5, ఆగస్టు 2014, మంగళవారం

నిజమేనేమో!


'పుట్టుకతో కాదు కాని నేను మాంసాహారినే' అంటుంది మా ఆవిడ.

ఎందుకంటే  తీరికూర్చుని  ఇతర్ల మెదళ్ళు తింటుంటానుట.  


4, ఆగస్టు 2014, సోమవారం

టీవీ చూస్తున్నా. ఏమిటా గోల?


(నెల్లుట్ల వెంకట రమణారావు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధనానికి అనువాదం)
ఏకాంబరం టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే భార్య చేతులు తుడుచుకుంటూ వచ్చి అడిగింది.
"ఏమిటి చూస్తున్నారు"
"ఐ పీఎల్. నువ్వూ కూర్చుని  చూడు"
"బ్యాట్ చేస్తున్నది బ్రిట్ లీ కదా"
"కాదు అతడు బౌలర్. ఇతడు క్రిస్ గేల్"
"ఓహో! అలా అనిపించింది. భలే! భలే! మళ్ళీ వికెట్ పడింది"
"అది రీప్లే. ఇందాకటిదే మళ్ళీ చూపిస్తున్నారు"
"అలాగా! నేనూ అదే అనుకున్నాను. చూస్తుండండి ఈసారి ఈ మ్యాచ్ ఇండియా గెలిచి  తీరుతుంది"
"ఐపీఎల్ ఇండియా ఆడే మ్యాచ్ కాదు. ఇప్పుడు జరుగుతున్న  మ్యాచ్ బెంగుళూరు ముంబై మధ్య"
"నేనూ అదే అనుకున్నాను. ఈ జట్టు గెలవాలంటే ఇంకా ఎన్ని రన్స్ చేయాలి"
"36 బంతుల్లో 72 పరుగులు చేయాలి"
"తేలిగ్గా చేయొచ్చు. ఒక్క బంతికి రెండు పరుగులు"
"ఈ గోలంతా యెందుకు. నీకు టీవీ కావాలి. సీరియల్ చూడాలి. అంతే కదా!"
ఏకాంబరం భార్యకు రిమోట్ ఇచ్చేసాడు. ఆమె ఛానల్ మార్చి సీరియల్లో మునిగిపోయింది.
"నిన్న ఎపిసోడ్ లో కనిపించలేదు. ఎవరావిడ?" ఏకాంబరం చిన్నగా అడిగాడు.
భార్య గయ్యిమని లేచింది.
"నన్ను చూడనివ్వరా? కాసేపు ఆగలేరా? సీరియల్ పూర్తయ్యేదాకా వూరికే పక్కన కూర్చుని ఇలా ప్రశ్నలతో చంపకండి."




NOTE: Courtesy Image Owner 

అబ్రకదబ్ర


నాటి మాటలు  
"ముఖ్యమంత్రి కాగానే చరిత్రను మార్చే సంతకాలు చేస్తా!" - వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
"ముఖ్యమంత్రి అవగానే సీమాంధ్రను సింగపూర్ చేసేస్తా!" - చంద్రబాబు నాయుడు
"తెలంగాణా రాష్ట్రంలో హెలికాఫ్టర్ అంబులెన్సులు ఏర్పాటుచేస్తా! ఆదిలాబాదును బంగారు తునకగా మారుస్తా!" " - కేసీఆర్
"సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తాం" - కేంద్ర మంత్రి జై రామ్ రమేష్



(మాంధాతల కాలంనాటి మాటలు కాదు - ఈ ఏడాది మార్చిలో చెప్పినవి - పాత పేపర్లలో కనబడ్డవి)

3, ఆగస్టు 2014, ఆదివారం

ఆడది అబల కాదు, మా ఆవిడ అసలే కాదు


'వ్రతం చేసుకుందాం' అన్నాడు మా వాడు. 'సరే' అంది మా ఆవిడ. రోజుకు పాతిక ముప్పయి టాబ్లెట్స్, మూడు ఇంజెక్షన్లు. అయినా సరే అంటుంది. అంత సుస్తీ చేసి, ఇప్పుడిప్పుడేకదా నువ్వు కోలుకుంటోంది. 'వద్దులే' అన్నది నా మాట. కానీ అది పైకి అంటే కదా!  చివరికి నేనూ సరే అనక తప్పలేదు.
మా పిల్లలు, మా అన్నయ్యగారి పిల్లలు. ఇల్లు కళకళ. శ్రావణ మాసం డిమాండ్ వున్నప్పటికీ మంచి పురోహితులవారు దొరికారు. 'పాతిక ముప్పయిమంది భోజనాలు మాకొక లెక్కా' అన్నారు మా కోడళ్ళు అత్తగారితో చేయికలిపి.
పొద్దున్న ఛానల్ కు వెళ్ళి వచ్చేసరికి  'అంతా తయార్!'


(చూశారా! మగబుద్ది. ఫోటోలో కూడా అంతా మగవాళ్ళే)

వ్రతం, భోజనాలు సలక్షణంగా, తృప్తిగా జరిగాయి. 'బాగా చేశారు' అనబోయాను. అనేవుంటాను. 'మాదేవుంది, అంతా ఆయనే చూసుకుంటాడు. మనం నిమిత్తమాత్రులం' అన్నారు అంతా కోరస్ గా.
చేసికూడా చెప్పుకోకపోవడం ఆడంగులకే చెల్లింది.

చెవిటిమేళం


చెవిటిమేళం 
ఏకాంబరానికి అనుమానం వచ్చిందే తడవుగా డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
మా ఆవిడకు చెవుడు వచ్చిందని నా అనుమానంచెప్పాడు డాక్టర్ తో.
వోస్ ఇంతేనా! మా పని చెవుడు నయం చేయడమేఅన్నాడు డాక్టర్.
మా ఆవిడ చెవుడు యెంత  ముదిరిందో తెలుసుకునే వీలుందా!
అదేమంత పని. దీనికి చిన్న టెస్ట్ వుంది. మీరే చేసుకుని  మీకు మీరే నిర్ధారణ చేసుకోవచ్చు
డాక్టర్ చెప్పిన చిట్కా విని ఇంటికి వెళ్లాడు ఏకాంబరం. భార్య వంట గదిలో వుంది.
డాక్టర్ చెప్పినట్టు,  కాస్త ఆమెకు దూరంగా నిలబడి,  ‘ఇవ్వాళ ఏం కూర చేస్తున్నావుఅని అడిగాడు.
ఏదో గొణుగుతున్నట్టు పెదాలు కదిలాయి కాని ఆమె దగ్గరనుంచి సమాధానం లేదు.
ఏకాంబరం ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఏం కూరఅంటూ మళ్ళీ అదే ప్రశ్న వేసాడు. అప్పుడూ ఆమెనుంచి స్పందన లేదు. ఇంకాస్త దగ్గరకు వెళ్ళి డాక్టర్ చెప్పినట్టే మళ్ళీ అదే అడిగాడు.
ఈసారి ఏకాంబరం భార్య నుంచి ఠకీమని  జవాబు వచ్చింది.
ఏం కూర ఏం కూర అని మూడు సార్లు అడిగారు. వంకాయ కూర అని మూడుసార్లూ  నెత్తీ నోరూ కొట్టుకుంటూ చెప్పాను. మీకేదో చెవుడు వచ్చినట్టుంది. ముందు పోయి ఏ డాక్టర్ కన్నా చూపించుకోండి



(నెట్లో సంచారం చేస్తున్న ఓ ఇంగ్లీష్ కధనం ఆధారంగా- యధావిధిగా IMAGE OWNER కి కృతజ్ఞతలు)  

వివాదాస్పద ఆత్మ కధలు - కొన్ని జ్ఞాపకాలు


మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు జలగం వెంగళరావు 'నా జీవిత కధ' అనే పేరుతొ ఒక ఆత్మకధ వెలువరించారు. ఆ పుస్తకంలో కొన్ని అంశాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావడంతో అది వివాదాస్పదం అయింది. "పీవీ నరసింహారావు ఒక తెలుగు మహిళా ఎంపీ తో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎదిగిన పిల్లల్ని  ఇంట్లో పెట్టుకుని  ఇలా ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యం కదా!"  అని శ్రీమతి ఇందిరా గాంధీ తనతో చెప్పారని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు గురించి  శ్రీమతి గాంధీ తనతో ఇలా చెప్పారంటూ  వెంగళరావు ఆ పుస్తకంలో ఉదాహరించిన విషయాలు దిగ్భ్రాంతి గొలిపేవిగా వున్నాయి.
"నేనింతవరకు అలాటి (పీవీ) అసమర్ధ నాయకుడ్ని చూడలేదు. కందూ భాయ్ దేశాయ్, త్రిపాఠీ, ఉమా శంకర్ దీక్షిత్ వంటి సీనియర్ అన్న నమ్మకంతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసాను. వివాహేతర సంబంధం పెట్టుకుని తిరగడం తప్ప ఆయన ఉద్దరించిది ఏమీ లేదు. ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం నాకెంతో బాధ కలిగిస్తోందని" ఇందిరాగాంధి తనతో చెప్పుకున్నట్టు వెంగళరావు పేర్కొన్నారు. శ్రీమతి గాంధీ పీవీ గురించి కొన్ని విషయాలు తనతో చెప్పి, అందువల్లే ఆయన్ని మార్చి నిన్ను (వెంగళరావును) ముఖ్యమంత్రిగా పంపాలని నిర్ణయానికి వచ్చినట్టు తనతో చెప్పారని వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.(ఆ  విషయాలు మరీ దారుణంగా వుండడంవల్ల ఈ వ్యాసంలో పొందు పరచడం లేదు - భండారు శ్రీనివాసరావు)
అలాగే మర్రి చెన్నారెడ్డి గురించి వెంగళరావు వెలిబుచ్చిన కధనాలు:
"సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడానికి నాలుగు రోజులు ముందు ప్రధాని తనయుడు చెన్నారెడ్డి స్థానంలో అంజయ్యను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ మరణ వార్త చెన్నారెడ్డిని సంతోషంలో ముంచివేసింది. సంతాపం వెలిబుచ్చడానికి బదులుగా చెన్నారెడ్డి సంబరాలు చేఉకున్నారనీ, మిఠాయిలు పంచిపెట్టారనీ, కృష్ణాజిల్లాకు చెందిన ఒక లెజిస్లేటర్ తనతో చెప్పినట్టు  వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, అసలా పుస్తకం తాను తన చేతుల్తో రాయలేదనీ, ఎప్పటి జ్ఞాపకాలో  గుర్తు తెచ్చుకుని చెబుతుంటే వాటిని తన కోడలు అక్షరబద్ధం చేసారని, పుస్తకం పూర్తయిన తరువాత దాన్ని సమాచార శాఖ ఉన్నతాధికారి, అనేకమంది ముఖ్యమంత్రులవద్ద పీ ఆర్ వొ గా పనిచేసిన భండారు పర్వతాలరావు 'ఎడిట్' చేసారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చారు.  పుస్తకంలోని అంశాలను ఒక పద్దతిలో కూర్చడంలో సూచనలు చేయడం తప్ప,  ఎవరినైనా కించబరిచే ఎలాటి ఉద్దేశ్యం తనకు ఎంతమాత్రం  లేదని వెంగళరావు సమర్ధించుకున్నారు. అయితే పుస్తకంలో కొన్ని అంశాలు కొందరు  వ్యక్తులను బాధపెట్టేవిగా  వున్నాయని, వాటిని తొలగించడం మంచిదనీ అంటూ తాను ముందుగానే వెంగళరావు దృష్టికి తీసుకువచ్చినట్టు పర్వతాలరావు వివరణ ఇచ్చారు.  అయినా ఆయన తన సహజ శైలిలోనే,  'ఏం పర్వాలేదంటూ'  తన సలహాను  పట్టించుకోలేదని,  అంచేత ఆ పుస్తకంలో తన పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని కోరినట్టు పర్వతాలరావు  చెప్పారు.
వెంగళరావు పేరుతొ వెలువడిన ఆ పుస్తకంలో పేర్కొన్న మరికొన్ని విషయాలు కూడా సంచలనాత్మకంగా తయారయ్యాయి. దేశంలో అత్యవసర పరిస్తితి (ఎమర్జెన్సీ) విధించాలనే నిర్ణయం తీసుకోబోయేముందు ఇందిరాగాంధి ఆ విషయాన్ని మొట్టమొదట తనతోనే చెప్పారని  వెంగళరావు పేర్కొన్నారు. జీవించిలేని వ్యక్తుల గురించి ఈ విధంగా రాయడం సబబు కాదని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.
1975 లో అలహాబాదు హైకోర్టు శ్రీమతి గాంధీ ఎన్నిక చెల్లదని తీర్పుఇచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ జగ్  మోహన్  సిన్హా, తన తీర్పు యెలా వుండబోతోందో రెండు నెలలకు ముందే  (కీర్తిశేషులు) జయప్రకాష్ నారాయణ్ కు తెలియచేసినట్టు తనతో చెప్పారని వెంగళరావు రాయడం మరింత వివాదాన్ని రేకెత్తించింది. ఆ ఆరోపణను  జస్టిస్ సిన్హా తీవ్రంగా తప్పుపట్టారు. 'ఇంతకంటే దారుణమైన పచ్చి అబద్ధం మరోటి వుండదు' అని  ఆయన వ్యాఖ్యానించారు.  
వెంగళరావు సొంత పార్తీవారిపైనే ఎక్కువ విమర్శలు చేశారు. ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి,  బియ్యపు మిల్లర్ల నుంచి భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేశారనీ, ఆ విషయం శ్రీమతి గాంధీ దృష్టికి వెళ్లినట్టు తెలియగానే అందులో  కొంత డబ్బు పార్టీ ఫండ్ కు జమచేసారనీ ఆ పుస్తకంలో రాశారు. ఆయన చాలావరకు ఇలాటి సంగతులు, తాను విన్నవి, ఇతరులద్వారా తెలియవచ్చినవీ రాసారు. ఆ ఆరోపణలకు నిర్దిష్టమైన ఆధారాలు లేకుండానే రాసుకుంటూ వెళ్లారు.
ఈ కోవలోకి వచ్చేదే  మరో ఆత్మకధ మల్లెమాల పేరుతొ ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత  ఎం.ఎస్.రెడ్డి రాసిన 'ఇదీ నా కధ'. ఆ పుస్తకంలో సినిమారంగానికి చెందిన అనేకమంది ప్రముఖుల ప్రస్తావనలు వివాదాస్పదం అయ్యాయి. ఎన్టీ రామారావు, జమున, డైరెక్టర్ గుణశేఖర్, యువ హీరో జూనియర్ ఎన్టీయార్ మొదలయినవారిని కించబరిచే వ్యాఖ్యానాలు వున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకం ప్రతులను విక్రేతలనుంచి వెనక్కి తెప్పించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
నాటి మేటి నటుడు ఎస్వీ రంగారావుతో  ఎన్టీ రామారావుకు పొసిగేది కాదని, అందువల్ల ఎస్వీయార్తో కలిసి నటించడానికి ఎన్టీ రామారావు నిరాకరించిన సందర్భాలు వున్నాయని మల్లెమాల రాశారు.'శ్రీ కృష్ణ రాయబారం' సినిమా సెట్టుపై తమిళనాడు ముఖ్యమంత్రి, నాటి నటి జయలిత, జమునల మధ్య తలెత్తిన మాటల యుద్ధం ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో వుంది.

తెలుగు సినిమా పరిశ్రమ మొత్తంలో జూనియర్ ఎన్టీయార్ వంటి గర్విష్టి మరొకడు లేడంటూ చేసిన ఆరోపణ ఆ యువ నటుడి అభిమానుల ఆగ్రహానికి  కారణం అయింది. ఈ విమర్శలు, ఆగ్రహ ప్రకటనలు మొత్తం మీద మార్కెట్ నుంచి తన పుస్తకాలను మల్లెమాల ఉపసంహరించుకునేలా చేసాయి.  

ఇద్దరు మిత్రులు వైఎస్ఆర్ - చంద్రబాబు


(ఈరోజు స్నేహితుల దినోత్సవం)
సరిగ్గా   ముప్పయ్యారేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు అనతికాలంలోనే  వేరైపోతాయని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం అంత త్వరగా ఆవిరి కాగలదని కానీ,  ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు నాయుడుకొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి. ఎందుకంటే...


(ఒకనాటి ప్రాణ మిత్రులు వైఎస్ఆర్ - చంద్రబాబు)

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టీకి ఆయనే  అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటికి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టీ  అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.
అలాగే, రెండో టరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది కూడా  మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపఠంలో   ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న స్థాయిలో వూహాగానాలు ఊపిరి పోసుకున్నాయి.  ఆయన హయాంలోనే  ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైకెక్కించే పధకాల రచనకు కంప్యూటర్  వేగంతో శ్రీకారం చుట్టారు. 
ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.  2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు.  గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే, బహుశా, ఏ  రెండేళ్ళో, మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపోయివుండేవారేమో.  సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు  కనుకనే అయిదేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడమే కాకుండా  పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ ను  సృష్టించారు.

ఒకప్పటి వారి స్నేహానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అందుకే, రాజకీయంగా విడిపోయిన ఈ రాజకీయ మిత్రులు ఇద్దరు  చివరికి భౌతికంగా కూడా విడిపోవడం చాలా విషాదం అనిపిస్తుంది.