11, ఏప్రిల్ 2013, గురువారం

రాహుల్ గాంధీని గుర్తు పట్టడం యెలా?



గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ శ్రేణులు చెప్పేమాటల్లో  ఒక నిజం లేకపోలేదు.
రాహుల్  గాంధీకి భేషజాలు లేవు. అందుకే ఓ రోజు సాధారణ పౌరుడి మాదిరిగానే  చెక్కు మార్చుకోవడానికి బ్యాంకులోకి వెళ్ళి క్యాషియర్ కు ఇచ్చాడు.
క్యాషియర్ చిరునవ్వుతో పలకరించి –‘దయచేసి మీ గుర్తింపు కార్డు చూపిస్తారా?’ అని అడిగాడు.
ముందు కంగుతిన్నా త్వరలోనే తేరుకుని ‘నిజం చెప్పాలంటే నా ఐ.డీ.కార్డు ఇంట్లో మరచిపోయివచ్చాను. అది తప్పనిసరి అని నాకూ తెలుసు. కానీ మనలో మాట. నా పేరు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని. దేవుడు మేలు చేస్తే ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా బాగా వున్నాయంటున్నారు. ఈ పరిచయం చాలనుకుంటాను’ అన్నాడు మర్యాదగా.
బ్యాంకు ఉద్యోగి కూడా అంతే మర్యాదగా జవాబిచ్చాడు.
‘నాకా విషయం తెలుసు సార్. కానీ ఈ మధ్య ప్రభుత్వమే బ్యాంకుల పనితీరుకు సంబంధించి ఎన్నో నియమాలు నిబంధనలు ఏర్పాటుచేసింది. మీకు తెలియనిది కాదుకదా. పైగా రహస్య పర్యవేక్షణ కూడా అమలవుతోంది. కాబట్టి మీరు ఏదో విధమైన గుర్తింపు రుజువు చేసుకుంటేనే తప్ప నేనేమీ సాయం చేయలేను. మన్నించండి.’ అన్నాడు.
‘పోనీ బ్యాంకులో వున్నవారినెవరినయినా అడిగిచూడండి. అందరికీ తెలిసేవుండాలి నేనెవరన్నది”
“నేను కాదనడంలేదు సార్ కానీ రూల్స్ అలావున్నాయి. నన్నేమి చేయమంటారు మీరే చెప్పండి”
“రూల్స్ సంగతి నాకూ తెలుసు. దయచేసి ఈ పని చేసిపెట్టండి”
“సార్ నన్నో మాట చెప్పమంటారా? ఒక రోజు ఇలాగే మా బ్యాంకుకు సచిన్  టెండూల్కర్ వచ్చాడు. అతడూ మీ లాగే ఐ.డీ. ప్రూఫ్ లేకుండా చెక్కుపట్టుకు వచ్చి క్యాష్ కావాలన్నాడు. రుజువు అడిగితే చేతిసంచీలోనుంచి బ్యాటు బంతి తీసి, బ్యాంకులోనే ఓ షాట్ కొట్టి చూపించాడు. దాంతో అతడే సచిన్ అని నిర్ధారించుకుని చెక్కు పాస్ చేసి పంపించాము. అలాగే మరోసారి సినిమా నటుడు బాలకృష్ణ వచ్చాడు. ఐడీ అడిగితే అర్ధం కాని  డైలాగ్ ఏదో  చెప్పాడు. దాంతో అతడే బాలకృష్ణ అని మేము అర్ధం చేసుకుని పనిపూర్తిచేసి వెంటనే పంపించేసాము. ఆవిధంగానే భావిభారత ప్రధాని రాహుల్  గాంధీ మీరే అని నమ్మేలా ఏదయినా రుజువు చూపించారనుకోండి. మీ పని చిటికెలో చేసి పంపిస్తాం”
రాహుల్ గాంధీ కాసేపు ఆలోచించాడు. మరికాసేపు తల గోక్కున్నాడు. ఇంకొంతసేపు జుట్టు పీక్కున్నాడు.
చివరకు ఇలా అన్నాడు.
“నిజాయితీగా చెబుతున్నాను. యెంత ఆలోచించినా నా బుర్రకు ఏమీ తట్టడం లేదు. నా మెదడు బ్లాంకుగా తయారయింది. ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో తల యెంత తడుముకున్నా తట్టిచావడం లేదు”
క్యాషియర్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా రాహుల్ ఇచ్చిన చెక్కు తీసుకుని తక్షణం దానికి తగ్గ నగదు లెక్కబెట్టి రాహుల్ చేతికి ఇస్తూ అన్నాడు.
“సందేహం లేదు. మీరే రాహుల్ గాంధీ. డబ్బు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.”  
(నెట్లో సంచరిస్తున్న ఓ టిట్ బిట్ కి స్వేచ్చానువాదం – ఇమేజ్ ఓనర్ కి ధన్యవాదాలు)

తెలుగువారందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలు


10, ఏప్రిల్ 2013, బుధవారం

ఉగాది మనాది – భండారు శ్రీనివాసరావు




కాలం అంచున నిలబడి ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే...



ఎన్ని వ్యాపకాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు
కొన్ని సుధా మధురం కొన్ని  మరికొన్ని వ్యధాబంధురం
కొన్ని మరపురానివి మరికొన్ని మరచిపోవాలని అనుకునేవి
కొన్ని తీపి గురుతులు  కొన్ని చేదు గుళికలు
ఉగాది పచ్చడిలా కష్టసుఖాల సమ్మేళనమా అంటే కాదాయె
కొని తెచ్చుకున్న ఇక్కట్లు కొన్నయితే కోరితెచ్చుకున్న కడగండ్లు మరి కొన్ని
కొన్ని ప్రకృతి  విషాదాలు మరికొన్ని మనిషి ప్రసాదాలు
కొన్ని స్వార్ధశక్తుల ప్రేరేపకాలు మరికొన్ని రాజకీయ  కుశ్చిత కుతంత్ర ప్రేరేపితాలు  
పులులు పంజాలు విసిరే చోట లేడికూనల దీనాలాపాలు
విష నాగులు సంచరించే వనంలో రెక్కలు విప్పుకుంటున్న శాంతి కపోతాలు
ఎవరి దోవ వారిదే ఎవరి యావ వారిదే
ఎవరి వాదన వారిదే ఎవరి రోదన వారిదే
ఎవరి గోల వారిదే ఎవరి లీల వారిదే 
ఒకరి మాట మరొకరికి ఎక్కదు
ఒకరి గోడు మరొకరికి పట్టదు
వివాదాల ముందు వివేచన తల వంచుకుంది
వాదప్రతివాదాల నడుమ హేతువు తల దించుకుంది 
పంతాలు పట్టింపుల హోరులో నోర్లు తెగబడ్డాయి, వూర్లు తగలడ్డాయి
నాలుకలు చీలిన  నాయకుల  ప్రేలాపనలతో బుల్లితెరలు చిల్లులు పడ్డాయి 
మాటల తూటాలతో మాధ్యమాలు దద్దరిల్లాయి
అమృతం కురవాల్సిన చోట విషం  ధారగా కారింది 
మంచితనం మనుగడే  ప్రశ్నార్ధకంగా మారింది
వాస్తవాలను ఎరుక పరచాల్సిన విజ్ఞులు తానులో ముక్కలయ్యారు
మౌనంగా పరికిస్తున్న సామాన్యులు నోటమాట రాక అవాక్కయ్యారు
దిల్ సుఖ్ నగర్ లో జరిగిన ఘోరకలి
కలి ఉనికిని నిర్ధారించింది  
యుగాంతం వదంతి నిజమయినా బాగుండేదన్న భావన అందరిలో కలిగింది 
అయినా ఏదో ఆశ
మనిషిని బతికిస్తున్న ఆశ
నిరాశ నిస్పృహల  నడుమ జోగాడుతున్న ఆశ
మంచి రోజులు వస్తాయన్న ఆశ
మంచి కాలం ముందుందన్న ఆశ
తిట్టుకుంటున్న నోళ్ళు కట్టుబడతాయన్న ఆశ
కొట్టుకుంటున్న చేతులు కలుసుకుంటాయన్న ఆశ
జనాలను దోచుకుంటున్న   నాయకులు
ఆపన్న  జనాలను కాచుకుంటారన్న ఆశ
అందరి  మదిలో కదుల్తోంది 
అందరి  హృదిలో  మెదుల్తోంది
నిరాశ కాకూడని ఈ ఆశను మన మనసుల్లో  చిగురింపచేద్దాం.
ఆ  చిగురించిన ఆశను అందరిలో పల్లవింప చేద్దాం.
(10--04-2013)

9, ఏప్రిల్ 2013, మంగళవారం

మనం మంచివాళ్ళ మధ్యనే వుంటున్నాం



ఒకరకంగా మన అందరం అదృష్టవంతులమే. ఎందుకంటే , జస్టిస్ చంద్రు వంటి  అరుదయిన మంచి మనుషులు జీవిస్తున్న కాలంలోనే మనమూ బతుకుతున్నాము కాబట్టి.

జస్టిస్  చంద్రు 

జస్టిస్ చంద్రు చెన్నై హై కోర్ట్లులో చాలాకాలం జడ్జిగా  పనిచేసి ఈమధ్యనే పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచిమాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు.
ఆంధ్రప్రదేశ్  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.వి.రావు  ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడుకోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ ఓ కొలిక్కి   రావాలంటే  300 లసంవత్సరాలకు  పైగా పడుతుందనీ జస్టిస్ రావు  చెప్పారు. ఆయన చెప్పింది అక్షరసత్యమే కావచ్చుకాని,  జస్టిస్  చంద్రు వంటి న్యాయమూర్తులు మరికొందరు వుండివుంటే,  బహుశా కేసుల పరిష్కారానికి  అంత సమయం అవసరం పడదేమో! ఎందుకంటే కేసుల పరిష్కారం  విషయంలో జస్టిస్ చంద్రు నెలకొల్పిన  రికార్డు అలాటిది మరి.  న్యాయమూర్తిగా ఆయన అక్షరాలా  యాభై నాలుగు వేల కేసులను పరిష్క రించారు. భారత న్యాయస్తానాల చరిత్రలో ఇదొక అరుదయిన రికార్డు.
సరే! విషయానికి వద్దాం.
ఏదయినా ఉద్యోగంలో వున్న వ్యక్తి యెంతటి  సమర్ధుడైనా సరే,  ఏదో ఒకనాడు పదవీ విరమణ చేయకతప్పదు. జస్టిస్ చంద్రుకు కూడా ఆ రోజు వచ్చింది.
మామూలుగా ఇలాటి సందర్భాలలో కొన్ని సంప్రదాయాలు వుంటాయి. న్యాయమూర్తి ఎవరయినా రిటైర్ అవుతున్నప్పుడు  కోర్టులోనే అధికారికంగా ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి,  ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్  వగైరా  హాజరవుతారు. వీడుకోలు ప్రసంగాలు చేస్తారు. పుష్పగుచ్చాలు అందచేస్తారు.  తేనీటి విందు జరుగుతుంది. అందరూ కలసి ఫోటో దిగుతారు. వీలునుబట్టి,  ఆ సాయంత్రం ఓ  ఫైవ్ స్టార్ హోటల్లో వీడ్కోలు  విందు ఏర్పాటుచేస్తారు.
కానీ జస్టిస్ చంద్రు తరహానే వేరు. అందువల్ల ఆయన పదవీ విరమణ ఆయన పద్దతిలోనే జరిగింది. ఏడేళ్ళపాటు జడ్జిగా  పనిచేసి  రిటైర్ అయ్యేముందు అంటే  ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయవద్దని అందులో ముందుగానే  అభ్యర్ధించారు.
ఒక జడ్జి  నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎన్నడూ జరగలేదా అంటే  జరిగింది. కానీ ఎప్పుడూ?  మన దేశానికి  స్వాతంత్ర్యం రాకముందు 1929లో జరిగింది.  ఆరోజుల్లో జస్టిస్ జాక్సన్ నాటి అడ్వొకేట్ జనరల్ తో చెప్పారు. ‘ నా రిటైర్ మెంటు విషయంలో అనవసరమైన హడావిడి ఏమీ చేయవద్దు. నా విధులు నేను నిర్వర్తించాను.  వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంది?’
మళ్ళీ ఎనభై రెండేళ్ళ తరువాత జస్టిస్ చంద్రు అలాటి నిర్ణయం తీసుకోగలిగారు.     
 మార్చి  ఎనిమిది, శుక్రవారం.
జస్టిస్ చంద్రు రోజుమాదిరిగానే  కోర్టుకు వచ్చారు. తన ఆస్తిపాస్తుల  వివరాలను స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. తరువాత తన చాంబర్స్ కు వచ్చి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో కూర్చుని తేనీరు  సేవిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు.
రిటైర్ అయినరోజున కూడా ఆయన అధికారిక వాహనాన్ని వాడుకోలేదు. అన్నిసంవత్సరాలుగా  వెన్నంటివున్న డఫేదారునూ వెంటతీసుకోపోలేదు.
తరువాత హై కోర్టు బయటకు వచ్చి నడుచుకుంటూ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటి అక్కడవున్న సంగీత రెస్టారెంటులో మిత్రులతో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెబుతూ గడిపారు. ఆ పిదప, బీచ్ రోడ్డు స్టేషన్ కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే ఎం.ఆర్.టీ.ఎస్. లోకల్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు.
న్యాయమూర్తిగా వున్నప్పుడు కూడా జస్టిస్ చంద్రు ఉద్యోగంతోపాటు వచ్చే హంగులు ఆర్భాటాలకు  దూరంగానే వుంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ చాంబర్ నుంచి కోర్టు హాలుకు వెళ్ళేటప్పుడు  యూనిఫారం ధరించిన  బిళ్ళ బంట్రోతు వొకరు చేత దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ. జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు.  తన అధికారిక వాహనానికి యెర్ర దీపం ఏర్పాటు తీసేయించారు. సెక్యూరిటీ సిబ్బందిని  అవసరంలేదని చెప్పి వాపసు పంపేసారు.  ఇంటివద్ద పనులకోసం బంట్రోతులను వాడుకోలేదు.
చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు చాంబర్ ముందు ఒక బోర్డు మీద ఇలా రాసివుండేది.

“పూలు,బొకేలు పట్రాకండి – నేనేమీ దేవుడ్ని కాను
ఆకలితో లేను  – కాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి
చలితో గడగడలాడిపోవడం లేదు –  శాలువల అవసరం ఏమీ లేదు  
అలా అని మీనుంచి నేనేమీ ఆశించడంలేదనుకోకండి.
లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మరచిపోకండి.”
   
బహుశా ఇప్పుడాబోర్డు అక్కడ వుండి వుండదు. దాని అవసరం కూడా వుండకపోవచ్చు.
(09-04-2013)
NOTE: COURTESY IMAGE OWENER

8, ఏప్రిల్ 2013, సోమవారం

భండారు బఠానీలు



‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?’  అనేది చిన్నప్పుడు స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని సమాధానం.
ప్రశ్న అడిగిన లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం,  దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.
తమదగ్గర  చదువుకునే పిల్లల్లో ఐ.ఏ.ఎస్. లు ఎంతమంది అవుతారన్నది వారికొచ్చిన  డౌటేహం కావచ్చు. వాళ్ళల్లో రాజకీయనాయకులు, జర్నలిస్టులు కొంతమంది అయినా కాకపోతారా అనే నమ్మకం కావచ్చు. అందుకే కాబోలు,  పిల్లలకు   వక్తృత్వపోటీలు పెట్టి, ‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’ – ‘అణ్వస్త్రాలు కావాలా?  అన్నవస్త్రాలు కావాలా?’ అని ప్రతి అంశానికి అనుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా చెప్పించేవారు. అప్పుడర్ధంయ్యేది కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చల తీరుతెన్నులు, రాజకీయ నాయకుల ప్రకటనలు గమనిస్తుంటే  అందులోని తత్వం  నెమ్మది నెమ్మదిగా తలకెక్కుతోంది.
‘నరం లేని నాలుక ఏవిధంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం, నిన్న ఏం చెప్పాం’ అన్నదానితో నిమిత్తం లేకుండా ‘ఈరోజు చెప్పిందే ఫైనల్’ అన్న పద్ధతిలో  బల్లగుద్ది వాదిస్తున్న విధం చూస్తుంటే రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం   కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు.




‘మా నాన్నవల్ల ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టడం నామతం కాదు,  అభిమతం కాదు, కాదెంతమాత్రం కానే  కాదం’టూ ఎక్కడలేని ధర్మపన్నాలు  వల్లించి ఆ తరువాత అనతికాలంలోనే  పోటీ పార్టీ పెట్టి సొంతపార్టీకి చిల్లి పెడుతున్న విధం చూస్తుంటే-  రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడే స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకులను పంచెలూడతీసి తరిమికొడతాం!’ అంటూ పొడుగుపాటి డైలాగులు అలవోకగా జనం మీదకు వొదులుతూ, పార్టీ పెట్టిన  తొమ్మిదిమాసాల్లోనే అధికార పీఠం ఎక్కిన  ఎన్టీయార్ రికార్డుని బద్దలుకొట్టేసి,   రాజ్యాధికారంలోకి వద్దామనుకున్న కలలు కాస్తా   పార్టీ పారాణి ఆరకముందే కల్లలైపోవడంతో, ఇక  విధిలేక  ఆ కాంగ్రెస్ పంచనే చేరి, కేంద్రమంత్రి పదవిలో విదేశాల్లో  సేదతీరుతూ, తీరిగ్గా  సోనియా భజన చేస్తున్న వైఖరి చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్సార్ చనిపోయినప్పుడు, పట్టు చీరెల అంచులతో, ఖాదీ ఉత్తరీయాలతో కళ్ళు వొత్తుకుంటూ బుల్లితెరలమీద బారులుతీరి ‘అంతటి నాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇకముందు పుట్టడు’ అంటూ విలపించిన ఆయన  మంత్రివర్గ సహచరులే  ఇప్పుడు పల్లవి మార్చి ‘అవినీతిలో వైఎస్ ను మించినవాడు లేడం’టూ వైనవైనాలుగా శాపనార్ధాలు పెడుతున్న వైనం గమనిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘తుది శ్వాస విడిచేవరకు తాత స్థాపించిన పార్టీలోనే వుంటానంటూ, ప్రత్యర్ధి పార్టీల ఫ్లెక్సీల్లో అభిమానుల పేరుతొ తన ఫోటోలు పెడుతుంటే మిన్నకుండిపోయి ముసిముసి నవ్వులు నవ్వడం చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘అల్లుడా రమ్మని పిల్లనిచ్చిన  మామ పిలిచి పార్టీ అందలం ఎక్కిస్తే, పార్టీని బతికించే నెపంతో పార్టీ సంస్తాపకుడి అంతాన్నే కళ్ళారాచూసి, ఇప్పడు మళ్ళీ పార్టీ పునరుద్దానానికి ఆ కీర్తిశేషుడి పేరునే వాడుకుంటూ, దానిపై పేటెంటు రైటు తమదే అంటూ వాడవాడలా  వూరేగుతున్న విపరీతాన్ని చూస్తున్నప్పుడు - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

పార్టీలు, వ్యక్తుల భజనకోసం పెట్టిన టీవీ చానళ్ళలో పనిచేస్తూ, జీతాలకోసమో, హోదాలకోసమో వేరే చానళ్ళలో చేరి  పొగిడిన నోళ్లతోనే తెగుడుతున్న విధానాలను పరికిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

ఇలాటి  చద్మ వేషధారుల, ఆషాఢభూతుల లీలలు చూపించి, వారి అసలు రూపాలను, స్వరూపాలను చూపించే విధంగా ఏ టీవీ వారయినా పుణ్యం కట్టుకుని, ‘అప్పుడు – ఇప్పుడు’ అనే కార్యక్రమం ప్రసారం చేస్తే యెంత బాగుంటుందో !   (08-04-2013)  
Note: Courtesy image owner              

6, ఏప్రిల్ 2013, శనివారం

ఈనాడు సిటీ ఎడిషన్ ఎనిమిదో పేజీ చూశారా?




ఈనాటి ‘ఈనాడు’ దినపత్రిక సిటీ ఎడిషన్ ఎనిమిదో పేజీలో ఒక ఫోటో వేసారు. ఆ ఫోటోలో ఒక నడివయసు ఆవిడ తన మనుమడిని భుజాలమీద ఎత్తుకుని వెడుతున్న దృశ్యం వుంది. పల్లెపట్టుల్లో ఇది మామూలే కాని హైదరాబాదు లాటి నగరంలో అపూర్వ దృశ్యమే అని చెప్పాలి. అందుకే అది ఆ ఫోటోగ్రాఫర్ కళ్ళల్లో పడి కెమెరా కంటికి చిక్కి పత్రికలోకి  ఎక్కింది.




ఈ ఫోటోలో వున్న ఆవిడతో మాకు బాదరాయణ సంబంధం వుండడం వల్లనే ఇది రాయాల్సివస్తోంది. 1992 లో మేము మాస్కోనుంచి వచ్చిన తరువాత పంజాగుట్టలోని  దుర్గానగర్ కాలనీలో చాలా ఏళ్ళు వున్నాము. ఆ రోజులనుంచి ఈ ఫోటోలో వున్న యాదమ్మ కుటుంబంతో మాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. యాదమ్మ చాలా కాలం మా ఇంట్లో పనిచేసింది. వాళ్ళాయన మల్లయ్య ఆటో నడుపుతాడు. ఆ రోజుల్లో దూరాభారాలకు మల్లయ్య ఆటోనే మాకు ఆధారం. అలాగే ఆ తరువాత సంవత్సరాలలో యాదమ్మ పిల్లలు – సైదమ్మ, కళ, భాగ్య, సంపూర్ణ , తిరుపతమ్మ మా ఇంట్లో పనిచేస్తూ వచ్చారు. చిన్నపిల్లలు సంపూర్ణ, తిరుపతమ్మ మా ఇంట్లో వుంటూనే చదువుకున్నారు. సంపూర్ణ పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళేదాకా మా ఇంట్లోనే వుండేది. వాళ్ల అక్క  భాగ్య ఇప్పుడు మాకు వంట చేసిపెడుతోంది. ఇదిగో ఈ భాగ్య ‘భాగ్యమే’ ఫోటోలో యాదమ్మ నెత్తికెక్కిన వాడు,  ఆమె  ఏకైక సంతానం గౌతమ్. కాన్వెంటు స్కూల్లో చదువుకుంటున్నాడు.  పోతే, కళ తనకు పుట్టిన పిల్లలకు మా పిల్లల పేర్లే ‘సందీప్,సంతోష్’ అని పెట్టుకుంది. మా పిల్లలు అమెరికా నుంచి ఎప్పుడు ఫోను చేసినా వీళ్ళందరి యోగక్షేమాలు అడుగుతారు. మా ఇంట్లో యే శుభకార్యం జరిగినా మొత్తం కుటుంబం మా చెంతనే  సాయంగా వుండిపోతుంది.   అదీ ఈ ఫొటోకు మాకువున్న లింకు. (06-04-2013)

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?




సరిహద్దుల్లో పోరు భీకరంగా జరుగుతోంది.
మరోపక్క అక్కడికి దాపున వున్న ఆసుపత్రిలో ఓ ముసలాయన చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. యుద్ధరంగంలో వున్న కొడుకును పదే  పదే  తలచుకుంటున్నాడు. తనకు సేవలు చేస్తున్న నర్సుతో కొడుకు గురించి తాను పడుతున్న ఆరాటాన్ని కేవలం కనుసైగలతో అదేపనిగా వివరిస్తున్నాడు. ఆఖరిఘడియల్లో కన్నకొడుకు ఆఖరి చూపు కోసం ఆ ముసలాయన పడుతున్న బాధను ఆ నర్సు అర్ధంచేసుకోగలిగింది. కానీ ఏమీ చేయలేని పరిస్తితి ఆమెది.
అదే  సమయంలో  ఓ యువకుడు ఆసుపత్రిలో అడుగుపెట్టాడు. మిలిటరీ దుస్తుల్లో వున్న  అతడిని చూడగానే  నర్సుకు ప్రాణం లేచి వచ్చింది. వెంటనే అతడిని వెంటబెట్టుకుని ముసలాయన వద్దకు తీసుకు వెళ్ళి  ‘ఇదిగో మీ నాన్న గారు. కళ్ళల్లో ప్రాణాలుపెట్టుకుని మీకోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎంతో సమయం లేదు. తెల్లారుతుందన్న ఆశ కూడా లేదు.’ అంటూ మిగిలిన రోగులను కనుక్కోవడానికి  హడావిడిగా వెళ్ళిపోయింది. మంచానికి  అతుక్కుపోయినట్టు పడివున్న  ఆ వృద్ధుడి వంక అతడు తేరిపారచూశాడు. ముడతలు పడి బలహీనంగా వున్న చేతిని కదపడానికి  అవసానదశలో అతడు చేస్తున్న విఫల ప్రయత్నాన్ని గమనించాడు.  ఆ యువకుడే చేయిసాచి వృద్ధుడి చేతిని తన చేతిలోకి తీసుకుని  మృదువుగా ఆప్యాయంగా అదిమాడు. బలిష్టమైన ఆ యువకుడి చేతిలో ఎముకలు,చర్మం  తప్ప ఏమీ లేని వృద్ధుడి చేయి అలాగే  వుండిపోయింది.


కాసేపటి తరువాత అటుగా  వచ్చిన నర్సు అతడిని చూసింది.
‘ఇక ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. మీరు కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తెల్లారిన తరువాత చేయవలసిన తతంగం చాలా వుండవచ్చు’ అంది.
తన చేతిని వొదలడం ఇష్టం లేదన్నట్టు  ప్రశాంతంగా నిదురపోతున్న ఆ ముసలి ప్రాణాన్ని  వొదిలివెళ్లడానికి అతడికి మనస్కరించలేదు.  రాత్రంతా  ఆ యువకుడు రోగిమంచం చెంతన అలాగే కూర్చుండిపోయాడు.  తెలతెలవారుతుండగా వృద్ధుడి ప్రాణం పోయింది.  చలనంలేని  ఆ చేతిని నెమ్మదిగా విడిపించుకుని వెళ్ళి నర్సును కలిసి విషయం చెప్పాడు.  కంటి మీద కునుకు లేకుండా  వృద్ధుడి చెంతనే వుండి, ఆఖరి నిమిషం వరకు స్వాంతన  చేకూర్చిన ఆ యువకుడిని నర్సు మనసారా అభినందించింది. ‘ఇలాటి కొడుకున్న  ఆ వృద్ధుడు ఎంతో అదృష్టవంతుడు’ అని కొనియాడింది. ఆ యువకుడి మోహంలో రంగులు మారాయి.
‘ఆయన  నాకు తండ్రా! అసలాయన్ని చూడడం ఇదే మొదటి సారి’ అన్నాడు. ఆశ్చర్యపోవడం ఈసారి నర్సు వంతయింది. ‘అదేమిటి, రాత్రి  ఆయనతో చెబుతున్నప్పుడే ఈ విషయం నాకెందుకు చెప్పలేదని’ ఎదురు ప్రశ్నించింది.
‘అప్పుడే నాకు విషయం బోధపడింది. ఆయన నా తండ్రి కాదని చూడగానే తెలిసిపోయింది. రాత్రి గడవదని మీరే చెప్పారు. ఆయనేమో నేను తన కొడుకుననుకుంటున్నాడు. కన్నకొడుకు చెంతనే కన్ను మూసానన్న తృప్తి ఆయనకు మిగలాలని  ఏమీ మాట్లాడకుండా వుండిపోయాను. అది సరే ఈ ఆసుపత్రిలో వర్ధన్ సింగ్ అనే పేషెంటు వుండాలి. ఆయన్ని నేను వెంటనే చూడాలి. ఆయన ఒక్కగానొక్క కొడుకు మొన్న శత్రువులతో పోరాడుతూ వీరమరణం చెందాడు. ఈ కబురు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను.’
యువకుడి మాటలు వింటూనే నర్సు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది.
‘వర్ధన్ సింగా! ఆయన ఎవరో కాదు. కనుమూసేవరకు మీరు కనిపెట్టుకుచూసిన ఆ వృద్ధుడే వర్ధన్ సింగ్’ అంటూ మంచం మీద అచేతనంగా పడివున్న ఆ వృద్ధుడి శవాన్ని చూపించింది. (06-04-2013)   
(చక్కటి ఇంగ్లీష్ కధను పంపిన అజ్ఞాత వ్యక్తులకు – ఇమేజ్ ఓనర్ కు కృతజ్ఞతలతో)