5, జనవరి 2013, శనివారం

తెలుగు అకాడమీపై ‘తోట’ గురిపెట్టిన తూటా



తెలుగు అకాడమీపై ‘తోట’ గురిపెట్టిన తూటా
(ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ వ్యాసంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వున్నాయి. రచయిత తోట భావనారాయణ గారికి కృతజ్ఞతలతో)



"అసత్యాలూ, అర్థసత్యాలూ, అచ్చుతప్పులూ, అన్వయదోషాలతో
అకాడెమీ అచ్చే(చ్చో)సి వదిలిన దృశ్యమాధ్యమ చరిత్ర

జెమినీ టీవీ ఆద్వర్యంలో సన్ నెట్ వర్క్ నడుస్తోంది
ఐ న్యూస్ ఛానల్ మూతబడింది
సత్య టీవీ విదేశాలనుంచి ప్రసారమవుతోంది
ఎబిఎన్ అంటే ఆర్మొడా బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్
హెచ్ఎమ్ టీవీ ని ఛానల్ 4 సంస్థ నడుపుతోంది
ఆర్ కె న్యూస్, జనతా న్యూస్, లోకల్ టీవీ శాటిలైట్ ఛానల్స్

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  ఆధ్వర్యంలోని రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి పర్యవేక్షణలో తెలుగు అకాడెమీ వారు డాక్టర్ వోలేటి పార్వతీశం గారి చేత వ్రాయించి అచ్చే(చ్చో)సిన ఐదువేల ప్రతుల లఘు గ్రంథ రాజము తెలుగునాట దృశ్య మాధ్యమంలో ఇలాంటి తప్పులు కోకొల్లలు . తెలుగు విశ్వవిద్యాలయానికీ, తెలుగు అకాడెమీకి లఘుగ్రంథాల ప్రచురణ బాధ్యత అప్పగించగా అకాడెమీ కోటాకింద వచ్చిన 150 గ్రంథాలలో ఇది ఒకటి. పుస్తకాలు రాయించి ముద్రించడమనేది ఒక యజ్ఞంగా  భావించి తెలుగు అకాడెమీ విజయవంతంగా నిర్వహిస్తున్నదన్న ఉపముఖ్యమంత్రివర్యుల అభినందన’, నిష్ణాతులచేత రచింపజేసిన ఈ లఘుగ్రంథాలను పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకం వెలిబుచ్చిన సాంస్కృతికశాఖ మంత్రివర్యుల ప్రస్తావన’, సమస్త విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతో ‘జాతి సంపద’ అ నదగిన పుస్తకాలను ప్రచురిస్తున్నామని అకాడెమీ సంచాలకులవారు నొక్కి వక్కాణించిన భూమిక - నిజమని నమ్మి, కొని, చదవటానికి సాహసించినపుడు కళ్ళుతిరిగే అంశాలు వెలుగు చూశాయి.

దక్షిణాదికి చెందిన ఏషియానెట్ అనే ప్రైవేట్ టీవీ సంస్థ తమ రోజువారీ కార్యక్రమాలలో ఒక అరగంట కాలాన్ని తెలుగు కార్యక్రమాలకు కేటాయించింది... ఈ వ్యవస్థ నుండి తెలుగు ప్రసారం ఉండేదనే విషయం దాదాపుగా తెలుగువారికి ఎవ్వరికి తెలియదుఅంటూ ఒక బ్రహ్మ రహస్యం వెల్లడించారు. పనిలో పనిగా జీ టీవీ ని కూడా ప్రస్తావించి అది కూడా అర్థగంటపాటు తెలుగులో కార్యక్రమాలు ప్రసారం చేసేదని సెలవిచ్చారు. కానీ వాస్తవం అది కాదు. కేరళకు చెందిన శశికుమార్ జీ టీవీ నుంచి మూడేసి గంటల సమయం కొనుక్కొని నాలుగు దక్షిణాదిభాషల్లోనూ ( ఏషియానెట్ తెలుగు, ఏషియానెట్ మలయాళం, ఏషియానెట్ కన్నడ, ఏషియానెట్ తమిళ్ ) ప్రసారాలు ప్రారంభించారు. సాయంత్రం 5 నుంచి 8 గంటలదాకా ప్రసారాలు అందేవి. అందులో ఏషియానెట్ తెలుగు ఛానల్ కోసం మునీర్ అహ్మద్, హరిహరన్, సి.జె.రెడ్డి కార్యక్రమాలు రూపొందించేవారు. కేబుల్ సరిగా విస్తరించకపోవటం వలన తప్పనిసరి పరిస్థితుల్లో మూతబడటం సంగతి సరే సరి. అదే విధంగా జైన్ టీవీ కూడా ప్రత్యేకంగా తెలుగు ప్రసారాలు అందించింది. శరత్ మరార్ సారధ్యంలో సుమంత్, జయంత్ తదితరులు పనిచేసేవారు. అందులో తొలి యాంకర్ అనితా చౌదరి. అప్పుడే అందులో గంటపాటు కొత్త సినిమాపాటలు, షూటింగ్స్ తదితర అంశాలతో కార్యక్రమం నిర్వహించుకోవటానికి తరంగసుబ్రహ్మణ్యం గారికి స్లాట్ కేటాయింపు కూడా జరిగింది. అప్పట్లో యుమాటిక్ హైబాండ్ టేపుల్లో రికార్డు చేసి శ్రీలంక పంపి అప్ లింక్ చేసేవారు. ఇదీ శాటిలైట్ చానల్స్ లో పాక్షిక తెలుగు ప్రసారాల స్థూల చరిత్ర.

ఇక జెమిని టీవి శీర్షిక కింద సన్ నెట్ వర్క్ ‘జెమినీ టీవి’ పేరుతో ఒక తెలుగు ఛానల్ ను ప్రారంభించింది.అని రాశారు. తొలి తెలుగు శాటిలైట్ ఛానల్ విషయంలోనూ తప్పులు తప్పలేదు. నిజానికి జెమినీ టీవీ ప్రారంభించింది ఎల్వీ ప్రసాద్ మనుమలు రవిశంకర్ ప్రసాద్, మనోహర్ ప్రసాద్. రెండేళ్ళు గడిచాక ఆర్థిక ఇబ్బందుల మధ్య సగం వాటాను సన్ నెట్ వర్క్ కు అమ్ముతూ ఆర్థికలావాదేవీల బాధ్యత సన్ వాళ్ళకే అప్పగించారు. కాలక్రమంలో మరిన్ని ఛానల్స్ మొదలుపెట్టడం , ఆ తరువాత పబ్లిక్ ఇష్యూకు వెళ్ళటం, నెట్ వర్క్ విస్తరణలో భాగంగా జెమినీ తొలి యజమానుల వాటా క్షీణించటం తెలిసిందే.

జెమిని టీవి తెలుగునాట కూడా తన ఛానల్స్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేసింది.... ఆ వృద్ధిలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపైన ఒక సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించగలిగింది జెమిని టీవి. దక్షిణాది భాషలకు సంబంధించి ఒక్క జెమిని టీవి వ్యవస్థ 32 ఛానల్స్ నిర్వహిస్తూ 95 మిలియన్ల ప్రేక్షకులకు చేరుతూ, 27 దేశాల్లో తన ప్రసారాలకు ఉనికిని ఏర్పరచుకుందంటే మనకి ఆశ్చర్యం కలుగుతుందిఅంటారు ఈ పుస్తకంలో.  జెమినీ ఛానల్స్ అన్నీ తెలుగువే కదా? రచయిత సన్ నెట్ వర్క్ కూ. జెమినీ కీ మధ్య తేడా తెలియక సన్ గొప్పదనాన్ని జెమినీ కి ఆపాదించి రాసుకుంటూ పోయారు. జెమినీ గ్రూపులో ఆరు ఛానల్స్ ఉన్నాయని ఇంకోచోట ఒప్పుకుంటారు. మళ్ళీ ఈ విషయం మరిచిపోయి జెమినీ పట్ల తనకు కలిగిన ఆశ్చర్యాన్ని రచయిత అందరికీ అంటగట్టారు. 95 మిలియన్లు అనకపోతే హాయిగా తొమ్మిదిన్నర కోట్లు అనవచ్చుగా అంటూ సలహా ఇవ్వటం ఇక్కడ అప్రస్తుతం కావచ్చు.
ఈటీవీ గురించి చెబుతూ ఆ ఛానల్ సాహిత్యసేవ గురించి మాత్రమే ప్రస్తావించటం దురదృష్టకరం. మార్గదర్శి లాంటి కార్యక్రమం గురించిగాని, తెలుగులో మొట్టమొదటి 24 గంటల న్యూస్ ఛానల్ ఈటీవీ 2 అనే విషయాన్ని గాని ఎక్కడా ప్రస్తావించలేదు. చరిత్రలో నమోదుకావలసిన ఇలాంటి విషయంలో ఉపేక్షను ఎలా అర్థం చేసుకోవాలి? అదేవిధంగా మాటీవీ గురించి చెబుతూ, ‘మాటీవీ మనందరి టీవీ’ అనే  నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన మొదటి ఛానల్ గా అభివర్ణించారు. ఎవరి నినాదం వారికే సొంతం. ఈటీవీ వాళ్ళు ఈటీవీ మీ టీవీఅనే నినాదంతో వచ్చారు. మెరుగైన సమాజం కోసంఅనేది టీవీ9 నినాదం. ఇందులో సొంతమని, మొదటి ఛానల్ అనిగాని ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది? ఎవరి నినాదం వాళ్ళదే. అదే సమయంలో తెలుగులో తొలి ‘పే ఛానల్’ గా మాటీవీ ఆరంభంలోనే చందాలు వసూలు చేసిన విషయాన్నిమాత్రం విస్మరించారు. ‘మా టీవి’ ఈరోజున సినీప్రముఖుల అజమాయిషీలో ముందుకు సాగుతోంది’  అన్నారుగాని ఆ ఛానల్ లో సినిమా వాళ్ళది 40 శాతం వాటా మాత్రమేనన్నవిషయం గుర్తించలేదు. ‘కలర్స్’ అనే కార్యక్రమం తరువాతే యాంకర్ల ప్రతిభాపాటవాలు వ్యక్తమయ్యే విధంగా ఛానల్స్ లో కార్యక్రమ ప్రసార సరళి ప్రారంభమైందని, కన్యాశుల్కం నాటకం ప్రసారం చేసి ‘మా టీవీ’ తన స్థాయి పెంచుకునే ప్రయత్నం చేసిందని అలవోకగా కొన్ని అభిప్రాయాలు జనం మీదికి విసిరారు. ఇవి ఎలాంటి ప్రాతిపదికా లేకుండా రచయిత ఏర్పరచుకున్న సొంత అభిప్రాయాలు మాత్రమే. ‘మా జూనియర్స్’ ఛానల్ ను యాజమాన్యం ‘మా గోల్డ్’ గా మార్చిన విషయం రచయిత దృష్టికి రానట్టుంది. టీవీ9 తన అనుబంధ ఛానల్ గా టీవీ 1 ప్రారంభించినట్టు రాశారుగాని అంతకుముందు అదే ఛానల్ సంస్కృతిపేరుతో నడిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ‘జీ తెలుగు’ అని రాయాల్సిన చోట ‘జీ టీవీ’ అని రాశారు.

టీవీ 9 విషయంలో మాత్రం కాస్త ఉదారంగా వ్యవహరించి పొగడ్తల్లో ముంచేశారు. మిగిలినవాటి గురించి అందులో సగమైనా రాయకపోవటం మాత్రం అన్యాయం. టీవీ 5 గురించి నామమాత్రంగా చెప్పారు. కాకపొతే  కొన్ని సంచనాలను కూడా నమోదు చేసుకున్నదంటూ ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ఈ ఛానల్ గురించి రాసిన ఒక వాక్యం గమనించండి. ‘ఎనిమిది ఓబీ  వ్యాన్లు  కలిగి ఉన్నా, ఈ ఛానల్ త్వరితగతిన వార్తలు అందించే కృషి చేస్తోంది. అంటే అర్థమేంటో ? వార్తలు వేగంగా అందకుండా ఓబి వాన్లు అడ్డుకుంటాయా? ఆ అడ్డంకులను తోసిపుచ్చి మరీ త్వరితగతిన వార్తలు అందించేందుకు టీవీ 5 వాళ్ళు కృషి చేస్తున్నారా? ఇక ‘ఎన్ టీవీ’ వారు 12 డి.ఎస్.ఎన్.జి. వ్యాన్లతో  ప్రారంభించి రికార్డు సృష్టించారని రాసినవాళ్ళు ఆ తరువాత పాతికదాకా డి.ఎస్.ఎన్.జి. వాన్లు వాడిన ‘సాక్షి టీవీ’ ఆ రికార్డును బద్దలు చేసినట్టు ఎందుకు రాయలేదో? ఎన్ టీవీ’ గురించి ఐదారు వాక్యాలతో సరిపెట్టి, వనిత’, భక్తి’ ఛానల్స్ ను మాత్రం ఆకాశానికెత్తేశారు. కర్ణాకర్ణిగా విన్నది, తనకు తెలుసనుకున్నది రాయటమే తప్ప తెలుసుకొని రాయటం కనిపించదు.

‘రాజ్’ టెలివిజన్ నెట్ వర్క్ సంస్థ టి.ఆర్.ఎస్. తో కలిసి రాజ్ న్యూస్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. పైగా, తెలంగాణ ప్రాంతపు వార్తల్ని, వార్తావిశేషాల్ని, తెలంగాణ సంస్కృతిని విస్తృతంగా ప్రేక్షకులకు అందించాలనే ధ్యేయంతోనే ఈ రాజ్ న్యూస్ టీవీ ఛానల్ ఏర్పడింది అంటారు. వాస్తవం అది కాదు. తమిళనాడుకు చెందిన రాజ్ నెట్ వర్క్ వాళ్ళకు రాజ్ న్యూస్ తెలుగు అనే ఛానల్ లైసెన్స్ ఉంది. దాన్ని టి.ఆర్.ఎస్. కు లీజుకిచ్చారు. సొంత లైసెన్స్ రాగానే టి.ఆర్.ఎస్. వాళ్ళు ‘టి ఛానల్’ పెట్టుకున్నారు. అంతే తప్ప తెలంగాణ కోసం రాజ్ న్యూస్ ఛానల్ పెట్టలేదు. ఇక ఐ న్యూస్, మహాటీవీ, స్టుడియో ఎన్, వి 6 గురించి ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా రాయకపోగా జీ 24 గంటలు, టి ఛానల్ గురించి ఒక్కో వాక్యంతో సరిపెట్టారు. విస్సా గురించి రాసినదాంట్లో సగం కూడా ప్రస్తావన లేని ఛానల్స్ చాలా ఉన్నాయి.

సాక్షి టీవీ విషయానికొస్తే, దాని సాంకేతికపరిజ్ఞానం గురించి తప్ప ప్రసారాలగురించి రాయటానికి ఇబ్బంది ఏమిటో తెలియదు. ఆ రాసిన నాలుగు ముక్కలూ అలా అట , ఇలా అట అంటూ పొడిపొడిగా రాయటానికి ఏ ప్రత్యేక కారణాలున్నాయో మరి. ఇంకా చిత్రమేంటంటే, ఐ న్యూస్ చానల్ ప్రసారాలు ప్రస్తుతం అందుబాటులో లేవని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి సోదరుడు వాటాలు తీసుకున్నారని లోకమంతా కోడై కూస్తున్న సమయంలో ఐ న్యూస్ అనే ఛానల్ ఆగిపోయిందని రాయటం ఎంత దుస్సాహసం? ఛానల్స్ జాబితా ఇస్తూ న్యూస్ ఛానల్స్ లో జెమినీ న్యూస్, వి 6, సివిఆర్ న్యూస్, ఆర్.వి.ఎస్. ఛానల్స్ పేర్లే మరచిపోయారు. ఛానల్ 7 హెల్త్ ప్లానెట్, సివిఆర్ హెల్త్ అనే రెండు ఛానల్స్ పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇతర ఛానల్స్ విభాగంలో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ పేరు రాసి డిస్కవరీ ని, ట్రావెల్ ట్రెండ్జ్ ను వదిలేశారు. విద్య, ఉద్యోగావకాశాలకోసమంటూ ప్రారంభించిన ఏ  టీవీ’ ఇప్పుడు న్యూస్ ఛానల్ గా మారబోతున్నది. దాన్ని విదేశీయులు నడుపుతున్నట్టు చెప్పారు. నిజానికి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అందులో మెజారిటీ వాటా కొనుగోలు చేశారు. ‘మన టీవీ’ ఇంకా వస్తున్నట్టు రాస్తూ ‘సత్య టీవీ’ విదేశాలనుంచి ప్రసారమవుతున్నట్టు చెప్పారు. సత్య టీవీ అనేది లైసెన్స్ రద్దయిన న్యూస్ ఛానల్. ‘ఆర్.కె. న్యూస్’, జనతా న్యూస్’, లోకల్ టీవీ’ అనేవి కేబుల్ టీవీలన్న విషయం రచయితకు తెలిసినట్టు లేదు. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖవారి వెబ్ సైట్ లో చూసి వివరాలు తనిఖీ చేసుకునేంత కనీస జాగ్రత్తకూడా తీసుకోకపోవటం వల్ల తప్పులు మరీ ఎక్కువయ్యాయి.


‘అనేక ప్రాంతీయ భాషల్లో ప్రభుత్వానికి విస్తృతంగా ప్రసారాలు సాగించే మార్గం నిర్మితమైంది’. ఈ వాక్యం నాకైతే అర్థం కాలేదు. రెండున్నదశాబ్దాలకు పైగా దృశ్యమాధ్యమంలో కార్యక్రమనిర్వాహకులుగా పనిచేసిన కవిపండితుల వాక్యం సామాన్యులకూ అర్థం కావాలిగదా! గ్రంథ రచయితగాని, భాషాసేవలో తలమునకలైన తెలుగు అకాడెమీ పెద్దలుగాని వివరిస్తే వినాలని ఉంది. ‘ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి’ గురించి రాస్తూ ఎబిఎన్ అంటే ఆర్మొడా బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్ అని సెలవిచ్చారు. ‘ఆమోదా’ను ఆర్మొడాగా మార్చింది ముద్రారాక్షసమేనా? కాబోలునని సరిపెట్టుకుందాం. ‘ఈ ఛానల్ ప్రముఖులైన వారితో పరిచయ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి అంతరంగాలను ఆవిష్కరించే కార్యక్రమాలు కూడా ఈ  టీవీకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చాయి’ అని రాశారు. వాక్యం మొదట్లో ‘ఈ ఛానల్’ అని రాసి మళ్ళీ ముగించే ముందు కూడా ‘ఈ టీవీ’ అని రాశారు. రచయిత ఈ గ్రంథం అంతటా ఇలాంటి ప్రయోగాలు చేశారు. ఈ ఛానల్ అని రాయల్సిన ప్రతిచోటా ఈ టీవీ అంటూ రాసి పాఠకులు ఈనాడు టెలివిజన్ ను గుర్తుకు తెచ్చుకొని అయోమయానికి గురయ్యేట్టు చేశారు. జీ తెలుగు ఛానల్ గురించి రాస్తూ, కొన్ని దశాబ్దాల క్రితం హిందీలో అనూహ్యమైన విజయాన్ని మూటగట్టుకున్న చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ప్రసారం చేశారు. అయినా ఈ ఛానల్ కు ప్రజాదరణ లభించలేదు’ అంటారు. అంటే, ఒక విజయవంతమైన చిత్రాన్ని ప్రసారం చెయ్యగానే ఛానల్ ప్రజాదరణ పెరిగిపోవాలా?

వెనుక అట్టమీద ఈ గ్రంథ సారాంశాన్ని, ఆవశ్యకతను, ప్రచురణ లక్ష్యాన్ని ఇనుమడింపజేస్తున్నట్టు సూచించేలా ఐదారు వాక్యాలు రాసే ప్రయత్నం చేశారు. అందులో మొట్టమొదటి వాక్యం ఇది : ‘ఈ శతాబ్దపు తొలిరోజులు మనకి అందించిన ఒక అద్భుత సాంకేతిక పరిజ్ఞానం ఫలం’. ఎన్నిసార్లు చదివినా ఈ వాక్యం అర్థం కాలేదు. ముందుమాటల్లోకి వెళ్ళి చూస్తే, దీన్ని ఆదరిస్తారని మంత్రిగారు విశ్వాసం వెలిబుచ్చినవారిలో పండితులు, తెలుగు భాషాభిమానులతో బాటు పాఠకులు కూడా ఉన్నారు. బహుశా పండితులు, తెలుగు భాషాభిమానులు ఎలాగూ చదవరనే అభిప్రాయంతో పాఠకులు అనే ప్రత్యేకమైన తెగ గురించి మంత్రిగారు ప్రస్తావించి ఉంటారు. పండితులకు, తెలుగు భాషాభిమానులకు ఈ వాక్యం ఎలా అర్థమైందో వాళ్ళ మనసుల్లోకి దూరి చెప్పటం అసాధ్యమేగాని ఒక పాఠకుడిగా నాకు మాత్రం అర్థం కాలేదని ఏమాత్రమూ సిగ్గుపడకుండా మనవిచేసుకుంటున్నా. ఇక అక్షరదోషాల( ముద్రారాక్షసాల) గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తం గ్రంథంలో కనీసం మూడు నుంచి నాలుగు వందలు కనిపిస్తాయి.
93
పేజీల గ్రంథానికి 18 పేజీల ముందుమాటలు, వగైరాలూ ముగిశాక ‘ప్రైవేటు ఛానళ్ళు’  అనే 21 పేజీలున్న ఏడవ అధ్యాయంలో అడుగుపెట్టినప్పుడు ఎదురయ్యే అంశాలను మాత్రమే ఈ అధ్యయనంలో చర్చించాం. మిగిలిన 72 పేజీలూ ఒప్పులని కాదు అర్థం. ఈ చరిత్రను ఇంకా చాలా చెప్పాలనుకున్నప్పటికీ  గ్రంథ విస్తృతి’ని దృష్టిలో ఉంచుకొని దృశ్యమాధ్యమ ప్రస్థానంలో మైలురాళ్ళవంటి కొన్ని సంఘటనలు మాత్రమే యధోచితంగా ముచ్చటించడం జరిగింది’  అని రచయిత వోలేటి పార్వతీశం గారు చెప్పుకున్నట్టే, ఆయన బాటలోనే నేను కూడా వ్యాస విస్తృతిని దృష్టిలో ఉంచుకొని 21 పేజీలలోని అంశాలకే పరిమితమయ్యాను. మొత్తం గ్రంథం గురించి రాయటం మొదలెడితే అసలు గ్రంథాన్ని మించిపోతుందన్న భయం నన్ను వెంటాడుతోంది. అవసరమైనవి ఏవి వదిలేశారో, అనవసరమైన వివరాలు కొండవీటి చేంతాడులా ఎక్కడెక్కడ ఇచ్చారో, కేవలం సాహిత్యకోణంలోనే చానల్స్ ను బేరీజు వేయటం ఎంతవరకు సబబో ఇక్కడ చర్చించటం లేదు. చరిత్ర రచనలో ముఖ్యఘట్టాలను నమోదు చేయాల్సివచ్చినప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇవ్వడమేంటనే పండితచర్చలోకి దిగటం కూడా ఇక్కడ భావ్యం కాదని ముగిస్తున్నా.

‘ఈ గ్రంథంలో ప్రచురితమైన విషయాలకు, వివరాలకు, అభిప్రాయాలకు ఆయా రచయితలు/రచయిత్రులే బాధ్యులు’  అనే ఒకే ఒక్క షరతు ( చట్టబద్ధమైన హెచ్చరిక? ) ముద్రించామని తెలుగు అకాడెమీ వారు తప్పించుకున్నామని అనుకోవచ్చునేమోగాని కుప్పలు తెప్పలుగా కనిపించే అక్షరదోషాలకూ, అన్వయలోపమున్న వాక్యాలకూ బాధ్యులం కాదనటం మాత్రం ఒక భాషా సంస్థ తన నైతికబాధ్యత నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నమే అవుతుంది. ‘దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో సవరించగల’మని అకాడెమీ సంచాలకులవారు తెలియజేశారుగాని తప్పుల కుప్పలాంటి ఈ లఘుగ్రంథాన్ని ఎలా సవరిస్తారో ! బహుశా వెంట్రుకలు ఏరుకుంటూ గొంగట్లోనే అన్నం తింటారేమో!"

--
తోట భావనారాయణ
టీవీ జర్నలిస్ట్
(05-01-2013)

4, జనవరి 2013, శుక్రవారం

వ్యక్తిత్వ వికాసం బోధించే హిందూ దేవుళ్ళు




వ్యక్తిత్వ వికాసం బోధించే హిందూ దేవుళ్ళు







ఈ రోజు భక్తి టీవీ ఛానల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.
పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ చక్కని ముక్కలు చెప్పారు.
శ్రీ దేవి అంటే లక్ష్మీదేవి. సకల సంపదలు అనుగ్రహించే దేవత. భూదేవి అంటే భూమాత. చరాస్తికి ప్రతిరూపం శ్రీదేవి. స్తిరాస్తికి సంకేతం భూదేవి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ఇద్దరు దేవేరులను తన వక్షస్థలంపై కుడి ఎడమల  ప్రతిష్టించుకున్నాడు. తనను దర్శించ వచ్చే భక్తులకు   భౌతిక సుఖాలకు నెలవయిన ఈ ఇద్దరినీ కాకుండా   వామ హస్తంతో తన  పాదాలను చూపిస్తుంటాడు. చరాస్తులు, స్తిరాస్తులు ప్రధానం కాదు మనిషి అనేవాడు తన సొంత ప్రతిభతో  సొంత కాళ్ళపై నిలబడాలని  వ్యక్తిత్వ వికాస బోధకులు ప్రబోధించే సూత్రాన్ని స్వామి ఆ విధంగా భక్తులకు బోధిస్తున్నాడన్న మాట.
ఇక పరమేశ్వరుడిని తీసుకుంటే ఆయన వొంటిపై అన్నీ పాములే. ఒక సర్పాన్ని చూస్తేనే వొళ్ళు జలదరిస్తూ వుంటుంది. అలాటిది అన్ని నాగుపాములను ధరించి కూడా శాంత మనస్కుడిగా వుండగలగడానికి కారణం ఆయన సిగలో నెలవయిన గంగమ్మ తల్లి. అన్నిరకాల ఉద్రికతలను ఉపశమింపచేయడానికి మెదడును ఎల్లప్పుడు చల్లగా, ప్రశాంతంగా  వుంచుకోవాలని చెప్పడమే శివతత్వం.
పోతే కృష్ణుడు. గోవులను కాచే గోపాలకుడు. గోవర్ధన గిరిధారి. హిందీలో గోవర్  అంటే గోమయము. (ఆవు పేడ) ధన్ అంటే ధనము. ఏడాది పాటు లభించే  ఒక్క ఆవుపేడతో కొన్ని ఎకరాల భూమిని సారవంతం చేయడానికి వీలుపడుతుంది. అలా పరిపుష్టమయిన భూమిలో  పంటలు బాగా పండుతాయి. దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వుంటుంది. ఆహారానికి కొరత వుండదు. ఆవిధంగా   సస్యశ్యామలమయిన పల్లెటూళ్ళే దేశానికి ఆయువుపట్లు.
ఇలా హిందూ దేవతలనుంచి వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే మంచి విషయాలను నేర్చుకోవచ్చని పరిపూర్ణానందస్వామి వాక్రుచ్చారు.
మంచి మాటలు నాలుగు చెవిన వేసుకోవడం మంచిదే కదా!
శుభం! 
(04-01-2013) 

ఏనుగు శీర్షాసనం చూశారా!


(ఈనెల పద్నాలుగో తేదీ ‘జంధ్యాల’ జయంతి)

ఏనుగు శీర్షాసనం చూశారా!



ఆయనతో పరిచయం యెలా జరిగిందో గుర్తు రావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా, స్తూలకాయానికి ఎక్కువగా వుండేవారు. పేరు మాత్రం కురచ. వరప్రసాద్.  వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువ. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ శాసనాలు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ విషయాలు కరతలామలకం. భారత, భాగవత, రామాయణాలు ఆసాంతం  ఆపోసన పట్టిన వ్యక్తి. పద్యాలు, వేల సంఖ్యలో సంస్కృత  శ్లోకాలు కంఠతా వచ్చు. అష్టాదశ పురాణాలు తడుముకోకుండా చెప్పగల సామర్ధ్యం ఆయన సొంతం. కుతర్కంతో కాక  తర్కంతో తన వాదన నెగ్గించుకునే ఈ మహానుభావుడు సూర్యోదయానికి పూర్వమే లేచి ఎంతో నిష్టగా అనుష్టానలన్నీ పూర్తిచేసుకుని ఇంటి నుంచి బయట పడడం తరువాయి ఆయన జీవన శైలి ఈనాటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.
ఎమర్జెన్సీ తరువాత జనతా సర్కారు ఇందిరా గాంధీపై పెట్టిన అనేక కేసులను ఆవిడ తరపున వాదించానని ఆయనే అనేకసార్లు చెప్పుకున్నారు. జ్వాలా నేనూ ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందుకు దాఖలా అన్నట్టు పలువురు పెద్దలను మాకు పరిచయం చేసి, వారితో తన సాన్నిహిత్యాన్ని తెలియచెప్పారు. దేశ రాజధానిలో   అంతంత స్థాయిలో పరిచయాలు కలిగిన వ్యక్తి  హైదరాబాదులో మాత్రం లాంబెట్రా స్కూటరు మీద తిరిగే వాడు. ఆరోజుల్లో మాకు స్కూటరు సరే సైకిల్ కూడా వుండేది కాదు. కాబట్టి ఆయన్ను సందేహించే పరిస్తితి మాది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరు మీద చిక్కడపల్లిలో మేముంటున్న ఇంటికి వస్తుంటే మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.
ఎక్కడ వున్నా త్రికాలసంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఢిల్లీలో మేము ఆయనతో కలసి కుతుబ్ మినార్ చూసివస్తున్నప్పుడు సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి దారిపక్కన నీటి  చెలమ వున్నచోట కారు ఆపించి సంధ్యావందనం చేసివస్తుంటే టాక్సీ డ్రైవర్ కూడా ఆశ్చర్య పోయాడు.


అలా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళాము. అక్కడి బుక్ స్టాల్లో పుస్తకాలు తిరగేస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే ఒకాయన మా వైపు తెలుగు వాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి ‘మీరు శ్రీనివాసరావు కదూ!’ అని పలకరించారు. ఆయన ఎవరో కాదు హాస్య సినీ బ్రహ్మ జంధ్యాల. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాంలో క్లాసుమేటు. సినీ రంగంలో అడుగుపెట్టి బాగా పేరు తెచ్చుకుంటున్న రోజులవి. ఆయన అసలు పేరు జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఆయన ఆ హోటల్లోనే దిగారుట. చాలా ఏళ్ళ  తరువాత కలిసిన మమ్మల్ని జంధ్యాల తమ రూముకు తీసుకు వెళ్లారు. వెళ్ళీ వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటని సందేహించకుండా ‘ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా’ అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు. తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణం’ సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల – విశ్వనాద్ గారిదే మరో సినిమా ‘సప్తపది’కి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిలో కొన్నింటిని ‘సప్తపది’ సినిమాలో జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే – నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది. ఆ రోజుల్లో జంధ్యాల ఒక్కడే మొత్తం కాలేజీలో ‘కారున్న కుర్రకారు’. ప్రిన్సిపాల్ కూడా కాలేజీకి రిక్షాలో వస్తుంటే, జంధ్యాల మాత్రం సొంత కారులో వచ్చేవారు. ‘సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ,వేస్తూ సరదాగా వుండేవారు. అలాటి జంధ్యాలలోని మరో కోణాన్ని ఢిల్లీలో చూడగలిగాను. అలాగే మా వెంట వచ్చిన లాయరు గారు. ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కళ్ళారా చూసి, చెవులారా విన్న తరువాత ఆయనపై వున్న దురభిప్రాయం దూదిపింజెలా ఎగిరిపోయింది. ‘వినదగునెవ్వరు చెప్పిన’ సూక్తిలోని  వాస్తవం మరోమారు  బోధపడింది.
మనం చెప్పిందే ఇతరులు వినాలన్న ఆత్రంలో యెంత నష్టపోతామో అర్ధం అయింది. సజ్జన సాంగత్యంలో వొనగూడే లాభం ఎరుకలోకి వచ్చింది.
ఇప్పుడు వారిద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. 
(అక్టోబరు 10,2010)                                               

2, జనవరి 2013, బుధవారం

చెప్పుకోండి చూద్దాం ?



చెప్పుకోండి చూద్దాం ?



సుబ్బారావు ఆయన  భార్య కలసి నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లారు. ప్రవేశ రుసుం తల ఒక్కింటికీ పది రూపాయలు.
సుబ్బారావు దంపతులకు ఏడుగురు సంతానం.
వారిలో ఇద్దరు మగ అయిదుగురు ఆడ.
అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి.
మగపిల్లలు ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు.
ఆడపిల్లలకు ఒక్కొక్కరికీ మళ్ళీ ఆరుగురు సంతానం.
ఇప్పుడు చెప్పండి.
ప్రవేశ రుసుం కింద సుబ్బారావు గారు యెంత చెల్లించి వుంటారు?

Image Courtesy : CartoonStock.com 

సర్వకళల సమాహారం – హరికధ – ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు


సర్వకళల  సమాహారం – హరికధ – ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

(ఈ రోజు, జనవరి రెండో తేదీ హరికధా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి వర్ధంతిని పురస్కరించుకుని) 




హరికధలంటే బోరు కొట్టే కధలు  కాదు. హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. ప్రజలను సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు. 
ఈ నాటి పిల్లలకు కాని ఇంకా చాలామంది  పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము.     ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.
యాభయ్, అరవై దశకాల్లో అయితే  హరికథ ఎంతో  ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలోవినాయక చవితిదేవి నవరాత్రుళ్ళుశ్రీరామ నవమి పందిళ్ళలోపెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే  శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి.  మధ్య మధ్యలో వేసవికాలంలో  కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమోమహా భారతమో సీరియల్ గా చెప్పించుకొనేవారు.    సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా  నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ  పెట్టించే వారు.

హరికధ అనేది  సర్వ కళాసమాహారం.  హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యంసంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ,భారత,భాగవతాదులు కరతలామలకంగా వుండాలి.  కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి.  వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం.  ఇన్ని వుంటేనే  ఉంటేనే దాసుగారికి బంతిపూల దండలు  దండిగా పడేది.  హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు.  అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా.  హరికథకి వయోలిన్మృదంగం పక్క వాయిద్యాలు.  దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు.  దాసు గారి ఆహార్యం పట్టు పంచెపట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్.

కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను  ఏ కధ  చెప్పదలచుకొన్నారన్నది  సూచన ప్రాయంగా తెలియచేస్తూ  రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడిగజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని  కాళ్ళకు కట్టుకొని‘శ్రీమద్రమారమణ గోవిందాఅని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ  కథలోకి ఉపక్రమించే వారు.  కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనే  వారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను మేలు కొలిపెందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు.  సినిమాలో కూడా హరికథలు పెట్టేవారు.  పది పదిహేను నిమషాలు ఉండేవి.  విజయా వారి షాహుకారు సినిమా హరికథ తోనే ప్రారంభం అవుతుంది.  నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన  సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.
హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది.  విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు  ద్వారం వెంకట స్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళా శాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ  చెప్పే ప్రతివారు మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామనో చెప్పుకొనేవారు.  ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణ దాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.
కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు.  భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పే వారు.   లలిత సరస గాన కళానిధే అంటూ ప్రార్ధన చేసేవారు.  లేచి నిల్చున్న  వెంటనే వాసుదేవ అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడే వారు.  సందర్భానికి తగ్గట్టుగా  పిట్ట కథలు చెప్పే వారు.  పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే.  పోతన గారిలాగే  కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను  అమ్ముకోలేదు.  ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పెద్ద వారయినా పెద్ద మనసు వున్నవారు.  ప్రాతఃస్మరణీయులు.  అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు.  చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు.  స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు.మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది.  నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే.  శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. అమ్ముల విశ్వనాధం గారి అమ్మాయి దుర్గాభవాని ప్రస్తుతం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.
సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు.  గుళ్ళో కళ్యాణ మండపం స్టేజిగా రామాయణమోభారతమో పూర్తిగా చెప్పించే వారు.  రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది.  మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు.  హరికధ వినడానికి వచ్చిన  హారతి పళ్ళెంలో  తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు.  పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి  దీపం పెట్టే వాళ్ళు.  చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని జోకులు కూడా ఉండేవి. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. ‘నా దగ్గర పావలా వుంది నేను వో అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యిఅని అడిగి తీసుకునే వారు.వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావు,  ర్యాలి రామచంద్ర రావుకంచిభొట్ల వీర రాఘవయ్యనౌడూరి విశ్వనాధ శాస్త్రి కడలి వీరదాసుముదపాక మల్లేశ్వర రావుప్రగడ వీర భద్ర రావుముదునూరు శంకర్ రావుఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరుతెచ్చుకున్నారు.  ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా.  హైస్కూల్ లో తెలుగు మాష్టారుగా వుండే వారు. త్యాగరాజ చరిత్రను  రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు.    పాతూరి మధుసూదన్ రావు  గారు  మొత్తం సంస్కృతంలోనే హరికథ చెప్పే వారు, సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, ఏ కధ అయినా అనర్ఘళంగా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది.  గాంధీనెహ్రు, బోస్  చరిత్రలు కూడా ఆయన హరికధలుగా  చెప్పే వారు.
తర్వాత తరంలో అందరికీ  తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద  శాస్త్రి గారు.  చాలా రమణీయంగా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నాఇంకా ఇంకా  వినాలనిపించేలా చెప్పేవారు.
బుర్రా  శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు.  ఆడ వారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి  కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశంతో పాటు ఇతర రాష్ట్రాలోని తెలుగు వారికి సయితం  అభిమాన పాత్రులయ్యారు.  నగరాజకుమారివజ్రాల విజయ శ్రీ మంత్రిప్రగడ లలిత కుమారి చెప్పే  హరికథలు అంటే జనం  చెవి కోసుకొనే వారు.  
పోతే, మరో ప్రసిద్ధ హరికధా విద్వాంసులు బుద్ధవరపు కురంగేశ్వర రావు గారు. వీరి గురించిన ప్రస్తావన  ‘నియోగి సర్వస్వం’ లో వున్నట్టు మిత్రుడు బుద్ధవరపు రామకృష్ణ  తెలియచేసారు. హరి కధలు చెప్పడంలో వీరు అందె వేసిన చేయి. అపర రామ దాసు అని పేరు. రామదాసు హరికధ చెబుతూ రామా రామా అంటూనే కైవల్యం చెందారట. ప్రసిద్ధ రచయిత శ్రీ నిడదవోలు వెంకటరావు గారు శ్రీ కురంగేశ్వర రావు గారి హరికధా గాన ప్రశస్తి గురించి తన రచనల్లో ప్రస్తావించారు. ఆయన తన అనుభవాన్ని ఇలా రాశారు. “ నేను వీరి కధను విని తన్మయత్వము చెందిన వారిలో ఒకడిని. కధ చెబుతూ భక్తి పారవశ్యములో అట్లే నిలిచెడివారు. అప్పుడు హారతి నొసగిన తరువాత తిరిగి కధ  ప్రారంభించెడివారు.”
రాజమండ్రి  దగ్గర కపిలేశ్వరపురం జమీందార్  సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి   అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు.  ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో  చాలా మంది కపిలేశ్వరపురం  గురుకులం  విద్యార్ధులే -  ఉమా మహేశ్వరితో సహా.  ఉమా మహేశ్వరి  చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ  చెప్పి అందరిని మెప్పించారు.  మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ  దంపతులిద్దరూ  వొకరు పేరిణి నాట్యం ద్వారా  మరొకరు హరికథ ద్వారా కళాసేవ  చేస్తున్నారు.
ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు.  తెలుగు యూనివర్సిటీ వారు  తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో  కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని  దాచుకోవాల్సిన పుస్తకం.

రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనంనాటక సప్తాహంలాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనాకర పత్రాల పైనా రేడియో ఆర్టిస్టుఅని వేసుకొనే వారు.  ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో తెలియదు. చేస్తే  చాలా సంతోషం. మానేస్తే  అంత కంటే అన్యాయం మరోటి వుండదు.  తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు.  తమిళనాడులో ఇంకా హరికధ  ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.

గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధా గాన కళా పరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి. (02-01-2013)