27, జూన్ 2015, శనివారం

పీవీ గారి జ్ఞాపకాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 28-06-2-15, SUNDAY)

(జూన్ ఇరవై ఎనిమిది పీవీ నరసింహారావు జయంతి)  
పీవీ నరసింహారావు ప్రధానిగా వున్నంతకాలం అందరూ ఆహా! ఓహో!! అన్నారు. పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలం అధికార పీఠంపై వుంచిన అపర చాణక్యుడని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత,  పదవి నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్ల తోనే  ఆయన్ని  తెగడడం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. పోనీ  ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తి సీతారాం కేసరికి పీవీని  మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ పదవే సర్వస్వమయిన  కాంగ్రెస్ వారికి  కేసరి భజనే సర్వస్వమయిపోయింది. మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి మొదలుపెట్టిన కాంగ్రెస్  పార్టీ పత్తిత్తులకు ఆయన చేసిన మేళ్ళు కానరాలేదు.


అయిదేళ్ళు తెలుగువాడి లోని వాడినీ  వేడినీ లోకానికి చాటిచెప్పిన వృద్ధ రాజకీయవేత్త  న్యాయస్థానాలలో నిస్సహాయంగా బోనులో నిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు కళ్ళు’, నోళ్ళు  మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాములో జరిగిన తప్పులను  సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో కృతజ్ఞత, ‘విధేయత  అనే పదాలకి  తావు లేకుండా పోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ.

పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు  ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ఒక్క పీవీ అనే కాదు ప్రధానమంత్రి ఎవరయినా సరే,  రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు అంటే చాలు యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయిపోయేవి. శాఖల వారీగానే కాదు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో  రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్' విభాగానికి చేరేవి. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి కనుక ఇబ్బంది లేదు. పూర్వం ప్రధాని ప్రసంగించే వేదిక దగ్గరగా టెలిఫోన్స్ డిపార్టుమెంటు వాళ్లు, దేశంలో ఎక్కడికయినా మాట్లాడగలిగే ఫోనును అమర్చేవారు. ఆ ఫోను ఎవరికి ఉపయోగపడిందో లేదో తెలవదు కాని ప్రధాని పర్యటన సమాచారం ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడలకు ఫోను చేసి చెప్పడానికి రేడియో విలేకరిగా నాకు పలుసందర్భాల్లో ఉపయోగపడిన మాట వాస్తవం. పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు బేగంపేటలోని  ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా  హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...' అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో వుండిపోయింది.      

మాజీ ప్రధానిగా పీవీ  రాజ భవన్ లో వున్నప్పుడు  నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము.  ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా అని అక్కడవున్న భద్రతాదికారిని  అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.


పెట్టిన తరవాత  మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు  ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు  ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది  కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల  కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత  కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  మరోసారి వారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛ స్థానంలో వున్న  పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా  నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. ఆతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. 'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా. 'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
అలాటి మహానుభావుడు మరణించినప్పుడు ఆయన పార్టీ వాళ్లు ప్రవర్తించిన తీరు మరింత బాధాకరం.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పీవీ జయంతి, వర్ధంతి రెండింటినీ అధికారికంగా నిర్వహించాలని తలపెట్టడం ఓ వూరట.
పీవీ స్మృతికి నా నివాళి. (27-06-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

25, జూన్ 2015, గురువారం

అగ్నిమీళే పురోహితం .........




(కీర్తిశేషులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు)

(నిన్న కన్నుమూసిన ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారితో నాకు ముఖపరిచయం లేదు. అయిదేళ్ళ క్రితం ఈ వ్యాసం రాసే సమయంలో ఋగ్వేదంలోని మొదటి శ్లోకం గురించి వారిని ఫోనులో సంప్రదించాను. వారు ఎలాటి భేషజాలు లేకుండా ఎంతో అభిమానంతో ఫోనులోనే నా సందేహ నివృత్తి చేశారు. వారికి నా నివాళి - భండారు శ్రీనివాసరావు)  
     

నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర  ఓ గ్రామఫోన్ వుండేది. ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన ఆకారంలో వుండే  ఒక స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామ ఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు  మందపాటి పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద పాటలు, వాటి రాగాలతో పాటు  గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు.  గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు దానిమీదవుంచి అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం  కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు.అందువల్ల ఆయన దగ్గర  వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే.  ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.
పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే.
రేడియోలో  చేరిన కొత్తల్లో ఓ రోజు  జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను  మొదట డైరెక్ట్ చేసిన ముద్దమందారం సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.
     
తన గొంతు తాను  వినాలని, తన మొహం తాను  చూసుకోవాలని ప్రతి మనిషికీ కొన్ని  బలహీనతలు  వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా.  రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు.   అలాటి వాళ్లకు వాళ్ళ  ఫోటో వాళ్ళకే  చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం  ఖాయం అనే చెప్పాలి.  ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో  దాగివున్న  వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.
సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.
ఈ రికార్డులకు హెచ్.ఎం.వి. (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం  కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.
పందొమ్మిదవ శతాబ్దంలో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త  గ్రామఫోను తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.  


గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు  ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు

మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలనికోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు.  ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్,  ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.

ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర  శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.
తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం  సమావేశ మందిరానికి  తిరిగి  వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో  ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.


అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని  భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ  మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.
ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా  విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.
ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది. హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు.అయితే  మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. ఎందుకంటె ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపుకు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను  వారెప్పుడూ వినివుండలేదు.
సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు. గ్రామఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న  ఋగ్వేదంలోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.

ఓం అగ్నిమీళే పురోహితమ్, యజ్ఞస్య దేవమృత్విజమ్, హోతారం రత్నధాతమమ్...."  – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో  మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన రికార్డ్ - ఋగ్వేద శ్లోకానికి మాక్స్ ముల్లర్ ఆవిధంగా కలిగించారన్న విషయం తెలపడమే ఈ కధనంలోని విశేషం.
అదే ప్రసంగంలో మాక్స్ ముల్లర్ చెప్పిన విషయాలు వింటే సంస్కృత భాష గొప్పదనం ఈ కాలం వారికి తెలిసే అవకాశం వుంటుంది. ఆయన ఇంకా ఇలా  అన్నారు.

మొత్తం మానవేతిహాసంలో వేదాలు మొట్టమొదటి పాఠాలు. అందులో అగ్నిమీళే పురోహితం అనేది తొలి వేదం అయిన రిగ్వేదం లోని మొదటి  శ్లోకం. వెనుకటి రోజుల్లో,ఆదిమ యుగంలో-  వొళ్ళు దాచుకోవడానికి దుస్తులు ధరించాలన్న ఆలోచన కూడా  లేకుండా,చెట్టుకొమ్మలపై  చింపాంజీల మాదిరిగా గెంతుతూ యూరోపులోని జనం  అనాగరిక జీవనం గడుపుతున్న కాలంలోనే- నివసించడానికి  ఇళ్లు అవసరమనే ధ్యాసకూడా లేకుండా కొండ గుహల్లో కాలక్షేపం  చేస్తున్న రోజుల్లోనే- భారతీయలు నాగరిక జీవనం సాగిస్తూ, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో   సార్వత్రిక వేదాంతాన్ని ప్రబోధించే జీవన సూత్రాలను వేదాల రూపంలో అందించారు.  ఎడిసన్ మహాశయులు  నా స్వరాన్ని రికార్డు చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఈ వేద శ్లోకాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదేఅని ముగించారు మాక్స్ ముల్లర్.
(ప్రముఖ పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కృతజ్ఞలతో భండారు శ్రీనివాసరావు)  

22, జూన్ 2015, సోమవారం

అంతయు మన మేలునకే


'అమ్మగారు ఈ రోజు ఇల్లూడ్చి వెళ్లిపోతా, నేనూ మా ఆయనా మార్నింగ్ షోకెడదామనుకున్నాం'
'ఓస్! అదెంత భాగ్యం, భాగ్యం! ఈ మాత్రానికే ఇంత ఇదయిపోయి అడగాలా ఏమిటి. ఇంట్లో  పనిదేముంది ? ఒక్క రోజు నడుం వంచి అంట్లు తోమితే నేనేమయినా అరిగి పోతానా, కరిగిపోతానా చెప్పు.  అలాగే వెళ్ళు. భాగ్యం.  అన్నట్టు ఓ  యాభయ్ ఇస్తా.  దగ్గరుంచు, సినిమా హాల్లో పనికొస్తాయి'
కంప్యూటర్ దగ్గర కూర్చుని పనిచేసుకుంటున్నాడు, ఏకాంబరం. దేవుడు చెవులకు  బిరడాలు పెట్టలేదు కదా! అందుకే, పనిమనిషి భాగ్యం, అతడి భార్య నీలాంబరి  నడుమ జరిగిన సంభాషణ పొల్లు పోకుండా అతగాడి చెవిన పడింది. 'ఇదేమిటి మా ఆవిడేనా అలా మాట్లాడింది' అంటూ ఓరకంట తేరిపారచూశాడు. యాభయ్ నోటు పనిమనిషి చేతిలో పెడుతూ కన్పించింది నీలాంబరి.  సందేహం లేదు కనిపించింది  ఆవిడే. విన్నది  ఆవిడ మాటలే.
అలా రోజంతా నీలాంబరిలో  ఆ మార్పు ఏమాత్రం మార్పులేకుండా  గంట గంటకూ వరదగోదారిలా పెరుగుతూ పోతోందే కాని ఏమాత్రం తగ్గేసూచనలు కానరావడం లేదు. పిల్లలు ఛానల్ మార్చి క్రికెట్ చూడాలని అంటే మామూలుగా అయితే సీరియల్ వస్తోంది  మార్చడానికి వీల్లేదంటే వీల్లేదని పట్టుబట్టే  శ్రీమతి నీలాంబరి ఆరోజు మాత్రం 'వెధవ సీరియల్ రోజూ వుండేదే,  ఒకరోజు చూడకపోతే కొంపలేమీ మునిగిపోవన్న'ట్టు  నీతులు చెబుతుంటే విని, పోతున్న ఏకాంబరం మతి మరికాస్త చక్కా పోయింది.
పనిమనిషితో, వాచ్ మన్ తో, పూలవాడితో, పాలవాడితో  నీలాంబరి  వ్యవహరించే తీరు, మాట్లాడే పధ్ధతి పూర్తిగా మారిపోవడంతో వూరువాడకు అదో టాపిక్ పాయింటు అయివుంటుంది. టీవీల్లో స్క్రోలింగు వచ్చినా ఆశ్చర్యం లేదు. అందులో సందేహం లేదు. ఇంతగా ఇంత  మారిపోయిన మనిషిని కారణం అడుగుతే ఇంతెత్తున లేస్తుందేమో అన్న భయం పూర్తిగా తొలగిపోయాక, ఈ మార్పు శాశ్విత తాత్కాలికమనో, తాత్కాలిక శాశ్వితమనో నిర్ధారించుకున్నాక ఇక వుండబట్ట లేక అడిగేశాడు ఏకాంబరం, 'అసలీ ఆకస్మిక  మార్పుకి కారణం ఏమిట'ని.
ముందు మందహాసం. తరువాత ప్రశాంత వదనం. ఆ తదుపరి ఇల్లాలి  అనుగ్రహభాషణం ఇలా సాగిపోయాయి.
'ఎప్పుడూ ఆ ఫేసుబుక్కో మరో బుక్కో అంటూ ఆ కంప్యూటర్ ముందు మఠం వేసుకుని కూర్చోకండి మొర్రో అంటే నా మాట ఎప్పుడు  విన్నారు కనుక.  నేను చూడండి, సీరియల్ కోసం నిన్న టీవీ పెడితే ఒకటే యోగా గోల. ఎన్ని ఛానళ్లు మార్చి చూసినా యోగా మాత్రం మారలేదు. దాంతో దాని సంగతేమిటో చూద్దామని  ఇష్టం లేకపోయినా చూస్తూ పోయాను. బోలెడు మంది యోగా గొప్పతనం గురించి బోలెడు బోలెడు చెబుతూ పోయారు. యోగా చేస్తే కరెంటు పోయి మళ్ళీ వచ్చినట్టు మన శరీరంలో పాజిటివ్ తరంగాలు ప్రవహిస్తాయట. మంచి భావాలు, మంచి ఉద్దేశ్యాలు వాటంతట అవే కలుగుతాయట.'
'అది సరే! అవి యోగా చేసే వాళ్లకేమో. మరి నీ సంగతేమిటి? నువ్వెప్పుడు నేర్చుకున్నావు'
'నేర్చుకోవడమా నా బొందా! రోజంతా టీవీల్లో అదేపనిగా అవే చూపెడుతుంటే అవి చూసిన నా వొంట్లో  కూడా పాజిటివ్ ఎనర్జీ,  వానొచ్చినప్పుడు వూళ్ళో సైడు కాలవలో నీళ్ళ మాదిరిగా పొంగుతూ  ప్రవహిస్తోంది సుమా!'
'ఇదా! కధ! పోనీలే! అంతయు మనమంచికే అన్నారు' అనుకున్నాడు ఏకాంబరం దీర్ఘశ్వాస తీసుకుంటూ. 

   
(22-06-2015)
కార్టూనిస్ట్ అర్జున్ (గోతెలుగు డాట్ కామ్) కు కృతజ్ఞతలతో 

జన్మ ధన్యం


'పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి' పెళ్ళయిన జంటను పెద్దలు ఆశీర్వదించే తీరిది.
ఇలాటి ఆశీస్సు నిజంగా నిజమైన సందర్భం నిన్న తటస్థ పడింది.


(యువ దంపతులు వనం కోదండ రామారావు గారు, శ్రీమతి ఫణి రాజకుమారి గారు) 

ఒక కోదండరామారావు గారు, ఒక ఫణిరాజకుమారి గారు యాభయ్ ఏళ్ళక్రితం ఒకింటివారయ్యారు. నలుగురు అమ్మాయిలను కన్నారు. పెంచారు. విద్యాబుద్ధులు చెప్పించారు. పెళ్ళిళ్ళు చేసి వారి బాధ్యత నెరవేర్చుకున్నారు. నలుగురూ నాలుగు కుటుంబాల్లో కోడళ్ళు గా చేరి ఆఇంటి దీపాలుగా వెలుగులు పంచి పెడుతున్నారు. ఆ పిల్లలకు పిల్లలు. నిన్న అంతా కలిసి చూడ ముచ్చటగా ఆ పుణ్య దంపతుల యాభయ్యవ పెళ్లి వేడుకను కళ్ళు చెదిరేలా చేశారు. అల్లుళ్ళు సహకరించారు. అన్నేళ్ళ క్రితం వాళ్ల పెళ్ళికి హాజరయిన ఓ పెద్దమనిషి మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత పిల్లలు చేసిన పెద్దల పెళ్ళికి కూడా హాజరయి పాత సంగతులు గుర్తు చేసుకున్నారు. ఆ నాడు పెళ్లి చూడలేని ఈ తరం వాళ్లందరూ ఈ పెళ్లి వేడుకను కళ్ళారా చూసి ఆనందించారు. ఆశీస్సులు అందుకోవాల్సిన జంటను ఆశీర్వదించడానికి ఆ పెళ్లి మండపంలో ఆ జంటను మించిన పెద్దలు ఎవ్వరూ లేరు. అంచేత వాళ్ళే పెళ్ళికి వచ్చిన పిల్లా పాపలకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
'పిల్లాపాపలతో ఆనందంగా జీవించండి' అని యాభయ్ ఏళ్ళనాడు వాళ్ల పెద్దలు ఇచ్చిన ఆశీస్సులు నిజమైన సందర్భం నిన్న జరిగిన ఆ వేడుక. నలుగురు కుమార్తెలు, నలుగురు  అల్లుళ్ళు, వాళ్ల పిల్లలు ఆటా పాటలతో అలరిస్తే వేద పండితులు మంగళాక్షతలతో ఆశీర్వదించారు. అంత చక్కని వేడుక కళ్ళారా చూసిన వారికి భోజనాలు చేయకుండానే కడుపులు నిండిపోయాయి. ఆ తరువాత నిండయిన తెలుగు  భోజనంతో పొంగి పొర్లాయి.
అలా కన్నపిల్లల నడుమ, మనుమలు మనుమరాళ్ళ మధ్య ఇంత  చక్కటి వేడుక జరుపుకోవడం కంటే వేరే భాగ్యం ఏముంటుంది? ఇహపరమయిన ఇతర భోగభాగ్యాలన్నీ ఈ భాగ్యం ముందు దిగదుడుపు అనిపించింది.
జన్మధన్యం కావడం అంటే ఇదేనేమో!  (22-06-2015)

19, జూన్ 2015, శుక్రవారం

అపర పరమానందయ్య శిష్యుల కధ


అనగనగా ఒక వూరు. ఆ వూరు పేరు పుణే అనబడే పూనా.
ఆ నగరంలో ఇద్దరు గురువులు. ఒకరు పరమానందయ్య, మరొకరు ఆనందయ్య. పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు, ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు.
గురువుల సంగతేమో కానీ వారి శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం. అలాగే  అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై  అంతులేని అపనమ్మకం.
ఒక రోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబై లో ఒక పని చక్కపెట్టుకుని రమ్మని ఆదేశించారు.
గురువాజ్ఞను శిరసావహించి ఆ పద్నాలుగుమంది రెండు జట్లుగా పుణే రైల్వే స్టేషనుకు వెళ్లారు.
ఆ శిష్యబృందానికి  ఒక మహత్తరమయిన ఆలోచన వచ్చింది. గురువులు ఎట్లాగో లేరు. ఎదుటి పక్షం వారు తమ సమక్షంలోనే వున్నారు. రెండు పక్షాలలో ఎవరి తెలివి తేటలు గొప్పవో తేల్చుకోవడానికి  ఈ ప్రయాణమే  సరయిన తరుణం  అనుకున్నారు. తదనుగుణంగా ఎవరికి వారు పధక రచన చేసుకున్నారు.

ఆనందయ్య బృందం తమ ఏడుగురికీ ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు. పరమానందయ్య శిష్యులు మాత్రం  ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకటే ఒక  టిక్కెట్టు కొన్నారు. ఇంతలో టీసీ వచ్చాడు. పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం  ఆనందిస్తుండగానే, పరమానందయ్య శిష్యులు ఏడుగురూ తటాలున  రైలు బోగీలో వున్న   టాయిలెట్లో దూరారు. టీసీ టాయిలెట్ తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుని ఒక చేయి బయటకు వచ్చింది. అందులో ఒక టిక్కెట్టు వుంది. టీసీ సంతృప్తి పడి  వెళ్ళిపోయాడు. ఇది చూసిన ఆనందయ్య శిష్యులకు వొళ్ళు మండింది. పరమానందయ్య శిష్యులు చేసిన ట్రిక్కు అర్ధమయింది.
సరే రెండు జట్లూ ముంబాయ్ చేరాయి. గురువులు ఒప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్ లో టిక్కెట్లు దొరకలేదు. లోనావాలా వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి లోకల్ ట్రైన్లో  పుణే వెళ్ళాలనుకున్నారు.
తిరుగు ప్రయాణంలో ఒకే టిక్కెట్టుఅనే  ట్రిక్కుతోనే  ఎదుటి పక్షం ఆట కట్టించాలని ఆనందయ్య శిష్యులు పధకం వేసారు. ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒకే టిక్కెట్టు కొనుక్కుని లోనావాలా రైలెక్కారు. పరమానందయ్య శిష్యులు ఒక్క టిక్కెటు కూడా కొనలేదు.
టీసీ రావడాన్ని పసికట్టి రెండు జట్లూ చెరో టాయిలెట్లో దూరాయి. పరమానందయ్య శిష్యుల్లో  ఒకడు టాయిలెట్ నుంచి  బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదుటి టాయిలెట్ తలుపు తట్టాడు. అలా తట్టింది  టీసీయే అని భ్రమపడి ఆనందయ్య  శిష్యులు తమ వద్ద వున్న ఒకే ఒక టిక్కెట్టును తలుపు ఓరగా తెరిచి   బయట పెట్టారు. అదను కోసం వేచి వున్న పరమానందయ్య శిష్యుడు తటాలున ఆ టిక్కెట్టు తీసేసుకుని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు. మళ్ళీ పాత ట్రిక్కే ఉపయోగించి  టీసీ బారి  నుంచి తప్పించుకున్నారు. కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్టును  పోగొట్టుకున్న ఆనందయ్య శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు.  
ఏమయితేనేం, మొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పుణే వెళ్ళే లోకల్ ఎక్కారు.
ఆనందయ్య శిష్యులు ఒక్క టిక్కెట్టు ట్రిక్ మళ్ళీ  ప్రదర్శించి వూరుచేరేలోగా ప్రత్యర్ధి జట్టుపై ఒక్కమారయినా ఆధిక్యత చూపాలని అనుకున్నారు.
పరమానందయ్య  శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టిక్కెట్లు కొనుక్కుని లోకల్ ట్రైన్ ఎక్కారు. ఈ కధలో లెక్కప్రకారం రావాల్సిన టీసీ యధాప్రకారం  వచ్చాడు. పరమానందయ్య  శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు. ఒక్క టిక్కెట్టుతోనే  రైలెక్కిన ఆనందయ్య శిష్యులు  టీసీ కళ్లబడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు. కానీ అది వారికి  దొరక్కపోగా వాళ్లు మాత్రం ఎంచక్కా టీసీకి దొరికిపోయారు. ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆత్రుతలో లోకల్  ట్రైన్లలో టాయిలెట్లు వుండవన్న సంగతి వారు మరచిపోయారు.
అంటే నీతి ఏమిటంటే అనుసరణ  మంచిదే కావచ్చుకాని ఎంతో కొంత ఆలోచన కూడా దానికి తోడు కావాలి. అప్పుడే అది రాణిస్తుంది.
మూడేళ్ళ క్రితం స్వేచ్చానువాదం చేసి పోస్ట్ చేసిన రచన ఇది. 

(19-05-2012)

నరేంద్ర యోగి -


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON SUNDAY, 21-06-2015)

పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు.  ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకుతగ్గట్టుగా శరీరాన్ని  తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒక ఎత్తయితే, సాధించిన దాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు. మొదటిది యోగం, రెండోది క్షేమం. ఈ 'యోగక్షేమాల' ప్రసక్తి భగవద్గీతలో కూడా వుంది. గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో  అంటాడు భగవానుడు అర్జునుడితో, " అనన్యాచింతయంతోమా యేజనాః పర్యూపాసతే,  తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" అని. అంటే  'వేరే ధ్యాస లేకుండా నన్నే తలుస్తూ, నన్నే ధ్యానిస్తూ పోతే వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను' అని స్తూలార్ధం. అలాగే,  'అధాతో బ్రహ్మ జిజ్ఞాసా' అనే దానితో 'బాదరాయణ బ్రహ్మ సూత్రాలు' మొదలవుతాయి. ( ఈ బ్రహ్మ సూత్రాలు వేద వ్యాస విరచితమనీ, కాదు బాదరాయణుడు రాశాడనీ కొన్ని వాదాలు వున్నాయి. ఆ ఇద్దరూ ఒకరనే వాదం కూడా వుంది, అది వేరే విషయం) బ్రహ్మసూత్రాలలో చెప్పిన  అధాతో అంటే 'అటు పిమ్మట...'. శరీరాన్ని యోగాతో ఆత్మసాక్షాత్కారానికి అనువుగా 'మార్చుకున్న పిమ్మట' అని భాష్యం చెప్పుకోవచ్చు. శంకర భాష్యాన్ని ప్రముఖ పండితులు పుల్లెల రామచంద్రుడు తెనిగించి  పుణ్యం కట్టుకున్నారు. అందులోని జిజ్ఞాస అధికరణంలో ఈ యోగ ప్రసక్తి వుంది. ఈ యోగ సూత్రాలను  పతంజలి మహాముని  వెలికితీసి ఒకచోట గుదిగుచ్చి పంచాంగాలతో, కర్మ యోగము, రాజ యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగములతో కూడిన 'యోగ దర్శనం'   తయారు చేశారు. అదే పతంజలి యోగశాస్త్రంగా ఈనాటికీ మన్ననలు అందుకుంటోంది.  పతంజలి యోగానికి ఇచ్చిన నిర్వచనం 'యోగసు కర్మ కౌశల్యం', 'చిత్తవృత్తి నిరోధం'. ఏ కర్మ (పని) చేసినా దాన్ని  నైపుణ్యంతో చేయడం, మానసిక చాంచల్యాలను జయించడం అని అర్ధం చెప్పుకోవచ్చు.
ఇందుకోసం ఆయన సాధన చతుష్టయాన్ని ప్రబోధించారు. నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానము, ఇహలోక పరలోక విషయం భోగ వైరాగ్యము, శమదమాది సాధన సంపద, మోక్షం పొందాలనే తీవ్రమైన వాంఛ- ఈ నాలుగు అలవరచుకుని యోగసాధన మొదలు పెట్టాలి. శమదమాది సాధన సంపద అంటే ఒకటి శమము( మనో నిగ్రహము), రెండు  దమము ( బాహ్య ఇంద్రియ నిగ్రహము ) మూడు  ఉపరతి (విషయాలనుంచి వెనక్కు మరలడం) నాలుగు తితిక్ష (సహనం), అయిదు  శ్రద్ధ (శాస్త్రాదుల పట్ల పరిపూర్ణ విశ్వాసం).  ఈ అయిదూ యోగసాధకుడికి అత్యవసరం. బ్రహ్మ సూత్రాలలో చెప్పిన మొదటి సూత్రం 'యధాతో బ్రహ్మ జిజ్ఞాస' అంటే అటు పిమ్మట అనేది, 'ఈ అయిదూ సాధించిన' పిమ్మట అనేది గ్రాహ్యం. తద్వారా  ఆత్మ సాక్షాత్కార సాధన సులభం అవుతుంది. ఈ నైపుణ్యం అలవరచుకోవడం కోసం కర్మయోగాది పంచ యోగాలు ఉపయోగపడతాయి. కర్మ, రాజ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు కర్మతో మొదలయి జ్ఞానంతో అంతమవుతాయి.  ఈ జ్ఞాన సాధనతో యోగి యోగయుక్తుడు/ యోగసిద్ధుడు కాగలుగుతాడు.
పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి విభాగాలు వున్నాయి.
ఇవన్నీ సరే, మామూలు మనిషికి ఇవన్నీ యెందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
మానవ శరీరం శాశ్వితం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించి  పోయేదే. జీవుడు శాశ్వితం. అతడికి నాశనం లేదు. కానీ శరీరాన్ని ఆవహించుకుని వున్న జీవుడికి ఆ తాత్కాలిక ఆవాసం మీదనే మోజు. తద్వారా సంప్రాప్తించిన సుఖ దుఃఖాలతో మునిగితేలుతుంటాడు.  ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక  వ్యవహారాలను  నిర్లిప్త వైఖరితో పరికించే స్తితి వస్తుంది. ఇట్టి స్తితికే ముక్తి,  కైవల్యం, అపవర్గం అని పేర్లు. ఇలాటి స్తితిని దేహం వుండగానే చేరుకోగలిగితే అది జీవన్ముక్తి అనిపించుకుంటుంది. ఈ యావత్ యోగ సాధన అంతా ఈ స్తితికి చేరుకోవడం కోసమే.
బుధజనులతో అప్పుడప్పుడు జరిపే సంభాషణల్లో వినవచ్చిన ఈ మంచి సంగతులను, కేంద్ర ప్రభుత్వం నా ఫోనుకు పంపిన ఓ చిట్టి పొట్టి సందేశం గుర్తు చేసింది. 


(యోగముద్రలో ప్రధాని నరేంద్ర మోడి)
  
ఆ ఎస్.ఎం.ఎస్. లో ఇలా వుంది.
"యోగా అభ్యసించండి. క్రమం తప్పకుండా పాటించండి.  యోగా  మన మనస్సు మీద, మన శరీరం మీద, మన భావోద్వేగాల మీద,  మన శక్తి యుక్తుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. యోగాతో  జీవితాన్ని కడకంటా  సంపూర్తిగా ఆరోగ్యంగా అనుభవించండి" - ఆయూష్ మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్వం.
ఈ మాదిరి ఎస్.ఎం.ఎస్.లు బహుశా దేశంలోని ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారుడికి చేరేవుంటాయని అనుకోవచ్చు. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో దేశాన్ని ముంచెత్తిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగాదినాన్ని ఘనంగా  పాటించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. ఆరువేల ఏళ్ళ క్రితం  మన పూర్వీకులు మనకందించి వెళ్ళిన  ఈ అత్యంత విలువైన జీవన విధానం ఇది.  అలాటి యోగాకి ప్రత్యేకించి  ఒక దినాన్ని కేటాయించాలని నిరుడు ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి మేరకు ఏటా జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగాదినంగా  ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. అతి నిరాడంబరంగా పూర్వీకులు అందించిన భారతీయ యోగ శాస్త్రానికి సంప్రాప్తించిన యోగం అనుకోవాలి. అందుకే కాబోలు అంతర్జాతీయ  యోగా దినోత్సవాన్ని అత్యంత ఆడంబరంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగమే బహుశా   ఈ సంక్షిప్త సందేశాల బట్వాడా కావచ్చు. చేసేది మంచి పని అయినప్పుడు దాన్ని అంతగా ఆక్షేపించాల్సిన అవసరం లేదు. స్వాగతం, శుభం భూయాత్ అనుకుంటే తప్పేముంది.
అయితే ఓ చిన్న ముచ్చట. రేపు ఇరవై ఒకటిన అట్టహాసంగా జరిపే యోగా విన్యాసాలు పతంజలి యోగశాస్త్రంలో పేర్కొన్న శమదమాది అష్టాంగ యోగంలో ఒక చిన్న భాగం మాత్రమే. మొత్తం సుమారు డెబ్బయి నాలుగు వేల  యోగాసనాలు వుంటే ఈనాడు లభ్యం అవుతున్నవి,  రాం దేవ్ బాబా వంటి వారు చేయించేవి నూరుకు లోపలే. పతంజలి యోగశాస్త్రంలో లేని 'ప్రక్షిప్తాలు' వీటిల్లో  అనేకం వున్నాయని కూడా అంటారు. అవేవిటన్నది ఆ 'యోగుల'కే ఎరుక.
మరో ముఖ్యమైన విషయం. మొత్తం మానవాళికి యోగావిద్యను ప్రసాదించింది భారతీయులే. కానీ మనస్సును, శరీరాన్ని అదుపులో వుంచుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మంచి ఉపకరణం అయిన యోగాను ఏదో ఒక దేశానికో లేదా మతానికో పరిమితం చేసి చూడడం  మంచిది కాదు. తాజాగా ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత పఠనం పోటీలో మర్యం ఆసిఫ్ సిద్దికీ అనే ముస్లిం బాలిక ప్రధమ స్థానం దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం.  అలాగే, మనం బాధపడాల్సిన అంశాలు కూడా వున్నాయి. మతాన్ని నల్లమందుతో సమానంగా పరిగణించే కమ్యూనిష్ట్ చైనాలో భగవద్గీతను చైనా భాషలో ప్రచురించి ప్రజలకు అందుబాటులో పెట్టారు. మనం పవిత్ర గ్రంధం అని పైకి  గొప్పగా  చెప్పుకుంటాము కాని భగవద్గీత గ్రంధాల ఉనికి,  కోర్టుల్లో సాక్షి ప్రమాణాలకు, మనుషులు కాలం చేసినప్పుడు మైకుల్లో వినిపించడానికి పరిమితం అయిపొయింది. ఇదొక విషాదం.
(18-06-2015)
NOTE COURTESY IMAGE OWNER

సిసలైన నవ్వుకు అసలైన చిరునామా - జంధ్యాల


(జూన్ 19 జంధ్యాల వర్ధంతి)




నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.
ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే వార్త తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణ మూర్తి  గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.
“హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణం లేదు.
“తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న ఈనాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకుంటాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని "ఫిబరే హ్యూమరసం" అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.”
ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు.