13, ఆగస్టు 2013, మంగళవారం

నువ్వెవరివో నాకు తెలుసు




గొర్రెల కాపరి లొల్లాయి పదాలు పాడుకుంటూ గొర్రెల్ని కాసుకుంటూ వెడుతున్న సమయంలో ఓ పొడవాటి కారు అతడి పక్కగా వచ్చి ఆగింది. అందులోనుంచి ఓ పొడవాటి మనిషి సూటూ బూటూ వేసుకుని దిగాడు.
గొర్రెల కాపరిని చూడగానే అతగాడికి అతడ్ని ఆట పట్టించాలని అనిపించింది. అనిపించి అతడితో ఇలా అన్నాడు.
ఇదిగో అబ్బీ! నీ దగ్గర చాలా గొర్రెలు వున్నట్టున్నాయి. అవి ఎన్ని వున్నాయో నేను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పాననుకోవాటిల్లో ఒకదాన్ని నాకిచ్చేస్తావా?’
సూటు ఆసామీ మాటలు గొర్రెల కాపరికి వింతగా అనిపించాయి. తనను ఆట పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి కూడా కాపరి అతడి పందేన్ని ఒప్పుకున్నాడు.
సూటు దొరవారు వెంటనే కారులోనుంచి లాప్ టాప్ తీసాడు. మొబైల్ ఫోనుకుఫాక్స్ మిషన్ కు కలిపాడు. నెట్ కనెక్ట్ చేసి జీపీఆర్ ఎస్ సిస్టం తో గొర్రెలమంద వున్న ప్రదేశాన్ని స్కాన్ చేసాడు.  
          కంప్యూటర్లో ఏవేవో అంకెలు వేసాడు. ఎన్నెన్నో లెక్కలు కూడాడు. చివరికి ప్రింటర్ నుంచి నూటయాభై పేజీల ప్రింటవుట్ తీసాడు. అంతాచేసి చివరికి గొర్రెల లెక్క తేల్చాడు.అయ్యా! కాపరిగారూ! మీవద్ద వున్న గొర్రెలు చిన్నా పెద్దా  ఆడా మగా అన్నీ కలిపి అక్షరాలా పదిహేనువందల నలభై మూడు’ అన్నాడు.
అతడంత ఖచ్చితంగా గొర్రెల సంఖ్యను చెప్పడంతో ముందు కంగారు పడ్డా కాపరి తొందరగానే తేరుకున్నాడు.
 ‘అయ్యా దొరవారూ! చాలా బాగా లెక్క చెప్పారు. పందెం ప్రకారం నా మందలోనుంచి మీకు నచ్చిన గొర్రెను తీసుకెళ్లండి
దొర తన తెలివితేటలకు తానే మురిసిపోతూ మంద నుంచి ఓ బలిసిన గొర్రెను ఎంపిక చేసుకుని తన కారు వెనుక సీటు కింద పెట్టుకున్నాడు.   
           కారు స్టార్ట్ చేసి వెళ్ళబోయేలోగా వెనుకనుంచి గొర్రెల కాపరి స్వరం వినిపించింది.
అయ్యా! మీరెవరో ఏంచేస్తుంటారో నాకు తెలవదు. కానీ నేనూ మీలాగే మీ వృత్తి ఏమిటో వూహించి చెప్పగలను. సరిగ్గా చెబితే నా గొర్రెను నాకిచ్చి వెడతారా?’
పందెం గెలుచుకున్న సంతోషంలో దొర వెంటనే దానికి ఒప్పుకున్నాడు.
గొర్రెల కాపరి కాసేపు ఆలోచించినట్టు   నటించి మీరు జర్నలిస్టు  అయివుంటారు. అవునా! నా అంచనా కరెక్టే కదా!’ అన్నాడు.
దొరకు మతిపోయినంత పనయింది.
అవును. నేను జర్నలిస్టునే. అంత సరిగ్గా యెలా చెప్పగలిగావు’ అడిగాడు గొర్రెను తిరిగి ఇచ్చేస్తూ.  
            కాపరి ఇలా జవాబు చెప్పాడు.
అదేమంత పని. చాలా సులభం.
నేను అడగకుండానే ముందు మీరే నా వద్దకు వచ్చారు. జర్నలిస్టులు  మాత్రమే ఇలా చేస్తుంటారు.  అది మొదటి సంగతి. పోతే,  నాకు తెలిసిన విషయాన్ని  నాకే చెప్పడానికి పందెం కట్టారు చూసారు,  అక్కడ దొరికిపోయారు.  మూడో పాయింటు ఏమిటంటే, నేనేమిటో,  నా వృత్తి ఏమిటో  మీకు ఎంతమాత్రం తెలియదు. అయినా తెలుసు అనుకుని తగుదునమ్మా అని మీ తెలివితేటలు, నా వంటి ముక్కూ మొహం తెలియనివాళ్ళ ముందు ప్రదర్శించబోయారు. మీరు జర్నలిస్టు అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.


(నెట్ ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం) 

12, ఆగస్టు 2013, సోమవారం

ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?


చలపతికి చాలా ఓపిక. అతడి భార్య అరుణకు ఓపిక మరింత ఎక్కువ. ఇద్దరు పిల్లల్ని ఎంతో ఓపిగ్గా పెంచుకోవడంలోనే వారిద్దరి ఓపిక హారతి కర్పూరంలా హరించుకు పోతోంది.
‘నాన్నా  దేవుడున్నాడా?’
‘వున్నాడురా’
‘మరి కనపడడేమి’
‘ఆయన దేవుడు కదా! అంచేత అలా కనబడకుండా ఉంటాడు’
‘కనపడనిదానికి అసలు వుండడం ఎందుకు?’
‘ఒరేయ్ నీకు పుణ్యం వుంటుంది. నన్ను నీ ప్రశ్నలతో చంపకురా!’
‘అమ్మా! పెరుగు ఎలా వస్తుంది’
‘ఏవిటే అర్ధంలేని ప్రశ్నలు మీ అన్నయ్య లాగా. పాలు కాచి పెరుగు తోడు పెడితే పెరుగు వస్తుంది’
‘మరి తోడు పెట్టడానికి పెరుగు ఎక్కడినుంచి వస్తుంది?’
‘ఏవండీ నన్ను పనిచేసుకోనీకుండా చంటిది ప్రశ్నలతో చంపేస్తోంది. కాస్త దీన్ని దగ్గరకు తీసుకోండి’
చలపతి ఆలోచనలో పడ్డాడు. తన చిన్నతనంలో తనకు ఇన్ని అనుమానాలు వచ్చేవా?
వచ్చేవి. కానీ వాటిని విసుక్కోకుండా తీర్చేందుకు బామ్మా తాతయ్యా వుండేవారు.



తాతయ్య వేలు పట్టుకుని తాను  బడికి వెళ్ళేవాడు. ఇప్పుడో! తన పిల్లల్ని ‘ఆటో అంకుల్’ స్కూలుకు  ‘తోలుకు’ పోతున్నాడు.
బామ్మ పొద్దుగుంకుతుండగానే గోరుముద్దలు తినిపించి, వొళ్ళో పండుకోబెట్టుకుని చిచ్చెకొడుతూ ‘అనగనగా ఒక రాజు కధలు’ చెప్పేది. ఇప్పుడో! పిల్లలు తమ గదిలో  కంప్యూటర్ ముందు కూర్చుని ‘గేములు’ ఆడుకుంటున్నారు.
చిన్నప్పుడు తనకు చిన్నగా  వొళ్ళు వెచ్చబడ్డా బామ్మా తాతయ్యా పెద్దగా గిలగిలలాడిపోయేవాళ్ళు. ఆడుకుంటూ కిందపడి మోకాలు చెక్కుకుపోతే అప్పుడు బామ్మ పడే ఆదుర్దా చూసితీరాలి. ఇప్పుడు అంతటి ప్రేమ పిల్లలపై  తమకూ వున్నా చూపించే తీరికలేని జీవితాలు తమ ఇద్దరివీ. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులే. సాయంత్రం ఇంటికి చేరేసరికి వున్న కాస్త వోపిక వొండుకు తినడానికే సరిపోతుంది.
తాను తన పిల్లలకు అన్నీ అమర్చాడు. మంచి స్కూల్లో చేర్పించాడు. విడిగా వారిద్దరికీ పడక గది ఏర్పాటు చేసాడు. కొంచెం ఖర్చయినా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాడు. వారం విడిచి వారం మల్టీప్లెక్స్ సినిమాలు చూపిస్తాడు. ఖరీదయిన రెస్టారెంటు తీసుకువెడతాడు. ఇక అరుణ మాట చెప్పనక్కరలేదు. ఇంట్లో వున్న కాసేపు ఆమెకు పిల్లల తోడిదే లోకం.
అయినా ఎక్కడో ఏదో లోపం జరుగుతుందోన్న అనుమానం. తాము ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేవరకు వాళ్ళిద్దరూ పక్కింటి ఆంటీ ఇంట్లో వుంటారు. తాము కనబడగానే వాళ్ళ కళ్ళల్లో కనబడే వెలుగు చూసినప్పుడు ‘లోపం’ గురించిన ఆ అనుమానం పెనుభూతంగా మారి భయపెడుతుంది. కానీ, అవసరం అనుమానాలను అణచిపెడుతుంది.
అమ్మానాన్నా ఎక్కడో వుంటారు. నెలకు ఇంత అని క్రమం తప్పకుండా డబ్బు పంపుతూనే ఉంటాడు. తెచ్చి తమ దగ్గరే అట్టిపెట్టుకునే ఆలోచన వచ్చినా  ఇంకేదో  ఆలోచన పట్టి ఆపుతుంది.
కానీ పిల్లలు ఏదో కోల్పోతున్నారు. బామ్మా తాతల ఆప్యాయత. అది తాము పూడ్చలేనిది.
వాళ్లకు మేధో వికాసం కలిగించే కంప్యూటర్లు ఇస్తే సరిపోతుందా? మానసిక స్వాంతన కలిగించే బామ్మా తాతల ప్రేమను అందివ్వాలా?

ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?

(Courtesy Image Owner)

తేరా భారత్! మేరా మహాన్!!




ఇటాలియన్ మంత్రిగారొకరు హడావిడిగా ఇండియా వచ్చి భారత విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. దీనికి కొంత నేపధ్యం వుంది. ఇటలీ నౌకాదళ సైనికులు ఇద్దర్ని అంతకు కొన్ని రోజులముందు కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను సముద్రపు దొంగలుగా భ్రమపడి  ఇటలీ సైనికులు కాల్చి చంపారని అభియోగం. వారిని విడిపించే ప్రయత్నంలో భాగంగా ఇటలీ మంత్రి ఇండియా మంత్రి చర్చలు జరుపుతున్నారు.
పట్టుబడిన  ఇద్దరినీ ఇండియాలోనే వుంచి విచారణ జరపడం మంచిదని ఇండియా మంత్రి ఇటలీ మంత్రికి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని వివరించే క్రమంలో ఆయన ఇటలీ మంత్రికి కొన్ని విషయాలు విశదం చేశారు.
ఇటలీలో పుట్టి పెరిగి ఇండియా కోడలిగా వచ్చి ఇప్పుడు ఏకంగా మొత్తం ఇండియానే శాసిస్తున్న సోనియా గాంధీకి జాతీయ అంతర్జాతీయ నేరస్తులపట్ల యెనలేని  కనికరం వున్న సంగతి యాదాలాపంగా బయట పెట్టారు. అందుకు దృష్ట్యాంతంగా   యూనియన్ కార్బైడ్ వ్యవహారం గురించీ, ఆయుధాల వ్యాపారి ఖత్రోచీ గురించీ, చివరాఖరుకు పాక్ ఉగ్రవాది కసబ్ పట్ల చూపిన  అపూర్వఆదరణ  గురించీ  ఇటలీ మంత్రికి వివరించి చెప్పి, ఇటాలియన్ సైనికుల విచారణ ఇండియాలోనే జరగడం వల్ల వాళ్లకు మంచే కాని చెడు జరగదన్న విషయాన్ని విడమరచి చెప్పారు.
అంతేకాదు స్పెక్ట్రం కుంభకోణం గురించీ, అందులో పీకల్లోతు ఇరుక్కున్న రాజా, కనిమొళి గురించీ ఇటలీ మంత్రి చెవిలో వేసారు. స్విస్  బ్యాంకుల్లో  కోట్లకు కోట్లు డబ్బు దాచుకున్న వారి సంగతి కూడా చెప్పి అలాటివారంతా భారత దేశంలో ఎలాటి  చీకూ చింతా లేకుండా యెలా రోజులు వెళ్ళదీస్తున్నారో సయితం అంకెలతో సహా చెప్పిచూసారు.        
ఎంతచెప్పినా ఆ ఇటలీ మంత్రికి చెవికెక్కిన దాఖలాలు లేవు.  భారత దేశంలో తన వారిపై విచారణ జరపడానికి సుతరామూ ఆయన  అంగీకరించలేదు. నేరస్తులకు రక్షణ పూర్తిగా వుంటుందని యెంత చెప్పినా అర్ధం చేసుకోని ఇటలీ మంత్రిపై ఇండియా మంత్రికి పట్టలేని కోపం వచ్చింది.
అయితే ఇంతలో ఒక అద్భుతం జరిగిపోయింది.
మంత్రి గదిలో వున్న టెలివిజన్ తెరపై అప్పుడు ఒక స్క్రోలింగ్ వస్తోంది.
ఇటలీ నౌకను పాతిక లక్షల రూపాయల పూచీకత్తుపై విడిచిపెట్టాలని కేరళ న్యాయమూర్తి ఆదేశించారన్నది  ఆ వార్త సారాంశం.
పాతిక లక్షల రూపాయలంటే యెంత అని ఇటలీ మంత్రి అడిగాడు. సుమారుగా ముప్పయ్ ఎనిమిది వేల   యూరోలని ఇండియా మంత్రి జవాబు చెప్పాడు.
భారత దేశ పౌరసత్వం దొరకాలంటే ఏం చెయ్యాలని ఇటలీ మంత్రి ఆసక్తిగా అడిగాడు.
నెహ్రూ కుటుంబంతో వియ్యం అందితే ఇట్టే  దొరుకుతుందని ఇటునుంచి సమాధానం.
వాళ్ల కుటుంబంలో  పెళ్ళికాని ప్రసాద్రాహుల్ ఒక్కడే కదా! అదెలా సాధ్యం?’ అని ఇటాలియన్ మరో ప్రశ్న సంధించాడు.
అనవసరంగా రాహుల్ ప్రసక్తి తెచ్చానే అని నీళ్ళు నమిలిన ఇండియా మంత్రి సిటిజన్ షిప్ లాంటి తతంగాలన్నీ అత్యల్ప స్వల్ప విషయాలు. వాటిని గురించి కనుక్కుని ఏర్పాట్లు చేయడానికి కోటరీ చాలా వుంది. ముందు మీ సంగతి  తేల్చండిఅన్నాడు.          
ఇటలీ మంత్రి కూర్చున్న చోటి నుంచి కదలకుండా రోముకు ఫోను చేసి తాను ఇప్పట్లో ఇటలీ రావడం లేదని చెప్పాడు. మరో ఫోను సిసిలీకి చేసి అక్కడి మాఫియా అధినేతతో మాట్లాడాడు.
ఇన్నాళ్లబట్టి మీరంతా ఏదో పోటుగాళ్లన్న భ్రమలో వున్నాం. ఒకసారి ఇండియా వచ్చి చూడండి. ఇక్కడివాళ్ళు చాలా తెలివిమీరిపోయారు. మీరింకా పాత రాతి యుగంలోనే  వున్నారన్న సంగతి భారత దేశానికి వస్తే అర్ధమవుతుంది.

(ఇంటర్నెట్ లో సంచారం చేస్తున్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్ఛానువాదం)   

11, ఆగస్టు 2013, ఆదివారం

విందామయా నరుడ విందామయా


చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.
"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.

తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట. 
పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట." 

ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.



కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు. 

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.

కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు. 

" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. ‘మొగుడి మాట పెళ్ళాం వినకూడదు’ అన్నది  మా ఇంట్లో నా రూలు కాబట్టి తాను  వెంటనే  లేచి నిలబడుతుంది.  చూశారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు. 


బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని. ఘనత వహించిన మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా గిట్టని వాళ్ళు ‘ఆయనో సీతయ్య – ఎవరి మాట వినడు’ అంటారని కొందరు అంటుంటారు.

పొతే, వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.

హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.
మళ్ళీ అసలు సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.

'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.

విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.

NOTE: Courtesy Cartoon Owner

ఏడ్చేవాడికి ఏడ్చినంత. నవ్వేవాడికి నవ్వినంత.




(శ్రీ బొడ్డు మహేందర్ సౌజన్యంతో) 
ఏడ్చేవాడికి ఏడ్చినంత. నవ్వేవాడికి నవ్వినంత. జీవితమంతా ఎలా ఉండాలనుకుంటున్నావో అది నీకే తెలియాలి. జీవితమన్నప్పుడు సమస్యలూ ఉంటాయి. వాటి తాలూకు సంఘర్షణలూ ఉంటాయి. అయితే వాటి మధ్య సరదా నవ్వులూ, సంతోషాలు కూడా అంతే సమానంగా ఉండాలి. లేకపోతే జీవితంలో బ్యాలెన్స్ ఉండదు . ప్రేమ పూల సుగంధం ఉండదు అంటాడు ప్రఖ్యాత మానసిక వేత్త ఎడ్విన్ కీస్టర్




ప్రపంచంలో ప్రతి దానికీ రెండు అంచులు ఉంటాయి. చెట్టునే తీసుకున్నా, కిందికి చూస్తే మట్టిలో కూరుకుపోయిన వేళ్లు,కాండం కనిపిస్తాయి. పైకి చూస్తే గాలిలో తేలాడుతున్న ఆకులూ, పూలూ, కనిపిస్తాయి. నువ్వు ఏ వైపు చూస్తున్నావన్న అంశం మీదే నీ భావాలూ, నీ అనుభూతులూ, నీ ఉద్వేగాలూ ఉంటాయి. ప్రేమనైనా, పెళ్లినైనా కొందరు మరీ సీరియస్‌గా తీసుకుంటారు. కొందరు అతి సాధారణ అంశంగా తీసుకుంటారు. మరికొందరు ఒక తమాషాగా తీసుకుంటారు. అయితే తమాషాగా తీసుకునే వారు అసలే సీరియస్‌గా తీసుకోర ని కాదు.అలాగే సీరియస్‌గా తీసుకునే వారు అసలే సరదాగా ఉండరనీ కాదు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి, అన్నిటినీ మించి మూడ్‌ని బట్టి అలా ఉంటారు.

రూలేమీ లేదుగా.....
ప్రసిద్ద రచయిత ఒకరు కొత్తగా తాను రాసిన పుస్తకం తొలిపేజీలో ' ' నా భార్య తోడ్పాటే లేకపోతే ఈ పుస్తక రచన అసలు పూర్తయ్యేదే కాదు. ఆమె అడుగడుగునా నాకు ఇచ్చిన స్పూర్తే నా పుస్తకానికి ఒక ఆత్మగా నిలిచింది. అందుకే ఈ పుస్తకాన్ని ఆమెకు అంకితం చేస్తున్నాను.'' అన్న వాక్యం రాసి ఆ కిందే బ్రాకెట్‌లో (ఇలా మెచ్చుకోకపోతే ఆవిడ ఊరుకోదు) అని రాశాడు. ఆ ఒక్క చివరి వాక్యంతో ఆ పైన రాసిన వాక్యాలన్నీ ఉత్తి అబద్దమని తే లిపోయిన ట్లేగా. అంత భయమున్న వాడు చివరన ఆ వాక్యం రాయకుండా ఉండిపోవచ్చుగా! మరెందుకు రాసినట్లు? ఉడికించడానికి, ఆవిడను సరదాగా నవ్వించడం కోసం. అంతేగా! ఇదీ ఒక సరదాయేనా అంటే ఔను మరి! సరదా అంటే ఇలాగే ఉండాలని రూలేమీ లేదుగా.

అటూ ఇటూ మారితే....
ఆలస్యగా ఇంటికి వచ్చిన భర్తను ఉద్దేశించి " ఇప్పుడా ఇంటికొచ్చేది? ఇప్పటిదాకా ఏ మహాకార్యాలు పూర్తిచేసొచ్చారు తమరు? అంది వెటకారంగా. వెంటనే భర్త ' నేను వచ్చే దారిలో పెద్ద యాక్సిడెంట్ అయ్యి రోడ్లన్నీ జామ్ అయిపోయాయి అదీ సంగతి ' అన్నాడు భర్త . అందుకు ఆమె అవునా? అంటూనే ' రోజుకో సాకు భలే వెంటబెట్టుకొస్తారండీ మీరు?' అంది ఆ వెంటనే భర్త "సాకుల్ని నేను వెంటబెట్టుకు రావడం కాదు భాగ్యవతీ! సాకులే నా వెంటబడి వస్తాయి ఏం చెయ్యను చెప్పు?'' అన్నాడు గోముగా. ఇంక ఆవిడ నవ్వక ఏంచేస్తుంది? అలా మాట్లాడ్డం వల్ల అప్పటిదాకా ఆమెలో పేరుకుపోయిన కోపమంతా ఒక క్షణంలో మాయమైపోయింది. విషయం అదే. కాకపోతే ఆ విషయాన్ని కాస్త తలకిందులు చేసి చెప్పాడంతే! అదే విషయం మీద గొడవ పడాలంటే పెద్ద గొడవే అయిపోతుంది. ఆలస్యానికి కారణం అడిగినప్పుడు ' ఏ రోజు ఎందుకు ఆలస్యం అయ్యిందో ప్రతి సారీ తమకు నివేదిక సమర్పించుకోవాలా? 24 గంటలూ ఇంట్లో పడి ఉండే నీకు రోడ్డు మీది సమస్యలేమిటో ఎలా తెలుస్తాయి? ఇంకొకసారి ఇలా అడిగావంటే బావుండదు మరి!'' అన్నాడే అనుకోండి. ఇంకేముంది? ఆమె మనసు గాయమేగా? ఆ కొద్ది రోజులైనా సరే వారిద్దరి మధ్య దూరాలేగా...! అందుకే ఎంతో వివేకవంతుడైన ఆ భర్త 'సాకులు నా వెంటబడి వస్తాయే గానీ, నేనెప్పుడూ వాటిని వెంట తీసుకురాను' అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు. పైగా ఆలస్యానికి కారణం అడగడం వెనుక మీ పట్ల ప్రేమే గానీ, మిమ్మల్ని నిలదీయాలని కాదుగా. ఆ లోతులు అర్థం చేసుకున్నాడు కనకే తన సరదా సమాధానంతో హాయిగా నవ్వుకునేలా చేశాడు. అందుకే సహజీవనంలో ఇలాంటి నవ్వుల్లేకుండా పోయిన్నాడు బందాలు బరువెక్కిపోతాయి.

నవ్వుతూ...న వ్విస్తూ....
వివాహం అంటే మరీ అంత సీరియస్ అంశమేమీ కాదు. అలాగే జీవితం కూడా అంత సీరియస్ అంశమేమీ కాదు. నాలుగు రోజులు కలిసి జీవించడం అంతిమంగా ఎవరి దారిన వెళ్లిపోవడాలు. అంతేగా...! ఆ మాత్రం దానికి ప్రతి విషయాన్నీ బరువెక్కించి, పగలూ రేయీ కాలిపోవడం అవసరమా! జీవితానికి హాయిగా నవ్వుకోవడాన్ని మించిన గొప్ప వరం ఏముంది? కాకపోతే అది సాధించడానికి కాస్తంత జాగ్రత్త అవసరం.మంచుపర్వతం మీదున్నాను నాకేమిటని ఎవరైనా కదలకుండా అక్కడే నిలుచుంటే ఏమవుతుంది? ఆ పర్వతం కరిగి కాళ్లు పాతాళంలోకి జారిపోతాయి. అందుకే మంచు పర్వతమన్న విషయాన్ని మరిచిపోకుండా, ఎప్పటికప్పుడు చల్లదనాన్ని కలిగిస్తూ ఆ పర్వతం కరిగిపోకుండా జాగ్రత్తపడుతూ ఉండాలి. అప్పుడే అందులోంచి మంచు వృక్షాలు మొలుస్తాయి. నవ్వుల్లాంటి మంచు పూలు పూస్తాయి. మనసుల్లోనూ మంచుపూల పరిమళాలు నిండుతాయి అంటాడు ఎడ్విన్ కీస్టర్.

10, ఆగస్టు 2013, శనివారం

కెవ్వు కేక


(Courtesy: Image Owner)







బడుగులకో రూలు, బడాబాబులకో రూలా!



బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహాన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య.

రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన  ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు మన పక్కా ఇళ్ళ ప్రణాళికలుఅచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.

పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశనస్థలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, ఇళ్ళ స్థలాలకు   ఈనాడు వున్న ధరలు లేని ఆ రోజుల్లో కూడా పేదలకు  నివేశన స్థలాలు  అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు  స్థలాలను  పేదవారికి ఇళ్ళ స్థలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ  స్థలాల కేటాయింపు అనేది అదనపు పెద్దరికాన్నికట్టబెట్టింది. కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత పక్కాగాఅమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో పక్కా ఇళ్ళ పధకంఅనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రధానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈనాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం

ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత పదేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి తిలాపాపం తలా పిడికెడుచందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.


అదేసమయంలో మరో మాట కూడా చెప్పుకోవాలి. పారిశ్రామిక వర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో వేల, లక్షల ఎకరాల భూపంపిణీ ఓపక్క నిరాఘాటంగా, నిర్లజ్జగా సాగిస్తున్నప్పుడు, కేవలం పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పధకాన్ని భూ భాగోతంగాముద్రవేసి వారి కడుపులపై కొట్టడం కూడా మంచిది కాదు. దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే ‘కడుపు నిండినవాడు, కడుపు మండినవాడు’ అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే సిసలయిన  పాలకుల అసలయిన కర్తవ్యం.