16, ఏప్రిల్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (293)



గుప్పెడు బియ్యం 

నిన్న అంటే ఏప్రిల్ పదిహేను మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు గారి భార్య విమల వదిన  పుట్టిన రోజు. ఊళ్ళో వున్న ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, ఇద్దరు మనుమరాళ్లు (నాలుగో వాడు, భార్య,  ఒక మనుమడు, మరి నలుగురు మనుమరాళ్లు విదేశాల్లో వున్నారు) అంతా కలిసి మా అన్నయ్య అభీష్టం మేరకు పెద్ద హడావిడి లేకుండా, సలక్షణంగా మా వదిన ఎనభయ్యవ పుట్టిన రోజును జరిపించారు. 

సత్యనారాయణ వ్రతం తర్వాత (నాకు ఈ వ్రతం ఇష్టం ఎందుకంటే ఇందులో ఎలాంటి కులగోత్రాల ప్రస్తావన వుండదు, సర్వ మానవ సమానత్వాన్ని బోధించే ఆధ్యాత్మిక క్రతువు అనేది మా పెద్దన్నయ్య ద్వారా నేను తెలుసుకున్నాను) ముగ్గురు కోడళ్ళు కలిసి అన్నయ్య వదినలకు పాటలు పాడుతూ మంగళ హారతులు ఇస్తుంటే ఏదో సినిమాలోని ‘ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా’ అనే పాట గుర్తుకు వచ్చింది.

ఏమైనా మా అన్నయ్యా వదినలు అదృష్టవంతులు. వాళ్ళ మంచితనమే, సేవా తత్పరతే వారికి అక్కరకు వచ్చింది. సకల సదుపాయాలు వుండే పెద్ద ఉద్యోగాలు చేసి, స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయి ప్రశాంతంగా, నిరాడంబరంగా  విశ్రాంత జీవనం గడుపుతున్నారు.  

ఇక మా వదిన  నా చిన్నతనంలో వృద్ధులైన మా తాతగారికి చేసిన సేవలు ఇన్నీ అన్నీ కావు.

మా మూడో తాతగారు సుబ్బారావు గారు మా రెండో అన్నయ్యను దత్తు తీసుకున్నారు. చివరి రోజుల్లో ఆయన పక్షవాతానికి గురై మంచాన పడ్డారు.

అప్పుడు మా అన్నయ్య నాగపూరులో ఎమ్మే చేస్తున్నారు. కనీసం కరెంటు సౌకర్యం కూడా లేని మా వూళ్ళో, జబ్బుతో కదలలేని స్థితిలో వున్న వరుసకు తాతగారైన మామగారికి అన్నం వండి కలిపి ముద్దలు చేసి  నోటికి అందించి తినిపించడం కళ్ళారా చూసిన వాడిని. ఆ సేవలు ఇప్పుడు ఆమెకు  పెద్దతనంలో అక్కరకు వస్తున్నాయి.

కోడళ్ళు నలుగురు ఆమెను ఎత్తుకు ఎత్తుగా చూసుకుంటున్నారు. అన్ని భాగ్యాల  కంటే ఇది గొప్ప భాగ్యం, నా దృష్టిలో. పెద్దతనంలో ఎవరికైనా కావాల్సింది పిల్లల అభిమానం, ఆదరణ, కాసింత ఆరోగ్యం. ఇక ఎన్ని సిరి సంపదలు వున్నా అవి చెప్పుకోవడానికి మాత్రమే.

గత కొన్నేళ్లుగా మా వలలి వనిత  వండిన నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని  ఈ పూటకు భోజనం అయింది అని  అనిపించడానికి అలవాటు పడిన నాకు, మా అన్నయ్య కోడళ్ళు కొసరి కొసరి వడ్డించడం మింగుడు పడని పని.

అయితే, నేను ఏమి తిన్నాను, ఏమి వదిలేసానో  ఓ కంట కనిపెట్టి చూడడం వారికి మాత్రమే చెల్లు.  భక్ష్యాలు వడ్డించబోతే, కడుపు  నిండిపోయింది తర్వాత తింటాను అన్నమాటను గుర్తు పెట్టుకుని  పదిలంగా ప్యాక్ చేసి,  నన్ను ఇంటి వద్ద దింపేటప్పుడు భద్రంగా నా చేతిలో పెడతారు. మసక చీకటిలో వాళ్ళు కనిపెట్టి చూస్తే నా కంటి తడి వాళ్లకు కనపడేదేమో! సరే!  వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారీ ఇది షరా మామూలే. 

అందరి భోజనాలు అయిన తర్వాత  సాయంత్రం గుడికి వెడదాం అన్నారు. అందరం కలిసి జూబిలీ హిల్స్ లోని టీ టీ డీ వారి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము. 

గుడిలో వున్నప్పుడు ఫోన్ మోగింది. హెచ్ పీ గ్యాస్ బాపతు అనుకున్నా. కానీ మా వలలి వనిత. ‘ఇంటికి వచ్చాను బెల్లు కొట్టాను.  ఏం చేయను’  అంటోంది. ‘ఏం చేస్తాం! నేను చాలా దూరంగా వున్నాను. ఈ పూటకి వంట వద్దులే వెళ్ళిపో’  అన్నాను.   

దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. గర్భగుడిలో గడప అవతల మెరిసే ఆభరణాలతో నిలువెత్తు మూల విరాట్టు. ఇవతల  పిపీలికాల్లా మేము. గోత్ర నామాలతో అర్చన చేసుకుని సంతృప్తిగా బయట పడ్డాం. ఆలయం అంతా కలయ తిరిగాము, ఫోటోలు తీసుకున్నాము.

మహాద్వారం నుంచి లోపలకు వెడుతున్నప్పుడు సరిగ్గా యాభయ్ అయిదేళ్ళ క్రితం, 1971 డిసెంబరు పదహారున తిరుపతిలో జరిగిన నా గుళ్ళో పెళ్లి తంతు  గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఇలాగే మహాద్వారం నుంచి నేరుగా  వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాము.

ఇంటికి వచ్చాను. 
మళ్ళీ ఏకాంత వాసం మొదలు.

కంప్యూటర్ ముందు కూర్చొన్నాను. ఒక పక్క టీవీలో ఐ పి ఎల్ మ్యాచ్ నడుస్తోంది. మధ్యలో వలలి వనితను ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. స్టీలు డ్రమ్ము మూత తీసి   ఒక గుప్పెడు బియ్యం గిన్నెలో కడిగి  రైసు కుక్కర్ లో పెట్టి ఆన్ చేశాను. పదకొండు గంటల లోపలే క్రికెట్ మ్యాచ్ ముగిసింది. మా అన్నయ్య కోడళ్ళు ఇచ్చిన బక్ష్యాలు, పెరుగన్నంతో భోజనం ముగిసింది. 

పొద్దున్నే పనిమనిషి అడిగింది, చాలా వదిలేశారు అని. 
బోధి వృక్షం లేకుండానే జ్ఞానోదయం అయింది. 

మనిషి బతకడానికి గుప్పెడు బియ్యం చాలు. 

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: