10, డిసెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (246) : భండారు శ్రీనివాసరావు


నందిక నా కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేసింది.
ఇప్పుడు తెల్లవారుఝమున మూడు గంటలు దాటింది.
నా వయసు ఎనభయ్ సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం నా భార్య నిర్మల మరణించింది. నిరుడు మొదట్లోనే నా రెండో కుమారుడు సంతోష్ కన్ను మూశాడు.
అమెరికాలో ఉంటున్న నా పెద్దవాడు సందీప్, కోడలు భావన, చిన్న వయసులోనే జీవన సహచరుడిని పోగొట్టుకున్న చిన్నకోడలు నిషా నాకు బాసటగా నిలబడ్డారు. మా అన్నయ్య రామచంద్ర రావు గారు, ఆయన పిల్లలు సరే సరి. నా పాలిటి 108.
మల్టీ నేషనల్ సంస్థలో చిన్న కోడలుకి ఉద్యోగ బాధ్యతలు. చిన్నారి జీవిక ఆలనా పాలనా చూడడానికి మా ఆవిడ లేదు. అంచేత తప్పనిసరి పరిస్థితిలో పుట్టింట్లో, కటక్ లో వుండాల్సిన పరిస్థితి. అక్కడ జీవికకు అమ్మమ్మ, తాతతో పాటు కోడలి అన్నవదినలు, వారి పిల్లలు వుంటారు. ఒక కుటుంబ వాతావరణంలో పెరుగుతుంది. నిజానికి అంతకంటే గొప్పగానే పెరుగుతోంది. అది దాని అదృష్టం.
పగలు స్కూలు, సాయంత్రం డాన్సు స్కూలు, ఉదయం ట్యూషన్, డ్రాయింగు క్లాసు. ఇలా ఉదయం నుంచీ సాయంత్రం దాకా, వాళ్ళ అమ్మ ఓవర్ సీస్ కాల్స్ పూర్తయ్యేవరకు బిజీ, బిజీ.
ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒంటరిగా వుండడమే మంచిదని నాకూ అనిపించింది. మొబైల్స్ యుగంలో దూరాభారాల సమస్య లేదు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్ చేసి చూస్తూ మాట్లాడ వచ్చు.
అలా సర్దుకుపోయాను.
ఒకరకంగా హైదరాబాదులో వానప్రస్తాశ్రమం.
ఒక్కడిని. వంట చేసిపెట్టడానికి వలలి. ఇంటి పనులు చేసిపెట్టడానికి ఒక హెల్పర్. బయట తిరగాలి అంటే కారు. ఎనభయ్ ఏళ్ళ మనిషికి ఇంతకంటే ఏం కావాలి?
ఏ సమస్య లేకుండా పిల్లలు చూసుకుంటున్నారు. వాళ్లకి నేను సమస్య కాకుండా చూసుకోవడం ఒక్కటే నేను చేయగలిగింది.
దాంతో నాకు నేనుగా కొన్ని నియంత్రణలు పెట్టుకున్నాను.
ముందు నేను చేయాల్సింది నా ఆరోగ్యం చూసుకోవడం. ఇదివరకు ప్రతిదీ ఒక సమస్యే. ఎప్పుడయితే నా పెద్దకోడలు భావన చెప్పినట్టు, అది సమస్య కాదు ఇబ్బంది అని అనుకోవడం మొదలు పెట్టానో అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి.
నాకు నేనుగా ఒక ప్రపంచం నిర్మించుకున్నాను, ఇందులో రాత్రీ పగలు తేడా లేదు. రాత్రుళ్లు నిద్ర పట్టదు. పట్టకపోతే ఏమవుతుంది? రేపు పగలు నిద్రపోతాను. రేపు అనేది వుంది అనే నమ్మకం కుదరడంతో నిద్రపట్టక పొతే ఎల్లా అనే దిగులు, భయం పోయాయి. దిగులు పోవడంతో ఆరోగ్యం నా ప్రమేయం లేకుండానే కుదుట పడింది.
అదివరకు ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకునే వాడిని. ఆరు నెలలుగా డయాగ్నాస్టిక్ సెంటర్ గడప తొక్కలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు.
ఒకరకంగా ఇది మొండితనమే. ఏదన్నా ముంచుకు వస్తే! ఏమవుతుంది? ఇంతకంటే ఏమవుతుంది?
కట్టుకున్న భార్య, కన్న కొడుకు కళ్ళ ముందే పోయారు. వారిని కాపాడగలిగానా?
మిత్రుడు, మేనకోడలు మొగుడు జ్వాలా 'బయటకు వస్తుండు' అని చెప్పి చెప్పి విసుగు పుట్టి ఊరుకున్నాడు. ఆదివారం కలిసిన మిత్రుడు, తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి కూడా అదే మాట. వారానికి ఒకరోజు జీరోకు సెలవు ఇచ్చి బయటకు వస్తుండు అని. కానీ ఒకళ్ళ మాట వినేరకం అయితే నేను, నేను ఎందుకు అవుతాను.
ఇప్పుడు ఒకటే నా ధ్యేయం. మొదలు పెట్టిన జీరో కధను పూర్తి చేయడం. వీలయితే దాన్ని మా పిల్లలు చదువుకునేలా ఆంగ్లంలో అనువాదం చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో అదేమంత పెద్ద విషయం కాదు.
తెల్లవారుఝామున ఎప్పుడో నిద్ర పట్టినా ఆరుగంటలకు మెలకువ వస్తుంది. కాలకృత్యాలు తీర్చుకునేసరికి, పాలబ్బాయి ప్యాకెట్ వేస్తాడు. వాటిని కాగబెడతాను. ఒక్కోసారి పొంగిపోతాయి. అవసరం అన్నీ నేర్పిస్తుంది. సన్నటి సెగన కాగబెడతాను. గతంలో ఫిల్టర్ కాఫీ తాగేవాడిని. అదో పెద్ద హైరాణా. ఫిల్టర్ లో పొడివేసి, వేడి నీళ్ళు పోసి అది దిగిన దాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు.
మరి ఇంతమంది పనివాళ్లు దేనికి అంటారా! వంట చేసే ఆవిడ పదిహేను ఏళ్ళ నుంచి పని చేస్తోంది. ఆమెకు గంపెడు సంసారం. పొద్దున్నేరావాలి, ఈ పనులు చేయాలి అంటే. గతంలో వచ్చేది. ఒక్క మనిషికి కాఫీ కలపడం కోసం ఎందుకు, వద్దని నేనే చెప్పాను. కొన్నాళ్ళు కాఫీ ప్రహసనంతో కుస్తీ పట్టిన తర్వాత ఈ గోలకంటే కాఫీ మానేస్తే పోలా అనిపించి ఆ అలవాటుకు స్వస్తి చెప్పాను.
ఒక గ్లాసు పాలలో ఎన్స్యూర్ కలుపుకుని, డ్రాయింగ్ రూములో కూర్చుని లెగ్ మసాజర్ లో కాళ్ళు పెట్టుకుని, పాలు తాగుతూ, అలెక్సాలో వెంకటేశ్వర సుప్రభాతం పెడతాను. మిగిలిన పాలు తోడు పెడతాను. నిజానికి ఈ పనులన్నీ చాలా రోజులు మా వలలి చేసేది. అప్పటిదాకా మంచం మీద నిద్రపట్టక దొర్లుతూ వుండేవాడిని. ఈ పనులు నా భుజానికి ఎత్తుకున్న తర్వాత రోజులో ఎంతో సమయం కలిసివస్తోంది. నాకూ కొంత కాలక్షేపం.
పొతే, ఇక నందిక సంగతి. ఈ అమ్మాయి మా చిన్నకోడలు నిషా అన్నయ్య కుమార్తె. చార్టర్డ్ అక్కౌంటెన్సీ ఇంటర్ మీడియెట్ గ్రూపు రెండు పరీక్షలు ఒకే అటెంప్ట్ లో మంచి రాంక్ తో పూర్తి చేసింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఆర్టికిల్ షిప్ ఆఫర్ వచ్చింది. ఆ కంపెనీ హైదరాబాదులో వుంది. చేరడానికి ఇక్కడకు వచ్చింది. అదీ ఇండిగోలో. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు అన్నీ ఒకేమారు నేల వాలినట్టు ఇండిగో విమానాలన్నీ గాలిలో ఎగరడం మానేసి భూమి మీదనే పడి వుంటున్నాయి, కొన్నిరోజులుగా. ఆ అమ్మాయి సోమవారం నాడు జాయిన్ కావాలి. ఎలారా అని మధన పడుతుంటే ఆదివారం నాడు మాత్రం మధ్యాన్నం ఫ్లయిట్ సరయిన సమయానికి భువనేశ్వర్ లో బయలుదేరి సరయిన సమయానికి హైదరాబాదు చేరింది. లక్కీ గర్ల్.
ఇంట్లో దీపం వెలిగించేవాళ్లు లేరు అనుకునే బాధ లేకుండా ఇంటి దీపంలా నందిక వచ్చింది.
సోమవారం ఆఫీసుకు వెళ్ళింది, వచ్చింది. కొత్త ఆఫీసులో పని, ఇతర క్షేమ సమాచారాలు కనుక్కుని మళ్ళీ నా డెన్ లోకి వచ్చాను. ఏదో చెత్తా చెదారం రాసుకుంటూ వుండి పోయాను. నేను సాధారణంగా నా గది వదిలి మా ఇంట్లోనే కాలు బయట పెట్టను, ఉదయం పూట ఓ అరగంట తప్ప. తలుపు తీసి పెడతాను. వంటమనిషి, పనిమనిషి వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెడతారు. మూడు కిలోలు బియ్యం కొంటే నెల దాటినా మళ్ళీ కొనే అవసరం పడదు. నేను కంచంలో వదిలేసే అన్నం చూసి, పని మనిషి బాధ పడుతుంది. ఇంతకంటే తక్కువ వండడం కష్టం అని వలలి వాదన. ఈ వయసులో ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేది నా థియరీ. మా అన్నయ్య, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ మీల్స్ ఎలాగూ తప్పదు.
సోమవారం సాయంత్రం వంటింట్లో చప్పుడు అవుతుంటే వెళ్లి చూశాను. నందిక వంటింటి సామాగ్రి సర్దుతూ కనిపించింది. ఎందుకమ్మా ఈ చాకిరీ అన్నాను. తీరా చూస్తే ఆరు నెలల కింద కొనిపెట్టి పోయిన సరుకులు. తెలివికల అమ్మాయి కనుక స్కాన్ చేసి పనికిరాని సరుకులన్నీ పెద్ద గోతాములో పెట్టింది. గిన్నెలు, స్టీల్ డబ్బాలు అన్నీ సదిరిపెట్టింది.
ఎలా అయినా ఆడపిల్లలు ఆడపిల్లలే. నిషా పోలికే ఈ అమ్మాయికి వచ్చింది. పోలిక సంగతేమో కానీ మా ఇంటికి మళ్ళీ వెలుగు వచ్చింది.





(08-12-2025)
(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: