8, ఏప్రిల్ 2014, మంగళవారం

శ్రీరాముడితో పోల్చి వోటు వేయాలంటే 'NOTA'నే గతి!


" ఓటేసే ముందు ప్రతి అభ్యర్ధికీ రాముడి లక్షణాల లిట్మస్ పరీక్ష పెట్టాలి. శ్రీరాముడితో పోలిస్తే ఎవరికెన్ని మార్కులొస్తాయో లెక్కగట్టి పక్కాగా అంచనా వేసుకోవాలి" - వోటర్లకు ఈ నాటి 'ఈనాడు' సలహా!

" అలా పోల్చి వోటు వేయాలంటే వోటర్లకు ఒక్క అభ్యర్ధీ కలికానికి కూడా దొరకడు. ఇక అప్పుడు 'NOTA' నే శరణ్యం!    

7, ఏప్రిల్ 2014, సోమవారం

రెండు లీటర్లు చాలు


ఏకాంబరం కారు డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతూ పార్లమెంటు భవనం వైపు వెళ్లాడు. అక్కడ అంతా గందరగోళంగా వుంది.
విండో కిందికి దించి అడిగాడు ఏం జరుగుతోందని.
'టెర్రరిష్టులు భవనంలో జొరబడి సభ్యులనందరినీ బంధించారు. విడిచిపెట్టడానికి వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వారినందరినీ పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరిస్తున్నారు. అందుకని చందాలు అడుగుతున్నాం.'
'యెంత ఇమ్మంటారేమిటి' ఏకాంబరం అడిగాడు పర్సు తీస్తూ.
'తలా రెండు లీటర్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నాం'
(నెట్లో కనబడ్డ ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

ఉభయతారకం

పొత్తులతో కుదేలవుతున్న పార్టీలకి  ఓ చిన్న చిట్కా.
A పార్టీ B పార్టీకి పొత్తులో భాగంగా  పలానా స్థానాలు ఇవ్వడానికి అంగీకరించింది. పలానా రెండో పార్టీ పలానా మొదటి పార్టీకి పలానా పలానా స్థానాలు వొదులుకోవడానికి సిద్ధపడింది. కానీ ఆ పలానా పలానా స్థానాల్లో పాతుకుపోయిన వాళ్లకు యెలా సర్ది చెప్పేట్టు. అందుకే ఈ చిట్కా.
అలా పాతుకుపోయివున్న పాతవారికి పొత్తు కుదుర్చుకునే కొత్త పార్టీ కండవా కప్పేసి ఆ కొత్త పార్టీచేత బీ ఫారం వారిచేతిలో పెట్టించాలి. పొత్తు కుదుర్చుకున్నట్టు వుంటుంది. తమ పార్టీ వాళ్ళకే టిక్కెట్టు ఇప్పించినట్లు వుంటుంది. ఉభయతారకం. ఏమంటారు?    

సరికి సరి


"మా పార్టీ ప్రకటించిన అభ్యర్ధుల్లో మూడో వంతు మంది మీ పార్టీనుంచి వచ్చి చేరిన వాళ్ళే! తెలుసా"
"అలాగా! మా పార్టీ తరపున పోటీచేస్తున్న వాళ్ళల్లో మూడో వంతు మీ పార్టీ వాళ్ళే!"




మనవాడే అయ్యుంటాడు

అంజయ్య గారి భోలాతనం గురించి ఆ రోజుల్లో ఓ కధ చెప్పేవాళ్ళు. నిజంగా ఇది కధే. నిజంగా నిజం కాదు. ఆయన ఓ సారి మంత్రివర్గాన్ని భారిగా విస్తరించారు. జంబో క్యాబినెట్ అనేవాళ్ళు. ఇప్పుడంటే అవి మామూలయిపోయాయి. ఒకరోజు కొత్తమంత్రి ఒకరు ముఖ్యమంత్రి అంజయ్య గారిని కలవడానికి వచ్చారు. ఆయన్ని చూడగానే అంజయ్య గారు నొచ్చుకుంటూ - ఈ సారి నిన్ను తీసుకోవడం కుదరలేదు. మళ్ళీ ఎప్పుడయినా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు నిన్ను తప్పకుండా చేర్చుకునే పూచీ నాది'అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు వున్నారో ఆయనకే తెలియదని ఆ రోజుల్లో హాస్యోక్తిగా అనుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అలాగే వుంది. ఎన్నికలముందు ఎవరు ఏ పార్టీలోకి వెడుతున్నారో తెలవదు. వెళ్ళిన వాళ్లు అక్కడ ఎన్నాళ్ళు వుంటారో తెలవదు. ఏ పార్టీనుంచి ఏ గుర్తుమీద పోటీ చేస్తున్నారో తెలవదు. ప్రచారానికి పోయినప్పుడు పాత పార్టీని తిట్టాలో తెలియదు. కొత్త పార్టీని పొగడాలో తెలియదు. ఫలితాలు వెల్లడయిన తరువాత కూడా గెలిచినవాడు మనవాడేనా కాదో తెలియదు. ఇన్ని అయోమయాల మధ్య జరుగుతున్న ఎన్నికల్ని మనం చూడబోతున్నాం.

ఈ ప్రశ్నకు బదులిది


వోటేసి రావడానికి వాళ్ల వూరు వెళ్ళిన పనిమనిషి కుటుంబం తిరిగొచ్చింది.
'కొత్త రాజధాని ఎక్కడ అనుకుంటున్నారు' యాదాలాపంగానే అడిగాను.
'బిల్దింగులూ, రోడ్లు, మెట్రో రైళ్ళూ అన్నీ కలిగినోళ్ళకి. మాకిట్లా నాలుగువేళ్ళు నోట్లోకి పోతే చాలు'

'?' 

5, ఏప్రిల్ 2014, శనివారం

వినదగునెవ్వరు చెప్పిన.....


మన వైఖరిలో లేదా నడతలో ఏదైనా బలహీనత వుంటే అది మన వ్యక్తిత్వంలో కూడా ప్రస్పుటమవుతుంది.  
కొందరు మంచి జరిగినప్పుడు ఆనందంతో మందహాసం చేస్తారు. తామ్ము నవ్వినప్పుడే మంచి జరుగుతుందని మరికొందరు విశ్వసిస్తారు.
చక్కటి మానవ సంబంధాలను దెబ్బతీయడానికి కావలసిన ఏకైక వనరు ఒక్కటే. అదే అహంకారం.
రాత్రికి రాత్రే లక్ష్యాలను మార్చుకుంటూ పోవడం సమర్ధనీయం కాదు. కానీ ఆ లక్ష్యసాధనకోసం అనుసరించాల్సిన మార్గాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవచ్చు.
అసంబద్ధం అయిన విషయాలు చెప్పి మిమ్మల్ని నమ్మించేవాళ్ళు మీచేత అకృత్యాలు చేయించినా ఆశ్చర్యపోనక్కరలేదు.  
విజయం సాధించినప్పుడు అది మీకు స్వాభావికం అనుకోవాలి. వోటమి ఎదురయినప్పుడు మార్పుకోసం దాన్ని ఆస్వాదించగలగాలి.
నిరాశావాది ఎదురుగాలి గురించి ఆందోళన చెందుతాడు. ఆశావాది ఆ వ్యతిరేక పవనాలను  తనకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు.
అద్భుతం అంటే అదేదో అరుదుగా జరిగే అద్భుతం  అనుకోకండి. చూడకలిగే  కళ్ళు వుంటే మన చుట్టూ కనబడే ప్రతిదీ ఒక పరమాద్భుతమే.   
ప్రతిదీ భగవంతుడి మీద భారం వేసి ప్రార్ధన చేయండి. కానీ పని చేసేటప్పుడు మాత్రం అన్నీ మీమీదే, మీ కృషి మీదే ఆధారపడివున్నాయన్న విశ్వాసంతో మొదలుపెట్టండి.  
మీ చుట్టు వున్న లోకాన్ని మార్చడానికి చాలా కాలం పడుతుంది. కానీ ముందు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. దానికి కావాల్సింది సమయం కాదు, పట్టుదల, నిబద్ధత.   

మీకు మంచి నైపుణ్యం వుంది అనుకున్న రంగంలో మరింత మెరుగయిన కృషి చేయక పోతే మీ ఎదుగుదల అసాధ్యం  
జీవితం, సమయం మనకు మంచి ఆచార్యులు. సమయాన్ని యెలా వాడుకోవాలో జీవితం నేర్పితే, జీవితపు విలువ ఏమిటో సమయం బోధిస్తుంది.
పొద్దున్న నిద్ర లేవడం అన్నది ఒక మంచి ఆలోచనతో మొదలయితే చాలు, ఇక ఆ రోజంతా మీకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా  గడిచిపోవడం ఖాయం.
పనిచేయడం, ప్రయత్నించడం రెండు వేర్వేరు విషయాలు. ప్రయత్నించడం  అంటే జరుగుతుందని  ఆశ పడడం. పని పూర్తి చేయడం అంటే ఫలితాన్ని సాధించడం.
ఏదో సాధించాలి అన్న తపనే మీరు  ఈరోజున్న స్థానానికి మిమ్మల్ని  చేర్చింది అన్న విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి.  
ఈ క్షణంలో ఏదయినా బాగా చేయగలిగితేనే అది మరు క్షణంలో మిమ్మల్ని మరో మంచి స్థానంలోకి చేరుస్తుంది.
ఆశావాది మరచిపోవడానికి నవ్వుతాడు. నిరాశావాది నవ్వడమే మరచిపోతాడు.
ఇంట్లో ఆహ్లాదకరమైన  వాతావరణం కావాలంటే కావాల్సినవి ఎయిర్ కండిషనర్లు కాదు. మంచి మనసులు,  మంచి  మనుషులు.
ఆకాశంలో అంత ఎత్తున ఎగిరే బెలూన్లు కూడా  మంచి పాఠం బోధిస్తాయి. జీవితంలో అలా  పైపైకి ఎదుగుతూ పోవాలంటే 'సరుకు' వుండాల్సింది బయట కాదు, లోపల  అని.