజు ఆసుపత్రి గదిలో వుంచి తర్వాత ఇంటికి పంపుతారట. ఇది తెలిసి ఇంట్లో వాళ్ళ సంతోషం చెప్పనలవి కాదు. నేను పుట్టక ముందు మా నాన్నగారు స్వాతంత్ర సమరంలో పద్దెనిమిది నెలలు  జైల్లో వున్నారు. విడుదల అయి తిరిగి వచ్చిన రోజు ఇంట్లో బయటా సంబరాలు చేసుకున్నారని మా బామ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు కరోనా కోరల నుంచి బయట పడే నా గురించి కూడా మా ఇంట్లో అవే సంబరాలు.

ఐ.సీ.యు. నుంచి గదికి తీసుకు వెళ్ళగానే నర్సును ముందు అడిగిన మాట ఒక్కటే.

‘బాత్ర్రూం ఎక్కడ? స్నానం చేయాలి

‘సరే కాని జాగ్రత్త! లోపల గడియ పెట్టుకోవద్దు. మీరింకా  నీరసంగానే వున్నారు. మేము గది బయటే ఉంటాము. అవసరం అనిపిస్తే పిలవండి అని జాగ్రత్తలు చెప్పి బయటకు వెళ్ళింది.

బాత్‌రూం అద్దంలో కమిపించిన ఆకారం చూసి వెన్నులో వణుకు పుట్టింది. నేను మరీ బొద్దు మనిషిని కాకపోయినా అంత నాజూకు మనిషిని కూడా కాదు. మరి ఇలా పుల్లలా అయిపోయానేమిటి?

తోకటపా: పదహారు రోజులు ఆసుపత్రిలో వుండి, మృత్యువు నోట్లో తలపెట్టి వెనక్కి వచ్చిన రోగిగా నేను చెప్పేది ఒక్కటే!

‘కరోనా అనగానే భయపడకండి. మనం భయపడితే మరింత భయపెడుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మీ జోలికే రాదు. ఒకవేళ వచ్చినా దానికి ముకుతాడు వేసే మందులు వున్నాయి. డాక్టర్లు వున్నారు, నర్సులు వున్నారు. మీకు వెన్నంటి ధైర్యం చెప్పే కుటుంబం వుంది. అన్నింటికీ మించి సేవాభావంతో సేవ చేసే ముస్లిం ఫ్రెండ్ వంటి వ్యక్తులు వున్నారు.

ఒక కరోనా రోగిగా చెబుతున్నాను.

‘ధైర్యంగా వుంటే కరోనాను జయించడం కష్టం కాదు

(21-04-2021)          

అతి విలువైన సంచితం – భండారు శ్రీనివాసరావు

 

పుస్తక ప్రేమికులు దేవినేని మధుసూదన రావు గారు. సాంఘిక మాధ్యమాల ద్వారానే పరిచయం. ఎప్పుడో ముప్పయ్యేళ్ల క్రితం నా మాస్కో అనుభవాలను బ్లాగులో రాసుకుంటే వరసగా చదివి, వాటిని పుస్తకంగా తీసుకుని రావాలన్న వయోధిక పాత్రికేయ సంఘం వారి పూనికకు మద్దతుగా నిలిచారు. తనకు నచ్చిన పుస్తకాన్ని వందల ప్రతులు ముద్రించి తెలిసిన వారి వివాహాలలో పెళ్లి కానుకగా అందచేయడం ఆయనకు ఉన్న ఓ గొప్ప అలవాటు. అందుకే వారికి పుస్తక ప్రేమికులు అని ట్యాగ్ లైన్ తగిలిస్తుంటాను.
మళ్ళీ ఇన్నాళ్ళకు మరో పుస్తక ప్రేమికులు ఫేస్ బుక్ లో దర్శనం ఇచ్చారు. వారి పేరు సుప్రసిద్ధం. V. Chowdary Jampala గారు. పరిచయం అక్కరలేని నామధేయం.
జీవిత చరిత్రలకు సంబంధించి జంపాల గారు ఈరోజు రెండు పోస్టులు పెట్టారు. అసూయ కలిగించే విధంగా వున్నది వారి గ్రంధ సేకరణ అలవాటు. దాదాపు నూట అరవై జీవిత చరిత్రల పుస్తకాల ముఖచిత్రాలను ఈ పోస్టుల్లో పొందుపరిచారు. ఈ సేకరణ నిమిత్తం వారు ఎంతగా శ్రమ పడివుంటారో అనిపించింది. ఏమైనా ఇంతటి విలువైన సంపదను కష్టపడి సముపార్జించుకున్నందుకు అభినందనలు, అభివాదాలు. అన్నీ అని చెప్పలేను కానీ అతి కొద్దిగా అయినా వీటిలో కొన్ని నా దగ్గర కూడా వున్నందుకు గర్వపడ్డాను.
మరొక గర్వ కారణం కూడా వుంది. నేను రాసిన వాటిలో మొట్టమొదటిసారి, బహుశా చివరి సారి కూడా కావచ్చు, ‘అచ్చు మొహం’ చూసిన నా ఏకైక పుస్తకం మాస్కో అనుభవాల సమాహారం ‘మార్పు చూసిన కళ్ళు’ కూడా వారి పుస్తక ఖజానాలో చోటు చేసుకుంది. ఈ అద్భుత అవకాశం కల్పించిన వారికి, వారి పుస్తక ప్రేమకు సహస్రాధిక వందనాలు. – భండారు శ్రీనివాసరావు
(21-04-2021)
May be an image of book and text that says 'మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు) భండారు శ్రీనివాసరావు தனး పాత్రికేయ Meser Journalists ప్రచురణ వయోధిక త్రికేయ సంఘం ఆంధ్రప్రదేశ్'

Like
Comment
Share

0 Comments


గాయత్రి మంత్రం అంతరార్ధం - భండారు శ్రీనివాసరావు

 ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం

గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.

ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.

గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను

స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన.

గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.

ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి.

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.

మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.

ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.

ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.

గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.

సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.

కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా

భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.

గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం.

అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.

ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం

తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.

ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు.

ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.

ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి అది సాధ్యం అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.

గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు.

భర్గో దేవస్య ధీమహి

భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.

అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ

దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు.

ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే

మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.

దియోయోనః ప్రచోదయాత్

ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.

భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.

కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.

ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద

(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)

 

 

20, ఏప్రిల్ 2021, మంగళవారం

కాలనాగు కరోనా

 

ఈ పోస్టు భయపెట్టడానికో, ఆందోళనకు గురిచేయడానికో ఎంతమాత్రం కాదు. కొన్ని విషాదాలు కళ్ళు తెరిపించాలి. ఎలాంటి కాలనాగుతో మనం కాలక్షేపం చేస్తున్నామో తెలుసుకోవడానికే ఈ పోస్టు.

విజయవాడలో ఆయనో లాయరు. మూడు రోజుల క్రితమే తల్లి, బాబాయి ఇద్దరూ చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఈరోజు తెల్లవారుఝామున తండ్రి మరణించారు. కాసేపటికే ఆ లాయరు గారు కూడా కన్ను మూశారు.
కొద్ది రోజుల వ్యవధిలోనే సంభవించిన ఈ వరస చావులకు కారణం కరోనా. కేవలం కరోనా!
కరోనా కాటుకు ఓ కుటుంబం బలయిపోయింది.

నేనెందుకు వదులుకుంటాను?

 

ఒక ముని నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక తేలు ప్రవాహంలో కొట్టుకు పోవడం చూసి జాలిపడి దాన్ని ఒక ఆకులోకి తీసుకుని ఒడ్డుపైకి విసిరివేసేలోగా ఆ తేలు తన స్వభావం కొద్దీ ముని చేతిపై కుట్టింది. దాంతో అది చేతినుంచి జారి మళ్ళీ నీళ్ళల్లో పడింది. బాధను అణచుకుంటూనే ముని తిరిగి ఆ తేలును రక్షించే ప్రయత్నం చేసాడు. తేలు మళ్ళీ కుట్టింది. తిరిగి నీళ్ళలో పడి కొట్టుకుపోతున్న ఆ తేలును రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వృశ్చికం అడిగింది.

ఓ మునీశ్వరా! కుట్టడం నా స్వభావం అని తెలిసికూడా కుట్టిన ప్రతిసారీ నన్ను నా మానాన వదిలివేయకుండా కాపాడుతూనే వున్నావు కారణమేమిటి?’

అందుకు జవాబుగా ఆ తపస్వి నవ్వి ఇలా చెప్పాడు.

కుట్టడం నీ స్వభావం. సరే. మరి ఆపదలో ఉన్నవారిని కాపాడడం నా స్వభావం. జన్మతః వచ్చిన నీ స్వభావాన్ని నువ్వు వదులుకోకుండా వున్నప్పుడు నాది నేనెలా వదులుకుంటాను చెప్పు’



ఈ కధ ఎందుకు చెబుతున్నాను అంటే, మనలో ప్రతి ఒక్కరికి ఓ స్వభావం వుంటుంది. అలా ఎందుకు రాస్తారు, ఇలా ఎందుకు కామెంటు చేస్తారు అని అప్పుడప్పుడు తోటివారిపై కొంత అసహనం ప్రదర్శించడం కద్దు. అది వారి స్వభావమని సరిపెట్టుకుంటే ఇక చిక్కేలేదు.



 

19, ఏప్రిల్ 2021, సోమవారం

అభిమాన ధనమే నిజమైన సంపద

(ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం)

గమనిక: ఈ వ్యాస పరిధి  ఒక విలేకరిగా నాకు తెలిసిన చంద్రబాబు నాయుడికే పరిమితం. అంటే రాష్ట్రవిభజనకు పూర్వం వరకే. ఆ తరువాత నేనెన్నడూ వారిని ముఖాముఖి కలుసుకున్నది లేదు)

 

ప్రతి ఏడాది ఏప్రిల్ పందొమ్మిదవ తేదీన మాకు తెలిసిన ఓ విజయవాడ వాస్తవ్యురాలు, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు,  బస్సులో బయలుదేరి మరునాటి ఉదయం కల్లా హైదరాబాదు చేరుకొని చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి మళ్ళీ బస్సెక్కి బెజవాడ వెళ్ళిపోవడం నాకు తెలుసు. ఎందుకంటే ఆరోజు ముఖ్యమంత్రి నివాసంలో రద్దీని తప్పించి, ఆయన్ని కలుసుకునే వెసులుబాటు కల్పించడం అనే బాధ్యత ఆవిడ నా భుజస్కందాలపై వుంచేది. ఆయన అధికారంలో వున్నప్పుడు, లేనప్పుడు కూడా ఆవిడ అలా ఏటా హైదరాబాదు వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోవడం ఏళ్ళ తరబడి చూస్తూ వచ్చిన నాకు చంద్రబాబు అదృష్టవంతులైన రాజకీయ నాయకుల కోవలో ఒకరని అనిపించేది.

ఇప్పుడు కూడా ఆవిడ అలాగే వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే 2005  లో నేను రిటైర్ అయిన తర్వాత ఇలాంటి పనులు నెత్తికెత్తుకోవడం మానేశాను.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నాకూ, ఆయన పేషీ అధికారులకు నడుమ స్నేహపూర్వక కీచులాటలు నడుస్తుండేవి.

“ముఖ్యమంత్రితో వ్యవహరించాల్సిన పద్దతి ఇది కాదు, శ్రీనివాసరావు గారు..” అన్నాడో అధికారి ఓ రోజు నాతో తన  మనసులోని అసహనాన్ని సాధ్యమైనంత మృదువైన మాటల్లో వ్యక్తపరుస్తూ.

ఈ ఐ.ఏ.ఎస్. అధికారి చాలా చాలా సౌమ్యుడు. పేషీలో పనిచేసే అధికారులను బట్టి ముఖ్యమంత్రి పనితీరు అంచనాలు ఆధారపడివుంటాయంటారు. ఆ రోజుల్లో సమర్దుడయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో ఆయన పేషీ అధికారుల పాత్రకూడా వుంది.

ఇది మరీ అన్యాయం. ఆయన ముఖ్యమంత్రి. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఇలా పెళ్ళిళ్ళకూ, వేడుకలకూ పిలుస్తూ పొతే ఏం బాగుంటుంది. మీ ఇంట్లో పెళ్లి అంటే అర్ధం వుంది, ఇలా మీకు తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లకు కూడా ముఖ్యమంత్రి రావాలంటే ఎలా!” అనేవారు  సౌమ్యుడయిన ఆ అధికారి.

ఎమోనండీ! అది నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా  పిలిచిన వాళ్ళు ఆయన పెళ్ళికి వస్తే మహాదానందపడిపోయేవాళ్ళు. వున్న వూళ్ళో హైదరాబాదులోనే పెళ్లి. ఒక్కసారి వీలు చేసుకుని వస్తే సరిపోతుంది. అందుకే నేను అడగగానే ఆయన ఒప్పుకుని వస్తామని మాట ఇచ్చారు. ఇక మీ ఇష్టం” అనేవాడిని నేను.

తరవాత కధ చెప్పాల్సిన పనిలేదు. ఏ పెళ్ళికి ముఖ్యమంత్రిని పిలిచినా ఆయన వీలు చేసుకుని ఏదో ఒక సమయంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించి, పూల బొకే ఇచ్చి వెళ్ళేవాళ్ళు. కొన్ని చోట్ల భద్రతాపరమయిన ఇబ్బందులు అడ్డు వచ్చేవి. ముఖ్యమంత్రి వెళ్ళే చోట కనీసం రెండు లిఫ్టులు వుండాలి. రెండు ద్వారాలు వుండాలి. సెక్యూరిటీ వాళ్ళు ఇలాంటివి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్న తరువాతనే క్లియరెన్సు ఇచ్చేవాళ్ళు. కానీ, నా విషయంలో వాళ్ళు అనేకసార్లు రాజీ పడాల్సిన పరిస్తితి ఎదురయ్యేది. పెళ్ళిళ్ళకే కాదు, చిన్న చిన్న స్కూళ్ళ వార్షికోత్సవాలు, ఆటలపోటీలు ఇలా దేనికీ పిలిచినా చంద్రబాబునాయుడు మారుమాట లేకుండా వచ్చిపోయేవారు. ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇది కాదని పేషీ అధికారి కినుక వహించడం వెనుక కధ ఇదే.

రేపు ఏప్రిల్ ఇరవై చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. వారికి నా శుభాకాంక్షలు.

(19-04-2021)