15, ఏప్రిల్ 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (291) : భండారు శ్రీనివాసరావు

 

ఆరణాల కూలీ
అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.
పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా, ఒకసారి ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడిపోయి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.
ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టి వుంటాయి.
ఒకప్పుడు హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో తాను రోజుకు ఆరణాల కూలీ తీసుకుని పని చేశానని గర్వంగా చెప్పుకునే అంజయ్య గారికి, కార్మికులంటే ప్రత్యేకమైన అభిమానం. వారి విషయాలను, సమస్యలను అంజయ్య గారు యెంత నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.
1981 ఏప్రిల్ లో కౌలాలంపూర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. 14వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు జయ ఇంటర్నేషనల్ హోటల్ లోని తన రూముకి తిరిగొచ్చేసారు. అదే హోటల్లో నాకూ బస ఏర్పాటు చేశారు కానీ, షరా మామూలుగా ఆయనతో కలిసి నేను కూడా ఆయనకు కేటాయించిన వీ ఐ పి రూమ్ కి వెళ్లాను. కాస్త నలతగా వున్నట్టు కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన ఒక సోఫాలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ, గోడకు అమర్చిన పెద్ద కిటికీలో నుంచి బయటకు చూస్తున్నారు.
విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.
ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.
“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసే వాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తి కాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసే వాళ్లకు, వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.
అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.
‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ప్రధాని ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండి పోకుండా, వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి.
ఈయన గారేమో ఇక్కడ తాపీగా హోటల్లో కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు.
అలా వుండేది అంజయ్య గారి వ్యవహారం.
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: