30, జులై 2010, శుక్రవారం

అమెరికా అనుభవాలు – 13

అమెరికా అనుభవాలు – 13
 
క్రుకెడ్ రోడ్



క్రుకెడ్ రోడ్ శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అనేక కొండల మధ్య నిర్మించిన ఎగుడుదిగుడు రహదారులతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూవుంటుంది. అక్కడి క్రుకెడ్ రోడ్డుని చూడడానికి జనం ఎగబడి వస్తారు. దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసారు. డౌన్ టౌన్ లోని ఒక ఎత్తయిన కొండ మీదకు నేరుగా ఎలాటి వొంపులు లేకుండా ఒక రోడ్డు వేసారు. దానికి అటూ ఇటూ నివాస సముదాయాలు కూడా వున్నాయి. ఏటవాలుగావున్న ఆ రోడ్డుపై కారులో ప్రయాణం చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా వుంటుంది. కారు వెనుక కారు, కారు ముందరో కారు – ఇలా కింద నుంచి పై దాకా వరుసగా వెడుతుంటాయి. బ్రేకులు వేసుకుంటూ, వేగం సరి చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా – ముందు కారుని డీ కొట్టడమో లేదా వెనుక కారు పైకి జారి పోవడమో జరిగే ప్రమాదం వుంటుంది. దాదాపు రెండు కిలోమీటర్లు ‘అసిధారావ్రతం’ లాటి ఈ ప్రయాణం చేసాక – హఠాత్తుగా కొండ పైభాగంపై నాలుగు రోడ్ల కూడలి ఎదురవుతుంది. మా కారు దాని దగ్గరకు వెళ్లేసరికి ట్రాఫిక్ రెడ్ లైట్ పడింది. వెనక్కు చూస్తే వేలాడుతున్నట్టుగా అనేక వాహనాలు. కొండ అంచుపై బల్లిలా అతుక్కుని వున్నట్టు కారు ఆపుకుని గ్రీన్ సిగ్నల్ రాగానే రోడ్డు దాటాము. అంతటితో కధ ముగియలేదు. ఆ కొండపై నుంచి మళ్ళీ కిందకు దిగాలి.


 అదే క్రుకెడ్ రోడ్డు. ఇంగ్లీష్ అక్షరం ‘Z’ ఆకారంలో జిగ్ జాగ్ గా పై నుంచి కిందకు ఈ రోడ్డు వేసారు. మిగిలిన ఖాళీ స్తలాలలో లాన్లు, పూలమొక్కలు ఆహ్లాదకరంగా పెంచారు. అతి నెమ్మదిగా కారుని ఈ మలుపులు దాటిస్తూ కిందకు చేరాము. ఈ క్రుకెడ్ రోడ్డు ప్రయాణం కోసం రోజూ వేలాది కార్లు వస్తుంటాయి. ప్రమాదకర ప్రయాణం. ప్రమాదాలకు నిలయం.అయినా విచిత్రం. ఒక్క ట్రాఫిక్ పోలీసూ కనబడడు. దారి పక్కన స్పుటంగా కానవచ్చే నిబంధనలు చదువుకుంటూ, వాటిని ఖచ్చితంగా పాటిస్తూ వెడితే ఎలాటి ఇబ్బంది వుండదన్నది స్తానికుల ఉవాచ.

NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు - 12

అమెరికా అనుభవాలు - 12

మైలురాళ్ళు దాటని అమెరికా
మా అమెరికా సందర్శనలో ప్రధాన ఘట్టం కాలిఫోర్నియాతో మొదలయింది.




అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. విస్తీర్ణంలో చాలా పెద్దది. ప్రపంచంలోనే ప్రముఖ వాణిజ్య, వినోద కేంద్రాలయిన శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్, డిస్నీల్యాండ్, హాలీవుడ్ ఈ రాష్ట్రం లోనే వున్నాయి. సిలికాన్ వాలీ గా వినుతికెక్కిన ఈ ప్రాంతంలోనే ఒరేకిల్ వంటి ప్రసిద్ధిగాంచిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు వున్నాయి.




శాన్ ఫ్రాన్సిస్కో అతి పెద్ద నగరం.గంటకు అరవై మైళ్ల వేగంతో (అమెరికాలో దూరాన్ని మైళ్ళలో కొలుస్తారు. ఈ విషయంలో మాత్రం మన దేశమే అమెరికా కంటే ఒక మైలు ముందుందని చెప్పాలి. వాళ్ళింకా మైలురాళ్ళు దాటనే లేదు.) స్పీడ్ వే లపై రోజూ కొన్ని గంటలపాటు తిరుగుతూ – సుమారు నెల రోజులు వుండి కూడా నగరంలో సగం కూడా చూడలేకపోయాము. మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు (స్టేట్ బ్యాంకు సీజీయం గా పని చేసి రిటైర్ అయ్యారు) ఆయన ఇద్దరు కుమారులు – లాల్ బహదూర్, రాజేంద్రప్రసాద్ లు ఒరేకిల్ కంపెనీలో చాలాకాలంగా పనిచేస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లోనే వుంటున్నారు. వీరిలో పెద్దవాడు లాల్ సొంత ఇల్లు కొనుక్కున్నాడు. వాళ్ళ పూనికపై కొన్ని రోజులు వాళ్ళతో గడపాలనే ఉద్దేశ్యంతో మేము అక్కడికి వెళ్ళాము. లాల్ కొనుక్కున్న ఇల్లు – మూడు పడక గదులు, రెండతస్తులు- ముందూ వెనుకా పెరడుతో చాలా సౌకర్యంగా వుంది.


 బయట తిరిగి వచ్చినప్పుడు కారు దిగి గరాజు తలుపు తెరవాల్సిన అవసరం లేకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చునే ఒక మీట నొక్కి గరాజు తలుపు (షట్టరు) తెరవచ్చు. లోనికి వెళ్ళగానే ఇలాగే మళ్ళీ మూసివేయవచ్చు. ఆలీబాబా కధల్లో ఓపెన్ ససేమ్, షట్ ససేం అనగానే గుహ ద్వారం తెరుచుకుని, మూసుకుపోయినట్లుగా ఈ ఆటోమాటిక్ లాకింగ్ విధానం కారు గరాజు వున్న ప్రతివారికీ అందుబాటులో వుంది.

NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు – 11

అమెరికా అనుభవాలు – 11



దీవిలో ఒక రోజు



 అమెరికా- కెనడా సరిహద్దుల్లో పసిపిక్ మహాసముద్రం దీవులు కొన్ని వున్నాయి.సియాటిల్ నుంచి కెనడాకు రెండున్నర గంటల్లో కారులో వెళ్ళవచ్చు. రోడ్డు మార్గం ద్వారా మాత్రమె కాకుండా హెలికాప్టర్లు, విమానాల ద్వారా కూడా ఆ దీవులను చేరుకోవచ్చు.


 అనకోర్టెస్ అనే పట్టణం నుంచి ఫెర్రీల (పెద్ద పెద్ద మర బోట్లు) ద్వారా కూడా వెళ్ళవచ్చు. మనతో పాటు మన వాహనాలను కూడా ఈ బోట్లలో తీసుకువెళ్ళడానికి వీలుంది. నిర్ణీత రుసుము చెల్లించి సందీప్ కారుని నేరుగా ఫెర్రీ లోని పార్కింగ్ లాట్ లోకి చేర్చాడు. డజన్ల సంఖ్యలో అక్క డ కార్లు పార్క్ చేసుకునే వీలుంది.


 పై అంతస్తులో పర్యాటకులకోసం విశాలమయిన లాంజ్ లు వున్నాయి. అన్ని వైపులా నిలువెత్తు అద్దాలు బిగించడం వల్ల వెచ్చగా, హాయిగా చుట్టూ పరిసరాలను గమనిస్తూ సముద్రయానాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఫెర్రీలో బార్, రెష్టారెంట్ తొ సహా అన్నిరకాల వసతులు వున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు వున్నాయి.


 గంటన్నర పాటు సముద్రంలో ప్రయాణించి సాన్ జువాన్ (అమెరికన్లు ‘సాన్ వాన్’ అంటారు) దీవుల్లోని ఫ్రైడే హార్బర్ కు చేరుకున్నాము. బోటు నుంచి కారు కిందకు దింపుకుని విశాలమయిన దీవిలో సన్నటి రోడ్లపై కలయ తిరిగాము. దీవికి అన్నివైపులా పసిఫిక్ మహాసముద్రం. ఎక్కడో సుదూరంగా నీలి సముద్రాన్ని నీలాకాశం తాకుతున్న ఫీలింగ్.


 పేరుకు దీవి కానీ ఫ్రైడే హార్బర్ అన్ని వసతులు కలిగిన చిన్నపాటి నగరమనే చెప్పాలి. రెష్టారెంట్లు, సినిమా హాళ్ళు, హోటళ్ళు, మ్యూజియం, చిన్న సైజు విమానాలు దిగడానికి ఎయిర్ స్ట్రిప్, సంపన్నులయినవారు విడిది గృహాలుగా కొనుగోలు చేసుకున్న ఖరీదయిన ఇళ్లు – హాలీవుడ్ చిత్రంలో సెట్ మాదిరిగా చూడచక్కగావుంది. ఇంటి నుంచి తెచ్చుకున్న పెరుగన్నం- పులిహార లాగించి చూడాల్సినవి అన్నీ చూసి వస్తుంటే వర్షం మొదలయింది. సాయంత్రం అయిదు గంటలకే చిమ్మ చీకట్లు కమ్మే వాతావరణం. బోటు లంగరు వేసిన ప్రదేశం కనుక్కునే సరికి తాతలు దిగివచ్చారు. మొత్తానికి ఎలాగయితేనేం – కారుతో సహా తిరిగి బోట్లో పడ్డాం

NOTE: All images in this blog are copy righted to their respective owners


.


29, జులై 2010, గురువారం

అమెరికా అనుభవాలు – 10

అమెరికా అనుభవాలు – 10



స్నోకాల్మీ ఫాల్స్



ఒక రోజు స్నోకాల్మీ ఫాల్స్ (SNOQUALME FALLS) కి కారులో వెళ్ళాము. సియాటిల్ నుంచి సుమారు గంటన్నర ప్రయాణం. ఎత్తయిన పర్వతాలు,లోతయిన లోయల మీదుగా విశాలమయిన రహదారి. రోడ్డుకు రెండువైపులా నింగిని తాకుతున్నాయా అనిపించేంత పొడవయిన చెట్లు. వాటిని నరికి అడవులను ధ్వసం చేస్తున్న దాఖలాలు మచ్చుకు కూడా కనిపించవు. చెట్లను నరకడంపై గట్టి నిషేధాలు వున్నాయి. కార్చిచ్చుల కారణంగా అడవులు తగలబడి పోవడం తప్పిస్తే దొంగతనంగా చెట్లను నరకడం అన్నది జరగదు.(ఇటీవల కాలిఫోర్నియాలో ఇలాటివి జరిగి వందల ఎకరాల విస్తీర్ణంలో అడవులు కాలిపోయాయి.)


నిజానికి స్నోకాల్మీ ఫాల్స్ అన్నది ఒక కృత్రిమ జలపాతం. లోయల్లో పారుతున్న నీటిని ఒక ఎత్తయిన ప్రదేశం మీదుగా మళ్లించి ఈ జలపాతం ఏర్పడేలా చూసారు. పర్యాటకులకు అవసరమయిన వసతులు అద్భుతంగా కల్పించారు. కాలిబాట మీదుగా లోయలోకి దిగి వెళ్లి ధారగా దూకుతున్న జలపాతాన్ని చూడవచ్చు. పైనుంచి పడుతున్న జలధారలతో కింది భాగంలో నీటి మడుగు ఒక సరస్సు మాదిరిగా తయారయింది. దానిలో బోటింగ్ చేయడానికి రోజూ వందలాదిమంది అక్కడకు వస్తుంటారు. నిజానికి ఇది మన నాగార్జునసాగర్ సమీపంలో వున్న ఎత్తిపోతల జలపాతం కంటే పెద్దదేమీకాదు. అయినా పర్యాటకులను ఆకర్షించడానికి చేసిన ఏర్పాట్లు,రహదారి సౌకర్యాలు చూసి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది.


మండే కొండ మరో రోజు మౌంట్ రేనియర్ అనే అగ్ని పర్వతం చూడడానికి వెళ్ళాము. అక్కడకు చేరడానికి కొన్ని వేల అడుగుల ఎత్తున నిర్మించిన విశాలమయిన ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలి. ఇక్కడ ఘాట్ రోడ్డు అంటే మలుపులు తిరుగుతూ వెళ్లే రోడ్డు కాదు. ఏటవాలుగా సరాసరి కొండమీదికే రోడ్డు నిర్మిస్తారు. ఒక దాని వెంట మరొకటిగా వందలాది కార్లు అమిత వేగంతో ఆ రోడ్లపై పరుగులు తీయడం గమనిస్తే కళ్ళు తిరిగిపోతాయి. మౌంట్ రేనియర్ సజీవ అగ్ని పర్వతం. ఇంకా రగులుతూనే వుంది. ఏదో ఒకనాడు ఇది బద్దలు కాగలదని భావిస్తున్నారు. సియాటిల్ కి ఈ పర్వతం ఒక కొండ గుర్తు. చాలా దూరంలో వున్నా నగరంలో పలుచోట్ల నుంచి ఈ అగ్ని పర్వతం కనిపిస్తూనే వుంటుంది. సందర్శకులకు ఇక్కడ కూడా బ్రహ్మాండమయిన ఏర్పాట్లు చేసారు. అగ్ని పర్వతమే అయినా సంవత్సరంలో చాలా రోజులు మంచుతో కప్పబడే వుంటుంది. ఆ మంచుపై స్కీయింగ్ చేయడానికి సీజనులో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ అగ్ని పర్వతం చరిత్రను వివరించే పెద్ద ప్రదర్శనశాల కూడా వుంది.

 ఇండియా నుంచి వచ్చి ఈ అగ్ని పర్వతం చూసేవారికి ఒక అదనపు ఆకర్షణ కూడా వుంది. దీనికి వెళ్లే దోవలో ‘నారద ఫాల్స్’ కనిపిస్తాయి. నిజానికి మన ‘నారద మహర్షి’ పేరు పెట్టారో లేదా కాకతాళీయమో కానీ ఆ పేరు చూడగానే ఎంతో సంతోషమనిపించింది.

NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు – 9

అమెరికా అనుభవాలు – 9
ఎయిర్ ఫోర్స్ వన్



ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలయిన మైక్రోసాఫ్ట్ , బోయింగ్ ప్రధాన కార్యాలయాలు సియాటిల్ లోనే వున్నాయి. ఇన్ఫోసిస్ తరపున బోయింగ్ విమానాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న మా అబ్బాయి సందీప్ ఏర్పాటుచేసిన ప్రత్యెక పాసులతో ఒకరోజు బోయింగ్ కర్మాగారానికి వెళ్ళాము. అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్యాక్టరీని ప్రవేశ రుసుముతో సందర్శించే వీలు కల్పించారు. ఎంతో భద్రత అవసరమయిన ఈ కర్మాగారాన్ని సందర్శించేందుకు ఉత్సాహపడే పర్యాటకులను ప్రవేశ రుసుముతో అనుమతించడం ద్వారా టూరిజం ను వారు ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ని కూడా ఇదేవిధంగా సందర్శించే వీలు వుందని విన్నాను.
మిగిలిన సందర్శకులతో కలిపి మమ్మల్ని కూడా ప్రత్యెక బస్సుల్లో లోపలకు తీసుకు వెళ్లారు. అన్నీ చూపించి విషయాలను విశద పరిచేందుకు వెంట గైడ్లు కూడా వున్నారు.


అసలు బోయింగ్ విమానమే ఎంతో పెద్దగా వుంటుంది. అలాటిది వాటిని తయారు చేసే ఫాక్టరీ యెంత పెద్దగా వుంటుందో ఊహించుకోవచ్చు. విడి భాగాలను తయారు చేసి వాటినన్నిటినీ ఒకచోట చేర్చి విమానాన్ని నిర్మించే వివిధ దశలను మేము కళ్ళారా చూసాము. అంతేకాకుండా బోయింగ్ విమాన నిర్మాణం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపే డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఈ కర్మాగారం ఆవరణలోనే పెద్ద పెద్ద రన్ వే లతో కూడిన విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు.



రైట్ సోదరులు కనుక్కున్న తొలి విమానం నుంచి ఇంతవరకు తయారయిన అధునాతన యుద్ధ విమానాలు, ప్రయాణీకుల విమానాలు,సరకుల రవాణా విమానాలు, హెలికాప్టర్లు వుంచిన ఒక ప్రదర్సనశాల కూడా వుంది. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ పాత మోడల్ కూడా అక్కడ వుంది. సందర్శకులు అందులోకి ఎక్కి కాక్ పిట్ తొ సహా ప్రెసిడెంట్ కోసం విమానంలో ఏర్పాటు చేసిన పడక గది, సమావేశ మందిరం, పత్రికా విలేఖరులతో మాట్లాడే హాలు అన్నీ చూడవచ్చు. టెలిఫోన్, టేలెక్స్, కంప్యూటర్, ఇంటర్నెట్, టీవీ మొదలయిన అత్యాధునిక సమాచార పరికరాలన్నీ అందులో వున్నాయి.


 అమెరికా ప్రెసిడెంట్ విమానంలోకి ఎక్కి అన్నీ చూడడం అన్నది నిజంగా ఒక మరపురాని అనుభూతి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ వున్నానంటే – ఈ దేశంలో పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెప్పడానికే. నిజానికి బోయింగ్ విమానాల కర్మాగారం రక్షణ అవసరాల దృష్ట్యా నిషేధిత ప్రదేశమయినా టికెట్లు పెట్టి మరీ ప్రజలకు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఏటా ఎన్నో వేలమంది దీన్ని సందర్శిస్తూ వుంటారు

NOTE: All images in this blog are copy righted to their respective owners


.




అమెరికా అనుభవాలు – 8

అమెరికా అనుభవాలు – 8


ముసురు నగరం




సియాటిల్ వాషింగ్టన్ రాష్ట్రంలో వుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి కీ దీనికీ సంబధం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు. రాముడి రాజ్యం లో నేలకు మూడు వానలు కురిస్తే ఇకాడ నెలకు ముప్పయి రోజులూ వాన పడుతూనే వుంటుంది. అందుకే దీనికి గ్రీన్ స్టేట్ అని మరో ముద్దుపేరు కూడా వుంది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన చెట్లు దర్శనమిస్తాయి. పచ్చదనానికి, పరిశుభ్రానికీ సియాటిల్ మారు పేరు. సిటీ మేయర్ గ్రెగ్ నికిల్స్ మాటల్లో చెప్పాలంటే సియాటిల్ అమెరికా మొత్తంలో అందమయిన నగరం


.ప్రక్రుతి ప్రసాదించిన విశాలమయిన సరస్సులూ, ఎత్తయిన కొండలూ, నదులూ, నదీ మార్గాలూ, కనువిందు చేసే పచ్చని పచ్చిక బయళ్ళూ, శీతల వాతావరణం, సమీపంలో సాగర తీరం – ఇవన్నీ ఈ నగరానికి ఒక ప్రత్యేకతను, విశిష్టతనూ సంపాదించి పెట్టాయి.


 ముప్పొద్దులా ముసురు ముసుగు కప్పుకునివుండే ఈ నగరం రోడ్లపై ట్రాఫిక్ గీతలు ఎప్పుడు చూసినా అప్పుడే గీసినట్టు ఎలా మెరుస్తూవుంటాయో అర్ధం కాదు. మేమున్న అయిదు నెలల్లో కూడా ఏ ఒక్క నాడు ఈ ట్రాఫిక్ గీతల్ని కొత్తగా పెయింట్ చేస్తున్న సందర్భం కానరాలేదు.

సీటు బెల్టులు

పొరుగునవున్న కాలిఫోర్నియా రాష్ట్రం తో పోలిస్తే – వాషింగ్టన్ స్టేట్ లో ముఖ్యంగా సియాటిల్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారనిపిస్తున్నది. డ్రయివర్ తో సహా (సాధారణంగా కారు యజమానే అయివుంటాడు) కారులో ముందు వెనక సీట్లో కూర్చున్నవాళ్ళందరూ విధిగా సీట్ బెల్ట్ ధరించితీరాలి.


 లేకపోతె వంద డాలర్ల జరిమానా తప్పదు. చిన్న పిల్లలకు సయితం మినహాయింపు లేదు. పైగా వారికి ప్రత్యేకమయిన కారు సీట్లు వుండాలి. ఇవి షాపుల్లో దొరుకుతాయి. వాటిని కారులో వున్న సీట్లకు అదనంగా అమర్చుకుని పిల్లల సీటు బెల్టులు తగిలించి కూర్చోపెట్టుకోవాలి. ఎటువంటి పరిస్తితుల్లోనూ పిల్లలను ముందు సీట్లో కానీ, పెద్దల ఒడిలో కానీ కూర్చోబెట్టుకోకూడదు. నెలల పిల్లలయినా సరే వెనుకనే వారి కారు సీట్లు అమర్చుకోవాలి.

నగరాన్ని తలపించే ఎయిర్ పోర్ట్




సియాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయం అమెరికా లోని అతిపెద్ద ఎయిర్ పోర్టులలో ఒకటి. కార్ల పార్కింగ్ కోసం పలు అంతస్తుల భవనాలు అనేకం నిర్మించారు. ఒక్కో అంతస్తులో కనీస అయిదు వందల కార్ల వరకు వసతిగా పార్క్ చేసుకునే వీలుంది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు త్వర త్వరగా తమ విమానాలను చేరుకోవడానికి వీలుగా అత్యంత వేగం తో నడిచే ఎలక్ట్రిక్ రైళ్ళు భూగార్భంలోనూ, వెలుపలా తిరుగుతుంటాయి. ఎస్కలే టర్లతో, రెష్టారెంట్లతో, ఆధునిక దుకాణ సముదాయాలతో, మెరిసే విద్యుత్ దీపాలతో ఈ విమానాశ్రయం ఒక ఆదునిక నగరాన్ని తలపిస్తుంది.


NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు – 7

అమెరికా అనుభవాలు – 7

రోప్ వే



స్పోకేన్ లో వున్నప్పుడు అక్కడికి దగ్గరలో వున్న సిల్వర్ మౌంటైన్ రిసార్ట్ కి వెళ్ళాము. కింద బేస్ క్యాంపు నుంచి గండోలా (రోప్ వే) లో ఆరువేల అడుగుల ఎత్తున వున్న రిసార్ట్ కి చేరుకున్నాము. ఈ రోప్ వే నిడివి 3.1 మైళ్ళు. ప్రపంచంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే గండోలాల్లో ఇదొకటి. గంటకు పదహారువందలమంది టూరిష్టులను, స్కీయింగ్ క్రీడాకారులను పైకి తీసుకువెళ్ళగల 112 క్యాబిన్లు నిరంతరం పైకీ కిందకు తిరుగుతూవుంటాయి.


 ఒక్కొక్క క్యాబిన్ లో ఎనిమిదిమంది వసతిగా కూర్చోవడానికి వీలుంది. నిమిషానికి వెయ్యి అడుగుల వేగంతో మంచు కప్పుకు పోయిన లోయల మీదుగా పైపైకి తీగె బాటపై ప్రయాణించడం మరపురాని అనుభూతి . పైకి వెళ్ళిన తరవాత చూస్తే అంతా మంచు. తెల్లని మంచు.



 ఎవరో గంధర్వుడు యోజనాల నిడివి కలిగిన తన బాహువులతో లక్షలకొద్దీ టన్నుల తెల్ల దూది చల్లినట్టు ఎటు చూసినా కను చూపు మేర వరకు తెలతెల్లటి మంచు. అంత ఎత్తునుంచి కొండ సానువుల మీదుగా మంచు మీద స్కీయింగ్ చేస్తూ వేగంగా జారిపోతున్నవారిని చూస్తుంటే ‘భళిరా!’ అనిపించింది. ఉదయం పైకి వెళ్ళినవాళ్ళు సాయంత్రం దాకా ఈ స్కీయింగ్ క్రీడలో గడపవచ్చు. స్కీయింగ్ చేస్తూ మంచు లోయల్లో దారి తప్పిన వారిని కనిపెట్టి క్షేమంగా వెనక్కు చేర్చడానికి మంచుపై పరుగులు తీయగల చిన్న చిన్న మోటారు వాహనాలలో సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం గస్తీ తిరుగుతుంటారు.

అమెరికా లో బస్సు ప్రయాణం

స్పోకేన్ లో మూడు నిద్దర్లు చేసి తిరిగి బస్సులో సియాటిల్ కు బయలుదేరాము. అమెరికాలో బస్సులో ప్రయాణం చేయాలనే కోరిక స్పోకేన్ పుణ్యమా అని తీరింది.
అన్ని రంగాలలో మాదిరిగానే అమెరికాలో బస్సు సర్వీసులు ప్రైవేటు రంగంలోనే వున్నాయి. రహదారులు, వాహనాలు రెండూ బాగుండడం వల్ల బస్సు ప్రయాణం ఎలాటి కుదుపులు లేకుండా ఆహ్లాదంగా సాగింది. కండక్టర్ పద్దతి లేదు. డ్రైవర్ ఒక్కడే సమస్తం చూసుకుంటాడు. బస్సు కంట్రోల్స్ అన్నీ అతడి చేతిలోవుంటాయి. దారిలో విశేషాలన్నీ మైక్రోఫోన్ ద్వారా ప్రయాణీకులకు వివరిస్తుంటాడు. బస్సు ఎన్ని వందల అడుగుల ఎత్తున కొండ శిఖరాలు దాటుతున్నదీ తెలియచేస్తుంటాడు.


ఇంకో గంటలో సియాటిల్ చేరుకుంటామనగా వున్నట్టుండి మంచు కురవడం మొదలయింది. చూస్తూ ఉండగానే దాని ఉధృతి పెరిగిపోయింది. బస్సు స్నో కార్నీ అనేచోట ఆగినప్పుడు చూస్తే హోటళ్ళు, ఇళ్లు, వాటి పైకప్పులు మంచుతో కప్పుకు పోయివున్నాయి. ఒక క్షణం మాస్కోలో వున్నామా అనిపించింది.
బస్సు బయలుదేరింది కానీ వేగం మందగించింది. మా బస్సే కాదు మిగిలిన అన్ని వాహనాలు కూడా. ఎప్పుడూ గంటకు వంద కిలోమీటర్లకు తగ్గకుండా రోడ్లపై పరిగెత్తే వాహనాలన్నీ అతి జాగ్రత్తగా నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాయి. మంచు కారణంగా రోడ్లపై ట్రాఫిక్ గీతలు కనబడకుండా పోవడం కూడా ఇందుకు కారణం. ఎవరు ఏ లైనులో వెడుతున్నారో తెలియని పరిస్తితి.

అమెరికాలో పరిస్తితి  

 మార్గ మధ్యంలో అనేకచోట్ల లైట్లతో అమర్చిన హెచ్చరిక సూచనలు కానవస్తున్నాయి. వాటిని పాటిస్తూనే మా బస్సు డ్రైవర్ రేడియో ఆన్ చేసాడు. వాతావరణం గురించీ, రోడ్ల పరిస్తితి గురించీ, ఏ ప్రాంతంలో యెంత వేగంగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జాములు వున్నాయో వాటి వివరాలన్నీ రేడియోలో తెలియచేస్తున్నారు. ఇంత అభివృద్ధి చెందినా కూడా ఈ దేశంలో రేడియోకు లభిస్తున్న ప్రాధాన్యత తెలుసుకుని రేడియో మనిషిగా గర్వంగా ఫీలయ్యాను. మాస్కో గుర్తు వచ్చిందని అన్నాను కదా. అక్కడ ఇలాటివన్నీ సర్వ సాధారణం.

మాస్కోలో దృశ్యం

 మాస్కోలో ఏడాదికి పది నెలల పాటు మంచు కురుస్తూనే వుంటుంది. అయినా వాహనాల రాకపోకలకు కానీ, జన జీవనానికి కానీ ఎలాటి అంతరాయం కలగకుండా చూస్తారు. రోడ్లపై మంచుని ఎప్పటికప్పుడు తొలగిస్తుంటారు. ఇక రాత్రి వేళల్లో కొన్ని గంటలపాటు రోడ్లని శుభ్రం చేసే కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. ప్రత్యెక వాహనాలతో ఉప్పు ఇసక కలిపి రోడ్లపై చల్లుతారు. ఉప్పు వల్ల మంచు కరిగి నీరుగా మారుతుంది. వెనుకవచ్చే మరో వాహనం చీపురుతో ఊడ్చినట్టు చేస్తుంది. మరో వాహనం నీళ్ళు చిమ్ముతూ రోడ్లని కడుగుతుంది. మాస్కోలో మేమున్న అయిదేళ్ళు కూడా మంచు కారణంగా రోడ్లపై వాహనాలు నిలిచిపోవదం కానీ, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం కానీ చూడలేదు. అక్కడి,అప్పటి ప్రభుత్వ యంత్రాంగం శక్తియుక్తులన్నీ ప్రకృతిపై పోరాటానికే ఖర్చు చేసారా అనిపించింది. అక్కడితో పోలిస్తే ఇక్కడ అమెరికాలో పరిస్థితులు వేరుగా కానవచ్చాయి. రోడ్లపై గీతలు కనబడకపోతే ఇక్కడి వాళ్ళు కార్లు నడపలేరేమో!

NOTE: All images in this blog are copy righted to their respective owners