10, డిసెంబర్ 2016, శనివారం

రాజకీయ వారసత్వాలు

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 11-12-2016, SUNDAY)
మనిషి ఎలా బతికాడన్న విషయం అతడి చావు తెలుపుతుంది అంటారు. ఆ రకంగా జయలలిత గొప్పగా జీవించి నట్టే లెక్క. మహరాణిలాబతికింది. మహారాజ్ఞిలా దాటిపోయింది. చెన్నై నగరంలో ఒక పక్క జన సంద్రం, మరోపక్క జలసంద్రం నడుమ  మెరీనా సైకత తీరంలో సమస్త అధికార లాంఛనాలతో జరిగిన  అంత్యక్రియల్లో భాగంగా  జయలలితకు  రాజకీయ బిక్ష పెట్టిన  ఎం.జీ. రామచంద్రన్  సమాధి సరసనే నిర్మించిన  మరో సమాధిలో గంధపు చెక్కలతో చేసిన  శవ పేటికలో శాశ్వితనిద్రకు ఉపక్రమించింది. తమిళనాట  రాజకీయాలపై  ఒక ప్రగాఢమైన ముద్ర వేసిన జయలలిత శకం ఆ విధంగా  ముగిసింది. ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలికి ఆ స్థాయిలో తుది వీడ్కోలు లభించడం నిజంగా ఒక అరుదయిన రికార్డు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై దేశ వ్యాప్తంగా మీడియాలో నిరంతరాయంగా సాగుతూ వస్తున్న చర్చోపచర్చలకు జయలలిత మరణం తాత్కాలికంగా అయినా తెర దించడం గమనిస్తే, ఆవిడ మృతి యావత్  జాతిజనులను  ఎంతగా దిగ్భ్రాంతికి గురిచేసింది అర్ధం అవుతుంది.  
అంతుపట్టని ఆకస్మిక అనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి జయలలిత చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి నెలల తరబడి  మృత్యువుతో ఆఖరి పోరాటం చేస్తున్నప్పుడే, ఆవిడ తరువాత అన్నా  డీఎంకే నాయకత్వం ఎవరు స్వీకరించాలనే అంశంపై అనంతంగా  చర్చలు సాగాయి. గతంలో రెండు పర్యాయాలు తాత్కాలికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, జయలలితకు  అత్యంత విధేయుడు అనే ముద్ర వేయించుకున్న పన్నీర్ సెల్వం, ఆవిడ చనిపోయిన రోజు అర్ధరాత్రి రాజభవన్ లో మూడోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో జయలలిత వారసత్వం గురించిన చర్చకు కూడా తాత్కాలికంగా తెరపడింది.
ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుపడిన భారత దేశంలో రాజకీయ వారసుల గురించి మాట్లాడుకోవడం ఒక విచిత్రం. అధికార వ్యవస్థలో కీలకమైన  ప్రధానమంత్రి పదవికి  కానీ, ముఖ్యమంత్రి పదవికి కానీ ఎన్నిక ద్వారా కాకుండా వారసత్వ ప్రాతిపదికపై ఎంపిక జరగడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సాంప్రదాయంగా పరిణమిస్తూ రావడం  ప్రజాస్వామ్యప్రియులను కలత పెడుతోందనడం నిర్వివాదాంశం. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతో శాసించిన అన్నా డీఎంకే నాయకురాలు జయలలిత, తన వారసుడు ఎవరన్నది నిర్దారించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమించడం వారికి ఊరట కలిగిస్తోంది కూడా.  
వివాదాస్పదమైన రాజకీయ వారసత్వాలకు ప్రజామోదం లభిస్తూ వుండడం వల్ల ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలో ప్రజాస్వామ్య వ్యవస్థ చిక్కుకు పోయింది. జాతీయస్థాయిలో ఇదే పరిస్తితి. అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే దుస్తితి.     
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంగతి తీసుకుందాం. ఆయన కూడా వారసుడి హోదాలోనే అధికార పీఠం అధిరోహించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఎంపిక కావడం తప్పనిసరి కనుక ఆ శంఖుతీర్ధం తంతు పూర్తిచేసుకునే ముఖ్యమంత్రి అయ్యారు.   నవీన్  తండ్రి బిజూ పట్నాయక్ గతంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పేరు మీద పుట్టిన  బిజూ జనత దళ్ పార్టీ  తరపున ఆయన ఒరిస్సా పాలనాపగ్గాలు చేపట్టారు.  వరసగా మూడు ఎనికల్లో తన పార్టీని విజయపధంలో నడిపించి పార్టీలో, ప్రభుత్వంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న నవీన్ పట్నాయక్, తరచూ అనారోగ్యానికి గురవుతున్నారనే వదంతుల నేపధ్యంలో ఆయనకు  రాజకీయ వారసుడెవరనే చర్చకు రెండేళ్ళక్రితమే తెర లేచింది. ఈ సందర్భంలోనే నవీన్ పట్నాయక్ మేనల్లుడు అరుణ్ పట్నాయక్ పేరు బయటకు వచ్చింది కానీ, రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని అరుణ్ స్వయంగా ప్రకటించడంతో ఆ చర్చకు నిరుడే  తాళం పడింది.
ఇక పశ్చిమ బెంగాల్ ఆడపులి మమత బెనర్జీ. ఇంటా బయటా ఎదురులేని ఈ వీరవనితకు సయితం  నిజజీవితంలోనూ, రాజకీయ జీవితంలోను వారసులంటూ ఎవరూ లేరు. తన వారసుడు పలానా అని దీదీ కూడా ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే అయిదేళ్ళ క్రితం తన మేనల్లుడు, ఇరవై నాలుగేళ్ల యువకుడు అభిషేక్ బెనర్జీకి  తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షపదవి కట్టబెట్టడంతో ఆ రాష్ట్రంలో  కూడా తృణమూల్ అధినేత్రి  మమత వారసుడి గురించిన చర్చలు మొదలయ్యాయి. రెండువేల పద్నాలుగులో అతగాడికి తృణమూల్ పార్టీ టిక్కెట్టు ఇచ్చి, గెలిపించి  అతి చిన్న వయసులోనే  పార్లమెంటుకి పంపడంతో  ఈ వదంతులకు మరింత బలం సమకూరినట్టయింది. కాకపొతే, రాజకీయ అరంగేట్రం చేసి అయిదేళ్ళు అవుతున్నా అభిషేక్ బెనర్జీ మాత్రం తనేమిటో, తన బలమేమిటో నిరూపించుకున్న సందర్భం లేకపోవడంతో ఆయన గురించి వెలువడిన వారసత్వపు వార్తలకు పురిటిలోనే గండి పడింది.  
ఉత్తరప్రదేశ్  లో బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి విషయం కూడా ఇదేమాదిరి. ఆవిడకీ వారసులు ఎవరూలేరు. బహుజన సమాజ్  పార్టీ అంటే మాయావతి, మాయావతి అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనే  తరహా రాజకీయమే నడుస్తూ వుండడంతో వారసత్వం అంశం అంతగా చర్చకు రావడం లేదు. ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ప్రజాస్వామిక స్పృహ ఆ పార్టీ  నాయకురాలికి  వున్నట్టు లేదని చెవులు కొరుక్కుంటున్నా ఆవిడ ఏమాత్రం చెవిన పెట్టే పరిస్తితి లేదు.  కాకపొతే, తన రాజకీయ వారసుడిని తాను  ఎన్నడో నిర్ణయించానని ఎనిమిదేళ్ళ క్రితం ఒకసారి ప్రకటించిన మాయావతి, ఆ వారసుడి  పేరు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. గతంలో మాయావతిపై హత్యాప్రయత్నానికి కుట్ర జరిగినట్టు వార్తలు వెలువడిన నేపధ్యంలో ఏర్పాటయిన ర్యాలీలో ప్రసంగిస్తూ, బీఎస్పీ అధినేత్రి స్వయంగా   ఈ విషయం బయట పెట్టారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా తాను ఎంపిక చేసుకున్న వారసుడు ఎవరు అనే దానిపై మళ్ళీ  పెదవి విప్పలేదు.
తమిళనాడులో జయలలిత, ఉత్తర ప్రదేశ్ లో మాయావతి, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఈ మువ్వురుదీ ఒకే పడవలో ప్రయాణం. వారికి నిజ జీవితంలో వారసులు లేరు. పార్టీలో వారికి ఎదురు లేదు. చుట్టూ జేజేలు కొట్టే భజన బృందాలు ఎన్ని వున్నా ఎవర్నీ నమ్మలేని తత్వం వీరిది.  దిగువ శ్రేణి నాయకులను  తప్ప ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం వీరికి అలవాటులేని పని. అంచేతే భవిష్యత్తులో వీరికి వారసులు ఎవరూ  అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్తితి.    


అదే ఉత్తరప్రదేశ్ లో మాయావతికి ప్రధాన ప్రత్యర్ధి అయిన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు మూలాయం సింగ్ యాదవ్ తన రాజకీయ వారసుడి విషయంలో లేనిపోని గుంజాటన పడలేదు. మీనమేషాలు లెక్కపెట్టలేదు. ఎవరు ఏమనుకున్నా లెక్కపెట్టకుండా  ఏకంగా తన కుమారుడు అఖిలేష్ యాదవ్ ని ముఖ్యమంత్రి గద్దె మీదనే కూర్చోబెట్టి అధికారపగ్గాలు అప్పచెప్పారు. కుమారుడికి  ముఖ్యమంత్రి పదవిని  అయితే కట్టబెట్టగలిగారు కానీ, తిరుగులేని  అధికారానికి వుండే  సహజస్వభావాన్ని గుర్తించలేకపోయారు. అది వంటబడితే  తండ్రీ కొడుకూ అనే వ్యత్యాసం  వుండదు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్  అధికారంలో వున్న సమాజ్ వాదీ పార్టీలో బయట పడుతున్న లుకలుకలే ఇందుకు సాక్ష్యం.       
పొతే,  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ వంశపారంపర్య విధానం  దశాబ్దాలుగా సాగుతూనే వస్తోంది. ఆ రాష్ట్రపు తొలి ప్రధానమంత్రి (స్వతంత్రం వచ్చిన కొత్తల్లో, భారత ప్రధాన మంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ కు కూడా  ప్రధానమంత్రి వుండేవారు, తదనంతర కాలంలో దాన్ని కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ముఖ్యమంత్రి హోదాకు అనుగుణంగా  మార్చారు) షేక్ అబ్దుల్లా.  తరువాత ఆయన  కుమారుడు ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. ఫరూక్ తనయుడు ఒమర్ అబ్దుల్లా కూడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే ఆ రాష్ట్రంలోనే  ముఖ్యమంత్రి  ముఫ్తీ  మహమ్మద్ సయీద్ కుమార్తె మెహబూబా ముఫ్తీని తన రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. ఆయన మరణానతరం మెహబూబా  ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు.
వారసత్వ రాజకీయాలకు బీహారు కూడా పుట్టిల్లు. రాష్ట్రీయ జనత దళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టు తీర్పుల దరిమిలా పదవి కోల్పోయినప్పుడు ఎలాంటి భేషజాలకు పోకుండా తన భార్య  శ్రీమతి రబ్రీ దేవినే  ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి తను వెనుక వుండి పాలన సాగించారు. నితీష్ కుమార్ ప్రస్తుత మంత్రి వర్గంలో కూడా లాలూ కుమారులు ఇద్దరు మంత్రులుగా వున్నారు. ఒక కుమారుడు తేజస్వి యాదవ్  ఉప ముఖ్యమంత్రి కాగా మరో  కుమారుడు  తేజ్ ప్రతాప్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి.
మహారాష్ట్రలో కూడా వారసులకే అధికార పదవులు దక్కడం చూస్తున్నాము. థాకరేలు ఇందుకు  చక్కని ఉదాహరణ. మరాఠా నాయకుడు శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియ పవార్ ఈ విధమైన ఫామిలీ  పవర్ పాలిటిక్స్ కి ప్రసిద్ధి. కర్ణాటకలో జనతాదళ్ (ఎస్) రాజకీయాలు యావత్తు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, ఆయన కుటుంబం చుట్టూ పరిభ్రమిస్తూ వుంటాయి.
పంజాబులో శిరోమణి అకాలీ దళ్ నేత ప్రకాష్  బాదల్ ముఖ్యమంత్రి. ఆయన కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఉప ముఖ్యమంత్రి.
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్కృతికి దూరంగా లేవనే చెప్పాలి.
ఇక స్వతంత్ర భారతంలో వారసత్వ రాజకీయాలకు ఆద్యులు ఎవరయ్యా అంటే మొదట చెప్పుకోవాల్సింది గాంధీ, నెహ్రూ కుటుంబీకులు గురించి.  పేరులో గాంధీ అని వున్నప్పటికీ జాతి పిత, స్వతంత్ర ప్రదాత మహాత్మా గాంధీకి ఏమాత్రం సంబంధంలేని నెహ్రూ కుటుంబం వారే దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించారు.  ప్రముఖ ప్రవచన కారుడు చాగంటి వారు పురాణాల్లోని వంశ వృక్షాలను ఆశువుగా నుడివినట్టు చెప్పాలంటే,  జవహర్ లాల్  నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఆయన కుమారుడు.....’ ఇలా సాగిపోతుంది ఆ వారసుల జాబితా.
విచిత్రం ఏమిటంటే గాంధీ, నెహ్రూ కుటుంబీకుల  వారసత్వ రాజకీయాలను చీల్చి చెండాడిన ప్రత్యర్ధులు సయితం అధికారం చేతికి అందగానే నిస్సిగ్గుగా  అదే బాటలో ప్రయాణించడం. అందువల్లే, రాజకీయాల్లో విమర్శలకు విలువ లేకుండా పోతోంది.    
చివరిగా ఒక మాట.
ప్రజాస్వామ్య పదకోశంలో చోటులేని పదం ఏదైనా వుంటే అది రాజకీయ వారసత్వం.
వర్తమాన  రాజకీయాల్లో దానిదే అగ్రస్థానం కావడం దేశానికి పట్టిన దురదృష్టం.  (10-12-2016)
రచయితఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595


9, డిసెంబర్ 2016, శుక్రవారం

మరణం అంటే.....

.....అన్నీ అలాగే వుండి మనం ఒక్కళ్ళమే లేకపోవడం.

రేపు లేదురా! ఈరోజు మనదిరా!

“రేడియోవాళ్ళు  నీకెంత జీతం ఇస్తారు?” ఆయన అడిగిన ప్రశ్న ఇది.
బేసిక్ 325, ఇతర అలవెన్సులు అదనం అని మాత్రం వుంది నాకొచ్చిన నియామక పత్రంలో.
1975లో ఆంధ్రజ్యోతిలో నా నెల జీతం అక్షరాలా నూట డెబ్బయి అయిదు. అప్పటికి అయిదేళ్ళు అయింది అక్కడ చేరి.
భత్యాలుగా వచ్చేది ఎంతో తెలియకపోయినా  నికరంగా 325 వస్తున్నప్పుడు ఆలోచన ఎందుకు” అంటూ ప్రోత్సహించాడు సహోద్యోగి ఎల్వీ రమణ, ‘ఓ వందా రెండువందలకోసం హైదరాబాదు దాకా పోవడం అవసరమా’ అనే నా మీమాంస గమనించి.
హైదరాబాదు వెళ్ళాలనే నిర్ణయం ఖరారు అయింది. కానీ చిల్లర మల్లర అప్పులు తీర్చి వెళ్ళాలి కదా! దానికోసం ఒక పెద్ద అప్పు చేయాలి కదా!
అప్పుడు గుర్తొచ్చాడు మా కుటుంబంలో ఒక పెద్దాయన. చిన్నా పెద్దా అందరికీ ఆయన మామయ్యే. చంద్రం మామయ్య. ఎలిమెంటరీ స్కూలు టీచరుగా పాతికేళ్ళ క్రితం  రిటైరయి నెలకు ఎనభయ్ రూపాయలు పించను పుచ్చుకుంటున్నాడు. కొంత భూమీ పుట్రా వుంది. దాని మీద అయివేజు, పించను డబ్బులు కలిపి పొదంగా, ఏ చీకూ చింతా లేకుండా  జీవితం గడుపుతున్న పెద్దమనిషి ఆయన. నిక్కచ్చిగా వ్యవహారం చేసే తత్వం కాబట్టి నికరంగా ఎంతో కొంత రొక్కం చేతిలో వుండేవుంటుంది. అందుకే ఆయన గుర్తు వచ్చాడు.
వెంటనే బస్సెక్కి పెనుగంచి ప్రోలు వెళ్లాను. వెళ్లి కలిశాను. కలిసి ఓ వెయ్యి రూపాయలు సర్దమని అడిగాను. అప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్నఇది.
“రేడియో వాళ్ళు నీకెంత జీతం ఇస్తారు?”      
“ఖచ్చితంగా తెలియదు కానీ, 325 మాత్రం నికరం.” నా జవాబు.
అప్పుడాయన నాకు జీవితానికి సరిపడే భగవద్గీత చెప్పాడు. అది ఆచరిస్తే జీవితపు చరమాంకంలో అందరూ ఆయనలాగే నిశ్చింతగా కాలం గడిపే వాళ్ళేమో అని అనిపిస్తుంది ఇప్పుడు.
“ఒరేయ్ సన్నాసీ. (ఆయన అందర్నీ అలాగే పిలుస్తాడు) నేను చెప్పేది కాస్త గుర్తు పెట్టుకో. అలవెన్సులూ అవీ కలిపి నీకు అయిదు వందలు వస్తుందనుకుందాం. అందులో 499 ఖర్చు పెట్టుకో. పరవాలేదు, సుఖపడతావు. అయిదు వందలూ తగలేయి. సుఖపడక పోయినా కష్ట పడవు. వచ్చేది అయిదు వందలు అయితే, ఒక్క రూపాయే కదా అని 501  ఖర్చు పెట్టావు అనుకో. ఇంతే సంగతులు. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. ఆదాయాన్ని మించి చేసే ఆ ఒక్క రూపాయి ఖర్చయినా, అప్పయినా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో  వందలు, వేరుగా పెరిగి నీ మెడకు చుట్టుకుంటుంది. మెడలోతు గోతిలో పడతావు సుమా!”
ఇలాంటి మాటలు చెవికెక్కే వయసు కాదు నాది. పైగా అవన్నీ చాదస్తం మాటలు అని కొట్టిపారేసే వయసు.
చంద్రం మామయ్య  నేను అడిగిన చేబదులు సర్దుబాటు చేసాడా అన్నది కాదు ప్రశ్న. చివరికి  ఆయన చెప్పినట్టే జరిగిందన్నది నా జవాబు.    

తత్వం బోధపడే వేళకు అనుభవం వస్తుంది. కానీ ఏం లాభం?

8, డిసెంబర్ 2016, గురువారం

ఆలోచనాలోచనం


కాస్తో కూస్తో చదువుకున్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, చిరు ఉద్యోగం నుంచి పెద్ద కొలువులు చేస్తున్నవారు, నిరుద్యోగులు,  బ్యాంకర్లు, లాయర్లు, లెక్చరర్లు, జర్నలిష్టులు, పండితులు, గృహిణులు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అపారమైన జీవితానుభవం కలిగిన వయోవృద్ధులు, ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు దర్పణం ఈ ఫేస్  బుక్. ఒకరకంగా మనం జీవిస్తున్న ప్రపంచానికి ఒక మీనియేచర్. బయట వుండే అభిమానదురభిమానాలు, ప్రేమలు, ఆప్యాయతలు, స్నేహాలు ఇక్కడ కూడా తొంగిచూడడం వింతేమీ కాదు. అయితే అవి హద్దులు దాటినప్పుడే ఇబ్బంది.
చిన్నప్పుడు సినిమా పోస్టర్లకు దండలు వేసేవాళ్ళు. ప్రత్యర్ధులు వాటి  మీద పేడ కొట్టేవారు. అభిమానం, దురభిమానం పెడదారి పడితేనే  ఇటువంటి విపరీత పోకడలకు దారి తీస్తాయి. వేములపాటి మాధవి గారు ఈ విషయంలో వెలిబుచ్చిన ఆవేదన దీనికి ప్రేరణ.
మనలో ఎవరికీ మోడీతో పరిచయం లేదు. రాహుల్ ఎవరో తెలియదు. చంద్రబాబు, చంద్ర శేఖర రావులతో ముఖ పరిచయం కూడా లేదు. జగన్ మోహన రెడ్డితో గట్టు తగాదాలు లేవు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీలకి నాయకులు. రాజకీయంగా అనేక మాటలు అనుకుంటారు. సిద్దాంతాలు, సూత్రాలకు సంబంధించి ఏదైనా మాట్లాడుకున్నా, వ్యాఖ్యానించినా తప్పుపట్టడానికి లేదు. వ్యక్తిగతమైన నిందలు, ఆరోపణలు అనవసరమైన మానసిక గ్లాని కలిగిస్తాయి.
అలాఅని మడిగట్టుకుని కూర్చోమని చెప్పడం లేదు. చేసే విమర్శలు హుందాగా వుండాలి. చేసే  వ్యాఖ్యలు ఏం చెప్పారురా అనేట్టు వుండాలి. మరోసారి, మరోసారి చదివించేట్టుగా వుండాలి. ఎంతోకొంత జ్ఞానాన్ని సముపార్జించుకునేలా వుండాలి.
పరవాలేదు, ఈరోజు నా స్నేహితుల నుంచి ఒక కొత్త పాఠం నేర్చుకున్నాను, ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, మరపున పడ్డ ఒక గొప్ప సంగతి గుర్తు చేసుకున్నాను, రాస్తున్న దానిలో, చెబుతున్నదానిలో ఎక్కడ తప్పు దొర్లిందో స్నేహితుల నుంచి తెలుసుకుని సరిదిద్దుకోగలిగాను అనే విధంగా  మనసుకు హాయినిచ్చే భావనతో ఒకరోజు గడపగలగడం నిజంగా ఎంతటి అదృష్టం.

ఈ అవకాశం అందించిన జుకర్ బర్గ్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలా! ఎందుకయ్యా ఈ బ్రహ్మ రాక్షసిని మాకు కట్టబెట్టావు అని నిందవేయాలా!            

ఒకనాటి ఓ క్యూ కధ


అలనాటి సోవియట్ యూనియన్  లో కొత్తగా వెళ్ళిన మా బోంట్లకు అక్కడ చాలాకాలంగా ఉంటున్న వాళ్ళు ఓ నీతి బోధ చేసేవాళ్ళు.
‘కనబడిన క్యూలో నిలబడు. కనబడ్డ ప్రతిదీ కొనుక్కో. కొన్న వస్తువు పనికొస్తుందా రాదా అన్నది ఇంటికి వెళ్లి చూసుకో”
దీనికి కారణం వుంది. ఆ దేశంలో ప్రతిదీ బీరు నుంచి కారు వరకూ అన్నీ కారు చౌకే. లీటరు పాలు ముప్పయి కోపెక్కులు. (మన పైసల వంటివి). లీటరు పెట్రోలూ   ముప్పయి కోపెక్కులే. కార్లూ, రిఫ్రేజ్ రేటర్లు ఏవీ ఖరీదు కావు. చౌక అనే దానికి తోడు ప్రజల కొనుగోలు శక్తి కూడా అపరిమితం. దానాదీనా  జనాలు అవసరం వున్నా లేకపోయినా, అవసరానికి మించి కొనుగోళ్ళు చేసేవాళ్ళు. అంచేత వచ్చిన సరుకులు వచ్చినట్టు క్షణాల్లో అయిపోయేవి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు.
అవసరానికి మించి కొనుగోళ్ళు జరపడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడేది. దానితో పాటే క్యూలు పెరిగిపోయేవి. మనిషికి ఇన్నే అనే నిబంధన పెడితే అందరికీ దొరికేవేమో. కానీ ప్రజా సంక్షేమం పేరుతొ అలాంటి ఆంక్షలు ఉండేవి కావు.
ఏతావాతా జరిగింది ఏమిటంటే ఏ కొరతా లేని దేశంలో అన్నిటికీ కొరతలు ఏర్పడ్డాయి.
కొరత మాట ఎలా వున్నా ఏదీ ఖరీదు కాదు. అంచేత దొరికిందే కొనుక్కుందామని క్యూలలో కాలక్షేపం చేయడం జనాలకు అలవాటయింది. అదృష్టం బాగుంటే ఆ రోజు క్యూబా నుంచి దిగుమతి అయిన  తాజా తాజా అరటి పండ్లు డజన్ల కొద్దీ ఇంటికి తెచ్చుకోవచ్చు. అదృష్టం మరీ పుచ్చితే జర్మనీలో తయారయిన నాణ్యమైన ఎలెక్ట్రానిక్ వస్తువులు దొరకొచ్చు. ఖరీదు మాత్రం రూబులు (రూపాయ్) దాటితే గొప్ప.  

ఒకసారి ఇలానే ఓ క్యూలో నిలబడి చాలా చవగ్గా కనబడ్డది ఒకటి కొని ఇంటికి తెచ్చాను. ప్యాకెట్ మీద రష్యన్ లో ఏదో  రాసుంది. అదేమిటో తెలియక పక్కన పడేశాను. తీరా ఎవరో చెప్పారు, అది చెకొస్లవేకియాలో  కట్ గ్లాస్ తో తయారుచేసిన  విస్కీ సెట్ (డికా౦టర్) అని. మనదేశంలో దాని ఖరీదు వేలల్లో వుంటుందని. 
(ఇన్నేళ్ళ తరువాత కూడా, ఇన్ని ఇళ్ళు మారిన తరువాత కూడా అదిప్పుడు మావద్ద భద్రంగా వుంది, ఆ నాటి మా వైభవానికి ఓ తీపి గుర్తుగా)    

కొరతలు, క్యూలు. జోకే సుమా!

ఎనభయ్యవ దశకం ఉత్తరార్ధంలో నేను మాస్కోలో కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తున్న రోజుల్లో శాకాహారుల మైన మమ్మల్ని ఒకే ఒక్క కొరత బాధిస్తుండేది. సరయిన బియ్యం దొరికేవి కావు. అవి ఎక్కడ దొరుకుతాయన్నది అక్కడి తెలుగు కుటుంబాల వాళ్ళం ఒకరికొకరం ఫోన్లు చేసుకుని చెప్పుకునేవాళ్ళం.  ఆ రోజుల్లో హుషారుగా షికారు చేసిన జోకు ఇది.
“మాస్కోలోని ఇండియన్ ఎంబసీకి కొత్త అధికారి వచ్చారు. ఆయన మహా స్ట్రిక్టు. ప్రతి రోజూ ఉదయం స్టాఫ్ మీటింగు జరిగేది. ఒక్క నిమిషం ఎవరయినా ఆలస్యంగా వచ్చినా ఆయన మండిపడే వారు. ఇలా వుండగా ఒకరోజు ఒక చిన్న ఆధికారి ఆ మీటింగుకి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. పెద్ద ఆధికారి చిందులు వేస్తూ “ఎందుకీ ఆలస్యం, ఏమా కధ” అంటూ సంజాయిషీ కోరారు. బాగా  బెదిరిపోయిన ఆ  చిన్న అధికారి చిన్న గొంతుకతో మెల్లగా చెప్పాడు.
“ఆఫీసుకి వస్తుంటే దారిలో ఒక దుకాణంలో బియ్యం అమ్ముతున్నారు. క్యూలో నిలబడి కొనుక్కుని వచ్చేసరికి లేటయింది, మన్నించాలి”
అంతే!

కొత్తగా వచ్చిన పెద్ద అధికారి, లేటుగా వచ్చిన చిన్న అధికారి తప్ప అక్కడ ఎవరూ లేరు. ఒక్కసారిగా  అందరూ మాయం అయిపోయారు.  బియ్యం దొరుకుతున్న షాపుకు పరిగెత్తుకు పోయారు.           

7, డిసెంబర్ 2016, బుధవారం

ముల్లు గుచ్చుకుంది కానీ రక్తం కారడం లేదు

ఇబ్బందులనుంచి  ఉపశమనం రెండు విధాలుగా లభిస్తుంది. పరిష్కారం మొదటిది కాగా వాటికి  అలవాటు పడిపోవడం రెండో పద్దతి. చాలా సందర్భాలలో  సామాన్యులకు  రెండోదే ఊరట ఇస్తోంది.