21, ఏప్రిల్ 2021, బుధవారం
అతి విలువైన సంచితం – భండారు శ్రీనివాసరావు
గాయత్రి మంత్రం అంతరార్ధం - భండారు శ్రీనివాసరావు
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
‘న గాయత్ర్యాః పరం
మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం
గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం
లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర
ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’
అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి
ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.
ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి
మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం
జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే
ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై
నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం
మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి
పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన.
గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి
పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ
మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.
ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన
నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే
లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి.
ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే.
మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ
తిరుగుతుంటే, ఆ
చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న
లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.
మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని
ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై
రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు
పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో
అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని
శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.
• ఓం భూర్భు వస్వః -
భూర్ అంటే భూమి, భువః
– అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత
(గెలాక్సీ)
ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్
ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే
చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో
అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు
ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.
గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ
బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో
సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని
తెలియచేస్తున్నాయి.
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర
మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని
ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో
వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం
ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ
వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ”
అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం.
అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు.
అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.
ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత
విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని
ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి
వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది.
దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే
ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.
తత్స వితుర్వరేణ్యం
తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు
(నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.
ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా
అని అవగతమవుతుంది. రూపం, నామం
రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది
దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు.
ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు
తెలియని, మనకు
కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి
చెప్పాడు.
ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే
కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల
సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న
నైపుణ్యాన్ని బట్టి అది సాధ్యం అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు
చెప్పింది ఇదే.
గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం
చేసుకోవచ్చు.
భర్గో దేవస్య ధీమహి
భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన
భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని
జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు.
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ
ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని
ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.
దియోయోనః ప్రచోదయాత్
ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ
భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.
ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో
చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.
భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః)
అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి
కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ
(తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి
ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.
కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని
ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం
సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా
చేయాలి.
ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద
(అన్ని దిక్కులనుంచి
మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)
20, ఏప్రిల్ 2021, మంగళవారం
కాలనాగు కరోనా
నేనెందుకు వదులుకుంటాను?
ఒక ముని నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ
సమయంలో ఒక తేలు ప్రవాహంలో కొట్టుకు పోవడం చూసి జాలిపడి దాన్ని ఒక ఆకులోకి తీసుకుని
ఒడ్డుపైకి విసిరివేసేలోగా ఆ తేలు తన స్వభావం కొద్దీ ముని చేతిపై కుట్టింది. దాంతో
అది చేతినుంచి జారి మళ్ళీ నీళ్ళల్లో పడింది. బాధను అణచుకుంటూనే ముని తిరిగి ఆ
తేలును రక్షించే ప్రయత్నం చేసాడు. తేలు మళ్ళీ కుట్టింది. తిరిగి నీళ్ళలో పడి
కొట్టుకుపోతున్న ఆ తేలును రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వృశ్చికం అడిగింది.
‘ఓ మునీశ్వరా! కుట్టడం నా స్వభావం అని తెలిసికూడా కుట్టిన ప్రతిసారీ నన్ను
నా మానాన వదిలివేయకుండా కాపాడుతూనే వున్నావు కారణమేమిటి?’
అందుకు జవాబుగా ఆ తపస్వి నవ్వి ఇలా
చెప్పాడు.
‘కుట్టడం నీ స్వభావం. సరే. మరి ఆపదలో ఉన్నవారిని కాపాడడం నా స్వభావం. జన్మతః
వచ్చిన నీ స్వభావాన్ని నువ్వు వదులుకోకుండా వున్నప్పుడు నాది నేనెలా వదులుకుంటాను
చెప్పు’
ఈ కధ ఎందుకు చెబుతున్నాను అంటే, మనలో ప్రతి ఒక్కరికి ఓ స్వభావం వుంటుంది. అలా ఎందుకు రాస్తారు, ఇలా ఎందుకు కామెంటు చేస్తారు అని అప్పుడప్పుడు తోటివారిపై కొంత అసహనం
ప్రదర్శించడం కద్దు. అది వారి స్వభావమని సరిపెట్టుకుంటే ఇక చిక్కేలేదు.
19, ఏప్రిల్ 2021, సోమవారం
అభిమాన ధనమే నిజమైన సంపద
(ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం)
గమనిక: ఈ వ్యాస పరిధి ఒక విలేకరిగా నాకు తెలిసిన చంద్రబాబు నాయుడికే
పరిమితం. అంటే రాష్ట్రవిభజనకు పూర్వం వరకే. ఆ తరువాత నేనెన్నడూ వారిని ముఖాముఖి
కలుసుకున్నది లేదు)
ప్రతి ఏడాది ఏప్రిల్ పందొమ్మిదవ తేదీన
మాకు తెలిసిన ఓ విజయవాడ వాస్తవ్యురాలు, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు, బస్సులో బయలుదేరి మరునాటి ఉదయం కల్లా హైదరాబాదు
చేరుకొని చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి మళ్ళీ బస్సెక్కి
బెజవాడ వెళ్ళిపోవడం నాకు తెలుసు. ఎందుకంటే ఆరోజు ముఖ్యమంత్రి నివాసంలో రద్దీని
తప్పించి, ఆయన్ని కలుసుకునే వెసులుబాటు కల్పించడం అనే బాధ్యత ఆవిడ నా భుజస్కందాలపై
వుంచేది. ఆయన అధికారంలో వున్నప్పుడు, లేనప్పుడు కూడా ఆవిడ అలా ఏటా
హైదరాబాదు వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోవడం ఏళ్ళ తరబడి చూస్తూ వచ్చిన నాకు
చంద్రబాబు అదృష్టవంతులైన రాజకీయ నాయకుల కోవలో ఒకరని అనిపించేది.
ఇప్పుడు కూడా ఆవిడ అలాగే వెళ్లి
శుభాకాంక్షలు చెబుతున్నారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే 2005 లో నేను రిటైర్ అయిన తర్వాత ఇలాంటి పనులు
నెత్తికెత్తుకోవడం మానేశాను.
చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం
ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నాకూ, ఆయన పేషీ అధికారులకు నడుమ స్నేహపూర్వక
కీచులాటలు నడుస్తుండేవి.
“ముఖ్యమంత్రితో వ్యవహరించాల్సిన
పద్దతి ఇది కాదు, శ్రీనివాసరావు గారు..” అన్నాడో అధికారి ఓ రోజు నాతో తన మనసులోని అసహనాన్ని సాధ్యమైనంత మృదువైన మాటల్లో
వ్యక్తపరుస్తూ.
ఈ ఐ.ఏ.ఎస్.
అధికారి చాలా చాలా సౌమ్యుడు. పేషీలో పనిచేసే అధికారులను బట్టి ముఖ్యమంత్రి పనితీరు
అంచనాలు ఆధారపడివుంటాయంటారు. ఆ రోజుల్లో సమర్దుడయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు
పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో ఆయన పేషీ అధికారుల పాత్రకూడా వుంది.
“ఇది మరీ అన్యాయం.
ఆయన ముఖ్యమంత్రి. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఇలా పెళ్ళిళ్ళకూ, వేడుకలకూ పిలుస్తూ
పొతే ఏం బాగుంటుంది. మీ ఇంట్లో పెళ్లి అంటే అర్ధం వుంది, ఇలా మీకు తెలిసిన
వాళ్ళ పెళ్లిళ్లకు కూడా ముఖ్యమంత్రి రావాలంటే ఎలా!” అనేవారు సౌమ్యుడయిన ఆ అధికారి.
“ఎమోనండీ! అది నాకు
తెలియదు. నాకు తెలిసిందల్లా పిలిచిన వాళ్ళు
ఆయన పెళ్ళికి వస్తే మహాదానందపడిపోయేవాళ్ళు. వున్న వూళ్ళో హైదరాబాదులోనే పెళ్లి.
ఒక్కసారి వీలు చేసుకుని వస్తే సరిపోతుంది. అందుకే నేను అడగగానే ఆయన ఒప్పుకుని
వస్తామని మాట ఇచ్చారు. ఇక మీ ఇష్టం” అనేవాడిని నేను.
తరవాత కధ
చెప్పాల్సిన పనిలేదు. ఏ పెళ్ళికి ముఖ్యమంత్రిని పిలిచినా ఆయన వీలు చేసుకుని ఏదో ఒక
సమయంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించి, పూల బొకే ఇచ్చి
వెళ్ళేవాళ్ళు. కొన్ని చోట్ల భద్రతాపరమయిన ఇబ్బందులు అడ్డు వచ్చేవి. ముఖ్యమంత్రి
వెళ్ళే చోట కనీసం రెండు లిఫ్టులు వుండాలి. రెండు ద్వారాలు వుండాలి. సెక్యూరిటీ
వాళ్ళు ఇలాంటివి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్న తరువాతనే క్లియరెన్సు
ఇచ్చేవాళ్ళు. కానీ, నా విషయంలో వాళ్ళు అనేకసార్లు రాజీ పడాల్సిన పరిస్తితి ఎదురయ్యేది.
పెళ్ళిళ్ళకే కాదు, చిన్న చిన్న స్కూళ్ళ వార్షికోత్సవాలు, ఆటలపోటీలు ఇలా
దేనికీ పిలిచినా చంద్రబాబునాయుడు మారుమాట లేకుండా వచ్చిపోయేవారు. ముఖ్యమంత్రితో
వ్యవహరించే తీరు ఇది కాదని పేషీ అధికారి కినుక వహించడం వెనుక కధ ఇదే.
రేపు
ఏప్రిల్ ఇరవై చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. వారికి నా శుభాకాంక్షలు.
(19-04-2021)
పసునూరు శ్రీధర్ బాబు
2005 లో నేను దూరదర్సన్ నుంచి రిటైర్ అయినదాకా ప్రైవేట్ ఛానళ్ల వాళ్ళు చర్చలకు పిలిచినా వెళ్ళేవాడిని కాను. ఆ తరువాత మొట్టమొదట కుడి కాలు పెట్టింది మాత్రం HMTVలో. రామచంద్రమూర్తి గారి సారధ్యంలో నడుస్తుండేది. ఏ.ఎస్. రావు నగర్ లో స్టూడియో. నేను వుండేది ఎల్లారెడ్డి గూడాలో.
ప్రతి మంగళవారం నాకు అక్కడ ఉభయం. ఉదయం అయిదున్నరకల్లా
టీవీ వారి ఇన్నోవా వాహనం మా ఇంటి ముందు రెడీగా వుండేది. పోవడానికి నలభయ్ అయిదు
నిమిషాల పైమాటే. వచ్చేటప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి గంట పట్టేది.
అక్కడ మొదటి పరిచయం శ్రీధర్ బాబుతో. చిదిమితే పాలు కారుతాయి
అన్నట్టు వుండేవారు. పదహారేళ్ళు గడిచినా ఇప్పటికీ అలానే ఉన్నట్టున్నారు. ప్రశ్న
అడిగితే సున్నితంగా వుండేది. మర్యాద ఉట్టిపడేది. ఆ రోజుల్లో ప్రతిరోజూ రాజకీయ
నాయకులతో పాటు విషయం విడమరిచి చెప్పడానికి
ఒకరిద్దరు విశ్లేషకులను కూడా పిలిచేవాళ్ళు.
ప్రొఫెసర్ కోదండ
రాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి
రవి, ఘంటా
చక్రపాణి, వి.
ప్రకాష్, జ్వాలా నరసింహారావు ఇలా అందరూ HMTV చర్చల్లో తారసపడేవారు. ఒక్కోసారి వీలునుబట్టి
రామచంద్ర మూర్తిగారు సైతం చర్చలో కూర్చొనేవారు. ఇప్పుడు మంత్రులుగా వున్న
అనేకమంది టీఆర్ ఎస్ నాయకులు కూడా పాల్గొనేవాళ్లు. ఆ రోజుల్లో తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతుండేది. చర్చలది కూడా అదే స్థాయి. కాకపొతే శ్రీధర్ బాబు గారి
చాకచక్యం వల్ల ఎప్పుడూ హద్దులు దాటేవి కాదు.
ఆ తర్వాత అయన మరి కొన్ని చానళ్ల్లలో పనిచేశారు. ప్రతి
రోజూ ఒక ఛానల్ కు వెళ్ళే వారాలబ్బాయిగా నేనూ ఆ టీవీ చర్చలకు వెడుతుండే వాడిని. ఆ
విధంగా బంధం గట్టిపడింది. తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయారు, బీబీసీ తెలుగు ఆహ్వానం మేరకు.
నిన్న ఉదయం ఫోన్ చేశారు. స్వరంలో అదే మృదుత్వం. చాలా
సేపు సంభాషణ నడిచింది. నా కంటే వేరే వ్యాపకం లేదు. కానీ ఆయన చేస్తున్నది బిజీ
ఉద్యోగం కదా!
‘హైదరాబాదు ఎప్పుడు వచ్చారు?’ అని అడిగాను.
‘లేదండీ ఢిల్లీలోనే వున్నాను. మీతో మాట్లాడాలి అనిపించి
ఫోన్ చేస్తున్నాను’ అన్నారాయన.
చాలా విషయాలు చెప్పారు. నేను చెప్పిన చాలా విషయాలు కూడా
ఓపిగ్గా విన్నారు.
‘హైదరాబాదు వచ్చినప్పుడు కలుస్తాను’ అనే మాటతో
ముగించారు.
ఎదిగినా ఒదిగి వుండడం చాలామందికి సాధ్యం కాని విషయం.
అదే శ్రీధర్ బాబులో నాకు నచ్చే విషయం.
(19-04-2021)
