22, మే 2015, శుక్రవారం
ఎండల్ మండేలా
20, మే 2015, బుధవారం
ప్రజాస్వామ్యంలో ప్రజాసంఘాల పాత్ర
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 21-05-2015, THURSDAY)
ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం
మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి కాస్తంత ఉదాత్తమైన పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద
ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం
జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం
జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే
ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా
కానవస్తోంది.
నిజమైన ప్రజాసంఘాలకీ, రాజకీయ నేపధ్యం కలిగిన
ప్రజా సంఘాలకీ హస్తిమశకాంతరం తేడా వుంది. కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులోని ఒక రద్దీ
కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల కొద్దిసేపు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం మానేశాయి. దాంతో ఎవరి హడావిడిలో వాళ్ళు పోవడం వల్ల వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్
సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి
వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం
చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ
క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ
సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ తన పదవినీ,
దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని
కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది.
దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే
సంస్థకు చెందిన రాజకీయ కార్యకర్తలు మంచి
మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం.
రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.
అధికారంలో ఉన్నవాళ్ళకి తాము చేసే ప్రతిపనీ
మంచిగానే కనిపిస్తుంది. సమాజ శ్రేయస్సుకోసం తాము అహరహం కష్టపడుతున్నా విమర్శలు
చేయడం తగదన్న భావన పాలకులది. గతంలో ఆ పనుల్లోని లోటుపాట్లను పరిపాలనలో పాలకులకు తోడ్పడే అధికారులు ఎత్తిచూపి
వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించేవారు. ఇప్పటికాలంలో అలాటి అధికారులూ లేరు. అధవా, ఏ అధికారి అయినా కల్పించుకుని చెప్పబోయినా
చెవినబెట్టే పాలకులూ లేరు. చెబితే విననప్పుడు చెప్పడం దండగ అనుకునే వాళ్ళు
కొందరయితే, పైవారికి హితవు కాని మాటలు చెప్పి లేని తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం
ఎందుకని సర్దుకుపోయే వారు మరికొందరు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి
ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట వేదవాక్యం. ఎదురు చెబితే, నలుగురి ఎదుటా ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో
ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన
ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు
పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో కొలువుతీరి కూర్చునేవారు. తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి
పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి
మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు
వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి వుంటుంది.
రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు. చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు ఒక పని చెప్పీ చెప్పగానే, వెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము'
అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు.
అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే,
తీరా ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి
వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ
పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది
కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి
ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు. ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో
'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు
ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఈ నాటి
పాలకులకు ఎదురు చెబితే తట్టుకునే సహనం తక్కువయిపోతోంది. పాలకులే కాదు అధికార గణం
సయితం ఇదే తంతు. అందరికీ మెచ్చుకోళ్ళే కావాలి తప్ప విచక్షణతో కూడిన విమర్శ పనికిరాకుండా
పోతోంది. 'ఎవరు ఎందుకు చెబుతున్నారు, అలా ఎందుకు చెబుతున్నారు' అని ప్రశ్నలు వేసుకుని
సరయిన సమాధానాలు రాబట్టుకోగలిగితే పాలనాసూక్ష్మాలు బోధపడతాయి.
నిజమే. రాజకీయ నాయకులు ఎక్కడలేని వైభోగాలు అనుభవిస్తున్నారనే
లోకోక్తిలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ 'పీత బాధలు పీతవి' అన్నట్టు వారి ఇక్కట్లు, వారి ఇబ్బందులు వారివి. అధికారం అన్న ఓ దండం
చేతిలో వున్న కారణంగా మెడలో పడే దండలు, జనాలు పెట్టె దండాలు మినహాయిస్తే వారి జీవితాలు కూడా పూలపానుపులు
కావు. దీన్ని రుజువుచేసుకోవడానికి సచివాలయానికి వెడితే చాలు. మంత్రి దర్సనంకోసం
అప్పటిదాకా పడిగాపులు పడ్డ జనం ఆయన కనబడగానే మీదపడిపోతారు. అదే ఒక చిన్న అధికారి
ఆఫీసులోకి కూడా చొరవగా జొరబడలేరు. మంత్రులు, ఎమ్మెల్యేల కార్లలోకి నెట్టుకుదూరిపోయే
చోటా నాయకులు అన్ని చోట్లా కనిపిస్తారు. అదే అధికారులు అయితే ఆమడ దూరంలో వుంటారు.
అందుకే ముప్పయ్యేళ్ళ క్రితమే అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు అనుచరుల తాకిడి తట్టుకోలేక,
తొడతొక్కిడి భరించలేక కారులో ముందు సీటుకు మారిపోయారు.
అసలు విషయానికి వస్తే '
పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో
వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా దాని వెనుక ఏదో పైకి కనిపించని రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది.
ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం
అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేస్తుంది.
చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు
సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి
కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు
వాటిని గుర్తించవు. అభినందించవు.
ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా
సహేతుకమైనవి కావచ్చు. కానీ
అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.
కారణం ఒక్కటే. 'రాజకీయం'.
ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ
పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న
ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు
పడి, వాటి విశ్లేషణలకు, అభిప్రాయాలకు,
సూచనలకు, సలహాలకు ఒకనాడు వున్న గుర్తింపు
మసకబారి పోతోంది.
ఈ దుస్తితి తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ
ఒక మెట్టు దిగాలి. ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి.
ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే
ధైర్యం అలవరచుకోవాలి.
ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.
సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు. (20-05-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com
మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner
లేబుళ్లు:
ప్రజాస్వామ్యంలో ప్రజాసంఘాల పాత్ర
17, మే 2015, ఆదివారం
బుక్ షెల్ఫ్ - 7 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు
మళ్ళీ కాసిన్ని చాదర్
ఘాట్ స్కూలు కబుర్లు. ముళ్ళపూడి వారి 'కోతి కొమ్మచ్చి' మాదిరిగా కాస్త ముందుకూ,
కాస్త వెనక్కూ.
(శిష్ట్లా లక్ష్మీపతి
శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"మా ఇంగ్లీష్ టీచరు
పబ్బరాజు సుబ్బారావు గారు ఓ రోజు ఇంగ్లీష్ పాఠం తీసి పైకి చదవమన్నారు. చాలా
కుంట్లు పడుతూ చదివాను. అంతవరకూ నాది తెలుగు మీడియం. ఇంగ్లీష్ సరిగ్గా చూచి చదవలేని
పరిస్తితి.. నా మీద నాకే సిగ్గేసింది.
"ఐదో ఫారంలో మా
క్లాసు టీచరు జుల్ఫ్ కార్ ఆలీఖాన్. మంచీ ఒడ్డూ పొడుగూ, సినిమా స్టార్ లా ఉండేవాడు.
కేంబ్రిడ్జ్ లో ఇంటర్ మీడియట్ చదివి వచ్చాడు. అదే ఆయన యోగ్యత. ఆయన తప్పుల్ని
పిల్లలు దిద్దుతుండేవారు.
"మా క్లాసు పిల్లలు
నిజంగా సిసింద్రీలు. వాళ్ళ ఇంగ్లీష్ ఇప్పటి ఎం.ఏ. వారికన్నా బాగుండేది. ముఖ్యంగా
నరసింహన్ అయ్యంగార్, రామచంద్రారెడ్డి, అబ్దుల్ అజీజ్,
ఆజ్మల్ ఖాన్, రాఘవన్ - వీళ్ళు ఇంగ్లీష్
మాట్లాడుతుంటే ఎంతో గొప్పగా వుండేది. రాఘవన్ బేబీ ఆస్టిన్ కార్లో స్కూలుకు
వచ్చేవాడు. లెక్కల టీచరు అబీద్ ఆలీ గారు.
ఆయనకు పల్చటి గడ్డం వుండేది. అంచేత ఆయనకు కొత్తిమీర్ కట్ట అని కొంటే పేరు పెట్టారు
పిల్లలు. ఫిజిక్స్ మహమ్మద్ ఆలీ గారు చెప్పేవారు.ఆయనకు దుబ్బుగా
పొడవాటి గడ్డం. అందుకని ఝాడుకట్ట అని పేరు. హిస్టరీ జాగ్రఫీలు వామన్ రావు చెప్పేవారు.
టీచర్లకు పేర్లు పెట్టె విషయంలో బందరు పిల్లలు కూడా ఏమీ తక్కువ తినలేదు. 'కాంతా
వల్లభరాజులుంగారు' అనబడే మునిమాణిక్యం నరసింహారావు గారు మా క్లాసు టీచరు. ఆయనకు కళ్ళు పుసులు కారే
జబ్బు. ఆయన్ని చిమ్మెట్ట గారని ఆట
పట్టించేవారు. సైన్సు టీచరు సోమజాజులు గారికి మెడ పొడవు. బీకరు అనేవారు. అనంత శర్మగారికి మెడ పొట్టి.
మనిషి లావు. ఆయన్ని మెట్ట వంకాయ్ అని
పిలిచేవాళ్ళు. హెడ్ మాస్టర్ వెంకట రామయ్య గారు 'పాండు రంగడు'. పెద్ద పెద్ద మీసాలు
వున్న తాళ్ళూరి నారాయణ రావు గార్ని బొద్దింక మాస్టారు అనే వాళ్ళు. ఆయన తండ్రి
చనిపోయిన కారణంగా కర్మకాండలో మీసాలు తీసేశారు. ఇక బొద్దింక గొడవ ఉండదని ఆయన అనుకున్నారు.
మీసాలు లేని ఆయన్ని చూసి బోడి బొద్దింక వచ్చిందిరా అనడంతో ఆయన
చిన్నబుచ్చుకునేవారు. అలా ఉండేవి చిన్నతనంలో సరదాలు"
(ఇంకా వుంది)
16, మే 2015, శనివారం
బుక్ షెల్ఫ్ - 6 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు
(శిష్ట్లా లక్ష్మీపతి
శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"పరీక్షలు అయిన
తరువాత ఇంటికి వెళ్లాను, గుడ్లవల్లేరు. రిజల్ట్ వచ్చిన సంగతి ఆలస్యంగా తెలిసింది.
హైసెకండ్ క్లాసులో పాసయ్యాను. హైదరాబాదు వెళ్లి నిజాం కాలేజీలో అడ్మిషన్ కోసం
అప్లికేషన్ ఇచ్చాను. టర్నర్ అనే ఆయన ప్రిన్సిపాల్. ఆయన వేసవి సెలవులకు ఇంగ్లండు
వెళ్ళాడు. మహమ్మద్ సిద్దికీ అని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన్ని తాత్కాలికంగా
ప్రిన్సిపాల్ గా వేసారు. టర్నర్ వుంటే నా మార్కులు చూసి సీటు ఇచ్చేవాడే. మహమ్మద్ సిద్దికీ గారు 'నువ్వు
ఆలస్యంగా వచ్చావు. సీట్లు నిండి పోయినై. నువ్వు మద్రాసు ప్రెసిడన్సీ వాడివి. అయినా
మంచి మార్కులు వచ్చాయి కనుక ముల్కీ సర్టిఫికేట్ తెస్తే సీటు ఇస్తాన'ని అన్నారు. ముల్కీ
సర్టిఫికేట్ అంటే నిజాం రాజ్యంలో పుట్టయినా వుండాలి. లేదా పన్నెండేండ్లు నివాసం
అయినా వుండాలి. మాకు నైజాంలో భూములు వున్నాయి కాని అవి పరాధీనంలో వున్నాయి.
నైజాంలో పుట్టినట్టు సర్టిఫికేట్ కావాలంటే సాక్ష్యం వుండాలి. ఆరోజుల్లో నైజాంలో
పుట్టుకల గిట్టుకల రిజిష్టర్ వుండేది
కాదు. అంచేత అనేకమంది దొంగ సర్టిఫికేట్లతో చేరేవారు. మా బావ స్నేహితుడి తండ్రి ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్
అయినాడు. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు ఇద్దరం
అప్లికేషన్ తో తాలూక్ దార్ ఆఫీసుకు వెళ్ళాము. 'ఇతను మీకెలా తెలుసు అని తాలూక్ దార్ అడిగితె, ఆబ్కారీ
డిపార్టుమెంటులో పనిచేస్తూ వాళ్ళ వూరు
వెళ్ళేవాడిని, అల్లా పరిచయం' అనిచెబుతాను. నువ్వూ అట్లాగే చెప్పు' అని నాతొ అన్నాడాయన. ఫారం లోపలి
పోయింది. మాకన్నా ముందు వచ్చిన ఒకాయన తప్పుడు సాక్ష్యం చెప్పాడని మజరద్ గార్
నిర్ణయించి రెండువందలు ఫైను వేసాడు. అది చూసి సాక్ష్యం ఇవ్వడానికి నాతొ పాటు
వచ్చిన పెద్దమనిషి భయపడి పోయాడు. ఐనా నేను లోపలకు వెళ్లి మజరాద్ గారిని కలిసాను. చిన్నవాడు. మంచి మనిషిలా కనిపించాడు. 'నీకు నిజాం కాలేజీలో సీటు
వచ్చింది చేరడానికి ముల్కీ కావాలి. ఎవర్నన్నా సాక్ష్యం తీసుకురా ఇస్తాన'ని చెప్పాడు.
నాకు సాక్ష్యం ఎవ్వరూ లేరు. ముల్కీ రాలేదు.
సీటూ రాలేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత బందరులో హిందూ కాలేజీలో నాలుగేళ్ళు చదివాను. (ఇంకా వుంది)
రాజకీయ చక్రబంధంలో రైతాంగం
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 17-05-2015, SUNDAY)
ఏ.ఐ.సీ.సీ. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్
సందేశ్ యాత్ర పేరుతొ ఆదిలాబాదు జిల్లాలో పదిహేను కిలోమీటర్లు మండుటెండలో పాదయాత్ర
చేసి వెళ్ళారు. ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజక్టుల వద్ద పడక
పేరుతొ వూళ్లపట్టునే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి
చంద్రశేఖరరావు స్వచ్చ నగరం పేరుతొ హైదరాబాదులో గల్లీ గల్లీ తిరిగే కార్యక్రమం
పెట్టుకున్నారు. వై.ఎస్.ఆర్.సీ.పీ. అధినాయకుడు రైతు భరోసా పేరుతొ ఊళ్లకు ఊళ్ళు
చుట్టబెడుతున్నారు.
కనుచూపు మేరలో ఎన్నికలు లేవు. అయినా నాయకులు ఏదో
ఒక పేరు పెట్టుకుని జనం మధ్యనే గడపాలని అనుకుంటున్నారు. ఈ మార్పుకు కారణం ఒక్కటే, వెనుకటికీ
ఇప్పటికీ రాజకీయ వ్యూహాల్లో వచ్చిన తేడానే!
కొన్ని దశాబ్దాల క్రితం విద్యార్ధులు పరీక్షల
తరుణంలోనే పుస్తకాలు చేతపట్టి రాత్రీ పగలూ అనకుండా కష్టపడి చదివి గట్టెక్కాలని
ప్రయత్నం చేసేవారు. మిగిన రోజుల్లో ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి ప్రబలిన
తరువాత విద్యార్ధులకు అనునిత్యం పరీక్షలే. ప్రతిక్షణం పరీక్షాకాలమే.
ఇప్పుడీ సంస్కృతి రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినట్టు వుంది.
పూర్వం ఎన్నికల సమయంలో మాత్రమె కానవచ్చే హడావిడి ఇప్పుడు ఏడాది పొడుగునా కళ్ళకు
కడుతోంది. నిత్యం జనాలతో అనుబంధం పెంచుకుంటూ ఆత్మ స్తుతి, పరనిందలతో పొద్దుపుచ్చుతున్నారు.
అందుకే, రాజకీయ కోయిలలు ముందే కూస్తున్నాయి. ఎన్నికల ఘడియ దగ్గరలో లేకపోయినా
నాయకులు కాళ్ళకు బలపాలు కట్టుకుని జనాలమధ్యనే తిరుగుతున్నారు.
అరవయ్యో దశకంలో ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం
లోకసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికలప్పుడు జనాలకు చూపించిన మొహం మళ్ళీ ఎన్నికల వరకు
చూపించేవారు కాదు. అయినా వరసగా అయిదు సార్లు ప్రజలు ఆయన్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు.
గెలిచిన తరువాత ఢిల్లీలోనో, హైదరాబాదులోనో
హాయిగా కాలక్షేపం చేసేవారు కాని నియోజకవర్గం వైపు తొంగి చూసేవారు కాదు. అయినా ఆ
రోజుల్లో అలా నడిచిపోయింది.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి
అధికారంలోకి వచ్చిన తరువాత కొంత పరిస్తితి మారింది. జనాల్లో తిరగకుండా జనాలమీద
పెత్తనం చేయడం కష్టం అన్న ఎరుక రాజకీయ నాయకుల్లో మొదలయింది. అయితే ఎన్టీఆర్ తరహా
కూడా అదో మాదిరి. ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు, కనీసం ఏసీ సౌకర్యం కూడా లేని చైతన్య రధం
మీద బయలుదేరి, ఎండావానల్ని లెక్కచేయకుండా,
ఆకలిదప్పులు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని చుట్టబెడుతూ రాత్రింబగళ్ళు ప్రజల మధ్యనే తిరిగేవారు. ఆ ఎండలకు
అంతటి అందగాడి మొహం కూడా నల్లకప్పు వేసిపోయేది. ఒక్కసారి విజయం సాధించి,
అధికార పీఠం ఎక్కడం తరువాయి, అంతే! ఎంతో ముఖ్యమైన రాచకార్యం వుంటే తప్ప రాజధానిని
ఒదిలిపెట్టి అడుగు బయట పెట్టేవారు కాదు.
జిల్లాల పర్యటనలు ఎక్కువగా పెట్టుకునేవారు
కాదు. చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్తితి పూర్తిగా
మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన గురించిన కబురు చెవిలో పడడం ఆలస్యం కాళ్ళకు రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళేవారు. కొన్ని సందర్బాలలో స్థానిక అధికారుల కంటే ముందే
అక్కడ వాలిపోవడం, లేదా ముఖ్యమంత్రి
హైదరాబాదు నుంచి ఆ విషయం గురించి వారిని వాకబు చేయడం ఇలాటివన్నీ ఆ రోజుల్లో తమాషాగా చెప్పుకునేవారు.
కొండొకచో సంచలనాత్మకంగా, కొండొకచో విమర్శనాత్మకంగా ఉండేవి అవి.
దరిమిలా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిది కూడా ఓ రకంగా ఇదే
తరహా. పర్యటనల్లో వున్నా, రాజధానిలో వున్నా జనం మధ్య గడపడానికే ఆసక్తి చూపేవారు.
ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడానికి ఆయన చాలా కాలం పాటు చేసిన నిరీక్షణ
ఫలించడానికి కారణం ఆయన చేసిన పాదయాత్రే అనడంలో సందేహం లేదు. తదాదిగా అధికారం
చేజిక్కించుకోవాలంటే పాదయాత్రలు చక్కని రాజమార్గం అన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో కుదిరిపోయింది.
చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అనంతరమే తొమ్మిదేళ్ళ పైచిలుకు సాగిన ప్రతిపక్ష
అజ్ఞాత వాసం నుంచి బయట పడి ముఖ్యమంత్రి
కుర్చీలో కూర్చోగలిగారు.
ఇక సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి
పూర్తిగా జనం మీదనే ఆధారపడ్డారు. జనం అండ ఉంటుందనే నమ్మకంతో రాజకీయ ఎత్తుగడల్లో
చూపించాల్సిన పట్టు విడుపుల్ని ప్రదర్శించకుండా ఓ మేరకు నష్టపోయారని కూడా ఆయన్ని
గురించి చెప్పుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనది అదే తీరు. తన సొంత పార్టీ
నాయకులతో కంటే జనాల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతారనే పేరు ఆయన ఖాతాలో వుంది కూడా.
పొతే, రాజకీయ నాయకుల పాదయాత్రలు, కిసాన్ యాత్రలు,
రైతు భరోసా యాత్రలు, ఇంకా ఇలాటి అనేకానేక యాత్రలు, పర్యటనలు, ప్రదర్శనలు, ర్యాలీలు
ప్రజలకు చేసే మేలు ఏమిటోకాని ఆయా పార్టీలకు మాత్రం పెద్ద మేళ్ళే
చేస్తున్నాయని వాటి గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే ఇబ్బందులు వున్నా, కష్టాలు
వున్నా, బాగా డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా నాయకులు వెనుకడుగు వేయకుండా పాదయాత్రలతో
ముందడుగు వేస్తున్నారు.
సరే! 'యాత్రాఫల సిద్ధిరస్తు' అని జనం వారిని ఆశీర్వదిస్తారో లేదో తెలియడానికి ఇంకా చాలా
వ్యవధానం వుంది. 'ప్రజలు గమనిస్తున్నారు సుమా!' అని ఎదుటివారికి హెచ్చరికలు చేసే
నాయకులు, తమను కూడా అవే జనాలు గమనిస్తున్నారని మరచిపోతుంటారు. సామాన్య రైతుల కడగండ్లు తీర్చడం ఒక్కటే తమ ప్రధమ ప్రాధాన్యత
అని జబ్బలు చరుచుకుంటూ, అసలా కష్టాలకన్నింటికీ ఆవలి పక్షం వారే కారణం అంటూ ఆరోపిస్తూ
అధికారంలో వున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తూ, అధికారం చేజారగానే అంతవరకూ
ప్రతిపక్షాలు ఆలపిస్తూ వచ్చిన పాత పల్లవినే ఎత్తుకుంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకునేందుకు ఇలాటి ఈ వేదికలు
ఉపయోగపడడం నిజంగా దారుణం అనిపిస్తుంది. రైతుల ఆత్మహత్యలు ఎదుటి పక్షం హయాములో
ఎన్ని జరిగాయో, తమ పాలనలో ఎలా తగ్గుముఖం పట్టాయో గణాంకాలతో సహా వివరిస్తుంటారు.
ఎదుటి వారిది రైతు వ్యతిరేక విధానం అనే
వారు, తమది రైతు అనుకూల విధానం అని జనంచేత నమ్మించడానికి తాముచేసిన ఘన కార్యాల
జాబితాలను జనాల మీదకు ఒదులుతుంటారు. మరి
ఇందరు, విడివిడిగా అయినా సరే, ఇలా రైతుల సంక్షేమం కోసమే అహర్నిశలు చెమటలు
కారుస్తున్నప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కాక, ఆర్ధిక సమస్యలతో ఉసురు తీసుకునే వారి సంఖ్య ఎందుకిలా పెరిగిపోతోంది?
అంటే వీరందరూ చెబుతున్న రైతు సంక్షేమ పధకాలన్నీ నీరు కారిపోతున్నట్టే కదా! వారు చెబుతున్న మాటలన్నీ నీటిమూటలే కదా! నీటి
మీద రాతలే కదా! నేతిబీరకాయ చందమే కదా!
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని
ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతున్నది. వాళ్ళు
విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం
చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది
కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు
వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి.
విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నం పెట్టె రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం
తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి.
ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు
వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు
ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూమి పందారాలు, మిషన్లు, గ్రోత్ కారిడార్లు
అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో కాస్త పేరున్న ఏ
పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారం, అధికారం లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ
రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం
చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, జనాలకు మొదటి ముద్ద
పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సింది ప్రభుత్వాలు సకాలంలో ఇస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది మన్ను
పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి
మంచి విత్తనాలు, ఎరువులు. పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. ఈ మాత్రం సకాలంలో చేయలేక
పోవడం వల్లనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను
ఓదార్చడం తప్పుకాకపోవచ్చు. కానీ అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ ప్రభుత్వాలు, ఈ
రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం
లేని ప్రశ్న.
ఉపశ్రుతి : ఆధునిక జాతక కధలో బుద్దుడు ఓ గ్రామానికి
వెడతాడు. చనిపోయిన తన పిల్లవాడికి
ప్రాణదానం చేయమని ఓ తల్లి గౌతముడ్ని వేడుకుంటుంది. ఆయన సరే అని చెప్పి, 'పరిశ్రమలకోసం
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య
చేసుకున్న వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్రా మీ అబ్బాయిని బతికిస్తా' అంటాడు.
ఆ తల్లి ఆశతో ఎన్ని వూళ్ళో తిరుగుతుంది. యెంత తిరిగినా అటువంటి వారి జాడ కనబడక నిరాశగా తిరిగొస్తుంది. ఇందులో నీతి ఏమిటన్నది వేరుగా
చెప్పక్కరలేదేమో!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
(16-05-2015)
NOTE: Courtesy Cartoonist
లేబుళ్లు:
రాజకీయ చక్రబంధంలో రైతాంగం
ఐ నో పీఎం ఐ నో సీఎం
'హలో నమస్కారం'
'నమస్కారం. చెప్పండి '
'మనం కలవక చాలా రోజులయింది'
'అవునండీ'
'ఈ సాయంత్రం ఎలా వున్నారు? వీలుంటే బంజారా హోటల్లో కలుద్దామా!'
'ఎందుకండీ అంత ఖర్చు. హాయిగా మంకు ప్రెస్ క్లబ్ వుంది కదా'
'ప్రైవసీ వుండదేమో'
'హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి
ప్రైవసీ ఎందుకండీ?'
'అదీ నిజమే అనుకోండి'
క్లబ్బులో రెండు మూడు గంటలు గడిపిన తరువాత.....
'నేను వస్తానండీ'
'అప్పుడేనా?'
చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడయితే ఏదో ఒక ఆటో
దొరుకుతుంది. ఆలస్యం అయిన కొద్దీ వాళ్ళతో
తంటా. రోజూ వుండే తద్దినమే అయినా పైగా
పొద్దున్నే వార్తల టయిముకి ఆఫీసుకి చేరాలి'
'వుండండి నా కారులో దింపేసి వెడతాను'
'భలే వాళ్ళే!
మీరు వుండేది ఉత్తరం, నేను ఉండేది
దక్షిణం. బోలెడు దూరం తిరిగెలి వద్దు లెండి'
'నేనేమన్నా మిమ్మల్ని మోసుకుంటూడతానా? కారే కదా.
పైగా డ్రైవర్ కూడా వున్నాడు, పదండి'
'సరే పదండి'
ఇంటి దగ్గర దిగే ముందు -
'నేను చెప్పింది కాస్త గుర్తు పెట్టుకోండి. నాకు
ఇది ప్రిస్టేజ్ ఇష్యూ'
ఏళ్ళు గడిచిపోయాయి.
అప్పటి జర్నలిష్టు ఇప్పుడు మాజీ జర్నలిష్టు.
ప్రెస్ క్లబ్ లో మళ్ళీ కలిశారు అదే ఇద్దరు.
'ఏమండీ బాగున్నారా?'
'మీరెలా వున్నారు?'
బాగానే వున్నాను. కంపెనీ టర్నోవర్ అయిదు
కోట్లయింది. పని బాగా పెరిగిపోయింది. మునపటిలా ఎవర్నీ తీరిగ్గా కలవలేకపోతున్నాను. కాసేపు
మాట్లాడుకుందాం రండి'
'కాదండీ. ఇప్పటికే చాలా సేపు అయింది. మీకు తెలుసు
కదా కాదు చాలా దూరం వెళ్ళాలి. పైగా ఆటో సమస్య'
'మరే. నేను అదే అనుకుంటున్నాను. ఈరోజు వేరే
ఫ్రెండ్స్ వస్తామన్నారు. మరో రోజు తీరిగ్గా కులుద్దాం లెండి. గుడ్ నైట్ అండీ'
'గుడ్ నైట్'
(NOTE : COURTESY IMAGE OWNER)
లేబుళ్లు:
ఐ నో పీఎం ఐ నో సీఎం
15, మే 2015, శుక్రవారం
బుక్ షెల్ఫ్ - 5 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు
(శిష్ట్లా లక్ష్మీపతి
శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"నిజాము గారికి
మనుమడు పుట్టాడు. మొజంజాహి అని పేరు పెట్టారు. మనుమడి పేరుతొ నగరంలో ఒక మార్కెట్
నిర్మించారు కూడా.
నిజాము రాజ్యంలో ప్రజలు
దొంగతనాలు ఎరుగరు. పోట్లాటలు ఎరుగరు. నిజాము దగ్గర రెవెన్యూ, పోలీసు విభాగాలు
పర్యవేక్షించిన రాజా బహదూర్ సర్ కిషన్ ప్రసాద్, కొత్వాల్ వెంకట్రామరెడ్డి ఇందుకు
ప్రధాన కారకులు.
"ఆబిడ్స్ లోని
జమ్రుద్ మహల్ సినిమాహాల్లో దేవకీ రాణి కధా నాయికగా నటించిన 'జవానీకి హవా ' అనే సినిమా చూడడానికి నిజాము ముచ్చటపడి
వెళ్ళారు.
"ఆ రోజుల్లో
జమ్రుద్ మహల్ పెద్ద సినిమాహాలు. అప్పుడప్పుడు అందులో పాట కచ్చేరీలు కూడా జరుగుతూ
ఉండేవి. నేను ముసునూరి సుబ్రహ్మణ్యం గారి కచేరీ అక్కడే విన్నాను.
"ఆబిడ్స్ కార్నర్
లో ప్యాలెస్ అనే కొత్త టాకీసు కట్టారు. సుల్తాన్ బజారులో మోతీ మహల్, రాయల్ టాకీసు
అనే రెండు థియేటర్లు ఉండేవి. మోతీ మహల్లో చార్లీ చాప్లిన్ మోడరన్ టైమ్స్, సైగల్
దేవదాసు చూసాను. కొన్నాళ్ళ తరువాత అగ్ని ప్రమాదంలో మోతీ మహల్ పూర్తిగా తగులబడి పోయింది.
అప్పుడందులో లేడీ డాక్టర్ సినిమా ఆడుతోంది. సులోచన హీరోయిన్. మంటల నుంచి
తప్పించుకోలేక అనేకమంది స్త్రీలూ, పిల్లలూ చనిపోయారు. తర్వాత చూస్తె నాలుగయిదు
నెలల చంటి పిల్ల పైన పల్లకీ బొంగు మాదిరి వంగిన తల్లి శవం కనిపించింది. చావులో
కూడా తల్లికి పిల్ల మీద యెంత ప్రేమో. ఆ పసిబిడ్డ మాత్రం ప్రాణాలతోనే వుంది. తల్లి
ప్రేమ తల్లి ప్రేమే.
"గౌలీగూడాలో ఒక
మూకీ హాలు వుండేది. దానికి తెర లేదు. తెల్లని గోడ మీదే సినిమా బొమ్మలు నడిచేవి.
స్టంట్ సీన్లు వచ్చినప్పుడు హాలు యజమానులు మనుషుల్ని పెట్టి డప్పులు వాయించేవారు.
(ఇంకా వుంది)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)






