27, ఏప్రిల్ 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (300) : భండారు శ్రీనివాసరావు

 

రోడ్డు దాటగలవా ఓ నరహరి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.
హైదరాబాదులో ఎర్రమంజిల్ ఐ.ఎ.ఎస్. కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. (ముఖ్యమంత్రికి వున్న విచక్షణ అధికారాలతో, ఔట్ ఆఫ్ టర్న్ పద్దతిలో చంద్రబాబు నాయుడు నాకు ఆ ఐ.జే. 2 క్వార్టర్ అలాట్ చేశారు. సీనియర్ ఐ.ఎ,ఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే ఆ కాలనీలో కారు లేని వాడిని, నేనొక్కడినే. ఇప్పుడు ఆ కాలనీ లేదు. మెట్రో కోసం నేలమట్టం చేశారు. మేము వున్న క్వార్టర్ స్థానంలో ఏదో పెద్ద షాపింగ్ మాల్ వచ్చింది)
అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పని కాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను రోడ్డు మధ్యలో డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈ లోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు.
నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి అబ్రహాం లింకన్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి’ అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం’ అన్నారు.
నేను మళ్ళీ సెక్యూరిటీ అధికారి దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.
ఇది జరిగి కొంచెం అటూ ఇటుగా ముప్పయ్ ఏళ్ళు దాటాయి.
ఈ సమస్య పరిష్కారం కాకపోగా దాని తీవ్రత ముప్పయ్ రెట్లు పెరిగింది.
2014 లో రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాదులో కొంత కాలంపాటు, ఉమ్మడి గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు డీజీపీలు, ఇలా ఇంతమంది వీ.వీ. ఐ.పీ. ల రాకపోకలతో ట్రాఫిక్ సర్దుబాటు చేయడానికి, సమన్వయం చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడేవారు.
రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయడం వల్ల వాహనదారులకు ఒకింత ఉపశమనం కలుగుతుంది. వారికోసం రోడ్లపై వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు వాడుకోవాలి.
ముఖ్యమంత్రులు కూడా తమ వ్యవహార శైలిలో కొంత మార్పు చేసుకోవాలి. సమయపాలన విషయంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావును ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన టైం అంటే టైం. వెళ్ళాల్సిన ప్రదేశానికి నిమిషం ఆలస్యం కాకుండా వెళ్ళే వాళ్ళు.
నేను విలేకరిగా చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. ‘టైం అవుతోంది బయలుదేరాల’ని సంబంధిత అధికారి మర్యాదగా సూచిస్తారు. ముఖ్యమంత్రి సిద్ధం కాగానే సెక్యూరిటీ అధికారి ట్రాఫిక్ వారికి సమాచారం ఇస్తారు. అంతే, ఆయన వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ నిలిపేస్తారు.
ముఖ్యమంత్రి అంజయ్య వున్నప్పుడు కళ్ళారా చూశాను. కారు ఎక్కబోతుంటే ఎవరో కలుస్తారు. తెరిచిన కారు డోరు పట్టుకుని ఆయన వారితో మాట్లాడుతూ ఆగిపోయేవారు. అంతసేపు దోవలో ట్రాఫిక్ నిలిపే వుంచేవారు. కాకపోతే ఆ రోజుల్లో ఇంత ట్రాఫిక్ లేదు. కాబట్టి ఇబ్బందుల తీవ్రత కూడా ఇంతగా వుండేది కాదు.
సమయానికి కూడా అంత విలువ వుండేది కాదు. బస్సులు, రైళ్లు కొంచెం ఆలస్యం అయినా జనం సర్దుకు పోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు. సమయం అంటే డబ్బుకు మరో రూపం. కార్పొరేట్ ప్రపంచంలో జీవించేవారికి ఆలస్యాలు అసలు పనికి రావు. అలాగే ఆసుపత్రులకు వెళ్ళే వారికి కూడా సమయం అమూల్యం. అమృత ఘడియల్లో (గోల్డెన్ అవర్స్ అని డాక్టర్లు అంటారు) రోగికి చికిత్స అందిస్తే రోగి బతికి బట్టకట్టే అవకాశాలు ఎక్కువ. అటువంటి వారిని తీసుకువెళ్ళే అంబులెన్సులకు సయితం ఈ ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు.
ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించడం వంటి చర్యలను చేపడితే మంచిది.
తోకటపా:
హైదరాబాదు విలేకరులకు మంచి స్నేహితుడు అయిన సమ్మెట విజయకుమార్ Vijaya Kumar Sammeta గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద దాదాపు పదేళ్లు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నిన్ననో మొన్ననో మాదాపూర్ వంద అడుగుల రోడ్డు వద్ద పాదచారుల అవస్థలు గురించి ఫొటోలతో సహా ఒక పోస్టు పెట్టారు. అదే ఈ పోస్టుకు ప్రేరణ.
కింది లింక్ అదే!
(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: