14, ఏప్రిల్ 2021, బుధవారం

ఐ వాంట్ టు డై ఎట్ మై హోం

 

ఓ చేదు జ్ఞాపకానికి మూడేళ్లు

ఐ వాంట్ టు డై ఎట్ మై హోం

రెండు సంఘటనలు చెప్పుకుందాం.

2018 ఏప్రిల్ పద్నాలుగో తేదీ సాయంత్రం. కార్పొరేట్ ఆసుపత్రిలో ఓ డాక్టరు తన పేషెంటుతో చెబుతున్నాడు.

మీకు మంచి వైద్యం అందుతోంది, త్వరలో కోలుకుంటారు’

సరే కానీ డాక్టర్! ఐ వాంట్ టు డై ఎట్ మై హోమ్. ప్లీజ్ డిశ్చార్జ్’

ఆ పేషెంటు కూడా డాక్టరే. మా అక్కయ్య కుమారుడు డాక్టర్ ఏపీ రంగారావు.

పేషెంటు అభ్యర్ధన మేరకు డిశ్చార్జ్ చేసారు. ఇంటికి చేరాడు. పన్నెండు గంటలు కూడా కాలేదు. ఆ రాత్రి గడవలేదు. తెల్లవారుజామున కన్ను మూశాడు.

ఇక రెండోది.

మా దగ్గరి బంధువును హైదరాబాదులోని ఓ పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. వారిది ఈ ఊరు కాదు. పరిస్తితి క్రిటికల్ అన్నారు. రెండు రోజులు గడిస్తే కాని చెప్పలేమన్నారు. ‘ఒక టెస్ట్ చేయించాలి, అదిక్కడ లేదు, బయట వాళ్ళు చేస్తారు, ఏడు వేలు అవుతుంది, ఆ టెస్ట్ చేయడానికి వచ్చిన వాడికి ఏడు వేలు ఇవ్వండి’ అని చెప్పారు ఆసుపత్రివాళ్ళు. ఆ టెస్ట్ చేయించారు. డబ్బు చెల్లించారు. గంటలు గడవక ముందే ఆ పేషెంటు కన్ను మూసింది. ఆసుపత్రి ఫీజులన్నీ ముందే కట్టేశారు కనుక డిశ్చార్జ్ కి ఎక్కువ టైం తీసుకోలేదు. ఇంతలో వాళ్లకు అంతకు ఒక రోజు ముందు చేయించిన టెస్ట్ జ్ఞాపకం వచ్చి అడిగారు. ఆ రిజల్ట్ అయిదు రోజులకు వస్తుంది అని జవాబు.

రెండు రోజులు గడవటం కష్టం’ అని చెప్పిన వాళ్ళు అయిదు రోజుల తర్వాత రిజల్ట్ వచ్చే టెస్ట్, అదీ ఆసుపత్రి వెలుపల వాళ్ళ చేత చేయించడం ఏమిటో అర్ధం కాని స్తితిలోనే వాళ్ళు పేషెంటు బాడీ తీసుకుని ఊరికి వెళ్ళిపోయారు.

చికిత్స పేరుతో డబ్బులు పిండుతూ చేసే ఇటువంటి వైద్యాలకు డాక్టర్ రంగారావు పరమ విరోధి. అతితక్కువ ఖర్చుతో చేసే వైద్యమే పేదవారు ఎక్కువగా వుండే మన వంటి దేశాలకు ఉపయుక్తమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. స్వల్ప ఖర్చుతో సత్వర వైద్యం అనేది ఆయన నినాదం. చిన్న చిన్న అస్వస్థతలను శరీరమే తట్టుకుంటుందని, వీటి కోసం పెద్ద పెద్ద వైద్యాలు, పరీక్షలు అనవసరమన్నది డాక్టర్ రంగారావు నిశ్చితాభిప్రాయం. ఇలా వచ్చిన వారికి ఆయన ఓ క్రోసిన్ గోలీ వేసుకోండని చెబుతూ వుండేవారు. ఆయన అన్నట్టే వారికి స్వాంతన చేకూరేది. దానితో ఆయనకు డాక్టర్ క్రోసిన్ అనే పేరు వచ్చింది.

ఎన్నో ఏళ్ళక్రితం వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడు, యువ డాక్టర్లకు నేర్పే ఓ నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.

రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

నిజానికి డాక్టర్ రంగారావు ఒక మామూలు డాక్టర్. ‘నేనొక షరా మామూలు డాక్టర్ ని’ ఆయన అనుకున్నట్టయితే ఆయన కధే వేరుగా వుండేది. ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.

పది జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే చక్కబెట్టగలిగారు.

అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి కనుకనే ఇతరులకు అసాధ్యం అనుకున్న 108, 104 వంటి అనేక అపూర్వ పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.

సకల జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. కనుకనే ఆయన మరణించిన తర్వాత జ్వాలా వంటివారు డాక్టర్ రంగారావు గురించి రాసిన అనేక వ్యాసాలు పత్రికల్లో చదివి, ‘ఈయన ఇంతటి గొప్పవాడా, మాకు తెలియదే’ అంటూ ఫోన్లు చేసి కొనియాడిన అపరిచితులు అనేకమంది.

రేపు ఏప్రిల్ పదిహేను ఆయన వర్ధంతి.

 

13, ఏప్రిల్ 2021, మంగళవారం

సారీ చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే


సారీ చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే – భండారు శ్రీనివాసరావు  

ఏదైనా  అంశం పట్ల నాకున్న అభిప్రాయం నేను చెప్పిన తర్వాత దానిపై జరిగే వాదోపవాదాలతో నేను నిమిత్తం పెట్టుకోను. నా అభిప్రాయం తప్పని సహేతుకంగా ఎవరైనా చెబితే సరిదిద్దుకోవడానికీ, ఆ విషయం బహిరంగంగా అంగీకరించడానికి కూడా నేనెప్పుడు వెనుకాడింది లేదు.

నిన్న సుమన్ టీవీ వాళ్ళు రఘురామ కృష్ణం రాజు గారి ఎపిసోడ్ పై నా వివరణ ఇవ్వమని అడిగారు. ఇక ఆ విషయంలో చెప్పేది ఏమీ లేదని, నేను పొరపాటు మాట మాట్లాడి వుంటే తప్పకుండా వివరణ ఇచ్చేవాడిని కానీ  ఇది ఆ సందర్భం కాదని బదులిచ్చాను.

చివరికి సుమన్ టీవీ వాళ్ళే రాజుగారి నుంచి వివరణ తీసుకుని ఈ గందరగోళానికి శుభం కార్డు వేసినట్టున్నారు. ఈ విషయం SIVARAMAPRASAD KAPPAGANTU గారి  పోస్టు చూసేదాకా నాకు కూడా తెలియదు. వారికి కృతజ్ఞతలు.

(13-04-2021)


12, ఏప్రిల్ 2021, సోమవారం

Bandaru Srinivasarao Sensational Comments On AP 3 Capitals || Bandaru Sr...




వంటింట్లో 'పంచదార' అని రాసివున్న సీసాలో పంచదారే వుండాలని రూలేమీ లేదు. ఉప్పు అని కూడా ఉండవచ్చు. అలాంటిదే ఈ 'వంట' కూడా! కాకపొతే చక్కెరకు బదులు 'కాలకూట విషం' అని రాసారు. హెడ్డింగు చూసారు కదా! కాకపొతే లోపల పంచదార మాత్రమే వుంది.

Senior Journalist Bhandaru Srinivasa Rao Analysis on YS Sharmila Public ...

Senior Journalist Bhandaru Srinivasa Rao About MP Raghu Rama Krishna Raj...

రఘురామ కృష్ణంరాజు గారు

 


తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన పేరు. వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఈ వృత్తుల్లో వున్నవాళ్ళు చాలామంది వుంటారు. కానీ రాజు గారి స్థాయిలో ప్రాచుర్యం లభించడం దుర్లభం.

నేను యాక్టివ్  జర్నలిజంలో వున్నప్పుడు వారితో నాకు పరిచయం లేదు. నిజం చెప్పాలి అంటే అప్పుడూ, ఎపుడూ ముఖపరిచయం కూడా లేదు. నాకు దశాబ్దాలుగా పరిచయం వున్న కేవీపీ గారి వియ్యంకులు అని తెలుసు. టీవీల్లో  తరచూ చూస్తుంటాను. ఆయన మాటల్లో సున్నితమైన వ్యంగం దోబూచులాడుతూ వుంటుంది. అంచేత ఏ విషయం చెప్పినా, అది మనకు నచ్చినా  నచ్చకున్నా ఒక చెవి అటు వైపు వేసి వింటూనే ఉండేలా చేసే శక్తి ఆయన మాటల్లో వుంది.

 ఉదయం ఓ మిత్రుడు ఫోన్ చేసి ఆయన మీ గురించి టీవీ లో రాత్రి నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు అని అంటే ఆశ్చర్యం వేసింది. నేనెవరో వారికి తెలియదు, అయినా అలా మాట్లాడారు అంటే (ఆ మిత్రుడు లింక్ కూడా పంపించారు) కొంత వింతగానే వుంది. అయినా వారిని తప్పుపట్టలేము. ఎవరైనా నేను రాసిన  రాతలకు చెడుగా వ్యాఖ్యలు పెడితే ఎంత సర్దుకు పోదామని అనుకున్నా మనసు మూలల్లో చివుక్కుమంటూనే వుంటుంది. అలానే ఒక వెబ్ ఛానల్ లో ఆయన్ని గురించి నేను మాట్లాడిన సంగతులు విన్నప్పుడు రాజుగారికి కూడా అలానే అనిపించి వుంటుంది. మనసు నొప్పించడానికి పరిచయాలు అక్కరలేదు కదా!

కాకపోతే నేనేదో డబ్బులకోసం అలా మాట్లాడుతున్నాను అనే అర్ధంలో రాజుగారు మాట్లాడడం నాకూ  బాధగానే వుంది. ఈ విషయంలో నాకు నేను వివరణ ఇచ్చుకోవడం బాగుండదు. అందుకని అదేదో ఆ సందేహాన్ని రాజుగారు తమ వియ్యంకుడు కేవీపీ గారెని అడిగి నివృత్తి చేసుకుంటే బాగుంటుంది.  ఎందుకంటే నా గురించి బాగా తెలినిన రాజకీయ ప్రముఖులు  కొద్దిమందిలో వారూ ఒకరు.

ధన్యవాదాలు రాజుగారు.

(12- 04- 2021)

మిత్రుడు పంపిన లింక్ ఇదే!

https://m.facebook.com/story.php?story_fbid=916764009147663&id=100024422183203

సత్యం రామలింగరాజు రాయని డైరీ!

 

ఈరోజు అంటే ఈరోజని కాదు. ఆరేళ్ల క్రితం ఇదే రోజున సాక్షిలో ఒక కధనం వచ్చింది. ఒక పేరా బాగా నచ్చింది.
సాక్షి కధనంలో సత్యం రామలింగ రాజు చెప్పిన కొన్ని భాగాలు:
".....పేరు కోసం పరుగు, పేరు నిలుపుకోవడం కోసం పరుగు. పరువు గురించి పట్టించుకోలేనంత పరుగు. చివరకు ఇక్కడ (చెర్లపల్లి జైలు) వరకు తెచ్చిన పరుగు..."
"...ఈ మనసు, ఈ శరీరం ఇప్పటికే అలవాటు పడ్డాయి, ఒక్క టీవీకి తప్ప. జైలుకు వచ్చీ రాగానే అధికారులను అభ్యర్ధించాను, టీవీ లేని బ్యారక్ లోకి మార్చమని. సాధ్యం కాదన్నారు. టీవీ లేని బ్యారక్స్ జైల్లో లేవట. కానీ దేవుడు దయ తలిచాడు. ఓ బ్యారక్ లో టీవీ పనిచేయడం లేదు. నన్ను అందులోకి మార్చారు. అంతకన్నా అదృష్టం ఉంటుందా!"
"మానస సరోవరంలో దోమలు ఉంటాయా?! ‘‘ఇక్కడవి మామూలే’’ అని, అతి మామూలుగా అన్నాడు జైలు వార్డెన్. వెనకా ముందూ అతడు నాకేం గౌరవాలు తగిలించలేదు. ఖైదీలకు కనీస సంబోధనా పూర్వక మానవ మర్యాదలను ఆశించే హక్కు ఉంటుందా? ఆ మర్యాదలను ఇచ్చే అవసరం వార్డెన్‌కు ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుందా? చట్టంలో ఎలా ఉందో మరి. అయినా గౌరవ మర్యాదలతో ముఖ విలువను, వాటావిలువను పెంచుకోవలసిన కంపెనీలు ఇప్పుడు నా చేతిలో ఏమున్నాయి కనుక. ముందు సీబీఐ ఇచ్చిన ఈ స్పైరల్ బౌండు కేసు పూర్వాపరాల కాపీలో ఏముందో చూడాలి. దీన్ని చదివి, అర్థం చేసుకునేందుకు ఏడేళ్ల కాలం సరిపోతుందా! ఇంటి నుంచి తెచ్చుకున్న పుస్తకాలు.. వాటినెప్పుడు చదవాలి?
"నేనున్నది మానస సరోవర్ బ్లాకు. దోమలు ఉత్సాహంగా గుయ్యిమంటున్నాయి. కొత్త ఖైదీని దొరికాను కదా! మస్కిటో కాయిల్ తెప్పించి వెలిగించుకున్నాను. దోమలకు ముందుగా నేను అలవాటు పడతానా లేక మస్కిటో కాయిల్స్ అలవాటవుతాయా అన్నది త్వరలోనే తేలిపోవచ్చు. ఇది కోర్టులు నిర్ణయించే విషయం కాదు కాబట్టి.
"ఒకరోజు గడిచింది. చంచల్‌గూడా జైలుకు, చర్లపల్లి జైలుకు నాకేం పెద్ద తేడా కనిపించడం లేదు. అక్కడి స్పెషల్ కేటగిరీ, ఇక్కడి సాధారణ ఖైదీగిరీ రెండూ ఒకేలా ఉన్నాయి. జీవితంలోని ఎత్తుల్నీ, పల్లాల్నీ చూసినవాడికి బిర్యానీ అయితే ఏమిటి? మిర్యాల చారు అయితే ఏమిటి? నా డ్రెస్ నేను వేసుకుంటే ఏమిటి? జైలువాళ్లిచ్చే తెల్ల చొక్కా పైజమా అయితే ఏమిటి?
"ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి కిచిడి. మధ్యాహ్న భోజనంలోకి చపాతీ, అన్నం, పప్పు, రసం, అప్పడం. రాత్రి డిన్నర్‌లోకి మళ్లీ ఇదే వరుస. కానీ ఇక్కడ లంచ్‌టైమ్‌లో లంచ్, డిన్నర్‌టైమ్‌లో డిన్నర్ ఇలా కాదు. పావు తక్కువ తొమ్మిదికి బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక.. పదిన్నరకి లంచ్. సాయంత్రం నాలుగింటికి డిన్నర్! సత్యం రోజులు గుర్తొస్తున్నాయి. ఉదయం ఇంత తిని, మధ్యాహ్నం తిన్నాననిపించి, సాయంత్రం తినీతినకుండా, రాత్రి తింటే తిని... ఎంత అక్రమబద్ధంగా గడిచాయి!
"ఈ మనసు, శరీరం అన్నిటికీ అలవాటు పడ్డాయి. టీవీకి తప్ప! జైలుకు వచ్చీరాగానే జైలు అధికారులను అభ్యర్థించాను నన్ను టీవీలేని బ్యారక్‌లోకి మార్చమని. సాధ్యం కాదన్నారు. టీవీ సెట్ లేని బ్యారక్సే జైల్లో లేవట! కానీ దేవుడు దయతలిచాడు. ఓ బ్యారక్‌లో టీవీ పనిచేయడం లేదు. నన్ను అందులోకి మార్చారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా?" (12-04-2015)
NOTE: ప్రతి మనిషిలో పైకి కనపడని ఓ కవి హృదయం వుంటుంది. స్వయంగా నిర్మించుకున్న అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో క్షణం తీరిక లేకుండా గడిపిన రాజుగారిలోని కవిని, రచయితను ఈ వ్యాసంలో చూడవచ్చు. తన మనసులోని మాటను అభివ్యక్తీకరించిన తీరు నన్ను విశేషంగా ఆకట్టుకోవడమే దీన్ని పదిలంగా దాచుకోవడానికి కారణం.
రామలింగరాజు గారికి కృతజ్ఞతలతో