హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్థాపించి యాభయ్ ఏళ్ళు
గడిచాయి. ఇందులో నలభయ్ ఏళ్ళకు పైగా ఆ క్లబ్ సభ్యుడిగా వుంటూ వచ్చాను. క్లబ్
కార్యవర్గ సభ్యుడిగా, క్లబ్ కార్యదర్శిగా, క్లబ్ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో
ప్రెస్ క్లబ్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం లభించడం నా
అదృష్టం.
మొన్నీ మధ్య ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలు ఘనంగా
జరిగాయి. ప్రధాన ఉత్సవానికి ముందు రోజు క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి
తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరై సీనియర్
సభ్యులను సత్కరించారు. మరుసటి రోజు రవీంద్రభారతిలో నిర్వహించిన స్వర్ణోత్సవంలో గవర్నర్ శ్రీ నరసింహన్, కేంద్ర
మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణా ఐ.టీ. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా
మరోమారు ఈ సత్కారం స్వీకరించే అవకాశం మా బోంట్లకు కలిగించిన క్లబ్ కార్యవర్గానికి
కృతజ్ఞతలు.