26, మే 2015, మంగళవారం

దేవుడు నిర్దయుడు


శనివారం ఉదయం పదిన్నరకు ఫోను మోగిందంటే అది ఖచ్చితంగా  టీవీ నిస్సార్ నుంచే.

(నిస్సార్)

'రేపు ఆదివారం ఉదయం మాకు టైం ఇవ్వాలి' వద్దువద్దన్నా ఇదే మాట ప్రతిసారీ, ప్రతివారం  చెప్పేవాడు. కల్మషం లేని నమ్రత అతడి మాటల్లో నాకు కనబడేది.
ఎన్నో ఏళ్ళుగా ప్రతి శనివారం తప్పనిసరిగా నిస్సార్ నుంచి వచ్చే ఫోను ఇక నుంచి నాకు రాదు. ఫోన్ కాదు ఎప్పుడూ నవ్వుతూ వుండే అతడి మొహాన్ని కూడా నేను జీవితంలో చూడలేను. ఎందుకంటె అతడిక లేడు.
పొద్దున్న మహా టీవీకి వెడుతుంటే టీవీ 5  విజయ్ నారాయణ్ ఫోను చేసి చెప్పారు. నిస్సార్ కి  రాత్రి మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కన్ను మూసాడని. సొంతూరు కర్నూలు జిల్లా కొడుమూరుకు తీసికెళ్ళారని.  
మూడు పదులు దాటిన నిస్సార్ కి అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి. యెంత కష్టమో అతడి కుటుంబానికి.

దేవుడు నిర్దయుడు. ఎవరికీ ఇష్టం లేని ఇలాటి పనులు చేస్తుంటాడు. దయామయుడు కూడా. తెలిసిన వారందరూ ఇష్టపడే నిస్సార్ ని తాను  కూడా ఇష్టపడి తన దగ్గరకు రప్పించుకున్నాడు.  

PHOTO COURTESY SRI NARAYANA MURTHY  

23, మే 2015, శనివారం

మోడీ ఏడాది పాలన, ఒక పరిశీలన




(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 24-05-2015, SUNDAY)  


మనిషిది  నూరేళ్ళ జీవితం అంటారు. అంచేత అందులో  ఓ ఏడాది కాలం చెప్పుకోతగ్గది కాకపోవచ్చు. కానీ,  ప్రజాస్వామ్య దేశంలో  ఎన్నికల్లో తీర్పు ద్వారా ఆయా రాజకీయ పార్టీలకి  ప్రజలిచ్చిన అయిదేళ్ళ అధికారంలో  ఒక సంవత్సరం  గడిచిపోయిందంటే మాత్రం  అది అంత  చిన్నా చితకా సమయం అయితే కాదు. ఇక మిగిలింది కేవలం నాలుగేళ్లే అన్నది ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. అయితే మిగిలున్న ఈ సమయం, అధికారంలోకి రాగానే చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పినవాటిని కానీ, అధికారంలోకి రాగానే కొత్తగా జోడించిన తాజా వాగ్దానాలను లేదా సరికొత్త  పధకాలను కానీ  నూటికి నూరు శాతం అమలుచేయడానికి  సరిపోయేదయితే  కాదు.
నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా పగ్గాలు చేతిలోకి తీసుకుని ఈ నెల ఇరవై ఆరుకి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ రెండు రోజుల్లో కొత్తగా సాధించి చూపించే వ్యవధానం ఎటూ లేదు కాబట్టి అయన పరిపాలనను అంచనా వేసే ప్రయత్నం కొంత ముందుగా చేస్తే తప్పేమీ కాదు. ఏడాది స్వల్ప సమయంలోనే  'ఎన్నో చేశాం' అని చెప్పుకోవడం పాలక పక్షాలకు, ఏడాది గడుస్తున్నా 'సర్కారు ఒరగబెట్టింది ఏమీ లేదు' అని ఎద్దేవా చేయడం ప్రతిపక్షాలకూ  అనూచానంగా వస్తున్న ఆచారమే . ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సరిగ్గా ఇదే వ్యాఖ్య చేసారు. అమేథీలో మాట్లాడుతూ, మోడీ ఏడాది పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్నట్టు చెప్పారు. పైగా ఉత్త సున్నా కాదు పెద్ద గుండు సున్నా అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ యువ నాయకుడి విమర్శలను బీజేపీ సీనియర్ నాయకులు తిప్పికొట్టారు. అమేథీలో యువ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయి తరువాత మోడీ క్యాబినెట్లో మంత్రిగా చేరిన స్మృతి ఇరానీ కాస్త పదునైన ప్రతి వ్యాఖ్యలు చేసారు. మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఈ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ అన్నారు. పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వ కాలం పరిగణనలోకి తీసుకుంటే సున్నకు సున్నా,హళ్లికి హళ్లి అని కొట్టిపారేశారు.  మోడీ ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ వంటి ప్రధాన శాఖకు మంత్రిగా వున్న అరుణ్ జైట్లీ కూడా తన పాత్రకు తగ్గట్టే మాట్లాడారు. అవినీతి రహిత పాలన అంటే ఎలా వుంటుందో దేశ ప్రజలకు ఈ ఏడాది కాలంలో ప్రదర్శించి చూపామని అన్నారు. యూపీఏ పాలనలో దేశ ప్రజల్లో అలముకున్న నిరాశను పోగొట్టామనీ, కొత్త ఉత్సాహాన్ని నింపామని తమకు తామే కితాబు ఇచ్చుకున్నారు. ముందే చెప్పినట్టు ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడడం సహజం.          
అందుకే, ఈ  ఏడాది కాలంలో పాలకులు  'ఏం మంచి చేసారు, ఏం  చేయలేదు, అలా చేసి వుండాల్సింది కాదు' అనే మూడు మూడు అంశాలను మాత్రమే  తీసుకుని  మోడీ ప్రభుత్వం పనితీరును స్థాలీపులాకన్యాయంగా విశ్లేషించి ఒక అంచనా వేయడానికే  ఈ ప్రయత్నం.
మోడీ అనే ఈ రెండు అక్షరాలు  భారత రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పి ఇంకా ఏడాది కాలేదు. మోడీ మాయ  అప్పట్లో దేశాన్ని  కమ్మివేసింది. ఆ మాయ ఇంకా పూర్తిగా తొలగిపోయిన దాఖలాలు కానరావడం లేదు. దేశంలోని  నవ తరం యువజనుల్లో అధిక శాతం మందిని  ఆ మాయ ఇంకా కమ్ముకునే వుంది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి  మాధ్యమాల్లో మోడీ ప్రభలు ఇంకా విరజిమ్ముతూనే వున్నాయి. విదేశాల్లో చెప్పనక్కరేలేదు.
ఒక్క ఏడాదిన్నర వెనక్కి వెళ్లి చూస్తె భారత రాజకీయాల్లోనే కాదు, సొంత పార్టీ బీజేపీలో సయితం నరేంద్ర మోడీ ఒక సాధారణ నాయకుడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక జాతీయ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో నేతృత్వం వహించే పరిస్తితి నాడు మోడీకి వుందని వారి పార్టీ వారికే నమ్మకం లేదు. ప్రధాని అభ్యర్ధిగా మోడీ పేరు  ప్రకటించడానికి బీజేపీలో ఎంతగా మల్లగుల్లాలు పడ్డదీ తెలుసుకోవడానికి చరిత్రను తవ్వితీయనక్కర లేదు. అయితే, దరిమిలా సంభవించిన రాజకీయ పరిణామాలన్నీ మోడీకి కలసి వచ్చాయి. రెండో విడత పాలన ముగియవస్తున్న సమయానికి యూపీయేకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పీకల లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయింది. జైట్లీ అన్నట్టు ప్రజలు నిరాశలో వున్నారు. నిస్పృహకు గురై వున్నారు. కాంగ్రెస్ పట్ల అత్యధిక ప్రజానీకం పట్టరాని కోపం పెంచుకునివున్న  స్తితిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వచ్చాయి. బలహీన పడ్డ  కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి నిజానికి  బీజేపీ పెద్ద కష్టపడే పరిస్తితి లేదు. మోడీ అవసరం అంతకన్నా లేదు. కానీ,  ప్రధాని అభ్యర్ధిగా పార్టీలో అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికలకు ముందు మోడీ చెలరేగిపోయారు. తన వాగ్ధాటితో, తన ఆహార్యంతో, తన నేపధ్యంతో దూసుకుపోయారు. మోడీ తమలో ఒక్కరు  అని సామాన్యులు అనుకునేలా ప్రచారం సాగించారు. అన్నీ కలసివచ్చిన  మోడీ, ఎన్డీయే కూటమికి, అంతకు మించి బీజేపీకి తిరుగులేని విజయం సమకూర్చి పెట్టారు. ఎదురులేని నాయకుడిగా ఎదిగారు.     
కొన్నేళ్ళ క్రితం వరకు నేపధ్యంలోనే నిశ్శబ్దంగా వుండి, హఠాత్తుగా వెలుగులు విరజిమ్ముతూ దూసుకువచ్చి, అదే వేగంతో నేలరాలి పోతుందని  ఇంటా (అంటే వారి సొంత పార్టీలో) బయటా (అంటే ఎదుటి పక్షాల్లో)  అందరూ అనుకున్న తరుణంలో నిలదొక్కుకుని నిలబడ్డ  'నక్షత్రం'  నరేంద్ర మోడీ. వ్యక్తులకంటే వ్యవస్థ ప్రధానం అంటూ అన్ని పార్టీలు వల్లె చేస్తుంటాయి కాని వ్యక్తుల ప్రభావంతో ఆయా రాజకీయ పార్టీల భవితవ్యాలు నిర్ధారణ అవుతూ వుండడం భారత రాజకీయాల్లో కొత్త విషయం ఏమీ కాదు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, జయప్రకాష్ నారాయణ్, రాజీవ్ గాంధీ, వాజ్ పాయ్ వంటివారు జాతీయ స్థాయిలో తమదైన, బలమైన ముద్ర వేసి నాయకులు అనిపించుకున్నారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లో కూడా స్థానిక నాయకుల ప్రభావం కూడా తక్కువేమీ కాదు.  గుజరాత్ ముఖ్యమంత్రిగా  అంటుకున్న మరకలు, తన రాజకీయ భవిష్యత్తును అంధకారమయం చేస్తున్నాయన్న  ఆందోళన ముసురుకుంటున్న తరుణంలో వచ్చి పడిన సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని  మోడీ రాజకీయ జీవితం  ఊహాతీతమైన మలుపు తిరిగింది. నిరుడు జరిగిన  ఎన్నికలకు కొద్ది వారాలు ముందు నుంచీ మొదలయిన మోడీ ప్రభావం ఇప్పటివరకు ప్రజలపై గణనీయంగానే వుందని సర్వేలు చెబుతున్నాయి.  ఓ ఏన్నర్ధం క్రితం బీజేపీ అగ్రనాయకుడు అద్వానీని సయితం తోసిరాజని మోడీ నేతృత్వంలో ఎన్నికల రణరంగంలో కాలుమోపాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించినప్పుడే ఆ పార్టీ పగ్గాలను  మోడీ దొరకబుచ్చుకున్నారు. ప్రధానిగా మోడీ అభ్యర్దిత్వానికి సొంత  పార్టీలోనే మొగ్గ తొడిగిన అసమ్మతి, ముదిరి పాకాన పడకముందే ఎన్నికలు ముంచుకు రావడం మోడీకి మంచి మేలే చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ను మట్టికరిపించి 'నభూతో నభవిష్యతి' అనే తీరులో ఓ అపూర్వ విజయాన్ని 'బీజేపీ' ఖాతాలో జమ చేయడంతో మోడీ ప్రభలు దేశ విదేశాల్లో వెలుగులు విరజిమ్మాయి.
'కనిష్ట స్థాయిలో ప్రభుత్వ పెత్తనం, గరిష్ట స్థాయిలో ప్రజా పాలన' అనే కొత్త నినాదంతో అధికార పీఠం అధిరోహించిన మోడీ,  తొలినాళ్ళలో మూటగట్టుకున్న ప్రజాభిమానమే  దరిమిలా జరిగిన కొన్ని  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  బీజేపీ  విజయపరంపర కొనసాగడానికి దోహదం చేసింది. నల్లధనం వంటి ఒకటి రెండు ఎన్నికల వాగ్దానాలు మినహా ప్రజలకు మాటిచ్చి తప్పిన అపరాధభావం అంతగా లేని పాలనావకాశం మోడీకి దొరకడం ఒక రకంగా  ఆయన అదృష్టం. 'ఒకనాటి చాయ్ వాలా ఈనాటి దేశ ప్రధాని' అనే కొత్త  ప్రచారం ఆయనకు బాగా కలిసి వచ్చింది. గతంలో వీసా ఇవ్వడానికి సయితం నిరాకరించిన అమెరికా వంటి అగ్రరాజ్యంలో మోడీ భారత ప్రధాని హోదాలో అధికార పర్యటన జరపడం దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని కొండంతగా పెంచింది. ప్రధాని అయిన తదాదిగా మోడీ జరిపిన విదేశీ పర్యటనలు, ఆ సందర్భంగా ఆయన ఆహార్యం ఓమేరకు  విమర్శలకు  గురయినప్పటికీ, నానాటికీ పెరిగిపోతున్న మోడీ ప్రభావం ముందు అవన్నీ వెలవెల పోయాయి. 'స్వచ్చ భారత్, మేక్ ఇన్ ఇండియా' వంటి నినాదాలు మోడీ ఆకర్షణను మరింత పెంచాయి.
అయితే, ఎన్ని చేసినా, ఎన్నో చేసామని బీజేపీ నాయకులు పదే పదే తమ నాయకుడ్ని స్తోత్ర పాఠాలతో ముంచెత్తుతూ వున్నా, ఈ ఏడాది కాలంలో మోడీ చేసిన ఒక్క మంచి పని ఏమిటంటే గట్టిగా  చెప్పుకోవడానికి స్వచ్చ భారత్ కార్యక్రమం మినహా మరొక్కటి కానరాని పరిస్తితి. ఇంకా ఏమైనా వున్నాయని చెప్పుకున్నా, అవన్నీ మోడీ  ఏడాది పాలనలో సాధించినట్టు చెప్పుకునే  ఘనకార్యాలను కీర్తించే ప్రభుత్వ ప్రకటనలకు మాత్రమే  పరిమితం.
ఇక మోడీ అభిమానులు సయితం బాధ పడే అంశం ఒకటుంది. తిరుగులేని సంఖ్యాబలం అందించి జనం ఆయన్ని గద్దె ఎక్కించారు. ఆయనకు కానీ, ఆయన నేతృత్వంలోని ఎండీఏ సర్కారుకు కానీ ముంచుకు వచ్చే ముప్పేమీ కనుచూపు మేరలో లేదు. అయినా కానీ, ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా ఆర్డినెన్సు తరహా పాలనకు పూనుకోవడం నిజానికి మోడీ వంటి నాయకుడి నుంచి ప్రజలు ఎన్నడూ కోరుకోరు. ఆర్డినెన్సుల పాలనకు స్వస్తి పలకాలని ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు,  అధికార పీఠం ఎక్కగానే వాటితోనే పాలనకు స్వీకారం చుట్టడం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడడం లేదు.                              
ఇక, చెప్పి చేయని అంశం నల్ల ధనం. ఈదిశగా ఏదయినా చేసామని చెప్పుకున్నా అవి నేలబారు ప్రకటనలే. మునుపటి మన్మోహన్ ప్రభుత్వం ఇలా చేసి వుండాల్సిందని నాడు ఎన్డీయే నాయకులు చెప్పిన దాంట్లో ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు. దురదృష్టం ఏమిటంటే నల్లదనం వంటి అంశాలు వున్నవాళ్ళకే కాని సామాన్యులకు అంటని విషయాలు. కనుక ప్రస్తుతానికి ఈ అంశం మోడీ మెడకు బిగుసుకుపోయే అవకాశాలు తక్కువ.
లోకం చుట్టిన వీరుడు అని పేరు తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల  ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
ఏడాదిగా స్వచ్చమైన పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల  వైఫల్యాల పాత  జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. ఏడాది గడిచిన తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే, జైట్లీ గారు సెలవిచ్చినట్టు  ప్రజలు విసిగిపోయి, మరొకర్ని  పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు పెడతారు.      
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది. (23-05-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595  


22, మే 2015, శుక్రవారం

ఏ నిమిషానికి ఏమి జరుగునో .....


'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు గడిచే పరిస్తితి కూడా  లేదు'
అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ (మా కజిన్) ఫోను. మధ్యాహ్నం నేను వెళ్ళేసరికే అంతా అయిపొయింది.
ఆవిడ నిజానికి శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు.  కొన్నేళ్ళ క్రితం  శాస్త్రి గారు, ఆయన భార్య పుణ్యవతిగారితో  కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం. వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం. ఎంతో వెంటబడితే ఒక్కసారి కాబోలు వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ కృష్ణా రావు గారు వారింటికి వెళ్లి కులాసాగా గడిపివచ్చి  కొన్ని వారాలు కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు. 


(సరయూ నదీ తీరంలో శాస్త్రి గారు, పుణ్యవతి గారు 2012 లో)

శాస్త్రిగారు హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ. శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.
ఆసుపత్రిలో వాళ్ళ అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని గంటలు పట్టేట్టు ఉందన్నారు.  అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ  'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపే  మనిషి. ఆ కాస్తా తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో  'కట్టె'. అంతే.
శాస్త్రి గారిని తీసుకుని పక్కకు వచ్చాను. ఏదో చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడ్డం మొదలు పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో  కనిపించని వేదాంతం వుంది.
"యాభయ్ ఆరేళ్ళు నాతొ కాపురం చేసింది. సుఖం నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని నన్ను ఇలా ఒదిలేసి వెళ్ళిపోయింది. బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్ అంటించడం కూడా రాదు. లక్షలు  బిల్లు తీసుకుని ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా  చేతిలో పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా చేసానా. గత కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన.  ఇంట్లో గిరగిరా తిరిగే మా ఆవిడ కాలూ చేయీ కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని తెలుసు. అందుకే నేనే అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు దువ్వేవాడిని. నీ దగ్గర దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు చెప్పడం లేదు'
శాస్త్రి గారి  కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.
నిజమే. ఆయన నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్ అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ, ఇల్లాలినీ వదిలి బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే 'నేను రాను ఇంట్లో తనొక్కతే వుండాలి, కరెంటు పొతే భయపడుతుంది' అనేసేవారు.
'బహుశా నేను అలా అలవాటు లేని సేవలు చేసి వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం లేకే ఇలా దాటిపోయిందేమో!' అంటున్నారు శాస్త్రి గారు
ఈసారి నీళ్ళు నా కళ్ళల్లో.
(22-05-2015)                    


ఎండల్ మండేలా

రెండు రాష్ట్రాల్లో చంద్రులేనాయే - అందుకే సూర్యుడికి కాలివుంటుంది,



Image Courtesy Andhra Jyothi

20, మే 2015, బుధవారం

ప్రజాస్వామ్యంలో ప్రజాసంఘాల పాత్ర

  
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 21-05-2015, THURSDAY)
ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి  కాస్తంత  ఉదాత్తమైన  పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల  పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక  రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.  
నిజమైన ప్రజాసంఘాలకీ, రాజకీయ నేపధ్యం కలిగిన ప్రజా సంఘాలకీ హస్తిమశకాంతరం తేడా వుంది. కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల  కొద్దిసేపు  ట్రాఫిక్ సిగ్నల్స్  పనిచేయడం మానేశాయి. దాంతో  ఎవరి హడావిడిలో వాళ్ళు  పోవడం వల్ల  వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ  తన  పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ  కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.
అధికారంలో ఉన్నవాళ్ళకి తాము చేసే ప్రతిపనీ మంచిగానే కనిపిస్తుంది. సమాజ శ్రేయస్సుకోసం తాము అహరహం కష్టపడుతున్నా విమర్శలు చేయడం తగదన్న భావన పాలకులది. గతంలో ఆ పనుల్లోని లోటుపాట్లను  పరిపాలనలో పాలకులకు తోడ్పడే అధికారులు ఎత్తిచూపి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించేవారు. ఇప్పటికాలంలో అలాటి అధికారులూ లేరు.  అధవా, ఏ అధికారి అయినా కల్పించుకుని చెప్పబోయినా చెవినబెట్టే పాలకులూ లేరు. చెబితే విననప్పుడు చెప్పడం దండగ అనుకునే వాళ్ళు కొందరయితే, పైవారికి హితవు కాని మాటలు చెప్పి లేని తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం ఎందుకని సర్దుకుపోయే వారు మరికొందరు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట  వేదవాక్యం. ఎదురు చెబితే, నలుగురి ఎదుటా  ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో  కొలువుతీరి కూర్చునేవారు.  తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి  తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో  నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి  వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు.  చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు  ఒక పని చెప్పీ చెప్పగానే,  వెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు. అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా  ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను  ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు.  ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు. 

       
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఈ నాటి పాలకులకు ఎదురు చెబితే తట్టుకునే సహనం తక్కువయిపోతోంది. పాలకులే కాదు అధికార గణం సయితం ఇదే తంతు. అందరికీ మెచ్చుకోళ్ళే కావాలి తప్ప విచక్షణతో కూడిన విమర్శ పనికిరాకుండా పోతోంది. 'ఎవరు ఎందుకు చెబుతున్నారు, అలా ఎందుకు చెబుతున్నారు' అని ప్రశ్నలు వేసుకుని సరయిన సమాధానాలు రాబట్టుకోగలిగితే పాలనాసూక్ష్మాలు బోధపడతాయి.
నిజమే. రాజకీయ నాయకులు ఎక్కడలేని వైభోగాలు అనుభవిస్తున్నారనే లోకోక్తిలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ 'పీత బాధలు పీతవి' అన్నట్టు వారి ఇక్కట్లు,  వారి ఇబ్బందులు వారివి. అధికారం అన్న ఓ దండం చేతిలో వున్న కారణంగా మెడలో పడే దండలు, జనాలు పెట్టె దండాలు  మినహాయిస్తే వారి జీవితాలు కూడా పూలపానుపులు కావు. దీన్ని రుజువుచేసుకోవడానికి సచివాలయానికి వెడితే చాలు. మంత్రి దర్సనంకోసం అప్పటిదాకా పడిగాపులు పడ్డ జనం ఆయన కనబడగానే మీదపడిపోతారు. అదే ఒక చిన్న అధికారి ఆఫీసులోకి కూడా చొరవగా జొరబడలేరు. మంత్రులు, ఎమ్మెల్యేల కార్లలోకి నెట్టుకుదూరిపోయే చోటా నాయకులు అన్ని చోట్లా కనిపిస్తారు. అదే అధికారులు అయితే ఆమడ దూరంలో వుంటారు. అందుకే ముప్పయ్యేళ్ళ క్రితమే అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు అనుచరుల తాకిడి తట్టుకోలేక, తొడతొక్కిడి భరించలేక కారులో ముందు సీటుకు మారిపోయారు.
అసలు విషయానికి వస్తే '
పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా  దాని వెనుక ఏదో పైకి కనిపించని  రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది.
ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా  రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో  కొట్టి పారేస్తుంది.
చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.
ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం  ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి  కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.
కారణం ఒక్కటే. 'రాజకీయం'.                   
ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా  ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి  విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు  ఒకనాడు వున్న గుర్తింపు మసకబారి పోతోంది.
ఈ దుస్తితి తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ ఒక మెట్టు దిగాలి. ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి.
ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.
సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.  (20-05-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner 

17, మే 2015, ఆదివారం

బుక్ షెల్ఫ్ - 7 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు


మళ్ళీ కాసిన్ని చాదర్ ఘాట్ స్కూలు కబుర్లు. ముళ్ళపూడి వారి 'కోతి కొమ్మచ్చి' మాదిరిగా కాస్త ముందుకూ, కాస్త వెనక్కూ.
(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"మా ఇంగ్లీష్ టీచరు పబ్బరాజు సుబ్బారావు గారు ఓ రోజు ఇంగ్లీష్ పాఠం తీసి పైకి చదవమన్నారు. చాలా కుంట్లు పడుతూ చదివాను. అంతవరకూ నాది తెలుగు మీడియం. ఇంగ్లీష్ సరిగ్గా చూచి చదవలేని పరిస్తితి.. నా మీద నాకే సిగ్గేసింది.
"ఐదో ఫారంలో మా క్లాసు టీచరు జుల్ఫ్ కార్ ఆలీఖాన్. మంచీ ఒడ్డూ పొడుగూ, సినిమా స్టార్ లా ఉండేవాడు. కేంబ్రిడ్జ్ లో ఇంటర్ మీడియట్ చదివి వచ్చాడు. అదే ఆయన యోగ్యత. ఆయన తప్పుల్ని పిల్లలు దిద్దుతుండేవారు.

"మా క్లాసు పిల్లలు నిజంగా సిసింద్రీలు. వాళ్ళ ఇంగ్లీష్ ఇప్పటి ఎం.ఏ. వారికన్నా బాగుండేది. ముఖ్యంగా నరసింహన్   అయ్యంగార్, రామచంద్రారెడ్డి, అబ్దుల్ అజీజ్, ఆజ్మల్ ఖాన్, రాఘవన్ - వీళ్ళు  ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో గొప్పగా వుండేది. రాఘవన్ బేబీ ఆస్టిన్ కార్లో స్కూలుకు వచ్చేవాడు. లెక్కల టీచరు  అబీద్ ఆలీ గారు. ఆయనకు పల్చటి గడ్డం వుండేది. అంచేత ఆయనకు కొత్తిమీర్ కట్ట అని కొంటే పేరు పెట్టారు పిల్లలు.  ఫిజిక్స్  మహమ్మద్ ఆలీ గారు చెప్పేవారు.ఆయనకు దుబ్బుగా పొడవాటి గడ్డం. అందుకని ఝాడుకట్ట అని పేరు.  హిస్టరీ జాగ్రఫీలు వామన్ రావు చెప్పేవారు. టీచర్లకు పేర్లు పెట్టె విషయంలో బందరు పిల్లలు కూడా ఏమీ తక్కువ తినలేదు. 'కాంతా వల్లభరాజులుంగారు' అనబడే మునిమాణిక్యం నరసింహారావు గారు  మా క్లాసు టీచరు. ఆయనకు కళ్ళు పుసులు కారే జబ్బు. ఆయన్ని  చిమ్మెట్ట గారని ఆట పట్టించేవారు. సైన్సు టీచరు సోమజాజులు గారికి మెడ పొడవు.  బీకరు అనేవారు. అనంత శర్మగారికి మెడ పొట్టి. మనిషి లావు. ఆయన్ని మెట్ట  వంకాయ్ అని పిలిచేవాళ్ళు. హెడ్ మాస్టర్ వెంకట రామయ్య గారు 'పాండు రంగడు'. పెద్ద పెద్ద మీసాలు వున్న తాళ్ళూరి నారాయణ రావు గార్ని బొద్దింక మాస్టారు అనే వాళ్ళు. ఆయన తండ్రి చనిపోయిన కారణంగా కర్మకాండలో మీసాలు తీసేశారు. ఇక బొద్దింక గొడవ ఉండదని ఆయన అనుకున్నారు. మీసాలు లేని ఆయన్ని చూసి బోడి బొద్దింక వచ్చిందిరా అనడంతో ఆయన చిన్నబుచ్చుకునేవారు. అలా ఉండేవి చిన్నతనంలో సరదాలు"


 (ఇంకా వుంది)       

16, మే 2015, శనివారం

బుక్ షెల్ఫ్ - 6 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు


(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"పరీక్షలు అయిన తరువాత ఇంటికి వెళ్లాను, గుడ్లవల్లేరు. రిజల్ట్ వచ్చిన సంగతి ఆలస్యంగా తెలిసింది. హైసెకండ్ క్లాసులో పాసయ్యాను. హైదరాబాదు వెళ్లి నిజాం కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లికేషన్ ఇచ్చాను. టర్నర్ అనే ఆయన ప్రిన్సిపాల్. ఆయన వేసవి సెలవులకు ఇంగ్లండు వెళ్ళాడు. మహమ్మద్ సిద్దికీ అని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన్ని తాత్కాలికంగా ప్రిన్సిపాల్ గా వేసారు. టర్నర్ వుంటే నా మార్కులు చూసి సీటు  ఇచ్చేవాడే. మహమ్మద్ సిద్దికీ గారు 'నువ్వు ఆలస్యంగా వచ్చావు. సీట్లు నిండి పోయినై. నువ్వు మద్రాసు ప్రెసిడన్సీ వాడివి. అయినా మంచి మార్కులు వచ్చాయి కనుక ముల్కీ సర్టిఫికేట్ తెస్తే సీటు ఇస్తాన'ని అన్నారు. ముల్కీ సర్టిఫికేట్ అంటే నిజాం రాజ్యంలో పుట్టయినా వుండాలి. లేదా పన్నెండేండ్లు నివాసం అయినా వుండాలి. మాకు నైజాంలో భూములు వున్నాయి కాని అవి పరాధీనంలో వున్నాయి. నైజాంలో పుట్టినట్టు సర్టిఫికేట్ కావాలంటే సాక్ష్యం వుండాలి. ఆరోజుల్లో నైజాంలో పుట్టుకల గిట్టుకల రిజిష్టర్  వుండేది కాదు. అంచేత అనేకమంది దొంగ సర్టిఫికేట్లతో చేరేవారు.  మా బావ స్నేహితుడి తండ్రి  ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయినాడు.  ఆయన సాక్ష్యం  ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు ఇద్దరం అప్లికేషన్ తో తాలూక్ దార్ ఆఫీసుకు వెళ్ళాము. 'ఇతను  మీకెలా తెలుసు అని తాలూక్ దార్ అడిగితె, ఆబ్కారీ డిపార్టుమెంటులో పనిచేస్తూ వాళ్ళ  వూరు వెళ్ళేవాడిని, అల్లా పరిచయం' అనిచెబుతాను. నువ్వూ  అట్లాగే చెప్పు' అని నాతొ అన్నాడాయన. ఫారం లోపలి పోయింది. మాకన్నా ముందు వచ్చిన ఒకాయన తప్పుడు సాక్ష్యం చెప్పాడని మజరద్ గార్ నిర్ణయించి రెండువందలు ఫైను వేసాడు. అది చూసి సాక్ష్యం ఇవ్వడానికి నాతొ పాటు వచ్చిన పెద్దమనిషి భయపడి పోయాడు. ఐనా నేను లోపలకు వెళ్లి మజరాద్ గారిని  కలిసాను. చిన్నవాడు. మంచి  మనిషిలా కనిపించాడు. 'నీకు నిజాం కాలేజీలో సీటు వచ్చింది చేరడానికి ముల్కీ కావాలి. ఎవర్నన్నా సాక్ష్యం తీసుకురా ఇస్తాన'ని చెప్పాడు. నాకు సాక్ష్యం  ఎవ్వరూ లేరు. ముల్కీ రాలేదు. సీటూ  రాలేదు. అందుకే  ఇంటికి వెళ్ళిపోయాను.  తరువాత బందరులో హిందూ కాలేజీలో నాలుగేళ్ళు చదివాను. 



(ఇంకా వుంది)