22, ఏప్రిల్ 2013, సోమవారం

ఉరుకుల పరుగుల జీవితం




చిన్నప్పుడు ఒక కధ చెప్పేవాళ్ళు.
ఒక చదువుకున్న జ్ఞాని  దేశ సంచారం చేస్తూ ఒక వూరికి వెడతాడు. అక్కడ ఒక మోతుబరి ఇంట్లో వేడుక జరుగుతూ వుంటుంది. ఈయన మాసిన బట్టలతో వెడితే ఎవరూ గుర్తించక పోగా లోపలకు రాకుండా అడ్డుకుంటారు. అతగాడు ఇది పనికాదనుకుని తన మాసిన దుస్తులు విసర్జించి ఖరీదయిన నూతన వస్త్రాలు ధరించి తిరిగి అక్కడికే వెడతాడు. వేషం మార్చుకుని వచ్చిన అతడికి మోతుబరి ఇంట్లో ఘన సత్కారాలు జరుగుతాయి. షడ్రసోపేతమైన విందు భోజనం వడ్డిస్తారు. ఆ జ్ఞాని ఆ పిండివంటలు తినకుండా తను  ధరించిన దుస్తులకు పెట్టే ప్రయత్నం చేయడం చూసి విస్తుపోయిన గృహస్తు సందేహ నివారణ చేయమని కోరతాడు.
‘మీరు గౌరవిస్తున్నది నాలోని విద్యను కాదు, నేను వేసుకున్న దుస్తులను. కాబట్టి ఈ పిండివంటలు ఈ దుస్తులకే చెందుతాయి’ అని జవాబిచ్చాడు.
ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ఈ కధలోని  నీతి  మరోమారు రుజువయింది.
కాకపొతే అమెరికాలో.



“వాషింగ్టన్ డీసీ లోని ఒక మెట్రో స్టేషన్ దగ్గర్లో వీధి పక్కన ఒక సంగీతకారుడు నిలబడి వయోలిన్ వాయిస్తూవుంటాడు. ఆ దేశంలో ఇలాటివి షరా మామూలు దృశ్యాలే. ఆఫీసులకు పోయే టైము. జనం హడావిడిగా ఎవరిపనులమీద వారు ఉరుకులు పరుగులతో వెడుతుంటారు. దాదాపు నలభై అయిదు నిమిషాలపాటు ఆ సంగీతకారుడి వయోలిన్ వాయిద్య కచ్చేరీ సాగిపోతూనే వుంటుంది. కాసేపటి తరువాత ఒక నడికారు మనిషి మెట్రో రైలు దిగివస్తూ అతడ్ని చూస్తాడు. కాసేపు ఆగి వింటాడు కానీ అలానే  ఆగిపోయి వినే  వ్యవధానం వుండక తన దారిన తాను పోతాడు. మరి కాసేపటికి ఓ మహిళ  కొద్దిసేపు ఆగి  కాసేపు సంగీతం ఆస్వాదించి ఒక డాలరు నోటు అక్కడపెట్టి చక్కాపోతుంది. మొత్తం మీద ఆ ముప్పావుగంటలో అక్కడ ఆగివిన్నది ఆరుగురే. ఇక వచ్చిన సొమ్ము అక్షరాలా ముప్పై రెండు డాలర్లు మాత్రమే.
ఈ కధ ఇంతటితో అయిపోలేదు.
ఎందుకంటే అంతకు రెండురోజుల ముందే అసలు కధ మొదలయింది.
ఆ సంగీతకారుడి పేరు జాషువా బెల్. బోస్టన్ లో అతడు ఇచ్చిన ప్రదర్శనకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వంద డాలర్లు చెల్లించి మరీ టిక్కెట్లు కొనుక్కుని కిక్కిరిసిన ధియేటర్లో అతడి సంగీతాన్ని ఆస్వాదించారు.
అదే  సంగీతకారుడు సాధారణ దుస్తుల్లో అతి సాధారణంగా  మెట్రో దగ్గర  వాయిస్తే అతడ్ని పట్టించుకున్నవాళ్ళే లేరు. పైగా ఆయన వయోలిన్ పై ఆ సాయంత్రం వాయించిన బిట్టు వాణిజ్యపరంగా లెక్కకడితే మూడున్నర మిలియన్ల డాలర్లు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా పదిహేడు  కోట్ల పైమాటే.  
ఇంతకీ ఆ మెట్రో దగ్గర వయొలిన్ వాయించాలని అంత గొప్ప సంగీతకారుడికి యెందుకు అనిపించినట్టు?
దీనికీ ఒక నేపధ్యం వుంది.
ప్రజలు, వారి అభిరుచులు, వారి  ప్రాధాన్యతల మీద ఒక ప్రయోగం చేయాలని  వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు అనిపించడమే అసలు కారణం. (22-04-2013)

ఫోటో వెనుక జ్ఞాపకం



రష్యాలో కమ్యూనిస్టుల పాలన సాగుతున్న రోజుల్లో రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కోలో కాలు పెట్టాను. సోవియట్ పౌరులందరికీ గుర్తింపు కార్డులు వుంటాయి. వాటిని విధిగా వెంట వుంచుకోవాలి కూడా.  సరే! మాస్కో రేడియో వాళ్లు కూడా నాకూ,  మా కుటుంబసభ్యులందరికీ ఈ కార్డులు ఇచ్చారు. దీన్ని ప్రొపుస్కా అనేవారనుకుంటాను. ఇదిలేకుండా బయటకు వెడితే ఇంతే సంగతులు.
అక్కడ నిబంధనలు యెంత ఖచ్చితం అంటే, ఎంతటివారయినా ఆఖరికి సాక్షాత్తు రేడియో వ్యవహారాలు చూసే మంత్రి అయినా సరే ఈ గుర్తింపు కార్డు చూపిన తరువాతనే ఆఫీసులు లోపలకు అనుమతించేవారు. పొరబాటున ఇంట్లో మరచిపోయి ఆఫీసుకు పోతే, రోజూ చూస్తున్న మనిషే కదా  అన్న మొహమాటం కూడా  వుండేది కాదు.  అప్పుడు ఇంటికి ఫోను చేస్తే, పిల్లలు అప్పటికే స్కూలుకు పోయేవాళ్ళు కాబట్టి  మా ఆవిడే టాక్సీ వేసుకుని నా కార్డు పట్టుకువచ్చేది.


ఆ కార్డుకోసం ఓ ఫోటో స్టూడియోకు వెడితే ఓ రూబులు కాబోలు తీసుకుని ఇదిగో ఇలా ఓ నాలుగయిదు షీట్ల మీద వరసగా ఫోటోలు ప్రింటు వేసి ఇచ్చాడు.  

21, ఏప్రిల్ 2013, ఆదివారం

తెలుగులో పిల్లలకోసం కొత్త పత్రిక



శృతి ఫౌండేషన్ ప్రచురిస్తున్న ద్వైమాసిక పిల్లల పత్రిక తొలి ప్రతిని తమిళనాడు గవర్నర్ శ్రీ కె.రోశయ్య గారు ఈరోజు హైదరాబాదులో ఆవిష్కరించారు.



ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీ వీకే అగర్వాల్, ఐ.యే.ఎస్., డాక్టర్ ఊట్ల బాలాజీ, సీ.ఈ.ఓ. హెచ్.ఎం.ఆర్.ఐ., శ్రీ ఎర్రబల్లి రామమోహన రావు, శ్రీ జైపాల్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ అగర్వాల్, భండారు శ్రీనివాసరావు, శృతి ఫౌండేషన్ సీ.ఈ.ఓ. శ్రీ చలపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ రోశయ్యగారి చేతులమీదుగా చిన్నారి బాలబాలికలు శృతి సంచిక ప్రతులను స్వీకరించారు. వారితో కలసి అడిగిమరీ ఫోటో తీయించుకున్న ఔన్నత్యం శ్రీ రోశయ్య గారిది.


21-04-2013

20, ఏప్రిల్ 2013, శనివారం

జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా?




“జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా మాస్టారూ”
“కాపీ రైట్ అంటేనే  కాపీ కొట్టే రైట్ శిష్యా!”

“ఆరంజి పండుకి యాపిల్  పండుకి వున్న తేడా ఏమిటి?”
“ఆరంజి పండు ఆరంజి రంగులో వుంటుంది. యాపిల్ పండు యాపిల్ రంగులో వుండదు”

యాదగిరి కొత్త మొబైల్ ఫోను కొని తెలిసిన వాళ్ల నెంబర్లకు 
ఎస్.ఎం.ఎస్. లు పంపాడు.
“నా ఫోను నెంబర్ మారింది. మునుపు నాది   నోకియా  3310  అయితే ఇప్పుడది నోకియా 6610  గా మారింది. దయచేసి   ఈ నెంబరు మార్పు నోటు చేసుకోండి.”

“డాక్టర్ గారు  ఫుట్ బాల్ ఆడుతున్నట్టు కలలు వస్తున్నాయి”
“అయితే ఈ రాత్రి నిద్రపోయేముందు ఈ మాత్ర వేసుకోండి. సర్దుకుంటుంది”
“రేపటి నుంచి వేసుకుంటా డాక్టర్. ఇవ్వాళే ఫైనల్ మ్యాచ్”

“నేను చనిపోయాననుకో! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా”
“లేదు. నా చెల్లెలు  దగ్గరకి వెళ్ళి వుంటాను కాని, మళ్ళీ పెళ్లి చేసుకోను. మరి మీ సంగతేమిటి? నేను పోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా?”
“లేదు లేదు. నేనూ  మీ చెల్లెలితోనే వుంటాను”
 
“రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. ఒక్క టీవీ తప్ప అన్నీ ఎత్తుకెళ్లారు ఇనస్పెక్టర్”
“అదేమిటి టీవీ ఒక్కదాన్ని యెందుకు పట్టుకుపోలేదు”
“దొంగలు వచ్చినప్పుడు నేను టీవీ చూస్తున్నాను”

“ఎందుకలా అంతా పరిగెడుతున్నారు?”
“పరుగు పందెం. గెలిచిన వాళ్లకు మెడల్  ఇస్తారు?”
“గెలిచినవాళ్లకు  మెడల్  ఇస్తారు సరే!  కానీ మిగిలినవాళ్ళెందుకు పరిగెత్తుతున్నట్టు”

“నేను ఒకడిని హత్య చేసాను. ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చి చెప్పు”
“నువ్వు జైలుకు వెడతావ్”

“ వెళ్ళు. వెళ్ళి మొక్కలకు నీళ్ళు పొయ్యి”
“వర్షం పడుతున్నట్టుంది”
“అయితే ఏమిటట! గొడుగు తీసుకెళ్ళు”

“నా మొబైల్ బిల్లు యెంత వచ్చిందో చెబుతారా”
“దానికి నా సాయం అక్కరలేదు. మీ మొబైల్ నుంచి  121 డయల్ చేస్తే  మీ కరెంట్ బిల్లు ఎంతో ఏమిటో  మీకు వెంటనే ఎస్.ఎం. ఎస్’ వస్తుంది”
“ఏడిచినట్టే వుంది. నేను అడుగుతోంది నా మొబైల్ బిల్లు సంగతి. కరెంటు బిల్లు కాదు”

“ఆ అమ్మాయికి పుట్ట చెముడులా వుంది”
“ఏం అలా అంటున్నావు”
“ ఇందాక ఆ అమ్మాయిని కలిసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పా. అలా చెప్పాక కూడా ‘నా చెప్పులు కొత్తవి తెలుసా’ అంటోంది”

“నిన్ను నా  కోర్టులో మళ్ళీ మళ్ళీ  చూస్తున్నాను. మూడో సారి కూడా ముద్దాయిగా కోర్టుకు  రావడానికి నీకు సిగ్గనిపించడం  లేదా”
“యెందుకు సిగ్గు!  మీరు మాత్రం రోజూ కోర్టుకు రావడం లేదా”
 
“రాముడు, బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త,  ఏసు క్రీస్తు, గాంధీ -  వీరిలో నీకు కామన్ గా కనిపించే విషయం ఏమిటి”
“అందరూ ప్రభుత్వ సెలవుదినాల్లోనే  పుట్టారు
“మిస్ నిన్న నా మొబైల్ కేమైనా ఫోను చేసారా?”
“లేదే! ఎందుకలా  అడిగారు”
“ఏమీ లేదు నా ఫోన్ లో ఒక మిస్ కాల్ వుంది.”




(ఇవన్నీ నెట్లో విహారం చేస్తున్న ఇంగ్లీష్ జోకులు. ముందే చెప్పినట్టు తెలుగులోకి కాపీ కొట్టే రైట్ కొట్టేశానన్నమాట. మొట్టమొదటిదొక్కటే అచ్చంగా నా సొంతం. పోతే ఇమేజ్ సొంతదారుకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

న్నిఝoగా న్నిజం !


న్నిఝoగా న్నిజం ! - నిన్ననో మొన్ననో టీవీల్లో కూడా బంగారు దుకాణాల్లోనూ, వాటి బయటా బారులుతీరిన జనాలను చూపించారు. జనం దగ్గర అంత డబ్బుందా లేక బంగారం అంటే అంత మోజా!



ఒబామా వర్సెస్ మన్మోహన్

Views can be expressed in many ways. Silence is one among them.


ఉప్పుకప్పురంబు .......



గుండీలు మార్చినంత సులభంగా గుండెలు మార్చడంలో పేరొందిన ఒక సర్జన్ గారు తను నడిపే కారు ట్రబుల్ ఇస్తుండడంతో దాన్ని తీసుకుని మెకానిక్ దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో మెకానిక్  మరో కారులోని భాగాలను అలవోకగా  విడతీస్తూ, మారుస్తూ బిజీబిజీగా వున్నాడు.  డాక్టర్ రావడం వోరకంట గమనించిన  మెకానిక్ ఆయన దగ్గరకు వచ్చి, చేతికంటిన గ్రీజు తుడుచుకుంటూ పలకరించాడు. ఆయన చెప్పింది విని చిటికెలో డాక్టరు గారి కారు బాగుచేసాడు. స్టార్ట్ చేసి చూపెట్టాడు. అంతతొందరగా పనిపూర్తిచేసినందుకు డాక్టర్ ధన్యవాదాలు తెలిపి డబ్బు తీసి ఇస్తుండగా మెకానిక్ వున్నట్టుండి    
“ఎన్నాళ్ళ నుంచో నాకొక  అనుమానం  డాక్టర్ గారు  అడగమంటారా?” అన్నాడు.
డాక్టర్ కూడా కాస్త తీరిగ్గా వున్నాడో యేమో  “చెప్పు ఏమిటి నీ సందేహం?” అని అడిగాడు.
మెకానిక్ కాసేపు అడగాల్నా వద్దా అన్నట్టు మొహం పెట్టి చివరికి అడిగేసాడు.
‘డాక్టర్ గారు. మీరేమో మనిషి గుండె ఓపెన్ చేసి, భాగాలు మార్చి, మరమ్మతు చేసి  మళ్ళీ రోగిని మామూలు మనిషిని చేస్తారు. నిజానికి మేమూ చేసేదీ  అదే. కారు ఇంజిన్ వూడతీస్తాం. చెడిపోయిన పార్టులు బయటకు తీస్తాం. కొత్త పార్టులు వేస్తాం.  పాత వాల్వులు తీసి కొత్త వాల్వులు వేస్తాం.  మళ్ళీ ఇంజిన్ మామూలుగా పనిచేసేట్టు చేస్తాం. మీరూ మాలాగే గుండె వాల్వులు మార్చి కొత్తవి వేస్తారు. మీకేమో అడిగినంత డబ్బు అడక్కుండానే ఇస్తారు. మా దగ్గరకు వచ్చేసరికి గీసి గీసి బేరం చేస్తారు. మీరూ మేమూ చేసేది ఒకే పని కదా! అటువంటప్పుడు  ఈ తేడా యెందుకు చెప్పండి?”
డాక్టర్ ఒక్క క్షణం నివ్వెరపోయినట్టు కనిపించినా వెంటనే తేరుకున్నాడు.  కారు  బానెట్  మీదికి  వొంగి అతడి చెవిలో గుసగుసలాడాడు.
అది విన్న మెకానిక్ ఒక్కసారి నోరు తెరిచాడు.
ఇంతకీ డాక్టర్ గారు ఆ మెకానిక్ చెవిలో చెప్పింది ఏమిటి?
కాస్త ఆలోచించి చూడండి..................

.........డాక్టర్ ఏంచెప్పాడంటే -
“నువ్వు చెప్పింది బాగానే వుంది. అయితే కారు నడుస్తున్నప్పుడు  ఆ పనేదో చేసి చూడు,  అప్పుడు తెలుస్తుంది తేడా ఏమిటన్నది”