10, సెప్టెంబర్ 2015, గురువారం

అనుబంధం – ఆత్మీయత


రామచంద్ర మూర్తికి కాలు నిలవడం లేదు. అమెరికానుంచి గోపీ పిల్లలూ వస్తున్నారన్న కబురు తెలిసినప్పటి నుంచి ఆకాశంలో తేలిపోతున్నట్టుగా వుంది. అప్పటికప్పుడు పెన్షన్ డబ్బులు బ్యాంకు నుంచి తీసి రెండో గదిలో ఏసీ పెట్టించాడు. పిల్లలకు సౌకర్యంగా వుండాలని బాత్ రూమ్ లో వెస్ట్రన్ టాయిలెట్ పెట్టించాడు. ప్రతి గదిలో దోమలు రాకుండా కిటికీలకి  మెష్ పెట్టించాడు. భార్య మహాలక్ష్మి అంటూనే వుంది, ‘వాడేమన్న పరాయి వాడా, ఇక్కడపుట్టి ఇక్కడ పెరిగి వెళ్ళిన వాడేనాయే. అంతా మీ చాదస్తం’ అని. కానీ రామచంద్రమూర్తి చెవిన పెట్టలేదు. ‘అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, పరాయి దేశంలో కొత్త సౌకర్యాలకు అలవాటు పడి వస్తే ఇబ్బంది లేకుండా చూడ్డం మన ధర్మం’ అని నచ్చచెప్పాడు. ఈ లోగా అమెరికా నుంచి వాళ్ళు వచ్చే రోజు దగ్గర పడింది. ఆయన హడావిడి మరింత పెరిగింది.
అక్కడ అమెరికాలో విమానం ఎక్కబోయేముందు గోపీ, భార్యాపిల్లలతో  మరోసారి చెబుతున్నాడు.
‘చూడండి మనం చాలా ఏళ్ళ తరువాత బామ్మా తాతయ్యల దగ్గరికి వెడుతున్నాం. అక్కడ అన్నీ ఇక్కడి మాదిరిగా వుండవు. ఎలా వున్నా మనందరం సర్దుకు పోవాలి. వున్న మూడు నాలుగు వారాలు మనకేం ఇబ్బంది లేనట్టు గడిపి రావాలి. అది వసతిగా లేదు, ఇది  లేదు  అని సణగొద్దు. ఇండియాలో టాయిలెట్లు మన మాదిరిగా వుండవు. అయినా సరే నాలుగు రోజులు సర్దుకు పోదాం. అంతేకాని బామ్మను తాతయ్యను ఇబ్బంది పెట్టవద్దు. మనం వచ్చామన్న సంతోషం వాళ్లకు కలిగించాలి. వున్నన్నాళ్ళు పూర్తిగా వాళ్ళతోనే గడపాలి. సినిమాలు, షికార్లు ఏవయినా  మళ్ళీ తిరిగి వచ్చిన తరువాతే సుమా!’    

9, సెప్టెంబర్ 2015, బుధవారం

మనసులోని రసం


ఈ పండు ఏమిటి?” అడిగాడు గురువు గారు
“నారింజ పండు” చెప్పాడు  శిష్యుడు
“ఈ పండును గట్టిగా పిండితే ఏం వస్తుంది?”
“నారింజ రసం”
“యాపిల్ రసం ఎందుకు రాదు?”
“వీల్లేదు”
“మరి ద్రాక్ష రసం”
“అయ్యే పనికాదు”
“ఈ పండుని గట్టిగా పిండితే ఏ రసం వస్తుందంటావు?”
శిష్యుడికి సహనం తగ్గిపోతోంది. కానీ అడుగుతున్నది గురువుగారాయె. విసుగును అణచి పెట్టుకుంటూ జవాబు చెప్పాడు.
“నారింజ పండును పిసికితే నారింజ రసమే వస్తుంది”
“అంటే ఏమిటి. నారింజ పండు కాబట్టి లోపల వుండేది నారింజ రసమే, కదా!”
శిష్యుడు ఔనన్నట్టు తలూపాడు.


“ఉదాహరణకు ఈ పండే నువ్వు అనుకుందాం. ఎవరో కావాలని నీ మీద ఒత్తిడి పెంచాడనుకుందాం. నీకు ఇష్టం లేని మాటలు చెబుతున్నాడని అనుకుందాం. నిష్కారణంగా నిన్ను వేధిస్తున్నాడని అనుకుందాం. అప్పుడేమి జరుగుతుంది. నీకు లోపలనుంచి కోపం తన్నుకు వస్తుంది. అంటే నీ లోపల ఉన్నది కోపం అన్నమాట. ఇలా నీ మనసు బాధ పెట్టేవాడు నీ శత్రువు కావచ్చు, నీ మిత్రుడు కావచ్చు, నీ దగ్గరి చుట్టం కావచ్చు. నీ భార్యాపిల్లలు కావచ్చు, అధికారులు కావచ్చు. ప్రభుత్వాలు కావచ్చు. కానీ వాళ్ళు చేసేది ఈ పండును పిండినట్టు నిన్ను పిండడమే. కానీ నీలోనుంచి బయటకు వచ్చేది మాత్రం కోపం,   చీకాకు, ఆందోళన,  ఒక్కోసారి భయం. దీనర్ధం ఏమిటంటే నీ మనసులో పేరుకుపోయి వున్నవి ఇవే. వీటి స్థానంలో ప్రేమ, ఆప్యాయతలు వుంటే అవే బయటకు వస్తాయి. జీవితంలో సాటివాడిని ప్రేమించడం నేర్చుకుంటే మనసులో కూడా ప్రేమే నిండి వుంటుంది. ఒత్తిళ్లకు గురయినప్పుడు అదే బయటకు వస్తుంది”

శిష్యుడికి గురువుగారి మాటల్లో పరమార్ధం బోధపడింది. (09-09-2015)

8, సెప్టెంబర్ 2015, మంగళవారం

కాళోజీ గర్వభంగం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 13-09-2015, SUNDAY)

(కాళోజీ గర్వభంగం అనే పదాన్ని కాళోజీనే స్వయంగా తన ఆత్మకధలో వాడారు -సెప్టెంబరు తొమ్మిది ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని)


ఈ ఏడాది  కాళోజీ  నూట ఒకటో జయంతి. ఇకనుంచి ప్రతియేడూ కాళోజీ జయంతిని తెలంగాణా భాషా దినంగా పాటించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. అధికారికంగా నిర్వహించే ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్ధులకు తెలంగాణా భాషపై చర్చా గోష్టులు మొదలయినవి నిర్వహించాలని చైనా పర్యటనకు బయలుదేరి వెళ్ళే ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చివెళ్ళారు.
కాళోజీ నారాయణ రావు ‘ఇదీ నా గొడవ’ అనే పేరుతొ తన ఆత్మకధ రాసుకున్నారు. స్నేహసాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం 1995 సెప్టెంబరు నెలలో విడుదల అయింది. తెలుగు భాష గురించీ, తెలంగాణా యాస గురించీ ఆయనకున్న మక్కువను  ఆయన తన ఈ రచనలో వ్యక్తం చేసారు. అలాగే కొన్ని సందర్భాల్లో తనకు జరిగిన ‘గర్వ భంగాలను’ కూడా ఆయన చాలా హృద్యంగా ఆయన శైలి లోనే ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పాఠకుల కోసం కాళోజీ స్వయంగా రాసుకున్న ఆ జ్ఞాపకాల్లో కొన్ని కాళోజీ మాటల్లోనే  :
“కులాల్లో ఎన్నో తరతమ భేదాలు  పాటిస్తున్నాం. అది గ్రామ్యం,  ఇది గ్రాంధికం అంటూ భాషలో కూడా తేడాలు పాటిస్తున్నాం.
“భాషకి సంబంధించి రెండే రెండు. ఒకటి మాట రెండు రాత. అంటే ఉచ్చారణ, దస్తూరి. అదే ‘అ’ అదే ‘ఇ’,
అదే ‘ఉ’ అదే ‘క’, అదే ‘య’. అక్షరమైతే ఒకటే. ‘క’ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఎట్ట రాసినా అది ‘క’ అనే అంటం కాని ‘హ’ అని ఎవడూ అనుకోడు.
“దస్తూరి విషయంలో వుండే ఈ ఉదారత, సహృదయత  ఉచ్చారణ విషయంలో ఎందుకు లేవు ? ఏ ఇద్దరి దస్తూరి ఒక రకంగా వుండనట్టు ఏ ఇద్దరి ఉచ్చారణా ఒక రకంగా వుండది.  ఉచ్చారణ ఏ యాసలో వున్నా అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది  వుండకూడదు. మాండలికాలు లేని భాష చచ్చి వూరుకుంటది. మాండలికంలో తేడాలు, యాసలో వ్యత్యాసాలు వుండడమే భాషకి జీవ లక్షణాలు.
“‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్నను. అన్ని భాషలు నేర్చుకో కానీ నీ మాతృభాషని మాత్రం తప్పకుండా  నేర్చుకో. 
“రావిశాస్త్రి విశాఖ భాష, తెలుగు కాదని మేమూ, నల్గొండ వాళ్ళది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగు కాదని బెజవాడవాడు, బెజవాడ వానిది తెలుగే కాదని రాయలసీమ వాడు – ఇట్లా అనుకుంటపొతే మన మద్య సుహృద్భావం ఎట్టవస్తది. మనందరం తెలుగు వాండ్లం అనే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ – ఆత్మీయత ఏముంటది . ఒకని భాష విషయంలో, యాస విషయంలో తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బ తింటది. దానికి వెల  కట్టలేం.
“హైద్రాబాదు రేడియోలో బాలల కార్యక్రమం వచ్చేది.  ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచి  ఈనాటి (1985) దాకా అంటే దాదాపు ముప్పయ్ ఏండ్లపాటు బాలల కార్యక్రమాలు వందలు వేలు జరిగివుండాలె. వీటిల్లో తెలంగాణా పిల్లలు ఎందరు పాల్గొన్నరు. వాండ్ల వాడుక భాష ఏది. వాండ్లు కనబడరు. వాండ్ల భాష వినబడదు. బిరుదు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడయినా బాలానందంలో పాల్గొన్నరా. రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాసా ఏదీ తెలంగాణది కాదు.
“ప్రతి విషయంలో ఈ తేడాలు వుంటుంటే మరి మనమంతా కలిసి తెలుగోళ్ళమనుకుండేదెట్ట. ఆ భాష బాంధవ్యం కానీ, ఆ సామరస్యం కానీ ఎట్ట రావలె. ఏడనుంచి ఒస్తది. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం” 
పొతే కాళోజీ తన ఆత్మ కధలో తన గర్వం అణిగిన సందర్భం ఒకటి ఉదహరించారు ఇలా.
“వరంగల్లు రాజరాజ నరేంద్ర గ్రంధాలయంల ఆంజనేయులు అనే ఒకవిద్యార్ది సాయంకాలాలు పనిచేసేటోడు. ఐదో ఆరో ఇచ్చేటిది. ఆ లైబ్రరీకి బెజవాడ నుంచి ఓ ఉత్తరం వచ్చిందట. పై కవరు మీద ఆంజనేయులు అడ్రెసు, లోపల మాత్రం రావి నారాయణరెడ్డి నాకు రాసిన ఉత్తరం. మరి సీ.ఐ.డీలు ఎట్ల పసికట్టిన్రో ఏమో, అది పట్టుకుని నన్నూ ఆంజనేయుల్నీ అరెస్టు చేసిన్రు. నన్నొక లాకప్ లోను, ఆంజనేయుల్ని మరో లాకప్ లోను పెట్టిన్రు.  ఆ లాకప్ లో నాతో పాటు ఓ దొమ్మరాయన వున్నడు. .....నేను సత్యాగ్రహిని. ఈ నేరస్థునితో సమానం చేస్తరా. నా ప్రిస్టేజికి భంగం వచ్చినట్టు అనిపించింది. దొమ్మరతని చెవిలో సగం కాలిన ఆకు చుట్ట వుంది. అది తీసి, కొరికి, అక్కడే ఉమ్మి వేసి నా వైపు చూస్తూ ‘అగ్గిపుల్ల ఉందా’ అని అడిగాడు. నేను చీదరించుకున్నట్టు ‘హట్! నన్నడుగుతవా’ అన్న. అతడు సెంట్రీ నడిగి చుట్ట ముట్టించుకుని నా ముంగిట కూర్చుని అడిగిండు నన్ను ఏ నేరంలో పోలీసులు పట్టుకొచ్చారని. రాజకీయ సత్యాగ్రహం, బాధ్యతాయుత ప్రభుత్వం ఇవన్నీ నేను  చెప్తె వానికేమి తెలస్తది.
“చూడండి మనిషి స్వభావం యెంత విచిత్రమో. కులమతాల పట్టింపులు లేనివాడిని. ఆర్య సమాజపు మనిషిని. ఇలాటోడిని లాకప్పులో తోటి మనిషి పట్ల ఇట్లుండడం.
“చోరీ చేస్తివా ?”
“ఎవుడి తలన్నా పగలగొట్టి వస్తివా ?”
“ఎవుడి పెళ్ళాన్నన్నా ఎత్తుకు వస్తివా ?”
ఇలా నేరాలన్నీ ఏకరువు పెట్టి అడుగుతున్నాడు.
“ఛీ ఛీ అంటూ అన్నిటికీ కాదు కాదనే చెబుతున్న. ఈ ప్రశ్నలన్నీ అయినంక ఒక నిమిషం ఆలోచించి ఒక్క ప్రశ్న వేసిండు. కాళోజీ గర్వభంగం అని చెప్పే నాలుగైదు సంఘటనల్లో ఇది మొదటిదన్న మాట.
అతనాలోచించి అడిగిన ప్రశ్న. ‘గాంధీ మహారాజ్ కిన్నీ, హుజూర్ నైజాంకీ లడాయ్ జరుగుతుందట. దాంటోగిన రాలేదు కద నువ్వు?’
“దొంగతనాలు, దోపిడీలు కాకుండా వేరే రకంగా ఓ పోరాటం జరుగుతున్నదనే ఒక పిక్చర్ అతని లోపల కట్టి వున్నదన్నమాట. దాంతో నేను విచిత్రపడిపోయి, దగ్గరకి జరిగి కౌగలించుకుని ‘అవున్నాయనా ఆ లడాయిలోనే వచ్చిన’ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్న. నా జీవితంలో ఇది మరపురాని ఘట్టం’ అని కాళోజీ తన ఆత్మకధలో రాసుకున్నారు.
ఈ కాలంలో వచ్చే ఆత్మకధల్లో ఇలాటి నిజాయితీని ఊహించగలమా!  (08-09-2015)  
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       
          

 NOTE: Courtesy Image Owner 

7, సెప్టెంబర్ 2015, సోమవారం

ఉపశమనమా ? పరిష్కారమా ?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 10-09-2015, THURSDAY)

దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ అగ్రస్థానానికి ఎగబాకుతున్నాయనో, చేరుకున్నాయనో  ఓ వార్త చదివిన గుర్తు. నిజానికి ఇదేమీ భుజాలు ఎగరేసి గర్వంగా చెప్పుకునే విషయం కాదు. పైపెచ్చు సిగ్గుపడాల్సిన సంగతి.


ఈ మధ్య పత్రికల్లో మరో వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో రెండు తెలుగు రాష్ట్రాల రైతులు నారుమళ్ళు వేసుకోవడానికి కూడా సాగునీరు లేక అల్లాడిపోతుంటే మరోపక్క ఆ సరిహద్దులకు అవతలవైపు వున్న ఆ రెండు రాష్ట్రాల పొలాలు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయని. కృష్ణా గోదావరి నదీ జలాలు సముద్రంలో కలవడానికి ముందు ఆ నదులు ప్రవహించేది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే. ఆ కారణంతో చాలా సంవత్సరాలపాటు ఎగువన వున్న రాష్ట్రాలు నీటి ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడు ఆంద్రప్రదేశ్ సేద్యపు నీటి అవసరాలను గమనంలోకి తీసుకోవాల్సిన పరిస్థితి  వుండేది. ఇప్పుడా వెసులుబాటు లేదు.  మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ముందు చూపుతో ఆ రెండు నదుల మీద అనేక ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు, ప్రత్యేకించి తెలుగు రైతులకు  ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది.      
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు ఒక కొత్త పరిష్కారం దిశగా ఆలోచిస్తోంది. ఎవరయినా వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితుల్లోకి నెట్టబడినప్పుడు, కొద్దిరోజులపాటు అసలు ఆత్మహత్య చేసుకోవాలా వద్దా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతుంటారు. సరిగ్గా ఆ దశను గుర్తించి వారికి సరయిన తీరులో నచ్చచెప్పగలిగితే వారు ఆ తీవ్రమైన చర్యకు పూనుకోకుండా నిరోధించవచ్చని  మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ సూత్రం ఆధారంగా ఆ ప్రభుత్వం ఒక పైలట్ పధకానికి అంకురార్పణ చేసింది. ప్రస్తుతం అందుబాటులో వున్న ఆశా వర్కర్లను, వారికి తోడుగా కొందరు కౌన్సిలర్లను కాంట్రాక్టు పద్దతిపై వినియోగించి రైతులకు సరయిన సమయంలో తగు సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా వారిని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి వెనక్కు మళ్ళించాలనేది ఈ పధకం ఉద్దేశ్యం. తద్వారా ఆత్మహత్యల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నది  అక్కడి ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న రైతుల జాబితాను కూడా సిద్ధం చేసింది.  సరే! ఇదొక పద్దతి. ఇది పైలట్ ప్రాజెక్టు కాబట్టి ఫలితాలు తెలియడానికి కొంత సమయం పడుతుంది.  కానీ రైతులను ఆత్మహత్య చేసుకోవాలనే దిశగా వారిని ప్రోద్బలపరుస్తున్న సమస్యల  సంగతేమిటి? వాటికి పరిష్కారం ఏమిటి?
ఒక మనిషిని ఆత్మహత్య దిశగా నెట్టడం తేలిక కావొచ్చేమో కానీ నిజానికి ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు. పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని ఉద్భోదిస్తూ వుంటారు కానీ అలా సొంత స్వయంగా తీసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ఒక మనిషిని హత్య చేయడానికి తాత్కాలిక భావోద్రేకం కూడా కారణం కావచ్చు కానీ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. వీటిల్లో ప్రధానమైనది స్వాభిమానం. వూళ్ళో వడ్డీ వ్యాపరులనుంచో, లేదా బ్యాంకుల నుంచో తీసుకున్న ఋణం సకాలంలో ఎలా చెల్లించాలి, చెల్లించకపోతే వూళ్ళో మొహం చెల్లని పరిస్థితిని తట్టుకోవడం ఎల్లా అనే సగటు రైతు మధన పడిపోతుంటాడు. ఋణం తీరిపోతే అలాటి వారికి ప్రాణం లేచివచ్చినట్టుగా వుంటుంది.
ఇక వారికి తెలిసిన విద్య ఒక్కటే. పండినా పండకపోయినా పంటలు పండించడం. సకాలంలో వానలు కురవక సేద్యపు నీళ్ళు లేక  వేసిన  పైర్లు  తమ కళ్ళ ముందే ఎండిపోతుంటే,  వాళ్ళ కళ్ళలో నీళ్ళు  మాత్రం ఎండిపోవు. వారి కష్టాలకు సజీవ సాక్ష్యాలుగా సతతం కళ్ళల్లో వూరుతూనే వుంటాయి. ఒకవేళ సరయిన సమయంలో నాలుగు మంచి వానలు పడ్డప్పటికీ వారి కష్టాలు తీరిపోవు. నాణ్యమైన విత్తనం దొరక్కపోతే, భూమిలో విత్తిన గింజ మొలవదు. ఒకవేళ మంచి విత్తనాలు దొరికి చేను పచ్చపడ్డా అదునుకు ఎరువులు దొరకవు. ఒకవేళ అదృష్టం బాగుండి అవి దొరికి చేలో పంట ఏపుగా పెరిగినా కాలం కలిసి రాకపోతే అకాల వర్షాలతో పొట్టకొచ్చిన పైరు కృష్ణార్పణం. ఒకవేళ ఆ సమస్యలు కూడా లేకుండా  పంట ఇంటికి చేరినా అమ్మబోతే అడివి సామెత మాదిరిగా గిట్టుబాటు ధర కలికానికి కూడా దొరకదు. చేబదుళ్లు తీర్చడం కోసం ఏదో  ధరకు అమ్మినా అప్పులు పూర్తిగా తీరే  అవకాశం వుండదు. ఒకవేళ అలాటి శుభతరుణం వాళ్ళ జీవితాల్లో ప్రవేశించినా  వచ్చే ఏడు ఇదే తంతు మళ్ళీ మొదలు.
రైతులందరూ ఇలాగే ఈ విష చక్రబంధంలో వున్నారా అంటే పూర్తిగా ఔనని చెప్పలేము. కొందరు ఇటువంటి కష్టాలను తేలిగ్గా తట్టుకోగలిగిన స్థితిలో వున్న స్థితిపరులు అయివుండవచ్చు. అధిక సంఖ్యాకులు మాత్రం ఈ నిత్య బాధలు పడుతూనే వున్నారు. పంట  పండినా ఎండినా తమ ఖర్మం అనుకుంటూ బతుకుబండి లాగించేవారే ఎక్కువ. కొందరు మాత్రం ఎదురీతలో అలిసిపోయి బతుక్కు ముగింపు వాక్యం పలకాలనే నిస్పృహలోకిజారిపోతుంటారు. మనం నిత్యం పత్రికల్లో చదివే దురదృష్టకర సంఘటనలు ఇటువంటి వారిగురించే.
రైతులు ఆత్మహత్యలు అనే అంశం ప్రస్తుతం రాజకీయాల్లో ఒక ఆయుధంగా మారింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆయుధంగా పనిచేసిన ఇదే అంశం అధికార పీఠం ఎక్కగానే ఆత్మరక్షణ లోకి నెట్టివేస్తుంది.
నిజానికి రైతులకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం లేదా అది చేస్తాం, ఇది చేస్తాం అనడం వారిని చిన్నబుచ్చటమే. నిజానికి వాళ్ళే, తాము తిన్నా తినకపోయినా  సమాజానికి ఇంత భిక్ష పెడుతున్నారు. వారికి ఎవరూ ఏమీ చేయనక్కరలేదు. ప్రభుత్వాలు కొన్ని పనులు చిత్తశుద్ధితో చేస్తే చాలు.
సమయానికి నాణ్యమైన విత్తనాలు వారి ఇంటి వద్దనే అందించండి. ఎరువులు సకాలంలో సరఫరా చేయండి. సరయిన వానలు సకాలంలో కురవక పొతే ప్రత్యమ్న్నాయలు ప్రత్యామ్న్నాయాలు సూచించండి. అధిక వర్షాలు పడి పంటలు నష్టపోతే ఇబ్బందులు పెట్టని భీమా వ్యవస్థని అమల్లో పెట్టండి. పండిన పంట వారిచేతుల్లో నుండి వెళ్లి పోయిన తరువాత ఆమధ్య దళారులు ధరలను పెంచే విష సంస్కృతికి అడ్డుకట్ట వేయండి. వాళ్ళు పండించిన పైర్లకు ధరలను వాళ్ళే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించండి.
ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే రైతుల కుటుంబాలకు ఆర్ధికంగా ఊతం ఇవ్వండి. ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో ఈ సాయం అందిస్తే వారి ఆత్మ గౌరవం దెబ్బతినకుండా వుంటుంది. ఈ ఉపశమన సాయాలకు తోడు, శాశ్వితంగా వారి సమస్యలను పరిష్కరించే కార్యాచరణకు నడుం కట్టండి. సాయం అందించండి కానీ ఎల్లకాలం వారు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలకోసం ఎదురు చూసే దుస్థితిలోకి నెట్టకండి. అన్నింటికీ మించి నలుగురికి అన్నం పెట్టే రైతుల్ని ఓటు బ్యాంకుగా మలచుకునే దుష్ట సాంప్రదాయానికి దూరంగా జరగండి.
రైతుకు అవసరమైనవి మీరు చేస్తే మీకు అవసరమైనవి రైతు తానే చేస్తాడు.
రైతును రక్షిస్తే ఆ రైతే మిమ్మల్ని రక్షిస్తాడు.

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595  
NOTE: Courtesy Image Owner                            

పెద్ద గీత - చిన్న గీత

స్టేట్ బ్యాంక్ సీజీఎం గా  రిటైర్ అయి హైదరాబాదులో స్థిరపడ్డ ఓ పెద్దమనిషి బ్యాంక్ ప్రొబేషనరీ అధికారుల ఇంటర్వ్యూ బోర్డు చైర్మనుగా గత రాత్రి  ఒడిసా రాజధాని భువనేశ్వర్ కు వెళ్ళారు. మూడు  దశాబ్దాల క్రితం ఆ రాష్ట్రం  కొత్తగా ఏర్పడ్డప్పుడు కొత్తగా కట్టిన రాజధానీ నగరం అది. భువనేశ్వర్ విమానాశ్రయం పూర్వం బేగం పేట ఎయిర్ పోర్టు మాదిరిగా వుంటుంది. ఇంతవరకూ ఆ రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయం వైభోగం లేదు. హైదరాబాదు నుంచి వెళ్ళిన బ్యాంకు మాజీ అధికారి  విమానం దిగి ఎయిర్ పోర్టులో ఎస్కలేటర్ ఎక్కగానే కరెంటు పోయింది. విమానాశ్రయంలో కరెంటు పోవడం ఆయనకు తొలి అనుభవం. ఎయిర్ పోర్టు నుంచి గెస్టు హౌస్ కు వెళ్ళేవరకు దారిలో అనేక పర్యాయాలు కరెంటు పోవడం రావడం జరుగుతూ వచ్చింది. ఇక ఆ రాత్రి గెస్టు హౌస్ లో గడిపిన తరువాత  అక్కడ తరచుగా వాటిల్లే కరెంటు అంతరాయాలకు  ఆయన పూర్తిగా అలవాటు పడిపోయారు.
నవీన్ పట్నాయక్ ఒడిసా రాష్ట్రపు ముఖ్యమంత్రి. బాగా చదువుకున్నవాడు. పేరుకు తగ్గట్టే నవీన భావాలు కలిగినవాడు. అవినీతి మచ్చలు పడనివాడు. ఆయన నేతృత్వంలో బిజూ జనతా దళ్ వరసగా మూడో పర్యాయం అధికారంలో కొనసాగుతోంది. చక్కటి పరిపాలకుడు అని ప్రజలు విడవకుండా పట్టం కడుతున్న ఆ రాష్ట్రంలో కరెంటు పరిస్తితి అది.
ఆ రాష్ట్రాన్ని చూసి పరవాలేదు మనమే నయం అనుకోవాలా?         


4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

షరా మామూలు అసెంబ్లీ సమావేశాలు


‘నేడే విడుదల, రేపే ఆఖరు రోజు, ఈ రోజే చూడండి!’ అనే తరహాలో నవజాత  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ  సమావేశాలు హైదరాబాదులో  అయిదు రోజులపాటు జరిగి ముగిసాయి. ఈ సమావేశాలు సజావుగా సాగాయా అంటే జరగాల్సినట్టు జరగలేదని చెప్పొచ్చు. జరగలేదా అంటే జరగకూడని విధంగా జరిగాయని కూడా చెప్పవచ్చు. వర్షాలు లేని ఈ వర్షాకాల సమావేశాల్లో ఉరుములు, మెరుపులకు మాత్రం కొదవ లేదు.


షరా మామూలుగానే అయిదు రోజులూ ఒక్క రోజుకూడా మినహాయింపు లేకుండా అధికార పక్షం, ప్రతిపక్షం నడుమ ఏదో ఒక అంశంపై వాదాలు, ప్రతివాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇలాగే నడిచిపోయింది. ఇక ఆఖరి రోజు ప్రత్యేకత వాయిదాల పర్వం. సభ నిరవధికంగా వాయిదా పడడానికి పూర్వం అనేకమార్లు వాయిదాలు పడ్డం,  తిరిగి సమావేశం కావడం, మళ్ళీ వాయిదా పడ్డం ఇలా గడిచి పోయింది.    
అలా అని సభలో ఏ కార్యక్రమాలు ఎజెండా ప్రకారం జరగలేదని కాదు. ఆంద్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. పట్టిసీమ, కరవు ఇతర అంశాలపై చర్చ జరిపింది. అక్రమ ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకునే ఆస్తులు  రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పడేలా వీలు కల్పించే బిల్లుతో సహా తొమ్మిది బిల్లుల్ని ఆమోదించింది. అయితే కొన్నింటిపై చర్చ అరకొరగా జరిగిందనీ, మరికొన్నింటిపై  చర్చకు ఆస్కారమే లేకుండా చేసిందనీ ప్రభుత్వంపై  ప్రతిపక్షం ఆరోపిస్తే, ప్రతిపక్షం అనవసర అంశాలు లేవనెత్తి సభాసమయాన్ని వృధా చేయడం వల్లనే ఈ పరిస్తితి తలెత్తిందని పాలక పక్షం సమర్ధించుకుంది.      
2014 లో జరిగిన ఎన్నికల తరువాత, కొత్తగా ఏర్పడ్డ ఈ తెలుగు రాష్ట్రంలో ఒక కొత్త  రాజకీయ చిత్రం ఆవిష్కృతమైంది. మొట్టమొదటిసారిగా రెండు పార్టీల వ్యవస్థ ఊపిరి పోసుకుంది. ఇంతవరకు శాసనసభల్లో అనేక రకాల పార్టీలకు కొద్దో గొప్పో,  ఎంతో కొంత ప్రాతినిధ్యం వుండేది. కానీ ఈ సారి సభలో రెండే రెండు పక్షాలు. ఒకటి పాలక పక్షం టీడీపీ. రెండోది ప్రతిపక్షం  వై.ఎస్.ఆర్.సీ.పీ.  బీజేపీకి  కొన్ని స్థానాలు లేకపోలేదు కానీ ఆ పార్టీ  పాలకపక్షానికి మిత్ర పక్షం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కూడా. పొతే వున్న ఒకేఒక్క ఇండిపెండెంటు సభ్యుడు కూడా పాలకపక్షంలో చేరిపోయారు. ఏతావాతా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సహకరించుకున్నా, సంఘర్షించుకున్నా మిగిలిన పార్టీలు రెండే రెండు. ఆ  రెండూ ప్రాంతీయ పార్టీలు కావడంతో ఇక వాటి మధ్య సయోధ్య, సహకారం ఆశించడం వృధా.  కనీసం  రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో సయితం  ఈ రెండు పార్టీలు ఉత్తర దక్షిణ ధృవాలుగా వ్యవహరిస్తూ రావడం గత చాలా కాలంగా చూస్తూ వస్తున్నదే. ఈ అయిదు రోజులూ శాసనసభలో అవే దృశ్యాలు మళ్ళీ మళ్ళీ కనబడ్డాయి.
సాధారణంగా గతంలో ఇటువంటి పరిస్తితులు తలెత్తినప్పుడు, సంఖ్యాబలం లేకపోయినా మిగిలిన రాజకీయ పార్టీలు కల్పించుకుని ఉభయులకు సర్ది చెప్పి పరిస్తితిని తాత్కాలికంగా అయినా సర్దుబాటు చేసేవి. దురదృష్టం ఏమిటంటే ఇప్పటి సభలో అటువంటి అవకాశం కూడా లేదు.   
ఈసారి మాటల తూటాలు పెరిగాయి. వాటిల్లో ఘాటు పెరిగింది. రికార్డుల నుంచి తొలగించకపోయినా కొందరు వాడిన పద ప్రయోగాలు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న వారిని కలత పెట్టాయి. మూర్ఖుడు, రౌడీ, సైకో  వంటి పదాలు వింటున్నప్పుడు మనసు చివుక్కుమనిపించింది. పైగా నోరుజారి పొరబాటున  ఆ పదాలు వాడారేమో అనే సందేహానికి ఆస్కారం ఇవ్వకుండా వాటినే ఒకటికి రెండు సార్లు రెట్టించి మరీ ప్రయోగించారు.  అలా మాట్లాడిన వారందరూ గౌరవనీయ శాసన  సభ్యులు. వారి పేరుకు ముందు ‘గౌరవనీయ’ అనే పదం విధిగా జోడించి వాడుతుంటారు. మరి ఇలా నోర్లు పారేసుకోవడం వల్ల ఆ గౌరవం భంగపడే అవకాశం ఉంటుందన్న వాస్తవాన్ని వారు గమనిస్తున్నట్టులేదు. ‘ప్రజలు గమనిస్తున్నారు’ అని వారు పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు కానీ,  వాళ్ళే ఆ విషయం  పట్టించుకుంటున్న దాఖలా కానరావడం లేదు.
పాలక, ప్రతిపక్ష సభ్యులు సభలో అడుగు పెట్టడానికి ముందే అవతల పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ఏం మాటలు వాడాలో అన్న విషయంలో ముందే ఒక  వ్యూహం సిద్ధం చేసుకుని వస్తున్నట్టు కనబడుతోంది. ఎదుటివారిని ఆత్మరక్షణలోకి నెట్టడం ద్వారా తమది పైచేయి అనిపించుకోవాలనే ధోరణి ప్రస్పుటంగా కనబడుతోంది. దీనివల్ల మాటకు మాట అనడంలో ఔచిత్యం లోపించి, కేవలం అసంబద్ధత మాత్రమే  కొట్టవచ్చినట్టు వ్యక్తం అవుతోంది. తమలపాకుతో తానిట్లంటే తలుపు చెక్కతో తానొకటి తగిలించానన్న చందంగా ఒకరికొకరు తీసిపోకుండా పోటాపోటీగా వ్యవహరించారు.   
గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు సభ సాఫీగా నడిస్తే అది ప్రతిపక్షానికే ప్రయోజనం. నడవక వాయిదాలు పడుతూ ముగిసిపోతే అది  పాలక పక్షానికి లాభం. సమయం లేదన్న సాకు చూపించి ఆమోదింప చేసుకోవాల్సిన బిల్లులనన్నిటినీ, ఒక్క దెబ్బతో  ఎలాటి చర్చా లేకుండా ‘గిలెటిన్’  ఆయుధం ప్రయోగించి ఒడ్డున పడవచ్చు. అయితే సభ సజావుగా నడిపించాల్సిన ప్రధాన బాధ్యత మాత్రం పాలక పక్షానిదే. ‘నడక’ గురించీ, ‘నడత’ గురించీ ఆట్టే పట్టింపులు లేకపోవడం వల్లనో  ఏమో, ఉభయులూ  ఈ విషయంలో తమ పాత్రలకు సరయిన న్యాయం చేయలేకపోతున్నారన్నది మాత్రం సుష్పష్టం. విలువైన సభాసమయాన్ని వృధా చేస్తున్నారని పాలకపక్షం సభ్యులు, ప్రజా సమస్యలపై సవివరంగా మాట్లాడే అవకాశం తమకు ఇవ్వడం లేదని, తమ గొంతు నొక్కుతున్నారనీ ప్రతిపక్షం – సభ లోపలా వెలుపలా ఇలా పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం ఈ అయిదు రోజులూ నిత్య కృత్యమైపోయింది. ప్రతి విషయానికీ పోడియంలోకి దూసుకుపోవడం ప్రతిపక్షానికి అలవాటుగా మారితే, ప్రతిపక్ష నేత ఏం మాట్లాడబోయినా దానికి స్వయంగా మంత్రులే అడ్డం పడడం ఓ కొత్త సాంప్రదాయం అయింది. ఇది చాలదన్నట్టు సభలో మాట్లాడింది మరోసారి వినిపించడానికీ, సభలో మాట్లాడలేనిది జనాలకు తెలియచెప్పడానికీ పాలక ప్రతిపక్షాలకు రెండింటికీ అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింటే ఉమ్మడి వేదికగా తయారయింది. ఈ మాత్రం దానికి అంతంత ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీ నడపడం ఎందుకు, మీడియా పాయింటు చాలదా  అనే ప్రశ్న సామాన్యుల నుంచి ఉత్పన్నం అయితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.         
గతంలో కూడా ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేసేవి. వాటిని తిప్పికొట్టే పద ప్రయోగాలు పాలకపక్షం వాళ్ళు చేసేవాళ్ళు. సభాకార్యక్రమాలు గమనించేవారికి ఆ వాదసంవాదాలు చాలా రసవత్తరంగా అనిపించేవి. మరునాడు దినపత్రికల్లో ఆ వార్తలు  శాసన సభలో ఛలోక్తుల పేరిట ‘బాక్స్ ఐటం’ అర్హతకు  నోచుకునేవి. ఈ రోజుల్లో ఒక్కటంటే ఒక్క వార్త అటువంటిది ఆహ్లాదంగా చదువుకుని ఆనందించగలిగే అవకాశం ఉందా! లేదని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు.
పూర్వం  ఇటు శాసన సభలలోను, అటు పార్ల మెంటులోను హేమాహేమీల నడుమ చాలా ఆసక్తికరమైన,  అదే సమయంలో సిద్ధాంతబద్ధమైన చర్చలు సాగుతూ ఉండేవి. అయితే, ఇవేవీ  అసలు విషయానికి అడ్డం పడకుండా, ప్రధాన చర్చనీయాంశం తప్పుదోవ పట్టకుండా ఎదుటి మనిషి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ వారిని  కిక్కురుమనకుండా చేయగలిగే విధంగా సూటిగా హాయిగా జరిగిపోయేవి.               
దశాబ్దాలక్రితం బ్రిటిష్ పార్లమెంటులో ఒక మహిళా సభ్యురాలు లేచి నాటి ప్రధాన మంత్రి చర్చిల్ ని పట్టుకుని ‘నువ్వొక తాగుబోతువి’ అని దులిపేసింది. దానికాయన నొచ్చుకోకుండా ఇలా జవాబిచ్చాడుట.  ‘నిజమే! నేను తాగుబోతునే. కాకపొతే రాత్రి యెంత తాగినా తెల్లారేసరికల్లా మళ్ళీ మామూలు మనిషిని  అవుతాను. కానీ, నీ విషయం అట్లా కాదే, నువ్వొక అనాకారివయ్యే!’.  పొద్దున్న కల్లా నా మైకం తగ్గిపోవచ్చు కానీ ఎన్నాళ్ళు గడిచినా నీ అనాకారితనం అలాగే ఉంటుందన్నది చర్చిల్ మహాశయులు సుతిమెత్తగా అంటించిన వ్యాఖ్యలో దాగున్న శ్లేష. 
తోక టపా: చాలా ఏళ్ళక్రితం  ఏదో పత్రికలో ఓ జోక్ వచ్చింది. ఒక నిర్మాత తాను   తీయబోయే సినిమా కోసం ఘాటుగా రెండర్ధాలు వచ్చే సంభాషణలు రాయమని ఓ రచయితను కోరాడట.  దానికారచయిత – ‘ఇప్పుడు సినిమా రంగంలో అలాంటి  వాళ్ళెవ్వరూ లేరు, అంతా  రాజకీయ రంగంలోకి వెళ్ళిపోయారు’ అంటాడు.
అయితే,  ప్రస్తుతం ఆ పరిస్తితి వున్నట్టు లేదు. రెండర్ధాలు వచ్చే పదాలకోసం వెతుక్కోనక్కరలేదు. నేరుగా అర్ధం ధ్వనించే వాటినే వాడేసినా  అభ్యంతర పెట్టేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడందరూ  అలాటి మాటలకే అలవాటు పడిపోయారు కాబట్టి.  (05-09-2015)   
రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner  

2, సెప్టెంబర్ 2015, బుధవారం

రాజకీయుల నాలుకకు నరం వుంటుందా!


అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.


అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాష్ట్ర రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్  విండిలై విండవర్ కండిలై’ అని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.
ఈ నిజం తెలుసుకోవడానికి పెద్ద కష్టపడక్కరలేదు. ఓ పదినిమిషాలు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం లేదా  ఏ టు జెడ్ టీవీ ఛానల్లు ప్రసారం చేసే చర్చాకార్యక్రమాలు చూస్తే చాలు. వాళ్ళ నాలుకలు ఎన్ని వంకర్లు తిరుగుతాయో అర్ధం అవుతుంది. ఇంత ఖరాఖండిగా ఎలా చెబుతున్నానంటే ఇది నా స్వానుభవం కనుక.  (02-09-2015)
రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  

NOTE : Courtesy Image Owner