“కాయ రూపాయ్ అయ్ పొతే, ఆవకాయను పెట్టుటెలా!
కూరనార లేనిరోజున బడికి పిల్లల పంపుటెలా!”
అప్పుడెప్పుడో 1975లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రాసిన రోజువారీ వాక్టూన్లలో ఒక పంక్తి ఇది.
"మా కోడలు సంగతి ఏం
చెప్పమంటారు పిన్నిగారు
అదిగో అవతల పిలుస్తున్నారు మా వారు
చెబుతా లెండి వివరంగా మరోమారు
అన్నట్టు ఆవకాయ కారాలు పెట్టారా మీరు"
"ఎడతెగని ముచ్చట్లు' పేరుతొ ఇది మరో వాక్టూన్.
2018లో, కారణం తెలవదు, ఎప్పుడూ ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టే అలవాటు బొత్తిగా లేని నేను మొట్టమొదటిసారి ఆవకాయ కారాల కార్యక్రమంలో చేయి పెట్టడమే కాదు, యావత్తు బాధ్యతను నేనే నెత్తిన వేసుకున్నాను.
దిగిన తర్వాత తెలిసింది ఇది ఆషామాషీ వ్యవహారం కాదని. ముందుగానే అటకల మీద వున్న జాడీలను దింపి, వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. పంజా గుట్టలో ఒక షాపు వుంది. అక్కడికి వెళ్లి పలానా బ్రాండు కారాలు, నూనెలు, ఆవపిండి, నువ్వులు, మెంతులు, వెల్లుల్లి పాయలు, ఉప్పు వగైరా వగైరా కొనుక్కోరావాలి. ఆ ఉదయం ఎర్రగడ్డ రైతు బజారుకు వెళ్లి పులుపుగా, గట్టిగా వున్న మామిడి కాయలను సెలక్టు చేసుకుని ముక్కలు కొట్టించి తీసుకురావాలి. బోలెడు చాకిరీ. ఏళ్ళ తరబడి ఆడవాళ్ళు ఇంత శ్రమకు ఓర్చి కారాలు పెడుతున్న విషయం నాకప్పుడు బోధ పడింది.
‘ఏడాది తర్వాత మీకెట్టాగు తప్పదులే ఇంటి చాకిరీ’ అనుకుందో ఏమో, మా ఆవిడ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తాను పక్కన కూర్చుని సూచనలు చేస్తుంటే నేను ఆ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశాను. (వెనుకటి రోజుల్లో అంటే మా తండ్రి, తాతల కాలంలో మొగవాళ్ళే ఈ బాధ్యత నిర్వర్తించేవారని విన్నాను)
కారాలు కలుపుతున్న చేతులు కాబట్టి నేను ఫోటో తీయలేకపోయాను. ఫోటోలు అంటే ఇష్టపడదు కనుక తను తియ్యలేదు. ఏతావాతా జరిగింది ఏమిటంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఇంటి పనుల్లో మా ఆవిడకు సాయం చేశాను అనే దానికి (అదీ ఆ ఒక్కసారే అనుకోండి) ఒకే ఒక్క రుజువు అంటూ లేకుండా పోయింది. అది నిజంగా నా దురదృష్టం. అమూల్యమైన, అపురూపమైన ఇటువంటి జ్ఞాపకాలు మనసులోనే దాచుకోవాలని రాసిపెట్టి వుంటే ఏం చేస్తాము చెప్పండి.
సీజనులో పండ్లు తినడం సరే, ఏడాది పొడుగునా తినే ఊరగాయ పచ్చళ్ళు జాడీల్లో నిండుగా వుండాలంటే సీజను తప్పిపోకముందే ఆవకాయ కారాలు పెట్టేసుకోవాలి. అంచేత ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఈ కొత్త కారాల గుబాళింపులే. అమ్మలక్కల నోట్లో కారాల గురించిన ముచ్చట్లే.
అయిత ఒక ఏడాది మాత్రం ఆ సీజనులో ఇంట్లో కాకుండా ఆసుపత్రిలో ఎక్కువ రోజులు వుండడం వల్ల, ఈ కొత్త కారాల బాధ్యతను మా ఆవిడ భుజం మీద నుంచి మా రెండో వదిన గారు, మేనకోడళ్ళు తమ భుజాలకు ఎత్తుకున్నారు. ఆ విధంగా మా ఇంట్లో పెట్టని కొత్త ఆవకాయ కారాలు మూతులు బిగించి, వాసెన కట్టిన జాడీల్లో మా ఇంట్లో కొలువు తీరాయి. దీన్నే కాబోలు ప్రాప్తం అంటారు.
ఇంట్లోనే పెరుగు చిలికి తీసిన వెన్న పూసతో కొత్త ఆవకాయ కారాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకు తింటుంటే, అహో ఏమి రుచి. 'మిధునం' సినిమాలో పాట గుర్తుకు రాక తప్పదు.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి