30, డిసెంబర్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (252) : భండారు శ్రీనివాసరావు

 

నేను నిలబెట్టుకోలేని నా మాట
నిలబెట్టుకోలేని మాట అనగానే రాజకీయుల వాగ్దానాలు గుర్తొస్తే చేసేదేమీ లేదు. అసలు నేను రాజకీయ పోస్టు పెట్టి ఏండ్లు గడిచిపోయాయి. ఆ కాడి కిందపారేసి నా ఆరోగ్యం కాపాడుకుంటున్నానని ఏనాడో మనవి చేశాను. ఈ విషయంలో నాకు సాయపడ్డ ట్రోలర్లకి సదా సర్వదా కృతజ్ఞుడిని. వాళ్ళు ఇంకా నా స్నేహితుల జాబితాలోనే వున్నారు. వారిని తప్పు పట్టను. వారికి ఒప్పచెప్పిన బాధ్యతను తుచ తప్పకుండా నెరవేర్చినందుకు అభినందిస్తున్నాను.
కానీ, నేను ఇప్పుడు చెప్పబోయే 'ఈ మాట' ఎవరికి వారు ఇచ్చుకునే మాట. కొత్త ఏడాదిలో 'ఇది చేస్తాం అది మానేస్తాం' అంటూ మనకు మనమే ఇచ్చుకునే మాట అన్నమాట.
కాసేపు ఈ మాట్లాట మానేసి అసలు విషయానికి వద్దాం.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో ఎన్నో చేయాలని అనుకుంటాం. అదేం పాపమో ఏడాది మొదట్లోనే వాటికి పురిటి సంధి కొడుతుంది.
చాలామంది మగ పురుషులు ప్రతి ఏడాది కామన్ గా తమకు తాము ఇచ్చుకునే వాగ్దానం కామన్ గా ఒకటుంది. అదేమిటంటే ‘మందు కొట్టడం మానేస్తాం, సిగరెట్లు తాగడం ఆపేస్తాం’ అని. కానీ, కామన్ గా జరిగేది ఏమిటంటే, మర్నాడు సీను షరా మామూలే.
హాల్లో పీఠం మీద విలాసంగా మఠం వేసుకుని కూర్చుని మందహాసంతో ఒక చేత్తో సిగరెట్టు వెలిగించి, మరో చేత్తో మందు గ్లాసు పట్టుకున్న తరువాత కూడా ఎందుకో ఏమిటో ఈ మాట అస్సలు గుర్తు రాదు. ఆవిళ్ళు (అనగా ఆవిడలు, అనగా భార్యలు) పనిగట్టుకుని గుర్తుచేయబోయినా 'ఆ మాట నిరుడు కదా చెప్పాను' అనేస్తారు అదేదో పూర్వ జన్మ వృత్తాంతం అన్నట్టు.
కావున, కావుకావుమని చెప్పేదేమిటంటే, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదెందుకని రాజకీయ నాయకులను నిలదీసే హక్కు మనకు బొత్తిగా లేదని.
అయితే, మనం మాట తప్పడానికి కూడా ఓ కారణం వుంది. ఈ కొత్త ఏడాది పాతపడి గిర్రున తిరిగి మరో కొత్త ఏడాది మళ్ళీ వస్తుందని. అప్పుడు కొత్తగా మరో మాట ఇచ్చుకునే అవకాశం ఎలాగు వుంటుందని.
వాళ్ళు మాట తప్పడానికి కూడా దాదాపు ఇదే కారణం.
అయిదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మరో మాట ఇస్తే పోలా అని.
కావున, అల్లా ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన పాత మాటలన్నీ (వోట్ల కోసం పెట్టిన వొట్లు అన్నమాట) మూటగట్టి మన గట్టునే పెట్టి వెడుతున్నారు.
వాళ్ళని కాసేపు మనమూ పక్కన పెడదాము. ఇంకా చాలా సమయం వుంది, వాళ్ళు మన జోలికి రావడానికి.
ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.
కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి ఏదో పనిమీద హడావిడిగా వస్తూ చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టు కొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను’. నాకేమనాలో తోచలేదు. కానీ భేషజాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఆ రోజు మావాడి నుంచి నేర్చుకున్నాను.
ఆ రోజు గుడికి వెళ్ళాము. అక్కడ తిరిగే ఫ్యాన్ల మీదా, వెలిగే ట్యూబ్ లైట్ల మీదా వాటిని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు రాసివున్నాయి. చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తాపత్రయమే నాకు వాటిలో కనిపించింది.
ఇంటికి వస్తే టీవీలో సినిమా వస్తోంది.
‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!’
బందీఖానాలో కొరడా దెబ్బలు తింటూ కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాడుతున్నాడు. తాను భద్రాద్రి రాముడికి, సీతమ్మకు చేయించిన నగల జాబితాతో పాటు వాటి ఖరీదు గురించి వివరిస్తున్నాడు.
ఏవిటో ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అనిపిస్తోంది కదూ. సహజం.
అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాల క్రెడిట్ తమకు దక్కాలంటే తమకు దక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడే తాపత్రయం నేపధ్యంలో చూస్తే వీటికి ఉన్న సంబంధం బోధపడుతుంది.
ప్రాజెక్టుల మీదా, పధకాల మీదా, అనేకానేక అభివృద్ధి కార్యక్రమాల మీదా ఆయా ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు భరిస్తున్నది నిజానికి ఆయా పాలక పార్టీలు కాదు, పన్నులు కడుతున్న ప్రజలు. అంటే మనము.
ప్రజలు చూసి చూసి విసుగెత్తి ఎప్పుడో అప్పుడు, రామదాసు గారు ఎద్దేవా చేసినట్టు, ‘ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేరు’ అని ప్రభుత్వాలని నిలదీయకుండా జాగ్రత్త పడడం మంచిదేమో!
కొత్త సంవత్సరంలో పాలకులకు ఇదొక ఉచిత సలహా! వింటారనే నమ్మకం నాకు బొత్తిగా లేదనుకోండి.
తోకటపా:
అయిదు దశాబ్దాల పాటు రాజకీయులతో అంట కాగినందుకు ఫలితంగా నాకూ మాట తప్పే అలవాటు వచ్చినట్టుంది.
గతంలోకి జారిపోతున్న ఈ 2025 ఏడాదిలో మీరు, మాట తప్పిన ఎంతోమందిని మంచి మనసు చేసుకుని క్షమించే వుంటారు. అలాగే నన్నూ ఈ ఒక్కసారికి మన్నించండి.
అలాగే, రానున్న ఏడాది 2026 లో అయినా, మనం మనకిచ్చుకున్న మాటని నిజం చేసే ప్రయత్నం మరోసారి చేసుకుందామని ఇంకో మాట ఇచ్చుకుందాం.
పనిలో పనిగా మళ్ళీ రాజకీయ పోస్టుల్లోకి పునః ప్రవేశ ప్రయత్నం ఇది ఎంత మాత్రం కాదని మనవి చేసుకుంటున్నాను.
నా ఆరోగ్యం నాకు ముఖ్యం కదా!
కొత్త ఏడాదిలో ఆనందంగా, ఆరోగ్యంగా వుండండి అంటూ నా ఆత్మీయుల శుభాకాంక్షలు వాస్తవం చేయడం కోసమైనా నేను నా మాట నిలబెట్టుకోవాలి.
ఎల్లరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌹
కింది ఫోటో :
నేను రాజకీయ పోస్టులకు, టీవీ చర్చలకు దూరం జరిగిన ఏడాదిని గుర్తు చేసుకుంటూ





Note: Courtesy Image Owner
(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: