19, మే 2014, సోమవారం

రివైండ్ - 2010

కన్నంతలో విన్నంతలో అమెరికా : 
పసిఫిక్ తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారివెంట వెడుతుంటే చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు కానవస్తూనే వుంది.
వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్  నుంచి  ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు  చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టుకింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము.డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల కార్లో వున్న జీ పీ ఎస్  సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము. మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని  ఇంటి ముందువున్న  ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి  తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.


(పసిఫిక్ తీరంలో పుట్టినరోజు)


 మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది.  పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్,  అతి పెద్ద ప్లాస్మా టీవీఫైర్ ప్లేస్,  సోఫాలు వున్నాయి.  పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో హాట్ టబ్ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి. స్నాన పానాదులు ముగించుకుని డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ- అతిదగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము. (2010)

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు'

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు' అంటూ ఆయన సోదరుడు  కృష్ణ పంపిన ఎస్ ఎం ఎస్ తో ఈరోజు మొదలయింది. కానీ ఆయన సుస్తీగా వున్నప్పుడు 'బాపూ' గారు ఆయనకు రాసిన ఉత్తరం చదివిన తరువాత శేఖర్ గారికి మరణం లేదనిపించింది.సాక్షాత్తు  'బాపూ' గారే, శేఖర్ గారికి  'వీరాభిమానిని' అని చెప్పుకోవడమే కాదు,  అక్షరాలా రాసిచ్చిన తరువాత శేఖర్ గారికి నిజంగా మరణం లేదు. ఆయన ఎప్పటికీ చిరంజీవే. సందేహం లేదు.



17, మే 2014, శనివారం

ఇక భయం లేదు


మోడీ గెలుస్తాడా ? రాహుల్ గెలుస్తాడా ?కేసీఆరా ! చంద్రబాబా! జగనా !
ఇవన్నీ నిన్నటి మాటలు. ఇవాళ ఫలితాలు తేలిపోయాయి. ఇక ఆ చర్చ అనవసరం.
ఓటరుగా మన బాధ్యత మనం పూర్తిచేశాం. ప్రభుత్వాలు ఏర్పడతాయి. పాలకులు కొలువు తీరుతారు. వాళ్లు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా సరే. లేకుంటే, వాళ్ల దగ్గర లేని ఆయుధం,   అయిదేళ్ళ తరువాత మన దగ్గర మాత్రమే వుండే 'ఓటు'  అనే ఆయుధం మనదగ్గరే వుంటుంది. బెంగ  పడాల్సిన పని లేదు.


ఈసారి మనం తెలిసో తెలియకో తెలివిగా ఒక మంచి పని చేశాం. అటు కేంద్రంలో, ఇటు తెలంగాణలో, మరో పక్క సీమాంధ్రలొ ఒకే పార్టీకి ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఇచ్చాం. వెనుకటి మాదిరిగా సంకీర్ణాలకి చోటివ్వలేదు. ఎన్నికల ప్రణాళికలో అన్ని పార్టీలు అలవికాని వాగ్దానాలు చేసుకుంటూ పోయాయి. సంకీర్ణ ధర్మం ప్రకారం అమలు చేయలేకపోయాం అని ఇన్నాళ్ళు కుంటి సాకులు చెబుతూ వచ్చాయి.
అది, ఇంకానా ఇకపై కుదరదు.
చెప్పిన మాట నిలబెట్టుకొకపోతే ఆయా పాలక పక్షాలను కాలరు పట్టి నిలదీసే మహత్తర అవకాశాన్ని మనమే కల్పించుకున్నాం.

ఇక భయం లేదు. మనకు మనమే ఒక రక్షరేఖ కల్పించున్నాం.           

జంప్ జిలానీలు - భండారు రామచంద్ర రావు


గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో 'ఈ జంప్ జిలానీల'  గురించిన వివరాలతో శ్రీ భండారు రామచంద్రరావు ఏర్చికూర్చిన కధనాలు:


(శ్రీ భండారు రామచంద్రరావు)

చివరి నిమిషంలో గోడదూకి మటాష్ అయిన జంప్ జిలానీలు-
మైనంపల్లి హనుమంతరావు, జీ. వివేక్,  నోముల నరసింహయ్య, జైపాల్ యాదవ్, కవితా నాయక, టీ. జీ. వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, శిల్పా మోహన రెడ్డి, లబ్బి వెంకటస్వామి, శ్రీనివాసులు రెడ్డి, వరదరాజులరెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడి, బీ. విజయకుమార్, గల్లా అరుణ కుమారి, కొత్తపల్లి సుబ్బారాయుడు, వెల్లంపల్లి శ్రీనివాస్, కుతూహలమ్మ, కారుమూరి నాగేశ్వర రావు, దగ్గుబాటి పురంధేశ్వరి,


సీమాంధ్ర ప్రజాతీర్పు


"అధికారం 'చేతి' లో పెట్టుకుని ప్రజాభీష్టాన్ని తుంగలో తొక్కి గొడ్డలితో నరికినట్టు రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి ఐ.పీ.సీ. (ఇండియన్ ప్రజాస్మృతి) 175/25 సెక్షన్  ప్రకారం జీవితకాలపు కఠినశిక్ష  విధించడమైనది.
ఒక దశలో రాష్ట్ర విభజనకు దోహదపడే ప్రకటన చేసిన వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీకి, ఆ పార్టీ నాయకుడి చిన్న వయస్సును దృష్టిలో పెట్టుకుని  ప్రతిపక్షపాత్రకు పరిమితం చేస్తూ అయిదేళ్ళ శిక్ష విదించడం జరిగింది.
రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందు కలవరపెట్టినా, అనాధగా మిగిలిపోయిన సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి అవసరమైన అనుభవం కలిగిన పార్టీగా తెలుగు దేశం పార్టీని గుర్తించి, ఆ పార్టీ  పాత తప్పిదాలను క్షమించి, నిర్దోషిగా భావించి విడుదల చేస్తూ ఆ ప్రాంతపు పాలనాధికారాన్ని అయిదేళ్లపాటు దఖలు చేయడం జరిగింది.
ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి అయిదేళ్ళ వ్యవధానం ఇవ్వడం కూడా జరిగింది.


- సీమాంధ్ర ప్రజానీకం 

15, మే 2014, గురువారం

కాకతాళీయం


ప్రముఖ మానవతావాది, స్త్రీ జనోద్ధరణ ఉద్యమ నాయకురాలు శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారు మరణించినట్టు అమెరికా నుంచి ఇన్నయ్య గారు పెట్టిన పోస్ట్ చదువుతుంటే ఆకాశవాణి మాజీ ఎనౌన్సర్ శ్రీమతి రత్నప్రసాద్ ఫోన్ చేశారు. ఆవిడ పుట్టెడు దుఃఖంలో వుండి మాట్లాడుతున్నారు అనిపించింది. కేవలం రెండు నెలల తేడాలో భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. మొదలు పెడుతూనే జాతస్య మరణం ధృవం అంటూ - 'ఎందరి గురించో రాస్తుంటావు, నేను పోతే నా గురించి కూడా రాయి బాబూ' అన్నారు. నాకేమనాలో తోచక అలా 'అనకండి ముందూ వెనుకగా అందరం పోవాల్సిన వాళ్ళమే. పోయేదాకా ఇంకా బతుకు వుంది అనే ఆశతో బతుకుతుంటాం.' అని వోదార్చే ప్రయత్నం చేసాను. ఇంతలో ఆవిడకు మరో ఫోను వచ్చినట్టుంది. మళ్ళీ చేస్తాను అని కాసేపట్లో మళ్ళీ ఫోను చేశారు. 'యెంత పనయిందో చూసావా శ్రీనివాసూ, మా వియ్యపురాలు సుబ్బమ్మ గారు పోయారు. ఇప్పుడే సమాచారం అందింది' అన్నారు. అంతకు ముందు ఆవిడ ఫోను మాట్లాడుతున్నప్పుడే నేను ఇన్నయ్య గారు పంపిన ఆ సమాచారమే చదువుతున్నాను. ఆ  సమయంలో చావు వార్త చెప్పడం ఎందుకని మిన్నకుండి పోయాను. నిజానికి మల్లాది  సుబ్బమ్మ గారు ఎవరో కాదు, రత్న ప్రసాదు గారి వియ్యపురాలే. ఆ సమయంలో ఈ విషయం నాకు స్పురణకు రాలేదు. యెంత కాకతాళీయం. నిజానికి మనిషి జీవితమే ఇటువంటి సంఘటనల సమాహారం.


(Smt. Malladi Subbamma garu)

దేవుడూ, ఆత్మలు అవీ నమ్మని మనిషి కాబట్టి సుబ్బమ్మ గారి విషయంలో -  'సుబ్బమ్మగారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి' అనే షరా మామూలు సందేశాలు అవసరం పడవు.