5, ఏప్రిల్ 2015, ఆదివారం

సభకి నమస్కారం

(నిన్న - 04-04-2015 -  సాయంత్రం హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మంటపం మందిరంలో అరోరా పీజీ కళాశాల వార్షికోత్సవంలో నేను చేసిన ప్రసంగపాఠం)
సభకి నమస్కారం -
ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల'  సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లు,  ప్రతివక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.
సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడకపోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పదినిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఎక్కువ కాకూడదు, అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.
అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో  సందేహం.
మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.
పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని  వ్యక్తీకరించలేవు. అయితే  ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి. మాటలు రాని పాపాయి మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.
గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర  సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది. 
అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయివుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని  మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం  మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని,  మంచినే  మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.
విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి. ఉపాధ్యాయులు చెప్పే  మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అలా మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది. అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది. ఇందులో ఇంత  విషయం వుంది  కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.
షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు, యేవో కొన్ని ఉద్భొదలు చెప్పి వెళ్లిపోవచ్చు. మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది.  సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అల జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ  బెంగ అక్కరలేదు.
చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే  వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.
మరో మాట. నా పిల్లల చిన్నతనంలో,  మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ ఆ ఆశ అప్పుడు  తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ  చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.
మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే  కాదు, పలానా విద్యార్ధి  మా కాలేజీలో చదివాడు  సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.
ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.
నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
సభకి మరోమారు నమస్కారం.
 - భండారు శ్రీనివాసరావు

(04-04-2015)

4, ఏప్రిల్ 2015, శనివారం

పెచ్చరిల్లుతున్న 'తుపాకీ సంస్కృతి'


(Published by 'SURYA' telugu daily in it's Edit Page on 05-04-2015, SUNDAY)

గత కొద్ది రోజులుగా మీడియాలో నేర స్వభావం కలిగిన సమాచారాలు చోటు చేసుకుంటున్నాయి.
సూర్యాపేట హైటెక్ బస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక కానిస్టేబులు, ఓ హోమ్  గార్డు చనిపోయారు. పోలీసు ఇన్స్పెక్టర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే దుండగులు దారిన వెడుతున్న ఓ కారును ఆపడానికి విఫల ప్రయత్నం చేసి ఆ కారును నడుపుతున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి గాయపరిచారు.
హైదరాబాద్ సరూరు నగర్ ప్రాంతంలో ఇంట్లో ప్రవేశిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వారు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. హైదరాబాదు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులపై పెట్రోలు పోసి తగులబెట్టే ప్రయత్నం జరిగింది. నగరంలో తుపాకీని అమ్మజూపతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన  ఓ వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా జరిగిన సంఘటనలు. అయితే వీటిలో దండలో దారంలా దాగున్న నిజం ఒక్కటే. అది  పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి, నేర ప్రవృత్తి.         
సూర్యాపేట బస్ స్టేషన్ వంటి  బహిరంగ ప్రదేశాల్లో జరిగిన సంఘటన సంచలనంతో పాటు ఆందోళన కూడా కలిగిస్తోంది.  పోలీసులపై తెగబడి కాల్పులు జరిపిన ఈ నేరస్తుల అసలు లక్ష్యం ఏమిటన్నది ఇంకా బయట పడలేదు.  ఎందుకంటె వీటికి కారణభూతులయిన వారు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. వారిని పట్టుకునేందుకు పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది.
సరూర్ నగర్ కాల్పులకు ఆస్తి తగాదాలు కారణంగా చెబుతున్నారు. పెట్రోలు పోసి తగలబెట్టడానికి ప్రయత్నించిన సంఘటనల్లో  అలాటి హేతువు కూడా కానరావడం లేదు.
తుపాకీ సంస్కృతి ప్రబలడం అనేది విశ్వవ్యాప్తంగా జరుగుతోంది. ఇంగ్లండులో గత పదేళ్ళలో ఈ రకమైన నేరాలు 89 శాతం పెరిపోయాయి. వీటిని అరికట్టడం ఎలాగా అని అక్కడి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఇక అమెరికాలో తుపాకులు అనేవి పౌరుల జీవితాల్లో ఒక భాగమై పోయాయి. ఇళ్ళల్లో ఆయుధాలు అట్టిపెట్టుకోవడం, ఆత్మ రక్షణ కోసం వాటిని యధేచ్చగా ఉపయోగించుకోవడం చట్టరీత్యాకూడా అక్కడ చెల్లుబడి అవుతోంది. అయితే ఆయుధాలను మారణాయుధాలుగా వాడుకోవడం అనుమతించరు. ఆయుధాల వినియోగం విషయంలో అక్కడి పోలీసులకు విపరీతమైన స్వేచ్ఛ వుంది. పరిమితి మించిన వేగంతో వాహనాలను నడిపేవారు పోలీసుల చేతికి చిక్కినప్పుడు వారి అనుమతి లేకుండా జేబులో చేయి పెట్టబొయినా పోలీసులు ఊరుకోరు. మారణాయుధం తీయడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే అనుమానించి పోలీసులే  ముందుగా కాల్పులు జరుపుతారు. అయినా ఆ దేశంలో జరిగే కాల్పుల సంఘటనలు తక్కువేమీ కావు. తుపాకీ ధరించిన దుండగుడు ఏదైనా పాఠశాలలోకి  హఠాత్తుగా దూరిపోయి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉదంతాలు అక్కడ నిత్యకృత్యంగా మారిపోతున్నాయి.
సూర్యాపేట సంఘటన పరిశీలిస్తే పోలీసులకంటే దుండగులే ముందుగా కాల్పులకు పూనుకున్నట్టు తెలుస్తోంది. పోలీసుల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నప్పటికీ వారు సకాలంలో స్పందించలేదనే ఆరోపణ వుంది. బస్సులో రొటీన్ గా జరిపే సోదాల్లో పోలీసులు అయుధాలు ప్రదర్శించి వుంటే అది మరో సంచలనవార్తగా మారివుండేది. కాబట్టి అమెరికా పోలీసుల మాదిరిగా కఠినంగా వ్యవహరించగల వెసులుబాటు మన పోలీసులకు లేదనేది కూడా కాదనలేని వాస్తవం.
వీటితో పోల్చలేకపోయినా మరో దారుణమైన విషయం గోవాలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆధునిక దుస్తులు అమ్మే ఒక దుకాణంలో కొనుగోలు చేసిన దుస్తులు తమకు తగ్గట్టుగా సరిగా ఉన్నాయా లేదా అనే విషయం సరిపోల్చుకోవడానికి ఏర్పాటు చేసిన  గదిలో రహస్య కెమెరాలు అమర్చిన వైనం ఓ కేంద్ర మహిళా మంత్రి చేసిన పిర్యాదు కారణంగా వార్తలకెక్కింది. దుకాణంలో దొంగతనాలు జరగకుండా ఈ ఏర్పాటు చేసినట్టు యజమానులు చెబుతున్న కారణం ఆకుకూ పోకకూ అందకుండా వుంది.
తుపాకీతో చేసే ఘోరాలకన్నా  మహిళలపై  జరిగే అత్యాచారాల నైత్యం  తక్కువేమీ కాదు. మారణాయుధంతో నిండు  ప్రాణం తీయడానికి, 'మగతనం' అడ్డుపెట్టుకుని అబలల మానం  నిలువునా హరించడానికీ నేరస్థాయిలో తేడా ఏమీ లేదు. వీటికి చట్టంలో శిక్షలు కఠినంగానే వున్నాయి. కానీ చట్టం దోవ చట్టందే, నేరాల దోవ నేరాలదే అన్నట్టు విశృంఖలంగా పెరిగిపోతున్నాయి.

         

అయితే, కేవలం కఠిన శిక్షలు మాత్రమే  పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృత్తికి అడ్డుకట్టవేయలేవు అన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం వుంది. చట్టాలకు పదును పెట్టి కఠిన శిక్షలు వేయడం అన్న ఒక్క ప్రక్రియే ఈ సమస్యలకు పరిష్కారం కాదు.
అసలు సిసలు మార్పు ఇళ్లనుంచి  మొదలు కావాలి. పిల్లల పెంపకం పట్ల తలితండ్రులు  తీసుకునే జాగ్రత్తలు కూడా సానుకూల మార్పుకు దోహదం చేస్తాయి. గతంలో పాఠశాలల్లో నైతిక ప్రవర్తనకు సంబంధిన పాఠాలు బోధించే పద్దతి వుండేది. యేది మంచి యేది చెడు అన్నది చిన్నతనం నుంచే అవగాహన చేసుకోవడానికి అవకాశం వుండేది. ఉమ్మడి కుటుంబాలకు మూలస్తంభాలు అయిన బామ్మలు, తాతయ్యలు పసితనం నుంచే పిల్లలకు నడత, నడవడిక గురించిన మార్గదర్శనం చేసేవాళ్ళు. ఎదిగే దశల్లో మనసును నియంత్రించుకోవడానికి అవసరమయిన నీతి పాఠాలు కుమార శతకం, కుమారి శతకాల్లో లభ్యం అయ్యేవి. అవన్నీ ఇప్పుడు కలికానికి కూడా కానరావడం లేదు. అధవా ఎవరయినా కలిగించుకుని చెప్పే నీతి వాక్యాలను  పాత చింతకాయ పచ్చడిలా పరిగణిస్తున్నారు.
అలాగే,   ఇప్పటి వేగ యుగంలో, పోటీ ప్రపంచంలో వాణిజ్యరూపం సంతరించుకున్న విద్యాసంస్థలకు నైతిక పాఠాలు బోధించే వ్యవధానం వుంటుందని ఆశించడం వృధా.   అటు కుటుంబాలలో కూడా పిల్లలకు  మంచీచెడూ చెప్పే వాళ్లు లేకుండా పోతున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలు జీవన శైలి మెరుగుదలకు ఓపక్క దోహదం చేస్తూనే మరోపక్క యువత పెడదారులు తొక్కటానికి మార్గాలను  సులువు చేస్తున్నాయి. అందుకే  సమస్య మూలాల్లోకి పోయి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది.  
ఏ సమాజనికయినా విలువల పతనాన్ని మించిన అధోగతి వుండబోదు.
దాన్ని నిరోధించకుండా చేసే ఏ ప్రయత్నాలయినా పై పూత మందులే అవుతాయికాని  అసలు రోగాన్ని సమూలంగా  నిర్మూలించలేవు. (04-04-2014)

Note : Courtesy Image Owner 

2, ఏప్రిల్ 2015, గురువారం

పోయినోళ్ళు అందరు మంచోళ్ళు

శశిశ్రీ - కడప జిల్లాకు మా రేడియో విలేకరి.


వార్త ఇవ్వడానికి అప్పుడప్పుడు ఫోను చేసేవాడు. వార్తకు ముందు అందర్నీ పేరు పేరునా అడిగేవాడు. చాలా ఏళ్ళ వరకు అతడో మంచి రచయిత అనీ, ముస్లిం అనీ తెలియదు. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి ప్రియ శిష్యుడు. ఒకసారి హైదరాబాదు వచ్చి తను ఎడిట్ చేసే ఓ పత్రిక ఇచ్చాడు. అప్పుడు తెలిసింది శశిశ్రీ ఓ రచయిత అని. మంచివాడు కాబట్టే  ముందుగా తప్పుకున్నాడు. ఎవరికి సంతాపం తెలపాలో తెలియని దుస్తితి నాది. అతడు తప్ప అతడి కుటుంబంలో ఎవ్వరూ తెలవదు. జర్నలిస్టులకు ఇలాటి శాపం ఏదో వున్నట్టు వుంది. వాళ్ళు అందరికీ తేలుస్తారు. వారి కుటుంబం వాళ్ళు ఎవ్వరో ఎవ్వరికీ తెలియదు. -  

నవ్వుల్ నవ్వుల్



వంక
విమానంలో పక్క సీట్లో కూర్చున్న అందమైన  యువతితో మాటలు కలపాలనుకున్నాడు ఏకాంబరం.
'మీ వొంటికి రాసుకున్న సెంటు ఏం బ్రాండో తెలియదు కాని అద్భుతంగా వుంది. అదేమిటో చెబితే నేను మా ఆవిడకు కూడా  కొనిస్తాను'
'వద్దు లెండి. ఇది రాసుకుంటే ఏ వెధవో  ఇలాగే మీ ఆవిడతో మాటలు కలపాలని చూస్తాడు'
అదేమరి!
తల్లి : 'టిప్పు సుల్తాన్ ఎవర్రా?'
కొడుకు: తెలియదు మమ్మీ!
తల్లి: అదేమరి చెప్పేది. ఎప్పుడూ ఆటలు పాటలు అని జులాయి తిరుగుళ్ళు మానేసి అప్పుడప్పుడన్నాపుస్తకాల మీద ధ్యాస పెట్టమని చెప్పేది అందుకే' 
కొడుకు :  రీటా ఆంటీ తెలుసా అమ్మా!
తల్లి:  తెలియదురా ఎవరావిడ?
కొడుకు: అదేమరి. ఎప్పుడూ టీవీ సీరియళ్లు అని కాలక్షేపం చేయకుండా అప్పుడప్పుడన్నా నాన్న ఏం చేస్తున్నాడో ఓ కంట కనిపెట్టి చూడమని చెప్పేది అందుకే!
వంకలు 
భార్య" ఈ ముష్టివాడ్ని మన ఇంటికి రానివ్వకండి,  వాడిని చూస్తె నాకు  అరికాలిమంట నెత్తి కెక్కుతుంది
భర్త: ఎందుకే వాడంటే అంత కోపం?
భార్య: ఎందుకేమిటి? నిన్న వస్తే  మిగిలిన టమాటా పప్పు, వంకాయ కూర వాడి గిన్నెలో వేసాను. ఈరోజు పొద్దున్న ఎంచక్కా వచ్చి నా చేతిలో వంటా వార్పూ పుస్తకం పెట్టి వెళ్ళాడు. వొళ్ళు మండదా మరి!
ఆవిడ పుణ్యమే! 
'అయ్యా ధర్మ ప్రభువులు ఓ ఇరవై రూపాయలు ఇలా నా చేతిలో పదేస్తీ  అలా వెళ్లి  హోటల్లో టీ తాగొస్తాను'
'ఇస్తాలే కాని ఒక్క టీ తాగడానికి ఇరవై ఎందుకో అది చెప్పు ముందు'
'మరి నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాకూడా  వస్తుంది కదా'
'ఓహో ఇప్పుడు తెలిసింది బిక్షగాళ్లు ఆడపిల్లలతో ఫ్రెండ్ షిప్ చేస్తారని'
'అయ్యా మీరు పొరబడ్డారు. నేను ఫ్రెండ్ ని చేసుకోవడం కాదు. నన్ను మాత్రం బిక్షగాడిని చేసింది'
తెలుస్తూనే వుంది సంబడం 
మొగుడు తాగి ఇంటికి వచ్చాడు. వచ్చీ  రాగానే లాప్ టాప్  ముందేసుకుని ఫేస్ బుక్ ఓపెన్ చేసాడు.
'ఇవ్వాళ కూడా తాగారా' భార్య అడిగింది.
'అబ్బే లేదే. ఎందుకలా అడిగావ్?'
'ఏంలేదు. లాప్ టాప్  అనుకుని సూట్ కేసుమీద వేళ్ళు టకటకలాడిస్తుంటే అనుమానం వచ్చి అడిగాను లెండి'

 COURTESY IMAGE OWNER

1, ఏప్రిల్ 2015, బుధవారం

మిషన్ కాకతీయ


(Published by 'SURYA' telugu daily in it's Edit page on 02-04-2015, THURSDAY)

చెరువుకు వూరికి అవినాభావ సంబంధం.
అందుకే చెరువులు లేని ఊళ్ళు సకృత్తుగా కనబడతాయి. చెరువు అనగానే సాధారణంగా పంట పొలాలకు సేద్యపు నీళ్ళు, తాగడానికి మంచి నీళ్ళు  అందించే వనరుగా మాత్రమె పరిగణిస్తారు. నిజానికి ఊళ్ళల్లో చెరువులకు చారిత్రిక ప్రాధాన్యతతో పాటు సాంస్కృతిక నేపధ్యం కూడా వుంది. దసరా వంటి పండుగ దినాల్లో చెరువులు ఆయా గ్రామాలకు తీర్ధ క్షేత్రాలుగా మారిపోతాయి. ప్రత్యేకించి తెలంగాణా ప్రాంతంలో ఆడపడుచుల 'బతుకమ్మలాటకు' వూరి చెరువే ప్రధాన వేదిక.
డెక్కన్ పీఠభూమిగా చరిత్రపుటలకెక్కిన  తెలంగాణా ప్రాంతంలో చెరువులకు యెనలేని ప్రాముఖ్యం వుంది. జీవనది గోదావరి తెలంగాణలో మైళ్ళ కొలది దూరం పారుతున్నా, నైసర్గికమైన కారణాలవల్ల ఆ నది నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి సహజసిద్ధమైన వీలు లేకుండా పోతోంది. అందుకే,  ఆ ప్రాంతం ఎక్కువగా చెరువులవంటి జలవనరులపైనే ఆధారపడాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ కారణం వల్లనే అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలోని వ్యవసాయం చెరువుల కిందనే సాగుతూ వచ్చింది. గతంలో దట్టమైన అటవీ సంపద కారణంగా విస్తారంగా కురిసే వర్షాలు, చెరువుల్ని నిండు కుండలుగా తయారుచేసేవి. ఒక్కసారి చెరువు  నిండిందంటే చాలు ఇక ఆ ఊరివారికి సాలు పొడవునా సేద్యపు నీరు లభిస్తుందనే భరోసా వుండేది. కాలక్రమంలో అడవుల విస్తీర్ణం క్షీణిస్తూ రావడం, వర్షపాతం శాతం తగ్గుతూ రావడం చెరువుల పాలిట శాపాలుగా మారాయి. ఇంతే కాకుండా, పట్టణీకరణ ప్రభావం కూడా చెరువులపై పడుతూ వచ్చింది. భూములకు విలువ పెరగడం, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడం మొదలైన అంశాలు తెలంగాణా ప్రాంతంలో చెరువుల స్తితిని దయనీయంగా మార్చాయి. చెరువుల్లో నీరు చేరే మార్గాలు మూసుకుపోవడం, చెరువల విస్తీర్ణం నానాటికీ కుంచించుకుపోవడం చెరువుల  భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి.


ఈ నేపధ్యంలో, తెలంగాణా సాంస్కృతిక పరిరక్షణ అనండి, పునరుద్ధరణ అనండి, కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో ప్రధాన  భూమిక  'మిషన్ కాకతీయ' అనే పేరుతొ మొదలు పెట్టిన చెరువుల పునరుద్ధరణ పధకం పోషిస్తోంది. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో వున్న తెలంగాణా భూములకు ఆ ప్రాంతంలో పారే నదీ జలాలను ఉపయోగించుకునే సాంకేతికత కొరవైన కాలంలో నాటి కాకతీయ ప్రభువులు చెరువుల కింద సేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కారణంగానే తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పధకానికి 'మిషన్ కాకతీయ' అని నామకరణం చేసింది.
ఈ పధక నిర్మాతలు చెప్పే కారణం కూడా సులభగ్రాహ్యం. బచావత్ ట్రిబ్యునల్  వల్ల తెలంగాణకు కృష్ణా గోదావరి నదులనుంచి 275 టీ.ఎం.సీ. ల నీరు వాడుకునే వీలుంది. కానీ అంత నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు లేదు. అందుచేత, రానున్న అయిదేళ్ళ కాలంలో కురిసే ప్రతి వర్షపు బొట్టుని ఒడిసిపట్టి తెలంగాణాలోని  గ్రామాల్లో వున్న ప్రతి ఒక్క చెరువునీ నింపగలిగితే కరవురక్కసి కోరలనుంచి రైతులకు శాశ్విత విముక్తి కలిగించవచ్చన్నది వారి ఉద్దేశ్యం.
తెలంగాణా గ్రామీణ ప్రాంతాలలో పడబాటు పద్దతి ఒకటుంది. చెరువులోని నీటిని తూముల ద్వారా కింద పొలాలకు ఒదులుతారు. వరి పైరు పొట్టకు వచ్చేవరకు పొలంలో నిలవవుండే నీరే దానికి ప్రాణాధారం. పొట్టకు వచ్చిన తరువాత నీరు అలాగే నిలవవుంటే అసలు  పైరుకే ముప్పు. వరికాండం కుళ్లిపోయే ప్రమాదం వుంటుంది. అందుకే ఆ సమయంలో ఆ నీటిని మరో పంటకు పనికి వచ్చేలా ఒదిలిపెడతారు. అలాగే చెరువు నిండినప్పుడు అలుగు ద్వారా నీటిని బయటకు ఒదులుతారు. ఆ నీళ్ళు పొరుగున వున్న మరో వూరి చెరువును నింపడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక రకంగా నదుల అనుసంధానం మాదిరిగా చెరువుల అనుసంధానం అన్నమాట.
చెరువుల పూడిక తీయడంలో రైతులు స్వచందంగా సహకరించే వీలుంది. ఎందుకంటె పూడిక తీయడం ద్వారా లభించే మట్టి అత్యంత సారవంతమైనది. పొలాలకు ఎరువుగా వాడుకోవచ్చు. కుమ్మరులు కుండలు చేసుకోవడానికి అదే మట్టి ఉపయోగపడుతుంది. చెరువులు సమృద్ధిగా వర్షపు నీటితో నిండితే గ్రామంలో మంచి నీటి  కొరత తీరుతుంది. భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి. పూడికలు సక్రమంగా తీయగలిగితే చెరువులో నిలవచేసే నీటి  పరిమాణం బాగా పెరుగుతుంది. తద్వారా, చెరువుకింద సాగయ్యే సాగు భూముల విస్తీర్ణం ఇతోధికంగా పెరుగుతుంది. చెరువుల పునరుద్ధరణ అనేది గ్రామస్తుల కళ్ళ ఎదుట జరుగుతుంది కాబట్టి,  పూడికలు తీయడంలో జరిగే ప్రతి పనికీ సోషల్ ఆడిట్ వుండే అవకాశం వుంటుంది.             
రాజకీయాలను దరి రానీయకపోతే నిజానికి చెరువుల పునరుద్ధరణ అనేది తెలంగాణకు ఓ వరం వంటిది. పెద్ద ప్రాజెక్టుల వల్ల పెద్ద పెద్ద ప్రయోజనాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే వాటి ఫలితాలు గ్రామాల్లోని రైతులదాకా చేరడానికి ఏళ్ళతరబడి వేచి వుండాలి. పైగా పెట్టుబళ్ళు కూడా  అంతే  భారీ స్థాయిలో అవసరమవుతాయి. వేలాది ఎకరాలు ముంపుకు గురవుతాయి. అదే స్థాయిలో ఇళ్లూ, పొలాలు పోగొట్టుకుని ప్రజలు నిరాశ్రయులవుతారు. ప్రభుత్వాలు ఇవ్వచూపే పరిహారం కోసం  చకోరపక్షుల్లా ఎదురు చూడాల్సి రావచ్చు.
'మిషన్ కాకతీయ' తెలంగాణా అవసరాల ప్రాతిపదికగా రూపొందించిన పధకం. రాష్ట్రంలో ఆక్రమణలకు గురయిన వాటిని మినహాయిస్తే దాదాపు నలభయ్ వేల పై చిలుకు చెరువులు వున్నాయని ఓ అంచనా. ఏడాదికి ఇరవై శాతం చొప్పున అయిదేళ్ళలో మొత్తం చెరువుల సంప్రోక్షణ పూర్తిచేయాలని సర్కారు సంకల్పం.
సంకల్పం బాగుంది. పెట్టుకున్న లక్ష్యం ఆచరణాత్మకంగానే వుంది. అయితే చిత్తశుద్ధిపైనే సందేహాలు, సంకోచాలు.
ఈ యావత్ 'కాకతీయ మిషన్' కేవలం టీ.ఆర్.యస్. నాయకులు, కార్యకర్తల కడుపులు  నింపడానికేకాని, చెరువులను నీటితో నింపడానికి కాదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలకు  మేలు చేయడమే పరమావధిగా ప్రభుత్వాలు పధకాలకు రూపకల్పన చేస్తాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అవి అవినీతి వూటలుగా మారిపోతాయి. ఇది చాలా ఏళ్ళుగా ప్రజలు గమనిస్తూ వస్తున్న వాస్తవం.
ప్రభుత్వాలు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే చివరికి సందేహాలే  నిజమవుతాయి. మొత్తం పధకం స్పూర్తే దెబ్బతింటుంది. ఈ వాస్తవం గుర్తెరిగి వ్యవహరిస్తే మంచి పేరు సర్కారు ఖాతాలో పడుతుంది. లెక్క  చేసేది లేదు అనుకుంటే తదనంతర కాలంలో వీటన్నిటి  లెక్కలు చూసే అవకాశం ప్రజలకే ఇచ్చినట్టు అవుతుంది.
'మిషన్ కాకతీయ' విజయవంతం అయితే మేలు జరిగేది ఒక్క తెలంగాణాకే కాదు, ఈ స్పూర్తిని అంది పుచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వీలుంటుంది. తద్వారా ఒనగూరే  సత్ఫలితాలు యావత్ దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి.        
(01-04-2015)
Courtesy Image Owner 

లొడ లొడ



దడ దడ చప్పుడు చేసే మోటారు సైకిల్ మీద ప్రియురాలిని ఎక్కించుకుని ఆవిడ చెప్పే కబుర్లు వింటూ ఝామ్మున షికారు తిరగాలన్నది ఏకాంబరం కోరిక. అందుకే అప్పుచేసి కొత్త బైకు కొన్నాడు. ప్రేయసిని వెనక ఎక్కించుకుని ఆమె చెప్పే ముచ్చట్లు వింటూ వూరంతా తిప్పుతూ కాలక్షేపం చేయాలనే  అతగాడి కోరికకి ఆ మోటారు సైకిల్ చేసే భయంకర ధ్వనులు  అడ్డం పడ్డాయి. ఆ రొదలో స్నేహితురాలు  సన్న గొంతుతో పలికే మాటలు ఓ పట్టాన వినబడేవి కావు. దాంతో,  ఆ రణగొణ ధ్వనుల మోటారు సైకిల్ ని అడ్డమైన ధరకు తెగనమ్మేసి ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో  ఆట్టే చప్పుడు చేయని మరో మోటారు సైకిల్ కొన్నాడు.   ఈ సైకిల్  తిరుగుళ్ళు పెద్దవాళ్ళకు నచ్చక వాళ్ళిద్దరికీ పెళ్ళిచేసి ఒకింటి వాళ్ళను చేసి చేతులు దులుపుకున్నారు. పెళ్ళయిన తరువాత ఏమైందో ఏమో ఏకాంబరం దడ దడ చప్పుడు చేసే పాత సైకిల్ నే ఎక్కువ ధర పెట్టి మళ్ళీ కొనుక్కుని భార్యను ఎక్కించుకుని తిరుగుతున్నాడు. ప్రియురాలిగా చెబుతున్నప్పుడు అదేపనిగా  వినాలనిపించిన ముద్దు ముచ్చట్లే పెళ్ళయిన తరువాత లొడ లొడ వాగుడుగా అనిపించడం ఈ మార్పుకు కారణం.  


(Courtesy Image Owner)

గొయ్యిని తవ్వుట మా వంతు


శాస్త్రవేత్త పేరు గుర్తు రావడం లేదు కాని మా కాలేజి ఇకనామిక్స్ లెక్చరర్ రామనరసింహం గారు ఆ  ఆర్ధిక నిపుణుడి  సూక్తిని తరచూ చెబుతుండేవారు. నిరుద్యోగం నిర్మూలించాలంటే ఒక గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిని పూడ్చాలి. తవ్విన వాడికి ఓ ఉద్యోగం, పూడ్చిన వాడికి ఓ ఉద్యోగం.
రెండు నెలల క్రితం కాబోలు ఏ శాఖవారో తెలియదుకాని మా అపార్ట్ మెంట్ ముందు రెండు గోతులు తవ్వారు. అక్కడితో వారి పని అయిపోయినట్టు వుంది. వాటిని అలాగే ఒదిలేసి వెళ్ళారు.
ఈరోజు ఉదయం నన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన టీవీ ఛానల్ వాహనం ఆగోతుల్లో ఒక దానిలో పడిపోయింది. తీయడానికి తాతలు దిగివచ్చారు.
మొత్తం మీద పొద్దున్నే ఓ గండం గడిచింది. ఇంకా  ఎన్ని ఎదురు చూస్తున్నాయో తెలియదు. ఎవరికి పిర్యాదు చేయాలో కూడా తెలియదు. ఇలా గోతులు తవ్వి వాటిని అలా ఒదిలేసి వెళ్ళేవారు అక్కడ తమ సెల్ నెంబరు వివరాలు ఒదిలి వెడితే బాగుంటుంది అనిపించింది.

జంటనగరాల మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్  సోమేశ్ కుమార్ గారికి ఇది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ అవస్థలు పడేవారికి పెద్ద సమస్య.  





(Sai Sree Nilaya Apartments, Oppo. Maharaja Chaat, Madhapur, Hyd. - 500 081)