15, జూన్ 2019, శనివారం

సెక్యూరిటీ పంజరాల్లో వీవీఐపీలు – భండారు శ్రీనివాసరావు


అమెరికా  మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక చక్కని మాట చెప్పారు.
ఒక మంచి వాడిని, సద్గుణ సంపన్నుడిని ఎంపిక చేసుకోండి. అతడికి అధికారం ఇచ్చి చూడండి, ఇక అతడెలా మారిపోతాడన్నది మీరే చూస్తారు.
చాలామందికి అర్ధం కానిది ఇదే. అధికారంలో లేని సమయంలో ఎలాంటి బందోబస్తూ లేకుండా ప్రజల నడుమ అరమరికలు లేకుండా స్వేచ్చగా తిరిగిన రాజకీయ నాయకులు, పదవిలోకి రాగానే చుట్టూ భద్రతా వలయాలు నిర్మించుకుని ప్రజలకు ఎందుకు దూరం అవుతారన్నదే జవాబు లేని ప్రశ్న.
ప్రముఖుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా,  ఏదైనా  జరగరానిది జరిగితే అది సంచలన వార్త అవుతుందని, అంచేత సెక్యూరిటీ విషయంలో తాము చెప్పినట్టు విని తీరాల్సిందే అని భద్రతా విభాగం వారు నాయకులకు నొక్కి చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కావచ్చు. మరి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్న ఈ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు కదా, తద్వారా  ప్రముఖుల రాకపోకల సందర్భంలో బందోబస్తు పేరుతొ సామాన్యుల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను ఓ మేరకు తగ్గించవచ్చు కదా! అనేది  మామూలు మనుషులకు కలిగే సందేహం. ప్రస్తుతం అలా కూడా చేస్తున్నారు. అంగరక్షకుల చేతుల్లో చిన్న సైజు బ్రీఫ్ కేసులు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇటువంటి పరికరాలే వుంటాయి. అయినా ప్రముఖుల రాకకు ముందు, అది వివాహ వేడుక కావచ్చు,  సాధారణ సమావేశం కావచ్చు  పోలీసు జాగిలాలతో, బాంబులను నిర్వీర్యం చేసే దళాలతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం తప్పనిసరి. అలాగే ప్రముఖులు  ప్రయాణం చేసే మార్గాల్లోనే కాకుండా  భద్రతాధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ  మార్గాల్లో సయితం వాహనాల కదలికలపై ఆంక్షలు విధించడం కద్దు.  ఇంత శ్రమ పడ్డా, ఇంతటి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేదు. దరిమిలా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించి వాటిని మరింత పటిష్టం చేయడం ఒక్కటే జరుగుతోంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతూనే వస్తోంది.
పొతే, ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత, పటాటోపం, అధికార దర్పం ప్రదర్శించడానికే తప్ప వారి ప్రాణరక్షణకు సరిగా ఉపయోగపడడం లేదన్న అభియోగాలు వున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల పేరుతొ కొందరికి కల్పిస్తున్న భద్రత అపహాస్యానికి గురవుతున్న మాటా నిజమే.
ఈ విషయాలను మననం చేసుకోవడానికి ఓ కారణం వుంది. ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో సాధారణ ప్రయాణీకుడి మాదిరిగా సెక్యూరిటీ చెక్ ద్వారం నుంచి వెళ్ళారనీ, విమానం ఎక్కడానికి ఇతర ప్రయాణీకుల వలెనే షటిల్ బస్సులో ప్రయాణించారనీ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆయనకు చాలా సంవత్సరాలుగా జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటూ వచ్చింది. దేశ విదేశాల్లో ప్రయాణాలు అన్నీ చాలావరకు ప్రత్యేక విమానాల్లోనే చేసేవారు. ఆ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న సమాచారం ఇంతవరకు అధికారికంగా లేదు. ఎయిర్ పోర్ట్ నిబంధనలు ఉన్నప్పటికీ బాబుకు ఉన్న  ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎలా అనుమతించారో అర్ధం కాని విషయం. బహుశా, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.
ఈ ఉదంతం చాలా మందికి విడ్డూరంగా అనిపిస్తే తెలుగు దేశం వర్గాలకు మనస్తాపం కలిగించింది. దానితో ఇదొక రాజకీయ వివాదంగా మారి చర్చలు సాగుతున్నాయి.
మొన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణాలను అన్వేషించే ప్రయత్నం చేసారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు దేశం పార్టీ అధినాయకుల్లో మానవీయ స్పర్శ మటుమాయం అయిందన్న అభిప్రాయం ఆ  సమావేశంలో వ్యక్తమైంది. నిజమే. పార్టీ అధినేత పార్టీ శ్రేణులకు దగ్గర కాకుండా అడ్డుపడిన అనేకానేక కారణాల్లో భద్రతా ఏర్పాట్లు కూడా వున్నాయి. ఇది నిజం.
జనం నడుమ వుండే నాయకులకే జనం దగ్గరవుతారు. 2019 లో జగన్ అద్భుత విజయం, 2014లో చంద్రబాబు చేసిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ఈ వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు రుజువు చేస్తున్నాయి.
తగ్గించిన భద్రతకు ఎవరు కారణం అనే రంద్రాన్వేషణ ఇప్పుడు  అనవసరం. సమస్యలనుంచి అవకాశాలను వెతుక్కుంటానని చంద్రబాబు తరచూ చెబుతుంటారు.
వెతకబోయిన తీగ ఎదురయింది. అదే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. అంశాన్ని వివాదాంశం చేసి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలు మాని పారేసుకున్న చోటునే వెతుక్కోవడం అనేది విజ్ఞత అనిపించుకుంటుంది.
అధికారం చేజారిన పిదప, అధికారంతో సమకూరే కొన్ని అదనపు సౌకర్యాలు కూడా దానితో పాటే తప్పుకుంటాయి. గతంలో విశేషాధికారాలు అనుభవించిన గొప్ప గొప్ప  నాయకులు సైతం ఈ దశలను దాటుకుంటూ వచ్చారు. రాజకీయాల్లో అది అత్యంత సహజంగా తీసుకోవాలి.          
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,   మోస్తరుగా ఆహ్వానించే నాయకులు కూడా లేకపోయారు. గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం మాజీ ప్రధాని బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లోని   హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన సత్తు చెంచాతో తినలేక ఇబ్బందిపడిన  ఇందిరాగాంధిచివరకు  చేత్తోనే  తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు (మాజీ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్  రావులపాటి సీతారామారావు తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెసు (కాంగ్రెస్ ఓ) లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చోటా మోటా స్థానిక నాయకుల మీద పడింది
పీవీ నరసింహారావు ప్రధానిగా వున్నంతకాలం అందరూ ఆహా! ఓహో!!అన్నారు.
పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన
సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా
వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలంఅధికార పీఠంపై వుంచిన
అపర చాణక్యుడని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాతపదవి
నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్లతోనే  ఆయన్ని  తెగడడం
ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం
కాగానే వాళ్ళూ దూరం జరిగారు.
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని
హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ
దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన
చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ
మార్బలాలు, వందిమాగధులుఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు.
ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ప్రధానమంత్రి హోదాలో పీవీ నరసింహా రావు  రాష్ట్ర పర్యటనకు
వస్తున్నారు అంటే చాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన  యావత్ యంత్రాంగాలు
అప్రమత్తం అయిపోయేవి. ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన
ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా
చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో
రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  ప్రత్యేక బృందాలను
ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును
అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని
పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్'
విభాగానికి దఖలు పరిచేవారు.
పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ప్రతి ఏటా  బేగంపేటలోని
ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు.
ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. భద్రతా ఏర్పాట్ల గురించి చెప్పే పనే లేదు. ప్రధాని వెళ్ళే దారి దారంతా జల్లెడ పట్టేవాళ్ళు. పదవి నుంచి
దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన
హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...'
అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు
అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలియని విషయాలు కావు. అధికారం శాశ్వతం కాదని అందరికంటే వారికే బాగా తెలుసు. అయితే అది శాశ్వతం అనే భ్రమలో వుంటారు. పదవి నుంచి దిగిపోయిన తరవాత కానీ తత్వం బోధ పడదు.

సర్పమూషిక న్యాయం


(Published in Andhra Bhoomi Daily on 16-06-2019, SUNDAY)

గత ఆదివారం నాడు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పసికందులు చనిపోయారనే వార్త ప్రకంపనలు సృష్టించింది. ఆసుపత్రిలో, అదీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి మరణాలు సహజమే అని సరిపుచ్చుకునే వారికి ఇదొక వార్తలా కనిపించదు. అయితే గడచిన అయిదు మాసాల వ్యవధిలో అదే ఆసుపత్రిలో సరయిన వైద్యం అందక అక్షరాలా 168 మంది పసికూనల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అనే విషయం తెలిస్తే ఆశ్చర్య పడక మానరు.
వైద్యుల నిర్లక్ష్యం, ఆసుపత్రిలో అరకొర సౌకర్యాలు తమ పిల్లల మరణానికి కారణమయ్యాయని ఆ పిల్లల తలితండ్రులు ఆరోపించి ఆందోళనకు దిగడంతో ఈ వార్త ప్రాముఖ్యం సంతరించుకుంది. అదే ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న మరో అయిదుగురు చంటి పిల్లలు కూడా అదే రోజు చనిపోవడంతో ఆందోళనకు ఆద్యం పోసినట్టు అయింది.
జరిగింది సర్దిచెప్పుకోలేని, సమర్ధించుకోలేని అంశం కావడంతో ఆసుపత్రి అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. తమ వద్దకు తీసుకురావడానికి పూర్వమే ఆ పిల్లల ఆరోగ్య పరిస్తితి విషమించివుందని, అంతకుముందు ప్రైవేటు వైద్యశాలల్లో వారికి చేయించిన చికిత్స ఫలించకపోవడం వల్లనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారని కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి కొద్ది రోజులు కూడా గడవక ముందే ఇటువంటి దుర్ఘటన జరగడం వై.ఎస్. జగన్ మోహనరెడ్డి ప్రభుత్వానికి కూడా మింగుడుపడని అంశమే. సరే! కొత్తగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన ఆళ్ళ నాని వెంటనే స్పందించి హుటాహుటిన అనంతపురం బయలుదేరి వెళ్ళారు. పరిస్తితిని దగ్గరుండి సమీక్షించారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని షరామామూలుగా ప్రకటించారు. అంతకు ముందే స్థానిక శాసన సభ్యుడు అనంత వెంకట రామరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి ఆందోళన చేస్తున్న తలితండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్తితులు గురించి తనిఖీ చేసారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల పదో తేదీవరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో  994 మంది చిన్న పిల్లలకు వివిధ రోగాలకు చికిత్స చేసారు. కాగా వారిలో 168 మంది మరణించారని గణాంకాలు తెలుపుతున్నాయి.
ఈ నేపధ్యంలో నాలుగేళ్ళకు పూర్వం జరిగిన ఒక దుస్సంఘటన గుర్తుకు వస్తోంది.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆనాటి మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని సీరియస్ గా  తీసుకుంది.
సాధారణంగా న్యాయస్థానాలు తమ ముందుకు వచ్చే కేసుల విషయంలో భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్  గుంటూరు ఆసుపత్రి కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేశాయి. మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో,  ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక విధానానికి భిన్నంగా వుంది. కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో, అదీ చేతిరాతతో వెలువడ్డాయి.
‘నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి  బిడ్డను తెచ్చి ఇవ్వగలమా?దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని  కమిషన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే మన సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్ సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్  కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.
‘అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మానన్ను ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంతటి  మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
‘మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్  తన ఆదేశాల్లో  అభివర్ణించింది.
‘దవాఖానాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.
 కమిషన్  స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.
సరే! అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులయిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాధమిక దర్యాప్తు జరిపి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, శిశువులకు చికిత్స చేసే ఒక వైద్య నిపుణుడిని బదిలీ చేసినట్టు నాటి  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా చనిపోయిన శిశువు తాలూకు వారితో దురుసుగా ప్రవర్తించిన ఒక హెడ్ నర్సును, మరో స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.
ఆసుపత్రిలో ఎలుకలు రేపిన కలకలంతో కంగారు పడిన అధికారులు ఎలుకలు పట్టే ఓ వ్యక్తిని వెతికి పట్టుకుని ఎలుకలను పట్టించారు. రెండు రోజుల్లోనే 87 ఎలుకలు దొరికాయని సమాచారం. దొరికినవే ఇన్ని వుంటే దొరక్కుండా కలుగుల్లో ఇంకా ఎన్ని దాగున్నాయో అన్నది జవాబు దొరకని ప్రశ్న.
ఈ ఎలుకలను పట్టడానికి ఓ మనిషి దొరికాడు. కానీ, ప్రభుత్వఆసుపత్రుల్లో ఖరీదయిన వైద్య పరికరాల్ని, మందుల్నీ ఎవరి కన్ను పడకుండా కరకరా నమిలి మింగుతూ, ‘వాతాపి జీర్ణం జీర్ణం’ అనుకుంటూ, చట్టానికి దొరక్కుండా కూడబెట్టుకున్నఅక్రమ సంపాదనలతో పెంచుకున్నబొజ్జల్ని హాయిగా నిమురుకుంటున్న ‘అసలు ఎలకల్ని’ ఎవరు పట్టుకోవాలి? ఎవరు పట్టిస్తారు? పట్టించినా ఏదో ఒక రకంగా తప్పించుకోగల ‘వారి’ తెలివితేటలకి ఎవరు అడ్డుకట్ట వేస్తారు?
ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఎందుకంటే సమాజాన్ని దోచుకునే సంఘ విద్రోహ, ఆరాచకశక్తుల్లో మరెక్కడా కానరాని సమైక్యత వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య.
ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము ఓ ఆలోచన చేస్తుంది. తన పొడ గమనించి  ప్రాణభయంతో గడగడలాడిపోతున్నఎలకతో యుక్తిగా ఓ సలహా  చెబుతుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’ 
పామును చూడగానే సగం ప్రాణాలు పోయిన ఆ ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలి మింగేసి, ఆ తరువాత ఎలక చేసిన  ఆ రంధ్రం ద్వారా బయట పడిప్రాణాలు దక్కించుకుంటుంది.
ఈ సర్పమూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఆ క్రమంలో ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.
అప్పుడు గుంటూరు ఆసుపత్రి సంఘటనపైనా విచారణ జరిగింది.  ఇప్పుడు అనంతపురం ఆసుపత్రిలో శిశుమరణాలపైనా  విచారణ జరుగుతుంది. దోషులకు శిక్ష పడుతుంది. వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకునివాళ్ళు కొన్నాళ్ళ తరువాత బయటపడతారు. అప్పటికి జనం ఈ విషయం మరచిపోతారు. ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపులు,  ఎవరో చేసిన తప్పిదాలకు తమ ప్రాణాలు పోగొట్టుకున్న పసికందుల మౌన రోదనలు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతాయి.  కడుపుకోతతో విలవిలల్లాడే  ఆ మాతృమూర్తుల  వేదన అరణ్య రోదనే అవుతుంది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు ఇచ్చే  హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. (EOM)

చంద్రబాబుకు ఊరట కలిగించే జగన్ నిర్ణయం

(Published in SURYA daily on 16-06-2019, SUNDAY)

‘ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి అని అనుకుంటున్నారు?’
మొన్నీమధ్య ఓ టీవీ చర్చలో యాంకర్ సంధించిన ప్రశ్న.
‘కోరుకునేది చెప్పమంటారా! జరిగేది  చెప్పమంటారా!’
‘రెండూ చెప్పండి’
‘సభ సజావుగా జరగాలన్నది నా ఒక్కడిదే కాదు, ప్రజలందరి ఆకాంక్ష. కానీ ఇప్పటి రాజకీయాల తీరుతెన్నులు చూస్తుంటే కోరుకునేవి జరిగే అవకాశాలు తక్కువ.  ఇంతకాలం ఎలా జరుగుతూ వచ్చాయో అలాగే జరుగుతాయి. ఇది నా అంచనా మాత్రమే. మొదటిది జరిగితే బాగుండు అనిపిస్తుంది. కానీ రెండోదే జరిగి తీరుతుంది. రాజకీయాలదే పైచేయి అనే కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి’
తధాస్తు దేవతలు వుంటారంటారు. అలాగే జరిగింది.
ఆరోజు ఏదో మాటవరసకు చెప్పినా అలాగే మొదలయింది అసెంబ్లీ.
రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగిననాడు ఇది స్పుటంగా కానవచ్చింది, మొదటి ముద్దలోనే ఈగ పడింది అనే సామెతను గుర్తు చేస్తూ.
రెండే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా వున్నచోట రాజకీయాలు మరోలామరోలా  సాగవు. సంఖ్యాపరంగా బలహీన స్తితిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి కూడా గత ఎన్నికల్లో సగటున సుమారు నలభయ్ శాతం వోట్లు వచ్చాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. అయినా రెండు పార్టీల నడుమా పదకొండు శాతం ఓట్ల తేడా వుంది. ఇక సీట్ల సంఖ్యతో పోలిస్తే వైసీపీ స్థానం శిఖరాయమానంగా వుంది. మొత్తం 175 సీట్లలో వారివే 151. టీడీపీకి వచ్చినవి కేవలం 23 సీట్లు మాత్రమే. మరో ప్రాంతీయ పార్టీ జనసేన ఒకే ఒక స్థానం గెలుచుకుని అసెంబ్లీలో అడుగు పెట్టగలిగింది. ఆ మాత్రం అవకాశం కూడా జాతీయ పార్టీలు కాంగ్రెస్ , బీజేపీలకు, ఇతర వామపక్షాలకు ఏపీ ఓటర్లు ఇవ్వలేదు.
గత అసెంబ్లీలో పాలక పక్షం చేతిలో పడిన అగచాట్లో, పొందిన అవమానాలో కారణం ఏదైనా టీడీపీ మీద ఇన్నేళ్ళుగా పెంచుకున్న ఆగ్రహానికి  బదులు తీర్చుకోవడానికి సంఖ్యాబలం రూపంలో  వైసీపీకి చక్కని అవకాశం దొరికింది. అందుకే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం ఆ పార్టీ వారికి ఇష్టం లేనట్టుంది. స్పీకర్ ఎన్నిక ప్రక్రియ  కాగానే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణం. కొత్త స్పీకర్ తమ్మినేని సీతారాంని అభినందిస్తూ చేసిన ప్రసంగంలో, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన  చంద్రబాబుకు చురుక్కుమనిపించేలా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“గత శాసన సభలో ఒక సభానాయకుడు, ఒక స్పీకర్ ఎలా ఉండకూడదో చూశాం.  ఎలా ఉండాలో ఇప్పుడు  చూపిస్తాం’ అన్నారు జగన్. సంతోషించదగ్గ మాట. ఇలాంటి మార్పు నిజంగా ఆచరణలో చూపిస్తే ముందుగా  సంతోషించేవాళ్ళు ప్రజాస్వామ్య ప్రియులే.  
వివాదాస్పద అంశాలు ప్రస్తావించకూడని సందర్భం అయినా  జగన్ మోహన రెడ్డి కొన్ని గతకాలపు విషయాలను పేర్కొన్నారు. ఒక రకంగా ఈ అంశాలు స్పీకర్ కు సంబంధించినవే కావడం వల్ల ఆయన తెలివిగా వీటి ప్రస్తావనకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది.
‘మా పార్టీ గుర్తుపై ఎన్నికయిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను, సంతలో పశువుల మాదిరిగా నాటి పాలక పక్షం టీడీపీ కొనుగోలు చేసింది. పిర్యాదు చేసినా అప్పటి స్పీకర్ పట్టించుకోలేదు. చర్యలు తీసుకోలేదు. పైగా వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా  కట్టబెట్టారు. అలాంటి అప్రజాస్వామిక వ్యవహారాలు మా హయాంలో చూడబోరు. టీడీపీ నుంచి గెలిచిన  వాళ్ళలో కొంతమందిని తీసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదని మావాళ్ళు నాతో అన్నారు. అలా చేస్తే  నాకూ, బాబుకూ తేడా లేకుండా పోతుందని జవాబు చెప్పా. పార్టీ మారేవారు ఎవరైనా సరే, ముందు రాజీనామా చేసి తీరాలి. లేకపోతే స్పీకర్ వారిపై అనర్హత వేటు వెయ్యాలి’ అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు.
సందర్భోచిత పలుకులైనా సభలో ఉన్న ప్రతిపక్షనేతకు ఇవి ములుకుల మాదిరిగా తగిలి వుంటాయి. అందుకే కాబోలు సభానాయకుడి ప్రసంగం తరవాత మైకు తీసుకున్న చంద్రబాబు కూడా అదే రీతిలో జవాబు చెప్పే ప్రయత్నం చేసారు. మైకు సరిగా  పనిచేయక పోవడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. గొంతు పెగలడం లేదంటూ ఓ పక్క  పాలక పక్షం సభ్యుల నుంచి వెలువడిన వ్యాఖ్యలకు ఆయన దాన్ని ఉపయోగించుకున్నారు. ‘మా హయాంలో పనిచేసిన మైకులు ఇప్పుడు పనిచేయడం లేదు. నా స్వరం తగ్గదు, నా పోరాటం ఆగదు’ అంటూ ధీటుగానే జవాబు ఇచ్చారు. కానీ నిజానికి కొత్త  శాసన సభ భవన నిర్మాణం, అందులో  మైకుల అమరిక ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగినవే.
స్పీకర్ గా తమ్మినేని ఎంపిక సరైనదే అని చెబుతూనే, ఈ విషయంలో తమను సంప్రదించలేదని, సంఖ్యాబలాన్ని చూసుకుని వైసీపీ సంప్రదాయాలను పక్కన పెడుతోందనే వాదనను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఈ ఆరోపణతో  సహజంగానే సంభాషణలు పక్కదోవ పట్టాయి. ఇరుపక్షాలు గతాలను నెమరు వేసుకుంటూ ఎదుటి పక్షం వాదనను పూర్వపక్షం చేసే పనిలో పడ్డాయి.  ఆ విధంగా సభ జరిగే తీరు రక్తి కడుతోందని ఆ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నవాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేలోగా, రామాయణంలో పెడకల వేట మాదిరిగా వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి నుంచి వెలువడిన  ‘బంట్రోతు’  ప్రస్తావన మొత్తం వ్యవహారాన్ని  పూర్తి మలుపు తిప్పింది. మళ్ళీ  గతంలో అసెంబ్లీ సాగిన తీరే పునరావృతం అవుతున్నదేమో అనే  భావనను  కలిగించాయి.
కొత్తగా ఎన్నికయిన స్పీకర్ ను సభానాయకుడు (ముఖ్యమంత్రి), ప్రతిపక్షనాయకుడు, సభలోని ఇతర పార్టీల నాయకులు వెంటబెట్టుకుని వెళ్లి ఆయనను స్పీకర్ స్థానంలో అసీనుడిని చేయడం సాంప్రదాయం. ఇందుకు అనుగుణంగా ప్రోటెం స్పీకర్ అయిన నాయుడు ఒక సూచన చేసారు. ‘సభానాయకుడు, ఇతర పార్టీల నాయకులు నూతన స్పీకర్ తమ్మినేని సీతారాం ను సభాధ్యక్ష స్థానం వద్దకు తీసుకువెళ్లాల్సిందని కోరారు. దరిమిలా ముఖ్యమంత్రి, సభానాయకుడు అయిన జగన్ మోహన రెడ్డి, జన సేన ఏకైక సభ్యుడు వరప్రసాద్ స్పీకర్ వెంట నడిచారు. తన పేరు పెట్టి పిలవకుండా క్లుప్తంగా ఇతర పార్టీల నాయకులు అని అన్నందుకు నొచ్చుకున్నారేమో తెలవదు, టీడీపీ తరపున చంద్రబాబు ఆ పనికి మరో సీనియర్ సభ్యుడు అచ్చెంనాయుడిని నియోగించారు. నిజానికి ప్రోటెం స్పీకర్ చంద్రబాబు నాయుడిని పేరు పెట్టి ఆహ్వానించినా, లేదా చంద్రబాబే హుందాగా  సాంప్రదాయానికి అనుగుణంగా కొత్త స్పీకర్ వెంట నడిచి వెళ్ళినా ఈ అంశం అంతటితో ముగిసిపోయి వుండేది. కానీ అలా జరగలేదు.
అచ్చెంనాయుడిని ఉద్దేశించి చెవిరెడ్డి భాస్కర రెడ్డి బంట్రోతు అనడం సభలో ప్రకంపనలు సృష్టించింది. చెవిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేసారు. రికార్డులు చూసి అభ్యంతర వ్యాఖ్య చేసినట్టు అనిపిస్తే ఆ పదాన్ని తొలగిస్తానని స్పీకర్ తమ్మినేని ప్రకటించడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది.
స్పీకర్ తమ్మినేని సీతారాంను అభినందిస్తూ చేసిన ప్రసంగాలలో వైసీపీ సభ్యులు చాలామంది, ముఖ్యంగా గత శాసన సభలో టీడీపీ పక్షం నుంచి తీవ్రమైన అవహేళనలు, అవమానాలు ఎదుర్కున్న రోజా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని  గతాన్ని నెమరు వేసుకుంటూ అలనాడు టీడీపీ అప్రజాస్వామికంగా ఎలా  వ్యవహరించిందీ సోదాహరణంగా వివరించారు. సహజంగా ఇవన్నీ ప్రతిపక్ష టీడీపీకి మింగుడు పడని విషయాలే.
స్పీకర్ తమ్మినేని సీతారాం జావాబు ఇస్తూ సభానిర్వహణ సజావుగా నిర్వహించడానికి పాలక, ప్రతిపక్షాలు తనకు సహకరించాలని కోరారు. ఎందరో మహానుభావులు అలంకరించిన స్పీకర్ స్థానం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, వారు నెలకొల్పిన సత్సంప్రదాయాల మార్గంలోనే ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. మంచి వక్తగా పేరున్న సీతారాం ఒక చక్కటి ప్రసంగం చేసి అందరి మన్ననలను చూరగొన్నారు. అయితే బంట్రోతు వంటి ఆక్షేపనీయ పదాన్ని ఒక సభ్యుడు వాడినప్పుడు, రికార్డుల పరిశీలనతో  నిమిత్తం లేకుండా అక్కడిక్కక్కడే ఆ పదాన్ని  తొలగిస్తున్నట్టు ప్రకటించి ఉన్నట్టయితే నిష్పాక్షికంగా వ్యవహరిస్తానని  సభకు ఇచ్చిన  మాటను నిలబెట్టుకున్నట్టు అయ్యేది.
ఏదిఏమైనా, ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి చేసిన ప్రకటన, సంఖ్యాపరంగా బలహీనంగా ఉన్న  ప్రతిపక్ష నాయకుడికి కొంత ఊరట కలిగించి వుండాలి. పార్టీ ఫిరాయింపులని ఎటువంటి పరిస్తితుల్లోను ప్రోత్సహించేది లేదని ముఖ్యమంత్రి  నిక్కచ్చిగా తెగేసి  చెప్పడం చంద్రబాబుకి ఉపశమనం కలిగిస్తే, ప్రజాస్వామ్య ప్రియులకు ఆనందం కలిగించింది అనడంలో సందేహం లేదు. ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ప్రజలే  ఎన్నుకునే ప్రజాస్వామ్య వ్యవస్థకు చీడపురుగులా తయారైన పార్టీ మార్పిళ్ల దురాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఏక తాటిపై నిలబడి, ఒకే గొంతుతో తిరస్కరిస్తే దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత పటిష్టం అవుతుంది.

Discussion on TDP reaction Over Governor Narasimhan's speech in AP Assem...





ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN ANDHRA JYOTHY టీవీ ఛానల్ లో  యాంకర్ శ్రీనివాస్ నిర్వహించిన   PUBLIC POINT ముఖాముఖి చర్చాకార్యక్రమం.