9, జులై 2014, బుధవారం

ఇంతేరా ఈ జీవితం!


(కధలకోసం కంచికే పోనక్కరలేదు.వెతుక్కుంటే జీవితాల్లోనే కనబడతాయని ప్రబోధిస్తూ నెట్లో సంచరిస్తున్న ఆంగ్ల కధనానికి  స్వేచ్చానువాదం. ఆస్ట్రేలియాలోని  వృద్ధుల సంరక్షణ కేంద్రంలో  ఓ ముదివగ్గు మరణిస్తూ వొదిలి వెళ్ళిన ఓ లేఖ ఇది. - భండారు శ్రీనివాసరావు)



అప్పుడు నాకు పదేళ్లు. అమ్మానాన్న, అన్నలు,తమ్ముళ్ళు,అక్కలు చెల్లెళ్ళు ఒకరికోసం ఒకరు, అందరికోసం అందరూ.
పదహారేళ్ళు వచ్చేసరికి మొలుచుకొచ్చాయి కాళ్ళకు రెక్కలు.
ఇల్లు పట్టదు. ఇంట్లోవాళ్ళు పట్టరు. ఏ ఆడపిల్లను చూసినా నా కోసమే పుట్టిందనే నమ్మకం.
పాతికేళ్ళు వచ్చాయి. వెనక్కు తిరిగి చూసుకుంటే అన్నీ నెరవేర్చని హామీలే నిలబెట్టుకోలేని వాగ్దానాలే. 
మూడుపదుల వయస్సు మీదపడింది. పెళ్లయింది. పిల్లలు పుట్టారు. బాధ్యతలు మీద పడ్డాయి.
మరో అయిదేళ్లు గడిచాయి. పిల్లలు పెరుగుతున్నారు. పిల్లలతో పాటే వారితో అనుబంధాలు పెరుగుతున్నాయి. భుజానపడ్డ బరువు బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి.
నలభయ్యో పడిలో పడేసరికి చదువులపేరుతోనో, ఉద్యోగాల పేరుతోనో  పిల్లలు బయటి వూళ్ళ బాట పట్టారు. బాధ్యతల భారం తగ్గింది. కాని వాళ్ళతో దూరం పెరిగింది.
చూస్తుండగానే యాభై! అప్పుడే సగం జీవితం గడిచిపోయిందా!
అనుకునేంతలో కాస్త స్వాంతన. పిల్లల పిల్లలతో బతుకు కొత్త చిగురు వేస్తోందన్న చిన్న ఆశ.
బాధ్యతలు పూర్తికాకుండానే షష్టిపూర్తి.
పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలు తీరకుండానే నేను పుట్టిన సంవత్సరం గిర్రున తిరిగొచ్చి పలకరించింది.        
మరో పదేళ్లు గడిచాయి. విధి చావుదెబ్బ కొట్టింది.
నాతో  జీవితాన్ని పంచుకుని, నా వెంటే నడిచివస్తున్న నా సహధర్మచారిణి ఇంక  సెలవంటూ  శాశ్వితంగా సెలవు తీసుకుంది.
నా ముసలితనాన్ని కూడా లెక్కచేయకుండా వొంటరితనం నన్ను కౌగలించుకుంది. ఆ కౌగిట్లో అంతా అంధకారమే!
పెరిగి పెద్దయిన  మా పిల్లలు  వాళ్ల పిల్లల పెంపకంలో మునిగి తేలుతున్నారు.
ఒకప్పటి నా ఆ వయస్సు గుర్తుకొచ్చింది. అమ్మానాన్నలు లీలగా కళ్ళల్లో కదిలారు. వాళ్లు అనుభవించిన  వొంటరి జీవితం తడారిపోయిన నా కంటిగుడ్డుపై  కదలాడింది.
ఆ రోజుల్లో అద్దంలో పదే పదే  చూసుకుని మురిసిన నా రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
నిగనిగ లాడే నల్లని జుట్టు, కండలు తిరిగిన వొళ్ళు, కంకర రాళ్ళను సైతం కరకర నమిలే పళ్ళు, ఖంగున మోగే కంఠం, ఆయాసపడకుండా  అంతస్తులను ఎక్కగలిగిన పటుత్వం. ఇవన్నీ అనుకున్నాను శాశ్వితం.
కానీ! ఏవీ అవి ఎక్కడ?
 ‘ముడతలు పడ్డ మొహం, నెరిసి రాలిపోయిన జుట్టు, బోసి నోరు, నంగి మాటలు, ఎవరు ఎవరో చప్పున గుర్తుపట్టలేని స్తితి.
వొళ్ళు వొణుకుతుంది, మాట తడబడుతుంది.
ఒకప్పుడు స్పందించే, జ్వలించే గుండె వుండేది. ఇప్పుడక్కడ వుంది మాత్రం చలనం లేని  ఓ బండ.
అయితే- ఎవరో కవి అన్నట్టు ఎముకలలో,బొమికలలో కానరానిదొకటున్నది
ఈ ఎముకల గూటిలో పరికించి చూస్తే ఒకనాటి యువకుడు కనబడతాడు.
అతడి కనుకొలకుల్లో నాటి ఆశారేఖలు రేఖామాత్రంగా కానవస్తాయి.
ఆ ఆశల తడిలో ఇంకా పచ్చగా వున్న జీవితేచ్చ కనబడుతుంది.
జీవితంపై పెంచుకున్న ప్రేమ కనబడుతుంది.
చూడండి. కళ్ళు తెరుచుకుని ఓమారు చూడండి.
నాలో మిమ్మల్ని చూసుకోండి.
ఇది జీవితం. ఇదే జీవితం. వద్దన్నా వొదిలిపోదు.
కట్టిపడేసుకుందామన్నా కట్టుబడి వుండదు.
ఈ సత్యం  తెలుసుకోండి.

(ఉత్తరం రాసిన అజ్ఞాత వ్యక్తికి, ఇమేజ్ సొంతదారుకు  కృతజ్ఞతలతో)  

8, జులై 2014, మంగళవారం

రైల్వే బడ్జెట్



ఏ బడ్జెట్ అయినా అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది రెండురకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహోబడ్జెట్ అయితే ప్రతిపక్షం వారికి అంకెల గారడీబడ్జెట్. కానీ ఈ రెండు కళ్ళే కాదు మూడో కన్నుమరోటి వుంది. అది ప్రజలది.



బడ్జెట్ లోనే చార్జీలు పెంచే  పద్ధతికి అన్ని  ప్రభుత్వాలు ఏనాడో స్వస్తి చెప్పేశాయి కనుక, రైల్వే  బడ్జెట్ గురించి గతంలో వున్న ఆసక్తి ఈనాడు జనంలో లేనట్టే లెక్క. అయినా ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులందరూ తమ విద్యుక్త ధర్మానుసారం బడ్జెట్ మంచిచెడ్డలు గురించి వ్యాఖ్యానాలు గుప్పించారు.ముందే చెప్పినట్టు అధికార పక్షం వాళ్ళు బడ్జెట్ అద్భుతంఅన్నారు. విపక్షంవాళ్ళు కొత్త సీసాలో పాతసారావంటి పాతపల్లవులనే సరికొత్తగా వినిపించారు. ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ 'నిరాశా జనకం' అనే ఒక్క ముక్కతో సరిపెట్టుకోకుండా ఒక అడుగు ముందుకు వేసి ధర్నాలు, నిరసన ప్రదర్శనల వరకు వెళ్ళింది.
ఇక, లోకసభలో అటు ఆంధ్ర ప్రదేశ్ లో, ఇటు తెలంగాణాలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు తమ రాష్ట్రాలకు  రైల్వే బడ్జెట్ లో దక్కించుకున్న వాటా ఎంత అని ఆలోచించుకుంటే, కడుపుచించుకుంటే కాళ్ళమీద పడ్డట్టయిందన్న చందానవుంది.
ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోక సభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మాత్రమే మహజరులు సమర్పిస్తారు. ఇవి ఎక్కువగా, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు స్టాప్ఏర్పాటు చేయాలనో ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీయార్ ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. కానీ వాటిని కొత్త ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనబడడం లేదు.

ఏదిఏమయినా, ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వే మంత్రి పూర్తి న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రెండు స్పీడ్ రైళ్ళు మాత్రం టీవీ స్క్రోలింగులలో షికార్లు చేసాయి. అవి పట్టాలు ఎక్కినప్పుడే కాస్తంత జనాలకు వూరట. కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి నిరాశే ఎదురయింది.

ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. ఎందుకంటే ఆ పని ముందుగానే పూర్తయిపోయింది కాబట్టి. రిజర్వేషన్ వేగం పెంచడం, పోస్ట్ ఆఫీసుల్లో కూడా టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా ఆహ్వానించదగ్గవే. పాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచడంవల్ల ప్రయోజనం పొందేది సామాన్యులే అన్నది కూడా ఇక్కడ గమనంలో వుంచుకోవాలి. ఎందుకంటె రైల్వే లకు మొదటి రూపాయి చెల్లించేది సాధారణ ప్రయాణీకులే.

ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటుప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క.

7, జులై 2014, సోమవారం

నగరంలో వాన


"వానా! కరెంటా!  ఏదో ఒక్కటే" అన్నాడు దేవుడు.
"వానే!" అన్నాము అందరం ముక్త కంఠంతో.
"తధాస్తు' అంటూ వెళ్ళిపోయాడు దేవుడు మహాశయుడు.


భోరున వర్షం పడింది.
చటుక్కున కరెంటు పోయింది. ఎప్పుడూ వస్తుందో ఆ దేవుడికి కూడా తెలియదు.       

కలల్ని ఆవిష్కరించిన కేసీయార్



ఆ సమయంలో కరెంటు వుండడం వల్ల నేను ఆసాంతం కేసీయార్ ప్రసంగాన్ని టీవీ తెరపై చూడగలిగాను. మాటల మాంత్రికుడని, మాటలతో ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తారని ఆయనకు పేరుంది. అయితే ఈరోజు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  నవ తెలంగాణా లక్ష్యాలు వివరిస్తూ ఆయన చేసిన  ప్రసంగానికి శ్రోతలుగా వున్నది అంత ఆషామాషీ వ్యక్తులు కాదు. మొత్తం తెలంగాణా అధికారయంత్రాంగం ఆయన మాటల్ని ఆలకించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.



బహుశా వారిలో చాలామందికి తాము ఎరిగివున్న కేసీయార్ కు బదులు కొత్త కేసీయార్ కనబడివుంటాడని టీవీలో చూస్తున్న నాకు అనిపించింది. నవ తెలంగాణా యెలా వుండాలి అనే దానిపై ఆయన అభిప్రాయాలు యెలా వుంటాయి అనేదానిపై నాకు అవగాహన వుంది. ఎందుకంటే ఎన్నికలకు చాలా పూర్వమే తెలంగాణా జర్నలిస్టులు ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో ఆయన అంతరంగ ఆవిష్కరణకు నేను ప్రత్యక్ష శ్రోతను. ఇవాల్టి సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమి మాట్లాడింది రేపటి పత్రికల్లో వివరంగా వస్తుంది. అంచేత ఆ వివరాల జోలికి పోవడం లేదు. కానీ ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. చెప్పదలచుకున్న అంశాలను సంగ్రహంగా, సూటిగా, అరటి పండు వొలిచి చేతిలో పెట్టిన చందంగా చెప్పగలిగే చతురత కేసీయార్ కు వున్నట్టు వర్తమాన రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ వున్నట్టు లేదు. తెలంగాణా సమస్యలపట్ల తనకు అవగాహన హెచ్చు అని చెప్పుకుంటూనే, కొన్ని కొన్ని గణాంకాల ప్రస్తావన  వచ్చినప్పుడు ఎలాటి భేషజాలకు పోకుండా పక్కనే కూర్చున్న సేద్యపు నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకుని సరిదిద్దుకున్న విధానం గమనించినప్పుడు ఆయనలోని నిజాయితీ అధికారులకు తెలిసివచ్చింది. 'కింది అధికారులతో, సిబ్బందితో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ లో అడిగి బెదరగొట్టకండి' అంటూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసిన పద్దతి కూడా బాగుంది. 'అందర్నీ కలుపుకు పోవడం ద్వారా మాత్రమే కన్న కలలు నిజం చేసుకోగలుగుతామని ఓ పక్క సుతిమెత్తగా చెబుతూనే, ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు పరికించినప్పుడు రానున్న రోజుల్లో ఆయన అనుసరించబోయే ఎత్తుగడలు యెంత కఠినంగా వుండబోతున్నాయో కూడా అవగతమైంది.                    

మనవాడే అయ్యుంటాడు



అంజయ్య గారి భోలాతనం గురించి ఆ రోజుల్లో ఓ కధ చెప్పేవాళ్ళు. నిజంగా ఇది కధే. నిజంగా నిజం కాదు. ఆయన ఓ సారి మంత్రివర్గాన్ని భారిగా విస్తరించారు. జంబో క్యాబినెట్ అనేవాళ్ళు. ఇప్పుడంటే అవి మామూలయిపోయాయి. ఒకరోజు కొత్తమంత్రి ఒకరు ముఖ్యమంత్రి అంజయ్య గారిని కలవడానికి వచ్చారు. ఆయన్ని చూడగానే అంజయ్య గారు నొచ్చుకుంటూ - 'ఈ సారి నిన్ను తీసుకోవడం కుదరలేదు. మళ్ళీ ఎప్పుడయినా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు నిన్ను తప్పకుండా చేర్చుకునే పూచీ నాది'అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు వున్నారో ఆయనకే తెలియదని ఆ రోజుల్లో హాస్యోక్తిగా అనుకునేవారు.


ఇప్పుడు మళ్ళీ అలాగే వుంది. ఎవరు ఏ పార్టీలోకి వెడుతున్నారో తెలవదు. వెళ్ళిన వాళ్లు అక్కడ ఎన్నాళ్ళు వుంటారో తెలవదు. పార్టీలు మారిన వాళ్లకు  పాత పార్టీని తిట్టాలో తెలియదు. కొత్త పార్టీని పొగడాలో తెలియదు. అధవా తిట్టినా పొగిడినా  ఆ సంగతి కండువా కప్పి పార్టీ తీర్ధం ఇప్పించి ఫోటోలు దిగిన ఆయా పార్టీల పెద్దలకు అర్ధం కాదు. చేరిన వాళ్లు, చేర్చుకున్నవాళ్ళు ఎన్నాళ్ళు కుదురుగా అంటి పెట్టుకుని వుంటారో అసలు తెలియదు.వెంటవున్నవాడు, వెనక వున్నవాడు  మనవాడో కాదో తెలియదు. ఇన్ని అయోమయాల మధ్య సాగిపోతున్న రాజకీయాల్ని నేడు మనం చూస్తున్నాం. కానీ ఖర్చులేని వినోదం అంటే ఇదేనేమో!
NOTE: Courtesy Cartoonist 

6, జులై 2014, ఆదివారం

విరాట రాజ్యంలో వాన


ఈ కధ అందరికీ తెలిసిందే. పాండవులు అజ్ఞాత వాసంలో గడుపుతుంటారు. ఏడాది గడువు పూర్తయ్యేలోగా వారి ఉనికిని కౌరవులు కనుక్కోగలిగితే  మళ్ళీ  మరో ఏడాది అజ్ఞాత వాసం తప్పదు. పాండవులు ఎక్కడ వున్నారో తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. 'పాండవులు పుణ్యాత్ములు. వారు నడయాడిన చోట సకాలంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి' అని కురుసభలో పెద్దలు సెలవిస్తారు. పాండవ స్తుతితో కూడిన  ఆ మాటలు అట్టే  రుచించకపోయినా, వారిచ్చిన 'క్లూ' మాత్రం కురు సార్వభౌముడికి తెగనచ్చుతుంది.
ఈ కధ యెందుకు గుర్తుకు వచ్చిందంటే ఫేస్ బుక్ లో చూసినా, టీవీ స్క్రోలింగులు చూసినా తొలకరి జల్లులు కురిసి  మట్టి తడిసిన వాసన.


కానీ మేముంటున్న మాదాపూర్ లో మాత్రం చినుకు జాడ లేదు, ఉరుములు మెరుపులు తప్ప.  
పాండవులు కాస్త వీలు చూసుకుని ఇటేమన్నా వస్తారేమో చూడాలి.

చెఖోవ్ చెప్పిన చిన్న కధ


‘గుర్రబ్బండి నడుపుతూ పొట్టపోసుకునే ఒక వృద్ధుడు ఈ కధలోని ప్రధాన పాత్ర. ఆ రోజు ఉదయమే అతడి కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. అంత దుఃఖంలో కూడా బండి నడపక పోతే పొట్ట గడవని స్తితి అతనిది. తన బండి ఎక్కినవాళ్లకు కుమారుడి మరణ వార్త చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా వాళ్లు అడ్డంపడుతుంటారు. ఎందుకంటె ఈ పాడు ప్రపంచంలో ఎవడి గోలవాడిది. తన కష్ట సుఖాలు పక్కవాడితో పంచుకోవాలనే ఆత్రుత తప్ప ఎదుటివాడి బాధ ఏమిటో ఎవరికీ పట్టదు. చివరికి, ఎవరికీ తన కడుపులోని దుఖం చెప్పుకోకుండానే ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. కొష్టంలో గుర్రాన్ని కట్టివేస్తూ పిల్లవాడి చావు కబురు దాని చెవిలో వేసి కడుపులో భారం దించుకుంటాడు.’
చెఖోవ్ ఈ కధ రాసి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మనుషుల మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులేదు.
టీవీల్లో జరిగే చర్చలే దీనికి మంచి ఉదాహరణ. సోషల్ మీడియాలో సాగే సంవాదాలే చక్కటి సోదాహరణ.  ఎవరికి వారు తమ వాదం వినిపించాలని ప్రయత్నిస్తారే తప్ప ఇతరులమాట వినిపించుకోరు. అందరికీ అన్నీ తెలియాలన్న రూలేమీ లేదు. తెలియంది తెలుసుకుంటే పోయేదీ లేదు. అనవసరమయిన ఈ అభిజాత్యం అవసరమా ? ఎవరికివారే తెలుసుకోవాలి.