14, మే 2015, గురువారం

ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు




(నిన్నటి మాటో మొన్నటి ముచ్చటో కాదు చాలా చాలా  పాతకాలం కబుర్లు. నేను పుట్టడానికి పదేళ్ళ ముందు, శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రిగారు అనే ఓ పెద్ద మనిషి, 1935 లోనే  కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు నుంచి చదువుకోసం హైదరాబాదు చేరారు. ఏళ్ళతరబడి హైదరాబాదు నగరంతో తాను  పెంచి పోషించుకున్న అనుబంధాన్ని తన అనుభవాలతో రంగరించి ఆ పెద్దాయన, 'హైదరాబాదు, నాడు - నేడు' అనే పేరుతొ తొంభయ్ పేజీల  పుస్తకం రాసారు. 2008 లో అది ముద్రణకు నోచుకుంది. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి అందులో ఎన్నో విషయాలు అచ్చెరువు గొలిపేలా వున్నాయి. చిన్న పుస్తకం. కానీ అందరూ చదవదగ్గ గొప్ప పుస్తకం. ప్రతులకు, విశాలాంధ్ర బుక్ హౌస్ అని అందులో రాసారు. వెల యాభయ్ రూపాయలు. అందులోని విషయాలు యెంత ఆసక్తికరంగా ఉన్నాయంటే, ఏది ఒదలాలో, ఏది చేర్చాలో తెలియనంత అయోమయంలో పడిపోయాను. పుస్తకంలో అన్నీ మెరుపులే. కానీ బ్లాగు పరిమితుల దృష్ట్యా కుదించి రాయాల్సి వస్తోంది. లక్ష్మీ పతి శాస్త్రి గారి మూల భావానికి న్యాయం చేయడానికే చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అయినా ఏదో లోపం చేసానేమో అన్న అనుమానం   నన్ను బాధిస్తూనే వుంది.  వారికి క్షమాపణలతో కూడిన ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)
ఇక ఇక్కడి నుంచి మాటా పలుకూ అన్నీ శాస్త్రిగారివే:





"అది జూన్ నెల ఇరవయ్యవ తారీఖు, 1935 వ సంవత్సరం. గుడ్లవల్లేరులో వున్న మా ఇంటికి హైదరాబాదులో వున్న మా బావగారి నుంచి టెలిగ్రాం వచ్చింది.
"23వ తేదీతో స్కూళ్ళలో ఎడ్మిషన్లు అయిపోతవి. చిక్కాయిని వెంటనే పంపండి"
"చిక్కాయి నా ముద్దు పేరు.
'చిక్కడు సిరి కౌగిటిలో, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతి లతికావలి, చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్' అనే పోతన పద్యంతో మా అమ్మ నన్ను అలరిస్తూ వుండేది.
"మా నాన్నగారు కోర్టు పనిమీద మద్రాసు వెళ్ళారు. మా అమ్మ దగ్గర దమ్మిడీ లేదు. మర్నాడు రైలు ఎక్కితేకాని హైదరాబాదు చేరలేను. అమ్మ అప్పుచేసి అయిదు రూపాయలు చేతిలో పెట్టింది. పప్పులూ, ఊరగాయలు, పాత్ర సామానులు వున్న రెండు పెద్ద మూటలు కూడా ఒప్పచెప్పింది. రైల్లో ఆ రాత్రి బెజవాడ చేరి మర్నాడు ఉదయం నైజాం బండి ఎక్కాను. సికింద్రాబాదుకు రైలు టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.
"కాసేపట్లో ఎర్రుపాలెం వచ్చింది. ఆ రోజుల్లో పద్నాలుగు ఏళ్ళు దాటని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదని శారదా యాక్టు వుండేది. నైజాంలో అది చెల్లదు. అంచేత పిల్ల పెద్దమనిషి కాకపూర్వమే వివాహం చేయాలనుకునే పూర్వాచారం వారు 'ఎర్రుపాలెం శరణంభవ' అనుకుంటూ అక్కడ ఆ తంతు పూర్తికానిచ్చేవాళ్ళు.
"మహబూబాబాదులో ఎవరో ఒకాయన (ముస్లిం లు ధరించే) ఎర్ర కుచ్చు టోపీతో రైలెక్కాడు. నుదుట రూపాయి కాసంత బొట్టుతో లక్ష్మీ దేవిని తలపిస్తూ పక్కన  ఓ ముత్తైదువ. ఇదేమిటబ్బా అని ఆశ్చర్యపోతుండగా ఆ పెద్దమనిషి టోపీ తీసి పక్కనబెట్టాడు. పిలకున్న బ్రాహ్మణుడాయన.  నిజాం ప్రభుత్వోద్యోగులందరూ ఏదో ఒక  టోపీ ధరించాలి. 'సర్ పే లాల్ టోపీ'
"వరంగల్ స్టేషన్ లో ఆగినప్పుడు దిగి కాణీ పెట్టి  ఓ చక్కిలం కొనుక్కున్నాను. అణా ఇస్తే చిల్లర ఒక కాణీతో పాటు యేవో గీతల మాదిరి అక్షరాలు వున్న రాగి నాణెం ఇచ్చాడు. అది హాలీ అర్ధణా. హాలీ అంటే నిజాం సిక్కా. అక్కడ బ్రిటిష్ సర్కారు సిక్కా, నిజాం సిక్కా రెండూ చెల్లుతాయట. సర్కారు నూరు రూపాయలకు హాలీ నూట పదహారు రూపాయలు. అదీ లెక్క.    
"సికిందరాబాదు చేరిన తరువాత నానా ప్రయాసపడి ఎట్టకేలకు మలక్ పేట లోని మా అక్కయ్య ఇంటికి చేరాను. హైదరాబాదు నగరంతో నా సుదీర్ఘ అనుబంధం నాటి నుంచి,  నా పన్నెండేళ్ళ వయస్సులో మొదలయింది"

(ఇంకా వుంది)

13, మే 2015, బుధవారం

ఐజీ దొరగారికి మిరపకాయ బజ్జీలు ఇష్టం

బుక్ షెల్ఫ్ - 2
ఐజీ దొరగారికి మిరపకాయ బజ్జీలు ఇష్టం
(శ్రీ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయనకు సమాచార సలహాదారుగా వున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ పీవీ.ఆర్.కే. ప్రసాద్ రాసిన 'అసలేం జరిగిందంటే...' అనే పుస్తకం నుంచి)
"నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో జిల్లాలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలను చూడడానికి ఆ నాటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇప్పుడు పోలీసు డైరెక్టర్ జనరల్ హోదాకు సమానం) ఖాన్ గారు వచ్చారు. ఖమ్మం ట్రావెలర్స్ బంగాళాలో మధ్యాన్నం భోజనం చేసాము. మాతో పాటు  ఖమ్మం ఎస్పీ శ్రీ సదాశివరావు, అడిషినల్ ఎస్పీ శ్రీ సుదర్శన్ కూడా వున్నారు.  భోజనంలో అప్పటికప్పుడు తాజాగా వేయించి వడ్డించిన మిరపకాయ బజ్జీలు ఖాన్ గారికి బాగా నచ్చాయి. తిని ఊరుకోకుండా 'చాలా బాగున్నాయి. ఇవి నాకు ఇష్టమని మీకెలా తెలుసు' అని అడిగారు.
ఇల్లెందు చేరిన తరువాత పోలీసు అధికారుల మీటింగు జరిగింది. అక్కడ తేనీటితో పాటు వేడి వేడి మిరపకాయ  బజ్జీలు పెట్టారు. అడవి తోవలో జీపుల్లో గుండాలకు ప్రయాణం మొదలెట్టాం. దారి మధ్యలో రెండు మూడు గూడేల్లో ఆగి గిరిజనులతో మాటా మంతీ. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ కూడా మిరపకాయ బజ్జీలు మళ్ళీ ప్రత్యక్షం.
జీపులో వెడుతున్నప్పుడు వైర్ లెస్ సెట్లలో పోలీసులు మాట్లాడుకుంటున్నారు.
'ఇల్లెందు కాలింగ్ గుండాల. ఐజీ దొరగారి ప్రోగ్రాం. దొరగారితో పాటు, కలెక్టర్ దొరగారు, ఎస్పీ దొరగారు, అడిషినల్ ఎస్పీ దొరగారు కూడా వస్తున్నారు. అంతా సిద్ధమేనా...'
'అంతా రెడీ. దొరగారు ఇల్లెందు ఒదిలారా?'
'ఒదిలి అరగంట దాటింది. ఇంకో గంటలో గుండాల వస్తారు. ఐజీ దొరగారికి మిరపకాయ బజ్జీలంటే మహా పిచ్చి. వేడి వేడిగా అరేంజ్ చేయండి. ఓవర్' అని పెట్టేసాడు.
వైర్ లెస్ సంభాషణ అందరికీ వినబడింది. ఐజీ గారి మొహం ఎర్రబడింది. ఏదో అనబోతుండగా మరో గూడెం వచ్చింది. గుడిసెల పక్కనే కుంపటి, మిరపకాయ బజ్జీలు.
ఖాన్ గారికి కోపం ఆగలేదు.
'ఏమనుకుంటున్నారు. ఏమిటిదంతా! ఇక్కడికి వచ్చింది మిరపకాయ బజ్జీలు తినడానికా!  ఏదో బాగున్నాయి అని మాటవరసకు అంటే ఇంత  హదావిడా!'  అంటూ ఆయన ఆవేశంగా విరుచుకు పడ్డారు. ఎవరూ మాట్లాడలేదు.
ఖాన్ గారు మంచి ఆఫీసరు. నేను పీవీ గారి  దగ్గర ముఖ్యమంత్రి  కార్యదర్సిగా వున్నప్పుడు ఆయన జంట నగరాల కమీషనర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఈ ఉదంతం మొత్తంలో నాకో విషయం అర్ధం కాలేదు. సుదర్శన్ ని పక్కకి పిలిచి అడిగాను.
'ఇప్పుడే కదా ఇల్లెందు పోలీసులు బజ్జీల సంగతి చెప్పింది. అప్పటికే ఈ అడవిలో కుంపట్లు,  వేడి వేడి బజ్జీలు రెడీగా వున్నాయే. ఇదెలా సాధ్యం?'
'ఖమ్మంలో భోజనం చేసేటప్పుడే  ఐజీ గారు మిరపకాయ బజ్జీలు బాగున్నాయని చెప్పారు కదా! అంటే ఖమ్మం నుంచే ఈ కబురు వైర్ లెస్ ద్వారా  అన్ని పోలీసు స్టేషన్ లకీ చేరిపోయి వుంటుంది. అందుకే ఈ అడవిలో కూడా అన్నీ సిద్ధంగా ఉంచారు. ఎందుకయినా మంచిదని ఇల్లెందు వాళ్ళు మిగిలినవాళ్లకు  జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సరఫరాల విషయంలో మా వాళ్ళు చాలా  ఎఫిషియెంట్' అన్నారు సుదర్శన్ నవ్వుతూ.


(అసలేం జరిగిందంటే.... రచన: పీవీఆర్ కే ప్రసాద్, ఎమెస్కో ప్రచురణ)                


12, మే 2015, మంగళవారం

నేర ప్రముఖులు : ప్రముఖ శిక్షలు


(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 14-05-2015, THURSDAY)

ఇప్పుడు దేశంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
సుమారు ఒక వారం రోజుల వ్యవధిలో మూడు రాష్ట్రాలలో మూడు న్యాయస్థానాలు దాదాపు ఒకే రకమైన  న్యాయాన్ని ప్రసాదిస్తూ తీర్పులు ఇచ్చాయి. వాటి మంచి చెడులను ఎంచడం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం కాదు. వింతగొలిపేలా వున్న ఈ తీర్పుల నేపధ్యంలో చరిత్ర పుటల మాటున దాగిన మరికొన్ని తీర్పులను చదువరుల దృష్టికి తీసుకురావడానికే ఈ ప్రయత్నం.


కాలమాన పరిస్తితులను బట్టి చట్టం ప్రకారం నేర స్వభావాలు నిర్ధారించడం జరుగుతుంది. రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్నరోజుల్లో అత్యంత సమర్ద్గుడయిన ఒక బ్యాంకు అధికారి తన వాహనంలో మద్యం సీసాతో పోలీసులకు పట్టుబడి కొద్ది రోజులు జైల్లో వుండాల్సివచ్చింది. ఆ అవమానం భరించలేక ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసారు.  ఆ తరువాత కొద్ది రోజులకే మద్యనిషేధం ఎత్తి వేసారు.  కానీ ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. ఆరోజుల్లో  తాగడం తప్పు. ఇప్పుడు ఖజానా నింపడం కోసం పట్టిబట్టి జనాలచేత అదేపనిగా తాగిస్తున్నారు. మారిన  పరిస్తితులను బట్టి తప్పు ఒప్పుగా ఒప్పు తప్పుగా  మారిపోతున్నాయి. ఈ మార్పులను అతి సహజంగా సమాజం పరిగణిస్తోంది.
మాదక ద్రవ్యాలతో పలుకుబడిన పెద్దలు పోలీసులకు పట్టుబడిన వార్తలు అప్పుడప్పుడు వింటుంటాము. అదే నేరానికి థాయిలాండ్ వంటి దేశంలో మరణశిక్ష విధించే వీలుంది. మానభంగాలు సరేసరి. సకాలంలో విచారణ పూర్తయి నిందితులకు శిక్షపడితే అబ్బురం అనుకోవాలి. అదే కొన్ని మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ నేరానికి పాల్పడ్డ వారికి చేతులు నరికేస్తారు. మానభంగం ఒక్కటే కాదు, దొంగతనం కూడా ఆ దేశాల్లో పెద్ద నేరమే.  ఆనేరం ఘోరం అనుకునేవారికి ఆ శిక్ష తప్పనిపించదు. అయ్యో పాపం అనుకునేవారికి అంత శిక్ష అవసరమా అనిపిస్తుంది.
చిన్న నేరాలకు చిన్న శిక్షలు పెద్ద నేరాలకు పెద్ద శిక్షలు వేయడం కొన్ని దేశాల్లో సంప్రదాయం అయితే, చిన్న నేరానికి కూడా పెద్ద శిక్ష వేయడం కొన్ని దేశాల్లో అనూచానంగా వస్తోంది. జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెట్టనక్కరలేదు. సత్ప్రవర్తనతో బయట పడేవాళ్ళు కొందరయితే రాజకీయ ఔదార్యాలతో శిక్షాకాలం పూర్తికాకుండానే ఇళ్ళకు చేరేవారు చాలామంది. చైనాలో మాత్రం జీవిత ఖైదు అంటే బతికి ఉన్నంత కాలం కారాగారంలోనే వుండాలి. ఎలాటి మినహాయింపులు రాయితీలు వుండవు. అమెరికాలో కూడా దాదాపు ఇంతే. కాకపోతే శిక్షాకాలం తగ్గించే అధికారం ప్రెసిడెంటు ఒక్కరికే వుంటుంది.
రాజకీయ కారణాలతో ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గినవారు అనేకమంది వున్నారు. దక్షిణాప్రికాలో నెల్సన్ మండేలా సుదీర్ఘకాలం అంటే ఇరవై ఏడేళ్ళపాటు జైల్లోనే గడిపారు.
పాలస్తీనా జాతీయుడు నేల్ బార్గౌతి ఏకంగా అక్షరాలా ముప్పయి ఒక్క ఏళ్ళుగా ఇజ్రాయెల్ జైల్లో ఉంటున్నాడు. ఆయన్ని  జైల్లో పెట్టినప్పుడు ఆయన వయస్సు ఇరవై ఒకటి. స్వేచ్చాజీవిగా కంటే ఖైదీగా ఆయన పదేళ్ళు ఎక్కువ గడిపాడన్నమాట. ఆయనకు శిక్షవేసిన న్యాయమూర్తి  ఇన్నేళ్ళని శిక్షాకాలాన్ని నిర్దారించకపోవడం వల్ల  ఎప్పుడు విడుదలయ్యేది ఆయనకీ తెలియదు. ఇది మరో విషాదం.
బర్మా(మియన్మార్) లో సైనిక  ప్రభుత్వం తమ విధానాలను వ్యతిరేకించిన బొమిన్ యోకో అనే ఇరవై ఒక్క ఏళ్ళ వ్యక్తికి  ఏకంగా నూట నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేసి తన కక్ష తీర్చుకుంది.
పొతే, ఇది జరిగింది అమెరికాలో. 2006 లో జార్గియాలోని ఒక న్యాయస్థానం ఇద్దరు నేరస్తులకి ఏడేసి చొప్పున జీవితకాలపు  జైలు శిక్షలను విధించింది. అంతటితో వారిని ఒదిలిపెట్టలేదు. అదనంగా ఒక్కొక్కరికీ రెండువందల అరవై అయిదేళ్ళు చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంత  పెద్ద శిక్ష వేయడానికి వారు చేసిన గొప్ప నేరాలు ఏమిటంటే  సాయుధ దొంగతనాలకు పాల్పడడం.
దీన్ని మించిన శిక్షను ఒక ఇరాన్ న్యాయమూర్తి వేసారు.
1969 లో ఇద్దరు నేరస్తులను విచారించిన ఆ న్యాయమూర్తి వారికి ఒక్కొక్కరికీ ఏడువేల నూట తొమ్మిదేళ్ళు జైలు శిక్ష విధించి నేరగాళ్లకు సింహస్వప్నంగా మారారు.
ఇలా ఏళ్ళకు ఏళ్ళు జైలు శిక్షలు వేసే క్రమంలో అమెరికా న్యాయమూర్తి ఒక రికార్డు నెలకొల్పారు. 1981 లో అలబామా రాష్ట్రంలో డుడ్లె వెన్ కైజర్ అనే వ్యక్తీ ఉబుసుపోక తన భార్యను హత్య చేసాడు. అడ్డం పడ్డ అత్తగారినీ హతమార్చాడు. పనిలోపనిగా తన నేరాన్ని చూసిన ఒక కాలేజీ కుర్రవాడిని కూడా ప్రాణాలతో ఒదిలిపెట్టలేదు. న్యాయస్థానం కూడా కైజర్ మహాశయుడ్ని ఒదలలేదు. పదివేల సంవత్సరాల జైలు శిక్ష వేసి మొత్తం అమెరికా న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
పొతే, అసలు విషయానికి వస్తే కోర్టు శిక్షలనుంచి బయటపడ్డ ప్రముఖులు వున్నారు. వాటిని తప్పించుకోలేక జైళ్లల్లో మగ్గుతున్న గొప్పవారూ వున్నారు.
రెండేళ్ళక్రితం అమెరికాలోని వర్జీనియా మాజీ గవర్నర్ రాబర్ట్ మెక్డోనెల్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కానుకలు స్వీకరించాడు అనే అభియోగాన్ని విచారించిన న్యాయమూర్తి ఆయన్ని దోషిగా నిర్ధారించి కటకటాల్లోకి పంపాడు. కానుకల వ్యవహారం కనుక సహజంగానే అయన గారి భార్యకు సంబంధం వుండే వుంటుందన్న కోణంలో విచారించి ఆవిడను కూడా భర్తతో పాటు జైలుకు సాగనంపారు. 
సరే! నేరం చేసి జైలుకు వెళ్ళడం మామూలే. తెలిసీ తెలియని చిన్నతనంలో చిన్ననేరాలు చేసి జైలు పాలయి తరువాత జీవితంలో చాలా గొప్పవాళ్ళయిన వాళ్ళు కూడా వున్నారు.
ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ పేరు తెలియని వాళ్ళు వుండరు. అయితే ఆయన్ని గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. బాల్యంలో ఆయన ఒక రాత్రల్లా జైల్లో ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఆ రాత్రి జైలు వాతావరణం, పోలీసుల ప్రవర్తన చూసిన హిచ్ కాక్ కు ఆ భయం జీవితాంతం వెంటాడుతూ వచ్చింది.
వినడానికి విచిత్రం అనిపించవచ్చు కానీ ప్రపంచం మొత్తంలో అతి సంపన్నుడయిన వ్యక్తి బిల్ గేట్స్ కి కూడా జైలు ఊచలు లెక్కబెట్టక తప్పలేదు. 1977లో మాంచి యవ్వనంలో వున్న గేట్స్ సరయిన లైసెన్సు లేకుండా కారు నడిపిన నేరానికి పోలీసులు పట్టుకున్నారు. లైసెన్సు లేకపోవడం అటుంచి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర దీపం వెలుగుతున్నా పట్టించుకోకుండా పోవడం ఆయన చేసిన మరో తప్పిదం. ఆ తప్పులకు గాను అయన కొన్ని గంటల సేపు నిర్భంధంలో వుండాల్సివచ్చింది. అంతకుమందు 1975 లో కూడా బిల్ గేట్స్ ని లైసెన్సు లేకుండా కారు నడిపినందుకు, అలాగే 1989 లో న్యూ మెక్సికో సిటీలో  మద్యం సేవించి కారు నడుపుతున్నారనే అనుమానంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసారు. 
ఉపశృతి : అనగనగా ఒక రాజ్యం. దాన్ని ఒక నియంత పాలిస్తున్నాడు. ఆ నియంతకు వ్యతిరేకంగా హాస్యోక్తిగా మాట్లాడుకోవడం కూడా శిక్షార్హమైన నేరం. అలాటి దేశంలో -
ఒక న్యాయమూర్తి  ముద్దాయికి శిక్ష వేసి కడుపుబ్బా నవ్వుకుంటూ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్నాడు.
వెంట వున్న ఆయన స్నేహితుడు అడిగాడు ఎందుకలా నవ్వుతున్నారని.
'జీవితంలో ఇంత గొప్ప జోకు నేనెన్నడూ వినలేదు అందుకే ఇంతలా నవ్వొస్తోంది'
'ఏమా జోకు?  నాకూ చెప్పండి ఆనందిస్తాను' అన్నాడు మిత్రుడు.
'అలా ఎలా. ఆ జోకు చెప్పినందుకే కదా  అతగాడికి పదేళ్ళు జైలు వేసింది'
(12-05-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్ : 98491 30595
NOTE: Courtesy Image owner

11, మే 2015, సోమవారం

బుక్ షెల్ఫ్ ..........


ప్రతి రాజకీయ పార్టీలో క్రమశిక్షణ లేకపోయినా క్రమశిక్షణా సంఘం అంటూ ఒకటి వుంటుంది. 'దొంగవాడికి మడిబట్టలు అడ్డమా' అన్నట్టు ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారిని ఈ సంఘాలు ఏమీ చెయ్యలేవు. కాకపొతే పార్టీ నుంచి బహిష్కరించే వీలుంటుంది. స్వగృహ ప్రవేశం పేరుతొ ఎంచక్కా  తిరిగి పార్టీలో చేర్చుకుంటున్న రోజుల్లో, నిజం చెప్పాలంటే ఎవరికి వారే పార్టీలో తిరిగి  చేరిపోతున్నట్టు పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్న కాలంలో 'బహిష్కరణ వేటు' అనేది  ఏమేరకు ఉపయోగం అనేవారూ వున్నారు.
క్రమశిక్షణ పేరుతొ వేటు వేసేముందు ఆ  సంఘం వారు ఒక నివేదిక ఇస్తారు. అభియోగాలను విచారించేందుకు సీనియర్ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. వారు దర్యాప్తు చేస్తారు. పార్టీ అధ్యక్షుడికి ఒక నివేదిక సమర్పిస్తారు. ఒక పద్దతి అంటూ సాగని  వ్యవహారాలపై విచారణ తతంగం మాత్రం  పద్దతి ప్రకారమే జరుగుతుంది. అలా నియమాలను తోసిరాజని ప్రవర్తించిన సభ్యులను పార్టీ నుంచి తొలగించాలని సంఘం చేసిన సిఫారసును పార్టీ అధ్యక్షులు ఆమోదించి తదనుగుణంగా ఆ సభ్యుడిని బహిష్కరించినట్టు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటారు. అయితే సంఘాల నివేదికల్లో ఏమి పేర్కొన్నదీ బయట ప్రజలకి తెలియదు. పార్టీలో వారికీ తెలియదు. కానీ కొన్ని సందర్భాలలో ఆ అంశాలు బహిర్గతం అవుతుంటాయి. అలా మరుగున పడిపోయిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తుంటాయి.
అలాటి సందర్భం తెలుగుదేశం అధినాయకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నకాలంలో జరిగింది. ఎన్టీఆర్ హయాములో తెలుగు దేశం పార్టీకి సుశిక్షితమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేరుండేది. అలాటి ఆ పార్టీలో,  సీనియర్ సభ్యురాలయిన రేణుకా చౌదరిపై ఒక సారి ఇలాగే త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు జరపమని స్వయానా పార్టీ అధ్యక్షులవారే ఆదేశించారు. శ్రీమతి టీ.ఎన్. సదాలక్ష్మి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రతాపరెడ్డి త్రిసభ్య కమిటీలో  సభ్యులు. సమావేశం అనంతరం  ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇలా వుంది.
"ఇది నా ఆఫీసు, ఈ సిటీ నాది. ఈ సిటీ మొత్తం మీద పెత్తనం నాది. నా అనుమతి లేకుండా నువ్వు (బుచ్చయ్య చౌదరి) ఎవడవురా రావడానికి? వాడు (ఎన్టీఆర్) ఎవడురా పంపడానికి? కొడకా! చేపలు అమ్ముకునే వెధవా? ఏం పీకుతావురా? ఇదేమన్నా గోదావరి అనుకున్నావా?" అని రేణుకా చౌదరి లంకించుకునేసరికి సమావేశాన్ని వాయిదా వేసుకుని త్రిసభ్య సంఘం వారు బయట పడ్డారు. అయినా ఆమె ఒదిలిపెట్టలేదు. తన అనుచరులకు బుచ్చయ్య చౌదరిని చేయితో చూపిస్తూ, 'డక్కా మారో సాలేకో!' అంటూ రేణుకా చౌదరి వారి వెంట పడ్డారు.
ఇంత  జరిగిన తరువాత కూడా రాజీ కుదర్చడానికి ఆఖరు నిమిషంలో పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రాజీ కోసం తాము  చేసిన ప్రయత్నాలను కమిటీ సభ్యురాలు సదాలక్ష్మికి  వివరించారు. అటు రేణుకా చౌదరి ప్రతిష్ట దెబ్బతినకుండా, ఇటు   రామారావు ఆదేశాన్ని పాటించే విధంగా 'తెలియకుండా జరిగిపోయింది. క్షమించాలి' అని కోరుతూ ఒక లేఖ ఎన్టీఆర్ కి అందచేయాలని తామూ,  చంద్రబాబు నాయుడు రేణుకా చౌదరిని కోరామనీ, అందుకు ఆవిడ కూడా అంగీకరించారనీ, అయితే తెల్లారేసరికల్లా ఏం జరిగిందో కాని మొత్తం పరిస్తితి మారిపోయిందనీ సదాలక్ష్మి చెప్పారు. శ్రీ రామారావుకు ఇష్టం లేకున్నా ఆయనకు నచ్చచెప్పి ఈ రాజీ ప్రయత్నాలు చేసామని సదాలక్ష్మి తెలపడం విశేషం. ఇంత చేసినా పార్టీ నుంచి రేణుకా చౌదరి బహిష్కరణ తప్పలేదు. ఈ ఉదంతాన్ని చంద్రబాబు నాయుడికి ఓటమిగా, దగ్గుబాటి, లక్ష్మీ పార్వతి వర్గాల విజయంగా అప్పట్లో పార్టీలో పరిగణించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ తరువాత రేణుకా చౌదరి లెక్క చేసేది ఒక్క చంద్రబాబునే. ఆమె అంటే బాబుకు కూడా అభిమానం. అందుకే రేణుక  బహిష్కరణ పట్ల ఆయన ఖిన్నులయ్యారు.
బహిష్కరణ నిర్ణయంతో రేణుకా చౌదరి ఏ మాత్రం బెదరలేదు. పైపెచ్చు సంచలన వ్యాఖ్యలు చేసారు. 'నన్ను బహిష్కరించి ఎన్టీఆర్ ఇన్నాల్టికి మగాడనిపించుకున్నాడు. థాంక్స్.' ఇదీ ఆవిడ ప్రతిస్పందన.
(తదనంతర కాలంలో వడివడిగా సాగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, రేణుకా చౌదరిని తిరిగి తెలుగు దేశం పార్తీలోకి చేర్చుకోవడం జరిగాయి.  కాని, రేణుక ఇమడ లేకపోయారు. మూడోసారి రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వనందుకు బాబు వైఖరిపై కినిసి రేణుకా చౌదరి, కాంగ్రెస్ లో చేరి 1999 ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్టుపై ఖమ్మం నుంచి లోక సభకు ఎన్నికయ్యారు) 

  

(సీనియర్ జర్నలిష్ట్  ఐ. వెంకట్రావు, ఎన్టీ రామారావు పై రాసిన  'ఒకే ఒక్కడు' పుస్తకం ఆధారంగా)                   

9, మే 2015, శనివారం

స్వచ్చ భాగ్య నగరం : మంచి కార్యక్రమం

(Published in 'SURYA' telugu daily in it's edit page on 10-05-2015, SUNDAY)

నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో  స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు  ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్  ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.   
అప్పటినుంచి ఇప్పటివరకు ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోయాయి. పరిస్తితులు కాసింత మెరుగుపడ్డాయేమో కాని పూర్తిగా మారిపోయిందని చెప్పలేని పరిస్తితి ఈనాటికీ మిగిలివుంది.
ఇన్నేళ్ళ కాలంలో తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగల అనేక ఘన విజయాలను ఎన్నింటినో స్వతంత్ర భారతం సాధించింది. అయినా కానీ, పరిసరాల పరిశుభ్రత విషయంలో ఇంకా తలదించుకోవాల్సిన స్తితిలోనే వుంది. సిగ్గుపడుతూ ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది.
విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారిని ఎవరినయినా కదిపి చూడండి. వాళ్ళు చెప్పేది ఒక్కటే.   
'నిజమే. మంచి రోడ్లు పడ్డాయి. మంచి సౌకర్యాలు వున్న భవంతులు కట్టారు. మంచి మంచి కార్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. మంచి నాణ్యత కలిగిన వస్తువులు దొరుకుతున్నాయి. అమెరికా వంటి దేశాలతో పోటీగా మంచి మంచి జీతాలు ఇచ్చే కంపెనీలకు కూడా కొదవలేదు. అంతా మంచిగానే వుంది. లేనిదల్లా స్వచ్చమైన వాతావరణం. పరిశుభ్రమైన పరిసరాలు. ఇవి గనక మన దేశంలో  వుంటే ఇక విదేశాలను పట్టుకుని బయటే  వేళ్ళాడే వాళ్ళు ఉంటారని ఎవ్వరం అనుకోవడం లేదు.'
అమెరికా వంటి దేశాల్లో స్థిరపడ్డ యువతీ యువకులు అనేకమంది స్వదేశం తిరిగి రావడానికి విముఖత చూపుతూ చెప్పే ప్రధాన కారణాల్లో ఇదొకటని తెలుసుకున్నప్పుడు  ఎంతో బాధ వేస్తుంది.  ఒకానొక కాలంలో ప్రపంచ దేశాలకు పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం ఎలాటిదో  ప్రబోధించిన ఘనత  భారత దేశానిది. ఇప్పుడదే అంశం దేశానికి తలవంపులు తెచ్చే విషయంగా మారడం యెంత విషాదం.
విదేశాల్లో స్థిరపడ్డ మన వారిని అలా వుంచండి.
'ఇక్కడికి రండి. అన్ని సదుపాయాలు కల్పిస్తాం. పరిశ్రమలు పెట్టండి' అనే నినాదంతో మన నాయకులు రోజుకోదేశం చుట్టబెడుతున్నారు.వారి ఆహ్వానాలు అందుకుని   అలా వద్దామని అనుకున్న వారికి కూడా మన దేశంలో 'చెత్త' సమస్యే ముందుగా అడ్డుపడుతోంది.
బహుశా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' నినాదం ఎత్తుకోవడానికి ముందుగా 'స్వచ్చ భారత్' ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి కూడా ఇదే ప్రధాన కారణం అయివుంటుంది.
కొన్ని రోజులు హడావిడి తరువాత ఆ ఉద్యమం కాస్త సద్దుమణిగిన ఛాయలు కానవచ్చే తరుణంలో తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దానికి కొత్త ఊపిరి ఊదే ప్రయత్నం మొదలు పెట్టారు.
హైదరాబాదును విశ్వనగరంగా తయారు చేయాలంటే ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు వుంటే సరిపోదని, కాలుష్య రహిత స్వచ్చ నగరంగా తీర్చిదిద్దినప్పుడే భాగ్య నగరానికి ఆ శోభ దక్కుతుందని గ్రహించి కాబోలు, రెండు బృహత్తర కార్యక్రమాలను కేసీఆర్ తలపెట్టారు. అందులో ఒకటి ఆదిలోనే అనేక విమర్సలకు దారి తీసింది. నగరం నడిబొడ్డున, దుర్గంధ కాసారంగా తయారయిన హుసేన్ సాగర్ సరస్సును మంచి  నీటి తటాకంగా మార్చి దానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న తెలంగాణా ముఖ్యమంత్రి అభిమతానికి అనుగుణంగా అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించారు. వెనువెంటనే,  కొన్ని రాజకీయ పరమైన ఆరోపణలు, మరి కొన్ని న్యాయపరమయిన చిక్కులు ఎదురయ్యాయి. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వానికి కొంత ఊరట,  ప్రభుత్వ ప్రయత్నాలకు కొంత బాసట దొరికింది. ఏళ్ళ తరబడి హుసేన్ సాగర్ లోకి చేరుతున్న భయంకర రసాయనిక వ్యర్ధాలను తొలగించే క్రమంలో మరింత వాతావరణ  కాలుష్యం ఏర్పడి, ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం వుండగలదని పర్యావరణ ప్రేమికుల అనుమానం. అందులో కొంత నిజం ఉండవచ్చు. కానీ రసాయనిక వ్యర్ధాలు ఇప్పటి మాదిరిగానే ఆ సరస్సులో ఇలాగే పేరుకుపోతూ వుంటే భవిష్యత్తులో ఆ సరస్సు ఉనికి మరింత ప్రమాదకారిగా మారే అవకాశాలు కూడా వుంటాయి. వ్యాధికంటే చికిత్స ప్రమాదకరం అనే వాదన వున్నా, ప్రస్తుత పరిస్తితుల్లో ప్రక్షాళనే ఉత్తమ పరిష్కారం అవుతుంది. సాధారణంగా పాలకులకు ఇటువంటి ఆలోచనలు కలగడమే అపూర్వం. అలాటి ప్రతిపాదనలను మరింత మెరుగు పరచి ఏవైనా లోపాలు వుంటే సరిదిద్దే ప్రయత్నాలు జరగాలి కానీ, అసలుకే మోసం వచ్చేలా మోకాలు అడ్డడం కూడా మంచిది కాదు. గతంలో హుసేన్ సాగర్లో గుర్రపు డెక్క సమస్య చాలామందికి గుర్తుండే వుంటుంది. నిర్విరామ కృషి కారణంగా సాగర్ కు ఆ సమస్య శాస్వితంగా తొలగిపోయింది. ఇప్పుడు హుసేన్ సాగర్ ప్రక్షాళన కూడా అదేవిధంగా పూర్తయితే జంట నగరాలకు కొత్త అందాలు అద్దినట్టు అవుతుంది.  

   

స్వచ్చ నగరంగా మార్చాలనే నే ప్రయత్నం యెంత మంచిదో ఆలోచన అంత భారీ స్థాయిలోనే వుంది. ప్రధాని మోడీ జాతికి అందించిన స్వచ్చ భారత్ నినాదానికి కేసీఆర్ తన ఆలోచనలతో మరిన్ని మెరుగులు దిద్దారు. మొత్తం తెలంగాణాను, ముందుగా రాజధాని నగరాన్ని కాలుష్య రహిత పరిశుద్ధ నగరంగా రూపొందించాలని పధకాలు తయారు చేసారు. హైదరాబాద్ నగరాన్ని ఇందుకోసం 400 విభాగాలుగా చేసి ఒక్కొక్క దానికి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులను బాధ్యులుగా వుంచి ఒక నిర్ణీత కాలవ్యవధిలో నగరంలో పేరుకు పోతున్న చెత్త సమస్యకు శాస్వితంగా ఒక మంచి పరిష్కారం కనుగొనడం ఈ మొత్తం కసరత్తు లక్ష్యం. ఈ మహాయజ్ఞంలో స్వచ్చందంగా పాలుపంచుకోవడానికి ముందుకువచ్చే  పౌరులతో, చిన్న చిన్న బృందాలు ఏర్పాటు చేస్తారు. నగరంలోని మారు మూల ప్రాంతాలలో  పోగుపడిన చెత్తను గుర్తించే బాధ్యత ఈ బృందాలు తీసుకుంటాయి. రెండు రోజుల్లో ఈ బృందాలు  నివేదికలు ఇస్తాయి. ఈ నెల పదిహేనవ తేదీకల్లా నగర నివేదిక తయారవుతుంది. ఆ మరునాడు అంటే పదహారో తేదీన స్వచ్చ హైదరాబాదు కార్యక్రమం మొదలవుతుంది. రెండు మూడు రోజుల వ్యవధిలోనే నగరం మొత్తంలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెత్తను తొలగించేందుకు అవసరమైన వాహనాలను, సిబ్బందినీ  నగర పాలక సంస్థ సమకూరుస్తుంది. ఇళ్ళలో పోగుపడిన తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి  పారవేయడానికి ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను ప్రభుత్వమే అందచేస్తుంది.
విశ్వనగరంగా మార్చే  క్రమంలో హైదరాబాదును పరిశుద్ధ నగరంగా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్   ఆలోచనను ఎవ్వరూ తప్పుపట్టలేరు. వచ్చిన చిక్కల్లా, ఆలోచనలకు, ఆచరణకు మధ్య పెరిగిపోతున్న దూరమే.  అనుభవాలు తెలియచెప్పుతున్నది కూడా ఇదే.  దీనికి తాజా ఉదాహరణ, మొన్నీ మధ్య నగరంలో అట్టహాసంగా నిర్వహించిన టీ ఆర్ ఎస్ ఆవిర్భావ సభలే. ఆర్భాటంగా నగరాన్ని గులాబీ తోరణాలతో ముంచెత్తి వేసారు. ఆ తరువాత వాటిని తొలగించే నాధుడే లేదు. చెత్త పేరుకుపోవడానికి ఇలాటివి కూడా కారణాలే అన్న సంగతి మరువకూడదు.  
గతంలో ప్రధాని నరేంద్ర  మోడీ స్వచ్చ భారత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు జరిగిన హడావిడి అందరికీ గుర్తే. వారణాసిలో ప్రధాని మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఆసేతు హిమాచలం వెల్లువలా సాగింది. ఇంకా సాగుతోంది.   కానీ ఫలితాలు ఆ స్థాయిలో లేవన్నది మాత్రం నిర్వివాదాంశం. ఖరీదయిన దుస్తులు ధరించిన నాయకులు, అధికారులు, సంఘంలో అత్యంత గౌరవ స్థానాల్లో వున్న ప్రముఖులు    చేత చీపుర్లు పట్టి వీధుల్ని శుభ్రం చేస్తున్న దృశ్యాలు కోకొల్లలుగా మీడియాలో కానవచ్చాయి. ఇళ్ళకు వెళ్ళగానే వాళ్ళందరూ తమకంటిన మురికిని ఒదిలించుకునే వుంటారు. ఆ మురికితో పాటే ఇంత  గొప్ప కార్యక్రమం కొనసాగింపు ఆలోచన  కూడా ఒదిలిపోయేవుంటుంది.
స్వచ్చ భారత్ ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో  సాగించాలనేది నేతల తలంపు. అసలీ ఉద్యమం ప్రజలనుంచి మొదలు కావాలి. అందుకు ప్రభుత్వ సహకారం కావాలి. ఎవరింటిని వారు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చేసే కృషిలో పదోవంతు తమ పరిసరాల పరిశుభ్రత పట్ల కూడా కనబరిస్తే ఈ చెత్త సమస్య ఇంత చెత్తగా మారివుండేది కాదు.
సరే! చెత్తను తొలగించాలనే కార్యక్రమం ఏ కోణం నుంచి చూసినా మంచి కార్యక్రమమే. ఇది ఏదో మొక్కుబడిగా కాకుండా నిరంతరం జరుగుతూ పోతేనే  మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే, కంటికి కనబడే చెత్తను మాత్రమె కాదు, కనబడని  మానసిక కాలుష్యాన్ని కూడా ఏదో ఒక మేరకు తగ్గించుకోగలిగితే సమాజానికి మరింత మేలు జరుగుతుంది.   
ఉపశృతి: ఇద్దరు సన్యాసులు అడవి మార్గాన వెడుతున్నారు. దారిలో యేరు అడ్డం  వచ్చింది. కాలి గాయంతో అక్కడ కూలబడి వున్న ఓ అందమైన యువతి వారికి కనిపించింది. ఇద్దరిలో ఒకడు ఆమెను రెండు చేతులతో ఒడిసిపట్టుకుని యేరు దాటించి వొదిలివేసాడు. దగ్గరిలోవున్న  గ్రామం చేరేవరకు ఉగ్గపట్టుకుని వున్న  రెండో సన్యాసి తన మనసులో మాట బయట పెట్టాడు. 'నువ్వా అమ్మాయిని అలా మోసుకురావడం ఎందుకో నాకు అంత  మంచిగా  అనిపించ లేదు'
మొదటి సన్యాసి బదులు చెప్పాడు.
'నేనా అమ్మాయిని అప్పుడే, అక్కడే  దించి వేశాను. నువ్వే ఇంకా ఆమెను మనసులో పెట్టుకుని మోస్తున్నావు'  
(09-05-2015)  
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595

  

5, మే 2015, మంగళవారం

కావాల్సింది పట్టుదల- పంతాలు కాదు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 07-05-2015, THURSDAY)

మొన్నీమధ్య కారులో  వెడుతున్నప్పుడు  హైదరాబాదులో నిర్మాణంలో వున్న మెట్రో ని గమనిస్తూ డెబ్బయ్యవ పడిలో పడ్డ ఒక పెద్దమనిషి, తన జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకున్నారు.
"అత్యంత పొడవైన  పీవీ నరసింహారావు హైవే నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినప్పుడల్లా ఈ హైవే నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు దానిమీద ప్రయాణం చేద్దామా అనే కోరిక దారిపొడుగునా  నాలో సుళ్ళు తిరుగుతూ వుండేది. చూస్తుండగానే అది పూర్తికావడం, ఆ మార్గంలో అనేక వందల సార్లు ప్రయాణించడం జరిగిపోయింది.
"అల్లాగే ఔటర్ రింగ్ రోడ్డు. అదీ అంతే. ఇంత  పెద్ద ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారో, ఎప్పుడు చూస్తానో అనుకునేవాడిని. ఆ కోరికా తీరిపోయింది. ఇక ఈ మెట్రో. రేపో మాపో ప్రారంభం అని వార్తలు వింటున్నాను.


(చాలా ఏళ్ళ కిందట హుస్సేన్ సాగర్ మొత్తం ఇలా  గుర్రపు డెక్కతో నిండి వుండేది) 

"గతంలో హుసేన్ సాగర్ తటాకం గుర్రపు డెక్క మొక్కలతో మొత్తం పచ్చగా పాచిపట్టినట్టు అసహ్యంగా కానవచ్చెది. అధికారులు ఎన్ని సార్లు ఎన్ని తాత్కాలిక ప్రయత్నాలు చేసినా, గుర్రపు డెక్క మాత్రం ఖండించిన రావణాసురుడి శిరస్సుల మాదిరి తిరిగి మొలుచుకు వచ్చేది. దరిమిలా ఆ కార్యక్రమాన్ని ఒక యుద్ధప్రాతిపదికపై తలకెత్తుకున్న తరువాత ఆ  గుర్రపు డెక్క పీడ హుస్సేన్ సాగర్ కి శాస్వితంగా తొలగిపోయింది. ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, హుసేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మార్చి దానికి పూర్వ వైభవం తీసుకురావాలనే బృహత్తర ప్రయత్నం మొదలు పెట్టారు. అది సాకారం అయి అది కూడా చూడగలిగితే ఎంతో అదృష్టం అనుకుంటాను.
"పొతే,  'అమరావతి' (ఆంద్ర ప్రదేశ్ కొత్త రాజధాని) ని  కూడా కళ్ళారా చూడాలనే కోరిక నాలో నానాటికీ  పెరుగుతోంది'
నిజానికి ఇదేమంత తీరని కోరికేమీ కాదని  నాకప్పుడు  అనిపించింది. ఎందుకంటె ఈ రోజుల్లో నిర్మాణ రంగంలో వచ్చిన పురోగతి అలాటిది.  ప్రభుత్వాలకు, పాలకులకు  పట్టుదల, చిత్తశుద్ధి ఉండాలే కాని సాధ్యం కానిది ఏదీ లేదు. చైనాలో కేవలం పదిహేను రోజుల్లో ముప్పై అంతస్తుల భవనం నిర్మించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, గతంలో మాదిరిగా ప్రతి పైసాకు వెతికి చూసుకోవాల్సిన పరిస్తితులు ప్రభుత్వాలకు ఈనాడు లేవు. అన్నీ 'బీవోటీ' (బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్)  అనే కొత్త పారిభాషిక పదం   చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. సక్రమంగా ప్రణాళిక తయారు చేసి, పారదర్శకంగా టెండర్లు పిలిచి పనులు ఒప్పచెప్పడమే తరువాయి మిగిలిన పనులన్నీ  వాళ్ళే చూసుకుంటారు. యెంత పెద్ద ప్రాజెక్టు అయినా సరే కాంట్రాక్టుకు తీసుకున్న కంపెనీలే మొత్తం భారాన్ని  తమ నెత్తికి ఎత్తుకుంటాయి. ఇప్పుడు మన కళ్ళెదుట కానవస్తున్న మెట్రో రైలు మార్గం, ఔటర్ రింగు రోడ్డు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దేవుడు మేలు చేస్తే రేపో మాపో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో సాకారం కాబోతున్న అనేకానేక ప్రాజెక్టులు, ఇవన్నీ ప్రత్యక్ష తార్కాణాలు.  కాకపొతే లాభం లేని పనులు చేయడానికి  ఏ వ్యాపారీ ముందుకు రాడు అన్న నిజం తెలిసికూడా ప్రభుత్వాలు ఈ మార్గాన్నే ఎంచుకోవడానికి కారణం  తమపై ఎలాటి ఆర్ధిక  భారం లేకపోవడమే. ఇంతంత గొప్ప నిర్మాణాలను ఇంత  తక్కువ వ్యవధిలో ప్రభుత్వాలు ఇంత చక్కగా ఎలా చేయగలుగుతున్నాయి  అని ఎవరయినా అమాయకంగా అనుకుంటే,  ఆ   'ఖ్యాతి' కూడా అప్పనంగా వాటి  ఖాతాలోనే పడిపోతోంది.  కాకపొతే ఆ నిర్మాణ వ్యయాన్ని వడ్డీతో సహా వినియోగదారులనుంచి 'టోల్ టాక్సు' పేరుతొ అనేక సంవత్సరాలపాటు ఆ కంపెనీలు ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటాయి. గుడారంలో కాళ్ళు చాపుకోవడానికని చెప్పి మొత్తం ఆక్రమించిన ఎడారి ఒంటె కధ గుర్తుకువస్తే చేయగలిగింది లేదు.   అదే వేరే కధ. ఆ వ్యధతో ఏ ప్రభుత్వాలకీ నిమిత్తం వుండదు.
ఆంద్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వచ్చే నెలలో శంకుస్థాపన జరగబోతోందని సమాచారం. ఇప్పటికే ఆలస్యం అయిందని అనుకుంటున్న ఈ కార్యక్రమానికి శుభారంగం జరగబోవడం ఆహ్వానించతగిన పరిణామం. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త రాజధాని నిర్మాణం జరపాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తలపోస్తున్నారు. ఆయన ఆలోచనలన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా క్షేత్ర స్థాయిలో ఒక స్వరూపానికి వస్తే ప్రపంచపటంలో కొత్త రాష్ట్రానికి సరికొత్త స్థానం దొరకడం ఖాయం. అయితే ఆలోచనలు ఆకాశం,లో ఆచరణ అఘాధంలో అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలను తిప్పికొట్టాలంటే కేవలం మంత్రులు అప్పుడప్పుడూ ఇస్తున్న హామీ  ప్రకటనలు ఎంతమాత్రం సరిపోవు. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి. అవీ త్వరత్వరగా.
ఈ సందర్భంలో కొన్ని రాజధానుల నిర్మాణం గురించి చరిత్ర చెప్పే వాస్తవాలను వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
మన దేశం ఎల్లలు దాటి కొత్త దేశాల్లో కొత్తగా కాలుమోపేవారు ముందు కళ్ళార్పకుండా చూసేది అక్కడి భవన నిర్మాణ కౌశలాన్ని. మన  దేశానికి యాత్రీకులుగా వచ్చే విదేశీయులు సయితం అత్యంత  ఆసక్తిగా గమనించేది కూడా, చూడాలని తాపత్రయ పడేది  ఎప్పుడో పూర్వకాలంలో  రాజులు, నవాబుల హయాములో  నిర్మించిన తాజ్ మహల్ వంటి నిర్మాణాలనే  అనే నిజాన్ని గమనంలో వుంచుకోవాలి. ఇవన్నీ ఒక్క రోజులో నిర్మించినవి కావు. ఏళ్ళతరబడి కష్టపడి, చెమటోడ్చి  నిర్మిస్తేనే వాటికి ఒక ఆకారం వచ్చింది.
ఉదాహరణకు దేశ రాజధాని కొత్త ఢిల్లీ నగరం తీసుకుంటే అక్కడి నిర్మాణాలు, రహదారులు, ఉద్యానవనాలు ప్రపంచంలో ఏ నగరానికీ తీసిపోనంత ఘనంగా వుంటాయి. ఇది చాలామందికి తెలిసిన విషయమే.
కాసేపు  చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తె -
1911 డిసెంబరు 12 న  ఢిల్లీ దర్బార్ జరిగింది. కొత్త ఢిల్లీ నగర నిర్మాణానికి బ్రిటిష్ చక్రవర్తి అయిదో జార్జి శంకుస్థాపన చేసారు. అప్పటివరకు కలకత్తాలో వున్న దేశ రాజధానిని ఢిల్లీకి తరలిస్తున్నట్టు ఆయన ప్రకటన చేసారు. బ్రిటిష్ నిర్మాణ శిల్పులు సర్ ఎడ్విన్ లుటేన్స్, సర్ హర్బర్ట్ బెకర్ కొత్త రాజధాని నమూనా తయారు చేసారు. నగర నిర్మాణ కాంట్రాక్ట్ ను సర్ శోభాసింగ్ కు ఒప్పచెప్పారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం వంటి కారణాలవల్ల నిర్మాణంలో ఆలస్యం జరిగింది. దాదాపు ఇరవై ఏళ్ళు సాగిన రాజధాని నిర్మాణం ఎట్టకేలకు  1931లో పూర్తయింది. అదే ఏడాది ఫిబ్రవరి నెలలో అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేసారు. రాష్ట్రపతి భవన్ (వైస్రాయ్ నివాస భవనం)  వంటి కళ్ళు చెదిరే కట్టడాలు, అద్భుతమైన రహదారులు, సుందర ఉద్యానవనాలతో కూడిన కొత్త రాజధాని కళ్ళెదుట నిలిచింది. ప్రపంచపటంలో తనకంటూ ఒక సుస్థిర స్థానం దక్కించుకుంది.       
1926 లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నిర్మాణం ఒకే ఒక్క ప్లాటుఫారంతో మొదలయింది. కనాట్ ప్లేస్ పేరుతొ అధునాతన షాపింగ్ ప్లాజా నిర్మాణాన్ని నాలుగేళ్ల కాలవ్యవధిలో పూర్తిచేశారు.
ఆంద్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి'  నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ముందు పేర్కొన్న పెద్దమనిషి ఎదురుచూస్తున్నట్టే,  కొత్త రాష్ట్రంలో కోట్లాది ప్రజలు కూడా  ఎదురు చూస్తున్నారు. వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్టుగా ఈ ప్రయత్నానికి ఆదిలోనే ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు. కొన్ని వచ్చి పడ్డవి. కొన్ని తెచ్చి పెట్టుకున్నవి.
రాజధాని కూడా లేకుండా ఆవిర్భవించిన నూతన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అతి త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఎంతయినా వుంది. దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఇది రాజకీయ అవసరం. అంతకు మించి ప్రజల అవసరం.  నిర్మాణ ప్రాంతంలో వందలాదిమంది రైతులు వేలాది ఎకరాల పంట భూములను స్వచ్చందంగా ప్రభుత్వానికి ఒప్పగించారని సర్కారు గణాంకాలు తెలుపుతున్నాయి. అయినా అక్కడ అక్కడక్కడా సమీకరణకు సంబంధించి తలనొప్పులు తప్పడం లేదు. ఒక పెద్ద ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఇలాటివన్నీ అతి సహజం. ఒంటిపైన వస్త్రం ముళ్ళ కంచెకు తగిలినప్పుడు ఒడుపుగా ముళ్ళను తప్పించే ఓర్పు కావాలి. ప్రతి పక్షాలు అనవసర యాగీ చేస్తున్నాయని ప్రత్యారోపణలు చేస్తూ పోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు. సరికదా అనుభవశాలి చెప్పాల్సిన మాటలు కాదని సామాన్య ప్రజలు కూడా సందేహించే ప్రమాదం పొంచి వుంటుంది.
ఈ సందర్భంలో పాలకులకు కావాలిసింది గట్టి పట్టుదల. అంతే  కాని అనవసరమైన 'పట్టుదలలు, పంతాలు' కాదు.
(05-05-2015)

రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

2, మే 2015, శనివారం

పురుషులు : పుణ్య పురుషులు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY IN IT's EDIT PAGE ON 03-05-2015,SUNDAY)

ఒకానొక కాలంలో జిల్లాను  మొత్తం తమ కనుసన్నల్లో శాసించే  జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్  పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.
అలాటి కాలంలో, ఒకానొక  జిల్లాలో,  కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని  ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద  వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న  కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ  కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం  ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి  బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు   ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్  తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా  జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు  టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని  సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే  మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే  కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు.  ఆ వెనువెంటనే  కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి  పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు.  కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.  
పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నట్టు అధికారుల్లో కూడా పుణ్యమూర్తులయిన అధికారులు వుంటారు అని చెప్పడానికే ఈ సోదాహరణ.           
ఈ యాభై ఏళ్ళలో అనేక మార్పులు వచ్చాయి. జిల్లాకు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి మాత్రమె వుండే  పద్దతి మారి జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చారు. టార్పాలిన్ పట్టాలు వున్న జీపులు పోయి అధునాతన వాహన శ్రేణి వచ్చి చేరింది. జిల్లా మొత్తంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలియచెప్పే సమాచార  వ్యవస్థ చేతికి అంది వచ్చింది. సిబ్బంది పెరిగారు. జనం ఇబ్బందులూ పెరిగాయి. మరీ అంతలా కాకపోయినా, రాజకీయ అవరోధాలను అధిగమించి, పదిమందికి పనికి వస్తాయని తాము అనుకున్న మంచి పనులను అనుకున్న రీతిలో చేసి పెట్టె అధికారులు కూడా మన మధ్యనే వున్నారు.

(సురేష్ చందా)

ఇప్పుడు అలాటి ఓ మంచి అధికారి చేసిన ఓ మంచిపని గురించి రెండు రోజులుగా మీడియాలో మంచి మంచి కధనాలు వస్తున్నాయి.
సురేష్ చందా అనే ఆ అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే ఐ.ఏ.ఎస్. అధికారి. యువకుడు  కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని ఆయన భావించారు. తెలంగాణాలో పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో  సచివాలయంలోని తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన  బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను  ఎలా పనిచేస్తున్నది కూడా  నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను ఒక్కరే కాకుండా ఎవరయినా సరే  చూడగలిగేలా ఇంటర్నెట్ తో దాన్ని  అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత. 'సమాచార చట్టం ప్రకారం ప్రజలకు తెలుసుకునే హక్కు వచ్చింది. వాళ్ళు అడిగితె ఇవ్వడం కాకుండా అడక్కుండానే యావత్ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేమిట'నేది ఈ అధికారి అభిప్రాయం. తన దృష్టికి వచ్చిన ఫైళ్ళపై తాను  రాసిన నోట్ వివరాలను కూడా వెంటవెంటనే ఆయన ఇంటర్నెట్లో పెడుతుంటారని  పత్రికల్లో చదివినవారికి ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. అవసరానికి మించిన గోప్యతను అధికారులు పాటించడం వారికో అలవాటని జనంలో ఒక అభిప్రాయం బలంగా నాటుకుని ఉండడమే ఇందుకు కారణం. తాము చెప్పినది సావకాశంగా విని, కోరిన సమాచారం ఓ మేరకయినా అధికారులు అందించగలిగితే, తమ సమస్య సగం పరిష్కారం అయిందని సంతోషించే సామాన్యుల సంఖ్య కూడా అధికమే.
'అనుమతి లేకుండా పురుగు కూడా ప్రవేశించలేని అతి శీతల గదుల్లో కూర్చుని అధికారులు ఏం చేస్తుంటారు?' అనే అనుమానం సాధారణ జనంలో వుంది. అ అధికారుల గదుల్లోకి కనీసం తొంగి చూడడానికి కూడా వీలుపడని  వారికి సురేష్ చందా అనే ఈ అధికారి చేస్తున్నది అబ్బురం అనిపించడంలో సందేహం లేదు.    
అడగగానే మెచ్చి వరాలు ఇచ్చే దేవుళ్ళకు మన పురాణాల్లో కొదవలేదు. అడగకుండానే సమాచారం ఇవ్వాలనే అభిమతం కొందరు అధికారుల్లో అయినా ఊపిరి పోసుకోవడం  అభిలషణీయం. ఆహ్వానించదగ్గ పరిణామం .
మొత్తం పరిపాలన ఇలా ప్రజల  కళ్ళ ముందు జరగడం అంటూ జరిగితే పాలకుల పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసహనం ఓ మేరకయినా తగ్గడం కూడా  ఖాయం.   (02-05-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595