23, నవంబర్ 2013, శనివారం

గిల్లకురా!


గవర్నర్ల వ్యవస్థ మిధ్య పొమ్మన్నారు అలనాడు ఎన్టీ రామారావు గారు. రాం లాల్ ఉదంతం జ్ఞాపకం వున్నవారికి  గవర్నర్ల మీద ఆయనకు యెందుకు అంత ఆగ్రహం అన్నది అర్ధం అవుతుంది. కానీ ప్రస్తుతం డెబ్బయ్ ఎనిమిదో పడిలో పడ్డ మాజీ పోలీసు బాసు గారు కే పీ ఎస్ గిల్ గారికి గవర్నర్లతో ఏం గిల్లికజ్జా వున్నదో తెలవదు.


(శ్రీ కేపీఎస్ గిల్ )  
‘గవర్నర్లకు పనీ పాడూ ఏమీ వుండదు. వూరికే ఎదురు చూస్తూ కూర్చోవడం తప్ప’ అనేశారు  పోలీసు బాసుగా వున్నరోజుల్లో ఎన్కౌంటర్ స్పెషలిష్టుగా పేరుమోసిన ఈ సర్దార్జీ. ఆనాటితో ఆగే తత్వం ఆయనదయితే ఆయన్ని గురించి ఇంతగా చెప్పుకోవాల్సిన పనేంటి? 

పనేమీ ఉండదు..ఊరికే ఎదురు చూస్తుండాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫర్ చేసింది
అప్పట్లో పైలెట్ స్వయంగా కోరారు
అలాంటి పదవి వద్దని చెప్పేశాను
కేపీఎస్ గిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
అసోం హత్యలతో సంబంధం లేదని వివరణ
- See more at: http://www.andhrajyothy.com/node/32485#sthash.1c8X8txL.dpuf    
గిల్ దొరవారు గవర్నర్లను  ఏకంగా ‘వయసుడిగిన వేశ్యలతో’ పోల్చి వార్తల్లోకెక్కారు. కాకపొతే, వార్తల్లోకి ఎక్కడం అనేది గిల్ మహాశయులవారికి  వెన్నతో పెట్టిన విద్య.
యాభయ్యవ పడి  దాటిన  తరువాత కూడా గిల్ దొరవారికి స్త్రీ చాపల్యం తగ్గలేదు. ఒక సాయంత్రం సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్న పార్టీలో పీకల దాకా తాగిన   కేపీఎస్ గిల్ ఆ మద్యం మత్తులో ఒక మహిళా ఐ ఏ ఎస్  అధికారిణిని తాకరాని ప్రదేశంలో ఒక చాపు చరిచారు. రూపన్ బజాజ్ అనే ఆ ఐ.ఏ.ఎస్. మహిళ కూడా ఏమీ తక్కువ తినలేదు. పై అధికారి అని ఏమాత్రం మొహమాటపడకుండా గిల్ దొరవారిపై పోలీసు కేసు పెట్టింది. లో పెట్టిన ఆ కేసు ఎనిమిదేళ్ళ తరువాత కానీ ఓ కొలిక్కి రాలేదు. మొత్తం మీద న్యాయస్థానం ఆయన్ని దోషిగా పరిగణించి రెండు లక్షల రూపాయల జరిమానా, మూడు మాసాల కఠిన కారాగారశిక్ష విధించి చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు అని నిరూపించింది. కాని దరిమిలా సుప్రీం దాకా సాగిన ఈ కేసు లో గిల్ గారికి ఓ మేరకు వూరట లభించింది. జైలు శిక్షను రద్దు చేసి జరిమానాతో సరిపెట్టారు. అయితే ఆ డబ్బును పరిహారంగా తీసుకోవడానికి  రూపన్ బజాజ్ అంగీకరించలేదు. దాంతో  ఆ డబ్బును ఏదయినా మహిళా స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని న్యాయస్థానం  ఆదేశించింది. (23-11-2013)

ఎవరీ అంకుల్ టామ్ ? - 6


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.
 

(శ్రీ తోట భావనారాయణ)


టీవీ రేటింగ్ ప్రజాభిప్రాయమా?
రేటింగ్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదా అనేది... రేటింగ్స్ లెక్కించే పరిభాషలో ప్రజలు అంట నగరాలు, పట్ణణాల్లో ఉంటూ కేబుల్ కనెక్షన్ ఉన్న ఇళ్లలో నివసించేవారని అర్థం. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మహానగరంతో పాటు పదిలక్షల జనాభా పైబడిన విజయవాడ, విశాఖపట్టణం, నగరాలు లక్ష నుంచి పది లక్షల మధ్య జనాభా ఉన్న 12 పట్టణాలను మాత్రమే రేటింగ్స్ లెక్కింపులో పరిగణిస్తారు. వాటిలో కొన్ని పట్టణాలు అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలను ఎంత మాత్రమూ పట్టించుకోవటం లేదనీ, వారి అభిప్రాయాలను రేటింగ్స్ ప్రతిబింబించటం లేదనీ స్పష్టంగానే తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రేటింగ్స్ ఆధారంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారంటే నిజంగా ప్రజలు కోరుకుంటున్న విధంగా ఛానల్స్  నడుచుచుంటున్నాయని చెప్పగలమా? గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండే దూరదర్శన్ రేటింగ్స్ లో ఎక్కువగా కనపడకపోవటం గమనించవచ్చు. ఇది కూడా  TAM సంస్థ పరిధి పరిమితంగా ఉండటం వల్లే.

రేటింగ్స్ ఆధారంగా కార్యక్రమాలు తయారవ్వడం అంటే ఎక్కువ శాతం పట్టణ ప్రాంత ప్రజలను..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేటింగ్స్ లెక్కించే నగరాలు, పట్టణాల ప్రజలనే టార్గెట్ చేసుకోవడమన్నమాట. ఆ విధంగా కొన్ని సక్సెస్ ఫార్ములాలు తయారుచేసుకుని ఛానల్స్ తమ కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. వీలైతే ఇతర భాషల్లో సక్సెస్ అయిన (ఎక్కువ రేటింగ్స్ సంపాదించిన) కాన్సెప్ట్స్ ను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులతో తీర్చి దిద్దటమూ చూస్తున్నాం. మంచి కరా్యక్రమాలతో ప్రజలకు మేలు చేయటానికి బదులు ప్రజలను తాత్కాలికంగా రెచ్చగొట్టి ఆకర్షించేందుకే ప్రయత్నించటానికి కారణం రేటింగ్స్ మాయాజాలమే. ప్రసారాల మీద ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఛానల్స్ ప్రయత్నించటం లేదు. ఎలాంటి శాస్త్రీయమైన సర్వేలూ లేవు. TAM కు చందా కట్టి డేటా తెప్పించుకోవటమే తప్ప స్వయంగా రీసెర్చి జరిపేందుకు ఎవరూ పూనుకోవటం లేదు. ప్రేక్షకుల అభిప్రాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు తయారుచేయటానికి బదులుగా తాము ఇచ్చిన వాటిలో ఏది బాగా చూస్తారో అలాంటివే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఏం కావాలో చెప్పుకునే అవకాశం లేనప్పుడు ప్రేక్షకుడు సహజంగానే ఉన్నంతలో నచచింది చూడక తప్పదు. ఆ క్రమంలో చేతిలో రిమోట్ కు పనిచెప్పడం మరింత పెరుగుతుంది. రేటింగ్స్ వలలో పడిన ఛానల్స్ ఈ నిజాన్ని గుర్తించకపోతే భిన్నంగా ఆలోచించడానికే సాహసించవు. స్వల్పకాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తే ఎంత అనర్థమో ముందు ముందు తెలుస్తుంది. ఛానల్స్ ను  నియంత్రించాలని ప్రయత్నించే ట్రాయ్ ఈ రేటింగ్స్ వేలం వెర్రి నుంచి వాటిని కాపాడగలిగితే ప్రేక్షకులు సంతోషిస్తారు. (ఇంకా వుంది)

22, నవంబర్ 2013, శుక్రవారం

ఎవరీ అంకుల్ టామ్ ? -5


అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.


(శ్రీ తోట భావనారాయణ)
 

రేటింగ్స్ విశ్లేషణ, భిన్న వాదనలు
వస్తువుల ప్రకటనల కోసం కొన్ని టార్గెట్ గ్రూపులను ఎంచుకోవటం ఆనవాయితీ గనుక ఆ వస్తువు స్వభావాన్ని బట్టి మార్కెట్ పరిధిని కూడా అంచనా వేసుకోటానికి వీలుగా TAM తన సర్వే ఫలితాలను జనాభా ప్రాతిపదికన మూడు వర్గాలుగా విభజిస్తుంది. హైదరాబాద్ నగరంలో సేకరించే వివరాలను ఒక విభాగంలో అందజేస్తుంది. పదిలక్షలు పై బడిన జనాభా ఉన్న విజయవాడ, విశాఖపట్టణం నగరాలను మరో వర్గంలో చేరుస్తుంది. లక్ష నుంచి పదిలక్షలలోపు జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలు మూడవ విభాగంలో చేరతాయి. అయితే, లక్షలోపు జనాభా గల ప్రాంతాలను రేటింగ్స్ కోసం సర్వే పరిధిలో చేర్చకపోవటం వల్ల నిజమైన రేటింగ్స్ రావటం లేదనే విమర్శలున్నాయి. ప్రకటనదారులు కోరుకునే మార్కెట్ గ్రామాలలో లేనందున ఆ ప్రాంతాన్ని చేర్చకపోయినా ఫరవాలేదనేది యాడ్ ఏజెన్సీల వాదన.
నిజానికి రేటింగ్స్ అనేవి ఆ కార్యక్రమం గొప్పదనం, నాణ్యత మీదనే ఆధారపడి ఉంటాయని చెప్పటానికి వీల్లేదు. అదే సమయంలో ఇతర ఛానల్స్ లో ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఉన్న పక్షంలో రేటింగ్స్ వాటంతట అవే పడిపోతాయి. అంతమాత్రాన ఈ కార్యక్రమం బాగాలేదని భావించడానికి వీల్లేదు. పైగా ప్రతిరోజూ పరిస్థితి ఒకే విధంగా ఉంటుందని కూడా చెప్పలేం. ఎప్పటికప్పుడు రేటింగ్స్ ను కాపాడుకునేందుకు తగిన వ్యూహం అనుసరించడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. వారం మొత్తంలో అన్ని ఛానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు ర్యాంకులు ఇవ్వడం ద్వారా ప్రకటన కర్తలు తగిన నిర్ణయం తీసుకునేందుకు టామ్ వీలు కల్పిస్తుంది. ముందే చెప్పినట్లు హైదరాబాద్ నగరంలోనూ, 10 లక్షల పైబడిన జనాభా గల నగరాలలోనూ, లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా గల పట్టణాల్లోనూ టీవీ ఛానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు ర్యాంకులు ఇస్తారు.
వయో వర్గాల వారీగానూ, పురుషులు, మహిళలె వేరు వేరుగానూ ఎంతమంది ఏయే ఛానల్ ఎంత సేపు చూస్తున్నారో లెక్కిస్తారు. ఆ విధంగా ఏ ఛానల్ వాటా ఎంత ఉందో తెలుస్తుంది. ఛానల్ వాటాను తెలియజేసే ఈ నాలుగు పట్టికలలో వరసగా హైదరాబాద్ ఫలితాలు, విజయవాడ, విశాఖ నగరాల పరిస్థితి, చిన్న పట్టణాల ఫలితాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లలో ఛానల్స్ మార్కెట్ వాటా వరసగా తెలుస్తాయి. ఈ పరిశీలనలో కేవలం న్యూస్  ఛానల్స్ పరిస్థితిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
రేటింగ్స్ ప్రభావం
ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ తో పోలిస్తే న్యూస్ ఛానల్స్ వాటా చాలా తక్కువగా ఉంటుంది. వార్తల పట్ల ఆసక్తిచూపే వాళ్లు తక్కువగా ఉండటం ఒక కారణమైతే, పత్రికలు అందుబాటులో ఉండటం మరో కారణం. దృశ్య ప్రధానమైన టీవీని వినోద సాధనంగా పరిగణించడం ఒక కోణమైతే నిరక్షరాస్యులకు కూడా అందుబాటులో ఉండటం మరో కారణం. అన్నింటికంటే ప్రధానమైన అంశం పిల్లలు, మహిళలు ఎక్కువగా టీవీలలో వినోద కార్యక్రమాల పట్ల బాగా మొగ్గుచూపటం. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో కార్యక్రమాల వైవిధ్యం ఉండటం వలన ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేయటం సులభమవుతుంది. న్యూస్ ఛానల్స్ కు అటువంటి లక్షణం లేదు. ఏదైనా ప్రత్యేకమైన సంఘటన జరిగినప్పుడు తప్ప ప్రతి బులెటిన్ లో ప్రత్యేకత చూపించడం సాధ్యం కాదు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలన్నది న్యూస్ ఛానల్స్ తపన కావచ్చు గానీ ప్రజలు కోరుకుంటున్నది అందించాలనుకుంటున్న ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ ఆలోచనే మంచి ఫలితాలనివ్వడం చూస్తున్నాం. అందువల్లనే 24 గంటల న్యూస్ ఛానల్స్ వాటా చాలా పరిమితంగా ఉంటోంది.
లక్ష నుంచి పదిలక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా టామ్ చెబుతున్నప్పటికీ ఇవి కూడా ఒక మోస్తరు నుంచి భారీ సైజు పట్టణాలే. నిజానికి ఇక్కడి మార్కెట్ మీదనే ప్రకటన కర్తలు ఎక్కువగా దృష్టిసారిస్తారు. నగరాలలో ప్రకటించాల్సిన వస్తువులకు, ఇటువంటి semi-urban ప్రాంతాలలో ప్రకటించాల్సిన వస్తువులకు తేడా ఉంటుంది గనుక ఆ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటారు. పెరుగుతున్న ఆర్థిక స్థోమత దృష్ట్యా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఆధునిక సౌకర్యాలను పరిచయం చేయాలో గమనించి ఆయా ఉత్పత్తుల ప్రకటనలు జారీ చేస్తారు.
తెలుగు న్యూస్ ఛానల్స్ కు నగరాల్లో కంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఆదరణ ఉన్నట్టు అర్ధమవుతుంది. న్యూస్ ఛానల్స్ కు ున్న మార్కెట్ వాటా చాలా తక్కువే అయినప్పటికీ ప్రకటనలు ఎలా వస్తాయి? అన్ని న్యూస్ ఛానల్స్ కలిపి కేవలం నాలుగున్నర శాతం మార్కెట్ వాటా సంపదించుకుంటున్నప్పటికీ ప్రకటనకర్తలు ఎందుకు మొగ్గుచూపుతున్నారు?  ఈ ప్రశ్నలు తలెత్తడం చాలా సహజం. అయితే ఇందుకు సమాధానం ప్రేక్షకుల పరిమాణంతో బాటు నాణ్యతను విశ్లేషించడమే. వార్తలు చూసేది ఎక్కువగా పురుషులేనన్నది అందరూ అంగీకరించాల్సిన నిజం. కొనుగోళ్లను మహిళలు, పిల్లలు కొంత మేరకు ప్రభావితం చేయవచ్చునే తప్ప చాలా సందర్భాల్లో నిర్ణయాధికారం పురుషులదేనని, అందువలన పురుషులను ఆకట్టుకోవడం ముఖ్యమని ప్రకటనకర్తలు భావిస్తున్నారు.  కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే వాళ్లలో కీలకమైన కుటుంబ యజమానిని ఆకట్టుకుంటే చాలునన్న అభిప్రాయమే ఇందుకు కారణం. పురుషులకు మాత్రమే పనికొచ్చే వస్తువుల గురించి ప్రకటనలు ప్రసారం చేయాలన్నా న్యూస్ ఛానల్స్ లో రేటింగ్స్, మార్కెట్ వాటా గురించి పెద్దగా పట్టించుకోకుండానే ప్రకటనలిస్తారు.

ఛానల్స్ ఆలోచనా విధానాన్ని రేటింగ్స్ ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే రేటింగ్స్ రాని కార్యక్రమాన్ని వెంటనే తొలగిస్తున్నాయి. ఒక  చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకప్పుడు జెమినీ టీవీలో శుభోదయం పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమయ్యేది. చాలా మంది ఆ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఉదయాన్నేఒక చక్కటి కార్యక్రమాన్ని ఇస్తున్నారంటూ అభినందనలు వచ్చాయే తప్ప రేటింగ్స్ రాలేదు. దాదాపు ఏడాది పాటు ఓపిక పట్టిన యాజమాన్యం యువర్స్ లవింగ్లీలాంటి కార్యక్రమానే పునరుద్ధరించాల్సి వచ్చింది. వాళ్లు అంచనా వేసినట్టే దానికి  మంచి రేటింగ్ వచ్చింది. అయితే, రేటింగ్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే వార్తలు చూసే వాళ్లు పదిశఆతం మాత్రమే. వాళ్లకు మాత్రమే శుభోదయం లాంటి కార్యక్రమం నచ్చింది. వినోద కార్యక్రమాలు  చూసే 90శాతం మందికి పెద్దగా నచ్చలేదు. అందుకే రేటింగ్ రాలేదు. (ఇంకా వుంది)

21, నవంబర్ 2013, గురువారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 4


అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. 


(శ్రీ తోట భావనారాయణ)

భారతదేశంలో రేటింగ్స్ 
A.C. Nielsen ఆధ్వర్యంలో ఏర్పాటయిన IMRB సంస్థ TAM (Television Audience Measurement) పేరుతో రేటింగ్స్ నివేదిక రూపొందిస్తుండగా ORG MARG సంస్థ INTAM(Indian National Television Audience Measurement) పేరుతో రేటింగ్స్ నిర్ణయించడం మొదలెట్టింది. దీంతో భారతదేశంలో TAM, INTAM నివేదికలు రెండూ వాడకంలోకి వచ్చాయి. TAM మొదట్లో డైరీ పద్ధతిలో రేటింగ్స్ నిర్ణయించేది. INTAM వాడుతున్న అత్యాధునికమైన Picture Making Technology ప్రస్తుతం 9 దేశాలకు విస్తరించింది. ఈ విధానంలో నిమిష నిమిషానికీ ప్రేక్షకులు ఒక కార్యక్రమం నుంచి మరో కార్యక్రమానికి మారుతున్నా ఆ విషయం స్పష్టంగా నమోదవుతుంది. భారతదేశంలోని 49 నగరాలకు విస్తరించిన INTAM క్రమంగా తన పరిధి పెంచుకుంటూ వచ్చింది. Picture Making విధానం ఉండటం వలన కేబుల్ ఆపరేటర్లు ఛానల్స్ వరుస క్రమాన్ని మాటిమాటికీ మార్చినప్పుడు  కూడా ఛానల్స్ వారీగా వివరాలు ఖచ్చితంగా నమోదు చేయటం సాధ్యమవుతుంది. ఈ వివరాలన్నింటినీ TVPointer పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ రూపంలో చందాదారులకు అందజేయటం INTAM కున్న మరో విశిష్టత.

అయితే TAM, INTAM రేటింగ్స్ లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంలో సందిగ్ధత, వివాదం కొనసాగుతూ వచ్చాయి. రెండూ తమ శాంపిల్ సైజ్ ఇంకా పెంచుకోవాలన్నది Indian Broadcasting Foundation (IBF) అభిప్రాయం. టీవీ పరిశ్రమ కష్టనష్టాలను సమీక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న IBF సంస్థ TAM, INTAM రెండూ సమగ్రమైన రేటింగ్స్ ఇవ్వలేకపోతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేస్తూ వచ్చింది. లెక్కింపులో అనుసరించాల్సిన సాంకేతిక ప్రమాణాల విషయంలో కూడా ఈ రెండు సంస్థల్లో సారూప్యం కొరవడిందనే అభిప్రాయం ఉంది. చెరో విధానం అవలంబించడం వలన అనవసరమైన గందరగోళం ఏర్పడిందన్న భావం పెరిగింది.
భారత్ వంటి పెద్ద దేశంలో వైవిధ్యం ఎక్కువ ఉండటం వలన శాంపిల్ సైజ్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడే అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుంది. అప్పుడే అర్థవంతమైన రేటింగ్స్ నిర్ణయించడం కుదురుతుంది. పెద్ద పెద్ద నగరాలలో కూడా శాంపిల్ సైజ్ చాలా చిన్నదిగా ఉండటం ఇప్పటికీ సమస్యగానే మిగిలిపోయింది. పైగా హిందీ మాట్లాడే రాష్ట్రాలకున్న ప్రాధాన్యం తూర్పున ఉన్న రాష్ట్రాలకు లేదు. దేశంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ ప్రాతినిధ్యం లేదు. రాజస్థాన్, హర్యానా, ఒరిస్సాతో పాటు ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదు.
అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో టీవీ ప్రేక్షకులు సంఖ్య 30 కోట్ల మంది. వారిలో కేబుల్, శాటిలైట్ ప్రసారాలు చూసే వారి సంఖ్య 22 కోట్ల మంది. అంటే ఈ రెండు సంస్థలూ ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించలేదు అన్నది సుస్పష్టం. ఈ రెండు సంస్థలను పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థ ఉండాలని ఛానల్ యజమానులు కోరుతూ వచ్చారు. కనీసం 75 శాతం మంది ప్రజలను సర్వే పరిధిలోకి తీసుకురావటం, పొరపాట్లు సరిదిద్దడం, అటు యాడ్ ఏజెన్సీలూ, ఇటు ఛానల్ యజమానులూ కలిసికట్టుగా ఉండి ఒకే విధమైన రేటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చేలా చేయటం  ధ్యేయాలుగా ఉండాలని IBF వాదిస్తూ వచ్చింది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే  TAM, INTAM రెండూ పోటీ సంస్థలుగా కనిపిస్తున్నప్పటికీ డచ్ సంస్థ VNU కు  TAM  రేటింగ్స్ నడిపే AC NIELSEN లోనూ,  INTAM రేటింగ్స్ ఇచ్చే ORG MARG లోనూ మెజారిటీ వాటా ఉంది. మొత్తమ్మీద INDIAN BROADCASITING FOUNDATION పట్టుబట్టడంతో ఈ రెండు సంస్థలూ కలిసి పనిచేయటం మొదలయింది. ఫలితంగా ఇప్పుడు మనకు TAM రేటింగ్స్ మాత్రం మిగిలాయి.

TAM ప్రతివారం సేకరించిన డేటాను విశ్లేషించి, మార్కెట్లో ఏ ఛానల్ వాటా ఎంత ఉందో తేల్చిచెబుతుంది. ఇందులో వాస్తవం ఎంత అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని ఛానల్స్ ఈ డేటాను ఆమోదించి తీరాల్సిందే. అందరూ అంగీకరించి చందా కట్టడం వల్ల  TAM ఇచ్చే నివేదిక మీద అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదు. పైగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు కూడా TAM నివేదిక ఆధారంగా ప్రకటనలు ఏ మేరకు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రేటింగ్స్ పరిధి విస్తరించాలని మాత్రమే అందరూ కోరుకుంటున్నారు. (ఇంకావుంది)

18, నవంబర్ 2013, సోమవారం

చెవిటిమేళం


ఏకాంబరానికి అనుమానం వచ్చిందే తడవుగా డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
‘మా ఆవిడకు చెవుడు వచ్చిందని నా అనుమానం’ చెప్పాడు డాక్టర్ తో.
‘వోస్ ఇంతేనా! మా పని చెవుడు నయం చేయడమే’ అన్నాడు డాక్టర్.
‘మా ఆవిడ చెవుడు యెంత  ముదిరిందో తెలుసుకునే వీలుందా!’
‘అదేమంత పని. దీనికి చిన్న టెస్ట్ వుంది. మీరే చేసుకుని  మీకు మీరే నిర్ధారణ చేసుకోవచ్చు’
డాక్టర్ చెప్పిన చిట్కా విని ఇంటికి వెళ్లాడు ఏకాంబరం. భార్య వంట గదిలో వుంది.
డాక్టర్ చెప్పినట్టు,  కాస్త ఆమెకు దూరంగా నిలబడి,  ‘ఇవ్వాళ ఏం కూర చేస్తున్నావు’ అని అడిగాడు.
ఏదో గొణుగుతున్నట్టు పెదాలు కదిలాయి కాని ఆమె దగ్గరనుంచి సమాధానం లేదు.
ఏకాంబరం ఆమెకు మరింత దగ్గరగా జరిగి ‘ఏం కూర’ అంటూ మళ్ళీ అదే ప్రశ్న వేసాడు. అప్పుడూ ఆమెనుంచి స్పందన లేదు. ఇంకాస్త దగ్గరకు వెళ్ళి డాక్టర్ చెప్పినట్టే మళ్ళీ అదే అడిగాడు.
ఈసారి ఏకాంబరం భార్య నుంచి ఠకీమని  జవాబు వచ్చింది.
‘ఏం కూర ఏం కూర అని మూడు సార్లు అడిగారు. వంకాయ కూర అని మూడుసార్లూ  నెత్తీ నోరూ కొట్టుకుంటూ చెప్పాను. మీకేదో చెవుడు వచ్చినట్టుంది. ముందు పోయి ఏ డాక్టర్ కన్నా చూపించుకోండి’



(నెట్లో ‘జోక్కి ‘ స్వేఛ్చానువాదం)

(Courtesy image owner - 18-11-2013)

నడకే మంత్రము



విజయసాధనకు వేసే ప్రతి అడుగు విశ్వాసంతో తొణికిసలాడాలి. గందరగోళంతో కూడిన వురుకులు పరుగులకంటే నమ్మకం నిండిన నడకే ముందుగా గమ్యానికి చేరుస్తుంది. 


(Courtesy image owner)
    

సరైన తరుణం


ఇరవై ఏళ్ళ క్రితం మనం ఒక మొక్కను నాటివుంటే అది ఇప్పటికల్లా ఫలితాలను ఇస్తూ వుండేది. అయితే  అప్పుడు నాటలేదని చింతిస్తూ కూర్చోనక్కరలేదు. ఇప్పుడు కూడా ఆ పనిచేయవచ్చు. మొక్కలు నాటడానికి తరుణం మించిపోవడం అంటూ వుండదు. ఈరోజు ఒక మొక్కను నాటుతున్నాము అంటే  భవిష్యత్ తరానికి ‘పచ్చని’ ఆస్తులు పంచుతున్నట్టే లెక్క. పైగా ఈ ఆస్తులకు పన్నుల బాధాలేదు, పంపకాల ప్రయాసా వుండదు. 


(Courtesy image owner)