1, మే 2013, బుధవారం

రేడియో రోజులు


(ఈరోజు ఫేస్ బుక్ లో అమెరికా నుంచి నరిసెట్టి ఇన్నయ్య గారు పోస్ట్ చేసిన మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ పీ ఎస్ రామమోహన రావు గారి ఫోటో చూసిన తరువాత మదిలో మెదిలిన జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు) 
అసలు సిసలు పోలీసు అధికారి పీ ఎస్ రామమోహన రావు గారితో నాకూ కొన్ని మరచిపోలేని అనుభవాలు వున్నాయి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఆయన డీజీపీ. అప్పటికే కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు అధికారులు మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడం, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటుచేయడం, ఆ వెంటనే నా మాస్కో ప్రయాణం - మా నడుమ సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి. మాస్కో వెళ్ళబోయేముందు డీజీపీ రామమోహన రావు గారిని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సంచారాలు కనుక్కుని వీడ్కోలు చెబుతూ ఒక మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలోలా ఠలాయిస్తే కుదరదు.’
వయసు అలాటిది మరి. నేనూ అలానే జవాబు చెప్పాను. ‘మాస్కో చాలా చలి ప్రదేశం అని విన్నాను. మంచు కురిసే రోడ్లపై ‘టూ వీలర్స్ ఎలౌ చేయరనుకుంటాను’
రామమోహన రావుగారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను అదే ఉద్యోగి మా మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
‘ఏదో తెలియక చేసాడు, ఇప్పుడు ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద చాలా దూరం ట్రాన్సఫర్ చేశారు, నాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
‘మీరు కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ నేను చేసిన పొరబాటు. ఇప్పడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్ కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్ రామ్మోహనరావు గారు!

(01-05-2013)

ఇల్లాలి ముచ్చట్లు




హోటల్లో మీటింగు కాగానే హ్యాండు బ్యాగు తీసుకుని బయటకు వచ్చాను. వస్తూనే కారు తాళాల కోసం చూసుకుంటే అవి కనిపించలేదు. బ్యాగు తీసి చూసాను, కనిపించలేదు. మీటింగు జరిగిన హాల్లోకి వెళ్ళి వెతికాను. లేవు. అక్కడి సిబ్బందిని వాకబు చేసాను. తెలియదన్నారు.  సడెన్ గా గుర్తుకు వచ్చింది. తాళాలు  కారులోనే వొదిలిపెట్టి వుంటాను. పైగా నాకది  అలవాటు కూడా.  

పొరపచ్చాలు లేని దాంపత్యం మాది. ఈ ఒక్క విషయంలోనే నాకూ ఆయనకూ పడదు.  తాళాలు కారులో వొదలవద్దు అని అస్తమానం సతాయిస్తుంటారు. నాకేమో అవి అక్కడ వుంటేనే సేఫ్ అనిపిస్తుంది. ‘కారులోనే తాళాలు వుంచితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే’ అన్నది మావారి థియరీ. కాని ఈ విషయంలో నా దారి నాదే. ఆయన గోల ఆయనదే.
పార్కింగ్ లో చూస్తే కారు కనబడలేదు. మా వారి మాటే కరెక్ట్ అయింది.
కారు పోయిందని తెలియగానే కాళ్ళల్లో వొణుకు మొదలయింది. హోటల్ వాళ్లకు చెప్పి పోలీసులకు ఫోను చేసాను. యేకళన వున్నారో నేను చెప్పినవన్నీ వెంటనే నోటు చేసుకున్నారు. కారు నెంబరు, పోయిన చోటు అన్నీ చెప్పాను. కారులోనే తాళం చేతులు మరచిపోయిన సంగతి కూడా చెప్పేసి, ఎవడో పట్టుకుపోయివుంటాడు అన్న అనుమానం కూడా వెల్లడించాను. దొంగతనం గురించి చెబుతుంటే మా వారు గుర్తుకువచ్చారు. ఆయన సతాయింపు గుర్తుకువచ్చి చెప్పాలా అక్కరలేదా  అనుకుంటూనే మా వారికి ఫోను చేసాను.
‘హలో హనీ!’
ఇలాటి చిక్కు పరిస్థితులు ఎదురయినప్పుడు ఆయన్ని నేను అలానే పిలుస్తాను.
“నువ్వు రోజూ చెప్పేదే ఇవాళ నిజమయింది. కారులో తాళాలు పెట్టి మీటింగుకు వెళ్లాను. వచ్చి చూస్తే  పార్కింగులో కారు కనిపించలేదు.’
కాసేపు నిశ్శబ్ధం. బహుశా కోపం కొద్దీ లైన్ కట్ చేసివుంటారు.
ఇంతలో ఆయన గొంతు వినిపించింది.
‘ఇడియట్! నువ్వు కారులో వెళ్ళలేదు. నేనే నిన్ను  హోటల్ దగ్గర డ్రాప్  చేసి వచ్చాను. అది మరచిపోయావా?’
నిజమే. ఇక ఏం చెప్పను. నేను కారు తీసుకురానిమాట నిజమే. అమ్మయ్య అనుకున్నాను.
‘సరే లెండి. ఏదో మతిమరపు. వెంటనే బయలుదేరి రండి. ఇంటికి పోదాం’ అన్నాను.
‘యెలా రమ్మంటావు? ఈ కారు మాదే,  దొంగ కారు కాదు మొర్రో  అని ఎంతసేపటి నుంచో మొత్తుకుంటున్నాను. అయినా ఈ పోలీసులు వినిపించుకోవడం లేదే!’


ఇప్పుడు మౌనం నా వంతయింది. (నెట్లో ఇంగ్లీష్ కధకు స్వేఛ్చానువాదం)

30, ఏప్రిల్ 2013, మంగళవారం

నమ్మితే నమ్మండి అను ఇండియా దట్ ఈజ్ భారత్!



కొన్ని విషయాలు వింటుంటే నిజమా! అనిపిస్తాయి.
నిజంగా నిజమేనా అన్న అనుమానం కలిగిస్తాయి. నిజమెంతో నిగ్గుతేల్చే అవకాశం లేనప్పుడు –పోనీ మంచి విషయమే కదా నమ్మేస్తే పోలా అని కూడా అనిపిస్తుంది. అలాటి నమ్మలేని ఓ నిజం నెట్లో సంచరిస్తోంది. నమ్మితే నమ్మండి.
ఇంతకీ ఆ నమ్మలేని నిజం ఏమిటో తెలుసా?
ప్రపంచం యావత్తులో అత్యంత సంపన్న దేశం ‘భారత దేశం’ అన్నదే ఆ నమ్మలేని నిజం.




నిజానికి ఇందులో నిజమెంతో తెలియదు కాబట్టి ఒక కధలాగానే చెప్పుకుందాం.
అనగనగా వైద్యరాజ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు పురాతన రాతి విగ్రహాలు వుంటూ వచ్చాయి. ఈ వైద్యరాజ్ మహాశయులవారి వంశ  చరిత్ర కూడా ఘనమైనదే. ఆయన కృష్ణదేవరాయల వంశీకుడు. మూడువందల ఏళ్లనుంచి మైసూరులోని ఆయన గృహంలో ఆ మూడు పురాతన దేవతా విగ్రహాలు తరతరాలుగా పూజలందుకుంటున్నాయి. నిజానికి అవి రాళ్ళూ కావు. దేవతా విగ్రహాలు కావు. లెక్కకట్టడానికి సాధ్యం కాని విలువైన వజ్రాలు. ఈ సంగతి బయటకు పొక్కీపొక్కక ముందే ఆ వజ్రాలను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కారణాలు తెలవవు కాని ఆ వజ్రాలను ప్రస్తుతం ఓ స్విస్ బ్యాంకులో భద్రపరిచి వుంచారు.
అసలు ఈ కధలోని అసలు కధ ఇక్కడే మొదలవుతుంది.
ఈ వజ్రాల విలువను లెక్కకట్టి చూసారు. లెక్కకట్టిన నిపుణులు ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.
ఈ మూడు వజ్రాలలో ఒక్కొక్క దాని విలువ ఎంతంటే అమెరికా, ఇంగ్లాండ్ ఈ రెండు దేశాల స్తూల దేశీయ ఉత్పత్తికంటే ఎక్కువ. వీటిని కొనగలిగిన డబ్బు ప్రపంచ బ్యాంకు దగ్గర కూడా లేదు.
అంతే కాదు వీటిల్లో ఒక్క వజ్రం విలువ తీసుకున్నా – ప్రపంచ బ్యాంకు నుంచి మన దేశం ఇంతవరకు తీసుకున్న అప్పుకు మూడు రెట్లు ఎక్కువ. పది మంది బిల్ గేట్స్ సంపదకు సమానం. వీటితో ఏడు వర్ధమాన దేశాలను కొనుగోలు చేయవచ్చట. ఇంకో ‘ట’ కూడా వుంది. వాయిదాల పద్ధతిలో అమ్మితే కొనడానికి సిద్ధం అని ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిందట. అయితే మన ప్రధాన మంత్రి గారు మాత్రం ‘ససేమిరా’ అనేసారుట.
మామూలుగా ఇలాటి విషయాలు చెప్పేవాళ్ళు పలానా పేపర్లో రాశారు చూడలేదా అనేస్తారు. అలాగే ఈ కధ చెబుతున్న వాళ్లు కూడా 2011  లోనే  టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ వార్త వేసారు, వీలయితే ఆ పాత పేపరు తెచ్చుకుని  చదువుకోమంటున్నారు. హిందూ లో కూడా రాశారు చూసుకోమంటున్నారు. స్టార్ టీవీ వాళ్లు ఈ వజ్రాల వ్యవహారం గురించి ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేశారంటున్నారు.
ఇదంతా చదివిన తరువాత ఎప్పుడో ఏనాడో విన్న ‘ఫారెన్ లాటరీ’ సంగతులేమైనా గుర్తుకువస్తే మాత్రం నా పూచీ లేదు. (30-04-2013)
Note: Courtesy Image Owner 

29, ఏప్రిల్ 2013, సోమవారం

అభినవ శబరి కధ



ఆ ముసిలావిడ్ని చూస్తే   బస్ కండక్టర్ కు ముచ్చటేస్తుంది. ఎందుకంటే  ఎప్పుడు బస్సు ఎక్కినా సరే దగ్గరకు  పిలిచి గుప్పెడు జీడిపప్పులో, బాదం పప్పులో అతడి చేతిలో పోస్తుంది.


ఒకరోజు అడిగాడు. యెందుకు మామ్మగారు ఇలా జీడిపప్పులు మీరు తినకుండా నాలాటి వాళ్లకు ఇస్తుంటారు
నవలడానికి పళ్ళు లేవు నాయనా!   అందుకే నీ బోటి వాళ్లకు ఇస్తుంటాను’ అంది.
‘మీకు  పళ్ళు లేవు. తినలేరు. అది సరే!  మరి వీటిని యెందుకు కొంటున్నట్టు? ఎవరి కోసం కొంటున్నట్టు?’ మళ్ళీ అడిగాడు కండక్టర్ ఆవిడ ఇచ్చిన జీడిపప్పుల్ని నోరారా నవిలి తింటూ.
‘జీడిపప్పులు అంటే తినలేను  కాని వాటి చుట్టూ వుండే చాక్లెట్ అంటే నాకు ప్రాణం.  అందుకే షాపుల్లో ఇలాటి చాకో నట్
చాక్లెట్లను వెతికి మరీ కొంటుంటాను.’ వున్న మాట చెప్పేసి ముసలావిడ  బస్సు దిగి వెళ్ళిపోయింది.

(courtesy image owner)

27, ఏప్రిల్ 2013, శనివారం

మన్నించడమే మనిషి పని



ఆ దంపతులది అన్యోన్య దాంపత్యం.   లేక లేక మగపిల్లవాడు  పుట్టాడు. వాళ్ల ఆనందానికి అంతే లేదు. ఎత్తుకెత్తుగా పిల్లాడిని అబ్బురంగా అపురూపంగా పెంచుకుంటున్నారు. చూస్తుండగానే  అతడికి రెండేళ్లు వచ్చాయి.




తండ్రి ఒక రోజు హడావిడిగా ఆఫీసుకు వెళ్లాడు. ఆ తొందరలో తాను రోజూ వేసుకునే మందు  బాటిల్ మూతపెట్టడం మరచిపోయాడు.  ఆఫీసుకు వెళ్ళగానే ఆ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే ఇంటికి  ఫోను చేసి భార్యకు విషయం చెప్పి ముందు ఆ  మందు  సీసా మాట  సంగతి చూడమన్నాడు. ఆమె సరే అంది కాని ఇంటిపనుల్లో తలమునకలైవుండి  ఆ విషయమే మరచిపోయింది. భర్త గుర్తు చేసిన విషయం ఆలస్యంగా ఆమెకు  గుర్తుకు వచ్చింది. కాని అప్పటికే జరగాల్సిన ఆలశ్యం జరిగిపోయింది.
ఇంట్లో  ఆడుకుంటున్న పిల్లాడికి భోజనాల బల్ల మీది మందు సీసా కనిపించింది. అందులోని ద్రవం రంగు అతడిని ఆకర్షించింది. చూసి ముచ్చట పడ్డాడు. మూత లేని ఆ సీసా పట్టుకుని  అందులోని మందంతా  గటగటా తాగేసాడు. అది పెద్దవాళ్ళు వాడాల్సిన మందు. వాళ్ళు కూడా కొద్ది డోసుల్లో తీసుకోవాల్సిన ఘాటయిన  ఔషధం. సీసా మొత్తం ఒకేసారి తాగడంతో ఆ పసివాడు తట్టుకోలేకపోయాడు.  మందు వికటించి పిల్లాడు వున్నపెట్టున స్పృహ కోల్పోయాడు. అది చూసి తల్లి  చిగురుటాకులా వొణికిపోయింది. అదిరే గుండెలతో  ఆదరాబాదరాగా పిల్లాడ్ని చేతుల మీద వేసుకుని దగ్గరలోని  ఆస్పత్రికి తీసుకువెళ్ళింది. భర్తకు ఫోను చేసి విషయం చెప్పింది. అప్పటికే  జరగరానిది జరిగిపోయింది. పిల్లాడి ప్రాణం పోయిందని  డాక్టర్లు  చెప్పగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ నిజాన్ని తట్టుకోలేక  నిస్సత్తువుగా  కూలబడిపోయింది.
తండ్రి ఆఫీసునుంచి ఆఘమేఘాలమీద  వచ్చాడు. విగతజీవుడిగా మంచం మీద పడివున్న కన్నకొడుకుని చూశాడు. గుండెల్లోనుంచి  దుఃఖం తన్నుకువచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు తమ  అశ్రద్ధకి బలై  పోయాడన్న వాస్తవం అతడ్ని మరీ కుంగ తీసింది.  కుర్రాడి శవం పక్కనే కూలబడి గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న భార్యను చూశాడు. ఆమె వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు.
ఇదంతా తన వల్లనే జరిగిందనీ,  ఫోను రాగానే చేతిలో పని పక్కనబెట్టి ముందా  మందు సీసా భద్రం చేసి వున్నట్టయితే  ఈ పరిస్తితి  వచ్చివుండేది కాదని ఆ తల్లి  తల్లడిల్లుతోంది. భర్త వంక చూడడానికి కూడా భయపడుతోంది. నీవల్లనే ఇదంతా జరిగిందంటూ కోపడతాడని  కంగారు పడుతోంది.
అతడు భార్య దగ్గరికి వచ్చాడు. భార్య కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపులో కోపం  లేదు. భుజం మీద చేయివేశాడు.ఆ స్పర్శలో కాఠిన్యం లేదు.  నెమ్మదిగా భార్యతో అన్నాడు.
‘ఇందులో ఎవరు చేసిందీ లేదు. ఎవరు చేయ కలిగిందీ  లేదు.వాడితో మనకు ప్రాప్తం లేదు. అందుకే ప్రాప్తమున్నలోకానికి వెళ్ళిపోయాడు’
భర్త నుంచి వచ్చిన ఈ అనూహ్య  స్పందన ఆమెను అంతులేని ఆశ్చర్యానికి గురిచేసింది.
కలా  నిజమా అనుకుంది. ఎన్నోమాటలు పడాల్సివస్తుందని అనుకుంటే భర్త పల్లెత్తు మాట అనకపోవడం  ఆమెకు వూరట కలిగించింది. జరిగినదాన్ని పొరబాటుగా తీసుకున్నాడే కాని తప్పుగా భావించని భర్త ఉదాత్త మనస్తత్వం  ఆమెను కదిలించివేసింది.  

‘జరగరాని ఘోరం జరిగిపోయింది. పొరబాటు  ఎవరిదయినా పిల్లవాడు దక్కకుండా పోయాడు. ఇందులో  నాకూ  భాగం వుంది. ఆఫీసు తొందరలో వెడుతున్నా కాస్త నేనే ఆ  మందు సీసా మూత తానే పెట్టినట్టయితే ఇంత ఘోరం జరిగివుండేదే కాదేమో.’
భర్త మాటలు లీలగా వినబడుతున్నాయి.
అతడి ఆలోచనలు అతడివి.
‘భార్యను నిందించడం వల్ల  లాభం ఏమిటి?  పిల్లాడిని కోల్పోయి అసలే పుట్టెడు దుఃఖంలో వుంది. నవమాసాలు మోసింది ఆమె.  పురిటి నొప్పులు భరించింది ఆమె.  ఇంటిదీపం కంటిముందే కన్నుమూయడం కంటే  కన్నతల్లికి  గర్భశోకం వేరే ఏముంటుంది.  నెపం  మోపి ఈ పాపం నీదే అనేయడం తేలికే. కాని అలాటి ఈటెల్లాంటి మాటలతో మనసును మరింత గాయపరిస్తే   ఆ కన్నతల్లి కడుపు మరెంతగా రగిలిపోతుంది.’
ఇలా ఆలోచించిన అతగాడు  భార్యను పల్లెత్తు మాట అనలేదు.
నిజానికి   ఈ పరిస్తితిలో ఆమెకు కావాల్సింది కూడా  వూరడింపుతో కూడిన ఓ చల్లని మాట. అది అర్ధం చేసుకున్నవాడు కాబట్టే  అతడు ఆ  విజ్ఞతను ప్రదర్శించాడు.  దానితో, అంత  దుఃఖంలోవున్న ఆమె మనసు  దూదిపింజలా తేలికయింది.
మంచి మనసుకు మంచితనం తోడయితే ఆ మనిషి మహామనీషి అవుతాడు.

(27-04-2013) 

26, ఏప్రిల్ 2013, శుక్రవారం

పరిపూర్ణానంద స్వామి వారి ప్రవచనానందం



కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. మరికొన్ని బహు విచిత్రంగా కనిపిస్తాయి.
కొన్ని  దృష్టి మహిమ. మరికొన్ని ఆ సర్వేశ్వరుడి సృష్టి మహిమ. నమ్మినవానికి, రాయే  సాయి. నమ్మనివానికి, సాయే రాయి. అందుకే తొక్కితే రాయి. మొక్కితే సాయి అని పెద్దలు అంటారు. అంతా నమ్మకం.


పరిపూర్ణానంద స్వామి


దేవుడిని విశ్వసిస్తామని చెప్పేవారేకాని నిజంగా మన ప్రార్ధనలకు మెచ్చి భగవంతుడు కోరిన వరాలు  ఇస్తాడని నమ్మేవాళ్ళు తక్కువే. విశ్వాసమనేది సంపూర్తిగా వుండాలి కాని అరకొరగా వుండకూడదని బోధించే చిన్న నీతికధ ఇది.
ఒక వూరిలో వానలు పడక పంటలు ఎండిపోయి వూరిజనం అల్లాడిపోతున్నారు. వూరి నడుమ వున్న గుడి వద్ద ఒక రాత్రంతా భజనలు చేస్తే వర్షాలు కురుస్తాయని ఎవరో చెప్పగా విని పిల్లాపీచుతో సహా వూళ్ళో  వాళ్లందరూ కట్టగట్టుకుని గుడి వద్దకు చేరుకున్నారు. ఒక పిల్లవాడు గొడుగుతో సహా వచ్చాడు. దేవుడి మీద, చేసే భజన మీదా అతడికున్న విశ్వాసం అది. నిజమయిన  విశ్వాసం అంటే కూడా అదే.
పసి పాపల్ని ఆడించడానికి తలిదండ్రులు ఒక్కోసారి వారిని గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూవుంటారు. అలా చేస్తున్నప్పుడు పాప పడి పడి నవ్వుతుందే కాని కింద పడేస్తారేమోనని ఏమాత్రం భయపడదు. తాను పడిపోకుండా తల్లీ తండ్రీ తనను భద్రంగా పట్టుకుంటారని ఆ పసి పాప నమ్మకం.
నిన్న సాయంత్రం అంటే 2013 ఏప్రిల్ 25 వ తేదీన  హైదరాబాదు ఎన్టీయార్ స్టేడియంలో శ్రీ పరిపూర్ణానంద స్వామివారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమయిన కార్యక్రమం జరిగింది. వేలాదిమంది భక్త జనం స్వచ్చందంగా తరలి వచ్చి సామూహిక జ్యోతి  ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.  అంతకు ముందు కుంభవృష్టి కురుస్తుందా అన్నట్టు ఆకాశం మేఘావృతమై వుంది. అంతా బహిరంగ ప్రదేశం. వాన పడితే తలదాచుకోవడం అని సందేహించినవాళ్ళు సంక్షేపించి వూరుకున్నారు. అటూ ఇటూ మనసు చలించేవారు, వర్షం పడితే అప్పుడు చూద్దాంలే  అనుకుంటూ వెళ్లారు. (బహుశా నాది అంటే భార్యల్ని వెంట తీసుకువెళ్ళిన నాలాటివారిది ఈ తరగతి అనుకుంటా) ఇక పోతే, వాన  వచ్చేది, పిడుగులు పడేది -  పోకుండా మానేది లేదు అని భీష్మించుకు  వెళ్ళినవాళ్ళూ  వున్నారు. నిజానికి ఇలాటి వాళ్ళదే అక్కడ  మెజారిటీ. వాళ్ల నమ్మకమే నిజమైంది. జడివాన కాదుకదా చిన్నపాటి చినుకు కూడా రాలలేదు.
సరే! పరిపూర్ణానంద స్వామివారు, వేదిక మీద జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. వచ్చిన భక్త జనులందరూ తమ వెంట తెచ్చుకున్న ప్రమిదలు, ఆవునేతితో తడిపిన  వొత్తులతో ఎవరికి వారు దీపాలను వెలిగించారు. కృత్రిమ విద్యుత్ దీపాలను తాత్కాలికంగా ఆర్పివేశారు.  దానితో  ఆ విశాల ప్రాంగణమంతా భక్తులు వెలిగించిన వేలాది  దీపాల వెలుగులతో నిండిపోయింది. స్వామివారి అనుగ్రహభాషణం ఓ పక్క, దీపాల కాంతులు మరోపక్క. ఆ యావత్ ప్రదేశం ధార్మిక కర్మ భూమిగా శోభిల్లింది.
ఇక విచిత్రం ఏమిటంటారా! ఒక భక్తురాలు వెలిగించిన దీపశిఖ ఇదిగో ఇలా ‘ఓం’ ఆకారంలో ప్రజ్వరిల్లి అశేష భక్తులను ఆకర్షించింది.

ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.
అయితే ఒకటి నిజం.  త్రికరణశుద్ధిగా నమ్మినది ఏదీ కూడా  మనల్ని మోసం చేయదు. నిజానికి  నమ్మకంలో వున్న గొప్పతనం అదే. (26-04-2013)

అగ్నిమీళే పురోహితం ........ అను గ్రామఫోన్ రికార్డ్ కధ



(ఎందుకో ఏమిటో రెండేళ్ళ క్రితం రాసిన ఈ గ్రామఫోను గుర్తుకొస్తోంది) 



చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక  పెను విషాదము.
కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.
లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం వొహ్ వోహోం వోహోంలు ఎక్కడన్నా కనవస్తున్నాయా? ఎప్పుడన్నా వినబడుతున్నాయా?
నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర  ఓ గ్రామఫోన్ వుండేది. ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన ఆకారంలో వుండే  ఒక స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామ ఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు  మందపాటి భోజన పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు.  గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు దానిమీదవుంచి అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం  కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు.అందువల్ల ఆయన దగ్గర  వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే.  ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.
పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే.
రేడియోలో  చేరిన కొత్తల్లో ఓ రోజు  జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను  మొదట డైరెక్ట్ చేసిన ముద్దమందారం సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.
     
తన గొంతు తాను  వినాలని, తన మొహం తాను  చూసుకోవాలని – ప్రతి మనిషికీ కొన్ని  బలహీనతలు  వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా.  రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు.   అలాటి వాళ్లకు వాళ్ళ  ఫోటో వాళ్ళకే  చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం  ఖాయం అనే చెప్పాలి.  ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో  దాగివున్న  వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.
సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.
ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం  కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.
పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త  గ్రామఫోను తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.  

గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు  – ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు

“మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలని” కోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు.  ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్,  ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.

ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర  శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.
తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం  సమావేశ మందిరానికి  తిరిగి  వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో  ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.


అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని  భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ  మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.
“ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా  విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.
ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది.హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు.అయితే  మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. ఎందుకంటె ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపు కు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను  వారెప్పుడూ వినివుండలేదు.
సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.గ్రామ ఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న  రిగ్వేదం లోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.

“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం  హాతారం రత్నశాసనం” – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో  మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన రికార్డ్ -  రిగ్వేద శ్లోకానికి మాక్స్ ముల్లర్ ఆవిధంగా కలిగించారన్న విషయం తెలపడమే ఈ కధనం లోని విశేషం.
అదే ప్రసంగంలో మాక్స్ ముల్లర్ చెప్పిన విషయాలు వింటే సంస్కృత భాష గొప్పదనం ఈ కాలం వారికి తెలిసే అవకాశం వుంటుంది. ఆయన ఇంకా ఇలా  అన్నారు.

“మొత్తం మానవేతిహాసంలో వేదాలు మొట్టమొదటి పాఠాలు. అందులో అగ్నిమీళే పురోహితం అనేది తొలి వేదం అయిన రిగ్వేదం లోని మొదటి  శ్లోకం. వెనుకటి రోజుల్లో,ఆదిమ యుగంలో-  వొళ్ళు దాచుకోవడానికి దుస్తులు ధరించాలన్న ఆలోచన కూడా  లేకుండా,చెట్టుకొమ్మలపై  చింపాంజీల మాదిరిగా గెంతుతూ యూరోపులోని జనం  అనాగరిక జీవనం గడుపుతున్న కాలంలోనే- నివసించడానికి  ఇళ్లు అవసరమనే ధ్యాసకూడా లేకుండా కొండ గుహల్లో కాలక్షేపం  చేస్తున్న రోజుల్లోనే- భారతీయలు నాగరిక జీవనం సాగిస్తూ, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో   సార్వత్రిక వేదాంతాన్ని ప్రబోధించే జీవన సూత్రాలను వేదాల రూపంలో అందించారు.  ఎడిసన్ మహాశయులు  నా స్వరాన్ని రికార్డు చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఈ వేద శ్లోకాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదే” అని ముగించారు మాక్స్ ముల్లర్.
(ప్రముఖ పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కృతజ్ఞలతో –భండారు శ్రీనివాసరావు)