23, ఆగస్టు 2010, సోమవారం

విన్నంతలో – కన్నంతలో అమెరికా - 3 భండారు శ్రీనివాసరావు


“అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల - శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలూ చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ‘ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను.

ఓవల్ ఆఫీస్
 ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని నాలో నేనే ఏదో వూహించుకుని ఆ విషయమే నా వెంట వచ్చిన ఆ తెల్ల పిల్లతో అన్నాను. పెద్ద వయస్సులేని ఆ అమ్మడు చిరునవ్వు నవ్వి ఇలా అంది. “ మీ ఊహల్నిఅలా అంతంత దూరం పోనివ్వకండి. ఆ ఎర్ర బటన్ నొక్కితే ప్రెసిడెంట్ కి కాఫీ కావాలని అర్ధం. పచ్చ బటన్ నొక్కితే బర్గర్ కూడా తీసుకు రావాలని సంకేతం.”
తెలియని విషయాలను గురించి మామూలుగా  మామూలు మనుషులు వూహించుకునే తీరుతెన్నులపై - ఓ నలభై ఏళ్ళక్రితం చదివిన ఈ జోక్ – సియాటిల్ లోని -  ‘లేక్ వాషింగ్టన్’ (సరస్సు) లో ఓ ఆదివారం నాడు పెద్ద మర బోటులో విహరిస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. విశాలమయిన ఈ మంచినీటి సరస్సు కొన్ని మైళ్ల దూరం విస్తరించి వుంది.

లేక్  వాషింగ్టన్ లో నౌకావిహారం

నౌకావిహారంలో భాగంగా ఒక లేడీ గైడ్ - చుట్టుపక్కల విశేషాలను మా అందరికీ ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తూ - “అదిగో ఆ వొడ్డుపై చెట్ల గుంపు వెనక కనిపిస్తున్న సౌధాన్ని చూడండి. యావత్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడయిన వ్యక్తి అక్కడ నివసిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భవనం అది “ అని చెబుతూ అందులోని విశేషాలను వర్ణించడం మొదలు పెట్టింది.

సాఫ్ట్ గేట్స్

బిల్ గేట్స్ నెలసరి ఆదాయం – సరిగ్గా చెప్పాలంటే చేసే వ్యాపారంలో అన్ని ఖర్చులు పోను మిగిలే నికర లాభం అన్నమాట – కొన్ని వందల కోట్లు వుంటుందని అంచనా. ఇంత డబ్బుగల ఆసామీ ఇల్లు ఎంత గొప్పగా వుంటుందో అని వూహించుకోవడం సహజమే మరి. ఆ లేడీ గైడ్ చేయి చాపి చూపినవైపు చూపు సారించి చూస్తే - దూరంగా తీరం, ఎత్తయిన వొడ్డు, దానిపై వత్తుగా మరింత ఎత్తయిన వృక్షాలు, వాటి కొమ్మల మధ్య లీలగా కానవచ్చే ఓ భవనం – ఓస్ ఇంతేనా అనిపించింది.

దూరపు కొండలు నునుపు కాదు

 కానీ లేడీ గైడ్ చెప్పే విశేషాలు మాత్రం ఇన్నీ అన్నీ కాదు మరి
పాత కొత్తల మేలుకలయికగా ఆ ఇంటిని డిజైన్ చేసారని చెబుతారు.

పాత చింతకాయ కాదు - ఖరీదు చూస్తే కోట్లలోనే

సోఫాలు,కుర్చీలు,మంచాలు ఇలాటివన్నీ చాలా పాత కాలానికి చెందిన ‘యాంటిక్ ఫర్నిచర్’ గా కనిపిస్తాయి. ఇతర ఉపకరణాలన్నీ భవిష్యత్ తరానికి తగ్గట్టుగా రూపొందించారు. అవి చూసినా విన్నా ‘అదరహో’ అనాల్సిందే.
యావత్ ప్రపంచానికే టెక్నాలజీ సమకూర్చి పెట్టినవాడికి తన ఇంటిని ఒక ‘సాంకేతిక అద్భుతం’గా తీర్చిదిద్దుకోవడం పెద్ద విశేషమేమీ  కాకపోవచ్చు. కానీ కనే వారికీ, వినే వారికీ ఆ నివాసం వింతల్లో వింతే.

మాయామహలుకు దారి
ఇంటికి వచ్చే అతిధులకు ఓ రకం చిప్ అమర్చిన బ్రేస్లేట్ ఇస్తారు. అంటే దేశ దేశాల్లోని వారెవరయినా వారిని కాంటాక్ట్ చేయాలనుకుంటే వేరే ఫోన్లు, సెల్ ఫోన్లు అవసరం లేదు. ఆ అతిధి యే గదిలో వుంటే ఆగదిలో అతడికి అతి దగ్గరలో వున్న ఫోనుకి ఆ ’ కాల్’ ’ కనెక్ట్ అవుతుంది. మరో విశేషం ఏమిటంటే- బయటనుంచి వచ్చిన అతిధి శరీర తత్వానికి తగినట్టుగా అక్కడి ఉష్ణోగ్రతలు మారిపోతుంటాయి. అంటే, వెచ్చదనం కావాలనుకునే వారికి అందుకు తగినట్టుగానూ, చల్లదనం కోరుకునేవారికి అందుకు అనుగుణంగానూ - ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది.

గోడలా అవి కావు   రసరమ్య కుడ్యాలు

 అక్కడి పెయింటింగులు కూడా వచ్చినవారి అభిరుచులకు అనుగుణంగా మారిపోతుంటాయి. పికాసా పెయింటింగులు కోరుకునేవారికి అవే కనిపిస్తాయి. అదే సమయంలో రవివర్మ చిత్రాలు ఇష్టపడేవారికి అవే కనువిందు చేస్తాయి. మాయాబజారు సినిమా చూస్తున్నట్టు వుంది కదూ ఇవన్నీ వింటుంటే.

యద్దనపూడి సులోచనారాణి నవలలలో  కలల హీరో కారు ఇతడి స్వంతం

బిల్ గేట్స్ నివాసం వున్న ప్రాంతం సియాటిల్ లో అతి ఖరీదయిన క్లయిడ్ హిల్ ఏరియా . అంత సంపన్నుడి ఇరుగూ పొరుగూ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత వుండడం సహజం.  అతగాడెవరో కాదు,  ఒక సాధారణ పిజియో తెరపిస్ట్ అంటే నమ్మగలరా!  గేట్స్ నివాసం పక్కనే ఇల్లు కొనుక్కోవడం  అతగాడికి ఇది ఎలా సాధ్యమయిందంటే-  బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్ సంస్త పెట్టిన కొత్తల్లో అందులో  కొన్ని షేర్లు కొన్నాడు.  కాలక్రమేణా  ఆ షేర్లు ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా  పెరిగిపోయాయి. దానితో ఆ మామూలు డాక్టర్ కాస్తా- కోరిన కోరికలు తీర్చుకోగల పెద్ద  ఆసామీ అయిపోయాడు. యెంతో డబ్బు గుమ్మరించి  బిల్ గేట్స్ పొరుగునే ఇల్లు కొనుక్కుని కాలర్ ఎగరేసుకుని కాపురం ఉంటున్నాడు..
అంతేకాదు – బిల్ గేట్స్   మైక్రోసాఫ్ట్ పెట్టిన తొలి రోజుల్లో ఆయన ఆహ్వానంపై  అందులో చేరిన సిమోనీ అనే హంగేరియన్ అమెరికన్ జీవితంలో  ఎంతగా ఎదిగి పోయాడంటే , అతడు వందల కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కుని రెండు సార్లు అంతరిక్షం లోకి వెళ్లి రాగల సంపన్నుడయ్యాడు.
అదీ మైక్రో సాఫ్ట్ షేర్ల మహాత్మ్యం అంటే.

 కాకపొతే గత రెండు మూడేళ్లుగా ఆ షేర్లలో పెద్ద ఎదుగుదల కనబడడం లేదని షేర్ సింగ్ లు అంటుంటారు. అయితే, దానితో మీ లాటి వారికీ, నాలాటి వారికీ ఎంతమాత్రం సంబంధం లేదనుకోండి. – భండారు శ్రీనివాసరావు

NOTE : Images in the blog are copy righted to respective owners

22, ఆగస్టు 2010, ఆదివారం

విన్నంతలో – కన్నంతలో అమెరికా –2 - భండారు శ్రీనివాసరావు

అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా యెంత’ అని అడిగితే  'తొమ్మిదివేల'ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి -  ‘రెండువేల ఏడో సంవత్సరం జులై నాటి తాజాలెక్కల  ప్రకారం 'అక్షరాలా తొమ్మిది వేల నూట  తొంభయి రెండు’ అని బల్లగుద్ది మరీ  చెబుతాడు.
మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ – హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ - పలకడం మాత్రం డెల్-హై అనే.
ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశం లోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క డిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది. అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ అమెరికాతో ‘ఉప్పూ నిప్పూ’ వంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటె దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ఈ మాదిరిగానే లండన్,బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు ఈ దేశంలోని పట్టణాలకు వున్నాయి.

లీవెన్  వర్త్ లో కుటుంబ సభ్యులతో రచయిత (ఎడమనుంచి రెండో వ్యక్తి)   

వాషింగ్టన్ స్టేట్ (అమెరికా రాజధాని వేరు- ఆ దేశపు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు) లో లీవెన్ వర్త్ అనే ఒక టూరిస్ట్ పట్టణం వుంది. జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి.వేనాచీ నదీ తీరంలోని ఈ లీవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి.

బవేరియన్ సంస్కృతి ఉట్టిపడే నిర్మాణాలు

ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి- తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
ఆహ్లాద వీధులు
స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా ‘సాస్’ లను మచ్చుకు రుచి చూపిస్తారు. వైన్ వంటివాటిని అనేక పర్యాయాలు రుచి చూస్తూ కాలక్షేపం చేసేవారిని - ఇక్కడ ఒక రకం ‘సాస్’ (మిరపకాయల రసం తో తయారు చేస్తారు) దిమ్మదిరిగేలా చేయడం కళ్ళారా చూసాము. అదేమిటో , దాన్ని ఎలా తయారు చేసారో తెలియదు కానీ – ఒక్కటంటే ఒక్కచుక్క నాలిక తాకగానే - శరీరం ఆపాదమస్తకం నిలువునా దహించిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది రుచి చూసి గింగిరాలు తిరిగిపోతున్నవారిని చూస్తుంటే మన వైపు ‘గుంటూరు మిరప ఘాటు’ మించిన పదార్ధం వుందనిపించింది. ఒక సీసా కొనుక్కువచ్చాము కానీ రుచి చూసే సాహసం మాత్రం చేయలేదు.

డిసెప్షన్ ఫాల్స్

సియాటిల్ తిరిగివస్తున్నప్పుడు త్రోవలో దట్టమయిన అడవుల నడుమ ‘డిసెప్షన్ ఫాల్స్’ అనే ఒక జలపాతం చూసాము. చూడడానికి చిన్నదే కానీ ఆ జలపాతం నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ఉరవడి మాత్రం చాలాఎక్కువ. బలిష్టమయిన ఏనుగులు కూడా ఆ వేగాన్ని తట్టుకుని నిలబడలేవని చెబుతారు. రోడ్డుపక్కన తాటిప్రమాణం చెట్ల నడుమ నుంచి కిందికి దిగి వెడితే ఇది కనిపిస్తుంది. అంతటి కారడవిలో కూడా టూరిస్టులకు అవసరమయ్యే సదుపాయాలూ కల్పించిన తీరు అమోఘం. ప్రసంశనీయం.

NOTE:All images in the blog are copy righted to the respective owners

21, ఆగస్టు 2010, శనివారం

విన్నంతలో - కన్నంతలో అమెరికా - 1 - భండారు శ్రీనివాసరావు

  
పసిఫిక్ తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారివెంట వెడుతుంటే చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు కానవస్తూనే వుంది.

పసిఫిక్ తీరంలో

వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్  నుంచి  ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు  చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టుకింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము.డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల – కార్లో వున్న జీ పీ ఎస్  సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము. మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని  ఇంటి ముందువున్న  ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి  తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.

'ఏ హోం ఎవే ఫ్రం హోం'  

 మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది.  పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్,  అతి పెద్ద ప్లాస్మా టీవీ,  ఫైర్ ప్లేస్,  సోఫాలు వున్నాయి.  పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో ‘హాట్ టబ్’ ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి. స్నాన పానాదులు ముగించుకుని డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ- అతిదగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము.

నిజం కాదు బొమ్మ షార్క్

 పసిఫిక్ మహా సముద్రం అంటే శాంతిసముద్రమని చదువుకున్నట్టు గుర్తు. కానీ, ‘ఈ పాయింట్ దాటి వెళ్ళవద్దు. అతి పెద్ద అలలు హటాత్తుగా పైనబడే అవకాశం వుంది.’ అనే హెచ్చరిక బోర్డు కనిపించింది. సునామీలు సృష్టిస్తున్న ప్రమాదాల నేపధ్యంలో ఇలాటి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని తెలిసింది. మేమున్న చోటికి కొన్ని మైళ్ల పరిధిలో ఫ్లారెన్స్, న్యూ పోర్ట్, లింకన్ సిటీ వంటి పట్టణాలు వున్నాయి. వున్న మూడు రోజులూ ఈ వూళ్ళన్నీ చూసాము. ఇవన్నీ టూరిస్ట్ రిసార్టులే. వారికి కావాల్సిన అన్ని వసతులూ పుష్కలంగా వున్నాయి. దేనికోసం వెదుక్కోవాల్సిన అవసరం వుండదు.

ఆక్వేరియంలో మాత్రం నిజం షార్కే

 ప్రతిచోట ఏదో ఒక ప్రత్యెక ఎట్రాక్షన్ . ఒకచోట సముద్ర గర్భంలో జలచరాల జీవనం ఎలావుంటుందో తెలియచెప్పే ఆరెగన్ స్టేట్  ఆక్వేరియం చూసాము.

కొండంత ఆనకొండ

 షార్కులు, డాల్ఫిన్ లు, ఆక్టోపస్ లు, ఆనకొండల మధ్య తిరుగుతూ పొద్దు తెలియకుండా గడిపాము.


జీ పీ ఎస్ సిస్టం పుణ్యమా అని దారి కోసం ఎవరినీ దేవులాడాల్సిన పని అంతకన్నాలేదు. కారు ఎక్కగానే వూరి పేరు, వీధి నెంబరు, ఇంటి నెంబరు, లేదా షాపు, రెస్టారెంట్ వివరాలు ఫీడ్ చేస్తే చాలు - ఎక్కడికక్కడే అది గైడ్ చేస్తూ దారి చూపుతుంటుంది. మాటల్లో పడి, దారి తప్పినా అది వెంటనే హెచ్చరికలు వినిపిస్తూ మరో ప్రత్యామ్నాయ మార్గం చెప్పి మళ్ళీ సరయిన దోవకు చేరేలా సూచనలు ఇస్తుంది. అందువల్ల యెంత తెలియని ప్రదేశానికి వెళ్ళినా ‘దారి తప్పే ప్రమాదం’ ఎంతమాత్రం వుండదు. అంతేకాదు, మార్గమధ్యంలో మరమ్మతుల నిమిత్తం కానీ మరో అవసరం కోసం కానీ ఎక్కడయినా రహదారులు మూసివేసినా లేక వాహనాలను దారి మళ్ళించాల్సివచ్చినా - ఆ తాజా సమాచారం కూడా అది గ్రహించి అప్పటికప్పుడు కొత్త దోవలను సూచించడం ఇందులోని మరో సౌలభ్యం.
లింకన్ సిటీ సముద్ర తీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.


అతి చిన్న నదిని చూద్దాం రండి

‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు.’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తె అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రం లో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు  కేవలం 440 అడుగులు. అంత ‘చిన్న’ నది వచ్చి కలుస్తున్నది దేనిలో?  సముద్రాలు అన్నింటిలో అతి పెద్దదయిన పసిఫిక్ మహాసముద్రంలో.  అది మరో విశేషం. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు. ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే – ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కాలు పెడితే గడ్డ కట్టెంత చల్లగా వుంటాయి.

మహా సంగమం

సియాటిల్ తిరిగి వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్ కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన ‘హేస్టాక్ రాక్’ ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ- సముద్రాన్ని చీల్చుకు పైకి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేసారు.  మేము వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.

హేస్టాక్  రాక్

 అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన విషయమే. వేలమంది దాన్ని చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా కానవచ్చింది. మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ ఆ తీరంలో పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు. ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో కనిపించారు.
చూసినవాటిని మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్  రోడ్డు ఎక్కాము.

(భండారు శ్రీనివాసరావు, 10-08-2010)

NOTE:All the images in the blog are copy righted to the respective owners.

20, ఆగస్టు 2010, శుక్రవారం

20-ఆగస్ట్ న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని - భండారు శ్రీనివాసరావు

20-ఆగస్ట్ న  రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని


అడవి బాటలో రాజీవ్ గాంధీ - (భండారు శ్రీనివాసరావు)

(వార్తల వెనుక కధ పుస్తకం నుంచి - ప్రచురణ- మార్చి -2007)




ఒకరు - సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.

గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం - ఎన్ టీ రామారావు గారి నాయకత్వంలో నడుస్తున్న రోజులాయె.

హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం - అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు గారు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు గారు అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేఖరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గ మధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలిపేరు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం - చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం - ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు కానీ ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది.

పైలట్ రాజీవ్

నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది.నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంట పట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్తిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే -

మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమవయిపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.

రాజీవ్ గాంధీ ఆయన కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు గారు, వెంగళరావు గారు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్(ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ ) - అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.

ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత - 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావు గారికి కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు - మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు గారు, వెంగళరావు గారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము- సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా.జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావుగారు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు గారు , సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్- అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.

అందరి ప్రాణాలు (అడవి) గాలిలో దీపాలు

అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా - రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా - నిబ్బరం కోల్పోకుండా - సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.

రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టూ గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి - అన్నం మెతుకులను పట్టి చూసి - ఆ పేదరాలి భుజంపై చేయి వేసి - సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిధి - దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో!

తర్వాత షరా మామూలే.- రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.
ఒక ప్రధాని-ఒక ముఖ్య మంత్రి- ఒక మాజీ ముఖ్య మంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి - మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.
(ఆనాటి ఆంద్ర జ్యోతి సంపాదకులు శ్రీ కె. రామచంద్రమూర్తి ,సీనియర్ జర్నలిష్ట్ శ్రీ కట్టా శేఖరరెడ్డి సంపాదకత్వంలో 2007 మార్చిలో వెలువరించిన 'వార్తల వెనుక కధ' అనే సంకలనం నుంచి)

NOTE:All images in the blog are copy righted to the respective owners.

18, ఆగస్టు 2010, బుధవారం

మితిమీరిన మీడియా ఉత్సాహం

సత్యం రామలింగరాజు ఆర్ధిక నేరాల ఆరోపణల ఉచ్చులో చిక్కుకుని అరెస్ట్ అయినప్పుడు


 – ఆ నాటి సత్యం సామ్రాజ్యానికి ‘షేర్ల’ రూపంలో పెట్టుబడులు పెట్టి ఆ తరవాత గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో - ఆరోజుల్లో నేను  రాసిన ఒక ఆర్టికిల్ – రాజు గారికి బెయిల్ దొరికిందని ఒక మిత్రుడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినప్పుడు గుర్తుకు వచ్చి దాన్ని పోస్ట్ చేస్తున్నాను. రాజు గారికీ నాకూ ఏవిధమయిన వ్యక్తిగత పరిచయం లేదన్న విషయం గమనంలో వుంచుకోవాల్సిందిగా మనవి – భండారు శ్రీనివాసరావు

మితిమీరిన మీడియా ఉత్సాహం








నిప్పులు చిమ్ము కుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు -

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేరాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరే!                     -శ్రీశ్రీ


ఒక మహావృక్షం కూకటి వేళ్లతో కూలిపోతున్న దారుణ దృశ్యం గతవారం విశ్వవ్యాప్తంగా ఆవిష్కృతమైంది.  శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్న లెక్కకు మిక్కిలి బుద్ధిజీవులు,  సమృద్ధిజీవులు, మాన్యులు, సామాన్యులు, లబ్ధిదారులు, ప్రారబ్ధదారులు ఆ విషాదాంతాన్ని మౌనంగా, జాలిగా, కసిగా, ఆగ్రహంగా, బరువెక్కిన గుండెలతో, చెమ్మగిల్లిన కళ్లతో గమనిస్తూ వచ్చారు. కొందరికిది కడుపుకోత. మరికొందరికి కడుపుమంట. కొందరిది వేదన. మరికొందరిది ఆవేదన.



ఏళ్ల తరబడి శిలా సదృశ్యంగా నిలబడి,  నిరంతర శ్రమతో,  నిర్విరామ కృషితో,  మొక్కవోని పట్టుదలతో-  ఆకాశం అంచులు తాకేలా నిర్మించుకున్న సువిశాల, సుందర సౌధం పునాదులు కళ్లెదుటే కదలిపోయాయి.


 `సత్యమైట్లు' గా -  సగర్వంగా చెప్పుకుంటూ, వర్తమాన సమాజంలో పరువుతో, పరపతితో నెగ్గుకొస్తున్న వేలాదిమంది యువతీ యువకుల కలలన్నీ వారి కనురెప్పల కిందే కరగిపోయాయి. నిన్నటివరకూ ఎదురులేని సత్యం. నేటికది  చెదిరిన స్వప్నం.

ఒక మెగా సంస్థ మహా పతనం గురించీ, దానికి కారణాలు గురించీ పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలతో, వార్తలతో, వార్తా కథనాలతో మీడియా రగిలించిన వేడి అంతా ఇంతా కాదు. సత్యం సంస్థ ఉత్థాన పతనాలకు కారకుడైన రామలింగరాజు కథ చంచల్‌గూడా జైలుకు చేరింది. ఈ పరిణామ క్రమాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఈ ఉదంతంలో దాగున్న మరో కోణాన్ని స్పృశించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఆర్ధిక నేరాలు మనదేశానికి కొత్తవేమీకాదు. నూతన ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇవి జరిగాయి. స్వతంత్ర భారతంలో స్వదేశీ నౌకా పరిశ్రమ ఆవిర్భావానికి, అభివృద్ధికీ ఆద్యుడూ, మూలకారకుడూ అయిన తెలుగుతేజం జయంతి షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థాపకుడు ధర్మతేజ చరిత్రే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

సత్యం రామలింగరాజును హర్షద్‌మెహతా, కృషి వెంకటేశ్వరరావు, కోలా కృష్ణమోహన్‌ వంటి వారితో ముడిపెట్టి వార్తాకథనాలు వెలువరించిన మీడియా అత్యుత్సాహం అర్థం చేసుకోలేని అధమస్థాయిలో ఉంది. సామాజిక సేవా కార్య కలాపాల విషయంలో కానీ, నిర్మాణాత్మక దక్షాదక్షతల విషయంలోకానీ, సిబ్బంది మంచి చెడులను కొసకంట కనిపెట్టి చూసేవిషయంలో కానీ -  రాజుకీ, వారికీ ఏమాత్రం సాపత్యం లేదు సరికదా నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆశ, అత్యాశ, దురాశల నడుమ ఉన్న అంతరాన్ని అర్ధం చేసుకోవడంలో విశ్లేషకులు విఫలమయ్యారు. ఆశ చచ్చినా, దురాశపుట్టినా ఆ మనిషి చచ్చిన వాడితో సమానమంటారు. పెంచి పెద్ద చేసిన సంస్థను కాపాడుకోవాలనే ఆత్రంతో, అత్యాశతో వేసిన అడుగు రామలింగరాజుదయితే, రెండో వర్గంవారిది దురాశతో కూడిన దుస్తర మనస్తత్వం.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఆ నేరాన్ని తమంతతాముగా, విచారణకు ముందే ఒప్పుకోవడం చాలా అరుదయిన విషయం. ఒక రకమైన విషవలయంలో చిక్కుకుపోయి మింగలేకా, కక్కలేకా డోలాయమానంలో కొట్టుకుంటుంటారు. అలాంటిది చేసిన దానికి, జరిగిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటూ, మరెవరి మీదా నెపం మోపకుండా, గరళం మింగిన శివుడిలా రామ `లింగ' రాజు జారీచేసిన `ఒప్పుకోలు' ప్రకటన ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. స్వయం నిర్మిత సువిశాల వ్యాపార సామ్రాజ్యం కళ్లెదుటే కుప్పకూలిపోతున్న స్థితిలో కూడా తన వద్ద పనిచేసే సిబ్బంది బాగోగులను గమనంలో ఉంచుకోవడం ఆయన స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం.


ఇక ఈ మొత్తం ఉదంతంలో రామలింగరాజుకూ, రాష్ట్రప్రభుత్వానికీ లంకెపెడుతూ వెలువడిన వార్తా కథనాలు పత్రికా విలువలకు తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. మితిమీరిన మీడియా ఉత్సాహం ఒక ప్రముఖ సంస్థ పతనాన్ని మరింత వేగిరం చేసింది. తప్పుదిద్దుకునే అవకాశాన్ని దూరం చేసింది.


 `బర్డు ఫ్లూ' వార్తలతో బెంబేలెత్తించి, లక్షలాది కోళ్ల సామూహిక సంహారానికి కారణమైన మీడియా, వేలాదిమంది సత్యం సిబ్బంది ప్రయోజనాలను కాపాడడానికి, తన సొంత ప్రయోజనాలను వదులుకోగలదని ఆశించడం అత్యాశే అవుతుంది.

అదే జరిగింది కూడా  

 ఇక వాటాదారులు విషయం అంటారా!
 మోసం చేసి డబ్బు సంపాదించాలనుకునే నేరగాళ్లకీ, జూదం ఆడి డబ్బు గడించాలనుకునే జూదగాళ్లకీ పెద్ద తేడాలేదు.

సత్యం షేరు ధర చుక్కల్లో ఉన్నప్పుడు ఆ వాటాలు కలిగిన బడాబాబులు ఎంతగా బడాయిలకు పోయారో అందరికీ తెలుసు. ఆడేది జూదం అయినప్పుడు ఆటుపోట్లకి కూడా సిద్ధంగా ఉండాలన్న విషయం కూడా వారు తెలుసుకోవాలి. లక్షలు కోల్పోయామని బాధపడేవారు లక్షణమైన సంస్థను తిరిగి ఎలా నిలబెట్టాలా అన్న విషయం ఆలోచించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది అదే. నేరాలు చేసిన వారిని విచారించి, నిర్ధారణ చేసే సంస్థలు వేరే ఉన్నాయి. కానీ, తెలుగు గడ్డపై పురుడుపోసుకుని, దిగంతాలకు ఒక వెలుగు వెలిగిన సంస్థ ఆరిపోకుండా చూసుకోవాలి. తమ తెలివితో, మేధస్సుతో ఒక మహా సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బంది భవితవ్యాన్ని కాపాడుకోవాలి. పుడమితల్లి నలుదిక్కులా తెలుగు వెలుగులను విస్తరించిన దీపం కొడిగట్టకుండా కనిపెట్టి చూడాలి. రాజకీయాలన్నవి ఆ పరిధికే పరిమితం కావాలి కానీ, తెలుగు యువత ఉజ్వల భవితకు రేచీకటిగా మారరాదు. ఆ దిశగా అడుగులు వేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.
 అంతేకానీ, ఎద్దుల పోట్లాటలో లేగదూడలు నలిగిపోకూడదు.

భండారు శ్రీనివాసరావు

NOTE:All the images in the blog are copy righted to the respective owners

17, ఆగస్టు 2010, మంగళవారం

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు


గూగుల్ ఇమేజ్ సెర్చ్ సర్ఫ్ చేసుంటే ఒక కార్టూన్ కనిపించింది.
 అందులో -



కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.

వర్తమాన ప్రపంచానికి – ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
ఎనభయ్యవ దశకంలో నేను మాస్కోలో వున్నప్పుడు వేల సార్లు విన్న పదం – ‘స్పసీబా’ – అంటే ఇంగ్లీష్ లో ‘థాంక్స్’ – మన తెలుగులో ‘ధన్యవాదాలు’. బహుశా ఈ పదం ఇంత పెద్దగా వుండడం వల్లనో ఏమో ఇది పలకడానికి జనం కొంత సంకోచిస్తున్నారనుకోవాలి.

పదం ఏ భాషలో అయినా భావం అదే 
 
రష్యన్లు - ఆ మాటకు వస్తే ప్రపంచం లోని అనేక దేశాలవాళ్ళు కృతజ్ఞతను బాహాటంగా వెల్లడిస్తుంటారు. అది వారి జీవన విధానంలో ఒక భాగమై పోయింది. పైకి వ్యక్త పరిస్తేనే కృతజ్ఞతా భావం వున్నట్టని చెప్పడం నా వుద్దేశ్యం కాదు. తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని ‘అన్నయ్యా ! చెల్లెమ్మా!’ అంటూ చెప్పుకునే డైలాగులు వింటే కంపరం కలుగుతుంది కానీ, వారి నడుమ వున్న ‘ఆత్మీయతా భావం ‘ అవగతం కాదు. అయితే – చేసిన మంచిని మరచిపోవడం మనుషులకు వుండాల్సిన లక్షణమని అనుకోలేము.
‘కృతజ్ఞత’ అన్న పదానికి ఈనాటి రాజకీయాల్లో స్తానం వున్నట్టులేదు. రాజకీయనాయకులకు ‘వడ్డించేవాడు’ ప్రధానం కాని ‘వడ్డించిన’ వాడు కాదు.

గతం ఘనం

పీవీ నరసింహారావుగారి విషయమే తీసుకుందాం. ప్రధానిగా వున్నంతకాలం ‘ఆహా! ఓహో!!’ అన్నారు. ఆర్ధిక సమస్యలతో పీకలలోతు మునిగిపోయివున్న దేశాన్ని నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠం పై వుంచిన ‘అపర చాణ క్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం కావడంతోనే – ఆ నోళ్ల తోనే – ‘అధికారాంతమునందు చూడవలె ‘ అని పద్యాలు పాడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ ‘పదవే’ సర్వస్వమయిన వారికి ‘ఆయన భజనే’ సర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన ‘పత్తిత్తులకు’ ఆయన చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’ లోని ‘వాడినీ – వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త – న్యాయస్తానాలలో నిస్సహాయంగా ‘బోనులో’ నిలబడ్డప్పుడు ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా పీవీ ని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’ అనే పదానికి తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు హడావిడి ఒక విలేఖరిగా నాకు తెలుసు. ఆకాశవాణి ప్రతినిధిగా కలుసుకోవాలన్నా ఎంతో కష్టంగా వుండేది. అధికారులు, అనధికారులు, మందీ మార్భాలాలు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్, న్యూస్  ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తమ వెళ్లి - ఆ పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడం తో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని ‘ పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.

ఆలోచనా? నిర్వేదమా?

పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేసామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము.లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేసారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.  అదీ  పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.

శ్రీ అంజయ్య

అలాగే- ఎనభయ్యవ దశకంలో అంజయ్య గారిని ఇదే పరిస్థితుల్లో చూసాము. ముఖ్య మంత్రిగా ఆయన రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. మేము ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు పోయింది. అంతా బోసిపోయి వుంది. మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.

1983 లో విజయభాస్కరరెడ్డి గారితో ఇలాటిదే మరో అనుభవం.

శ్రీ విజయభాస్కరరెడ్డి


తెలుగు దేశం పార్టీ అఖండ విజయం తరవాత – ఆయన అధికార నివాసంలో (ఇప్పుడు దాన్ని పడగొట్టి గెస్టు హౌస్ కట్టారు) ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని కలుసుకున్నాను. ఆయన మేఘ గంభీరుడు. ఒక పట్టాన బయటపడే వ్యక్తిత్వం కాదు. జనం చాలా పలచగా వున్నారు. కాకపొతే, ఆయన మళ్ళీ కేంద్రంలో మంత్రి అవుతారన్న గ్యారంటీ నూటికి నూరుపాళ్ళు వుండడం వల్ల పరిస్తితి మరీ అంత దారుణంగా లేదు.

ఇలాటి నేపధ్యాలున్న మన రాష్ట్ర రాజకీయ రంగంలో -

శ్రీ రామారావు

అధికారం చేజారితేనే పట్టించుకోని రాజకీయ నాయకులు - ప్రాణాలు విడిచిన తమ నాయకులను పట్టించుకుంటారనుకోవడం భ్రమ. రామారావయినా, రాజశేఖరరెడ్డి అయినా అంతే.

మొన్నటికి మొన్న హైదరాబాదులో – EMRI -108- ఐదో వార్షికోత్సవం విశేషాలను మీడియాలో చూసినప్పుడు ఈ విషయాలతో కూడిన గతం నా కళ్ళ ముందు కదలాడింది.

వాహనాన్ని పరిశీలిస్తున్న శ్రీ రాజశేఖరరెడ్డి

ఈ సంస్త ప్రారంభమయిన కొద్ది సంవత్సరాలకే ఎంతో ప్రాచుర్యం పొందింది. సకాలంలో సేవలందిస్తూ ఆపన్నుల ప్రాణాలు నిలబెడుతున్న ఈ సర్వీసు విశిష్టతను అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి గుర్తించారు. డాక్టర్ గానే కాకుండా ఒక రాజకీయ పార్టీని రాష్ట్రంలో శాసిస్తున్న నాయకుడుగా కూడా దీని ప్రాముఖ్యతను ఆయన బాగా అర్ధం చేసుకుని ‘పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో ఈ సంస్తకు ఆర్ధిక సాయాన్ని అందించారు

కుయ్ కుయ్ అంటూ 108 వాహనం సౌండ్ ని అనుకరిస్తున్న వైఎస్సార్     

. ప్రమాదాల్లో చిక్కుకున్న ప్రజల ప్రాణాలను నిలబెట్టడమే కాకుండా – ‘వోట్ బ్యాంకు’ ని తయారు చేయగల ఒక ‘ప్రజాకర్హక పదకంగా దీన్ని తీర్చి దిద్దారు. అలాగే వైద్య సేవలకు నోచుకోని పల్లె ప్రజలకోసం రూప కల్పన చేసిన ‘104’ పధకం కూడా రాజశేఖరరెడ్డి గారిని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే గత సార్వత్రిక ఎన్నికల సభల్లో వీటికి ఆయన అదనపు ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.

వొదిలి వెళ్ళిన  'మంచి ఆస్తి '


వీటిని గురించి మాట్లాడేటప్పుడు మరో వ్యక్తిని కూడా స్మరించుకోవాలి. ఆయన ఆర్ధిక నేరాల ఉచ్చులో చిక్కుకుని జైల్లో వుంటున్న ‘సత్యం’ రామలింగరాజు గారు. ఈ రెండు పధకాలకు పురుడు పోసింది రాజు గారే .వీటికి జీవం పోసింది మాత్రం రాజశేఖరరెడ్డి గారు.
కానీ – EMRI- 108- ఐదో వార్షికోత్సవం లో ముఖ్య మంత్రి రోశయ్య గారు మినహా మిగిలిన వారెవ్వరూ ‘వీరిద్దరి’ ప్రస్తావన తీసుకురాలేదనీ,  స్టేజీ వెనుక అమర్చిన ‘బ్యాక్ డ్రాప్’ లో కూడా కానరాలేదనీ - అమెరికాలో వున్న నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పినప్పుడు – ‘కృతజ్ఞత’ గురించిన జ్ఞాపకాలు మరో సారి మదిలో మెదిలాయి.
బయట కానరానివాటిని 'మ్యూజియం' లోనే కదా చూసేది   


కొన్నాళ్ళ తరవాత – పిల్లలకు ‘కృతజ్ఞత’ గురించి తెలియచేప్పాలంటే – మ్యూజియం కు తీసుకు వెళ్ళాలేమో!

(16-08-2010)

NOTE:All images in the blog are copy righted to the respective owners.


15, ఆగస్టు 2010, ఆదివారం

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు – భండారు శ్రీనివాసరావు

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు – భండారు శ్రీనివాసరావు


పత్రికల్లో గమనించారో లేదో సంఖ్యలు కొట్టొచ్చినట్టు కనబడడానికి అంకెల్లో రాస్తుంటారు.

ఉదాహరణకు వర్షాలు వరదల కారణంగా లక్ష మంది నిరాశ్రయులయ్యారు అని రాయడానికి 100000 మంది అని పేర్కొంటారు.అలాగే ప్రభుత్వ పక్షం వారు అసెంబ్లీకి సమర్పించే గణాంకాల్లో కూడా ఈ చమత్కారాలు తొంగి చూస్తుంటాయి. అల్లర్లలో అరెస్టులు గురించి చెప్పాలంటే – యాభయ్, వందా అని క్లుప్తంగా లాగించేస్తారు. బలహీనవర్గాలకు ఇళ్ళ పంపిణీ గురించి చెప్పేటప్పుడు 30 00000 మందికి ఇచ్చాం అని ఘనంగా ఉద్ఘాటిస్తారు.ఇక ప్రతిపక్షాలు – ‘మృతుని కుటుంబానికి 1000000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల’ని డిమాండ్ చేస్తాయి.

ఈ విషయాలు పక్కనబెట్టి అసలు విషయానికి వద్దాం.

సున్నా స్వగతం : పక్కన నేనున్నప్పుడే కదా ఎవరికయినా విలువ ? 

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే ఇంగ్లీష్ లో ‘ట్రిలియన్’ అంటారు. సంఖ్యలని లెక్కపెట్టడానికి మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. 2008 లో ప్రపంచ దేశాలలోని జనాలు పరస్పరం పంపుకున్న ‘ఎస్ ఎం ఎస్’ లకు ఇది సమానం.

ఇదొక లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ ‘సున్నాల’ గందరగోళం ఎక్కువై అసలు ‘విషయం’ గుండు సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు. ఈ రెండేళ్లలో ఇంకా ఎంతకు పెరిగివుంటుందో వూహించుకోవచ్చు.

పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం.
లోకం చుట్టిన వీరుడు


ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా నేలనాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని ఈ ‘బుల్లి పరికరం’ ఈనాడు ‘హస్తభూషణం’ గా తయారయి కూర్చుంది. ‘ఇంటికి ఒక్క ఫోనే’ అబ్బురమనుకునే దేశంలో – ఇంట్లోవున్న నలుగురూ ‘నాలుగు ఫోన్లు – ఎనిమిది రింగులుగా ‘ కాలక్షేపం చేసే కాలం వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి – ముక్కూ మొహం తెలియని వారితో మాటా మంతీ పెరిగిపోయింది.



- 635 510 000-
 అంటే ఫోన్ నెంబర్ అనుకునేరు – ఒక లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి మన దేశంలోని మొబైల్ ఫోన్ ల సంఖ్య ఇది. అమెరికాలో వాడే సెల్ ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ.

యెంత దగ్గరో - అంత దూరమూ


మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదు, సందేశాలు కూడా పంపుకోవడానికి కూడా వీలు వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి. ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా – 1992 డిసెంబర్ మూడో తేదీన మొట్ట మొదటి ‘ఎస్ ఎం ఎస్ ‘ ఇంగ్లండ్ లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా ఫోన్ ద్వారా వెళ్ళింది.


’హ్యాపీ క్రిస్మస్’ అనేది ఆ మొట్టమొదటి ‘ఎస్ ఎం ఎస్’


  అప్పటినుంచి ఈ చిట్టి పొట్టి సందేశాల ‘సాంకేతిక పిట్ట’ ప్రయాణం ఎదురులేకుండా సాగిపోయింది. అన్నిరకాల మొబైల్ ఫోన్ పరికరాలకు పనికివచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో – ‘ఎస్ ఎం ఎస్’ ల విశ్వవిహారం మొదలయింది. ఇంగ్లండ్ లో 2006 డిసెంబర్  లో క్రిస్మస్ పండుగ సందర్భంగా – ఒకే ఒక్కరోజున - యిరవై కోట్ల పైచిలుకు ‘ఎస్ ఎం ఎస్’లు - పండుగ  శుభాకాంక్షలు తెలుపుతూ - ‘ఫోన్లు మారాయి.’

ఈ లెక్కన ఈ లెక్కలు ఇప్పటికి ఎంతగా పెరిగాయన్నది లెక్కలు కట్టాల్సివుంది.

కానీ ఇలాటి లెక్కలు తీ సేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం – 2006 నాటికే ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది.

అమెరికా లాంటి దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ‘ఎస్ ఎం ఎస్’ కు పదకొండు సెంట్లు వసూలు చేస్తున్నారు. మరి ఈ ‘వసూలు రాజాల’ కు ఇందుకయ్యే ఖర్చు ‘చిల్లి సెంటు’ కూడా వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు వసూలు చేస్తున్న ‘అదనపు’ చార్జీ అనాలా! బియ్యం మిల్లు యజమానులకు ‘తవుడు’ అప్పనంగా మిగిలినట్టే, ఈ కంపెనీలకు ఇదొక అదనపు ఆదాయం.

ఇందులో ‘ఇంత’ వుంది కాబట్టే – ఈ ‘ఎస్ ఎం ఎస్ ‘ ల పేరుతొ ఇన్నిన్ని స్కీములు, ఇన్నిన్నిగేములు.

 వినియోగదారుల్ని వల వేసి పట్టుకుందుకు ఇన్నిన్ని ' గేలాలు' 

పేలాలు పంచి పప్పులు దంచుకునేందుకు ఇంకెన్నో టక్కు టమారాలు.

‘పట్టుకుంటే పట్టు చీరె’ నుంచి ‘ఆటాడుకుందాం రా’ వరకు అన్నే ‘ఎస్ ఎం ఎస్’ గేములే.

ప్రతి టీవీ చానల్ లో ప్రతి అంశం మీదా ‘ప్రజాభిప్రాయసేకరణలే. ‘ఎస్ ఎం ఎస్’ లు పంపాలని కోరని చానల్ తెలుగునాట కలికానికి కూడా కానరావడం లేదు.

పైగా ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కు వసూలు చేసే చార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్యటి నీటికి చేపలు ఎగబడే చందంగా – ఎవరికివారు పోటీలు పడి తమ ‘మొక్కుబళ్ళు’ చెల్లించుకుంటున్నారు. ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా.

బహుళ జాతి కంపెనీల మీద నిలువెత్తున ఎగిరిపడే వాళ్ళు కూడా – చాపకింద నీరులా వ్యాపిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్న ఈ ‘ఎస్ ఎం ఎస్’ – వ్యాపార ధోరణులపై ఎందుకు చూపు సారించడం లేదో ఆలోచించాల్సిన విషయం.

టీవీ చానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయో, ఇందులోని వ్యాపార ‘మర్మం’ ఏమిటో వెల్లడి చేస్తే బాగుంటుంది.

కానీ ఇది జరిగే పనేనా!

‘తప్పులెన్నువారు తమ తప్పులు ఒప్పుకుంటారా!’

NOTE: All images in this blog are copy righted to the respective owners