2, డిసెంబర్ 2015, బుధవారం

గర్వపడే ఆ ఘడియ ఎప్పుడో ......


ఇందాక ఏబీఎన్ ఆంద్ర జ్యోతిలో చెన్నై వరద పరిస్తితి గురించి ప్రత్యేక కధనం చూసాను. పరిస్తితి దారుణంగా వుంటే ఆ నగర వాసుల స్తితిగతులు మరింత దారుణం అనిపించాయి.


కేరళ నుంచి చెన్నై వచ్చి నగరంలో చిక్కుకు పోయిన ఓ అమ్మాయి చెబుతోంది ఇలా,...”మా రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద వానలే కురుస్తాయి. అయితే డ్రైనేజి వ్యవస్థ పటిష్టంగా వుండడం వల్ల ఈ ఇబ్బందులు మాకు తెలవవు”

రాష్ట్రాలు గురించి ఇలా గర్వంగా చెప్పుకోగలిగిన ఘడియ ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు.

మీడియాపై గవర్నర్ ధర్మాగ్రహం

సూటిగా ..........సుతిమెత్తగా .......


(హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలలో ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్)

గవర్నర్ నరసింహన్ గారికి కోపం వచ్చింది అనుకున్నారు ఆ  సాయంత్రం ఆయన సభకు వచ్చిన సభికుల్లో చాలామంది. కానీ ఆయనకు వచ్చింది ‘ధర్మాగ్రహం’ అనడమే సబబుగా వుంటుంది.
గతవారం హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ ఆనాటి ముఖ్య అతిధి. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాల్లో గవర్నర్ ప్రసంగం సాంప్రదాయబద్ధంగా సాగడం రివాజు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసంగపాఠాన్ని చదవడం ఆనవాయితీ. ఎందుకో ఏమో కానీ నరసింహన్ గారు ఆ రోజు ఆ పద్ధతికి స్వస్తి చెప్పి తటాలున అప్పటికప్పుడు ఆశువుగా  చేసిన ఉపన్యాసంలో, ఆయన  మనసులోని మాటలు బయటకు వచ్చాయి. తన సహజ సిద్ధ మైన మృదు భాషణతోనే ఆయన ఉపన్యాసం ప్రారంభించి చెప్పాలనుకున్న లేదా  చెప్పాల్సిన నాలుగు విషయాలు చల్లగా చెప్పేశారు. ధాటీగా సాగిన గవర్నర్ ప్రసంగం నుంచి ఈనాటి మీడియా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో వున్నాయి. నిజానికి ఈనాడు చాలామంది సాధారణ టీవీ వీక్షకుల్లో వున్న భావాలే అనర్ఘలంగా సాగిన గవర్నర్ ప్రసంగంలో చోటుచేసుకున్నాయి.
మీడియా హద్దులు దాటి వ్యవహరిస్తోంది అన్న సాకుతో నియంత్రణకు  పూనుకోవడం హేతుబద్ధం కాదు. అలాగని స్వేచ్చకు సొంత భాష్యాలు చెప్పుకుంటూ ప్రతి అంశాన్ని సమర్ధించుకుంటూ పోవడం కూడా సమంజసం కాదు. ఈ రెంటికీ నడుమ కనీ కనబడకుండా వున్న సన్నటి విభజన రేఖను గమనించి నడుచుకుంటే మీడియా పాఠాలు చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడేది కాదేమో!
నరసింహన్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి అయిదేళ్ళు దాటిపోయింది. మొదట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చిన నరసింహన్, దరిమిలా రాష్ట్ర విభజన అనంతరం పురుడు పోసుకున్న రెండు నవజాత రాష్ట్రాలయిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లు రెంటికీ కూడా ఉమ్మడి గవర్నర్ గా పనిచేసే అవకాశం రావడం ఆయన దక్షతకు అద్దం పడుతుంది. రాష్ట్ర విభజనకు ముందూ, ఆ తరువాతా కూడా గవర్నర్ పాత్ర పోషించడంలో పలుమార్లు అనేక విమర్సలకు గురయ్యారు. విభజనకు పూర్వం కొన్ని రాజకీయ పార్టీలు ఆయన వ్యవహార శైలిని అపార్ధం చేసుకుంటే, వేర్పాటు తరువాత మరికొన్ని పార్టీలకు ఆయన పోకడలతో పొసక్కపోవడం అన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలో అనేక సందర్భాలలో గవర్నర్ పాత్ర గురించీ, ఆయన వ్యక్తిగత నమ్మకాలు గురించీ అనేక కధనాలు మీడియాలో వచ్చాయి. ప్రెస్  క్లబ్ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం గమనించిన వారిని,  ఇన్నేళ్ళుగా నరసింహన్ తనను మానసికంగా బాధపెట్టిన అటువంటి అనేక అంశాలను మనసుకు పట్టించుకోవడమే కాకుండా గుర్తు పెట్టుకుని వాటినన్నింటినీ సోదాహరణంగా ప్రస్తావించిన తీరు మరింత అబ్బురపరచింది. తన మనస్సులో ఇంతకాలంగా సుళ్ళు తిరుగుతున్న భావోద్రేకాలను వెలువరించి, తన మనస్సును చల్లబరచుకునే ఉద్దేశ్యంతో నాటి వేదికను ఆయన అనువుగా ఎంచుకున్నారేమో అని కూడా అనిపించింది.
పత్రికా స్వేచ్చను గురించి  చర్చించడం వ్యాసకర్త ఉద్దేశ్యం కాదు. గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు ఆత్మశోధనకు ఉపకరించేలా వున్నాయన్న అభిప్రాయంతోనే ఈ వారం ఈ అంశాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది.
చేయి బార్లా చాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ చేతి కొన పక్కవాడి ముక్కును తాకనంతవరకే ఆ స్వేచ్చ  అనేది ఓ ఇంగ్లీష్ నానుడి.
బహుశా గవర్నర్ విషయంలో మీడియా స్వేచ్ఛ ఆ హద్దును దాటివుంటుంది.  ఆయన  తన ప్రసంగంలో అనేక వ్యక్తిగత అనుభవాలను  ప్రస్తావించడానికి అదే కారణం అయివుంటుంది.
నరసింహన్ గారి సోదరుడు ఓ ఐ.ఏ.యస్. అధికారి. అసోం రాష్ట్రంలో పనిచేస్తూ ఉల్ఫా ఉగ్రవాద దాడులకు గురై మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని తీసుకురావడానికి నరసింహన్ విమానాశ్రయానికి వెళ్ళారు. అదో విషాద సందర్భం. ఆ సమయంలో ఒక విలేకరి ఆయన్ని అడిగిన ప్రశ్న- ’కైసా లగ్తా హై’ (ఎలా అనిపిస్తోంది?).
‘ఓ పక్క సోదరుడి నిర్జీవ శరీరం.  నిండు విషాదంలో వున్న నన్ను, సమయం సందర్భం చూసుకోకుండా అడగాల్సిన ప్రశ్నా అది?’ అనేది నరసింహన్ గారు పాత్రికేయ లోకానికి సంధించిన ప్రశ్న.
గవర్నర్ ఉదహరించిన మరో ఉదంతం. ఒక పత్రికా విలేకరి గవర్నర్ ని కలిసి ఇంటర్వ్యూ చేసి తన పత్రికలో ఓ చక్కటి వ్యాసం రాసాడు. అంతా బాగానే రాసి ‘గవర్నర్ భార్య శ్రీమతి విమలా నరసింహన్ బయట ఊళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రతి సందర్భంలో గవర్నర్ విమానాశ్రయానికి వెళ్లి తీసుకు రావడం అంత అవసరమా’ అన్న రీతిలో ఓ వ్యంగ బాణం ఒదిలాడు. ఇది నరసింహన్ గారి మనస్సును యెంత బాధ పెట్టిందంటే, ‘నేను వెళ్ళేది ‘నా’ భార్యకోసమే కదా!’ అనేశారు. ‘ఇతరులకోసం కాదుకదా ‘ అనే వ్యంగం అందులో దాగుంది. సుతిమెత్తగా అంటించడం అంటే ఇదే! భార్యా భర్తల నడుమ అనురాగం అర్ధం అయిన విలేకరి అయితే పరిహాసానికి కూడా ఇలాటి ప్రస్తావన చేయడని నాటి సమావేశానికి హాజరయిన ఓ సీనియర్ విలేకరి వ్యాఖ్యానించాడు.
కలం బలం గురించి నెపోలియన్, మహాత్మా గాంధి సూక్తులను కూడా గవర్నర్ ఉదహరించారు. ‘పత్రికలకు వున్నబలం తక్కువ కాదు. మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. ప్రజాస్వామ్య సౌధంలోని మిగిలిన స్తంభాలు స్థిరంగా ఉండేలా మీడియా కాపు కాస్తుండాలి’ అనే రీతిలో గవర్నర్ హిత బోధ సాగింది.   
ఇటీవల మీడియాలో పెచ్చరిల్లుతున్న ‘బ్రేకింగ్ న్యూస్’ ధోరణిని కూడా గవర్నర్ తప్పుపట్టారు. ప్రతి అంశాన్ని సంచలనం చేసి రేటింగులు పెంచుకునే సంస్కృతికి స్వస్తి చెప్పాలని కూడా ఆయన సూచించారు. ‘ఉరి వేసుకుంటున్న వ్యక్తి ఏ చేత్తో ఉరితాడు తగిలించుకుంటున్నాడు’ అని విజువల్స్ తో వర్ణించడం కాకుండా అతడిని కాపాడడానికి చేతనయిన సాయం చేయడం  ధర్మమని అన్నారు.
‘ప్రమాదంలో గాయపడి ఓ వ్యక్తి నెత్తురోడుతూ చావుబతుకుల నడుమ కొట్లాడుతుంటాడు. అతడ్ని కాపాడడం యెట్లా అన్నది ఆలోచించకుండా ఆ సన్నివేశాన్ని యధాతధంగా చిత్రించి వీక్షకులకు యెంత త్వరగా చూపగలమనే ధోరణిలో మీడియా ఆలోచించడం దురదృష్టకరం. ఇలా బాధ్యతా రహితంగా వ్యవహరించే మీడియా వారిని కూడా నేరంలో భాగస్వాములను చేయాలి అనేంత తీవ్రంగా గవర్నర్ స్పందించారంటే మీడియా యాజమాన్యాలు తక్షణం  ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అగత్యం కనబడుతోంది.
సంచలన వార్తలు కొన్ని క్షణాలే బాగుంటాయి. నిస్సహాయులను కాపాడగలిగితే ఆ సంతృప్తి చిరకాలం వుంటుందని హితవు పలికారు. ఈ సందర్భంలో నరసింహన్ మృదువుగానే చాలా కటువైన సూచన చేసారు. మీడియాను కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్నది ఆ సూచన.
‘ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చినప్పుడల్లా ‘ప్రధానికి ఇచ్చిన ముప్పయి అయిదు పేజీల నివేదికలో ఏముందో చెప్పమంటారు’ అన్నారు గవర్నర్.
పేజీల సంఖ్య సయితం  తెలిసిన వారికి అందులో ఏముందో తెలవదా అన్నది నరసింహన్ గారి శ్లేష.
ఇక చివరాఖరుకు గవర్నర్, తన దేవాలయ సందర్సనలను  వివాదాస్పదం చేయడానికి మీడియా ప్రయత్నిస్తోందని అభియోగం మోపారు.
‘గవర్నర్ దేవాలయాలకు వెళ్ళడం తప్పుకాదు. నిజానికది వార్తా కాదు’ అంటూ నరసింహన్ ఘంటాపధంగా చెప్పారు.
‘ఒక అధికారిగా, ఒక గవర్నర్ గా నేను చేసిన సేవలకు గౌరవం ఇవ్వకపోయినా పరవాలేదు, కనీసం నా వయస్సును అయినా గౌరవించండి’ అనేది చివర్లో నరసింహన్ మీడియాకు చేసిన విజ్ఞప్తి.
తోక టపా: గవర్నర్ ప్రసంగం అనంతరం ఆ కార్యక్రమానికి హాజరయిన సీనియర్ జర్నలిష్టులు అనేకమంది గవర్నర్ లేవనెత్తిన పలు అంశాలతో ఏకీవభించినట్టే వారి మాటల్లో అర్ధం అయింది. పలు తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తూ వస్తున్న వీ.జే.ఎం. దివాకర్ ఇలా చెప్పారు.
“నేనొక రోజు ప్రెస్ క్లబ్ సమీపంలో వున్న హనుమంతుడి గుడికి వెళ్లాను. ఆ సమయంలో గవర్నర్ నరసింహన్ గుడిలో వున్నారు. లోపలకు వెళ్ళడానికి సంకోచిస్తుంటే, బయట నిలబడి వున్న గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది ‘పరవాలేదు, లోపలకు వెళ్ళండి’ అన్నారు. సందేహిస్తూనే వెళ్లాను. ప్రదక్షిణం చేస్తుంటే నా ముందున్న వ్యక్తిని చూసి నివ్వెర పోయాను. గవర్నర్ మామూలుగా అందరు  భక్తుల మాదిరిగా ప్రదక్షిణాలు చేస్తున్నారు.”
(02-12-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 09491 30595
NOTE: Courtsey Image Owner                     

1, డిసెంబర్ 2015, మంగళవారం

ప్రెస్ క్లబ్ తో నలభయ్ ఏళ్ళ అనుబంధం

హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్థాపించి యాభయ్ ఏళ్ళు గడిచాయి. ఇందులో నలభయ్ ఏళ్ళకు పైగా ఆ క్లబ్ సభ్యుడిగా వుంటూ వచ్చాను. క్లబ్ కార్యవర్గ సభ్యుడిగా, క్లబ్ కార్యదర్శిగా, క్లబ్ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో ప్రెస్ క్లబ్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం లభించడం నా అదృష్టం.

మొన్నీ మధ్య ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉత్సవానికి ముందు రోజు క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణా ఉప ముఖ్యమంత్రి  మహమూద్ ఆలీ,  హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరై సీనియర్ సభ్యులను సత్కరించారు. మరుసటి రోజు రవీంద్రభారతిలో నిర్వహించిన  స్వర్ణోత్సవంలో గవర్నర్ శ్రీ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణా ఐ.టీ. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా మరోమారు ఈ సత్కారం స్వీకరించే అవకాశం మా బోంట్లకు కలిగించిన క్లబ్ కార్యవర్గానికి కృతజ్ఞతలు.   






30, నవంబర్ 2015, సోమవారం

కాసింత కర్టెసీ


ఇప్పుడే ఒక ఛానల్ లో కింద వచ్చే  స్క్రోలింగు చూశాను. రాబోయే కార్యక్రమానికి చెందిన సమాచారం అది.
“సోనియా అమెరికా ఎందుకు వెళ్ళింది” అన్నది ఆ స్క్రోలింగు.
కాస్త మర్యాదగా “సోనియా అమెరికా ఎందుకు వెళ్ళారు” అని దాన్నే  మార్చి రాయొచ్చు. ఒకవేళ అది కుదరని పక్షంలో “సోనియా అమెరికా ఎందుకు వెళ్లినట్టు?” అని రాస్తే ఎవరికీ ఇబ్బంది వుండదు.
“మోడీ పారిస్ వెళ్ళారు” అనడానికీ, “మోడీ పారిస్ వెళ్ళాడు” అనడానికీ వున్న తేడాను ఈ స్క్రోలింగులు రాసే వాళ్ళు గమనిస్తే బాగుంటుంది.
కాలేజీ రోజుల్లో మాకు ఇంగ్లీష్ గ్రామరు లెక్చరరు క్లాసులోకి రాగానే ‘లెస్ నాయిస్ ప్లీజ్” అనేవారు. ‘స్టూడెంట్లు ఎట్లాగో అల్లరి చేస్తారు. కాస్త తక్కువ గోల చేయండ’ని ఆయన వేడుకోలు.
అల్లాగే ఈనాటి మీడియా కూడా, వున్నపరిధుల్లో, పరిమితుల్లో కాసింత ‘కర్టెసీ’ చూపితే బాగుంటుందని భవదీయుడి సూచన.

ధైర్యం


ఇరుగుపొరుగు రాజ్యాల సైన్యాధిపతులు ఓ విందు సమావేశంలో కలుసుకున్నారు. ఆ ఇద్దరి నడుమ ధైర్యం గురించిన ప్రస్తావన దొర్లింది.
ఒకడన్నాడు.
“నేను నా సైనికులకు ఇచ్చిన శిక్షణ చాలా గొప్పది. నేను ఆదేశించానంటే చాలు మా సైనికులు మారుమాట లేకుండా శిరసావహిస్తారు. ఈ విషయంలో వారు చూపే తెగువకు, ధైర్యానికి సాటిరాగలవారు వుండరు. మాట వరసకి ఇదిగో ఈ ఏడంతస్తుల భవనం మీద నుంచి కిందకు దూకమన్నాననుకోండి.  మరో మాట చెప్పకుండా కిందికి దూకేస్తారు. వాళ్ళ ధైర్యం ఎలాటిదో మీకు మచ్చు చూపిస్తాను” అంటూ తన సైనికుల్లో ఒకడిని పిలిచి ‘కిందకు దూకు’ అన్నాడు. సైన్యాధిపతి చెప్పినట్టే అతగాడు కిందికి దూకేసాడు. గాయపడిన అతడ్ని మిగిలిన సైనికులు వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళారు. ఈ తతంగం ముగియగానే మొదటి సైన్యాధికారి మీసం మెలేస్తూ రెండో వాడివైపు చూసి, ‘చూసావుగా మా వాళ్ళ ధైర్యం’ అంటూ హేళనగా మందహాసం చికిలించాడు. చేసేది లేక  పక్క దేశపు సైన్యాధికారి కూడా  తన బంటుల్లో ఒకడిని పిలిచి ఆ భవనం పైనుంచి దూకమన్నాడు. అయితే అతడు ఆ ఆదేశాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా ‘ఇంత ఎత్తు భవనం నుంచి దూకమనగానే దూకడానికి నాకేం మెదడు లేదనుకున్నావా’ అని ఎదురు ప్రశ్నించాడు.
అప్పుడన్నాడు రెండో సైన్యాధికారి.

“ఇలా పై అధికారికి ఎదురు చెప్పే ధైర్యం మీ వాళ్ళలో ఎవరికయినా ఉందా?”  

   
NOTE: Courtesy Image Owner  

27, నవంబర్ 2015, శుక్రవారం

కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన భారత రాజ్యాంగం

సూటిగా......సుతిమెత్తగా .....
(TO BE PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 29-11-2015, SUNDAY)

మత విశ్వాసులకు భగవద్గీత, ఖురాను, బైబిల్ మాదిరిగా ప్రజాస్వామ్యంలో నమ్మకం వున్నవారికి రాజ్యాంగం కూడా ఒక  పవిత్ర గ్రంధం. అటువంటి రాజ్యాంగం గురించి భారత పార్లమెంటు ఉభయ సభల్లో గడచిన వారం రెండు రోజులపాటు చర్చ జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని మోడీ ప్రభుత్వం, ‘రాజ్యాంగం పట్ల నిబద్ధత’ అనే అంశంపై రెండు రోజులపాటు ఈ  చర్చ నిర్వహించింది. రాజ్యాంగ రచనలో  అంబేద్కర్ ప్రదర్శించిన దూరదృష్టిని మననం చేసుకోవడంతో పాటు, రాజ్యాంగంలోని వివిధ అంశాలపై ఆసక్తికరమైన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు నోచుకున్నాయి. జాతి వ్యాప్తంగా ఈనాడు మీడియా చర్చలకు కేంద్ర బిందువుగా మారిన ‘అసహనం’ అంశం కూడా చట్ట సభల  ప్రసంగాల్లో చోటు చేసుకుంది. చర్చలు, సమాలోచనలే పార్లమెంటుకు అసలు సిసలైన ఆత్మ వంటిదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యల పర్యవసానమేమో తెలియదు కాని, రాజ్యాంగంపై లోక సభలో జరిగిన చర్చ ఘాటుగానే సాగింది.
చర్చ సాగినంత సేపూ సభలోనే కదలకుండా కూర్చుని సభ్యుల ప్రసంగాలను నోట్స్ రూపంలో రాసుకున్న ప్రధాని నరేంద్ర  మోడీ, రెండు రోజుల చర్చకు సవివరమైన సమాధానం ఇచ్చారు. (వివరాలు శనివారం పత్రికల్లో రావచ్చు)
సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి హిందీ సమానార్ధక పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచడంలో అనువాద సంబంధ మైన కించిత్ పొరబాటు జరిగిందనే అభిప్రాయం కలిగేట్టు, తొలి రోజునే  కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ సభ్యుల నుంచి నిరసనలకు దారితీసింది.
“దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అయిన పదం ఏదయినా వుందంటే అది ‘సెక్యులరిజం’. ఈ పదం ఇలా దుర్వినియోగానికి గురికాకుండా భరతవాక్యం పలకాలి. ఎందుకంటే, సమాజంలో ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడానికి ఈ పదం దోహదపడుతోంది” అన్నారు రాజ్ నాథ్.
సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి విస్తృతంగా వాడుతున్న అనువాద పదం ‘లౌకిక వాదం’ అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ పీఠికలో చేర్చాలని భావించలేదు. 1976 లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిష్టు (సామ్యవాద), సెక్యులర్ (లౌకిక) పదాలను రాజ్యాంగ పీఠికలో కొత్తగా చేర్చారని, రాజ్ నాథ్ గుర్తుచేశారు.
“సెక్యులరిజం’ అనే ఆంగ్ల పదానికి ‘ధర్మ నిరపేక్షత’(మతాతీత లౌకిక వాదం) అనే హిందీ అనువాదం సరికాదనీ, దాన్ని ‘పంత్ నిరపేక్ష’ (వర్గాతీత లౌకిక వాదం) అని వుంటే సబబుగా వుండేదని హోం మంత్రి వ్యాఖ్యానించారు.
“అంబేద్కర్ స్పూర్తితోనే మోడీ నాయకత్వంలోని  ఎండీయే ప్రభుత్వం ‘జన్ ధన్, స్వచ్చ భారత్, బేటీ పడావో’ వంటి పలు పధకాలకు రూపకల్పన చేసిందని చెప్పారు.
భారత రాజ్యాంగ రచనను ఒంటి చేత్తో నిర్వహించిన అంబేద్కర్ ప్రతిభను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు శ్లాఘించారు. కాలపరీక్షకు తట్టుకుని నిలబడేలా  రాజ్యంగ రూపకల్పన చేసిన అంబేద్కర్ దార్సనికతకు జాతి రుణపడివుంటుందన్నారు.
కేంద్ర హోంమంత్రి చేసిన ‘సెక్యులరిజం’ ప్రస్తావన పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఘాటుగానే స్పందించారు.
“రాజ్యాంగంపై విశ్వాసం లేనివాళ్ళు, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోనివాళ్ళు ఈ నాడు ధర్మ పన్నాలు వల్లిస్తున్నారు. ఇలాటివాళ్ళు  రాజ్యాంగానికి కట్టుబడి వుండడంపై చర్చ పెట్టడాన్ని మించిన హాస్యాస్పద అంశం వేరే ఏముంటుంది” అంటూ ఎద్దేవా చేసారు.
“రాజ్యాంగం యెంత మంచిదయినా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపొతే, అంతిమప్రభావం చెడుగానే వుంటుందని ఆనాడే అంబేద్కర్ అన్నారన్న సంగతిని గుర్తు చేస్తూ,  పాలక పక్షానికి ఓ  చురక అంటించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి వచ్చిన  అంబేద్కర్ లోని ప్రతిభను గుర్తించి రాజ్యంగ రచన వంటి గురుతర బాధ్యతను ఆయనకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీయే అని సోనియా ముక్తాయింపు ఇచ్చారు.
అంబేద్కర్ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన  ప్రత్యేక చర్చను, పాలక, ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తమ రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మళ్ళించుకునే రీతిలో, అంబేద్కర్ స్మృతిని వాడుకున్న తీరు నేటి స్వార్ధ రాజకీయాల తీరుతెన్నులకు అర్ధం పడుతోంది.
ఘర్షణాత్మక రాజకీయాలు ఒద్దని ఒకపక్క చెబుతూనే, సహనం నేటి  అవసరం అని ఇంకో పక్క  ఉద్ఘాటిస్తూనే, ఉభయ పక్షాలు తద్విరుద్ధంగా ప్రవర్తించడంలో తమ శక్త్యానుసారం పాటుపడ్డాయన్న వాస్తవం, చర్చల సరళిని గమనిస్తూ వచ్చిన వారికెవ్వరికయినా ఇట్టే బోధపడుతుంది.
అయితే మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ కొంత మేలే చేసింది. రాజ్యాంగం గురించి జాతి వ్యాప్తంగా మీడియాలో విస్తృత చర్చలు జరిగాయి. భారత రాజ్యాంగం గురించి, దాని విశిష్టతను గురించి బొత్తిగా తెలియని నేటి యువతరానికి తెలియయచేప్పే అనేక ఆసక్తికర అంశాలు మరోమారు వెలుగు చూసాయి.
గత అరవై ఆరేళ్లుగా అమల్లో వున్నభారత రాజ్యాంగానికి ఘనమైన చరిత్రే వుంది.
స్వాతంత్ర పోరాటంలో భాగంగానే సొంత రాజ్యాంగం కావాలంటూ 1930 లోనే కాంగ్రెస్ గళమెత్తింది. కాంగ్రెస్ వాదన ఒప్పుకోవడానికి బ్రిటిష్ పాలకులకు పదహారేళ్ళు పట్టింది.  1946లోనే నాటి వైస్రాయ్ లార్డు వావెల్ ఈ డిమాండును అంగీకరించారు. రాజ్యాంగ రూపకల్పనకు ఉద్దేశించిన పరిషత్ లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడే నాటికి సభ్యుల సంఖ్య 389 కాగా, దేశ విభజనానంతరం  299 కి తగ్గింది. కొందరు  ఎన్నికయిన వారు కాగా మరికొందరు నామినేటెడ్  సభ్యులు. మరో విశేషం ఏమిటంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో 24 మంది అమెరికన్లు. రాజ్యాంగ నిర్మాణ చర్చల్లో ఈ విదేశీయులు వారం రోజులు పాల్గొన్నారు.

రాజ్యాంగ రచన అక్షరాలా  రెండేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిదిరోజుల పాటు సాగింది. ఇందులో 114 రోజులు ముసాయిదా రూపకల్పనకే సరిపోయాయి. చర్చ సందర్భంగా 7,635 సవరణలు ప్రతిపాదించారు. సుదీర్ఘ పరిశీలన తరువాత 2,473 సవరణలను తిరస్కరించారు.
1946 డిసెంబరు లో మొదలయిన రాజ్యాంగ రచన  1949 డిసెంబరు వరకు కొనసాగింది. మరో విచిత్రం ఏమిటంటే ఈ క్రతువు కొనసాగుతున్న కాలంలో దేశం అత్యంత క్లిష్ట పరిస్తితుల్లో వుంది. మతఘర్షణలు, వర్గ పోరాటాలతో అట్టుడికి పోతున్న రోజులవి. బహుశా ఈ నేపధ్యమే సమానత్వం, స్వేచ్చ, సౌభాతృత్వం, సమ న్యాయం వంటి అంశాలు రాజ్యాంగ పరిధిలోకి తేవడానికి రాజ్యాంగ నిర్మాతలను ప్రేరేపించి ఉండవచ్చు.
వివిధ దేశాల రాజ్యాంగాలను సవిరంగా అధ్యనం చేసి, వాటిలోని మంచి లక్షణాలను భారత రాజ్యాంగంలో గుదిగుచ్చారు. ఫ్రాన్స్ నుంచి స్వేచ్చ, సమానత్వం, సౌభాతృత్వం, రష్యా నుంచి పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండు నుంచి ఆదేశిక సూత్రాలు, జపాన్ నుంచి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అమెరికా నుంచి ప్రాధమిక హక్కులు, కెనడా నుంచి సమాఖ్య స్పూర్తి, ఇలా పలు అంశాలకు మన రాజ్యాంగంలో చోటు దొరకడం వల్లనే అది కాల పరీక్షలను తట్టుకుని నిలబడి ప్రజాస్వామ్యం విలసిల్లడానికి తోడ్పడింది. 
యావత్ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దది. మొత్తం   25 భాగాలు. పన్నెండు షెడ్యూల్స్,  448 అధికరణలు, అయిదు అనుబంధాలు.
ఇంతటి విస్తృత రాజ్యాంగాన్ని సరిగ్గా అరవై ఆరేళ్ళ క్రితం నవంబరు 26 న మన రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటి నుంచి స్వేచ్చా భారతం గణతంత్ర రిపబ్లిక్ గా అవతరించింది. ఇన్నేళ్ళ తరువాత తొలిసారి ఈ రోజును అంటే నవంబరు ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవాలనే సత్సంకల్పం పాలకులకు కలిగింది. రాజ్యాంగం గురించి భావి భారత పౌరులయిన విద్యార్ధులకు మరింత అవగాహన కలగడానికి వీలుగా సరళమైన భాషలో ప్రాధమిక దశ నుంచే పాఠ్య ప్రణాళికలలో చేర్చే సదుద్దేశం కూడా ఏలిన వారికి కలిగితే అంతకంటే కావాల్సింది లేదు. 
తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత  పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రంధాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది. (27-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image owner

తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత  పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రందాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది. (27-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image owner          

24, నవంబర్ 2015, మంగళవారం

ఏకపక్ష విజయంలో బహుముఖ కోణాలు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 26-11-2015, THURSDAY)
ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చెందిన  అతిరధ మహారధులెందరో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు  దొరక్క, ఇండిపెండెంటుగా పోటీ చేసి కనుమూరి బాపిరాజు, ఆ పెను ప్రభంజనంలో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచి బయటపడి, మొదటి సారి శాసన సభలో అడుగు పెట్టారు. సహజంగా హాస్య ప్రియుడయిన బాపిరాజు ఆనాటి హైదరాబాదు విలేకరులతో ముచ్చటిస్తూ ఇలా అన్నారు. ‘ఎన్టీఆర్ సినిమాల్లో విసిరే ముష్టిఘాతాలకు విలన్లు కుదేలవడం తెలుసు. కానీ రాజకీయ రంగంలోకి అడుగు పెడుతూనే ఆయన కొట్టిన దెబ్బకు  మా అందరికీ కాళ్లూ చేతులూ విరిగిపోయాయి. నడుములు కుంగిపోయాయి. ఒకడికి కాలు పొతే, మరొకడికి కన్ను పోయినట్టయింది   మా పరిస్థితి. (ఇండిపెండెంటుగా గెలిచినా ఆయన కాంగ్రెసు మనిషే). ఎన్నికల్లో చావుదెబ్బ తినడం అంటే ఏమిటో చెప్పడానికి  బాపిరాజుగారు ఆ రోజుల్లో చెప్పిన భాష్యం అది. మళ్ళీ ఇన్నాల్టికి వరంగల్ ఉప ఎన్నిక ఫలితం రూపంలో అలాంటి రాజకీయ అద్భుతం చోటుచేసుకుంది. సుమారు ఏడాదిన్నర క్రితం కొంచెం అటూ ఇటూగా నాలుగు లక్షల మెజారిటీతో గెలుచుకున్న వరంగల్ లోక సభ స్థానాన్ని టీ.ఆర్.ఎస్. తిరిగి అంతకు మించిన మెజారిటీతో నిలబెట్టుకుని కొత్త రాష్ట్రంలో ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పింది.


అర్ధం చేసుకోవాల్సిన  విషయం ఏమిటంటే, ఏడాదిన్నర కాలంలోనే మెజారిటీ పడిపోయి ఓటమిని మూటగట్టుకునేంతగా కేసీఆర్ నేతృత్వంలోని టీ.ఆర్.ఎస్.  సర్కారు, తన  కొంగున కట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదు. అలాగని, ఇంత గొప్ప మెజారిటీ తెచ్చుకుని, ఎన్నికల బరిలో వున్నమొత్తం ఇరవైరెండు మంది ప్రత్యర్ధులకు  డిపాజిట్లు సయితం దక్కనంతగా ఘన విజయం సాధించే  అద్భుతమైన ఘన కార్యాలు ఈ ఏన్నర్ధం కాలంలో చేసిన దాఖలా కూడా ఏమీ లేదు. మరి ఎందుకిలా జరిగింది? ఎందుకిలా వచ్చిందీ ఫలితం?
ఎందుకంటే, ఘోరంగా ఓడిపోయిన వారిది ఎక్కువగా  స్వయంకృతాపరాధమే.      
‘తెలంగాణా ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడంలో వైఫల్యం చెందడం వల్లనే నిరుటి ఎన్నికల్లో గెలవలేకపోయామని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ,  ఆ విషయాన్ని మరోమారు తెలంగాణా ప్రజల ముందుకు తెచ్చి ఈ ఉపఎన్నికలో అయినా పోయిన పరువు నిలబెట్టుకోవాలని  ఢిల్లీ నాయకుల్ని సయితం వరంగల్ ప్రచారంలోకి దింపింది. తెలంగాణా బిల్లు లోకసభ ఆమోదం పొందే సమయంలో స్పీకర్ గా వున్న మీరా కుమార్ మొదలయిన వారితో అలనాటి అంశాలను మళ్ళీ చెప్పించి, ప్రజల మనసులు గెలవాలని ప్రయత్నం చేసింది. మరో వైపు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సహజంగా తలెత్తగల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా ఆ పార్టీ నాయకులు చేసారు. నామినేషన్ సమయంలో అభ్యర్ధిని మార్చాల్సిన విషమ పరిస్తితి నుంచి కొంత బయట పడ్డట్టు మొదట్లో అనిపించినా చివరకు ఫలితం మాత్రం ప్రతికూలంగానే వచ్చింది.
మరోవైపు కేంద్రంలో అధికారంలోవున్న  బీజేపీ, పొరుగు రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీ, గత ఎన్నికలల్లో కుదుర్చుకున్న పొత్తుకు కొనసాగింపుగా ఈ ఉపఎన్నికలో మరోమారు జతకట్టి పోటీ చేసాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటులో తమకూ కొంత వాటా వుందని నమ్ముతున్న బీజేపీ సహజంగానే ఆ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. కేంద్ర సాయం లేకుండా కొత్త తెలంగాణా రాష్ట్రం మనుగడ కష్టం కాబట్టి కేంద్రంలో అధికారంలో వున్న తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించడం వరంగల్ ఓటర్ల విధాయకం అని నమ్మచూపే పద్దతిలో ఆ పార్టీ ప్రచారం సాగింది. ఇక ఆ పార్టీకి మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ నాయకత్వం, బీజేపీ అభ్యర్ధి విజయానికి కృషి చేసింది కాని, సైకిల్ గుర్తుకు ఓటువేయడానికి అలవాటుపడిన టీడీపీ కార్యకర్తల ఓట్లు ఏమాత్రం కమలం గుర్తుకు బదిలీ అవుతాయన్న  విషయంలో ఎవరి అనుమానాలు వారికి పోలింగుకి ముందర నుంచీ వున్నాయి. చివరాఖరుకు అవే నిజమయ్యాయా అన్నట్టు ఫలితం వెలువడింది. ఓటమిలో పాలుపంచుకున్న టీడీపీ నాయకత్వానికి మిగిలిన ఒకే ఒక ఉపశమనం ఏమిటంటే,  ఈ ఎన్నికల్లో సొంతంగా  అభ్యర్ధిని  నిలబెట్టకుండా, ఆ స్థానాన్ని మిత్ర పక్షం అయిన బీజేపీకి ఒదిలివేయడమే.  
ఇక వామపక్షాలు ఏకంగా ఒక ఉమ్మడి అభ్యర్ధిని పోటీకి నిలిపాయి. వై.ఎస్.ఆర్. పార్టీకి తెలంగాణాలో బలం లేకపోయినా అభ్యర్ధిని నిలబెట్టింది. జగన్ మోహన్ రెడ్డి సభలకు భారీగా తరలివచ్చిన జనాలను అయినా ఓట్లుగా మలచుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.
ఇన్ని పార్టీలు రంగంలో వున్నప్పుడు సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి పాలక పక్షానికే ఉపకరిస్తుంది. అయితే ఇన్ని పార్టీలు ప్రచార పర్వంలో విసిరే ఆరోపణలకు, విమర్సలకు ఒంటరిగా జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా పాలక పక్షం నాయకులపై పడుతుంది. అందుకే ప్రచార సమయంలో ప్రతి అంశం వివాదాంశంగా మారి, మీడియాలో పలు రూపాల్లో రూపాంతరం చెంది, నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత బాగా పేరుకుపోయి ఉన్నదేమో అని ప్రతిపక్షాలే నమ్మే స్థితి ఏర్పడింది. చివరికి ఈ నమ్మకమే వాస్తవ స్థితిని  సయితం  గుర్తించలేని పరిస్థితిలోకి వాటిని నెట్టి వేసింది. నిజానికి అధికారంలోకి  వచ్చిన రెండేళ్లలోపు వచ్చిపడే ఉపఎన్నికలు ఏ పాలకపక్షానికయినా తలనొప్పే. యెంత గొప్ప నాయకుడయినా అంత కొద్ది వ్యవధానంలో ప్రజలను మెప్పించడం కష్టం. అధికార పక్షంపట్ల ఎంతో కొంత అసంతృప్తి సహజం. కొండొకచో అది వ్యతిరేకతగా కానవస్తుంది. అయితే అది అసహనంగా మారి, అసంతృప్తిగా పరిణమించి,  కసిగా మారనంత కాలం పాలక పక్షాలకు  కలిగే ప్రమాదం ఏమీ వుండదు.
సాధారణంగా ఉపఎన్నిక, అందులోను పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నిక అంటే జనంలో ఆసక్తి తగ్గిపోతుంది. ఆ ఒక్క స్థానంలో  గెలుపోటముల వల్ల అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలకు ఏర్పడే ముప్పు ఏమీ వుండదు. ఈ కారణాల వల్ల వరంగల్ ఉపఎన్నికను జనం ఆషామాషీగా తీసుకుంటారనే అభిప్రాయం కలిగిన మాట వాస్తవం. అయితే జనంలోని ఈ  నిర్లిప్తత తమ కొంప ముంచుతుందన్న ఎరుక కలిగిన రాజకీయ పార్టీలు తమ ప్రచార సరళిని ఉధృతం చేసే క్రమంలో, ఒకింత చెలియలి కట్ట దాటి వ్యవహరించాయి. మాటలు హద్దులు మించాయి. వ్యక్తిగత ఆరోపణలు మనస్సు చివుక్కుమనే రీతిలో సాగాయి.  రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల సమస్యలు వీటన్నిటినీ ప్రతిపక్ష పార్టీలు ప్రచారాస్త్రాలుగా మార్చుకుని టీఆర్ ఎస్ పై మూకుమ్మడి దాడికి దిగాయి. ప్రజల సమస్యలను ప్రచారంలో ఎత్తి చూపాయే కానీ, అంతకుమందు ప్రజల పక్షాన నిలిచి వారికోసం ఉమ్మడి పోరాటం చేయకపోవడం వల్ల, వారి ఆత్రుత అంతా అధికారంకోసమే అన్న అనుమానం కలగడం సహజం.   
వాస్తవంగా ప్రతిపక్షాలు ప్రచార పర్వంలో లేవనెత్తిన సమస్యలన్నీ పాలక పక్షం టీ.ఆర్.ఎస్. పార్టీకి మింగుడు పడని విషయాలే. ఇలాటి  ఏ అంశం అయినా సమాధానం చెప్పుకోవాల్సిందే. సంజాయిషీ  ఇచ్చుకోవాల్సిందే. అంచేతే  ప్రభుత్వానికి గుణపాఠం చెప్పితీరాలనే కసి కలగకపోయినా,  ఈ మాత్రం వ్యతిరేకత చాలు, నిరుడు టీ.ఆర్.ఎస్. పార్టీకి వచ్చిన భారీ మెజారిటీని గణనీయంగా తగ్గించడానికి అనే నమ్మకం కలిగింది ప్రతిపక్షాలకు. విజయం మీద నమ్మకం లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేకత పట్ల నమ్మకం పెంచుకున్న ప్రత్యర్ధులు మెజారిటీ తగ్గించగలిగితే, అదే ఓ మోస్తరు గెలుపు అనే అభిప్రాయానికి వచ్చారు. చివరికి గెలుద్దామని రంగంలో దిగిన పార్టీలు, మెజారిటీ తగ్గించడం, రెండో, మూడో స్థానం దక్కించుకోవడం ఎల్లా అనే మీమాంసలో పడిపోయినట్టయింది.
టీ.ఆర్.ఎస్. కి ఇంతటి అపూర్వ ఘన విజయం లభించడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు కొంతవరకు కారణం అయివుండవచ్చు కానీ, అసలయిన కారణం తెలంగాణా ప్రజల్లో ఇంకా అడుగంటని  భావోద్వేగం. కొడిగట్టని తెలంగాణా వాదం.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావడంతోనే, ఒకరకంగా  టీ.ఆర్.ఎస్. పాత్ర రాజకీయంగా పరిమితమయిపోయింది. మిగిలిన రాజకీయ పార్టీల్లో అదీ ఒకటయిపోయినట్టే లెక్క. ఈ లెక్క తెలిసిన మనిషి కాబట్టే, కేసీఆర్ ‘బంగారు తెలంగాణా’ నినాదం ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పడగానే టీ.ఆర్.ఎస్. పని ముగిసిపోయినట్టు కాదనీ, కష్టపడి ఎన్నో త్యాగాలతో  సంపాదించుకున్న తెచ్చుకున్న తెలంగాణాను ‘బంగారు తెలంగాణా’గా మలచుకోవాలంటే టీ.ఆర్.ఎస్. ఆవశ్యకత ఇంకా ఉందన్న అభిప్రాయం జనాల్లోకి చేరేలా ఆయన చేసిన ప్రయత్నం ఈ ఉపఎన్నికలో బాగా పనిచేసింది. అదే జనాలను ఇంత  పెద్ద ఎత్తున పోలింగు కేంద్రాలకు రప్పించి వుంటుందని నమ్మే వాళ్ళు వున్నారు.   
అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్ళు  ఇవన్నీ షరా మామూలు ఆరోపణలుగా భావించే రోజులు వచ్చాయి. అధికారంలో వున్నపార్టీ అధికారాన్ని వాడుకోవడం తనకున్న సహజ హక్కుగా భావించే రోజులివి. అధికారంలో వున్నప్పుడు తాము చేసిన నిర్వాకం అదే కనుక ఏ పార్టీ అయినా  మాటవరసకు మాత్రమే  ఇలాటి ఆరోపణలు చేస్తుందే తప్ప అందులో ఎంతమాత్రం నిజాయితీ లేదని వాటికీ తెలుసు. అధికార వినియోగం తప్ప దుర్వినియోగం అనే మాటే రాజకీయ పార్టీలు ఒప్పుకోని కాలంలో మనం జీవిస్తున్నాం. అధికారంతోటి, డబ్బుతోటి, ప్రలోభాల తోటి గెలుపు సాధ్యం అయ్యేటట్టయితే, వరంగల్ తో పాటే  ఫలితం వెలువడిన  మధ్య ప్రదేశ్ ఉపఎన్నికలో అధికార బీజేపీ  పార్టీ ఎందుకు ఓడిపోతుందన్న  ఎదురు ప్రశ్న సిద్ధంగానే వుంది.
అయితే ఒకటి మాత్రం నిజం.
ప్రజలు కచ్చపట్టి పాలకపక్షాలను ఓడించిన సందర్భాలు ఎరుగుదుం. కానీ కసిబూని ప్రభుత్వాన్ని గెలిపించిన ఏకైక సందర్భం మాత్రం ఒక్క వరంగల్ ఉపఎన్నికేనేమో! 
పాలక పక్షాన్ని ఓడించాలని ప్రతిపక్షాలు అనుకుంటాయి. అలా అని ప్రజలు కూడా అనుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలాగే వుంటుంది.
టీ.ఆర్.ఎస్. పార్టీకి  ప్రజలిచ్చిన వ్యవధానంలో ఇంకా మూడున్నర ఏళ్ళ సమయం మిగిలే వుంది. నిరుడు ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్ని పాలించమని ఇచ్చిన తీర్పు కంటే , తెలంగాణా కల సాకారం అయిన తరువాత కట్టబెట్టిన ఈ ఘన  విజయం టీ.ఆర్.ఎస్.కూ, ఆ పార్టీ అధినేతకూ మరింత ప్రియమైనదీ, అత్యంత విలువయినదీ. ప్రజలపట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రభుత్వానికి వున్న బాధ్యతను మరింత పెంచే విజయం కూడా ఇది.
విజయం వినయం పెంచాలి. అపజయం అనేది విజయం కోసం చేసే మరో ప్రయత్నానికి నాంది కావాలి. రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే.
(25-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595

NOTE : Courtesy Image Owner