5, సెప్టెంబర్ 2013, గురువారం

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు



సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి
యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.
ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నానుఅని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడుఅని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.
గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.
ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.
తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు
ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.
మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.
1921 వ  సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.
పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.
ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.
ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.
అక్షర బిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు. నిస్వార్ధంగా పిల్లలకు చదువు  చెప్పిన పుణ్యమే ఆయన్ని ఈ రోజుకు కూడా ఆరోగ్యవంతుడిగా కాపాడుతోంది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు కొంతమంది జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. మరికొందరు వయస్సులో పెద్దవాళ్ళయ్యారు. కానీ ఆయన ఇప్పటికీ అప్పటిమాదిరిగానే సాధారణ జీవనం సాగిస్తున్నారు.


(శివరాజు అప్పయ్య పంతులు గారు)

గురుపూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి మరోసారి మనః పూర్వకంగా -

గురుద్దేవో నమః


(Today 5th September is TEACHERS DAY)

4, సెప్టెంబర్ 2013, బుధవారం

యోగ్యతాపత్రం


ఒక్కో రోజు అలాగే. అనుకోకుండా ఈ రోజు ఓ మంచి ముక్క, మరో యోగ్యతాపత్రం. సంతోషించడానికి ఇంకేం కావాలి. ఫేస్ బుక్ లో నేను రాసిన ఓ వ్యాసం పట్ల యండమూరి వీరేంద్ర నాథ్ గారి విశ్లేషనాత్మక స్పందన ఒకటయితే (Yandamoori Veerendranath this is what i wrote 10 years ago about subsidies, in my book MINDPOWER. all this is for votes. hence even opposition could not say 'no' to it. if possible read, our former Reservebank secretary's remark, how this is going to ruin our country with this bill... how states would suffer.)
సాయి గారి ఇంటింటి పత్రిక ‘రచన’ (సెప్టెంబర్ సంచిక) లో శ్రీ డి. వెంకట్రామయ్య గారి ప్రేమపూర్వక ప్రస్తావనలు.
చాలా వివరంగా రాసిన ఆయన వ్యాసాన్ని కాస్త కుదిస్తే – (అంతా నా గురించే కాబట్టి యెంత కుదించినా కాస్త ఎక్కువే అనిపిస్తే క్షమించాలి)
వెంకట్రామయ్యగారి ఉవాచ:


“హైదరాబాదు ఆకాశ వాణి వార్తావిభాగంలో మిగతా అందరికంటే నాతొ ఎక్కువ కాలం పనిచేసిన సహోద్యోగి, మిగతా అందరి కంటే నాకు అత్యంత ఆప్తుడు భండారు శ్రీని వాసరావు. 1975  లో ఆయన చేరినప్పటినుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు నలభయ్ ఏళ్ళు మా స్నేహం చెక్కుచెదరకుండా వుంది. ...ఎన్నో విషయాల్లో ఏ మాత్రం పోలికా పొంతనా లేని మేమిద్దరం స్నేహితులుగా అన్నేళ్ళు అంత దగ్గరగా వుండడమే విచిత్రం.
“ఎప్పుడు నవ్వుతు, తుళ్ళుతూ గలగలా మాట్లాడుతూ వుండడం, తన వాక్చాతుర్యంతో,చమత్కారాలతో, చలోక్తులతో, వ్యంగోక్తులతో చుట్టూ వున్నవాళ్లనందరినీ కవ్విస్తూ నవ్విస్తూ వుండడం ఆయన సహజ లక్షణాలు. అసలీ మనిషి జీవితంలో ఎన్నడయినా  విచారం విషాదంలాంటివేమైనా వుంటాయా, ఎప్పుడయినా ఏ సందర్భంలో నయినా ఈయన సీరియస్ గా వుంటాడా అనిపిస్తుంది ఆయన్ని చూసిన వాళ్ళందరికీ.
“ న్యూస్ రూమ్ అంటేనే వాతావరణం ఎప్పుడు ఎంతో కొంత ఉద్విగ్నంగా వుంటుంది. కాని శ్రీనివాసరావు అక్కడ వుంటే చాలు వేడి తగ్గిపోయేది. ఆయన మాటలతో, చలోక్తులతో అందరూ కాసేపు హాయిగా నవ్వుకునే వారు. కాస్త విశ్రాంతి దొరికినట్టుగా, వూరట లభించినట్టుగా అనిపించేది పనిచేసేవాళ్లకి.
“సరే! కొత్తగా వచ్చి చేరిన ఈ శ్రీనివాసరావు అనే ఆయన అసలు స్వరూపం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన  పనితీరు యెలా వుంటుంది అని మొదట్లో అన్నీ సందేహాలే. ఇలాటివన్నీ తెలుసుకోవడానికీ, ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికీ అధమ పక్షం ఆరు మాసాలు పట్టింది. (పూర్తిగా అన్నమాట వాడకూడదేమో. ఎందుకంటే అప్పుడే కాదు.. ఇన్నేళ్ళ తరువాత కూడా నా మిత్రుడు భండారు శ్రీనివాసరావు లీలలూ, మాటలూ నాకు పూర్తిగా అర్ధం కావు)

(భండారు శ్రీనివాసరావుతో డి.వెంకట్రామయ్యగారి అనుభవాలు మరికొన్ని వచ్చే సంచికలో- ఎడిటర్) 
04-09-2013                

3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఫుడ్ సెక్యూరిటీ


క్లాసు జరుగుతోంది. ప్రొఫెసర్ అడిగాడు, ఫుడ్ సెక్యూరిటీ బిల్లు గురించి తెలుసా అని.
తక్కున జవాబు వచ్చింది.
‘తెలియకేం. అందరికీ ఆహారం. ఈ దేశంలో ఎవ్వరూ ఆకలితో కడుపులో కాళ్ళు పెట్టుకుని నిద్రించే పరిస్తితి లేకుండా చేయడం దీని ఉద్దేశ్యం’ 


ప్రొఫెసర్ గారు విద్యార్ధులకు ఓ పరీక్ష పెట్టాడు. దానితో పాటు ఒక నిబంధన కూడా.
అదేమిటంటే – అందరూ పరీక్ష రాస్తారు. కానీ అందరికీ వచ్చిన మార్కులను సగటు తీసి గ్రేడ్లు ఇస్తారు.
సరే. అంతా పరీక్ష రాశారు. బాగా చదివిన  వాళ్లు బాగా రాశారు. చదవని వాళ్లు అందుకు తగ్గట్టే జవాబులు రాశారు. ప్రొఫెసర్ గారు వాళ్ల మార్కుల సగటు తీసి అందరికీ ‘బీ’ గ్రేడ్ ఇచ్చారు. చదవని వాళ్లు సంతోషించారు. బాగా చదివే వాళ్లు  చిన్నబుచ్చుకున్నారు.
కొన్నాళ్ళు జరిగాయి. మళ్ళీ పరీక్ష పెట్టారు. ఈ సారి బాగా చదివేవాళ్ళు కూడా చదువుపై శ్రద్ధ పెట్టలేదు. వాళ్లను  నిర్వేదం అవహించింది, ‘చదివేం లాభం. యెట్లాగు వచ్చేవి సగటు మార్కులే’ కదా అని.
చదవని వాళ్లు ఆ కాస్త కూడా చదవడం మానేశారు. ఎందుకంటే చదవకపోయినా మంచి గ్రేడే వస్తోంది. ఇక కష్టపడాల్సిన పనేముంది.
ఈసారి అందరికీ తక్కువ గ్రేడే వచ్చింది.
తరువాత తరువాత ఏం జరిగిందో చెప్పనక్కర లేదు. బాగా కష్టపడి చదివేవాళ్లు చదవడం మానేశారు.
చదవని వాళ్లకు ఏం పట్టలేదు. ఎందుకంటే వాళ్లకు పోయేదేమీ లేదు.
చివరికి ఎన్నడూ కనీవినీ ఎరుగని  విధంగా క్లాసు మొత్తం పరీక్షలో తప్పింది.
ఆ తరువాత ప్రొఫెసర్ చెప్పారు.
‘ఫుడ్ సెక్యూరిటీ బిల్లు వల్ల ఏం జరుగుతుందో మీ అందరికీ  అర్ధం అయిందనుకుంటాను.’ 
ప్రతి కధకు ఒక నీతి వుండాలి కదా!
అదే ఇది.
 ‘కొందరికే అన్నీ కాకుండా అందరికీ అన్నీ’ అనే విధానం మెచ్చతగిందే.
కాలే కడుపుకి ఇంత అన్నం పెట్టడాన్ని మించిన ధర్మం ఏముంటుంది ?
కానీ,  
అందరికీ పంచడం అంటే  కొందరి నుంచి తీసుకోవడం కాదు.
సోమరితనాన్ని పెంచడం అంతకంటే కాదు.
అన్ని అవతారాలు ఎత్తిన భగవంతుడు కూడా అవతారానికి తగ్గట్టే నడుచుకున్నాడు. మన ప్రధాన మంత్రి గారయినా అంతే. రాజకీయ అవతారం ఎత్తిన తరువాత ఆర్ధిక శాస్త్రాన్ని మరచిపోవాలి.
అదే జరుగుతోంది.

(నెట్లో కంటబడ్డ కధనానికి స్వేచ్చానువాదం)

03-09-2013

ఈ కార్టూన్ కి ఓ క్యాప్షన్ పెట్టండి ప్లీజ్


(ఇది నా సొంత ఐడియా కాదు, గతంలో బాపూ రమణలు 'జ్యోతి' పత్రికలో ఇలాటి ఆటలు ఎన్నో పాఠకులతో ఆడేవాళ్ళు)


చెత్త బండిగా రోల్స్ రాయిస్



పురుషులలో పుణ్య పురుషుల మాదిరిగా కార్లలో రోల్స్ రాయిస్ రాయసమే వేరు. గొప్ప గొప్ప వాళ్లు కొనుక్కుని గొప్పగా చెప్పుకునే ఆ గొప్ప కారును ‘చెత్త బండీ’గా వాడిన ఘనత ఒక భారతీయుడిది. నమ్మి తీరమంటోంది ఓ  ‘నెట్ కధనం.’
1940 కి పూర్వం ఆనాటి మైసూరు మహారాజా గారు ఇంగ్లాండ్ కి విహార యాత్రకి వెళ్లారు. లండన్ లో రోల్స్ రాయిస్ కార్ల షో రూమ్ కి వెళ్ళి అక్కడ కొత్త మోడల్ కారును చూసి ముచ్చటపడ్డారు. కానీ ఆ షో రూమ్ వారికి ఈయన ఎవరో తెలియదు. అది అందరికీ అమ్మే అల్లాటప్పా కారు కాదన్నట్టు చెప్పి  తిప్పి పంపించారు.
రాజావారికి రోషం పొడుచుకు వచ్చింది. స్వదేశానికి వచ్చిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వంలో తనకున్న సంబంధాలను వాడుకుని ఇంగ్లాండ్ నుంచి ఒక రోల్స్ రాయిస్ కారును ఆఘమేఘాల మీద దిగుమతి చేయించుకున్నారు. లండన్ లో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలని అనిపించింది. వెంటనే ఆ కొత్త రోల్స్ రాయిస్ కారును రాజప్రాసాదంలో చెత్త రవాణా చేసే  వాహనంగా ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
దేశదేశాల్లో జనాల మన్ననలు అందుకుంటున్న తమ కారుకు మైసూరు రాజభవనంలో పట్టిన దుస్తితి రోల్స్ రాయిస్ కంపెనీ దృష్టికి వచ్చింది. ఆ కంపెనీ ప్రతినిధులు లబోదిబోమంటూ మైసూరుకు వచ్చి తమ కారు ప్రతిష్టకు భంగం కలిగించవద్దని మొర పెట్టుకున్నారు. అంతగా కావాలంటే కారు ధరకు ఎక్కువ మొత్తం చెల్లించి తమ కారును తాము తీసుకుపోతామని విన్నపం చేసుకున్నారు.
అంతా విని మైసూరు రాజా గారు మీసాలు సవరించుకుంటూ వారితో ఇలా అన్నారు.
“ ఆ మాటయితే ఓ పని చేయండి. రాజప్రాసాదంలో  చెత్త రోజుజుకూ పెరిగి పోతోంది.  మరో రెండు రోల్స్ రాయిస్ కార్లు వెంటనే పంపించండి. ధర ఎంతయినా పరవాలేదు.”
అప్పటినుంచి లండన్ లో రోల్స్ రాయిస్ షో రూమ్ కు  భారతీయులు ఎవ్వరు వెళ్ళినా వారిని మహారాజుల  మాదిరిగా చూడడం మొదలయింది.

 ‘యేమో ఏ పుట్టలో ఏ పాముందో’ అనే భయం అక్కడివారిని  పట్టుకున్నట్టుంది.

2, సెప్టెంబర్ 2013, సోమవారం

పెళ్లి ముడి



ఝామ్మున పెళ్లయిపోయింది. వధూవరులిద్దరూ హనీమూన్ బయలుదేరుతున్నారు. పెళ్లి కూతురు తల్లి కుమార్తె చేతిలో ఓ బ్యాంక్ పాస్ బుక్ పెట్టి చెప్పింది.
‘సంసారం అన్నాక కష్ట సుఖాలు వుంటాయి. నీకు బాగా సంతోషం కలిగిన రోజున ఎంతో కొంత సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చెయ్యి. ఆనందం కలిగించిన కారణాన్ని కూడా అందులో గుర్తుగా రాసుకో. పుస్తకం పారేసుకోకు. చెప్పింది మరచిపోకు’


గిర్రున ఏడాది తిరిగింది. పండంటి బాబు పుట్టాడు. ఆ సంతోషానికి గుర్తుగా కొంత డబ్బు డిపాజిట్ చేసింది.
నెలలు గడిచాయి. ఆమెకు జీతం పెరిగింది. పెరుగుతున్నఖర్చులకు తోడుగా జీతం పెరగడం కంటే ఆనందం ఏముంటుంది. దానికి గుర్తుగా మరికొంత సొమ్ము బ్యాంకులో చేరింది. మరి కొన్నాళ్ళకి అతడికి ప్రమోషన్. రెట్టింపు జీతం. కారు కొన్నారు. మంచి జరిగినప్పుడల్లా బ్యాంక్ డిపాజిట్ పెరుగుతూనే వుంది.
రోజులన్నీ ఒక్క మాదిరిగా వుండవు కదా.
కాపురంలో చిర్రుబుర్రులు మొదలయ్యాయి. సంభాషణల్లో స్వారస్యం తగ్గి వాదాలు చోటుచేసుకోవడం ప్రారంభమయింది.
ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి. ఎప్పుడన్నా నోరు తెరిచినా అది చివరకు నోరు పారేసుకోవడం దాకా వెళ్ళేది.
తల్లిదగ్గర చెప్పుకుంది.
‘ఇతగాడిని భరించడం ఇక నా వల్లకాదు. నేను విడాకులు తీసుకుంటాను మమ్మీ. అతడు కూడా వొప్పుకున్నాడు. ఇష్టం లేని కాపురం కన్నా విడిపోయి విడిగా వుండడమే హాయి’
విన్న తల్లి గుండె గతుక్కుమంది. అయినా తమాయించుకుని చెప్పింది.
‘నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా చెప్పు. అలాగే విడాకులు తీసుకుందురు కాని. కానీ నీ పెళ్ళిలో నీకొక బ్యాంక్ పాస్ బుక్ ఇచ్చాను కదా. అందులో యెంత వేసారో ఏమిటో. ముందు ఆ డబ్బు బయటకు తీసి ఒక్క పైసా మిగలకుండా అంతా ఖర్చుచేసేయ్యి. ఎందుకంటే ఈ దాంపత్యం తాలూకు ఏవీ నీకు గుర్తులుగా మిగిలి వుండకూడదు.’
అమ్మాయి పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళింది. క్యూలో నిలబడివున్నప్పుడు అనుకోకుండా పుస్తకం తెరిచి చూసింది. అందులో డిపాజిట్ చేసింది  తక్కువసార్లే అయినా ఆ ఎంట్రీల వద్ద రాసిపెట్టిన జ్ఞాపకాలు ఆమెను కదిలించాయి. పిల్లవాడు పుట్టడం, జీతాలు పెరగడం, ప్రమోషన్ రావడం – ఆ సందర్భాల్లో తమ నడుమ చోటుచేసుకున్న ఆహ్లాదకర క్షణాలు – ఓహ్ – జీవితమంటే యెంత ఆనందం.
ఇక అక్కడ నిలబడలేక ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చి భర్తతో చెప్పింది. 'ఇదిగో. ఈ పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళు. ఎంతవుంటే అంత తీసేసుకుని అంతా ఖర్చు చేసెయ్యి. ఆ తరవాతే ఇంటికి రా’
మర్నాడు వచ్చాడు. వచ్చి భార్య చేతిలో పాస్ బుక్ పెట్టాడు. అందులో కొత్త డిపాజిట్ వుంది. దానికి కింద ఇలా రాసాడు.
‘ఈ రోజు నా జీవితంలో గొప్పరోజు. నిన్ను నేను ఎంతగా ప్రేమించిందీ, ఇన్నేళ్ళ దాపత్యంలో నువ్వు నాకెంత సంతోషాన్ని అందించిందీ అన్నీ  ఈ రోజే మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను.’
ఎవరు ముందో తెలియనంత వేగంగా వారిద్దరూ ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నారు. ఆనంద భాష్పాలతో వారి కాపురం పునీతమైంది.
తరువాత వారు చేసిన మొట్టమొదటి పని – బ్యాంకు పాస్ బుక్ ను భద్రంగా బీరువాలో దాచిపెట్టడం.

Note: నెట్లో తారసపడిన ఓ ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం  

(02-08-2013)

"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు"




(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ఎన్టీఆర్ తో నేనుఅనే పుస్తకం నుంచి  కొన్ని భాగాలు)




“......ఎన్టీఆర్ కు అసలు దేవుడన్నా, పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు. ఆయన ఇంట్లో ఎప్పుడూ  ఏ వ్రతం కానీ, పూజలు కానీ జరగ్గా నేను చూడలేదు. ఒక్క వేంకటేశ్వరస్వామి ఫోటో మినహా మరే దేవుడి ఫోటో ఆయన ఇంట్లో కనిపించేది కాదు. తిరుమలకు తప్ప రాష్ట్రంలోని మరే ఇతర దేవాలయానికి ఆయన వెళ్లగా చూడలేదు......


“.......పూజలు పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా, ఎన్టీఆర్ జ్యోతిష్యాన్ని, వాస్తుని మాత్రం బాగా నమ్మేవారు. ఎవరయినా జ్యోతిష్కుడు వచ్చి పలానా రాయి వున్న వుంగరం పెట్టుకొమ్మని చెబితే దాన్ని తు చ తప్పకుండా పాటించేవారు. అలా ఆయన చేతి వేళ్లకి ఏడెనిమిది ఉంగరాలు వచ్చి చేరాయి.......

“..... సినిమా షూటింగులకి బయట వూళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద హోటళ్ళలో బస చేసేవారు కాదు. హైదరాబాదు వస్తే , సారధీ స్టూడియోలో ఓ మూల చిన్న గదిలో సర్దుకునేవారు. చిన్నపాటి పరుపు, ఓ దిండు ఇస్తే చాలు, కింద వేసుకుని పడుకునేవారు.....

“.....ఎన్టీఆర్ కి బాగా దగ్గరగా మసలిన వ్యక్తి,  బీవీ మోహనరెడ్డి. ఒకసారి దైవ దర్శనం కోసం ఎన్టీఆర్- బీవీతో కలసి తిరుపతి వెళ్లి వస్తున్నారు. వీళ్ళ కారు వెనకనే వస్తున్న వీఐపీ కారు ఒకటి సైరన్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయిందట. ఆ వీఐపీ కారుకు  అటూ ఇటూ మరికొన్ని కార్లు. ఈ హంగామాను ఎన్టీఆర్ ఆసక్తిగా గమనిస్తున్నప్పుడు, బీవీ కలగచేసుకుని మీ కారు కూడా ఎనభైలో ఇలాగే సైరన్, పైలట్ హంగామాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇది తధ్యం' అని జోస్యం చెప్పారట........

“......రామారావుది మొదటి నుంచి ఒకటే ఫిలాసఫీ. ఏదయినా వ్యాపారం అంటూ చేస్తే సొంత డబ్బు పెట్టాలి. ప్రభుత్వ రాయితీలు, ఉచిత  స్థలాలు  ఎందుకనే వారు. అక్కినేని నాగేశ్వరరావుకు స్టూడియో నిర్మాణానికి (ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్తలంలో వేరే వ్యాపారాలు చేయడం ఎన్టీఆర్ కి నచ్చలేదు. వారికి నోటీసులు పంపండి. ఏం పర్వాలేదుఅని ఆదేశాలిచ్చారాయన......

“.......తన సినీ జీవితం తొలినాళ్ళలో ఆత్మాభిమానం మెండుగా వున్న ఈ నిండు మనిషి, ఒకసారి నడుచుకుంటూ షూటింగుకు వెళ్లడం చూసి ఆ సినిమా నిర్మాత ఆయనకు ఒక కొత్త కారు కొని ఇంటికి పంపారట. ఆ రోజుల్లో కొత్త కారు ఖరీదు పదిహేను వందల రూపాయలు. తరువాత తనకు డబ్బు సమకూరాక నందమూరి ఆ నిర్మాత ఇంటికి వెళ్లి కారు డబ్బులు తిరిగి ఇచ్చేశారట......


".......ఎమ్జీఆర్ (అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్ ) ఢిల్లీ వెళ్ళే సందర్భాలలో ఆయన విమానం హైదరాబాదులో నలభై అయిదు నిమిషాల పాటు ఆగేది. ఎన్టీఆర్  టిఫిన్ క్యారియర్ పట్టుకుని నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళేవారు. అక్కడ తన మద్రాసు మిత్రుడితో కాసేపు ఆప్యాయంగా కబుర్లు చెప్పేవారు. ఇలా చాలా సార్లు జరిగింది."