3, మార్చి 2015, మంగళవారం

పిచ్చిమాలోకం


ఓ జర్నలిష్టు పిచ్చాసుపత్రికి వెళ్ళి అక్కడి డాక్టర్ని అడిగాడు, 'మీ దగ్గరకు వచ్చిన రోగికి పిచ్చి వుందని యెలా నిర్దారిస్తారని'
డాక్టర్ చెప్పాడు.
'వెరీ సింపుల్. ఒక బాత్ టబ్ నిండా నీళ్ళు నింపి వచ్చిన రోగికి ఒక బక్కెట్టు, ఒక చెంచా ఇచ్చి నీళ్ళు తోడమని చెబుతాం"
జర్నలిష్టు కల్పించుకుని అన్నాడు.  ' ఓ తెలిసింది. బక్కెట్టుతో తోడితే అతడికి పిచ్చి లేనట్టు. అంతే కదా!'
'కాదు, బాత్ టబ్ కింద నాబ్ వుంటుంది. అది తిప్పితే నీళ్ళు అవే పోతాయి. నర్స్, మూడో నెంబరు బెడ్డు ఖాళీ వుండాలి కదా! ఇతగాడిని ఎడ్మిట్ చేసి పరీక్షలు మొదలు పెట్టు, నేను తరవాత వచ్చి చూస్తాను'


(NOTE: Courtesy Image Owner)

కేంద్ర బడ్జెట్ సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 05-03-2015, THURSDAY)

శారీరక అస్వస్తత నుంచి కోలుకుంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, నానారకాల రుగ్మతలతో కునారిల్లుతున్న 
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకోసం బడ్జెట్ రూపకల్పనలో చాలా శ్రమ తీసుకున్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో వుంచుకుని కేటాయింపులు చేయడం  నిజానికి ఆహ్వానించాల్సిన అంశమే.   అన్ని రకాల  వర్గాలను మెప్పించేందుకోసం కాకుండా  దేశ హితాన్ని దృష్టిలో వుంచుకుని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తయారు చేసింది కావడం వల్ల ఫలితాలు అందుబాటులో రావడానికి కొంతకాలం వేచి వుండాలని బడ్జెట్ ను సమర్ధించే బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ వాదనను ప్రతిపక్షాలు అంగీకరించే పరిస్తితి ఎలాగూ వుండదు. అందువల్ల షరా మామూలుగానే కేంద్ర బడ్జెట్ పై ఖండన ముండన పర్వాన్ని అధికార ప్రతిపక్షాలు  యధాప్రకారం యధావిధిగా కొనసాగిస్తున్నాయి.
ఆ విషయం పక్కనబెడితే, ఈసారి కేంద్ర బడ్జెట్,   కొత్తగా ఏర్పడ్డ ఓ  తెలుగు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. మీడియా చర్చల్లో అదే ఒక  ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. ఇదే ఈసారి కేంద్ర బడ్జెట్ లో కానవస్తున్న నవ్యత్వం. గతంలో ఇలా జరిగిన దాఖలాలు లేవు. కేంద్రంలోను, ఆంధ్ర ప్రదేశ్  లోనూ  మిత్రపక్షాలుగానే కాకుండా ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా  వున్న రెండు రాజకీయ పక్షాల్లో రాజుకుంటున్న విభేదాలకు ఈ బడ్జెట్ మరింత  ఆజ్యం పోసింది. గత రెండు మూడు రోజులుగా స్థానిక టీవీ ఛానళ్లలో ఈ అంశంపై జరుగుతున్న చర్చల్లో మిత్రపక్షాలయిన బీజేపీ, టీడీపీ ప్రతినిధుల నడుమ వాదోపవాదాలు  కొంచెం శ్రుతి మించుతున్నట్టే అనిపిస్తోంది. వీటి తీరుతెన్నులు నిశితంగా గమనిస్తే, రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు ప్రస్తుతం వున్నరీతిలో కొనసాగే అవకాశాలు సన్నగిల్లుతున్నట్టు కూడా  అనిపిస్తోంది. పై స్థాయి నాయకుల మద్దతు, ప్రోత్సహం లేకుండా మీడియాలో మాట్లాడే ఆ  పార్టీల  ప్రతినిధులు ఈ పద్దతిలో మాట్లాడడం సాధ్యపడడం కుదరదు. ఈ సంవాదాలు ముదిరి పాకాన పడతాయా, లేదా ఒక స్థాయికి చేరి ఆగిపోతాయా అనే విషయంలో ఇప్పటికిప్పుడే అంచనాలకు రావడం తొందరపడడమే అవుతుంది. ఎందుకంటే, 'కొట్టినట్టు కొడతాను, ఏడ్చినట్టు ఏడువు' అనే నాటకీయ సంవాద ధోరణులు  కూడా ఇటీవలి కాలంలో రాజకీయాల్లో పెచ్చరిల్లుతున్నాయి. ఏది నిజమో, ఏది నాటకమో తెలియనంత స్వాభావికంగా నటించడంలో రాజకీయ నాయకులు రాటు తేలిపోయారు.  అయితే, టీడీపీ, బీజేపీ లలోని ఒక స్థాయి నాయకులు మాత్రం 'ఇక వెనక్కి తగ్గేది లేద'న్నంత తీవ్రంగా మాటలు విసురుకుంటూ  సవాళ్లు ప్రతిసవాళ్లు  విసురుతూ , ముందుకు దూసుకుపోతున్నారు. ఈ దృశ్యాలు  చూసినప్పుడు   రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో  బీజేపీ, టీడీపీ మైత్రి ముందు మాదిరిగానే కొనసాగుతుందా అంటే 'అవున'ని చెప్పడం కష్టంగా మారుతోంది. 

                  
గత ఎన్నికలకు ముందు ఏర్పడ్డ బీజేపీ, తెలుగుదేశం మైత్రీబంధం ఒకరకంగా ఉభయుల అవసరార్ధం కుదురుకున్నదే కాని, సిద్దాంత ప్రాతిపదికమీద ముడిపడింది కాదు. ఎన్నికల అనంతరం ఒకరి మీద మరొకరు ఆధారపడే అవసరం లేని సంఖ్యాబలం ఇరువురికీ లభ్యం కావడంతో ఈ పార్టీల పొత్తు కేవలం నామమాత్రంగానే తయారయింది. కాకపోతే, కొన్ని విషయాల్లో బీజేపీది పైచేయి అనే ఒప్పుకోవాలి. రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి అనే మాటలు పైకి ఎన్ని చెప్పినా చివరికి ఏ రాష్ట్రం  అయినా కేంద్రం మీద ఆధారపడే పరిస్తితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది నిర్వివాదాంశం. అందులోనూ కొత్తగా పురుడుపోసుకుని, బాలారిష్టాలతో కునారిల్లుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి,  ప్రతిదానికీ కేంద్రం మీద ఆధారపడడం తప్పనిసరి. రాష్ట్ర విభజన సమయంలోనూ, ఆ తరువాత ఎన్నికల  తరుణంలోనూ బీజేపీ అగ్రనాయకులు చెప్పిన ఉపశమన వాక్యాలతో కడుపు నిండిన ఆంధ్ర ప్రాంతం ఓటర్లు, చేయీ చేయీ కలిపిన బీజేపీ, టీడీపీ నాయకులని నమ్మి, 'చెయ్యి గుర్తు' పార్టీని మట్టి కరిపించి, అంతవరకూ అన్ని ఉపఎన్నికల్లో తాము బ్రహ్మరధం పట్టిన వై.యస్.ఆర్.సీ. పార్టీని పక్కన బెట్టి, ఈ రెండు పార్టీలనే అక్కున చేర్చుకున్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీలకు అతీగతీ లేకుండా పోవడం చూస్తూ  సీమాంధ్ర ప్రజానీకం లోలోపలే కుతకుతలాడి పోతున్న విషయం రహస్యమేమీ కాదు. హామీలను నూటికి నూరు  శాతం నిలబెట్టుకుని తీరతామని రెండు పార్టీల నాయకులు మరో కొత్త హామీ పదేపదే ఇవ్వడం తప్ప, ఇన్ని నెలలుగా కార్యాచరణ దిక్కుగా అడుగు పడింది లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బడ్జెట్ లోటు తగ్గింపుకు చేతనయిన సాయం,  నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రనిధులు,  పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాకు తగ్గ కేటాయింపులు, ప్రత్యేక రైల్వే మండలం అన్నీ మాటల్లోనే మిగిలిపోయాయి. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రాకు మొండి చేయి చూపిస్తే,  కేంద్ర బడ్జెట్లో ఏకంగా తొండి చేయి మిగిల్చారు. వీటిని సమర్ధించుకోవడానికి రాష్ట్రానికి చెందిన బీజేపే నాయకులు నానా అవస్థ పడాల్సి వస్తోంది. 'దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం, అందరితో  పాటే వడ్డన' అనే మోడీ మార్గం వారికి ఓ పట్టాన కొరుకున పడడం లేదు. ముందే చెప్పినట్టు 'అత్యల్ప రాజకీయ ప్రయోజనాలకంటే అనల్ప జాతీయ లక్ష్యాలు ప్రధానం. ఇది మా విధానం' అని మోడీ గద్దె ఎక్కిన మొదటి రోజునుంచీ చెబుతూనే వస్తున్నారు. ఇక ఆయన్ని తప్పుపట్టడం యెట్లా అనేది రాష్ట్ర బీజేపీ నాయకుల మనోగతం. కానీ పైకి చెప్పుకోలేరు. సాక్షాత్తూ  వెంకయ్య నాయుడు వంటి కాకలు తీరిన సీనియర్ నాయకుడే విలేకరుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక తడబడిన స్తితి. 'అవును, నేను అసమర్దుడినే, మీకు జవాబులు చెప్పలేకపోతున్నా' అని అయన విలేకరులతో అన్నట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు ఈ పరిస్తితికి అద్దం పడుతున్నాయి. వెంకయ్యనాయుడు బీజేపీలో ఆషామాషీ మనిషి కాదు. నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లోనే   ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు వుంది. కాకపొతే, ఆ పార్టీ నాయకులకు వున్న ఒక వూరట ఏమిటంటే,  బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో తెలుగు రాష్ట్రానికి చెందిన హామీలను పొందుపరచలేదు. ఎన్నికల ప్రసంగాలకు మాత్రమే వాటిని పరిమితం చేశారు. 'ఢిల్లీ చిన్నబోయేలా సీమాంధ్ర రాజధాని నిర్మించుకుందాం' అని మోడీ అలనాడు తిరుపతి సభలో అన్నా, 'కాంగ్రెస్ మిమ్మల్ని అనాధలుగా మార్చింది, అధికారంలోకి రాగానే మీకు అండగా వుంటా' అని ఎన్నికల వేళ  గుంటూరులో సీమాంధ్ర ప్రజలకు  మాటిచ్చినా అవన్నీ మానిఫెస్టోలో లేవని తప్పుకునే వెసులుబాటు బీజేపీ నాయకులకి వుంది. 'ఎన్నికల ప్రణాళికలో పొందుపరచిన అంశాలు మీరెంతవరకు అమలు చేసార'ని ఆ పార్టీ నేతలు టీడీపి పై ఎదురు  ప్రశ్నలు సంధించడం టీవీల్లో చూస్తున్నాం. రామాంజనేయ యుద్ధం అనే పౌరాణిక నాటకంలో యుద్ధరంగంలో తటస్థ పడిన శ్రీరాముడు, ఆంజనేయుడు ఒకరికొకరు తగిన మర్యాదలు ఇచ్చుకుంటూనే 'ఎత్తి పొడుపు' పద్యాలు ఎత్తుకున్న సందర్భం గుర్తుకు వస్తోంది.
ఇక తెలుగు దేశం పరిస్తితి చెప్పనక్కరలేదు. మిత్రపక్షాన్ని నిలదీయలేరు, అలా అని  సమాధాన పడలేరు. అయితే. రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ల తరువాత వారి స్వరాల్లో కొంత మార్పు కనబడుతోంది. చంద్రబాబు బావమరది, హిందూపూర్  ఎం.ఎల్.ఏ.,  బడ్జెట్ పై వెలిబుచ్చిన స్పందనలో ఈ మార్పు కొట్టవచ్చినట్టు కనబడింది. ఇక తిరుపతి టీడీపీ ఎంపీ ఒక అడుగు ముందుకు వేసి, జమ్మిచెట్టు మీద దాచిన ఆయుధాలను దించాల్సినసమయం ఆసన్నమైనదన్నట్టు మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల తన అసహనాన్ని దాచుకోలేదు.  'ఎంతో నమ్మకంతో బీజేపీ, టీడీపీలను గెలిపించిన 'ఏపీ' ప్రజల ఆశలను కేంద్రం వమ్ము చేసింది' అని చంద్రబాబు  విలేకరుల సమావేశంలోనే చెప్పారు. ఇక సహచరులతో జరిపిన అంతరంగిక సంభాషణల్లో  'కొంతకాలం వేచి చూద్దాం, మార్పు లేకుంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకుందాం' అన్నట్టుగా పత్రికల్లో  వచ్చింది. అదే వైఖరి టీవీ చర్చల్లో పాల్గొంటున్న టీడీపీ నాయకుల వాదనల్లో ప్రతిధ్వనిస్తోంది.
వీటన్నిటికీ 'కొసమెరుపు' అన్నట్టు 'ప్రశ్నించే హక్కు ప్రజలది' అనే నినాదంతో పుట్టిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ వీటన్నిటినీ మించిన దుమారం రేపింది.  రాజధాని భూముల సేకరణ  విషయంలో ఇటు టీడీపీని, ప్రత్యేక హోదా విషయంలో అటు  మోడీ ప్రభుత్వాన్ని ఒకే త్వీట్ లో ఇరుకున బెట్టారు.  మోడీ అభిమానం చూరగొన్న ప్రాంతీయ నాయకుడిగా ముద్రపడ్డ  పవన్ కళ్యాణ్ చంద్రబాబును అయన నివాసంలో కలుసుకుని, చర్చలు జరిపి 'రాజధాని' ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు. అనువైన తరుణానికి బాగా ముందుగానో, లేదా చాలా ఆలస్యంగానో  స్పందిస్తారని ఆయనకు ఇప్పటికే పేరుంది. రాజధాని భూముల  సమీకరణ గడువు 'ముగిసిన' తరువాత జరిపే ఈ పర్యటన వల్ల సాధించేది ఏముంటుంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి కూడా. కాకపొతే, ఢిల్లీ వెళ్ళి మోడీని కూడా కలుసుకుంటానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చేసేది ఏమీ లేదంటున్నారు కనుక, కనీసం 'తగినన్ని' నిధులు కేంద్రం నుంచి రాబట్టడంలో సఫలం అయితే కొంత మేలు జరిగినట్టు అనుకోవచ్చు. చంద్రబాబు అయన పరివారం విఫలం అయిన చోట పవన్ 'విజయం' సాధిస్తే ఆ పరిణామం మరికొన్ని రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశం  లేకపోనూ లేదు.                 
ఇదే వాతావరణం కొనసాగితే రాష్ట్రంలో 'రాజకీయ సమీకరణాలు' మారిపోయే ప్రమాదం వుంటుంది. ఆగ్రహించిన ప్రజానీకం యెలా స్పందిస్తారన్నది  సీమంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అవగతమైంది. వారి అనుభవంతో తెలుగుదేశం నాయకులకు కూడా  పరిస్తితి క్రమక్రమంగా అర్ధం అవుతున్నట్టుంది. అందుకే ఆ పార్టీలో నిరసనలు   'గుసగుసలు'గా  మొదలయి 'రుసరుసల' రూపం సంతరించుకుని క్రమేపీ  రణగొణ ధ్వనులుగా మారుతున్నాయి. 'ఇల్లా అయితే ఎల్లా' అనే ప్రశ్న, 'అవసరం అయితే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి తప్పుకుందాం' అనే వరకు రూపాంతరం చెందుతోంది. బడ్జెట్ సృష్టించిన, సృష్టిస్తున్న  రాజకీయ ప్రకంపనలు రానున్న కాలంలో వూహాతీత పరిణామాలకు దారితీస్తాయా, లేదా బలహీనపడ్డ అల్పపీడనం మాదిరిగా సద్దుమణుగుతాయా అన్నది రానున్న రోజుల్లో 'కాలమే' నిర్ణయిస్తుంది. (bhandarusr@gmail.com)

(04-03-2015)

NOTE:Courtesy Image Owner 

2, మార్చి 2015, సోమవారం

మేకు జోకు - జోకు మేకు


కొన్ని సందర్భాలలో జోకు మేకయ్యే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా కొన్ని జోకులు ఆడవారి మీద పేలిస్తే అవి రివర్స్ లో తగిలే ప్రమాదం వుంది.


కాకపోతే ఇలాటి జోకులన్నీ స్త్రీ స్వాతంత్రం ఎక్కువగా వున్న దేశాల్లోనే ఎక్కువగా పుట్టి మన దగ్గరికి  దిగుమతి అయ్యాయి. ఆ పరాయి జోకుల్ని సొంత భాషలోకి అనువదించాలనే ఉత్సాహపరులకి  కొండొకచో కొన్ని (కామెంట్లు) పాట్లు తప్పవు. అయినా తగుదునమ్మా అని అనువాదం చేస్తే ఇదిగో ఇల్లా వుంటాయి.  
అమెరికా తండ్రికి కూతురు ఫోను చేసి చెప్పింది.'సారీ డాడ్. నిన్న అనుకోకుండా నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేసి చెప్పే టైం లేకపోయింది'
తండ్రి: పర్వాలేదులే.  మళ్ళీ ఇలాటి సందర్భం రాకపోదులే. అప్పుడు మాత్రం గుర్తుంచుకుని కబురు చెయ్యి'
ఇండియా పిల్లాడు తన అమెరికన్ స్నేహితుడితో  చెప్పాడు, ' నాకు నలుగురు అక్కయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు మరి  నీ సంగతేమిటి?'
'నాకా! నాకు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. కాకపోతే నా మొదటి అమ్మద్వారా నలుగురు నాన్నలు, మొదటి నాన్న ద్వారా ముగ్గురు అమ్మలు'
"ఆడవాళ్ళు  ముగ్గురి  మాటే చెవిపెట్టి వింటారు. అంతే కాదు,  వారు చెప్పిన మాటలు అక్షరాలా ఆచరిస్తారు. అని  ఓ మగ పిశాచి ఉవాచ.

ఆ ముగ్గురు ఎవ్వరంటే ఒకడు టైలర్, రెండోవాడు ఫోటోగ్రాఫర్,  మూడో వ్యక్తి బ్యుటీషియన్. వీళ్ళు ముగ్గురు కాకుండా తలకిందుగా తపస్సు చేసినా సరే, ఆడంగులు ఈ భూప్రపంచంలో ఎవ్వరి మాట వినరుగాక వినరు.  కాకపోతే కొందరు  విన్నట్టు నటిస్తారుట"

NOTE: Courtesy Image Owner 

28, ఫిబ్రవరి 2015, శనివారం

కాపీ జోకులు


కాపీ కొట్టే రైట్లే కాని కాపీ రైట్లు లేనివాటిని జోకులంటారని ఓ జోకారావు చెప్పాడు. అలాంటివే ఇవి.
పీతాంబరం భర్త ఏకాంబరాన్ని ఒంటరిగా దొరకబుచ్చుకుని అడిగింది. 'మీరు నన్ను ప్రేమిస్తున్నారా?  ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తున్నారు?' అని. అతగాడికి ఓ పట్టాన ఆ ప్రశ్నే అర్ధం కాలేదు. అర్ధం కాగానే అందులో  ఏదో మతలబు వుందని పసిగట్టి, 'నిన్ను బోలెడు బొచ్చెడు  ప్రేమిస్తున్నాను, తాగుతున్న ఈ మందు మీద ఒట్టు' అనేసాడు ధైర్యంగా. అలా చెబితే కుదరదు, ఇదిగో ఇంత అని చెప్పాలి' అంది గారాలు పోతూ. ఏకాంబరం క్షణం ఆలోచించి చెప్పాడు. మాటవరసకు  నేను ఒక సెల్ ఫోన్ అనుకో. నువ్వు సిమ్  కార్డులాంటిదానివి. సిమ్ కార్డు లేకపోతే ఫోను ఉట్టిదేగా! అలా అన్న మాట' అన్నాడు. 'ఓహో! అలాగా' అని  పీతాంబరం బోలెడు సంతోషపడి యింది. ఏకాంబరం మనస్సులో అనుకున్నాడు 'అమ్మయ్య బతికిపొయానురా బాబూ ఈ పూటకు. పిచ్చిది, చెప్పగానే  నమ్మేసింది, కానీ దానికేం తెలుసు, నేను చైనా ఫోను లాంటివాడిననీ, నాలుగు సిమ్ కార్డులు వుంటాయని'   




NOTE: Courtesy Image Owner 

ఓ కప్ప కధ


అనగనగా ఓ కప్ప. ఆ  కప్పకు రోజు చెట్టెక్కాలని బుద్దిపుట్టింది. అనిపించిందే తడవు, నున్నగా సన్నగా వున్న ఓ చెట్టు చూసుకుని  ఎక్కడం మొదలెట్టింది. మిగిలిన కప్పలు చుట్టూచేరి, 'వద్దు వద్దు, చెట్లెక్కడం మన ఇంటా వంటా లేదు. అందులోను అంత పొడుగు చెట్టు అసలెక్కలేవు. అక్కడినుంచి పడ్డావంటే జనాభా లెక్కల్లో లేకుండా పోతావు,  దిగిరా దిగిరా' అని నిరుత్సాహపరుస్తూ బావురుమంటూ వెంటపడ్డాయి.  అయినా లెక్కచేయకుండా  ఆ కప్ప  అమాంతం ఆ చెట్టెక్కి కూర్చుంది.


యెలా?
యెల్లా అంటే,  ఆ కప్ప చెవిటిది. ఒక్క ముక్కా వినబడదు.  అందుకే తోటికప్పలు బావురు బావురుమంటూ, 'వద్దు వద్దం'టూ ఇచ్చే ప్రతికూల సలహాలు దాని చెవికెక్కలేదు. అందుకే హాయిగా చెట్టెక్కగలిగింది.
ఈ కప్ప కధలోని నీతి ఏమిటంటే ఏ పనిచేయబోయినా 'వద్దు వద్దు ఆ పని నువ్వు చెయ్యలేవు' అని నిరుత్సాహపరిచే వాళ్ళే  ఎక్కువ వుంటారు. సాహసాలు చేసేవాళ్ళు అలాటి మాటలు చెవిన పెట్టకూడదు. ఎవరేమన్నా ముందు అనుకున్న 
 రీతిలోనే  ముందుకు సాగిపోవాలి.

NOTE: Courtesy Image Owner 

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కొత్త రైళ్ల కూతలు, చార్జీల మోతలు లేని బడ్జెట్

(Published in 'SURYA' telugu daily in it's edit page on 01-03-2015, SUNDAY)
పరిగెత్తి పాలు తాగాలా ? నిలబడి నీళ్ళు తాగాలా? అంటే రైల్వే మంత్రి సురేష్ ప్రభు రెండోదే ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన మోడీ మార్కు రైల్వే బడ్జెట్ లో ఈ ధోరణే ద్యోతకమవుతోంది.


ఏ బడ్జెట్ అయినా  అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది చూసేవారి కంటినిబట్టి రెండు రకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహో బడ్జెట్. ఇంకా కాస్త పొగడాలని అనిపిస్తే 'అభివృద్ధికి బాటలు వేసే అద్భుతమైన బడ్జెట్'. అదే బడ్జెట్   ప్రతిపక్షం వారికంటికి  అంకెల గారడీ బడ్జెట్. ఇంకా తెగడాలని అనిపిస్తే, 'అభివృద్ధి నిరోధక బడ్జెట్'.  అయితే ఈ రెండు కళ్ళే కాదు, పైకి కనబడని  మూడో కన్ను మరోటి వుంది. అది ప్రజలది. అంటే ప్రయాణీకులది. అందులోనూ అతి సాధారణ ప్రయాణీకులది. కానీ వారి గోడు ఎన్నికల సమయంలో తప్ప ఎవ్వరికీ పట్టదు. తమకున్న  ఈ 'మూడో కన్ను' తెరవాలంటే ఎన్నికలదాకా ఆగాలన్న 'మునిశాపం' వాళ్లకు  వుంది. రైల్వే భాషలో చెప్పాలంటే వాళ్ళది 'వెయిట్ లిస్టు' కేటగిరీ.
సురేష్ 'ప్రభువుల'వారి రైల్వే బడ్జెట్ 'భవిష్యత్ పట్ల భరోసా కల్పించేదిగా వుంద'ని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీగారే అన్నారు కాబట్టి  ఇక అధికార పక్షం వారి 'మద్దతు' వ్యాఖ్యానాల అవసరమే లేకుండా పోయింది. పోతే,  కొత్త రైలు ప్రస్తావన లేని మొట్టమొదటి రైల్వే బడ్జెట్ అంటూ షరా మామూలు పద్దతిలోనే ప్రతిపక్షాల వాళ్లు  విమర్శలు చేశారు.
బడ్జెట్ పాత పద్దతిలో కాకుండా నవ్యత్వం చూపడానికి రైల్వేమంత్రి కొంత  ప్రయత్నం చేశారు. అయితే, అనేక సంవత్సరాలుగా బడ్జెట్ అంటే ఒక ఒరవడికి అలవాటుపడిన వారికి అది ఒక బడ్జెట్ మాదిరిగా కాకుండా మంత్రిగారి 'ఊహలచిత్రం' గా కానరావడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. అయితే మోడీగారి 'స్వచ్చభారత్' 'డిజిటల్ ఇండియా' నినాదాల ప్రభావం ఈ బడ్జెట్ లో అడుగడుగునా దర్శనం ఇచ్చింది.
ఇంట్లో నుంచే టికెట్ బుకింగ్, ఈ టికెట్ తో రైల్లో కావాల్సిన భోజనం, ఆన్ లైన్ ద్వారా వీల్  చైర్ సౌకర్యం, మహిళలకు, వృద్ధులకు కింది బెర్తులు, రైళ్ల రాకపోకల సమయాలు గురించి మొబైల్ ఫోన్లలో ఎస్.ఎం.ఎస్. అలర్టులు, ఆడవాళ్ల బోగీల్లో నిఘా కెమెరాలు, నాలుగు నెలల ముందే టికెట్ రిజర్వేషన్ ఇలా ఒకటా రెండా, కొత్త రైళ్ల వూసే లేని ఈ కొత్త రైల్వే బడ్జెట్ లో ఇలాటి వూసులు ఎన్నో, ఎన్నెన్నో.
కాకపొతే రైళ్ళలో అనునిత్యం ప్రయాణించే కోటిన్నర పైచిలుకు ప్రయాణీకుల్లో ఈ మాటలు వినని వాళ్లు, వాటికి అర్ధం తెలియని వాళ్లు, అసలు వాటి అవసరమే లేనివాళ్ళు అధిక సంఖ్యలో వున్నారు. ఆ జనాలకు సురేష్ ప్రభుగారు ప్రతిపాదించిన 'ఈ' భోజనాలు. 'ఈ' టిక్కెట్లు, 'ఈ'  దుప్పట్లు, వీటి  అవసరమే లేదు. వారికి  కావాల్సింది సమయానికి వచ్చి, కడగండ్లు లేకుండా  సమయానికి గమ్యం చేర్చే ప్రయాణపు బండ్లు. వాటిల్లో కూర్చోవడానికి ఎలాగూ చోటుండదు, కనీసం సౌకర్యంగా నిలబడి ప్రయాణించడానికి కాసింత వీలుంటే చాలనుకునే వాళ్లు చాలామంది. ఇలాటి  సాధారణ బోగీల్లో కూడా  మొబైల్ చార్జింగ్ సదుపాయం కల్పిస్తామని అంటున్నారు, సంతోషం. అలాగే, స్వచ్ఛ భారత్ ఆలోచనలను మామూలు బోగీల్లోని మరుగు దొడ్ల వైపు కూడా మళ్లిస్తే మరింత సంతోషం. ప్లాటుఫారాలపై లిఫ్టులు, ఎస్కలేటర్లు పెడతామంటున్నారు. వాటితో పాటు, ప్రస్తుతం వున్న మెట్ల దారిలో ట్రాలీ సూటుకేసులు తోసుకుంటూ తీసికెళ్లగల సైడ్ వాక్ సౌకర్యం గురించి యెందుకు ఆలోచించరు? ఈరోజుల్లో అనేకమంది ప్రయాణీకులు రైల్వే  పోర్టర్ల మీద ఆధారపడకుండా  తోసుకుంటూ వెంట తీసుకువెళ్ళే ట్రాలీ  లగేజీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాటివారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎక్కడానికీ, దిగడానికీ పడుతున్న  అవస్థలు తెలుసుకోవడానికి ప్రత్యేక అధ్యయనాలు చేయించనక్కర లేదు, ఏ రైలు స్టేషన్ కు వెళ్ళినా ఈ దృశ్యాలు కానవస్తాయి. ఈ సందర్భంలో గతం గురించిన ఒ ముచ్చట చెప్పుకోవడం అసందర్భం కానేరదు.
పూర్వం జనతా ప్రభుత్వం హయాములో రైల్వే మంత్రిగా మధుదండావతే పని చేశారు. అప్పటి వరకు సాధారణ టూ టయర్, త్రీ టయర్ బోగీల్లో పడుకోవడానికి చెక్క బల్లలు వుండేవి. దండావతే గారి పుణ్యమా అని ఆ బోగీలకు కూడా ఫోం పరుపులు అమర్చారు. ఆ ఒకే ఒక్క నిర్ణయంతో సామాన్యులు కూడా తామూ సమాజంలో ఎదుగుతున్నాం అనే ఉన్నత భావనకు లోనయ్యారు. సామాన్యులకు దగ్గరకావడం అంటే ఏమిటో, ఎలానో నాటి రైల్వే మంత్రి దండావతే చేసి చూపించారు.  సురేష్ ప్రభు, మోడీ తలచుకుంటే ఇటువంటివి చాలా చెయ్యవచ్చు. అలాటి సంకల్పం వారికి కలగాలని, సురేష్ ప్రభుగారే స్వయంగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్టు,  ఆ పైనున్న 'ప్రభువు' ను మనసారా  కోరుకుందాం.     
నిజానికి రైలుబళ్ళు యావత్ భారతానికి నకళ్ళు. ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న వాళ్ళకోసం రాజులు, మహారాజులు కోరే సకల  సౌకర్యాలతో 'ప్యాలెస్ ఆన్ వీల్స్' అనే పేరుతొ పట్టాలపై నడిచే  రాజప్రసాదాలు మనదేశంలో ఇప్పటికే  వున్నాయి. 'ఎప్పుడు వస్తుందో తెలియని, ఎప్పుడు గమ్యం  చేరుతుందో తెలియని' అతి మామూలు పాసింజర్ రైళ్ళు కూడా అదే పట్టాలపై తిరుగుతుంటాయి. ఇక మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, దిగువ తరగతి వాళ్లందరూ వేరు వేరు బోగీల్లో ఒకే రైలులో ప్రయాణిస్తుంటారు. వారి భాషలు వేరు, సంస్కృతులు వేరు, మాటతీరు వేరు, అయినా ఒక  కుటుంబం మాదిరిగా రైలు బండ్లు వారిని కలిపి వుంచుతాయి. అదే సమయంలో వారిని వేరువేరుగా చూస్తాయి. పక్కపక్కనే వున్నా వారి పక్కలు వేరు, వారికి కల్పించే భోజన వసతులు వేరు. ఇదంతా వారు చెల్లించే టికెట్టు ధర నిర్ణయిస్తుంది.  కొందరేమో  శబ్దం చెయ్యని ఏసీ బోగీల్లో దుప్పట్లు కప్పుకుని వెచ్చగా పడుకుని వెడుతుంటే, అదే రైల్లో మరో సాధారణ బోగీలో కాలు చేయీ కదపడానికి  కూడా వీల్లేని స్తితిలో మరికొందరు ప్రయాణం సాగిస్తుంటారు. అచ్చమైన భారతానికి అచ్చమైన నకలు ఏదైనా వుందంటే అది మన దేశంలోని రైలుబండే, సందేహం లేదు.
సురేష్ ప్రభుగారి విషయంలో ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి. పదవిలోకి వచ్చి మూడు మాసాలే అయినప్పటికీ, బడ్జెట్ రూపకల్పనలో ఎక్కడా తన సొంత రాష్ట్రం 'మహారాష్ట్ర' కు ఏదో ఒరగబెట్టాలని యెంత మాత్రం అనుకోలేదు. ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ ఒక్క విషయంలో  వెనుకటి మంత్రులతో పోలిస్తే ఈయన చాలా మెరుగు.
గతంలో రైల్వే మంత్రులగా పనిచేసినవాళ్ళల్లో చాలామంది 'తమ' ప్రాంతాల 'పాల రుణం' తీర్చుకోవడానికి నిస్సిగ్గుగా రైల్వే బడ్జెట్ ని ఉపయోగించుకున్నారు. వీరిలో బెంగాల్ ఆడపులి మమతా బెనర్జీ పేరే ముందు చెప్పుకోవాలి. యూపీయే హయాములో ఆమె 'రైలు భవన్ మహరాణీ' గా ఓ వెలుగు వెలిగినప్పుడు,  రైల్వే బడ్జెట్ లో సింహభాగాన్ని తూర్పు' వెళ్ళే రైలు  ఎక్కించేసి  చేతులు దులుపుకున్నారు. పశ్చిమ బెంగాల్  రాష్ట్రంలో  34 ఏళ్ళపాటు అవిచ్చిన్నంగా సాగుతూ వచ్చిన ఎర్రదండు పాలనకు శ్రీమతి బెనర్జీ 'ఎర్ర జెండా' చూపగలదేమో అన్న ఆశతో వున్న 'అప్పటి'  యుపీఏ నాయకులు, ఆవిడ ప్రతిపాదించిన (బెంగాల్) రైల్వే బడ్జెట్ కు పచ్చజెండా వూపారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా  సమర్పించిన  బడ్జెట్ లో  పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో హౌరా అని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్ లో సాఫ్ట్ వేర్ ఎక్సెలెన్సీ సెంటర్, కోల్ కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి మెట్రో కు 34 కొత్త సర్వీసులు,  ఇలా వరాల వాన కురిపించారు. 'లోగడ రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్, తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది' అన్న రీతిలో మమతా బెనర్జీ, పుట్టింటిపై  తన ప్రేమను సమర్ధించుకున్నారు. 'సొంత రాష్ట్రానికి, సొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో' అని సంకోచించే నిత్య శంకితులకు మాత్రం నిజంగా  ఇది కనువిప్పే.
సరే అదలా వుంచి, కొత్తగా పురుడు పోసుకున్న తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే - 
రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు సమర్పించిన ఈ బడ్జెట్, ఈ రెండు ప్రాంతాల ప్రజలను మాత్రం  ఉసూరుమనిపించింది. ఆంధ్ర. తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ 'ఈ బడ్జెట్ లో కాస్త కనికరం చూపండి మహాప్రభూ' అంటూ, అనేక సార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. బహుశా వారి మొర, మంత్రిగారి మనసు పొరలను తట్టిందో ఏమిటో కానీ, సురేష్ ప్రభువుల వారు, గంట పైచిలుకు చేసిన తమ బడ్జెట్ ప్రసంగంలో కాస్త  దయతలచి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని 'రెండు వూర్ల పేర్లు' ఒక్కటంటే ఒకేసారి  అనామత్తుగా ప్రస్తావించి వూరుకున్నారు.  'ఖాజీపేట (తెలంగాణా) - విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్) నడుమ మూడో రైలు మార్గం వేసే ప్రతిపాదన పరిశీలనలో వుంద'ని దాని తాత్పర్యం. తాత దగ్గుకే మురవమన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలవాళ్లు ఆ ఒక్క మాటకే మురిసిక్కచెక్కలవుతారని మంత్రిగారి అభిప్రాయమేమో తెలవదు.        
ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోకసభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని  మహజరులు సమర్పిస్తుంటారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలనో  ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వారి విజ్ఞప్తులు  వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీఆర్ ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. కానీ వాటిని కొత్త ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనబడడం లేదు.
ఏదిఏమయినా, ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వేమంత్రి పూర్తి స్థాయిలో  న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  గత జులైలో సమర్పించిన రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదనకు నోచుకున్న కొన్ని స్పీడ్ రైళ్ళు మాత్రం, ఆ ఒక్క రోజు  టీవీ స్క్రోలింగుల్లో గిరగిరా తిరిగివూరుకున్నాయి.  పట్టాలు ఎక్కిన దాఖలా లేదు. 'వూరికే మాటలు చెప్పడం యెందుకు అనుకున్నారేమో' ఈసారి అలాటి ప్రతిపాదనల వూసు కూడా లేశమాత్రం కూడా లేదు. విశాఖ కేంద్రంగా  కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి మళ్ళీ  నిరాశే ఎదురయింది. అల్లాగే, దశాబ్దాల తరబడి నానుతూ వస్తున్న కాజీపేట కోచ్ ఫాక్టరీ వ్యవహారం.
అయితే, ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. చార్జీలు ఏమీ పెంచలేదు. ఎందుకంటే ఆ పని ఆర్నెళ్ల ముందుగానే పూర్తయిపోయింది కాబట్టి. సరకుల రవాణా చార్జీలు మాత్రం ఘనంగానే పెంచారు. వీటి భారం పరోక్షంగా ప్రజలందరూ కలిసి మోస్తారు.  
ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. అలాగే, భద్రతకు పెద్దపీట వేసి,  రైలెక్కిన ప్రయాణీకుడి పేరు ముందు 'లేటు' అని రాయాల్సిన అవసరం లేకుండా చేస్తే మరీ గ్రేటు. (27-02-2015)    

NOTE: Courtesy Cartoonist 

26, ఫిబ్రవరి 2015, గురువారం

ప్రభువులవారి రైల్వే బడ్జెట్



ప్రధాని మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు  రెండో రైల్వే బడ్జెట్ కూడా పట్టాలెక్కేసింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు సమర్పించిన ఈ బడ్జెట్ 'కొత్తగా పురుడు పోసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలను మాత్రం  ఉసూరుమనిపించింది. ఆంధ్ర.తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ 'ఈ బడ్జెట్ లో కాస్త కనికరం చూపండి మహాప్రభూ' అంటూ, అనేక సార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. బహుశా వారి మొర, మంత్రిగారి మనసు పొరలను తట్టిందో ఏమిటో కానీ, సురేష్ ప్రభువుల వారు,   తమ గంట పైచిలుకు చేసిన బడ్జెట్ ప్రసంగంలో కాస్త  దయతలచి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని 'రెండు వూర్ల పేర్లు' ఓసారి అనామత్తుగా ప్రస్తావించి వూరుకున్నారు.  'ఖాజీపేట (తెలంగాణా) - విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్) నడుమ మూడో రైలు మార్గం వేసే ప్రతిపాదన పరిశీలనలో వుంద'ని దాని తాత్పర్యం. తాత దగ్గుకే మురవమన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలవాళ్లు ఆ ఒక్క మాటకే మురిసి ముక్కచెక్కలవుతారని మంత్రిగారి అభిప్రాయమేమో తెలవదు. 


      

ఏ బడ్జెట్ అయినా అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది రెండురకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహోబడ్జెట్. ప్రతిపక్షం వారికి అదే బడ్జెట్ అంకెల గారడీ. అయితే ఈ రెండు కళ్ళే కాదు, పైకి కనబడని  మూడో కన్నుమరోటి వుంది. అది ప్రజలది. అంటే ప్రయాణీకులది. అందులోనూ అతి సాధారణ ప్రయాణీకులది. కానీ వారి గోడు ఎన్నికల సమయంలో తప్ప ఎవ్వరికీ పట్టదు. తమ ఈ 'మూడో కన్ను' తెరవాలంటే ఎన్నికలదాకా ఆగాలన్న ముని శాపం వాళ్లకు  వుంది.

గతంలో రైల్వే మంత్రులగా పనిచేసినవాళ్ళల్లో చాలామంది 'తమ' ప్రాంతాల 'పాల రుణం' అంతో ఇంతో కొంత  తీర్చుకున్నారు. వీరిలో బెంగాల్ ఆడపులి మమతా బెనర్జీ పేరే ముందు చెప్పుకోవాలి. యూపీయే హయాములో ఆమె రైలు భవన్ రాణీగా ఓ వెలుగు వెలిగినప్పుడు రైల్వే బడ్జెట్ లో సింహభాగాన్ని తూర్పు వెళ్ళే రైలుఎక్కించడానికి ఆవిడ  ఎంతమాత్రం సంకోచించలేదు. ఆ రాష్ట్రంలో గత 34 ఏళ్లుగా అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్న ఎర్రదండుపాలనకు శ్రీమతి బెనర్జీ 'ఎర్ర జెండా' చూపగలదేమో అన్న ఆశతో వున్న అప్పటి  యుపీఏ నాయకులు, ఆవిడ ప్రతిపాదించిన (బెంగాల్) రైల్వే బడ్జెట్ కు పచ్చజెండా వూపారు. ఆవిడ సమర్పించిన రైల్వే బడ్జెట్ లో  పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో హౌరాఅని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్ లో సాఫ్ట్ వేర్ ఎక్సేలెన్సీ సెంటర్, కోల్ కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి మెట్రో కు 34 కొత్త సర్వీసులు ఇలా వరాల వాన కురిపించారు. లోగడ రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ 'తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది' అన్న రీతిలో మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ను రూపొందించి, పుట్టింటిపై  ప్రేమను పార్లమెంటు సాక్షిగా  బాహాటంగా ప్రదర్శించి చూపారు. 'సొంత రాష్ట్రానికి, సొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో' అని సంకోచించే నిత్య శంకితులకు మాత్రం నిజంగా  ఇది కనువిప్పే.
ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోకసభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మాత్రమే మహజరులు సమర్పిస్తారు.  రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలనో  ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీఆర్  ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. కానీ వాటిని కొత్త ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనబడడం లేదు.
ఏదిఏమయినా, ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వే మంత్రి పూర్తి న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  గత జులైలో సమర్పించిన రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదనకు నోచుకున్న కొన్ని స్పీడ్ రైళ్ళు మాత్రం, ఆ ఒక్క రోజు  టీవీ స్క్రోలింగులకే పరిమితం అయ్యాయి కాని,  పట్టాలు ఎక్కిన దాఖలా లేదు. 'వూరికే మాటలు చెప్పడం యెందుకు అనుకున్నారేమో' ఈసారి అలాటి ప్రతిపాదనల వూసు కూడా లేదు. విశాఖ కేంద్రంగా  కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి మళ్ళీ  నిరాశే ఎదురయింది.
అయితే, ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. చార్జీలు ఏమీ పెంచలేదు. ఎందుకంటే ఆ పని ఆర్నెళ్ల ముందుగానే పూర్తయిపోయింది కాబట్టి.  

ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. అలాగే, భద్రతకు పెద్దపీట వేసి,  రైలెక్కిన ప్రయాణీకుడి పేరు ముందు 'లేటు' అని రాయాల్సిన అవసరం లేకుండా చేస్తే మరీ గ్రేటు.    
NOTE: Courtesy Image Owner