12, ఆగస్టు 2011, శుక్రవారం

పండంటే పండూ కాదూ ..... – భండారు శ్రీనివాసరావు



పండంటే పండూ కాదూ ..... – భండారు శ్రీనివాసరావు


అరటి పండు అరవై ఆరు రోగాలకు అమృతంలా పనిచేస్తుందంటున్నారు డాక్టర్లు. రోజూ ఒక అరటిపండు తినిచూడండి – మీ మెదడు కదను తొక్కే గుర్రంలా పనిచేస్తుందని కూడా సెలవిస్తున్నారు. అరటి పండులోని మంచి గుణాలను గురించి అరటిపండు వొలిచిపెట్టిన చందంగా వివరిస్తున్నారు.

అరటి పండు చూడానికి చిన్నగా వుంటుంది కానీ మనిషి శరీరానికి అవసరమయిన అనేక పోషక గుణాలు అందులో పుష్కలంగా వుంటాయిట.

ఈ పండులో ప్రకృతి సిద్ధమయిన మూడు ప్రధానమయిన చక్కర పదార్ధాలు- సక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లు తగుపాళ్ళలో వుంటాయి. వీటివల్ల శరీరానికి కావాల్సిన శక్తి అప్పటికప్పుడే తక్షణం అందుతుంది.

రెండు అరటి పండ్లు తింటే చాలు మనిషికి కావాల్సిన శక్తి తొంభయ్ నిమిషాలపాటు నిరంతరాయంగా లభిస్తుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ స్తాయి క్రీడాకారులు చాలామంది తమ శరీర పాటవాన్ని కాపాడుకునేందుకు అన్నింటికంటే ముందు అరటి పండునే ఎంచుకుంటారట.

శరీరాన్ని సౌష్టవంగా వుంచుకోవడానికి మాత్రమే కాదు అరటి పండు అనేక రకాల రుగ్మతల నివారణలో కూడా మానవాళికి సాయపడుతోంది. దినసరి ఆహారంలో అరటి పండును చేర్చుకోవడం వల్ల కలిగే మేళ్ళు అన్నీ ఇన్నీ కాదన్నది పరిశోధకుల అభిప్రాయం.
డిప్రెషన్ : ‘మైండ్’ అనే ఒక పరిశోధక సంస్త డిప్రెషన్ కు గురయి దిగులుతో కుంగిపోయేవారిపై కొన్ని సర్వేలు జరిపింది. అరటిపండు తిన్నతరువాత అటువంటి వారిలో డిప్రెషన్ లక్షణాలు చాలావరకు తగ్గిపోయాయట. అరటి పండులో ట్రిప్టోఫాన్ అనే పదార్ధం వుంటుంది. అరటిపండు తిన్న తరువాత అది శరీరంలో సెరొటోనిన్ గా మారుతుంది. మనిషిని ఉల్లాసంగా వుంచడానికి ఈ సెరొటోనిన్ బాగా ఉపయోగపడుతుందిట.
రక్తహీనత : అరటి పండులో రక్త హీనతను నివారించడానికి అవసరమయ్యే హెమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేసే ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడే రోగులకు అరటిపండు ఆరోగ్యదాయిని అని చెప్పవచ్చు.

రక్త పోటు: అరటిపండులో పొటాషియం చాలాఎక్కువగా వుంటుంది. పైగా ఉప్పుశాతం బాగా తక్కువ. అందువల్ల రక్త పోటును అదుపులో వుంచుకోవడానికి రోజూ ఒక అరటిపండు తింటే చాలు. అమెరికా లోని ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ వారు అరటిపండులోని ఈ పోషక విలువను గ్రహించి రక్తపోటు నివారణకు అరటిపండు దివ్యంగా పనిచేస్తుందని ప్రచారం చేసుకోవడానికి ఈ మధ్యనే అరటి పళ్ళ ఉత్పత్తిదారులను అనుమతించారని భోగట్టా.

బ్రెయిన్ పవర్ : ఇంగ్లాండ్ లోని ట్వికేహాం స్కూలు వాళ్లు తమ విద్యార్ధులకు క్రమం తప్పకుండా అరటి పళ్ళు తినిపించారట. అలా అరటి పళ్ళు ముప్పూటలా తిన్న విద్యార్ధులు పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు సాధించారట.
మలబద్ధకం : మలబద్ధకం పోవాలంటే రోజూ ఒక అరటి పండు తింటే చాలట. ఎందుకంటె ఈ పండులోని ఫైబర్ విరోచనం సాఫీగా కావడానికి సహకరిస్తుందట.
గుండె మంట: గుండె మంటతో బాధపడే వాళ్లకు అరటిపండు మంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి అవసరమయిన యాంటాసిడ్ ప్రభావాన్ని అరటిపండు కలిగిస్తుంది.
వేవిళ్లు : వేవిళ్ళతో బాధపడే గర్భవతులకు అరటిపండుతో చేసిన పదార్ధాలు భోజనానికీ, భోజనానికీ మధ్య తీసుకుంటే వేవిళ్ళ ఉధృతం తగ్గుతుంది.
దోమకాటు: దోమలు కుట్టి దద్దుర్లు లేచినప్పుడు అప్పుడే వొలిచిన అరటి తొక్కతో రుద్దితే దద్దుర్లు తగ్గిపోతాయి.
స్తూలకాయం : స్తూలకాయానికి చక్కని విరుగుడు అరటిపండని ఆస్ట్రేలియాలో జరిపిన పరిశోధనలు తెలుపుతున్నాయి. కార్పోరేట్ ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు సాధారణంగా ఆఫీసుల్లో దొరికే చాకోలెట్లు, చిప్స్ తెగలాగిస్తూ తెగలావెక్కి పోతున్నారట. అలా వొళ్ళు పెంచి నడుం వంచలేని అయిదు వేలమంది లంబోదరులకు అరటి పళ్ళు తినిపించి వాళ్ల కొవ్వు చాలావరకు తగ్గించగలిగారట.
శీతాఫలం : చాలా చలవ చేసే పండు కాబట్టి దీన్ని ‘శీతాఫలం’ అనవచ్చేమో. గర్భవతుల్లో కలిగే శారీరక, మానసిక ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను సరిచేయడానికి చాలా దేశాల్లో అరటిపండు వాడుతుంటారు. కడుపుతో వున్న వాళ్లు అరటిపండ్లు తరచూ తింటుంటే వాళ్లకు పుట్టే పిల్లలు కూడా సరిపడా శారీరక ఉష్ణోగ్రతతో జన్మిస్తారనే నమ్మకం థాయ్ లాండ్ లో వుంది.
మందుకు మంచి మందు : మందుబాబులకు, పొగరాయుళ్లకు కూడా అరటి పండు ఎంతో మేలు చేస్తుంది. మందు డోసు ఎక్కువై మర్నాడు హాంగ్ ఓవర్ తో కుదేలయ్యే దేవదాసులు రాత్రి పడుకోబోయేముందు అరటి పండుతో చేసిన ‘బనానా షేక్’ తీసుకుంటే తెల్లవారిన తరువాత తగులుకునే తలనొప్పులు తొలగిపోతాయట. అలాగే పొగతాగేవాళ్ళు ఉన్నట్టుండి ఆ అలవాటు మానుకోవాలని మనసులో ఎంత మధనపడ్డా ‘విత్ డ్రాయల్ సిండ్రోం వారిని పట్టి వేధిస్తూనే వుంటుంది. అలాటివాళ్ళు అరటిపళ్ళు తినడం వల్ల - శరీరంలో నికోటిన్ శాతం తగ్గిపోవడం వల్ల కలిగే విత్ డ్రాయల్ సిండ్రోం చాలావరకు మటుమాయమవుతుందట.
వొత్తిళ్లు : వొత్తిళ్లను తగ్గించుకోవడానికి కూడా అరటి పండు బాగా ఉపకరిస్తుంది. అరటిపండులో లభించే పొటాషియం దానికి కారణం. అలాగే అరటి పండులో సమృద్ధిగా లభించే విటమిన్ ‘బి’ వల్ల నాడీమండల వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.
అంతే కాదు యాపిల్ కంటే కూడా అరటి పండు ఎన్నోరకాలుగా మంచి చేస్తుందని పరిశోధకుల ఉవాచ. యాపిల్ తో పోలిస్తే అరటి పండులో నాలుగు రెట్లు ఎక్కువగా ప్రోటీన్లు, రెండు రెట్లు పిండి పదార్ధాలు, మూడు రెట్లు భాస్వరం, అయిదు రెట్లు విటమిన్ ‘ఏ’, ఐరన్ - అరటి పండులో వుంటాయి. పొటాషియం కూడా చాలా ఎక్కువ.
ఇన్నిన్ని పోషకవిలువలు వున్న అరటిపండు పేదవాడి యాపిల్ పండు అంటే అతిశయోక్తి కాదు.
మరో విషయం న్యూ ఇంగ్లాండ్ మెడిసిన్ జర్నల్లో ఇంకో విషయం రాసారు. రోజూ క్రమం తప్పకుండా ఒక అరటిపండు తింటే గుండె పోటు వచ్చే అవకాశాలు నలభై శాతం తగ్గిపోతాయిట.

ఇన్నిమంచి విషయాలు చెబుతున్న శాస్త్రవేత్తలు మరో ముఖ్య విషయం కూడా చెబుతున్నారు. అదేమిటంటే ఎట్టి పరిస్తితుల్లోను అరటి పండ్లను రిఫ్రిజిరేటర్లలో వుంచడం ఎంతమాత్రం మంచిది కాదట. (11-08-2011)



11, ఆగస్టు 2011, గురువారం

తప్పు తప్పే – భండారు శ్రీనివాసరావు

తప్పు తప్పే – భండారు శ్రీనివాసరావు



ఒక జడ్జి గారు చనిపోయి పరలోకానికి పయనమై వెడుతుంటే వెంటవుండి తీసుకువెడుతున్న యమభటులు రూటు మార్చి ఆయన్ని తమ లోకానికి పట్టుకుపోయారు. అక్కడ ఆ సమయంలో యమధర్మరాజు కొలువు తీరి చిత్రగుప్తుడి సాయంతో పాపుల్ని విచారించి దండనలు విధిస్తున్నారు. కొద్ది సేపటిలోనే మన జడ్జీ గారి వంతు వచ్చింది. భూలోకంలో ఆయనకు యముడికి వున్నంత మంచి పేరు వుంది. రాగద్వేషాలు లేకుండా, స్వపర బేధాలు చూడకుండా కేసుల్ని విచారించి తీర్పులు ఇస్తాడనీ, ఎలాటి ప్రలోభాలకు లొంగడనీ అందరూ ఆయన్ని గురించి చెప్పుకునేవాళ్ళు. లక్షలకోట్లు ప్రజాధనాన్ని దిగమింగిన బడా రాజకీయనాయకులని కూడా వొదిలిపెట్టకుండా జైలు వూచలు లెక్కబెట్టించిన ఘనకీర్తి ఆయనది. అలాటి తనను నేరుగా స్వర్గానికి తీసుకుపోకుండా ఈ నరకకూపంలోకి పట్టుకువచ్చినందుకు ఆయనకు ఒకటే గుర్రుగా వుంది. ‘ఆర్డర్ ఆర్డర్’ అని హుంకరించడానికి ఇది కోర్టు హాలు కాదని గుర్తుకువచ్చి తమాయించుకున్నాడు. ఇంతలో చిత్రగుప్తుడు చిట్టావిప్పి ఆయన నరలోకంలో వుండగా చేసిన పాపాల జాబితా చదవడం, సమవర్తి వాటికి తగ్గ శిక్షలను అక్కడికక్కడే విధించడం చూసి ఆ న్యాయమూర్తికి తల తిరిగిపోయింది. సాక్షులు లేకుండా, సాక్ష్యాలు లేకుండా కేసుల్ని విచారించి అప్పటికప్పుడే యముడు తీర్పులు వెలువరించడం, అప్పీలుకు అవకాశం లేకుండా అక్కడి సిబ్బంది వాటిని వెంటనే అమలు పరుస్తూ వుండడం ఇదంతా మన జడ్జి గారికి సుతరామూ నచ్చలేదు. పైగా సచ్చీలతకు మారుపేరని, నిజాయితీకి మరోపేరని గొప్ప పేరున్న తను తప్పులు చేసినట్టు చిత్రగుప్తుడు చెప్పడం చూసి ఆయనకు మతిపోయింది. చిత్రగుప్తుడు తాను చేసినట్టు చెబుతున్న  తప్పులకు, వాటికి యముడు విధించిన శిక్షలకు పొంతన లేకపోవడం ఆయన్ని మరింత నివ్వెరపరచింది. చిత్రగుప్తుడు తనపై మోపిన అభియోగాలు విన్న తరువాత సమవర్తిగా యమధర్మరాజుకున్న బిరుదుకు ఆయన ఏమాత్రం తగడని ఆయనకు అనిపించింది.

ఇంతకీ తను చేసిన తప్పులేమిటి?  ఒక ఉన్నత న్యాయస్తానంలో న్యాయమూర్తిగా వున్నప్పుడు అధికారిక విధులపై అనేకసార్లు అనేక నగరాల్లో అయిదు నక్షత్రాల హోటళ్ళలో విడిది చేసేవాడు. హోటల్ బిల్లులు, అన్నపానీయాల ఖర్చులు అన్నీ నిబంధనల ప్రకారమే వుండేలా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే, తనకు ఒక చిన్న బలహీనత వుండేది. హోటల్ గది ఖాళీ చేసేటప్పుడు బాత్ రూమ్ లో వుండే రకరకాల శాంపిల్ సబ్బులను, షాంపూ బాటిళ్ళను ఇంటికి పట్టుకువచ్చేవాడు. అంతంత డబ్బులుపోసి అంత పెద్ద హోటళ్ళలో బస చేసినప్పుడు వాటిని తీసుకురావడం అంత పెద్ద విషయంగా కాని, తప్పుపట్టాల్సిన విషయంగా కానీ తనకు ఎప్పుడూ తోచలేదు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఇలాటి చిన్న తప్పుల్ని ఒక హెచ్చరికతో వొదిలిపెట్టవచ్చు. కానీ ఈ నరక లోకంలో రూల్స్ వేరేగా వున్నట్టున్నాయి. చిన్న తప్పు, పెద్ద నేరం అనే బేధం లేకుండా సరి సమానంగా శిక్షలు వేస్తున్నారు. పైగా వాటికి అప్పీలు కూడా లేకపోవడం మరీ అన్యాయం.

జడ్జి మనసులో తొలుస్తున్న సందేహాలను యమధర్మరాజు అర్ధం చేసుకున్నాడు.

‘తప్పు చేయడం, వాటిని మళ్ళీ మళ్ళీ చేయడం మా శిక్షాస్మృతి ప్రకారం పూర్తిగా నిషేధం. పైగా శిక్షార్హం. చిన్న తప్పులు జరగకుండా జాగ్రత్త పడితేనే పెద్దవి జరగకుండా వుంటాయి. మా నిబంధనల ప్రకారం చిన్నదయినా పెద్దదయినా తప్పు తప్పే. నేరం నేరమే. అలాగే విధించే శిక్షలలో కూడా హెచ్చుతగ్గులుండవు. విచారణలను ఏళ్లతరబడి సాగదీయడం వల్ల కూడా దోషులు తప్పించుకునే వీలు మీ న్యాయశాస్త్రం కల్పిస్తోంది. వందమంది దోషుల్ని విడిచిపెట్టినా పరవాలేదు కాని ఒక్క నిర్దోషిని కూడా శిక్షించకూడదు అనే కాలం చెల్లిన సిద్ధాంతంతో మీ కోర్టులు అనవసర కాలయాపన చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ నిర్వహణలో మీకూ మాకూ అదే తేడా. మీది భూలోకం – మాది యమలోకం. అందుకే మిమ్మల్ని న్యాయమూర్తి అంటారు. మమ్మల్ని సమవర్తి అంటారు.” వివరించాడు యమధర్మరాజు. (11-08-2011)

10, ఆగస్టు 2011, బుధవారం

ఓ చిట్టెలుక కధ – భండారు శ్రీనివాసరావు

ఓ చిట్టెలుక కధ – భండారు శ్రీనివాసరావు


 

అనగనగా ఒక రైతు. ఇంట్లో ఎలుకల బాధ భరించలేక ఆదివారం సంతకు వెళ్లి ఎలుకల బోను తెచ్చాడు.

అప్పుడే కన్నంలో నుంచి తలబయట పెట్టిన ఓ చిట్టెలుకకు ఆ బోనును చూడగానే ముచ్చెమటలు పట్టాయి.

వెంటనే రివ్వున పొలం వెళ్లి తను చూసిన విషయాన్ని తోటివారికి చెప్పాలనుకుంది.

‘రైతు సామాన్యుడు కాడు. మనల్ని పట్టుకోవడానికి బోను కొనుక్కుని వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త’ అని ఎలుగెత్తి అరిచింది.

ఎలుక హడావిడి చూసి కోడిపుంజుకు చిర్రెత్తుకువచ్చింది.

‘అయితే ఏమిటట. బోను తెస్తే భయపడాల్సింది నువ్వు. మాకెందుకు భయం?’ అంటూ కొక్కొరోకో అనబోయి ఇంకా తెల్లవారలేదన్న సంగతి గుర్తుకొచ్చి వూరుకుంది. ఇంత పెద్ద కబురు తెస్తే కోడి పుంజు అలా గాలి తీసినట్టు తేలిగ్గా తీసిపారేయటం చూసి చిట్టెలుక చిన్నబుచ్చుకుంది. పక్కనే పడుకున్న పంది దగ్గరకు వెళ్లి తన కడుపులోమాట చెప్పి బావురుమంది. పంది ఎలుకను ఓదార్చింది. బోను గురించి భయపడాల్సిన పని తనకు లేదని అంటూ ఎలుక క్షేమం కోసం ప్రార్ధనలు చేస్తానని హామీ ఇచ్చింది.

ఎలుక అంతటితో వూరుకోకుండా దోవలో కనబడ్డ ఎద్దుకు బోను విషయం చెప్పి ‘అందరం కలసి ఏదో చెయ్యకపోతే అందరికీ మూడుతుందని’ హెచ్చరించింది.

ఎద్దు దానికి సమాధానంగా ‘ఓసి పిచ్చిమొద్దూ . రైతు ఎలుక బోను తెచ్చాడని నేను కంగారు పడితే అర్ధం ఏమిటి. అందులో నా కాలి గిట్ట కూడా పట్టదు’ అని ఎగతాళి చేసింది.

ఇక ఎలుకకు ఏమి చేయాలో తెలియక ఇంటి దారిపట్టింది.

ఆ రాత్రి రైతు ఇంట్లో పెద్ద శబ్దం వినిపించింది. ఎలుకల బోను హటాత్తుగా మూసుకోవడంతో వచ్చిన చప్పుడు అది. రైతు భార్య లేచి బోను వద్దకు వెళ్ళింది. చీకట్లో అందులో ఏదో చిక్కుకున్న సంగతి లీలగా బోధపడింది. తీరా చూస్తే అది ఒక విష సర్పం. దాని కాటుకు రైతు భార్య స్పృహ కోల్పోయింది. వెంటనే వూళ్ళో వైద్యుడిని పిలుచుకు వచ్చారు. అతడేదో మందువేసి నీరసంగా వున్న రైతు భార్యకు ఏదయినా బలవర్ధక ఆహారం పెట్టమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.

రైతుకు పొలంలో వున్న కోడిపుంజు గుర్తుకు వచ్చి దానిని కోసి భార్యకు ఆహారంగా ఇచ్చాడు.

విషయం తెలుసుకున్న ఇరుగూ పొరుగూ చూడడానికి వచ్చారు. వారిలో కొందరు ఆమెను కనిపెట్టుకు చూడడానికి అక్కడే వుండిపోయారు. వారికోసం రైతు పందిని కోసి వండక తప్పలేదు.

కానీ, దురదృష్టం. వైద్యుడు ఇచ్చిన ఔషధం కన్నా విషం బాగా పని చేసి రైతు భార్య ఆ మరునాడు కన్నుమూసింది.

ఆమె కర్మకాండకు ఎంతో దూరం నుంచి చుట్టపక్కాలు వచ్చారు. వారికి వొండి పెట్టడానికి రైతు ఎద్దును కోయాల్సివచ్చింది.

ఈ పరిణామాలన్నింటినీ ఎలుక తన కలుగులోనుంచి గమనిస్తూ తన తోటివారు ఒక్కొక్కరే కనుమరుగు కావడం చూసి ఎంతో బాధపడింది.

ఒక విదేశీ జానపద కధాంశం ఆధారం అయిన ఈ చిట్టెలుక కధలో నీతి ఏమిటంటే –

‘ఎవరయినా ఏదయినా సమస్యలో చిక్కుకుని మన వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్య మనది కాదని తప్పుకోవడం మంచిది కాదు. సంఘ జీవనంలో వున్నప్పుడు అందరి సమస్యలు అందరివీ అనుకోవాలి.’

(10-08-2011)

8, ఆగస్టు 2011, సోమవారం

కలగంటి కలగంటి

కలగంటి కలగంటి




'నిన్న కలలో ఒక పెద్ద తప్పు చేసాను"

జాక్ స్టీవన్స్ తన మిత్రుడితో బాధ పడుతూ చెప్పాడు.

'కలలో తప్పు చేసావా? అదెలా!' ఆశ్చర్యపోతూ అడిగాడు స్నేహితుడు.

'కలలో వాటికన్ వెళ్లాను. పోప్ తన చేతులతో స్వయంగా నాకు తేనీరు కలిపి తీసుకువచ్చారు. ఇలాగే తాగుతావా? వేడి చేసి తీసుకురానా అని అడిగారు. నేనలాగే తాగి ఉండవచ్చుకదా. వేడిచేసి తెమ్మన్నాను. ఆయన వెచ్చబెట్టి తెచ్చేలోగా మెలకువ వచ్చేసింది.' బాధ పడ్డాడు స్టీవన్స్.

చాలామంది ఇంతే.

కలలోకూడా తమ గుణం మార్చుకోరు.

7, ఆగస్టు 2011, ఆదివారం

గాయత్రి మంత్రం - భండారు శ్రీనివాసరావు


గాయత్రి మంత్రం - భండారు శ్రీనివాసరావు   

(గాయత్రీ మంత్ర ప్రాశస్త్యం గురించి గతంలో సేకరించి అందించిన సమాచారం పట్ల చాలామంది పాఠకులు సహృదయంతో స్పందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరికొన్ని అదనపు వివరాలు, విశేషాలు వెల్లడించే ప్రయత్నంలో భాగమే ఇది. మరో విషయం. ఈ రోజు ఆగస్టు ఏడో తేదీ నా 66 వ పుట్టినరోజు. పుణ్యం పురుషార్ధంగా భావించి ఈ అంశం ఎన్నుకున్నాను. ఎక్కడయినా ముద్రారాక్షసాలు కనబడితే  దయచేసి నన్ను క్షమించకండి.)

గాయత్రి మంత్రము.

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

ప్రప్రధమంగా ఋగ్వేదంలో పేర్కొన్న ఈ పవిత్ర మంత్రం ఒక్కో దేవత పేరుతొ ఒక్కోరకంగా ప్రవచించబడింది.

దేవతలు – గాయత్రీ మంత్రాలు



1. అగ్ని గాయత్రి : ఓం మహా జ్వాలాయ విద్మహే

అగ్ని దేవాయ ధీమహి తన్నో అగ్ని: ప్రచోదయాత్

2. ఇంద్ర గాయత్రి : ఓం సహస్ర నేత్రాయ విద్మహే

వజ్ర హస్తాయ ధీమహి తన్నో ఇంద్ర: ప్రచోదయాత్

3. కామ గాయత్రి: ఓం కామదేవాయ విద్మహే

పుష్పబాణాయ ధీమహి తన్నోనంగ: ప్రచోదయాత్

4. కృష్ణ గాయత్రి : ఓం దేవకీ నందనాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ: ప్రచోదయాత్

5. గణేశ గాయత్రి : ఓం ఏకదంష్ట్రాయ విద్మహే

వక్రతుండాయ ధీమహి తన్నో దంతి: ప్రచోదయాత్

6. గురు గాయత్రి : ఓం సురాచార్యాయ విద్మహే

వాచాస్పత్యాయ ధీమహి తన్నో గురు: ప్రచోదయాత్

7. చంద్ర గాయత్రి : ఓం క్షీర పుత్రాయ విద్మహే

అమృతతత్వాయ ధీమహి తన్నోశ్చంద్ర: ప్రచోదయాత్

8. తులసీ గాయత్రి : ఓం శ్రీ తులస్యై విద్మహే

విష్ణు ప్రియాయై ధీమహి తన్నో బృందా: ప్రచోదయాత్

9. దుర్గా గాయత్రి : ఓం గిరిజాయై విద్మహే

శివ ప్రియాయై ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్

10. నారాయణ గాయత్రి : ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణః ప్రచోదయాత్

11. నృసింహ గాయత్రి : ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే

వజ్ర నఖాయ ధీమహి తన్నో నృసింహ: ప్రచోదయాత్

12. పృధ్వీ గాయత్రి : ఓం పృధ్వీదేవ్యై విద్మహే

సహస్రమూర్త్యై ధీమహి తన్నో పృధ్వీ ప్రచోదయాత్

13. బ్రహ్మ గాయత్రి : ఓం చతుర్ముఖాయ విద్మహే

హంసారూడాయ ధీమహి తన్నో బ్రహ్మ: ప్రచోదయాత్

14. యమ గాయత్రి : ఓం సూర్యపుత్రాయ విద్మహే

మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్

15. రాధా గాయత్రి : ఓం వృష భానుజాయై విద్మహే

కృష్ణ ప్రియాయై ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్

16. రామ గాయత్రి : ఓం దాశరధాయ విద్మహే

సీతావల్లభాయ ధీమహి తన్నో రామ: ప్రచోదయాత్

17. లక్ష్మీ గాయత్రి : ఓం మహాలక్ష్మేచ విద్మహే

విష్ణు ప్రియాయై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్

18. వరుణ గాయత్రి : ఓం జలబింబాయ విద్మహే

నీల పురుషాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్

19. విష్ణు గాయత్రి : ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు: ప్రచోదయాత్

20. శని గాయత్రి : ఓం కాకధ్వజాయ విద్మహే

ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్

21. శివ గాయత్రి : ఓం పంచవక్త్రాయ విద్మహే

మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్

22. సరస్వతీ గాయత్రి : ఓం సరస్వత్యై విద్మహే

బ్రహ్మ పుత్ర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్

23. సీతా గాయత్రి : ఓం జనక నందిన్యై విద్మహే

భూమిజాయై ధీమహి తన్నో సీతా: ప్రచోదయాత్

24. సూర్య గాయత్రి : ఓం భాస్కరాయ విద్మహే

దివాకరాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్

25. హనుమద్గాయత్రి : ఓం అంజనీ సుతాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి: ప్రచోదయాత్

26. హయగ్రీవ గాయత్రి : ఓం వాగీశ్వరాయ విద్మహే

హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవః ప్రచోదయాత్

27.హంస గాయత్రి : ఓం పరమహంసాయ విద్మహే

మహాహాంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్

(గాయత్రి గురించి ఋషిపుంగవుల ప్రశంసలు మరో సారి)

(07-08-2011)

6, ఆగస్టు 2011, శనివారం

సోనియా తరువాత ఎవరు ? – భండారు శ్రీనివాసరావు

సోనియా తరువాత ఎవరు ? – భండారు శ్రీనివాసరావు

(06-08-2011 తేదీ సూర్య దినపత్రిక లో ప్రచురితం)


దేశంలోని మీడియా సంస్తలన్నీ ముక్కున వేలేసుకోవాల్సిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది నిన్న పార్ల మెంట్ హౌస్ లో విలేఖరులకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘ప్రస్తుతం సోనియా ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యకు శస్త్ర చికిత్స అవసరమన్న డాక్టర్ల సలహా మేరకు సోనియా విదేశాలకు వెళ్లారు. రెండు మూడు వారాలపాటు ఆమె అక్కడే వుండవచ్చు. ఆమె లేని సమయంలో పార్టీ వ్యవహారాలను నిర్వహించేందుకు సోనియా నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, జనార్ధన్ ద్వివేదీ,అహ్మద్ పటేల్ వుంటారు” అన్నది ఆ ప్రకటన సారాంశం.

‘వైద్య సంబంధమయిన అంశాల్లో ప్రముఖుల గోప్యతకు గౌరవం ఇవ్వడం సముచితం’ అని కూడా ద్వివేదీ కోరినందువల్ల సోనియా అనారోగ్యానికి సంబంధించి వూహాగానాలకు పోవడం సబబు కాదు. కానీ, సోనియా సాధారణ వ్యక్తి కాదన్న విషయాన్ని ఈ సందర్భంలో గమనంలో వుంచుకోవాలి. ఆమె ఈ దేశాన్ని పాలిస్తున్న యూ.పీ.ఏ. అధినేత్రి. ఆ యూ.పీ.ఏ. ను శాసిస్తున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు. వ్యక్తిగత గోప్యత ముసుగులో అంతటి ప్రాధాన్యం కలిగిన వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా నొక్కిపెట్టడం ఏ కోణంలో నుంచి చూసినా సమంజసమనిపించుకోదు.

ద్వివేదీ ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చేదిగా కూడా వుంది. శస్త్ర చికిత్స విజయవంతమయిందనీ, ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్తితి సంతృప్తికరంగా వుందని చెప్పిన ద్వివేదీ ఆ వెనువెంటనే మాట మార్చి ఆమెకు ఆపరేషన్ ఇంకా జరగలేదనీ, రెండు మూడు రోజుల్లో చేసే అవకాశం వుందని పేర్కొనడం అనేక ఊహాగానాలకు ప్రాణం పోసింది.

సోనియా అనారోగ్యానికి సంబంధించి అనేక కధనాలు మీడియాలో మొదలయ్యాయి. వాటిల్లో నిజానిజాల ప్రసక్తి అటుంచి సోనియా త్వరగా కోలుకోవాలనే అందరూ ఆకాంక్షిస్తారు. అయితే సోనియా ఆరోగ్యానికి సంబంధించి అవసరమయిన దానికన్నా ఎక్కువ గోప్యతను పాటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించదలచుకున్నదన్నదే అసలు ప్రశ్న. సోనియా పరోక్షంలో ఆమె బాధ్యతలను నెత్తిన పెట్టుకున్న నలుగురు సభ్యుల బృందం నుంచి కూడా దీనికి సరయిన సమాధానాన్ని ఆశించే పరిస్తితి వుందనుకోలేము.

గత కొద్ది రోజులుగా సోనియా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్టు కొన్ని పత్రికల్లో వార్తలు వస్తూనే వున్నాయి. కానీ అమెరికాకు వెళ్లి హడావిడిగా శస్త్ర చికిత్స చేయించవలసినంత అనారోగ్యంతో ఆమె బాధ పడడంలేదని అంతా భావిస్తూ వచ్చారు. అవసరమయితే తప్ప బహిరంగ వేదికలమీద కనిపించే వ్యక్తి కాదు కనుక ఆమె అనారోగ్యానికి సంబంధించి వార్తలు బయటపడలేదని అనుకోవచ్చు. కానీ, ఆమె అధ్యక్షురాలిగా వున్న కాంగ్రెస్ పార్టీని ఇటీవలి కాలంలో అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మన్మోహన్ అధికారనివాసంలో వారానికి అనేక పర్యాయాలు పార్టీ కోర్ కమిటీ సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. సోనియా కూడా ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నట్టు సమాచారం. తీవ్రమయిన అస్వస్తతతో బాధ పడుతున్న పక్షంలో ఈ మీటింగులకు రావడం సాధ్యం కాదు. ఒకవేళ వస్తుంటే, మిగిలిన కోర్ కమిటీ సభ్యులకు తెలియకుండా విషయాన్ని దాచడం కొన్నాళ్ళ వరకే సాధ్యం. కానీ, వాళ్ళల్లో ఎవ్వరూ సోనియా ఆరోగ్యానికి సంబంధించి ఏనాడూ పెదవి విప్పిన దాఖలా లేదు.

దీన్నిబట్టి సోనియా ఆరోగ్య పరిస్తితి గురించి ఆమె నియమించుకున్న కోటరీలోని వారికి ఎంతో కొంత సమాచారం తెలిసివుంటుందనే అనుకోవాలి. అందుకే తెలంగాణా గురించిన ప్రసక్తి వచ్చినప్పుడు ‘రెండు మూడు మాసాల వ్యవధానం’ అనే మాట ప్రస్తావించడానికి కూడా ఇదొక కారణం అయివుండాలి.

కాకపొతే, సోనియాతో తమకు అత్యంత సాన్నిహిత్యం వుందని చెప్పుకునే రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవ్వరికీ సోనియా అనారోగ్యం గురించి ముందస్తుగా తెలిసి వుంటుందనడానికి ఆధారాలు కానరావడంలేదు. గురువారం నాడు పార్టీ విప్ ను సయితం ధిక్కరించి పార్ల మెంట్ సమావేశాలకు టీ కాంగ్రెస్ సభ్యులు హాజరు కాకపోవడం, సోనియా గాంధీ అనారోగ్యం గురించి మీడియాలో వార్తలు రావడం మొదలయిన ఉత్తర క్షణం నుంచి వారి వైఖరిలో మార్పు వస్తున్న సంకేతాలు రావడం – ఈ వాదనను బలపరుస్తున్నాయి. సోనియా అనారోగ్యం నేపధ్యంలో పార్టీని మరింత ఇబ్బంది పెట్టకుండా సోమవారం నుంచి సభకు హాజరు కావాలని వారు నిర్ణయించుకున్నట్టు వెలువడ్డ సమాచారాన్ని బట్టి కూడా వారికి ఏమీ తెలియదని అనుకోవాల్సివస్తోంది.

సోనియా అనారోగ్యం విషయం బయటకు పొక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని అనుకోవడానికి మరికొన్ని ఆధారాలు వున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభకు ఎన్నికయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు – ఆ సమయంలో సభలో సోనియా గాంధీ కానీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ లేకపోవడం మీడియా దృష్టిని దాటిపోలేదు. కానీ, రాజకీయ వైరుధ్యాల కారణంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో వారిరిరువురూ సభలో లేకుండా జాగ్రత్త పడ్డారని అనుకున్నారు కానీ, అప్పటికే సోనియా గాంధీ అమెరికా చేరుకున్న సంగతిని ఎవరూ పసికట్టలేకపోయారు. ప్రతి చిన్న విషయానికి బ్రేకింగ్ న్యూస్ లతో ఆదరగొడుతూ, తామే ముందు అని వూదరగొట్టే టీవీ చానళ్ళు సోనియా అమెరికా వెళ్ళిన సంగతి పట్టుకోలేకపోవడం విచిత్రం అనిపిస్తుంది. విదేశానికి వెళ్ళబోయే ముందు సోనియా ఏర్పాటుచేసినట్టు చెబుతున్న ఈ కమిటీలో పార్టీలో కాకలుదీరిన సీనియర్లను కాదని మరో నలుగురిని ఎంపిక చేసిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఈ నలుగురిలో రాహుల్ గాంధీ పేరు జాబితాలో ముందు వుండడం మరికొన్ని వూహాగానాలకు వూతమిచ్చేదిగా వుంది. తన పరోక్షంలో పార్టీ వ్యవహారాలను చూడడానికి నియమించిన కమిటీలో ప్రధమ సభ్యుడు, ప్రధాన సభ్యుడు అయిన రాహుల్ గాంధీ తల్లి సోనియా వెంట అమెరికా వెళ్ళిన బృందంలోనే వున్నారు. పైగా, పార్టీ ప్రెసిడెంట్ తరువాత కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ స్తానం ఎవ్వరిది అంటే అనేక దశాబ్దాలనుంచి తటాలున గుర్తువచ్చే ప్రణబ్ ముఖర్జీకి ఇందులో స్తానం కల్పించకపోవడం సరికొత్త వూహాగానాలకు వూపిరిపోస్తోంది. ఈ కమిటీ కేవలం పార్టీ వ్యవహారాలను చూసేందుకు నియమించింది కాబట్టి మంత్రులకు స్తానం కల్పించలేదని అనుకుందామంటే ఇందులో రాహుల్ తరువాత పేరు మరో కేంద్ర మంత్రి ఆంటోనీదే కావడం అంతుబట్టని విషయం.

ప్రణబ్ అంత స్తాయి కాకపోయినా ఆంటోనీ కూడా కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. సచ్చీలుడు, నిరాడంబరుడు అవినీతి మరకలు అంటని రాజకీయ నాయకుడని పేరు. యువకుడయిన రాహుల్ కు సరయిన మార్గ నిర్దేశనం చేయడానికి ఆంటోనీ వంటి నాయకుడు అవసరమని సోనియా భావించి వుండవచ్చు.

సోనియా తరువాత పార్టీలో ఎవరి స్తానం ఏమిటి అన్న ప్రశ్నకు ఆమె పరోక్షంగా ఇచ్చిన సమాధానం ఈ కమిటీ నియామకం అనుకోవాలా ? అలా అనుకుంటే పార్టీ పగ్గాలు ఎవరి చేతిలోకి రాబోతున్నాయన్నది అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. కాకపొతే, అప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడున్న పద్ధతిలో నడుస్తాయని అనుకోవడానికి మాత్రం వీలుండదు.

(05-08-2011)

5, ఆగస్టు 2011, శుక్రవారం

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు


మొన్న రాత్రి మహా టీవీలో ఏదో చర్చకు పిలిస్తే వెళ్లాను. తెలకపల్లి రవి గారు, ఘంటా చక్రపాణి గారు కూడా వచ్చారు. ప్రోగ్రాం మధ్యలో అనివార్యంగా వచ్చే ‘విరామ సమయం’లో రవి – మాటల మధ్య ప్రసిద్ధ రష్యన్ రచయిత చెఖోవ్ రాసిన ఓ చిన్న కధ చెప్పారు.

‘గుర్రబ్బండి నడుపుతూ పొట్టపోసుకునే ఒక వృద్ధుడు ఈ కధలోని ప్రధాన పాత్ర. ఆ రోజు ఉదయమే అతడి కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. అంత దుఃఖంలో కూడా బండి నడపక పోతే పొట్ట గడవని స్తితి అతనిది. తన బండి ఎక్కినవాళ్లకు కుమారుడి మరణ వార్త చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా వాళ్లు అడ్డంపడుతుంటారు. ఎందుకంటె ఈ పాడు ప్రపంచంలో ఎవడి గోలవాడిది. తన కష్ట సుఖాలు పక్కవాడితో పంచుకోవాలనే ఆత్రుత తప్ప ఎదుటివాడి బాధ ఏమిటో ఎవరికీ పట్టదు. చివరికి, ఎవరికీ తన కడుపులోని దుఖం చెప్పుకోకుండానే ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. కొష్టంలో గుర్రాన్ని కట్టివేస్తూ పిల్లవాడి చావు కబురు దాని చెవిలో వేసి కడుపులో భారం దించుకుంటాడు.’

చెఖోవ్ ఈ కధ రాసి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మనుషుల మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులేదు.

టీవీల్లో జరిగే చర్చలే దీనికి మంచి ఉదాహరణ. ఎవరికి వారు తమ వాదం వినిపించాలని ప్రయత్నిస్తారే తప్ప ఇతరులమాట వినిపించుకోరు. అందరికీ అన్నీ తెలియాలన్న రూలేమీ లేదు. తెలియంది తెలుసుకుంటే పోయేదీ లేదు. అనవసరమయిన ఈ అభిజాత్యం అవసరమా ? ఎవరికివారే తెలుసుకోవాలి.(05-08-2011)