4, ఏప్రిల్ 2019, గురువారం
News Talk | Special Discussion With Senior Journalist Mr. Bhandaru Srini...
ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం స్నేహ టీవీ న్యూస్ టాక్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ స్వర్ణ
2, ఏప్రిల్ 2019, మంగళవారం
రేడియోలో ‘దూడలు’ – భండారు శ్రీనివాసరావు
చాలా ఏళ్ళ కిందటి సంగతి.
ఢిల్లీలో బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది. మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి
ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం అధికారి శ్రీ ఆర్వీవీ
కృష్ణారావు, వెంటనే స్పందించి, జగ్
జీవన్ రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం
చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ
వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో
సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత ఏడూ అయిదుకు వచ్చే ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల జాతీయ వార్తల్లోనూ ఆ మరణ వార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది.
బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. అప్పటి తెలుగు దేశం లోక్ సభ సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ఈ విషయాన్ని ప్రశ్న రూపంలో లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి
ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి దేశంలోని
ఏడు రేడియో స్టేషన్లు తప్పు చేశాయని
తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో
లేదు.
ఏది ఏమైనా ఈ ఉదంతంతో రేడియో అధికారులు
మరణ వార్తల ప్రసారం విషయంలో అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ
అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి
ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని
ఆంక్షలు విధించారు.
తరువాత చాలా కాలానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ
పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు
జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో
కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.
విజయవాడలో ఉన్న కృష్ణారావు గారు
హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన
చనిపోయింది ఢిల్లీలో. నిబంధనల ప్రకారం ఢిల్లీ విలేకరి ఆ వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు
కానీ ఆ సమయంలో ఢిల్లీలోఎవరూ దొరకలేదు. చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది.
దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి
ఉదయం ఆరూ నలభయ్ అయిదు నిమిషాలకు మొదలయ్యే
ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.
మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు
వార్తల్లో ఆ ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి ఇచ్చినా నిబంధనల పేరుతొ తీసుకోలేదు.
‘తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ
వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్ల మెంటులో హడావిడి చేసారు.
ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో
వార్తల్లో దొర్లాయి. ఒకటి జగ్జీవన్ రాం మరణ వార్త, రెండోది లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త. ఈ రెండింటినీ
ధ్రువ పరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక కరచుకోవడం జరిగింది. పార్లమెంటు శ్రద్ధాంజలి
ఘటించింది కూడా. ఆ తరువాత కానీ జరిగిన పొరబాటు తెలియరాలేదు.
ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు
మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రేడియోవాళ్ళు
తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి వుంది.
నాకైతే తెలియదు.
లేబుళ్లు:
రేడియోలో ‘దూడలు’ తప్పుడు వార్తలు
1, ఏప్రిల్ 2019, సోమవారం
ఉందిలే మంచి కాలం ముందు ముందునా – భండారు శ్రీనివాసరావు
‘ఏవిటి రామయ్యా! అంత దీర్ఘంగా
ఆలోచిస్తున్నావ్’
‘ఏముంది మరో రెండు నెలల్లో మన జీవితాలు
ఎన్ని కొత్త మలుపులు తిరుగుతాయో తలచుకుంటూనే ఆశ్చర్యంగా వుంది’
‘అందుకోసం పోద్దటి నుంచీ తిండి కూడా తినకుండా ఆ కుక్కి మంచంలో పడుకుని కాలుమీద కాలు వేసుకుని మరీ ఆలోచిస్తున్నావ్!
ఇంతకీ ఆ జరగబోయే మంచి ఏమిటో చెప్పు, నాకూ వినాలని వుంది’
‘ఇక నుంచి నువ్వూ నేనే కాదు మన ఇంట్లో
పిల్లా పాపా అందరం కాలుమీద కాలువేసుకుని దర్జాగా గడిపే రోజులు వస్తున్నాయి. కలలో
కూడా ఊహించలేదు సుమా!’
‘ఏవిటి! పరగడుపునే నాలుగు పేకెట్లు
పడ్డాయేమిటి కడుపులో’
‘అలానే అంటుండు. అప్పుడే ఏప్రిల్
వచ్చేసింది. ఈ నెలకు ముప్పయి రోజులే. పైన మే
నెలలో మరో ఇరవై మూడు రోజులు. ఎంతలో దొర్లిపోతాయి చూస్తుండు’
‘మేలో ఏం జరుగుతుందేమిటి? మహా అయితే ఎండలు
ఇంకా మండుతాయి’
‘ఇక మనకు కడుపు మండడాలు గట్రా వుండవు.
అన్నీ మంచి రోజులే. పించన్లు నాకూ మా
ఆవిడకు, నీకూ మీ ఆవిడకు మాత్రమే కాదు, చదువంటక రోడ్లు పట్టుకు తిరుగుతున్న మా
ఇద్దరు పిల్లలకు నెల తిరిగేకల్లా విచ్చు రూపాయలు కళ్ళముందు గలగలా మంటాయి. ఉద్యోగం
వున్నా డబ్బులే, లేకున్నా డబ్బులే. గ్యాస్ బండలు రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లోకి
దొర్లుకుంటూ వస్తాయి, కాణీ ఖర్చు లేకుండా. పెళ్ళయిన పిల్లకి పసుపు కుంకుమ, పెళ్లి
కాని దానికి మనం కొనిపెట్టలేని అవేవో ల్యాప్టాపులూ, సెల్ ఫోన్లు. వాళ్ళ చదువులు అన్నీ
ఇక మనం చూసుకోనక్కర లేదు. పండినా పండక పోయినా ఇన్నాళ్ళు మనకు డొక్కలు ఎండడమే. పంట
వేసుకోవడానికి డబ్బులు, పైర్లు కోసుకోవడానికి డబ్బులు. రోగంరొష్టు వస్తే యెట్లా
అనే బాధ లేదు. బతికున్నా డబ్బులే. రోగం వచ్చినా డబ్బులే. ఆఖరికి చచ్చి కాటికి వెళ్ళినా డబ్బులే. వచ్చే ఎన్నికల నాటికి
ఇంకెన్ని ఇస్తామంటారో. ఇన్నాళ్ళు ఏదో చచ్చామో బతికామో తెలియకుండా బతుకులు
ఈడుస్తున్నాం. ఇక బతుకు గురించి బెంగ లేదు. సంసారం ఎలానా అన్న దిగులు లేదు. ఎవరు
గెలిస్తే మనకేమిటి. మనకు నిత్యం చచ్చి బతికే పనిలేకుండా చేస్తామంటున్నారు. ఎవరు
గెలిచినా ఎవరు ఓడినా మనకు పోయేదేమీ లేదు.
వాళ్ళందరూ గెలవాలనే మనం దేవుడ్ని
కోరుకుందాం’
‘అదెలా కుదురుతుంది. ఎవరో ఒకళ్లెకదా
గెలిచేది. మరి అందరూ గెలిస్తే కదా నువ్వు చెప్పిన కోరికలన్నీ తీరేది’
‘అందుకే ఇందాకటి నుంచి ఏం చెయ్యాలా అని
దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నువ్వన్నట్టు
పోటీలో ఉన్న పార్టీలు అన్నీ గెలిస్తేనే కదా ఇవన్నీ నిజం అయ్యేది. అందుకని ఓ పని
చేద్దాము. పోలింగు బూతులోకి వెళ్లి ఆ మెషిన్ మీద అన్ని పార్టీల గుర్తులు గుర్తు
పెట్టుకుని ఒకేసారి అన్నింటిపైనా నొక్కేద్దాము,
ఓ పనైపోతుంది. ఏవంటావ్’
31, మార్చి 2019, ఆదివారం
ఐ.క్యు. టాబ్ లెట్స్
ఈరోజు ఇడ్లీల దినోత్సవం అంటున్నారు.
కాబట్టి ఒక కధ గుర్తు చేసుకుందాం.
భారత దేశానికి అప్పటికి ఇంకా
స్వాతంత్రం రాలేదు.
ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు
నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా
ప్రయాణం చేస్తున్నారు. తెల్లారేసరికి రైలు
బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్
బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నారు.
అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్
విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు
ఇడ్లీలు తీసి తినడం ఆ ఆంగ్లేయుడు గమనించాడు. తెల్లగా, గుండ్రంగా
ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది. అయితే అడగడం
మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.
మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు
చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు. అయ్యరు
గారు రైల్వే భోజనాన్ని మృదువుగా తిరస్కరించి తన క్యారియర్ తెరిచి రెండో గిన్నెలో
వున్న మరో రెండు ఇడ్లీలు కమ్మగా తినడం ఆ బ్రిటిష్ వ్యక్తి గమనిస్తూనే వున్నాడు. యెంత
ఆలోచించినా తోటి ప్రయాణీకుడు తింటున్నవేమిటి అనేది ఆయనకు అర్ధం కాలేదు. దాంతో ఆయన
ఉత్కంఠ మరింత పెరిగింది.
రైలు బెర్హంపూరులో ఆగింది. మళ్ళీ అదే
సీను.
బ్రిటిషర్ ఇక తట్టుకోలేక నేరుగా
అడిగేశాడు.
“అయ్యా! ఇలా అడగడం మర్యాద కాదని తెలిసీ
అడుగుతున్నాను. మీరు తింటున్న ఆ తెల్లటి పదార్ధాలను నేను ఎప్పుడూ చూడలేదు. అవేమిటో
తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా వుంది”
అయ్యరు ఇలా జవాబిచ్చారు.
“ఇవి ఐ.క్యు. టాబిలెట్స్. అర్ధం మీకు తెలుసుగా. మేధస్సు
పెంచడానికి వీలైన పోషకాలు వీటిలో వున్నాయి. వీటిని తిని, భోజనం గట్రా ఏమీ
లేకుండా మేము రోజులతరబడి వుండగలం”
“వీటిని ఎలా తయారు చేస్తారు” బ్రిటిషర్
ఆరా.
అయ్యరు గారు ఇడ్లీలు తయారు చేయడానికి
కావాల్సిన సంభారాలు గురించీ, తయారు చేసే
విధానం గురించీ వివరంగా చెప్పారు.
“మంచి సంగతులు మీనుంచి తెలుసుకున్నాను.
మీకు అభ్యంతరం లేకపోతె నాకూ ఓ రెండు టాబ్ లెట్లు ఇవ్వగలరా! వూరికే కాదు, మీరు
చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించుకుంటాను” అని ఆంగ్లేయుడు అభ్యర్ధించాడు.
అయ్యరు ఒక క్షణం ఆలోచించి చెప్పాడు.
“నా దగ్గర ఇంకా మూడే మిగిలాయి.
కలకత్తాలో నేను మా చుట్టాల ఇంటికి వెడుతున్నాను, కనుక నాకు ఇబ్బంది లేదు. మీరే
చెప్పారు కాబట్టి ఇడ్లీకి ఓ ఇరవై రూపాయల చొప్పున ఇవ్వండి చాలు”
బ్రిటిషర్ యెగిరి గంతేసినంత పనిచేసి
అరవై రూపాయలు అయ్యరుకు ఇచ్చి మూడు ఇడ్లీలు తీసుకుని తిన్నాడు.
మర్నాడు ఉదయానికల్లా హౌరా స్టేషన్
వచ్చింది.
రైలు దిగి ఎవరి దారిన వారు విడిపోయే
సమయంలో బ్రిటిషర్ అడిగాడు. “ఈ టాబ్ లెట్లు తయారు చేసే విధానం చెప్పారు. అంతా
చెప్పారా! ఏమైనా మరచిపోయారా!”
“చెప్పేందుకు ఏమీ లేదు, అంతా వివరంగా
చెప్పాను”
“మరి ఈ టాబ్ లెట్ల ఖరీదు అంత
వుండకూడదే”
“చెప్పాను కదా ఇవి మేధస్సును వికసింప చేసే ఐ.క్యు. ట్యాబ్
లెట్లని. మీరు మూడే తిన్నారు. రాత్రికి ఇప్పటికీ మీలో యెంత తేడా వచ్చిందో చూడండి. అంటే
అవి పనిచేయడం మొదలయిందన్న మాట” అని అంటూ అయ్యరు తన హోల్డాలు, టిఫిన్ క్యారియర్
చేతబుచ్చుకుని చక్కాపోయాడు.
(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)
లేబుళ్లు:
ఐ.క్యు.టాబ్ లెట్స్ ఇడ్లీలు
28, మార్చి 2019, గురువారం
బెట్టింగు సర్వేలు
మా చిన్నతనంలో వరి కళ్లాల సమయంలో పొలాల్లో రాశిగా పోసిన వడ్లను కొలిచి బస్తాలకు ఎత్తేముందు మా బాబాయి ఉజ్జాయింపుగా చూసి ఇన్ని పుట్లు అని చెప్పేవాడు.(పుట్టి పది బస్తాలు). ఇంచుమించుగా ఆయన చెప్పినట్టే జరిగేది.
నటశేఖర బిరుదాంకితులు కృష్ణ, ఏ సినిమా అయినా (తన సొంత సినిమాతో సహా) విడుదల అయిన వెంటనే ఇన్ని రోజులు ఆడుతుందని చెప్పేవారట. ఆయన అన్నట్టే ఆ సినిమా ఫట్టో,హిట్టో అయ్యేదట.
ఇప్పుడు రాజకీయ పార్టీల వంతు వచ్చింది. ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో రోజుకొక సర్వే వస్తోంది. జ్యోతిష్కులు కూడా రంగం లోకి దిగారు. అసలే రాజకీయ పార్టీలు ఆడుతున్న మైండు గేములతో ఇప్పటికే తలలు తిరిగి తల పట్టుకు కూర్చున్న జనాలకు ఈ సర్వేలు మరింత అయోమయం కలిగిస్తున్నాయి.
బహుశా బెట్టింగుల స్థాయి పెంచడానికి కాబోలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)