23, ఆగస్టు 2014, శనివారం

అసెంబ్లీలో అసలేంజరుగుతోంది? -భండారు శ్రీనివాసరావు


(24-08-2014 ఆదివారం 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
గత కొంత కాలంగా పేపర్లు చదువుతున్నా,  పాత పేపర్లు తిరగేస్తున్నా,  టీవీ చర్చలు చూస్తున్నా  సామాన్య జనానికి  మనసులో మెదిలే ప్రశ్న ఇదే.
ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎలాంటి  రాజకీయపార్టీకయినా ఏవో కొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్థిరమైన భావజాలాలుంటాయి. కానీ ఈనాడు  దాదాపు  అన్ని రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.
ఏకంగా  శాసన సభను వేదికగా చేసుకుని ఎదుటివాళ్ళు అసభ్యపదజాలం వాడుతున్నారంటూ చేసే ఆరోపణల్లో కూడా అదేమాదిరి పదాలు దొర్లడం చూస్తుంటే  గోటితో పోయేదానికి గొడవలవరకు లాగుతున్నారన్న అభిప్రాయం సామాన్య జనాల్లో కలుగుతోంది. గొడవలకు కారణభూతులెవ్వరో తేల్చుకునే క్రమంలో మరిన్ని గొడవలకు అంకురార్పణ చేస్తున్నారు. జరిగినదానికి మొత్తం బాధ్యత అవతలవారిపై మోపుతూ అసలు బాధ్యతల నుంచి తప్పించుకునే దృశ్యం దృగ్గోచరమవుతోంది.
విమర్శలు చేసినప్పుడు, వివరణలు ఇస్తున్నప్పుడు గతాన్ని తవ్వుకోవడం వల్ల విషయం పక్క దోవపడుతూ, సభాసమయం వృధా అవుతున్న అంశాన్ని పట్టించుకోవడం మరచిపోతున్నారు. ఏది పార్లమెంటరీ పదం? ఏది కాదు? అనే విషయంలో ఇదమిత్థమైన నిబంధనలు ఉన్నప్పటికీ, సభాసాంప్రదాయాల విషయంలో లక్షలు ఖర్చు చేసి శిక్షణ ఇప్పించినప్పటికీ వాదప్రతివాదాల వేడిలో అవన్నీ ఆవిరైపోతున్నాయి. గొడవలకు మూలకారణం మీరంటే మీరని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ, చివరికి ఎవరిది తప్పో ఎవరిది వొప్పో తేల్చుకోలేని పరిస్తితిని స్వయంగా కల్పించుకుంటున్నారు. తమ వాదాలకు బలం చేకూర్చుకునే క్రమంలో వాడే భాష అదుపుతప్పి అనవసర గందరగోళాలకు కారణమవుతోందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. సభలో సాగుతున్న ప్రతిదాన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్న సంగతి మరచిపోతున్నారు.     
పార్టీల విషయం వచ్చేసరికి ఎవరికీ నిబంధనల  సంగతి  పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. నిందారోపణలు చేయడానికి, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఏ పార్టీకి  ఆ పార్టీవారు మూకుమ్మడిగా ఒక్కటై  ఒక్కపెట్టునలేచి మాట్లాడడం, అధికారపక్షం, ప్రతిపక్షం తేడాలేకుండా పోడియంలోకి దూసుకుపోయి సభాకార్యక్రమాలకు అంతరాయం కల్పించడం ఇవన్నీ గమనిస్తున్నవారికి, ముందే పేర్కొన్నట్టు అసలు అసెంబ్లీలో ఏం జరుగుతోంది అన్న అనుమానం అందరి మనసుల్లో ఇంతింతై అంతింతై అన్నట్టు పెరిగిపోతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.
గతాన్ని తవ్విపోసుకోవడం  తప్పుకాదు అన్న తరహాలో అందరూ  వ్యవహరిస్తున్నారు కాబట్టి ఒకసారి  గతంలోకి తొంగిచూస్తే, పాత రోజుల్ని పునశ్చరణ చేసుకుంటే కానవచ్చే దృశ్యం 'గతకాలము మేలు' అన్న సూక్తిని గుర్తుచేస్తుంది.
రాష్ట్రం విడిపోయిన తరువాత కొత్తగా ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ శాసన సభకు పాత అసెంబ్లీ భవనాన్ని కేటాయించారు. అయ్యదేవర కాళేశ్వర రావు వంటి స్పీకర్లు, పుచ్చలపల్లి సుందరయ్య,  తెన్నేటి విశ్వనాధం, పిల్లలమఱ్ఱి వెంకటేశ్వర్లు వంటి ప్రతిపక్ష దిగ్గజాలు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావువంటి నేతలు కలిసి కూర్చుని సమాలోచనలు జరిపిన సభామందిరం అది.  అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు.
శాసన సభలో ఏం జరిగిందో సవివరంగా అదే రోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు
పదిహేను నిమిషాలపాటు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి పత్రికల్లో పనిచేసే జర్నలిష్టులు సమీక్షలు రాసేవాళ్ళు. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది.
సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో కదలికమొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి.
ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.
ఇక శాసనసభ విషయానికి  వస్తే-
అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. 

టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో మరో అంశం చర్చనీయాంశం అవుతోంది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు. అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారడం ఇందులో దాగున్న విషాద కోణం. అయితే,  టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  ఒకే ఒక్క  అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని ప్రతిపక్షాలు కూడా అలవరచుకోవాలి. అదే సమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే భాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌధ పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి. (23-08-2014)

                                                      



21, ఆగస్టు 2014, గురువారం

సింగపూర్లో కేసీఆర్ - చిన్న మా ఫామిలీ టచ్


తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటనలో భాగంగా హోటల్ రిట్జ్ లో భారత పారిశ్రామిక సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఆదిత్య కృష్ణ రాయ్ అనే ఒక తెలుగు  యువకిశోరం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. మీరు చూస్తున్న ఫోటోలో కేసీఆర్ తో కనబడుతున్న శాల్తీ ఆదిత్యే. ఈ ఆదిత్య  యవరయ్యా అంటే మీలో చాలామందికి తెలిసిన నా క్లాస్ మేట్ వనం జ్వాలా నరసింహారావు కుమారుడు. జ్వాలా ఎవరయ్యా అంటే కేసీఆర్ సీపీఆర్వో. సీఎం తో ఆదిత్య కలయికకి జ్వాలా ఉద్యోగానికి ఎంతమాత్రం సంబంధం లేదు. ఈ ఆదిత్య యవరయ్యా అంటే  సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దేశాలకు గూగుల్ సంస్థ హెచ్ ఆర్ డైరెక్టర్. అంతే  కాదు వాడికి ఇంకో  హోదా వుంది. అది ఇంకా గొప్పది.  అదేమిటయ్యా అంటే ఆదిత్య మా మేనకోడలు విజయలక్ష్మి ఏకైక పుత్రుడు.



(కేసేఆర్ తో ఆదిత్య)

సూదికోసం సోది




జోకులు పంచుకుంటే పెరుగుతాయి అనేది ఓ హితవచనం. జోకులకి కాపీ కొట్టే రైట్లే కాని కాపీ రైట్లు వుండవన్నది మరో ఉచాచ. ఈ ఉపోద్గాతం ఎందుకంటె నిన్న మార్కెట్లోకి వచ్చిన ఆంద్ర జ్యోతి 'నవ్య' వారపత్రిక (27-08-2014) ఈరోజు మాఇంటికి చేరింది.  అందులో  61వ పేజీలో  One more cup coffee అనే శీర్షిక కింద 'వైనతేయ' అనే కలం పేరుతొ 'అన్యోన్య దాంపత్యం' అనే చిన్న గల్పిక ప్రచురించారు. రెండేళ్లకు పూర్వమే  అంటే 2012 మే నెలలో నేను నా బ్లాగులో 'గుర్తురావడం లేదు' అంటూ ఒక రచన పోస్ట్ చేసాను. నిజానికి దానికి మూలం నెట్లో సంచరిస్తున్న ఒక ఇంగ్లీష్ కధ. నేను దాన్ని నాదైన శైలిలో తెలుగులోకి మార్చాను. అదే మళ్ళీ ఈ రోజు మరో రూపంలో 'నవ్య'లో దర్శనం ఇవ్వడం కేవలం కాకతాళీయం కావచ్చు. మలయాళంలో సినిమాని హిందీలో డబ్ చేస్తే దాన్ని తెలుగులోకి అనువదిస్తే తిరిగిదాన్నే మలయాళంలోకి మార్చిన సినిమా కధలు వింటుంటాం. ఇదీ ఆ కోవలోనిదే. 


           

గుర్తు రావడంలేదు - భండారు శ్రీనివాసరావు 
ఎనభయ్యవ పడిలో పడ్డ పరమేశ్వరాన్ని ఆయన బాల్య స్నేహితుడయిన ఏకాంబరం చాలా  ఏళ్ళ తరువాత ఇంటికి  ఆహ్వానించాడు.
భోజనాలు అయిన తరువాత ముసలివాళ్లిద్దరూ ఆరుబయట మంచాలు వేసుకుని పిచ్చాపాటీ మొదలుపెట్టారు.
పైకి ఏదో మాట్లాడుతున్నాడన్న మాటే కాని పరమేశ్వరాన్ని మనసులో ఒక సందేహం తొలుస్తోంది.
వచ్చినప్పటినుంచీ చూస్తున్నాడు. ఏకాంబరం భార్య కొంగుపట్టుకుని తిరుగుతూ చూడు కన్నా, చూడు బుజ్జీఅంటూ ఒకటే నస.
ఇన్నేళ్ళ సంసారం తరువాత కూడా ఏకాంబరం భార్య పట్ల చూపిస్తున్న ప్రేమానురాగాలు, ప్రేమతో పిలుస్తున్న తీరూ గమనించిన పరమేశ్వరానికి మతిపోయినట్టుగావుంది. 
వాళ్ల  పెళ్ళయి దాదాపు అరవై ఏళ్ళు దాటిపోయాయి. అయినా ఏదో నిన్ననో మొన్ననో పెళ్ళిచేసుకున్న జంటలా ఆ పిలుపులు ఏమిటో.
వుండబట్టలేక ఏకాంబరాన్నే నేరుగా అడిగేసాడు అదేమిట్రా ఇంకా చిన్నపిల్లాడిలా పెళ్ళాన్ని పట్టుకుని కన్నా, బుజ్జీ అంటూ ఆ పిలుపులేమిటి? ఎంచక్కా పెళ్ళాన్ని పేరుతొ పిలవచ్చుకదా! అంటూ.
ఏకాంబరం జవాబు చెప్పాడు.
నాకూ పేరుతొ పిలవాలనే  వుంది. కానీ అదేమిటో కానిఆమె పేరు 
 మరచిపోయి పదేళ్లవుతోంది. ఇప్పుడు నీ పేరేమిటని పొరబాటున అడిగాననుకో ఆ రాక్షసి నా ప్రాణం తోడుకుతింటుంది.’ (May-2012)

NOTE: Courtesy Cartoonist Mallik

వెనుకడుగు వేద్దాం రండి (ఈరోజు సీనియర్ సిటిజన్స్ డే)


జీవితమంటే శక్తి. బలహీనతకు మరోపేరే మృత్యువు. మన వూహలు,ఆలోచనలు,ఆశలు,ఆశయాలు అన్నీ మన జీవితాల్లో భాగమే!” – స్వామి  వివేకానంద

అరవయ్యో పడిలో పడ్డ చాలామంది ఏదో తెలియని అభద్రతా భావంతో కలత చెందుతుండడం కద్దు. వయసు మీద పడుతోందన్న భావన కావచ్చు. జీవితం మలిసంధ్యలో అడుగు పెడుతున్నామన్న భయం కావచ్చు. సంఘంలో, కుటుంబంలో తమకున్న ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతున్నదేమో అన్న  బాధ  కావచ్చు. కారణం ఏదయినా వయసు మీరుతున్నవారిలో ఈ రకమయిన ఆందోళనలు  సహజం.       
ముందు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ముసలితనం వచ్చేసిందని చెప్పుకోకపోవడం.
వయసుల్లో మూడు రకాలున్నాయి.జనన తేదీ ప్రకారం చెప్పుకునే వయసు ఒకటయితే,రెండోది శారీరిక ఆరోగ్యం ఆధారంగా అంచనా వేసేది. ఇక మూడో వయస్సు అనేది మన భావనలు  బట్టి ఆలోచనలు బట్టి నిర్ధారణ అవుతుంది. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులుఅని శ్రీ శ్రీ రాసింది ఇలాటి వారి గురించే.
ఇందులో మొదటి దానిమీద మనకు కంట్రోల్ వుండని మాట నిజమే. నిజానికి ఆ వయసును ఏమాత్రం మార్చలేము, ఏమార్చలేము.
కాకపోతే రెండోదాన్ని మానవ ప్రయత్నంతో  కొంతవరకు అడ్డుకోవడానికి వీలవుతుంది. అంటే సరయిన  పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మనసును ఉల్లాసంగా వుంచుకోవడం ద్వారా కొంతమేరకు వయసు ప్రభావం శరీరం మీద పడకుండా చూసుకోవచ్చు. సానుకూల వైఖరి, ఆశావహ దృక్పధం పెంపొందింపచేసుకోవడం వల్ల మూడో రకం వయస్సును అదుపుచేసుకోవడానికి  కుదురుతుంది.
ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూక్తి చిన్నప్పటినుంచి వింటున్నదే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూక్తిలోని భాగ్యానికినిర్వచనాన్ని మార్చుకోవాల్సి వుంటుంది.
భాగ్యం అంటే సంపద కాదు. బ్యాంకుల్లో వుండే డబ్బు కాదు. కుటుంబం అందరూ ఆనందంగా సంతోషంగా వుండడం. వయసు మళ్లి  పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఆలోచించుకోవాల్సింది డబ్బు గురించి  కాదు. ఆరోగ్యంగా వుండేట్టు చూసుకోవడం ముఖ్యం. వెనుకటి మాదిరిగా ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిపోయింది. ఉద్యోగాలు, ఉపాధులు వెతుక్కుంటూ పిల్లలు దూర ప్రాంతాలకు, ప్రదేశాలకు తరలివెడుతున్న కాలమిది. రోగం రొష్టూ పేరుతొ వారిని ఇబ్బందుల పాలు చేయకుండా ఆరోగ్యాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈనాటి పెద్దతరంపై వుంది. కొద్దిపాటి క్రమశిక్షణ అలవరచుకుంటే ఇదేమంత పెద్దపని కాదు.         
హాయిగా మనసెంతో తీయగా
మనసును హాయిగా వుంచుకోవాలి. ఇతరులను హాయిగా వుంచాలి. కుర్రవాళ్లల్లో కుర్రవాళ్ళుగా మసలగలగాలి. అంటే టీ షర్టులు వేసుకోవడం, షార్టులు ధరించడం కాదు. మా రోజుల్లో అయితే...అంటూ నస పెట్టకుండా వాళ్లకు నచ్చేరీతిలో మీ రోజుల్లోని సంగతులను మనసుకు హత్తుకునే పద్దతిలో చెప్పడం  అలవరచుకోవాలి.      
సమయం అమూల్యం
ఈ జీవన యానంలో సంపాదించింది యెంత వున్నా పోగొట్టుకున్నది, పోగొట్టుకునేది  మాత్రం అమూల్యమయిన సమయాన్నే అని గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచీ ప్రతి రోజూ కొత్తగా మళ్ళీ పుట్టామని అనుకోవాలి. నిన్న అనేది క్యాన్సిల్ చేసిన చెక్కు. రేపనేది ప్రామిసరీ నోటు. పోతే,  ఈ రోజు అనేది వుంది చూసారూ అది మాత్రం  చేతిలో వున్న పైకం. దాన్ని జాగ్రత్తగా ప్రయోజనకరంగా వాడుకోగలగాలి. ప్రతి క్షణాన్ని జీవించడం, ఆస్వాదించడం  నేర్చుకోవాలి. 
మార్పు శాశ్వితం.
మారుతూ  వున్నప్పుడు అది శాశ్వితమెలా అవుతుందన్న అనుమానాలు పెట్టుకోకూడదు. మార్పును అంగీకరించడం అంటే వరద వాలులో కొట్టుకుంటూపోవడం కాదు. మార్పు అనివార్యం. ఈ సత్యం అంగీకరించగలిగితేనే యువ తరంతో, రానున్న తరంతో  సంబంధాలు బాగుంటాయి. పిల్లలు చెప్పేదేమిటి అని కొట్టిపారేయకుండా ఆ చెబుతున్న దానిలో కొత్తదనాన్ని గ్రహించగలిగితే ముసలి వాసనలుమన నుంచి తప్పుకుంటాయి.

ఇక ఆఖరుదీ అతి ముఖ్యమైనదీ ఏమిటంటే
మరణ భయం
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి వ్యక్తీ గిట్టక తప్పదు. ఇది తెలియని వాళ్లు వుండరు. కానీ తెలియనట్టుగా వుంటారు. రేపు పదవీ విరమణ చేసే వ్యక్తి కూడా చేస్తున్న ఉద్యోగం  శాశ్వతమే అన్న భ్రమలో వుంటాడు. అలాగే మరణం తధ్యమని తెలిసీ అది తన జోలికి రాదన్న భ్రాంతిలో మనుషులు బతుకుతారు. శరీరం బలహీనపడి, అభద్రతాభావం బలపడి ఒక్కసారి మరణ భయం పట్టుకున్నదంటే చాలు ఇక ఆ మనిషి మరణానికి చేరువయినట్టే. అందుకే మరణం గురించి ఆలోచించడం శుద్ద దండుగ.
జీవితాన్ని అరవైల్లో కూడా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది మన చేతుల్లోనే వుంది.

వయస్సు మళ్ళిన స్నేహితుల్లారా రండి. దర్జాగా  వెనుకడుగు వేద్దాం పదండి. వెనుకటి జీవితాన్ని మళ్ళీ ఆస్వాదిద్దాం రారండి.

(NOTE: Courtesy Image Owner)

కోతి వీసా


అనగనగా ఒక వూరు. ఆ వూర్లో ఓ జంతు ప్రదర్శనశాల.

అసలే ఇది చిట్టిపొట్టి కధ. ఈ కధలో పదేపదే వచ్చే ఈ పదాన్ని అలా సాగదీసి రాయడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ల భాషలో పొట్టిగా జూ అనుకుందాము.

ఆ జూ లోని ఓ బోనులో జూలు బాగా పెంచుకున్న ఓ సింహం వుంది. రోజుకు కనీసం ఓ కిలో మాంసం కూడా తన మొహాన విదల్చడం లేదని ఆ జూ అధికారులపై దానికి తగని కోపం. జూలు విదిల్చి, కాలు దువ్వాలని వుంది కానీ  ఏం లాభం.  తానున్నది అడవి కాదాయే. పైగా ఆ జూ అధికారులు అడవి జంతువులకన్నా క్రూరులు.  వాళ్లకు తిక్క తిరిగిందంటే దొంగలెక్కలు రాసి ఆ మాత్రం మాంసం కూడా పెట్టకుండా తన డొక్క మాడ్చగల సమర్ధులన్న సంగతి ఆ మృగ రాజుకు తెలుసు. అందుకే అనువుగాని చోట అధికులమనరాదు అన్న నీతి వాక్యం ప్రకారం మిన్నకుండి పోయింది.

కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలవదు. దాని గోడు విన్న తధాస్తు దేవతలు కరుణించారేమో తెలియదు. ఏదయితేనేమి, దుబాయిలో వున్న ఓ జూ అధికారి   రోజు ఈ జూ చూడడానికి వచ్చి, తగిన ఆహారం లేక చిక్కిపోయిన ఈ సింహాన్ని చూశాడు. చక్కనమ్మ చిక్కినా అందంఅనుకున్నాడేమో దాన్ని తన దుబాయ్ జూ కు తీసికెళ్ళాడు.

ఎమిరేట్స్ విమానం ఎక్కిన దగ్గరనుంచి సింహానికి ఆకాశంలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. ఆ దేశంలో జూలన్నీ సెంట్రల్ ఏసీ అని ఎవరో చెప్పగా విన్న సంగతి గుర్తు వచ్చి దాని వొళ్ళు పులకరించి పోయింది. ఎంచక్కా చల్లటి బోనులో కూర్చుని దుబాయ్ జూ అధికారులు రోజూ ఆహారంగా పెట్టే ఒకటి రెండు మేకలను కడుపారా తింటూ కడుపులో మాంసం  కదలకుండా కాలక్షేపం చేసే సన్నివేశాలను వూహించుకుంటూ ఆ సింహం దుబాయ్ జూ చేరుకుంది.

అది కలలు కన్నట్టే దానిని ఒక ప్రత్యేక బోనులో వుంచారు. నీటుగా దుస్తులు ధరించిన జూ పనివాడు ఒకడు పొద్దున్నే వచ్చి చాలా నీటుగా ప్యాక్ చేసిన ఆహారం పొట్లాన్ని అందించాడు. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకుంటూ సింహం ఆత్రంగా ఆ పాకెట్ విప్పింది. అందులో మూడు నాలుగు అరటి పండ్లు వున్నాయి. అసలే పరాయి దేశం - భాష అర్ధం కాక పొరపడ్డారేమోనని మొదటి రోజు సర్దిచెప్పుకుంది. కానీ రెండో రోజూ, ఆ మరునాడు కూడా పనివాడు అరటి పండ్లే పెట్టడంతో సింహానికి తిక్కరేగింది.
పండ్లు పట్టుకుని వచ్చినవాడిని నిలబెట్టి దులిపేసింది.

ఏం ఇక్కడ మీ అందరికీ నన్ను చూస్తే తమాషాగా వుందా. నేనెవరనుకుంటున్నారు. మొత్తం అడవికే రాజుని. అరటి పండ్లు తినడానికి నేనేమన్నా కోతి ననుకుంటున్నారా?’ అని గాండ్రించింది.

అయితే, సింహం గాండ్రింపులకు బెదిరిపోవడానికి ఆ జూ పనివాడు అడవిలో ఏనుగు కాదు కదా. అందుకే అతగాడు తాపీగా జవాబు చెప్పాడు.

నువ్వు సింహానివన్న విషయం ఇక్కడ పుట్టిన పిల్లులకు కూడా తెలుసు. కాకపోతే నిన్నిక్కడికి కోతి వీసా మీద తీసుకొచ్చిన సంగతే నీకు తెలిసినట్టు లేదు


నీతి: పరాయి దేశంలో కోతిగా వుండడంకన్నా మాతృదేశంలో సింహంగా బతకడం మేలు.


Note: Courtesy Image Owner 

20, ఆగస్టు 2014, బుధవారం

కోతి పైలట్



విమానం కూలిపోయింది. పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లతో సహా అందులో ప్రయాణిస్తున్నవారందరూ ఈ దుర్ఘటనలో మరణించారు, ఒక్క ఒక కోతి తప్ప. (విమానంలో కోతియేమిటంటే ఇక కధే లేదు)  

దాన్ని ఆసుపత్రిలో చేర్చారు. కాస్త కోలుకున్న తరవాత దుర్ఘటన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ఆ కోతిని విచారించడం ప్రారంభించారు. ఈ కధలో మరో  కొత్తదనం ఏమిటంటే ఆ కోతికి మనిషి భాష తెలుసు.
దర్యాప్తు ఇలా సాగింది.

అధికారి: విమానం బయలుదేరినదగ్గరినుంచి అన్ని విషయాలు చెప్పు. అసలేం జరిగింది.

కోతి: ఏముంది ఎయిర్ హోస్టెస్ నాకు పళ్ళూ బిస్కెట్లు పెట్టింది. అవి తింటూ కూర్చున్నాను.

నీ సంగతి సరే! మిగిలినవారు ఏం చేస్తున్నారు?”

సీటు బెల్టులు పెట్టుకున్నారు. మందు కొడుతూ కూర్చున్నారు

పైలట్లు ఏం చేస్తున్నారు?

 కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు

తరవాత?”

తరవాత ఏముంది ? ప్రయాణీకులందరూ ఫుల్లుగా మందు కొట్టి, ఎయిర్ హోస్టెస్ లు పెట్టింది తిని నిద్రలోకి జారుకున్నారు

మరి ఎయిర్ హోస్టెస్ లు ఏం చేస్తున్నారు?”

 తీరిగ్గా కూర్చుని లిప్ స్టిక్ దిద్దుకుంటూ, మేకప్ సరిచేసుకుంటున్నారు.

పైలట్లు?”

యధామాదిరి కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు.

అది సరే! ప్రమాదం జరగడానికి ముందు ఎవరేం చేస్తున్నారు ?”

ఎయిర్ హోస్టెస్ లు పైలట్లకు ముద్దులు  పెడుతున్నారు.

మరి  పైలట్లు ?”

 ఎయిర్ హోస్టెస్ లకు తిరిగి ముద్దులు  పెడుతున్నారు

నువ్వేం చేస్తున్నావు?”

ఒక్కత్తెను ఏం చేస్తాను,  కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నాను.



(నెట్ లో చక్కర్లుకొడుతున్న చిన్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్చానువాదం)


 NOTE: Courtesy Cartoonist)

19, ఆగస్టు 2014, మంగళవారం

సర్వేశ్వరార్పణం ......


'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' -  సాయంత్రం దాకా ఆగాల్సిన అవసరం లేకుండానే  ధనలక్ష్మిగారనే ఎన్యూమరేటర్  రూపంలో ఇప్పుడే వచ్చి వెళ్ళింది. ఇంత చిన్నవిషయానికా ఇన్నాళ్లబట్టి ఇంత రభస జరిగింది అనిపించేట్టుగా ముచ్చటగా మూడు నిమిషాల్లో మొత్తం తతంగం ముగిసిపోయింది. శుభం.



(విధినిర్వహణలో ఇంటికి వచ్చిన ఆడపిల్లల ఫోటో తీయడం భావ్యం సంభావ్యం కాదనుకుని, అసలా ఉద్దేశ్యమే మానుకున్నాను. కానీ ఈలోగా తెలంగాణా ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కల్సి సర్వే ఫారం పూర్తిచేస్తున్న ఫోటో లభించింది.)

NOTE:  Photo Courtesy CPRO to CM