(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 10-09-2015, THURSDAY)
దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో రెండు తెలుగు
రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ అగ్రస్థానానికి ఎగబాకుతున్నాయనో,
చేరుకున్నాయనో ఓ వార్త చదివిన గుర్తు.
నిజానికి ఇదేమీ భుజాలు ఎగరేసి గర్వంగా చెప్పుకునే విషయం కాదు. పైపెచ్చు
సిగ్గుపడాల్సిన సంగతి.
ఈ మధ్య పత్రికల్లో మరో వార్త వచ్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు కర్ణాటక, మహారాష్ట్ర
సరిహద్దుల్లో రెండు తెలుగు రాష్ట్రాల రైతులు నారుమళ్ళు వేసుకోవడానికి కూడా సాగునీరు
లేక అల్లాడిపోతుంటే మరోపక్క ఆ సరిహద్దులకు అవతలవైపు వున్న ఆ రెండు రాష్ట్రాల
పొలాలు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయని. కృష్ణా గోదావరి నదీ జలాలు సముద్రంలో
కలవడానికి ముందు ఆ నదులు ప్రవహించేది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే. ఆ కారణంతో
చాలా సంవత్సరాలపాటు ఎగువన వున్న రాష్ట్రాలు నీటి ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడు
ఆంద్రప్రదేశ్ సేద్యపు నీటి అవసరాలను గమనంలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వుండేది. ఇప్పుడా వెసులుబాటు లేదు. మహారాష్ట్ర, కర్ణాటక
ప్రభుత్వాలు ముందు చూపుతో ఆ రెండు నదుల మీద అనేక ప్రాజెక్టుల నిర్మాణాన్ని
పూర్తిచేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు, ప్రత్యేకించి
తెలుగు రైతులకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి
తలెత్తింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు ఒక కొత్త
పరిష్కారం దిశగా ఆలోచిస్తోంది. ఎవరయినా వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవాలనే
పరిస్థితుల్లోకి నెట్టబడినప్పుడు, కొద్దిరోజులపాటు అసలు ఆత్మహత్య చేసుకోవాలా వద్దా
అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతుంటారు. సరిగ్గా ఆ దశను గుర్తించి వారికి సరయిన
తీరులో నచ్చచెప్పగలిగితే వారు ఆ తీవ్రమైన చర్యకు పూనుకోకుండా నిరోధించవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ సూత్రం
ఆధారంగా ఆ ప్రభుత్వం ఒక పైలట్ పధకానికి అంకురార్పణ చేసింది. ప్రస్తుతం అందుబాటులో
వున్న ఆశా వర్కర్లను, వారికి తోడుగా కొందరు కౌన్సిలర్లను కాంట్రాక్టు
పద్దతిపై వినియోగించి రైతులకు సరయిన సమయంలో తగు సూచనలు, సలహాలు
ఇవ్వడం ద్వారా వారిని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి వెనక్కు మళ్ళించాలనేది ఈ పధకం
ఉద్దేశ్యం. తద్వారా ఆత్మహత్యల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నది అక్కడి ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ఆర్ధిక
ఇబ్బందుల్లో వున్న రైతుల జాబితాను కూడా సిద్ధం చేసింది. సరే! ఇదొక పద్దతి. ఇది పైలట్ ప్రాజెక్టు
కాబట్టి ఫలితాలు తెలియడానికి కొంత సమయం పడుతుంది.
కానీ రైతులను ఆత్మహత్య చేసుకోవాలనే దిశగా వారిని ప్రోద్బలపరుస్తున్న
సమస్యల సంగతేమిటి? వాటికి
పరిష్కారం ఏమిటి?
ఒక మనిషిని ఆత్మహత్య దిశగా నెట్టడం తేలిక
కావొచ్చేమో కానీ నిజానికి ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు. పిరికితనంతో
ఆత్మహత్యలు చేసుకోవద్దని ఉద్భోదిస్తూ వుంటారు కానీ అలా సొంత స్వయంగా తీసుకోవడానికి
ఎంతో ధైర్యం కావాలి. ఒక మనిషిని హత్య చేయడానికి తాత్కాలిక భావోద్రేకం కూడా కారణం
కావచ్చు కానీ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. వీటిల్లో
ప్రధానమైనది స్వాభిమానం. వూళ్ళో వడ్డీ వ్యాపరులనుంచో, లేదా బ్యాంకుల
నుంచో తీసుకున్న ఋణం సకాలంలో ఎలా చెల్లించాలి, చెల్లించకపోతే
వూళ్ళో మొహం చెల్లని పరిస్థితిని తట్టుకోవడం ఎల్లా అనే సగటు రైతు మధన
పడిపోతుంటాడు. ఋణం తీరిపోతే అలాటి వారికి ప్రాణం లేచివచ్చినట్టుగా వుంటుంది.
ఇక వారికి తెలిసిన విద్య ఒక్కటే. పండినా పండకపోయినా
పంటలు పండించడం. సకాలంలో వానలు కురవక సేద్యపు నీళ్ళు లేక వేసిన
పైర్లు తమ కళ్ళ ముందే ఎండిపోతుంటే, వాళ్ళ కళ్ళలో నీళ్ళు మాత్రం ఎండిపోవు. వారి కష్టాలకు సజీవ
సాక్ష్యాలుగా సతతం కళ్ళల్లో వూరుతూనే వుంటాయి. ఒకవేళ సరయిన సమయంలో నాలుగు మంచి
వానలు పడ్డప్పటికీ వారి కష్టాలు తీరిపోవు. నాణ్యమైన విత్తనం దొరక్కపోతే, భూమిలో
విత్తిన గింజ మొలవదు. ఒకవేళ మంచి విత్తనాలు దొరికి చేను పచ్చపడ్డా అదునుకు ఎరువులు
దొరకవు. ఒకవేళ అదృష్టం బాగుండి అవి దొరికి చేలో పంట ఏపుగా పెరిగినా కాలం కలిసి
రాకపోతే అకాల వర్షాలతో పొట్టకొచ్చిన పైరు కృష్ణార్పణం. ఒకవేళ ఆ సమస్యలు కూడా
లేకుండా పంట ఇంటికి చేరినా అమ్మబోతే అడివి
సామెత మాదిరిగా గిట్టుబాటు ధర కలికానికి కూడా దొరకదు. చేబదుళ్లు తీర్చడం కోసం
ఏదో ధరకు అమ్మినా అప్పులు పూర్తిగా
తీరే అవకాశం వుండదు. ఒకవేళ అలాటి శుభతరుణం
వాళ్ళ జీవితాల్లో ప్రవేశించినా వచ్చే ఏడు
ఇదే తంతు మళ్ళీ మొదలు.
రైతులందరూ ఇలాగే ఈ విష చక్రబంధంలో వున్నారా అంటే
పూర్తిగా ఔనని చెప్పలేము. కొందరు ఇటువంటి కష్టాలను తేలిగ్గా తట్టుకోగలిగిన
స్థితిలో వున్న స్థితిపరులు అయివుండవచ్చు. అధిక సంఖ్యాకులు మాత్రం ఈ నిత్య బాధలు
పడుతూనే వున్నారు. పంట పండినా ఎండినా తమ
ఖర్మం అనుకుంటూ బతుకుబండి లాగించేవారే ఎక్కువ. కొందరు మాత్రం ఎదురీతలో అలిసిపోయి
బతుక్కు ముగింపు వాక్యం పలకాలనే నిస్పృహలోకిజారిపోతుంటారు. మనం నిత్యం పత్రికల్లో
చదివే దురదృష్టకర సంఘటనలు ఇటువంటి వారిగురించే.
రైతులు ఆత్మహత్యలు అనే అంశం ప్రస్తుతం రాజకీయాల్లో
ఒక ఆయుధంగా మారింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆయుధంగా పనిచేసిన ఇదే అంశం అధికార
పీఠం ఎక్కగానే ఆత్మరక్షణ లోకి నెట్టివేస్తుంది.
నిజానికి రైతులకు అది చేస్తున్నాం, ఇది
చేస్తున్నాం లేదా అది చేస్తాం, ఇది చేస్తాం అనడం వారిని చిన్నబుచ్చటమే. నిజానికి
వాళ్ళే, తాము తిన్నా తినకపోయినా సమాజానికి ఇంత భిక్ష పెడుతున్నారు. వారికి ఎవరూ
ఏమీ చేయనక్కరలేదు. ప్రభుత్వాలు కొన్ని పనులు చిత్తశుద్ధితో చేస్తే చాలు.
సమయానికి నాణ్యమైన విత్తనాలు వారి ఇంటి వద్దనే
అందించండి. ఎరువులు సకాలంలో సరఫరా చేయండి. సరయిన వానలు సకాలంలో కురవక పొతే
ప్రత్యమ్న్నాయలు ప్రత్యామ్న్నాయాలు సూచించండి. అధిక వర్షాలు పడి పంటలు నష్టపోతే
ఇబ్బందులు పెట్టని భీమా వ్యవస్థని అమల్లో పెట్టండి. పండిన పంట వారిచేతుల్లో నుండి
వెళ్లి పోయిన తరువాత ఆమధ్య దళారులు ధరలను పెంచే విష సంస్కృతికి అడ్డుకట్ట వేయండి.
వాళ్ళు పండించిన పైర్లకు ధరలను వాళ్ళే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించండి.
ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయి ఆత్మహత్యలు
చేసుకునే రైతుల కుటుంబాలకు ఆర్ధికంగా ఊతం ఇవ్వండి. ప్రచారం కోసం కాకుండా
చిత్తశుద్ధితో ఈ సాయం అందిస్తే వారి ఆత్మ గౌరవం దెబ్బతినకుండా వుంటుంది. ఈ ఉపశమన
సాయాలకు తోడు, శాశ్వితంగా వారి సమస్యలను పరిష్కరించే
కార్యాచరణకు నడుం కట్టండి. సాయం అందించండి కానీ ఎల్లకాలం వారు ప్రభుత్వ
దయాదాక్షిణ్యాలకోసం ఎదురు చూసే దుస్థితిలోకి నెట్టకండి. అన్నింటికీ మించి
నలుగురికి అన్నం పెట్టే రైతుల్ని ఓటు బ్యాంకుగా మలచుకునే దుష్ట సాంప్రదాయానికి
దూరంగా జరగండి.
రైతుకు అవసరమైనవి మీరు చేస్తే మీకు అవసరమైనవి
రైతు తానే చేస్తాడు.
రైతును రక్షిస్తే ఆ రైతే మిమ్మల్ని రక్షిస్తాడు.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,
మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner
